ఈ భాగంలో అనుభవాలు:
1. ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన బాబా
2. బాబా ఊదీ నిజంగా దివ్య ఔషధం
3. పిలిచినంతనే కష్టం తీర్చే బాబా
ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన బాబా
సాయి బంధువులందరికీ నమస్కారములు. నా పేరు మాధవి. మాది నెల్లూరు. బాబా లేకపోతే నేను లేను. ఆయన నాకు ఈ జీవితం ప్రసాదించి నా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు నన్ను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారో లెక్కలేదు. అందుకే నా జీవితం బాబాకి అంకితం. శ్రీసాయి మహిమల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అవి అనుభవించేవాళ్లకు మాత్రమే తెలుస్తాయి. నేను ఈ బ్లాగులో ప్రచురితమయ్యే భక్తుల అనుభవాలు చూస్తున్నప్పటినుండి నా జీవితంలో జరిగిన అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక రెండు అనుభవాలు పంచుకుంటాను. ఒకసారి నేను మా ఇంటి గేటు వద్ద ఉన్న మెట్ల మీద నుండి పడిపోయాను. అప్పుడు నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఒక అదృశ్య హస్తం నా తలకి ఏమీ కాకుండా పట్టుకుని కింద పెట్టింది. ఆ చేయి నాకు కనపడలేదు కానీ, స్పర్శ స్పష్టంగా తెలిసింది. అలా ఎవరు చేస్తారు? నా బాబానే నన్ను కాపాడారు.
ఇంకోరోజు నేను స్కూటీ మీద చాలా వేగంగా వెళుతున్నాను. అదే సమయంలో ఎదురుగా కాస్త దూరంలో ఒక ఆటో అంతే వేగంగా వస్తూ కనిపించింది. నాకు ఏం తోచలేదు. అంతలో ఆ ఆటో హఠాత్తుగా యుటర్న్ తీసుకోబోయేసరికి నేను బ్రేక్ వేయలేకపోయాను. నాకు టెన్షన్ మొదలై, 'ఇంకేముంది ఆటోను గుద్దేస్తున్నాను, అయిపోయింది నా పని' అని ఒకటే భయంతో, "బాబా! నువ్వే చూసుకోవాలి" అని అనుకున్నాను. అంతే! ఆటోడ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేసి ఆటో ఆపాడు. ఒక్కసారిగా నేను స్కూటీ వదిలేసి పక్కన పడిపోయాను. నా తల రోడ్ డివైడర్ మీద పడింది. డివైడర్ మీద పడితే పరిష్టితి ఏంటో వేరే చెప్పాలా? ఎవరైనా ఉహించగలరు. మామూలుగా అయితే తల పగిలిపోవాల్సిందే. కానీ అలా జరగలేదు. బాబా అద్భుతం చేశారు. ఒక్క చుక్క రక్తం కూడా లేదు. స్కూటీకి కూడా ఏమీ కాలేదు. నేను ఆశ్చర్యపోయాను. ఏముంది, నా పని అయిపోయిందనుకున్న నాకు ఏమీ జరగకుండా కాపాడారు నా సాయి. ఆయన్ని నమ్ముకున్నవాళ్ళకి ఎప్పుడూ ఏమీ జరగదు. ఆయన ప్రతిక్షణం మన పక్కనే ఉంటూ పిలిచిన వెంటనే పలుకుతారు. ఇది సత్యం. ముమ్మాటికీ నిజం. ఎవరైతే తమని నమ్ముతారో వారిని జీవితాంతం వదిలిపెట్టరు బాబా. "ధన్యవాదాలు బాబా".
బాబా ఊదీ నిజంగా దివ్య ఔషధం
సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు విన్నీ. నేను నా చిన్నతనం నుంచి సాయిబాబా భక్తురాలిని. ఒకరోజు రాత్రి నాకు హఠాత్తుగా జలుబు చేసి విపరీతమైన జ్వరం వచ్చింది. మరుసటిరోజు హాస్పిటల్‌కి వెళితే, డాక్టర్ టెస్టులు చేసారు. రిపోర్టులో టైఫాయిడ్ అని వచ్చింది. దాంతో ఇంజెక్షన్ల కోర్స్ 3 రోజులకి
ఇచ్చారు.
ఆరోజు రాత్రి ఆస్తమా సమస్య ఉన్న నాకు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. ముక్కు పూర్తిగా బ్లాక్ అయిపోయి చనిపోతానేమో అనుకున్నాను. ఇంతలో బాబా ఊదీ గుర్తొచ్చి కాస్త నా నుదుటన పెట్టుకొని, తలగడ కింద పెట్టుకొని, సచ్చరిత్ర పుస్తకం కూడా నా పక్కన పెట్టుకొని, 'ఇక బాబా నాకు సహాయం చేస్తారో, చేయరో చూడాలి' అని అనుకున్నాను. నా సాయి 2 నిమిషాల్లో నేను అంతసేపూ పడుతున్న కష్టమంతా తీసేసి మామూలుగా ఊపిరి తీసుకొనేలా చేసారు. నేను నమ్మలేకపోయాను. బాబా ఊదీ నిజంగా దివ్య ఔషధం. దాని మహిమను అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఒకప్పుడు నేను కొంచెం అప్పుల్లో ఉండి వస్తున్న జీతం సరిపడక మంచి ఉద్యోగం ఇవ్వమని బాబాని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా రెండు సంవత్సరాలు గడిచాక ఒకరోజు అనుకోకుండా రెండింతల జీతంతో నా కలల ఉద్యోగం నాకు అనుగ్రహించారు సాయి. "చాలా ధన్యవాదాలు సాయి. అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండేలా చూడండి సాయి".
పిలిచినంతనే కష్టం తీర్చే బాబా
సదా మన వెంటుండి కాపాడే సాయినాథ్ మహారాజ్‌కు పాదాభివందనాలు. సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను తలుచుకునేది బాబానే. 2024, డిసెంబర్ 17వ తేదీ తెల్లవారుజామున 3గంటలకి అకస్మాత్తుగా మా పాపకి జ్వరమొచ్చింది. ముందు నెలలోనే మా పిల్లలిద్దరికీ జ్వరాలు వచ్చి మేము ఇబ్బందిపడ్డాము. అందుచేత నేను వెంటనే, "సాయినాథా! మళ్ళీ ఏంటయ్యా ఇలా వచ్చింది?" అని బాబాని ప్రార్ధించి, పాపకి టాబ్లెట్ వేసి పడుకోబెట్టాను. పిలిస్తే పలికే మన దైవం బాబా ఉండగా మనకి భయమెందుకు? ఆయన పిలిచినంతనే నిరంతరం మన కష్టం తీరుస్తారు. ఉదయం 7 కల్లా అంత జ్వరం తగ్గింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. మీ బిడ్డలను సదా కాపాడు తండ్రీ".
Sai nannu na barthani kalapandi sai
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba nenu ee appulu bhada padalekapothunna naa valla kavatam thandri nannu kapadandi ...eroju daka mere thesuku vacharu nannu twaraga kapadandi Baba please
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me