సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1966వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీయాత్ర అనుభవం
2. సాయిబాబానే పాపని కాపాడారు!


సాయిబాబానే పాపని కాపాడారు!

నేను ఒక సాయి భక్తురాలిని. నాకు పెళ్ళైన తర్వాత మేము చెన్నైలో ఉండేవాళ్ళం. అప్పుడు నేను రోజూ కారులో నా ఇద్దరు కూతుర్లను, మా బావగారి కూతుర్లను స్కూలుకు తీసుకెళ్లేదాన్ని. అప్పుడు నా చిన్న కూతురు వయస్సు ఒక సంవత్సరం ఉంటుంది. ఒకరోజు వర్షం అధికంగా కురిసింది. ఆ మర్నాడు స్కూలుకి వెళ్ళినప్పుడు బాగా బురదగా ఉన్నందు వల్ల డ్రైవర్ కారుని కొంచెం దూరంలో ఆపాడు. నేను నా చిన్న కూతుర్ని ఎత్తుకొని మిగతా ముగ్గురు పిల్లల్ని స్కూలుకి తీసుకొని వెళ్తుండగా బురదకి నా కాలుజారింది. హఠాత్తు పరిణామంతో నేను నా చేతిలో ఉన్న పాపని వదిలేసాను. కింద చూస్తే, పెద్ద రాయి ఉంది. నేను నా పాప నేరుగా ఆ రాయి మీద పడుతుందనుకొని కళ్ళు మూసుకుని పెద్దగా అరిచేసాను. కానీ కళ్ళు తెరిచి చూస్తే, పాప రాయి మీద కాకుండా పక్కన బురదలో పడింది. తనకి ఎటువంటి దెబ్బ తగలలేదు. ఇది నాకు ఒక అద్భుతమైన అనుభవం. ఆ రోజు గురువారం. సాయిబాబానే మా పాపని కాపాడారు. నేను పిల్లల్ని స్కూలులో వదిలేసి పాపను తీసుకొని నేరుగా గుడికి వెళ్లి బాబాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపినా తక్కువే. 

సాయిభక్తుల అనుభవమాలిక 1965వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏ సమయంలో తలచినా కరుణించే బాబా
2. సరైన సమయానికి లగేజీ అందేలా చేసిన బాబా
3. గండం గట్టెక్కించిన శ్రీసాయినాథుడు




సాయిభక్తుల అనుభవమాలిక 1964వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊదీ మహత్యం
2. సమస్య లేకుండా చూసిన బాబా

ఊదీ మహత్యం
 
సాయిబాబా భక్తులకు నమస్కారాలు. నా పేరు రేవతి. మేము గుంటూరులో ఉంటాము. మేము 2025, సంక్రాంతికి మా అత్తమామల వూరు వెళ్ళాం. అక్కడ ఒకరోజు బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుంటే చీకట్లో మా పాప ఏదో చూసి భయపడి వణుకుతూ ఏమీ చెప్పలేక సతమతమైపోయింది. మావారు ఏదీ సరిగా తెలుసుకోకుండా పాపను కొట్టారు. నేను మా పాప బాధను, అలాగే ఆయన కోపాన్ని తట్టుకోలేకపోయాను. ఊరిలో మా మామగారు బాబాను నమ్మనందువల్ల అక్కడ బాబా ఊదీ అందుబాటులో లేక నాకు ఏం చేయడానికి తోచలేదు. ఆ సమయంలో సచ్చరిత్ర చదివే అలవాటున్న నాకు అందులో బాబాను తలుచుకొని మట్టిని ఊదీగా పెట్టిన సందర్భం గుర్తుకు వచ్చింది. వెంటనే రెండు అగరుబత్తీలు వెలిగించి, అవి కాలంగా రాలిని బూడిదను ఊదీగా భావించి భావించి బాబాను తలుచుకుంటూ మా పాప నుదిటి మీద పెట్టి, కొంత నోట్లో వేసి, మరికొంత తన వీపుకు రాశాను. కాసేపటికి మా పాప పడుకొని లేచి చక్కగా అన్నం తిని, భయపడకుండా మళ్ళీ పడుకుంది. అంతా బాబా దయ.  

మేము ఊరు నుండి గుంటూరుకి తిరిగి వచ్చాక మా బాబుకి బాగా అనారోగ్యం చేసింది. వేడి చేసి గొంతులో అంతా ఎర్రగా పుండు అయినట్లు అయింది. దానివలన బాబు ఏమీ తినలేకపోయాడు, నీరు కూడా త్రాగలేకపోయాడు. తెలిసినవాళ్ళు ఏదో చిట్కా వైద్యం చేస్తారంటే వెళ్లాను కానీ, వాళ్ళు అక్కడ లేరు. నాకు ఏమీ దిక్కు తోచలేదు. సాయంత్రానికి నొప్పి ఎక్కువై బాబు బాగా ఏడవడం మొదలుపెట్టాడు. నేను వాడి బాధను చూసి తట్టుకోలేకపోయాను. కనీసం కొంచెంసేపు పడుకోబెడదామని ప్రయత్నం చేసినా వాడు నిద్రపోలేదు. ఇంకా నేను బాబాను తలుచుకొని, "బాబా! నా బాబుకి నొప్పి తగ్గి చక్కగా కొంచెంసేపు నిద్రపోవాలి" అని వేడుకొని ఊదీ బాబు నుదుటన పెట్టి, కొంత నోట్లో వేసాను. కొంతసేపటికి వాడు ఎలా నిద్రపోయాడో నాకు తెలియదుగాని ప్రశాంతంగా పడుకున్నాడు. మేము ఆనందంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాము. తర్వాత బాబు ఏరోజూ నొప్పి అని ఏడవలేదు. హాయిగా పడుకునేవాడు. తర్వాత మూడు రోజులకు వాడికి పూర్తిగా నయమైంది. "మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే తండ్రి సాయినాథా. నా ప్రతి విషయంలో వెంటుండి నడిపే మీరు నా సొంతకాల మీద నేను నిలబడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1963వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా సర్వాంతర్యామి - ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు


సాయిభక్తుల అనుభవమాలిక 1962వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఫోన్ దొరికేలా దయ చూపిన బాబా
2. చెప్పినట్టుగానే ఉంగరం దొరికేలా అనుగ్రహించిన బాబా



సాయిభక్తుల అనుభవమాలిక 1961వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా లీలలు ఎవరికీ అర్థం కావు - ఆయన ఎవరిని, ఎప్పుడు, ఎలా ఆశీర్వదిస్తారో తెలియదు


సాయిభక్తుల అనుభవమాలిక 1960వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. వేడుకున్నంతనే ట్యాబ్ కనపడేలా అనుగ్రహించిన బాబా
2. అంతలా ఉంటుంది బాబా లీల

వేడుకున్నంతనే ట్యాబ్ కనపడేలా అనుగ్రహించిన బాబా

నా పేరు రాణి. మాది కాకినాడ. సాయి లేకుండా నేను ఒక్కరోజు కూడా బ్రతకలేను. నా జీవితంలో సాయి ప్రసాదించిన అనుభవాలు చాలానే ఉన్నాయి. సాయి వద్దని చెప్పినవి చేయడం వల్ల రెండు, మూడుసార్లు నష్టం జరిగింది. అలాంటి అనుభవాలు ఎదురైనప్పటినుండి నా జీవితంలో ప్రతి నిమిషం సాయి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇక నా అనుభవానికి వస్తే..  2025, జనవరి 12న సంక్రాంతి పండక్కి శిరిడీలో ఉందామని నేను, నా పెద్దకూతురు స్నేహ శిరిడీ వెళ్ళాము. నా చిన్నకూతురు హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతుంది. మేము శిరిడీలో ఉన్నప్పుడు తను తన పని చేసుకొని లాప్టాప్, ట్యాబ్, ఫోను ఒకచోట పెట్టి తర్వాత లాప్టాప్, ఫోన్ తీసుకుని ట్యాబ్ అక్కడే మర్చిపోయింది. తర్వాత చూస్తే ఆ ట్యాబ్ కనిపించలేదు. దాని ధర 28,000 రూపాయలు. శిరిడీలో నేను, మా పెద్దమ్మాయి బాబా దర్శనం చేసుకొని రూమ్‌కి వచ్చేసరికి చిన్నమ్మాయి నాకు ఫోన్ చేసి ట్యాబ్ కనపడటం లేదని చెప్పి ఏడ్చింది. అది విని నేను "బాబా! ఇదేంటి పండగ సందర్భంగా ఇక్కడికి వస్తే. నాకు విచారం కలగజేస్తున్నావు. మీ దయతో ట్యాబ్ దొరకాలి తండ్రీ" అని అనుకున్నాను. వెంటనే మావారు ఫోన్ చేసి, "ట్యాబ్ బెడ్ షీట్ కింద ఉంది. ఇంతకుముందు చాలాసార్లు వెతికిన కనపడనిది ఇప్పుడు హఠాత్తుగా కనబడింది" అని చెప్పారు. నేను, "సాయిదేవా! కాసేపు ఎంత కంగారుపెట్టావు" అని నమస్కరించుకుని చాలా సంతోషంగా శిరిడీలో గడిపి తిరిగి కాకినాడ వచ్చాము. "ధన్యవాదాలు బాబా. నా స్నేహ అడిగింది కూడా నెరవేర్చు స్వామి. నా తప్పులుంటే క్షమించి కనికరించు బాబా".

అంతలా ఉంటుంది బాబా లీల

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు రాధిక. 2025, జనవరి 22న బాబా నాకు ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా భర్తకి షుగర్ వ్యాధి ఉన్నందున ఆయన జనవరి 21న రెగ్యులర్ చెకప్‌కి వెళ్లి అందులో భాగంగా రెటీనా టెస్టు చేయించుకుంటే, డాక్టరు రిపోర్టు ఆధారంగా, "కంటికి సంబంధించిన గ్లూకోమా వ్యాధి ఉందేమోనని అనుమానంగా ఉంది. ఎల్.వి.ప్రసాద్ కంటి హాస్పిటల్లో చూపించుకోండి" అని అన్నారు. ఆ వ్యాధి నా భర్త నాయనమ్మకు వుంది. అది వంశపారంపర్యంగా వస్తుందని డాక్టర్లు చెప్పడంతో నేను, నా భర్త పడిన టెన్షన్ మాటల్లో చెప్పలేం. ఆ వ్యాధి వల్ల కంటి చూపు మందగించి క్రమంగా అంధత్వంగా పరిణమిస్తుందని మేము చాలా చాలా భయపడ్డాము. నేను సాయిని, "సాయీ! ఆ వ్యాధిని నయం చేయలేమని, పెరగకుండా జీవితాంతం ఐడ్రాప్స్ వేసుకోవాలని డాక్టర్ చెప్పారు. కానీ ఆ వ్యాధి పెరగకుండా డ్రాప్స్‌తో తగ్గేలా చేయండి బాబా" అని వేడుకుని ఆయన నామస్మరణ చేయడం మొదలుపెట్టాను. మర్నాడు 2025, జనవరి 22, తెల్లవారుజామున 5 గంటలకు మేము ఎల్.వి.ప్రసాద్ కంటి హాస్పిటల్‌కి వెళ్లి అపాయింట్మెంట్ తీసుకుంటే, ఎన్నో టెస్టుల అనంతరం సుమారు మధ్యాహ్నం ఒంటిగంటకి డాక్టర్లు, "మీరు భయపడుతున్నట్లుగా ఏమీ లేదు. కంటిలో నరం పెద్దదిగా ఉండటం వలన డాక్టర్ అనుమానం వ్యక్తం చేశార"ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ క్షణం మేము ఎంత సంతోషపడ్డామంటే మాకు నోట్లో నుండి మాట రాలేదు, కళ్ళనుండి నీళ్లు తప్ప. అప్పటివరకు నేను సాయినామస్మరణ చేస్తూనే ఉన్నాను. నేను సాయితో వ్యాధి పెరగకుండా డ్రాప్స్ తో తగ్గేలా చేయమని చెప్పుకుంటే, ఆయన 'అసలు వ్యాధే లేదని' చెప్పేలా చేశారు. అంతలా ఉంటుంది బాబా లీల మరి. ఆయనకు సర్వస్య శరణాగతి వెడితే ఆయన తప్పకుండా మన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తారు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం నేను మ్రొక్కుకున్నవన్నీ తీర్చేశాను. "బాబా! ఇలానే మీ కరుణ మా మీద సదా ఉంచండి".

సాయిభక్తుల అనుభవమాలిక 1959వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మొదటి శిరిడీ దర్శనం
2. అంతా బాబా లీల

మొదటి శిరిడీ దర్శనం

నా పేరు రాజన్ బాబు. నేను అప్పుడప్పుడే బాబాని నమ్ముతున్న రోజుల్లో నా జీవితంలో ఏవో సమస్యల వల్ల ఇంట్లో మనశాంతి కరువైంది. ఏదేమైనా నా సమస్యలకు పరిష్కారం కావాలంటే బాబాని నమ్మడమే సరైన పని అని పూర్తిగా బాబాపై విశ్వాసముంచి ఆయన్ని వేడుకున్నాను. 2019, అక్టోబర్ 9, దసరాకి ముందు ఇంట్లో గొడవలతో ఇంట్లో ఎవరూ నాతో మాట్లాడడం లేదు. అందువల్ల ఈ దసరా సమయంలో ఇక్కడ ఉండొద్దని అనుకున్నాను. అంతలోపే శిరిడీ వెళ్దామని ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడే నా ఫోన్లో కాజీపేట నుండి శిరిడీకి ట్రైన్లు ఉన్నాయా అని చూస్తే దసరారోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ట్రైన్ ఉంది. వెంటనే స్లీపర్ టికెట్ బుక్ చేశాను. టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నప్పటికీ సరిగా దసరా ముందురోజు కన్ఫర్మ్ అయింది. దాంతో నేను ప్రయాణానికి సిద్ధమయ్యాను. మరో అద్భుతం ఏమిటంటే, నా టికెట్ స్లీపర్ క్లాస్ నుండి సెకండ్ ఏసికి అప్గ్రేడ్ అయిందని నాకు మెసేజ్ వచ్చింది. నేను ఆనందంగా బాబాకు నమస్కరించుకొని ట్రైన్ ఎక్కాను. కానీ నేను మొదటిసారి శిరిడీ వెళ్తున్నాను. నాకు ఏమీ తెలియనందు వల్ల, "బాబా! నాకు ఏమీ తెలియదు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి తిరిగి వచ్చేదాకా నా వెంట ఉండి చూసుకోవాల"ని వేడుకొని నా సీట్లో కూర్చున్నాను. కాసేపటికి నా బెర్త్ పైకెక్కి పడుకొని ఆలోచిస్తూ, "నా ప్రయాణం ఎలా జరుగుతుంది బాబా? నీవే దిక్కు" అని పదేపదే బాబాను తలుచుకుంటున్నాను. కొంతసేపటికి ట్రైన్ హైదరాబాదులో ఆగింది. కిందకి దిగి తినడానికి కొన్ని కొనుక్కొని మళ్ళీ ట్రైన్ ఎక్కాను. ట్రైన్ బయలుదేరింది. నా ఎదురు బెర్త్లో పడుకొని ఉన్న విజయవాడకి చెందిన ఒక అబ్బాయి హఠాత్తుగా లేచి, "హైదరాబాద్ వచ్చిందా?" అని అడిగాడు. నేను, "ఆ.. ఇప్పుడే వెళ్లిపోయింది" అన్నాను. అతను, "అయ్యో..! ఓకే" అన్నాడు. అతని దగ్గర తినడానికి రేగిపళ్ళు తప్ప ఏవీ లేవు. వాటిని తింటుంటే నాకు బాధేసి నా దగ్గరున్న అరటిపళ్ళు అతనికి ఇచ్చాను. ఒకరినొకరం పరిచయం చేసుకున్నాము. అతను తరచూ శిరిడీ వెళ్లి, వస్తుంటానని చెప్పాడు. నేను ఆనందంగా శిరిడీ తెలిసిన వ్యక్తిని పరిచయం చేసారని బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇద్దరం కలిసి శిరిడీ చేరుకొని ముందుగా ధూళి దర్శనం చేసుకున్నాం. అతను, "నేను రేపు తిరిగి వెళ్తాను" అని అన్నాను. నేను మూడు రోజులుంటాను అని అన్నాను. రూములు చూసి ఒక రూమ్ తీసుకున్నాము. అప్పటివరకు నాతో ఉన్న అతను, "నేను ఎక్కడైనా పడుకుంటాను" అన్నాడు. నేను, "వద్దు. నువ్వు నాతోనే ఉండు" అన్నాను. అతను సరేనని స్నానం చేసాక నన్ను మళ్లీ బాబా దర్శనానికి తీసుకొని వెళ్ళాడు. ప్రసాదాలయం, ఇంకా అన్నీ చూపించి మర్నాడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. నేను అతనితో వెళ్లి, అతన్ని ట్రైన్ ఎక్కించి వచ్చాను. నేను అక్కడున్న మూడు రోజులు కనీసం రోజుకు మూడుసార్లు చొప్పున వీలైనన్నీ సార్లు దర్శనం చేసుకున్నాను. త్రయంబకేశ్వరం కూడా వెళ్ళొచ్చాను. ప్రతి విషయంలో బాబా దగ్గరుండి నన్ను తిరిగి ఇంటికి చేర్చారు. "ధన్యవాదాలు బాబా".

అంతా బాబా లీల

'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు పాఠకులకు నమస్కారాలు. నా పేరు వెంకటేష్. 2024, ఫిబ్రవరి 22న నేను నా కుటుంబంతో మా కజిన్ సిస్టర్ పెళ్లికి వెళ్లాను. అక్కడ ఫంక్షన్ హాల్లో మా కుటుంబానికి కేటాయించిన గదిలో ఉన్నాం. పెళ్ళైపోయాక నేను మా బ్యాగులన్నీ సర్ది ఒకటికి రెండుసార్లు తనిఖీ చేశాను. తర్వాత బ్యాగులన్నీ నేను, నా భార్య బయటికి తీసుకొచ్చాము. నేను గదికి తాళం వేసే ముందు మరోసారి గదిలో అంతా చూసి, మా వస్తువులు ఏవీ లేవన్న నిర్ధారణకొచ్చిన తర్వాత తాళం చేసి, తాళాలు ఇచ్చేసాను. నాకు బాగా గుర్తుంది, నా బ్యాగును నేనే పెళ్లికూతురు గదిలో పెట్టాను. తర్వాత మేము బయలుదేరేముందు పనివాళ్ళు అన్నీ బ్యాగులు మా కారులో పెట్టారు. నేను అన్నీ వచ్చే ఉంటాయని చెక్ చేసుకోలేదు. తీరా ఇంటికి వచ్చాక చూసుకుంటే, ఒక బ్యాగు కనిపించలేదు. ఎవరిదా ఆ బ్యాగు అని చూసుకుంటే అది నాదే. ఆ బ్యాగులోని పెళ్లికోసం కొన్న కొత్త బట్టలు, బిజినెస్ కోసం ఉపయోగించే మొబైల్, లాకర్ తాళాలు ఉన్నందున చాలా టెన్షన్ పడ్డాను. ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం అంతా వెతికినా కనిపించలేదు. అప్పుడు పెళ్ళికొడుకువాళ్లకి విషయం చెప్తే, ఫంక్షన్ హాల్ దగ్గర విచారించారు, సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసారు కానీ, ఆ బ్యాగు జాడ తెలియలేదు. నేను చాలా భయపడిపోయి మనసులో బాబాని తలుచుకున్నాను. వాళ్ళు మరుసటిరోజు మళ్లీ వెళ్లి పెళ్లికూతురు గది, మేము ఉన్న గది చెక్ చేశారు. అప్పుడు మేము ఉండిన గదిలోనే ఆ బ్యాగు ఉందట. ఆ విషయం వాళ్లు కాల్ చేసి చెప్తే, నేను అస్సలు నమ్మలేకపోయాను. ఎందుకంటే, నేను గదికి తాళం వేసే ముందు బాగా చెక్ చేశాను. ఇంకా అప్పుడు అంతా బాబా లీల అనుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1958వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రార్థనలకు బాబా సమాధానం

నా పేరు మాధవి. నా ప్రార్థనలకు బాబా ఎలా సమాధానమిచ్చారో నేనిప్పుడు పంచుకుంటాను. మా అమ్మ, వదినలు మధ్య కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళు సన్నిహితంగా మాట్లాడుకునేవారు. అలాంటిది ఒకరోజు మా అమ్మ, "కోడలు నాతో మాట్లాడటం లేద"ని చెప్పింది(కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఇక్కడ సమస్య గురించిన వివరాలు ప్రస్తావించలేను). అది విని నేను ఆందోళన చెంది, "బాబా! దయచేసి వదిన అమ్మతో మాట్లాడేలా చేయండి. ఆమె మొండిగా ఉంటుందని నాకు తెలుసు. అలాగని ఏ సంబంధాన్ని వదిలిపెట్టలేం" అని బాబాతో చెప్పుకొని బాధపడ్డాను. ఇక అద్భుతం చూడండి. నేను మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేసినప్పుడు మామూలుగా "వదిన  మాట్లాడుతుందా?" అని అడిగాను. అందుకు అమ్మ, "నిన్న ఫోన్ చేసింది. ఏమీ జరగనట్లు చక్కగా మాట్లాడింది" అని చెప్పింది. అది విని నేను సంతోషించి బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా. నేను నా తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉంటున్నానని మీకు తెలుసు. వాళ్లకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా ఇంకేమైనా సమస్యలు వచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంటే వాళ్లే(వదినవాళ్ళు) అండగా ఉండాలి. దయచేసి వారి బంధాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా అనుగ్రహించండి".

2024లో మా అమ్మానాన్న కొత్త ఇంటికి మారి పాత ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకున్నారు. అయితే 2 నెలలు చూసినా ఎవరూ అద్దెకు రాలేదు. ఎవరైనా వచ్చినా ఇల్లు చూసి వెళ్లిపోతుండేవారు. ఈ పరిస్థితి అమ్మవాళ్లకి బాధను కలిగించడంతోపాటు ఆర్థికంగా ఇబ్బందిపెట్టింది. నేను వాళ్ళని ఆ స్థితిలో చూడలేకపోయాను. ఒకరోజు నేను ఈ బ్లాగును చదువుతున్నప్పుడు, ఇదే సమస్యను ఎదుర్కొన్న ఒక భక్తుని అనుభవం చూసాను. అందులో వాళ్ళ ఇంటిని డిసెంబర్‌లో ఎవరో అద్దెకు తీసుకోవోడంతో సమస్య తీరినట్లు ఉంది. అది చదివాక ఖచ్చితంగా చెప్పలేనుగానీ, 'డిసెంబర్ నాటికి అమ్మావాళ్ళింట్లో ఎవరో అద్దెకు వస్తారని బాబా నాకు సూచన ఇచ్చారని' అనుకున్నాను. తరువాత సరిగ్గా అదే జరిగింది. ఎవరో వచ్చి విచారించి, డిసెంబరులో ఇంటిలో దిగుతామని చెప్పారు. అది తెలిసి నేను, 'బాబా మనల్ని ఎంతలా చూసుకుంటున్నారు?' అని ఆశ్చర్యపోయాను. బాబా తమ బిడ్డలు సంతోషంగా లేకుంటే చూడలేరు. ఆయన నా ప్రార్థనలకు వేరే భక్తుల అనుభవం ద్వారా నాకు సమాధానం ఇచ్చారు. "చాలా ధన్యవాదాలు బాబా".

ఒకరోజు అకస్మాత్తుగా నా మేనేజర్ నాకు ఫోన్ చేసి, 'నేను ఒక పనికోసం ఎక్కువ గంటలు నమోదు చేసానని, దాన్ని సర్దుబాటు చేయమని, అన్ని గంటలకి పేమెంట్ ఇవ్వలేమని' చెప్పారు. దాంతో నేను డబ్బు గురించి ఆలోచించలేదు కానీ, నమ్మకం దెబ్బతింటుందని కొంచెం ఆందోళన చెంది చాలా బాధపడ్డాను. అయితే ఆ సమయంలో గంటల సంఖ్యను వేరే పనికింద సర్దుబాటు చేయడానికి కూడా వేరే అవకాశం లేకపోయింది. ఎందుకంటే, అది డిసెంబర్ నెల అయినందున నాకు ఎక్కువ పనులు లేవు. ఏదేమైనా నేను సమస్యను బాబా పాదకమలాల వద్ద ఉంచాను. తర్వాత నేను ఫేస్‌బుక్ పేజీలో చూస్తుంటే సాయిబాబా ఫోటో క్రింద, "నువ్వు పెద్ద ప్రమాదం నుండి రక్షించబడ్డావు. ఇది నువ్వు అనుకున్నట్లు జరగలేదని చింతించకు. ఇది నీ మేలు కోసం నా ప్రణాళిక. అనుకున్నవి సమయానికి నెరవేరుతాయి" అని వ్రాసింది. అది చూసిన నేను, 'బాబాకు మనకు ఏది మంచిదో తెలుసు. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు' అని అనుకున్నాను. కానీ నా టీమ్ ఈ అంశాన్ని స్టాండ్-అప్ మీటింగ్ వరకు లాగకూడదని అనుకున్నాను. తర్వాత నేను మీటింగ్‌కి హాజరయ్యే ముందు బాబాని ప్రార్థించి, కేవలం ఆయన నుండి భరోసా కోసం, "బాబా! దయచేసి మీటింగ్‌లో ఆ అంశం రావడం లేదని నాకు ఏదైనా హామీ ఇవ్వండి" అని అడిగాను. సమావేశానికి కొన్ని నిమిషాల ముందు నేను ఫేస్‌బుక్‌లో, "నేను నీకోసం పోరాడతాను. ఆందోళనలన్నీ తీసేసి ప్రశాంతంగా కూర్చో. నువ్వు ఏమీ చేయనవసరం లేదు. నా మాటలు నమ్ము" అని బాబా సందేశం చూసాను. బాబా అలా చెప్పడం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించి మీటింగ్‌కి హాజరయ్యాను. బాబా చెప్పినట్లు మీటింగ్‌లో ఆ అంశం రాలేదు. "చాలా ధన్యవాదాలు బాబా. నా జీవితానికి సృష్టికర్త మీరే. మీకు ఏది కావాలంటే అది చేయండి. అయితే ఎప్పుడూ మాతో ఉండండి. పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా మీ ఉనికిని అనుభవిస్తుంటే నేను భయపడను దేవా. దయచేసి నాకు నమ్మకం కలిగించండి".

సాయిభక్తుల అనుభవమాలిక 1957వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భక్తిని గెలిపించిన బాబా
2. బాబాని తలచిన వెంటనే కనపడిన చెక్ బుక్



సాయిభక్తుల అనుభవమాలిక 1956వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి దయ
2. బాబా కృప 

శ్రీసాయి దయ

సాయి దేవుడికి, సాయి బంధువులకు నమస్కారం. నా పేరు రమాదేవి. నేను ఇప్పుడు మా తిరుమల యాత్రలో బాబా చేసిన సహాయం గురించి మీతో పంచుకుంటున్నాను. 2024, డిసెంబర్ 5న స్వామివారి అర్చన సేవకు మాకు టికెట్ లభించింది. అర్చన సేవకు వెళ్లే భక్తులకు స్వామివారిని 45 నిమిషాలపాటు దర్శించుకునే భాగ్యం ఉంటుందని తెలిసి నేను చాలా సంతోషించాను. కానీ అది నాకు నెలసరి సమయం. నెలసరి రాకుండా టాబ్లెట్లు వేసుకుందామంటే, అవి నాకు పడటం లేదు. అందుకని నాకు ఏం చేయాలో తెలియక, "సర్వ దేవతా దర్శనం మీ కృప వలననే జరుగుతుంది బాబా. వేంకటేశ్వరస్వామి అర్చన సేవకు ఆటంకం రాకుండా చూడండి బాబా" అని బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ తీసుకుంటూ బాబా మీద భారమేశాను. ఒకరోజు ఆఫీసులో నా సహోద్యోగితో విషయం చెపితే తను, "ఒకసారి డాక్టర్ సలహా తీసుకుంటే మంచిద"ని చెప్పింది. నేను అంతా బాబా దయ అని డాక్టర్‌ను కలిస్తే, టాబ్లెట్లు వ్రాశారు. అవి వాడుతూ ఉంటే మా తిరుమల ప్రయాణానికి ముందురోజు వరకు బాగానే ఉంది కానీ, ఆ రోజు ఇబ్బంది మొదలవుతుందేమోననిపించి బాబాను, దత్తాత్రేయుని, వేంకటేశ్వరస్వామిని "మీ కృపతో ఏ ఆటంకం లేకుండా దర్శనం జరగాల"ని వేడుకున్నాను. బాబా దయవలన ఏ ఇబ్బందీ లేకుండా స్వామి దర్శనం, అర్చన సేవ ప్రశాంతంగా జరిగాయి. మరుసటిరోజు మేము తిరుచానూరు వెళ్ళాము. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆరోజు చివరి రోజు. చక్రస్నానం చేసేరోజు. మాకు ఆ విషయం తెలియక పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదామనుకున్నాం. కానీ బాబా పంపినట్టు పోలీసువాళ్ళు చక్రస్నానం విశిష్ఠత చెప్పి, స్నానం చేసి వెళ్ళమని చెప్పారు. మేము అలాగే చేసి క్షేమంగా ఇంటికి చేసుకున్నాము. అంతా బాబా దయ. "మీకు చాలా కృతజ్ఞతలు సాయిదేవా".

రెండు నెలల నుండి నా చర్మం, తల బాగా దురదగా ఉంటుండేవి. డాక్టర్ని సంప్రదిస్తే, కొన్ని క్రీములు వాడమన్నారు. వాటిని దురద ఉన్న చోట రాస్తే తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండేది.చివరికి నేను బాబాని వేడుకొని ఊదీ తీసుకొని, ఇన్ఫెక్షన్ ఉన్న చోట బాబా అభిషేక జలం రాశాను. బాబా దయవలన దురద పూర్తిగా తగ్గిపోయింది. "శతకోటి నమస్కారాలు బాబా".

ఒక ఆన్లైన్ అకౌంట్ తీసుకోవటానికి ప్రయత్నించినప్పుడు KYC అప్డేట్ అవ్వలేదు. అప్పుడు, "అకౌంట్ ఓపెనింగ్ అవ్వాలి" అని బాబాని వేడుకుంటే ఏ సమస్య లేకుండా అకౌంట్ ఓపెన్ అయింది. "థాంక్యూ సాయిదేవా. అడుగడుగున మీ తోడు మాకు కావాలి బాబా".



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo