సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 585వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అతి పెద్ద గండం (కరోనా మహమ్మారి) నుండి అతి తేలికగా కాపాడిన బాబా
  2. బాబా ప్రసాదించిన స్వప్నానుభవాలు

అతి పెద్ద గండం (కరోనా మహమ్మారి) నుండి అతి తేలికగా కాపాడిన బాబా

సద్గురు సాయినాథునికి హృదయపూర్వక, కృతజ్ఞతాపూర్వక అంగాంగ సర్వాంగ సాష్టాంగ నమస్కారములు. నా పేరు కుమార్. నా వయసు 40 సంవత్సరాలు. నేను ఇంటర్మీడియట్ చదువుకొనే రోజుల నుంచే బాబాను పూజించటం ప్రారంభించాను. ప్రతి గురువారం బాబా గుడికి వెళుతూ, ప్రతిరోజూ ఇంట్లో బాబా పటానికి పూజచేసుకుంటూ ఉండేవాడిని. సాయిలీలామృతము నాకు నిత్యపారాయణ గ్రంథం. నా జీవితంలో బాబా నన్ను ఎన్ని విధాలుగా కాపాడారో, ఎన్నిసార్లు రక్షించారో, ఎన్ని సలహాలనిచ్చి నన్ను ఎన్ని సమస్యల నుంచి గట్టెక్కించారో చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే వ్రాయవచ్చు. అవన్నీ ఒక్కొక్కటిగా నేను మీతో పంచుకుంటాను.

నేను హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. కోవిడ్ సమయంలో ఇంట్లోనే ఉండి ఆఫీస్ పని చేసుకుంటూ ఏదైనా అవసరమైనపుడు మాత్రమే బయటికి వెళుతూ వుండేవాడిని. బయటనుంచి రాగానే చేతులు, కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేవాడిని. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత, ఒకరోజు అకస్మాత్తుగా నాకు జలుబు మొదలైంది. అసలే బయట కోవిడ్ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ వుంది. రోజుకి కొన్ని వేల కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. అలాంటి గందరగోళ పరిస్థితులలో నాకు జలుబు (ముక్కు దిబ్బడ) మొదలైంది. ఆ తరువాత ఒళ్ళునొప్పులు, కొద్దిగా జ్వరం కూడా మొదలైంది. ఆ రాత్రి నిద్రపోవడం కూడా చాలా కష్టమైంది. ఆ తరువాత ముక్కుకి వాసన తెలియడం ఆగిపోయింది. దాంతో నాకు చాలా భయం వేసింది. అసలే ఇంట్లో చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు కూడా వున్నారు. ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే (కోవిడ్ అయితే) అందరం చాలా ఇబ్బందిపడతామని అనుకొని చాలా చాలా భయపడ్డాను. వెంటనే నేను రోజూ పూజ చేసే నా తండ్రి సాయిబాబా పటం ముందు నిలుచొని, “బాబా! ఇప్పటివరకు మాకు ఏ కష్టం వచ్చినా మీకు చెప్పుకుంటే వెంటనే ఆ కష్టాన్ని తీరుస్తూ నన్ను, మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వున్నారు. చల్లటి మీ పాదాల నీడలో మేమంతా హాయిగా వున్నాము. కానీ ఇప్పుడు నాకు వచ్చిన లక్షణాలు చూస్తుంటే చాలా భయంగా వుంది బాబా. నన్ను, నా కుటుంబాన్ని కోవిడ్ బారినుండి కాపాడండి బాబా! నాకున్న ఏకైక దిక్కు మీరే, మీ మీదే ఆధారపడి ఇన్ని రోజులు గడిపాము. ఇప్పుడు కూడా మీరే నాకు దిక్కు. కాపాడండి బాబా! రక్షించండి బాబా!” అని కన్నీళ్ళతో బాబాను వేడుకున్నాను. కొంచెంసేపటి తరువాత, మా అమ్మ మంచినీళ్ళలో బాబా ఊదీ కలిపి తెచ్చి త్రాగమని ఇచ్చింది. ఊదీనీళ్ళు త్రాగిన తరువాత సాయినాథుని దయవలన కొద్దిసేపటికే జ్వరం తగ్గిపోయింది. ఆ తరువాత ఒళ్ళునొప్పులు కూడా తగ్గిపోయాయి. ఆరోజు నుంచి సరిగ్గా నాలుగు రోజులు అలాగే బాబా ఊదీ కలిపిన నీళ్ళు తాగుతూ, మందులు వేసుకుంటూ బాబా పుస్తకాలు, బాబా లీలలు చదువుకుంటూ గడిపాను. అయిదవరోజుకి జలుబు (Nose Block) కూడా పూర్తిగా తగ్గిపోయింది. అసలు విషయం ఏమిటంటే, నాకు హై బి.పి వుంది. హై బి.పి ఉన్నవాళ్ళకి కోవిడ్ వస్తే చాలా సీరియస్ అవుతుందని చాలాచోట్ల చదివాను. కానీ నా బాబా నన్ను అతి పెద్ద గండం నుంచి అతి తేలికగా కాపాడాడు. కేవలం బాబా దయవల్ల మాత్రమే అంత పెద్ద గండం నుంచి బ్రతికి బయటపడ్డాను. ఎంతోమంది జీవితాలు కోవిడ్ బారినపడి, హాస్పటల్ బిల్స్ కట్టలేక, ఉన్న ఆస్తులన్ని అమ్మి, అప్పులపాలై, అస్తవ్యస్తమైపోయిన ఘటనలు ఎన్నో చదివాను. నా జీవితం అస్తవ్యస్తం కాకుండా నా తండ్రి సాయినాథుడు నన్ను కాపాడాడు. “బాబా! అంతటి మహమ్మారి నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడినందుకు ఈ బ్లాగ్ వేదికగా మీకు కోటానుకోట్ల కృతజ్ఞతాపూర్వక, హృదయపూర్వక నమస్కారములు అర్పించుకుంటున్నాను. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను బాబా! ఏ జన్మలోనో నేను చేసిన పుణ్యం ఈ జన్మలో నాకు మీ రూపంలో దొరికింది. బాబా! మీరు ఎప్పుడూ మా క్షేమం కోసం పరితపిస్తూ, మేము ఎప్పుడూ సుఖంగా వుండాలని ఆశిస్తారు. భగవంతుడు ఎలా వుంటాడో మాకు తెలియదు గానీ, మీరు మాపై చూపించే ప్రేమను చూస్తే మాత్రం మాకు మీరే భగవంతుడని ఖచ్చితంగా అర్థమవుతుంది. భగవంతుడు ప్రేమ స్వరూపమని, ఎంతో దయ, జాలి గల ప్రభువని ఇంకా ఖచ్చితంగా అర్థమవుతుంది. బాబా! కన్నీటితో వేడుకుంటే మీరు కరిగిపోతారు. ఎంతో గొప్ప హృదయం మీది. దయ, జాలి చూపించడంలో మీకు మీరే సాటి బాబా. మీలాంటి ప్రేమ స్వరూపం ఈ యుగాంతం వరకు వుండాలి బాబా. మమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళొద్దు బాబా. మీరు లేకుండా మేము ఈ జీవితం ఒక్క క్షణం కూడా గడపలేము బాబా. చివరగా నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే బాబా, మా మనసు వేరే విషయాల జోలికి వెళ్ళకుండా, మా మనసు నిండా మీ రూపం నిండిపోయేలా అనుగ్రహించి, స్థిరమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యములను అనుగ్రహించి, చివరికి మమ్మల్ని గమ్యం చేర్చండి బాబా!”

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా ప్రసాదించిన స్వప్నానుభవాలు

నా పేరు ప్రవీణ్ కుమార్. మాది షాద్ నగర్. సాయే నాకు అన్నీ. నేను చేసే ప్రతి పనీ సాయి చేస్తున్నట్టే ఉంటుంది. ఎందుకంటే, నా చేయి పట్టుకుని నడిపించేది నా సాయే. ఈ బ్లాగులో వచ్చే ప్రతి సాయిభక్తుని అనుభవం నాకు కలిగినట్లే ఉంటోంది. ఇక నా అనుభవానికి వస్తే... 


2020లో నాకు రెండు స్వప్నాలు వచ్చాయి. మొదటి స్వప్నంలో నాకు దత్తాత్రేయుని దర్శనమైంది. ఆ కలలో ఎవరిదో వివాహం జరుగుతున్నది. ఆ కలలోనే రామాయణం పుస్తకం కూడా కనబడుతోంది. నాకు దత్తాత్రేయుడు చెబుతున్నారో లేక ఎవరు చెబుతున్నారో స్పష్టంగా తెలియటం లేదు కానీ ఆ రామాయణం పుస్తకాన్ని చదవమని చెబుతున్నారు. అంతటితో ఆ కల పూర్తయింది.

రెండవ స్వప్నంలో బాబా ఊదీ దర్శనమిచ్చింది. నేను ప్రతి సంవత్సరం విజయదశమికి శిరిడీ వెళతాను. శిరిడీ వెళ్ళినప్పుడు ఒక సంవత్సరానికి సరిపోయేలా బాబా ఊదీని తెచ్చుకుంటాను. ఒకరోజు రాత్రి, ‘ఈ సంవత్సరం కరోనా కారణంగా శిరిడీ వెళ్ళడానికి కుదురుతుందో, లేదో’ అని అనుకుంటూ పడుకున్నాను. అప్పుడు బాబా ఊదీ కలలో దర్శనమిచ్చింది. ఆ మరునాడు మా సార్ నాకు ఫోన్ చేసి, ‘తాము సాయిమందిరం నిర్మించాలని అనుకుంటున్నామని, విజయదశమి రోజున భూమిపూజ చేద్దామనుకుంటున్నామ’ని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషం కలిగింది. ఈ సంవత్సరం శిరిడీ వెళ్ళే అవకాశం లేనందువల్ల ఈ విజయదశమికి బాబా నన్ను ఇక్కడే ఉంచి నా చేత సేవ చేయించుకుంటారని భావిస్తున్నాను.


ఓం శ్రీ సాయి సమర్థ.



హరి బాపూరావు శీర్షతే




మహల్సాబాయి అనే ఒక నిరుపేద సాయిభక్తురాలు శిరిడీలో నివాసముంటుండేది. ఒకసారి హరి బాపూరావు శీర్షతే శిరిడీ వచ్చినప్పుడు ఆమె అతన్ని ఆశీర్వదించి, డబ్బులు ఇమ్మని అడిగింది. అతను కొంత డబ్బిచ్చి, శిరిడీ నుండి వెళ్లేముందు మరికొంత ఇస్తానని ఆమెతో చెప్పాడు. అయితే తిరుగు ప్రయాణమయ్యే సమయానికి మహల్సాబాయికి ఇచ్చిన మాట గురించి అతను మరచిపోయాడు. కానీ ఆమె మరువక అతనిని డబ్బు అడిగితే, అతను డబ్బివ్వకపోగా కోపంతో, "వెళ్ళిక్కణ్ణించి, ఎవరన్నా మూడుసార్లు డబ్బిస్తారా?" అని ఆమెపై అరిచాడు. తరువాత అతను తన ప్రయాణంలో ఎన్నో అవస్థలు పడ్డాడు. కోపర్‌గాఁవ్‌లో స్టేషన్‌కి వెళ్ళడానికి అతనికి టాంగా దొరకలేదు. ఆ కారణంగా రైలు తప్పిపోయింది, దానివల్ల అతను ఆ రాత్రంతా అక్కడే గడపాల్సి వచ్చింది. అప్పుడతను, "ప్రతిసారీ సాయిబాబా అనుమతి తీసుకుని బయలుదేరితే నా ప్రయాణం సుఖంగా సాగేది. ఈసారి ఎందుకు ఇంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది?" అని అనుకున్నాడు. మరుసటిరోజు ప్రయాణంలో అతను మన్మాడ్ స్టేషన్ నుంచి తోటి ప్రయాణికుడు, సాయిభక్తుడైన బీహార్‌లాల్ వ్యాస్‌తో మాటల్లో పడ్డాడు. ఆ కబుర్లలో వ్యాస్ తన అనుభవాన్ని ఇలా చెప్పాడు: "ఈరోజు నేను శిరిడీ నుండి బయలుదేరుతున్నపుడు మహల్సాబాయి అనే పిచ్చిది నా దగ్గరకొచ్చి డబ్బులిమ్మని అడిగింది. ఆమె ఒంటిమీద ఉన్న బట్టల నుంచి వచ్చే దుర్వాసనకి నాకు వికారం కలిగింది. కానీ నేను ఆమెకు కొంత డబ్బిచ్చాను. ఆమె ఆ డబ్బు తీసుకుని వెనుతిరిగిన మరుక్షణంలో మల్లెలు మొదలైన పూల సుగంధ పరిమళాలు వ్యాపించగా నేను ఆశ్చర్యపోయాను" అని. ఆ మాటలు వింటూనే శీర్షతే తన ప్రయాణంలో తనకు ఎదురైన అసౌకర్యానికి కారణం మహల్సాబాయి పట్ల తన అమానుష ప్రవర్తనే అని గ్రహించాడు. దాంతో అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. సాయిబాబా తన ప్రశ్నకు వ్యాస్ ద్వారా సమాధానం ఇచ్చారని గుర్తించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈ అనుభవం ద్వారా అతనికి 'హీనులను, దీనులను అలక్ష్యము చేయరాద'ని బాబా బోధించారు.

సోర్స్: శ్రీసాయిబాబా బై సాయి శరణానంద.

సాయిభక్తుల అనుభవమాలిక 584వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రతీసారి ఉనికిని తెలియజేస్తూ నాతో ఉన్నానని నిరూపిస్తున్న బాబా

  2. సాయి దయే అసలైన ఔషధం


ప్రతీసారి ఉనికిని తెలియజేస్తూ నాతో ఉన్నానని నిరూపిస్తున్న బాబా

సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు సంహిత. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన బాబాకి, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి నా కృతజ్ఞతలు. నేనిప్పుడు బాబా కలలో నాకు దర్శనమిచ్చిన అనుభవం, ఆయన నాతోనే ఉన్నారనని తెలియజేసిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

నేను పోలీసు కానిస్టేబుల్ ట్రైనింగ్ లో ఉన్నాను. మాకు పాసింగ్ అవుట్ పెరేడ్ ప్రాక్టీస్ జరుగుతుంది. 2020, అక్టోబర్ ఒకటో తారీఖున ప్రాక్టీసులో భాగంగా మా అందరినీ గ్రౌండులో నిల్చోబెట్టారు. ఆ సమయంలో నా కాళ్ళు చాలా నొప్పిపెడుతున్నాయి. దాంతో నేను మనసులోనే బాబా నామస్మరణ చేసుకుంటున్నాను. అప్పుడు కొన్ని క్షణాలపాటు ఒకరకమైన సువాసన వచ్చింది. అది ప్రత్యేకించి శిరిడీ సమాధి మందిరంలో మాత్రమే వచ్చే సువాసన. బాబా నాతో ఉన్నారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొన్ని గంటలపాటు ఆ సంతోషం అలానే కొనసాగింది. నాకు కలిగిన ఆ అనుభూతిని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈవిధంగా సువాసన రావడం ఇప్పటికి మూడుసార్లు జరిగింది. మొదటి రెండుసార్లు నేను ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడేమో ట్రైనింగ్ లో ఉన్నప్పుడు వచ్చింది. 

మరో అనుభవం:

రోజూ రాత్రి నిద్రపోయేముందు బాబా తాతని తలచుకుని నిద్రపోవడం నాకు అలవాటు. నాకు ఎన్నోసార్లు బాబా స్వప్న దర్శనమిచ్చారు. అలాగే 2020, అక్టోబర్ 2న కూడా బాబాని తలుచుకుని నిద్రపోయాను. మధ్యరాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను పాసింగ్ అవుట్ పెరేడ్ ప్రాక్టీసు అయ్యాక నా షూస్ తీసి బ్యాగులో పెట్టాను. కానీ ఆ తరువాత చూస్తే అవి కనిపించలేదు. ఎక్కడో పోగొట్టుకున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నానో నాకు తెలియలేదు. అప్పుడు నేను, "బాబా! ఇంకో రెండురోజులు ఈ షూస్ తో నాకు అవసరం ఉందనగా ఇప్పుడీ షూస్ పోయాయి. అవి ఎలాగైనా దొరికేలా చేయండి బాబా. తర్వాత పాసింగ్ అవుట్ పెరేడ్ కోసం ఎలాగూ కొత్త షూస్ వేసుకుంటాను" అని బాబాని అడుగుతూ షూస్ కోసం వెతుకుతున్నాను. అక్కడొక పెద్ద గది ఉంది. అందులో బాబా పెద్ద విగ్రహం ఉంది. నేను బాబా పాదాలపై పడి, "బాబా నాకు గ్రూపు 4లో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి. ఇష్టపడిన అబ్బాయితో నా వివాహం జరిపించండి. ఇంకా నా షూస్ ఎలాగైనా నాకిప్పుడు దొరికేలా చేయండి" అని బాబాని అడిగాను. తరువాత నేను బాబా పాదాల వద్ద నుండి లేస్తున్నప్పుడు బాబా తన రెండు పాదాలు నా తలపైన పెట్టారు. వెంటనే అప్పటివరకూ విగ్రహ రూపంలో ఉన్న బాబా మనవాకృతిలోకి మారారు. నేను బాబాకి నమస్కరించుకుని అక్కడినుండి వచ్చేసాను. ఇంతటితో కల ముగిసింది. ఉదయం లేచిన తరువాత కల గురించి ఆలోచించాను. కానీ నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు నాకు తెలిసిన ఒక సాయి అన్నయ్యకి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి, తలపై బాబా పాదాలు పెట్టడం వెనక ఉన్న అర్థం ఏమిటి అని అడిగాను. అతను, "బాబా గొప్ప సత్పురుషులు. వారు తమ పాదాలు మన తలపై పెట్టడం అంటే ఎంతో శుభ సూచకం, గొప్ప ఆశీర్వాదం" అని చెప్పారు. అది తెలిసి నాకెంతో సంతోషంగా అనిపించింది. వెంటనే ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను.

కానీ తరువాత వచ్చిన ఫలితాల్లో నేను గ్రూపు 4కి ఎంపిక కాలేదు. ఆ ప్రక్రియలో బాబా చాలా నిదర్శనాలు ఇచ్చినందువల్ల ఆ ఉద్యోగం నాకు వస్తుందని నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను. మరి బాబా ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా భయమేస్తుంది. ఎందుకంటే, నేను బాబాని ఏది అడిగినా మొదట్లో చాలా సానుకూలంగా చూపిస్తారు. నేను ఎంతో నమ్మకం పెట్టుకుంటాను కానీ, చివరికి ప్రతికూల ఫలితం ఎదురవుతుంది. అందుకే ఇంక బాబాని ఏదీ అడగకూడదని, ఆయన ఇష్టానికి వదిలేస్తున్నాను. ఎప్పుడూ నాతో ఉంటూ నన్ను నడిపించేది నా బాబా. ఆయన నాకు నచ్చింది చేసినా, చేయకపోయినా ఆయన మీద నాకున్న ఇష్టం పోదు. నేను బాబాపై కోపగించుకున్నా ఆయన నన్ను వదిలిపెట్టరు. బాబా అంటే నాకు చాలా నమ్మకం. కానీ ఆయన పెట్టే పరీక్షలు నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా బాధ అవుతుంది. ఏదేమైనా బాబా సమాధానం కోసం నేను నిరీక్షిస్తాను.

"చాలా చాలా థాంక్స్ బాబా. ప్రతీసారి మీరు మీ ఉనికిని తెలియజేస్తూ నాతో ఉన్నానని నిరూపిస్తున్నారు. ఎంతో అదృష్టం ఉంటేనే మీ దర్శనం దొరుకుతుంది. అలాంటిది నేను అడిగిన ప్రతిసారి మీరు నాకోసం వస్తున్నారు. చాలా చాలా ధన్యవాదములు బాబా. కరోనా కారణంగా శిరిడీ దర్శించలేకపోతున్నాము. మీ దర్శన భాగ్యం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. వీలైనంత తొందరగా ఆ సదవకాశాన్ని భక్తులకు ప్రసాదించండి బాబా.

ఓంసాయిరాం.


సాయి దయే అసలైన ఔషధం

సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సాటి సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇటీవల జరిగిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

2020, సెప్టెంబరు 26వ తేదీ శనివారం రాత్రి మావారికి ఉన్నట్టుండి జలుబు మొదలైంది. అసలే బయట కోవిడ్ పరిస్థితుల వల్ల ఒంట్లో ఏ మాత్రం కాస్త నలతగా ఉన్నా అందరికీ భయమేస్తోంది. నాకు కూడా భయమేసి వెంటనే మన సద్గురు సాయిని ప్రార్థించి, మావారి చేత ఆవిరి పట్టించాను. తరువాత బాబా ఊదీ వేసిన వేడినీళ్ళు, కషాయం త్రాగమని మావారికి ఇచ్చాను. ఇన్ని చేసినా మర్నాడు కూడా తనకు జలుబు తగ్గలేదు. నేను బాబా ముందు ప్రణమిల్లి, “బాబా! మావారికి జలుబు తగ్గేలా చేయి తండ్రీ! మీ దయవల్ల మావారి జలుబు తగ్గిపోతే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను” అని మన సాయితండ్రిని వేడుకున్నాను. తనను నమ్మినవారిని సాయి ఎన్నటికీ విడిచిపెట్టరు. బాబా దయవల్లే మావారికి జలుబు తగ్గి ఆరోగ్యం కుదుటపడింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా మా కుటుంబానికి అడుగడుగునా సహాయంగా ఉంటూ అన్నివిధాలా మమ్మల్ని రక్షిస్తున్నారు. “బాబా! ఇలాగే నీ కృప అందరిమీదా ప్రసరించి ఈ కరోనా బారినుండి విముక్తి కలిగించు తండ్రీ!” 

ఓం సాయిరాం!



రామచంద్ర అంతిత్‌రామ్ దేశ్‌ముఖ్





రామచంద్ర అంతిత్‌రామ్ దేశ్‌ముఖ్ శిరిడీ నివాసి అయినప్పటికీ అతను బాబా భక్తుడు కాదు. 1918లో వృద్ధురాలైన అతని తల్లి కొడుకుతో కలిసి జీవించడానికి శిరిడీ వచ్చింది. ఒకసారి ఆమె బాబాను దర్శించి, అప్పటినుండి పూర్ణ భక్తివిశ్వాసాలతో బాబాను పూజించసాగింది. ప్రతిరోజూ ఊదీ ధరిస్తూ, తన వయసును కూడా లెక్కించక అన్ని ఆరతులకు హాజరవుతూ ఉండేది. బాబా సమాధి చెందాక కూడా ఆమె ద్వారకామాయికి వెళ్లడం, అక్కడ బాబా చిత్రపటాన్ని పూజించడం మానేదికాదు.

ఒకరోజు తెల్లవారుఝామున 4 గంటలకు ఆ వృద్ధురాలు కాలకృత్యాలు తీర్చుకోవడానికని వెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న ఒక బావిలో పడిపోయింది. జరిగిన దుర్ఘటన గురించి ఎవరికీ తెలియదు. సుమారు 5 గంటల ప్రాంతంలో ఒక మహిళ నీళ్లకోసం వచ్చి బావిలో ఎవరో తేలుతున్నట్లు గమనించింది. మొత్తానికి ఏదో ప్రయత్నం చేసి ఆ వృద్ధురాలిని బయటకి తీసి వైద్యుడికి కబురుపెట్టారు. వైద్యుడు ఆమెను చూసి, "బాబా దయవలన ఈమె సజీవంగా ఉంది. బావి లోతు సుమారు 48 అడుగులు, అందులో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. వయస్సు పైబడి, బలహీనంగా ఉన్న ఈ వృద్ధురాలు అంత ఎక్కువ సమయం చల్లని నీటిలో ఉన్నందున హైపోథెర్మియా (అల్పోష్ణస్థితి)కి గురికావొచ్చు. పర్యవసానంగా ప్రాణాంతకమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈమెకు వెచ్చదనం అందేలా చూస్తూ, ఎక్కువగా వేడి పానీయాలు ఇవ్వండి. శరీరమంతా ఊదీ రాయండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.

తరువాత తల నుండి పాదాల వరకు తడిసిపోయి ఉన్న వృద్ధురాలి బట్టలను మార్చే ప్రయత్నంలో వృద్ధురాలి శరీరంపై ఎక్కడా గాయాలుకానీ, గాట్లుకానీ లేకపోవడం చూసి ఆమె కోడలు ఆశ్చర్యపోయింది. తరువాత ఆమె వృద్ధురాలికి పొడి బట్టలు కట్టి, ఒక కప్పు వేడివేడి టీ ఇచ్చి, "ఈత కూడా రాని మీరు ఎలా అపాయం నుండి బయటపడ్డారు?" అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధురాలు, "నేను బావిలో పడినప్పుడు, 'సాయినాథా! మీరు మాత్రమే నన్ను నీటిలో మునిగిపోకుండా కాపాడగలర'ని నా సంరక్షకుడైన బాబాను పిలిచాను. వెంటనే నా సాయినాథుడు పరుగున వచ్చి, తమ వేయి చేతులతో నన్ను పట్టుకున్నారు. దాంతో నీళ్లకోసం ఆ స్త్రీ వచ్చేవరకూ నేను ఆ నీటిలో తేలుతూ ఉన్నాను" అని చెప్పింది. తరువాత వృద్ధురాలు ప్రశాంతంగా నవ్వుతూ, "అంత పొద్దున్నే నీళ్లకోసం బావి వద్దకు ఆ స్త్రీని పంపింది ఖచ్చితంగా బాబానే" అని అంది. టీ త్రాగిన కొద్దిసేపటికి ఆమెకి మంచిగా అనిపించి, తన రోజువారీ పనులలో నిమగ్నమైంది. అప్పటినుండి ఆమె, "బాబా దయవల్లే తాను ఆ అపాయం నుండి బయటపడ్డాన"ని తరచూ అందరితో చెప్తుండేది. ఆమెను కాపాడినట్లే సద్గురువు తన వెయ్యి చేతులతో జీవితమనే బావిలో మునిగిపోకుండా మనలను సదా రక్షిస్తుంటారు.

తరువాత ఒకసారి రామచంద్ర దేశ్‌ముఖ్ కుమార్తె అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న తనని డాక్టర్ గోండ్కర్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స మొదలుపెట్టి రక్త మరియు మూత్ర పరీక్షలు చేశాక అది టైఫాయిడ్ జ్వరమని నిర్ధారణ అయ్యింది. తనకి యాంటీబయాటిక్స్ ఇస్తున్నప్పటికీ జ్వరం తగ్గుముఖం పట్టలేదు. రోజురోజుకీ తను నీరసించిపోసాగింది. బాబాకు అంకిత భక్తురాలైన తన తల్లి బాబా ఊదీని నీళ్లలో కలిపి రోజుకు రెండుసార్లు బిడ్డకు ఇస్తుండేది. 45 రోజులు ఆసుపత్రిలో ఉన్న తరువాత బిడ్డ ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడంతో తండ్రి చాలా బాధపడ్డాడు. తల్లి మాత్రం వేరే ఏ మందులూ ఇవ్వకుండా ఊదీ తీర్థం మాత్రమే బిడ్డకి ఇస్తూ ఉండేది. అది చూసిన ఆమె భర్త, "మందులే సహాయం చేయనప్పుడు, ఈ ఊదీ తీర్థం తనకి నయం చేస్తుందని అనుకుంటున్నావా?" అని ఆమెని తిట్టాడు. ఆమె సమాధానమేమీ ఇవ్వక మౌనంగా ఉండిపోయింది. కానీ ఊదీ తీర్ధం ఇవ్వడం కొనసాగించింది. మూడురోజుల తరువాత పాప పూర్తిగా కోలుకొని తినడం, ఆడటం కూడా ప్రారంభించింది. ఆ తల్లి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, తన భర్తతో, "బాబా దయ, ఊదీ మహత్యం చూశారా?" అని అంది. అంతేకాదు, "ఇప్పటికైనా బాబాను నమ్మండ"ని బలవంతపెట్టింది.

దాంతో దేశ్‌ముఖ్ మరాఠీ సచ్చరిత్ర పుస్తకాన్ని కొని, పారాయణ మొదలుపెట్టాడు. అతను పారాయణ బిగ్గరగా చదువుతుండేవాడు. పారాయణ సమయంలో ఒక పెద్ద కప్ప వచ్చి, అతని ప్రక్కనే కూర్చుని అతను చదివేది వింటుండేది. ఇలా పారాయణ 7 రోజులు జరిగింది. పారాయణ పూర్తయిన తరువాత ఆ కప్ప మరి కనిపించలేదు. కప్ప ఆధ్యాత్మిక పరివర్తనకు సంకేతం.

అదే సంవత్సరం దేశ్‌ముఖ్ తన పెద్దకుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన అనారోగ్యం కారణంగా అనుకున్నట్లు చేయలేక ఒకరోజు అతను బాబా ఫోటో ముందు నిలబడి, "బాబా! నాకు మొదట్లో మీ మీద నమ్మకం లేకపోయినప్పటికీ మీరు నాకు, నా కుటుంబానికి అన్నిరకాల సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించారు. ఇప్పుడు నా పెద్దకుమార్తె పెళ్లి జరిపించమని, నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను" అని ఏడ్చాడు. మరుసటి సంవత్సరం జనవరి నెలలో ఒక అబ్బాయి తల్లిదండ్రులు దేశ్‌ముఖ్ గారి అన్నయ్యతో కలిసి దేశ్‌ముఖ్‌ను కలవడానికి వచ్చారు. వాళ్ళ అబ్బాయికి దేశ్‌ముఖ్ కుమార్తెతో వివాహం జరపడానికి నిశ్చయమైంది. దేశ్‌ముఖ్ ఆ వివాహాన్ని సాదాసీదాగా చేయాలనుకున్నప్పటికీ తగినంతలో లోటుపాట్లు లేకుండా చేయాలని నిర్ణయించుకుని 500 మందికి విందు ఏర్పాటు చేశాడు. కానీ అనుకోకుండా 800 మంది విందుకు హాజరయ్యారు. దేశ్‌ముఖ్ తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడి ద్వారకామాయికి పరుగెత్తుకుని వెళ్లి "తనని రక్షించమ"ని బాబాను వేడుకున్నాడు. తరువాత కొంచెం ఊదీ తీసుకుని ఆహారపదార్థాలున్న అన్ని పాత్రలలో వేసి ధైర్యంగా వడ్డన ప్రారంభించాడు. బాబా దయవలన అతిథులందరూ తృప్తిగా తిన్నాక కూడా మరో రెండువందల మందికి సరిపడా ఆహారం మిగిలింది.

రిఫరెన్స్ : ఆంబ్రోసియా ఇన్ శిరిడీ, బై రామలింగస్వామి.
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫొనీ బై విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 583వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా అనుగ్రహం వల్ల కరోనా లక్షణాలు మాయం - పరీక్షలో ఉత్తీర్ణత
  2. బాబా కృపతో క్షేమంగా సాగిన తిరుమల యాత్ర


బాబా అనుగ్రహం వల్ల కరోనా లక్షణాలు మాయం - పరీక్షలో ఉత్తీర్ణత

నేను సాయి భక్తురాలిని. ముందుగా సాయిభక్తులందరికీ నా నమస్కారం. ప్రతిరోజూ సాయిసచ్చరిత్ర పారాయణ, ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదవటం నా దినచర్యలో భాగమైపోయింది. సాయిభక్తుల అనుభవాల మననం నాలో సాయిబాబా పట్ల మరింత దృఢవిశ్వాసం కలుగడానికి కారణమైనదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

2020లో మా బాబు FMGE (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో పరీక్షకు మరో పదిరోజులు ఉందనగా, జలుబు, పదార్థాల వాసన లేకపోవటం వంటి కరోనాకు సంబంధించిన కొన్ని లక్షణాలు తనలో బయటపడ్డాయి. దీనితో మా కుటుంబసభ్యులందరం చాలా బాధపడ్డాము. కారణం, అప్పటికే మా బాబు ఒకసారి ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడు కాకపోవటంతో ఇప్పుడు రెండవసారి ఆ పరీక్షకి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా ఎలాంటి ఇబ్బంది పెట్టి వాడి కెరీర్ని దెబ్బతీస్తుందోనని చాలా బాధపడ్డాము. బాబాను తలచుకొని బాబాపై భారం వేశాము. అంతే! 5 రోజులలోనే బాబా అనుగ్రహం వల్ల మావాడికి ఆ లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోయి పరీక్షకి హాజరయ్యాడు. పరీక్ష చాలా కఠినంగా ఉన్నప్పటికీ బాబా చల్లని చూపుతో మావాడు పరీక్ష బాగానే వ్రాశాడు. ఆ తరువాత బాబా అనుగ్రహంతో ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. మా ఆనందానికి అవధులు లేవు. బాబా ఇలా ఎల్లవేళలా మా కుటుంబంపై తమ ప్రేమను కురిపిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. “ధన్యవాదాలు బాబా!”.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా కృపతో క్షేమంగా సాగిన తిరుమల యాత్ర

నా పేరు శ్రీనివాసరావు. ముందుగా సాయిబంధువులకు నమస్కారం. 2020లో మా కుటుంబసభ్యులందరం కలిసి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని అనుకున్నాము. కానీ ఆ సమయంలో కోవిడ్-19 కారణంగా తిరుమలకు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది. తరువాత టి.టి.డి వాళ్ళు చాలా తక్కువమందికి శ్రీవారి దర్శనానికి అనుమతిని కలిపించారు. మేము జులై, ఆగస్టు నెలల్లో తిరుమల వెళదామని రెండుసార్లు ప్రయత్నించాము. కానీ అవకాశం కుదరలేదు. సెప్టెంబరు నెలలో టి.టి.డి వాళ్ళు మరికొంతమందికి శ్రీవారి దర్శనం కొరకు స్పెషల్ టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ విషయం మా అపార్టుమెంటులో ఉంటున్న మిత్రుడు మాతో చెప్పి, అందరం కలసి తిరుమల వెళదామని అడిగారు. మేము వెంటనే అందరికీ 2020, సెప్టెంబరు 15వ తేదీన శ్రీవారి దర్శనం అయ్యేవిధంగా దర్శనం టిక్కెట్లు బుక్ చేశాము. సెప్టెంబరు 15వ తేదీన ఇంటి వద్ద నుండి బయలుదేరాల్సి ఉండగా, రెండు రోజుల ముందు నుండి భారీవర్షాలు ప్రారంభమయ్యాయి. ఇంత వర్షంలో ఎలా బయలుదేరాలా అని మేము భయపడుతూ, బాబా మీద భారం వేశాము. విచిత్రంగా 14వ తేదీ రాత్రి వరకు వర్షం పడి, 15వ తేదీ తెల్లవారుఝామునుండి తగ్గుముఖం పట్టి, మేము బయలుదేరే సమయానికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. మేము బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా మా అబ్బాయి డ్రైవ్ చేస్తుండగా మా కారులో తిరుమల వెళ్ళాము. మా అందరికీ 15వ తేదీ సాయంత్రం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. తరువాత మేమందరం 16వ తేదీ ఉదయం బయలుదేరి కపిలతీర్థం, మంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీకాళహస్తి దర్శించుకుని ఇంటికి వద్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ 15వ తేదీ రాత్రి విపరీతమైన గాలులతో పెద్ద వర్షం పడింది. ఇంత వర్షంలో మేము మరుసటిరోజు ఎలా బయలుదేరాలా అని ఆందోళనపడ్డాము. అదీకాక, మా బాబు మొదటిసారిగా కొండపై కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంత వర్షంలో తను ఎలా డ్రైవ్ చెయ్యగలడోనని చాలా భయపడ్డాము. మేము బాబా సహాయం కోసం ప్రార్థిస్తూ, "ఎటువంటి ఇబ్బందీ లేకుండా మాకు సహాయం చేసి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చండి" అని అనుకున్నాను. విచిత్రంగా అంత పెద్ద గాలివాన కూడా తెల్లవారేసరికల్లా తగ్గి, చక్కగా మేము అనుకున్న దేవాలయాలన్నీ దర్శించుకుని చాలా క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. ముఖ్యంగా మా బాబు డ్రైవింగులో మొదటిసారి తిరుమల కొండకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా చేర్చి, శ్రీవారి దర్శనం చేయించి, తిరిగి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుతూ మేమందరం క్షేమంగా ఇంటికి చేరేలా సహాయపడిన నా తండ్రి బాబాకు మనసారా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. “ధన్యవాదాలు బాబా! ఎల్లప్పుడూ ఇలాగే నీ చల్లని చూపు మా అందరిపై ఉండాలని, మా అందరినీ ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. అలాగే మా పెద్దబాబు కోరుకుంటున్నది కూడా సవ్యంగా జరిగేటట్లు చూడండి తండ్రీ!”



రామచంద్ర నారాయణరావు కార్ణిక్



రామచంద్ర నారాయణరావు కార్ణిక్ 1901వ సంవత్సరంలో జన్మించాడు. అతను తన తల్లిదండ్రులతో ముంబాయిలోని దాదర్ ప్రాంతంలోని రోండాలో నివసించేవాడు. 1915లో తనకు 14 సంవత్సరాల వయస్సున్నప్పుడు అతనికి బాబాను దర్శించే భాగ్యం దక్కింది. 
ఒకసారి అతను తన తల్లిదండ్రులతో కలిసి ముంబాయి నుండి శిరిడీకి రైలులో ప్రయాణమవుతున్నప్పుడు ధోండ్ స్టేషన్లో సంపన్నురాలైన ఒక స్త్రీ వాళ్ళ బోగీలో ఎక్కి, అతని తల్లితో మాట్లాడసాగింది. ఆ స్త్రీ, "ఎక్కడికి వెళ్తున్నార"ని అడుగగా, రామచంద్ర తల్లి, "శిరిడీ వెళ్తున్నామ"ని బదులిచ్చింది. ఇక ఆ స్త్రీ, "అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? బాబా దక్షిణ రూపంలో పెద్ద మొత్తాన్ని తీసుకుంటారు. ఒక సాధువు పెద్ద మొత్తంలో డబ్బు కలిగి ఉండటం సరైనదేనా?" అంటూ బాబా గురించి చెడుగా మాట్లాడసాగింది. ఆ సంభాషణ జరుగుతున్నంతసేపూ రామచంద్ర తల్లి మౌనం వహించింది.

రామచంద్ర కుటుంబం కోపర్‌గాఁవ్‌లో దిగి ఎద్దులబండిలో శిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్ళు శిరిడీ చేరుకుని దీక్షిత్ వాడాలో బసచేశారు. తరువాత వాళ్ళు బాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళినప్పుడు, బాబా రామచంద్ర తల్లి వైపు చూస్తూనే రైలులోని సంభాషణంతా పునరావృతం చేశారు. బాబా సర్వవ్యాపకత్వం రామచంద్రని ఎంతోగానో ఆకట్టుకుంది. వాళ్ళు శిరిడీలో వారం రోజుల పాటు బస చేసి, తరువాత బాబా ఆశీస్సులతో తిరుగు ప్రయాణమయ్యారు. 

రామచంద్ర ఇలా చెప్పాడు: "బాబా పొడుగ్గా, చక్కని శరీరఛాయ కలిగి ఉండేవారు. ఆయన ఒక కఫ్నీ, లుంగీ ధరించి, తలకి ఒక తెల్లని గుడ్డను చుట్టుకునేవారు. ఆయన ఎప్పుడూ చెప్పులు ధరించలేదు. కనీసం లెండీబాగుకు వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పులు వేసుకోలేదు. ఆయన ధునిమాయి నిరంతరమూ వెలుగుతూనే ఉండేది, ఇప్పటికీ! బాబా వద్ద ఒక తెల్లని గుఱ్ఱం ఉండేది. ఆయన దాన్ని చాలా ఇష్టపడేవారు. అది తెల్లవారుఝామునే ద్వారకామాయికి వెళ్ళి కాకడ ఆరతి కోసం నిరీక్షిస్తూ కూర్చునేది. ఆరతి పూర్తయ్యాక బాబా ముందర సాగిలపడి, తన నుదుటి మీద బాబా ఊదీ పెట్టిన తరువాతే అక్కడినుండి వెళ్లిపోయేది".

రెఫ్: శ్రీసాయి ప్రసాద్ పత్రిక 1993 (దీపావళి సంచిక)
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫొనీ బై విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 582వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. తమ బిడ్డలను దగ్గరుండి చూసుకుంటామని నిరూపించిన బాబా
  2. బాబా నిలబెట్టిన ఉద్యోగం

తమ బిడ్డలను దగ్గరుండి చూసుకుంటామని నిరూపించిన బాబా

సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి.  ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే అవి మన నిత్యజీవితంలో జరిగే చర్యలకు బాబా సమధానాలుగా అనిపించి చాలా సంతోషంగా ఉంటోంది. నేను గత 20 సంవత్సరాల నుండి ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నాను. అయితే క్రమం తప్పకుండా డాక్టర్ వద్ద చెకప్ చేయించుకుంటూ చాలా చురుకుగానే ఉండేదాన్ని. 2020, మార్చి నెల నుంచి కరోనా కారణంగా డాక్టర్స్ ఎవరినీ చెకప్ చేయటం లేదు. అందువల్ల నేను మునుపటి మందులే వాడుతూ చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. అయినా ఏమి తేడా జరిగిందో తెలియదుగానీ, దాదాపు 2020, సెప్టెంబరు నెల అంతా నా ఆరోగ్యం బాగోలేదు. రోజూ బి.పి డౌన్ అవటం, తల తిరగటం, నీరసం రావటంతో పగటిపూట కూడా నిద్రలోకి వెళ్లిపోతుండేదాన్ని. దానివలన రోజంతా పని చేసుకోలేకపోతుండేదాన్ని. ‘నా వలన ఏమైనా పొరపాటు జరుగుతోందేమో, అందుకే ఇలా జరుగుతోంది’ అని అనుకుని సహనంగా ఉంటూ బాబాకు పూజ చేసుకుంటూండేదాన్ని. 2020, అక్టోబరు నెలాఖరున మా పాపకు నిశ్చితార్థం అనుకున్నాము. ఆ కార్యక్రమం కోసం అవసరమైన పనులన్నీ చేసుకోవాలంటే నేను ఈ నెలరోజులపాటు ఆరోగ్యంగా ఉండాలి. అందుకని విషయాన్నీ బాబాతో చెప్పుకుని, 3 రోజుల తరువాత వచ్చే గురువారం వరకు, అంటే ఈ మూడురోజులూ నీరసం రాకుండా ఉండేలా చూడమని వేడుకుని, ‘గురువారం తర్వాత నా అనారోగ్యం పూర్తిగా తగ్గేలా చూడు తండ్రీ’ అని వేడుకున్నాను. బాబా దయవలన ఆ మూడు రోజులు నీరసం తగ్గింది. బాబా తమ బిడ్డలను తామే దగ్గరుండి చూసుకుంటారని నిరూపించారు. నాకు సర్వమూ బాబానే. ఆ తండ్రే ఈ నిశ్చితార్థం బాధ్యతను తీసుకుని, ఆనందంగా జరిపిస్తారని కోరుకుంటున్నాను. బాబా! నీ పాదాల వద్ద నా శిరస్సునుంచి ప్రార్థిస్తున్నాను. మా భారాలను నీ భుజాల మీద వేసుకుని మమ్మల్ని మంచి దారిలో నడిపించు. మా బాధ్యతలు సక్రమంగా నెరవేరేలా ఆశీర్వదించు తండ్రీ!”


బాబా నిలబెట్టిన ఉద్యోగం

నా పేరు లలిత. 2020లో కరోనా పరిస్థితుల కారణంగా మా కుటుంబం తణుకుకు మారాక నేను 'సాయిసచ్చరిత్ర' పారాయణ మొదలుపెట్టాను. సాయి అనుగ్రహం వలన చదివింది తెలుగు పండిట్ అయినప్పటికీ ఏ మాత్రం అవగాహనలేని ఎల్.ఐ.సి ఉద్యోగంలో అనుకోకుండా చేరాను. అయితే రెండు మాసాలైనా ఒక్క ఇన్సూరెన్స్ కూడా చేయించలేకపోయాను. దాంతో, "వచ్చే మాసంలో మీ ఉద్యోగం పోవచ్చు" అని పైఅధికారి చెప్పారు. నేను చాలా ఆందోళన చెంది అనుకోకుండా ఒకరోజు నిత్య పారాయణ గ్రూపులోని సభ్యురాలైన శ్రీలక్ష్మిగారితో విషయం చెప్పాను. ఆమె, "మీరు 'సహాయం చేయమ'ని సాయిని అడిగారా?" అని నన్ను అడిగారు. నేను, "లేద"ని చెప్పాను. అందుకామె, "అయితే, నాచేత మీకు చెప్పిస్తున్నారు, 'సాయిబాబాని అడగండి'. ఉద్యోగం ఇచ్చిన బాబాయే ఉద్యోగం నిలబెడతారు" అని అన్నారు. అప్పుడు నేను మనస్పూర్తిగా బాబాను అడిగాను. అద్భుతం! అనుకోకుండా తెలియని, 60ఏళ్ళ వయస్సున్న ఒకాయన నా ద్వారా ఎల్.ఐ.సి చేసారు. రెండు మాసాలుగా ప్రయత్నం చేసినా అవ్వనిది, సాయిని అడిగిన వారంలో ఈ అద్భుతం జరిగింది. అసలు నా ఉద్యోగం నిలవడానికి 2,50.000 రూపాయల పాలసీ చేసినా చాలు. కాని సాయి కృపతో 5,00,000 రూపాయల పాలసీ అయింది. బాబా ప్రసాదించిన ఈ అద్భుతమైన అనుభవాన్ని నేను ఎన్నటికీ మరువలేను. దీన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.



సాయిభక్తుల అనుభవమాలిక 581వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రతీ విషయంలో నన్ను ఆదుకుంటున్న బాబా
  2. బాబా ఆశీస్సులతో జరిగిన అన్నప్రాసన
  3. బాబాను ప్రార్థించినంతనే జ్వరం తగ్గుముఖం


ప్రతీ విషయంలో నన్ను ఆదుకుంటున్న బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాపై చూపించిన కృప అపారం. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియటం లేదు. బాబా చెప్పినట్టు నన్ను పిచ్చుకని లాగినట్టు తమ దగ్గరికి తీసుకున్నారు. నేను ఎన్నిసార్లు సాయి పాదాలు వదిలేసినా ఆయన నన్ను వదలలేదు. తండ్రి తన బిడ్డల్ని వదులుకోడుగా! అందుకే, "నేను ఎవరినీ మధ్యలో విడవను" అని బాబా అంటారు.

మేము యుఎస్‌లో నివాసముంటున్నాం. బాబా దయవల్ల నాకు ఒక చక్కని బాబు ఉన్నాడు. బాబు కడుపులో ఉన్నప్పుడొకసారి చెకప్‌కి వెళితే, అల్ట్రాసౌండ్ చేయించారు. రిపోర్టులో బాబు తలలో వెంట్రికల్స్ పెద్దగా ఉన్నట్లు వచ్చింది. గైనకాలజిస్ట్ ఆ రిపోర్టులు చూసి, "వాటిని నియనాటల్ స్పెషలిస్ట్ పరిశీలనకు పంపుదాం, వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఏమన్నా తేడా ఉంటే, బాబు పుట్టిన తర్వాత ఏమి చెయ్యాలో చెప్తార"ని చెప్పింది. దాంతో నేను భయపడి బాబాను ఎంతగానో ప్రార్థించాను. బాబా దయవల్ల సరిగ్గా వారానికల్లా వెంట్రికల్స్ దాదాపు సాధారణ స్థితికి వచ్చాయి. గైనకాలజిస్ట్ ఆశ్చర్యపోతూ, "భయపడేంత ఏమి లేదు. కొద్దిగా తేడా ఉంది. బాబు పుట్టేనాటికి సాధారణ స్థితికి వచ్చేస్తాయి. బాబు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు. మీరు ఇక రావాల్సిన అవసరం లేదు" అన్నారు. నిజంగా ఇది మిరకిల్. అలా చాలా విషయాల్లో బాబా నాకు తోడుగా ఉన్నారు.

మా బాబుకి రెండు నెలలు ఉన్నప్పుడు బాబు గుండెలో ఏదో శబ్దం వస్తుందని పిల్లల కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళితే, అంత చిన్నబాబుకి ఎక్స్-రే, ఈసిజీ, ఎకో మొదలైనవన్నీ చేసారు. ఎంతో భయమేసి బాధతో బాబాని ప్రార్థించి, రిపోర్టులు వచ్చేదాకా బాబా నామం, ఈ బ్లాగులో నేను చూసిన 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ గడిపాను. బాబా దయవల్ల అంతా నార్మల్ అని చెప్పి, బాబుకి ఆరు నెలలు వచ్చాక బాబుని తీసుకుని రమ్మని" అన్నారు. ఇలా బాబా ప్రతీవిషయంలో నన్ను ఆదుకున్నారు. ఆయన మననుండి ఏమీ ఆశించరు, కేవలం 'తమపై విశ్వాసముంచమ'ని చెప్తారు. "ధన్యవాదాలు తండ్రి".


బాబా ఆశీస్సులతో జరిగిన అన్నప్రాసన


నా పేరు జీ.పావని. మా బాబు పేరు నాగసాయి శ్రీవిష్ణు భరద్వాజ్. నేను మా బాబుకి ఆరవనెలలో అన్నప్రాసన చేయాలని అనుకున్నాను. కానీ మా ఇంట్లోవాళ్ళు 'పిల్లాడు పాకేసమయంలో చేయాల'ని ఒప్పుకోలేదు. "నా దగ్గర బాబుకి సరిపడా పాలు లేవు. పోత పాల వలన వాడికి ఫీడింగ్ సరిపోవడం లేద"ని నేను చెబితే ఎవరూ నా మాట వినలేదు. ఇప్పుడెలా అని నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే, అప్పటికే ఆరవనెల చివరిలో ఉంది. అప్పుడుగాని అన్నప్రాసన చేయకపోతే ఎనిమిదవ నెల వచ్చేవరకు చేసే వీలులేదు. అటువంటి సమయంలో నేను బాబా మీద భారం వేసి, మా బావగారికి విషయం చెప్పాను. అతను నేను చెప్పినదానికి సమ్మతించి, మా అత్తగారిని, మా వారిని ఒప్పించారు. సాయిబాబా ఆశీస్సులతో 2020, సెప్టెంబర్ 13, ఆదివారంనాడు పెన్నాడ నాగమ్మ గుడిలో అన్నప్రాసన చాలా బాగా జరిగింది. అంతా బాబా, అమ్మవారి దయ. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీ అందరి సమక్షంలో బాబాకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. "థాంక్యూ వెరీ మచ్ బాబా".


బాబాను ప్రార్థించినంతనే జ్వరం తగ్గుముఖం

ప్రియమైన సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2020లో ఒకసారి నాకు జ్వరం వచ్చింది. అది కరోనా సమయమని అయినందున నాకు చాలా ఆందోళనగా అనిపించి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టి, బాబా ఊదీ తీసుకున్నాను. ఇంకా, "రెండురోజుల్లో నా జ్వరం తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబాను ప్రార్థించినంతనే జ్వరం తగ్గుముఖం పట్టి నా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంది. ఇదంతా బాబా వల్లే జరిగింది. ఆయన తన బిడ్డల్ని సదా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ప్రార్థించి, శ్రద్ధ, సబూరీలను కనబరుస్తామో బాబా మన ప్రార్థనలను, అభ్యర్థనను విని మనల్ని ఆశీర్వదిస్తారు.

ఓం శ్రీ సాయినాథాయ నమః.



సాయిభక్తుల అనుభవమాలిక 580వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. దిక్కుతోచని స్థితిలో సాయి తన బిడ్డలకి నిజంగా తోడు ఉంటారు
  2. బాబా దయతో పూర్తి ఆరోగ్యం


దిక్కుతోచని స్థితిలో సాయి తన బిడ్డలకి నిజంగా తోడు ఉంటారు

నా పేరు సాహిత్య. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం.  2020 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఒకరోజు రాత్రి 3-4 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మా అమ్మకి తీవ్రమైన చలిజ్వరం వచ్చింది. నేను నిద్రలో నుంచి హఠాత్తుగా లేచి చూసేసరికి అమ్మ చలికి తట్టుకోలేక ముడుచుకుపోయి బాధతో ఒకటే ఏడుస్తుంది. కారణమేంటో, ఏమవుతుందో నాకు తెలియలేదు. తన నుదిటి  మీద చేయి వేసి చూస్తే, చాలా వేడిగా ఉంది. నేను అడిగినదానికి అమ్మ సమాధానం కూడా చెప్పలేకపోయింది. తనకి మాట సరిగ్గా రావట్లేదు. నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అసలే బయట పరిస్థితులు ఏమీ బాగాలేవని 'కోవిడ్ 19'ని తలుచుకోగానే, అమ్మకి 'కోవిడ్ 19' ఏమో! అని నాకు భయం ఇంకా ఎక్కువైంది. ఆ సమయంలో ఏం చేయాలో నాకేమీ అర్థంకాక సాయి వైపు చూశాను. మరుక్షణంలో అమ్మకి ఊదీ పెట్టాలని నా మనసుకి అనిపించింది. వెంటనే వెళ్లి సాయి ఊదీ తీసుకుని, కొంచం అమ్మ నుదుటిపై పెట్టి, మరికొంత నీటిలో కలిపి ఆమెచేత త్రాగించాను. దాంతోపాటు పారాసిటిమాల్ టాబ్లెట్ ఒకటి ఇచ్చాను. 15 నిమిషాలపాటు అమ్మ చలిజ్వరంతో బాధపడిన తరువాత మెల్లగా నిద్రలోకి జారుకుంది. నేను హాల్లోని సోఫాలో కూర్చుని మొబైల్‌లో సాయి సూక్తులు చదువుతూ, "అమ్మకి జ్వరం తగ్గేలా చేయి సాయి" అని సాయిని తలుచుకుంటూ ఒక సాయి లీల చదవడం మొదలుపెట్టాను. అప్పుడే! మా ఇంటి డోర్ మీద సాయి ముఖం నాకు దర్శనం అయింది. బాబా తమ తలకు తలపాగా చుట్టుకుని, గడ్డంతో ఉన్నారు, కళ్ళు తెరిచి నావైపు చూస్తున్నారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. "నువ్వు మాతోనే ఉన్నావు కదా సాయి" అని నాకు చాలా ధైర్యంగా అనిపించింది. నేను చదువుతున్న సాయిలీలలో భక్తునికి తీవ్రమైన జ్వరం వస్తే, సాయి తనకి ఊదీపెట్టి, "కొంచెం నీళ్లలో కలుపుకుని త్రాగమ"ని ఆదేశించి, "ఉదయం 6:30 కల్లా జ్వరం తగ్గిపోతుంద"ని చెప్పారు. ఆ మాటలు సాయి నాతోనే చెప్తున్నట్లు అనిపించింది. అప్పుడు నేను, "అమ్మకి కూడా ఉదయం ఆరున్నరగంటలకల్లా జ్వరం భాధ తగ్గించు సాయి" అని అనుకున్నాను. సరిగ్గా అదే జరిగింది. ఉదయం 6:30కి అమ్మకి చలిజ్వరం అస్సలు లేదు. అప్పుటిదాకా ఏసి ఆపేయమని అడిగిన ఆమె ఏసీ వేసుకుని కూడా "చెమటలు పడుతున్నాయి" అని అన్నది. అమ్మ జ్వరం తగ్గిపోయిందని లేచి కూర్చుని, కాసేపు మామూలుగా ఉండి, ఇంకేం ఫరవాలేదని, మళ్ళీ కాసేపు రెస్టు తీసుకుంటానని వెళ్లి పడుకుంది. దిక్కుతోచక కంగారుపడే పరిస్థితుల్లో సాయి తన బిడ్డలకి నిజంగా తోడు ఉంటారని నాకు ఈ అనుభవం ద్వారా అర్థం అయింది.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


బాబా దయతో పూర్తి ఆరోగ్యం

సాయిబంధువులందరికీ  నా నమస్కారములు. నేనొక సాయిభక్తురాలిని. 2020లో మా చెల్లికి కిడ్నీలో స్టోన్ ఉందని తెలిసింది. దానికోసం తను కొద్దిరోజులు మందులు వాడుతిన్నప్పటికీ ఒకరోజు హఠాత్తుగా తీవ్రమైన నొప్పి వచ్చి తను చాలా బాధపడింది. ఆ విషయం మాకు చెప్పి, దాంతోపాటు కిడ్నీలో స్టోన్ ఉన్న వైపు కాలు కూడా గత కొంతకాలంగా నొప్పిగా ఉంటుందని చెప్పింది. కిడ్నీలో ఏమైనా పెద్ద సమస్య ఉందేమోనని మాకు చాలా భయమేసి, డాక్టర్ని సంప్రదించి స్కానింగ్ చేయించాలని అనుకున్నాము. నేను బాబాని ప్రార్థించి, "చెల్లికి ఎటువంటి సమస్య లేదని, రిపోర్టులన్నీ నార్మల్ రావాల"ని వేడుకున్నాను. తరవాత చేసిన టెస్టుల రిపోర్టులన్నీ నార్మల్‌గా రావడం చూసి అందరం ఆశ్చర్యపోయాం. అంతేకాకుండా కిడ్నీలో స్టోన్ కూడా కరిగిపోయిందని డాక్టర్ చెప్పారు. మా సంతోషానికి అవధులు లేవు. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే భక్తులందరినీ చల్లగా ఆశీర్వదించండి".



సాయిభక్తుల అనుభవమాలిక 579వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా దయవల్ల తీరిన సమస్యలు
  2. మహామహిమాన్వితమైన సాయి ఊదీ


బాబా దయవల్ల తీరిన సమస్యలు

నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయినాథునికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. నేను సౌదీలో నివాసం ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. సంవత్సరంన్నర వయసున్న మా పాప ఆరాధ్య సాయి వరప్రసాదం. ఒకరోజు తన అరిచేతులు పసుపుపచ్చగా కనిపించాయి. ఏమిటి ఇలా ఉన్నాయని తన అరికాళ్ళు, కళ్ళు, నాలుక చూశాను. అరిచేతులు, అరికాళ్ళు పసుపు పచ్చగా ఉన్నాయి. వెంటనే నాకు తెలిసిన పిల్లల డాక్టర్‌కి ఫోన్ చేసి, విషయం చెప్పాను. తను, "ఫోటో తీసి పంపించమ"ని చెప్పారు. నేను అలాగే చేశాను. తాను ఆ ఫోటోలు చూసి, "పసుపురంగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ"ని చెప్పారు. కానీ అప్పటి(2020సం.) కరోనా పరిస్థితుల దృష్ట్యా డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి నాకు భయమేసింది. ఈ విషయం తెలిసి మా వారు తనకు తెలిసిన పిల్లల డాక్టర్‌కి ఫోటోలు పంపించారు. అవి చూసిన డాక్టర్ ఇంటికి రమ్మని చెప్తే, పాపను తీసుకుని వెళ్ళాము. డాక్టర్ పాపని చూసి, "అవును, కాళ్లుచేతులు పచ్చగా ఉన్నాయి. కిడ్నీ, లివర్ సమస్యలేమైనా ఉంటే కష్టం. కారోటేనేమియా అనే సమస్య కూడా అయి ఉండొచ్చు. చాలావరకు సమస్య ఉండకపోవచ్చు కానీ, ఎందుకైనా మంచిది అన్ని టెస్టులు చేయిద్దాం. రోజు పాపకి క్యారెట్ ఇస్తూ ఉండండి. విరోచనం మాత్రం లేత పసుపురంగు రాకూడదు" అని చెప్పారు. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. మరుసటిరోజు పాప విరోచనం లేత పసుపురంగులో అయ్యింది. దాంతో నాకు చాలా భయం వేసింది. వెంటనే అన్ని టెస్టులు చేయించమంటే, చేయించాము. నేను బాబాని ప్రార్థించి, "పదకొండు వారాలు సాయి దివ్యపూజ చేస్తాన"ని మొక్కుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చాయి. పాపకి ఐరన్, కాల్షియం తక్కువగా ఉన్నాయని తెలిసింది. భయపడినట్లు లివర్ వంటి పెద్ద సమస్యలు ఏవీ లేవు. అంతా బాబా దయ అనుకుని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాము.


మావారు డెంటల్ డాక్టర్. 2019లో మావారు రియాద్‌లోని ఒక కాలేజీలో పనిచేశారు. ఆ తర్వాత అక్కడినుంచి వేరే చోటుకి వచ్చి, ఒక డెంటల్ క్లినిక్‌లో ఉద్యోగం చేస్తుండేవారు. సౌదీలో ఉద్యోగం చేయాలంటే, సౌదీ లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సర్టిఫికెట్‌ని మళ్ళీ మూడేళ్ళకి రెన్యువల్ చేయించుకోవాలి. అప్పుడు లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాల్సిన సమయం వచ్చింది. నాలుగు నెలల నుంచి మావారు సౌదీ కమ్యూనిటీకి వెళ్లి సర్టిఫికెట్ రెన్యువల్ కోసం ప్రయత్నిస్తుంటే వాళ్ళు, "మేము రెన్యువల్ చేయము, నీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్‌లో కేవలం టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు మీరు క్లినిక్‌లో వర్క్ చేస్తున్నారు" అని చెప్తుండేవారు. వాళ్ళు చాలామంది డాక్టర్లకి చేశారుకానీ మావారికి మాత్రం చేయలేదు. అప్పుడు మావారు తాను అదివరకు పనిచేసిన కాలేజీకి ఫోన్ చేసి అడిగితే, వాళ్లు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. దాంతో మావారు నేరుగా కాలేజీ హెచ్.ఆర్ డిపార్ట్మెంట్‌కి వెళ్లారు. అక్కడ అంతా కొత్త అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్లు, "మాకు ఏమీ తెలియదు, మేము ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వము" అని చెప్పేశారు. దాంతో మావారు కాలేజీ డీన్‌ని సంప్రదించారు. అతను మరుసటిరోజు రమ్మని చెప్పారు. సరేనని మావారు మరుసటిరోజు వెళితే, 5 గంటలు వెయిట్ చేయించి మావారు ఇచ్చిన లెటర్ పై డీన్ 'ఇది నాకు సంబంధించినది కాదు' అని రాసి సంతకం చేశారు. చేసేదిలేక మళ్ళీ మావారు హెచ్.ఆర్ డిపార్ట్మెంట్‌కి వెళ్లారు. వాళ్ళు మళ్ళీ అదే సమాధానం చెప్పారు. ఆ సమయమంతా మావారు బాబాని స్మరిస్తూనే ఉన్నారు. ఆయన నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను, "అన్నదానం చేస్తానని, రెండు కొబ్బరికాయలు కొడతానని బాబాకి మ్రొక్కుకొమ్మ"ని  చెప్పాను. తర్వాత నేను 'మావారు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ పని జరగటం లేద'ని బాధపడి, సెల్ ఫోన్ తీసి, బాబాని ప్రార్థించి, సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్‌లో చూశాను. "నీ కోరికకు అతుక్కుపోకు. శ్రీసాయిబాబాని తలుచుకో. నీ పని జరుగుతుంది" అని బాబా సమాధానం వచ్చింది. దాంతో నాకు ధైర్యం వచ్చి, మావారికి ఫోన్ చేసి, "ఇంకోసారి డీన్‌ని కలిసి మాట్లాడమ"ని చెప్పాను. నేను "పని పూర్తయ్యేలా అనుగ్రహించమ"ని బాబాకి చెప్పుకున్నాను. వెంటనే మావారు డీన్‌ని కలిసి, "హెచ్.ఆర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వట్లేద"ని చెప్పారు. ఆయన "సరే,  నేను వాళ్లకి ఫోన్ చేసి చెప్తాన"ని వెంటనే హెచ్.ఆర్ డిపార్ట్మెంట్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. దాంతో వాళ్ళు, "ప్రక్రియ మొదలుపెట్టి, రెండురోజుల్లో మీకు సర్టిఫికెట్ పంపుతాము" అని చెప్పారు. చెప్పినట్లుగానే టీచింగ్ & క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మా వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో బాబా దయవల్ల సౌదీ లైసెన్స్ రెన్యువల్ అయింది. అనుకున్నట్లుగా మావారు ఒక వారం సచ్చరిత్ర పారాయణ చేసారు. "బాబా మీకు శతకోటి వందనాలు. నాపై, నా కుటుంబంపై మీ దివ్యప్రేమానుగ్రహాలు సదా ఉండాలని కోరుకుంటున్నాను".


మహామహిమాన్వితమైన సాయి ఊదీ

నా పేరు 'సాయి'. నేను ఒక సాయి భక్తురాలిని.  ప్రతిరోజు ఈ బ్లాగులో వచ్చే భక్తుల అనుభవాలను చదివి నేను ఎంతగానో సంతోషిస్తుంటాను. 2020, సెప్టెంబర్ 25 రాత్రి ఉన్నట్టుండి మా డాడ్ తుమ్మడం మొదలుపెట్టారు. అవి తగ్గుతూనే దగ్గు మొదలయ్యింది. ఎంతకీ దగ్గు తగ్గలేదు. అలా ఇదివరకెప్పుడూ జరగలేదు. అందువలన నాకెంతో ఆందోళనగా అనిపించి బాబాని తలుచుకుని, "సాయిదేవా! మాకు నీవు తప్ప ఎవ్వరూ లేరు. దయచేసి 'డాడ్' దగ్గడం ఆపేసి, హాయిగా నిద్రపోయేలా చేయి" అని వేడుకుంటూ, నీళ్లలో ఊదీ కలిపి,  ఊదీ మంత్రాన్ని చదివి డాడీకివ్వడానికి వెళ్ళాను. డాడ్ 'వద్దు' అన్నారు. నేను మనసులో బాబానే స్మరిస్తూ, "తండ్రి! దయచేసి డాడ్ ఈ నీళ్లు తాగేలా చేయి, తన పరిస్థితి మెరుగుపడేలా చేయి" అని వేడుకున్నాను. కాసేపటికి డాడ్ ఒప్పుకుని, నీళ్లు తాగారు. పదినిమిషాల్లో దగ్గు ఆగిపోయి, హాయిగా నిద్రపోయారు. మహామహిమాన్వితమైన సాయి ఊదీ వల్లనే ఇది సాధ్యమైంది. ఇలా బాబా ఎన్నో రకాలుగా నన్ను అనుగ్రహిస్తూ, "నేను నీతోనే ఉన్నాను" అని తెలియజేస్తూ ఉన్నారు. "సాయిదేవా! నీ ఆశీర్వాదం ఎప్పుడూ నీ బిడ్డలమైన మా అందరిమీద ఉండాలి. నా భయాలు, బాధలు, భారం అంతా నీ పాదాల చెంత విడుస్తున్నాను. నాకు నీవు తప్ప ఇంకో దిక్కులేదు. ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉండేలా అనుగ్రహించు".

సాయి శరణం.



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo