సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1947వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయి కరుణ

నేను ఒక సాయి భక్తుడిని. నేను రైల్వేలో ఎమర్జెన్సీ సెక్షన్‌లో పని చేస్తున్నాను. నేను చాలా పనులమీద 2024, నవంబర్ 23 రాత్రి రైలెక్కి 24వ తేదికి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉండగా అదేరోజు ఉదయం 8:45కి మా రైల్వేస్టేషన్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రాంతానికి డ్యూటీ మీద ఎమర్జెన్సీ ట్రైన్ తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళేటపుడు బాగానే వెళ్ళాము కానీ, తిరిగి వచ్చేటప్పుడు మా రైల్వేస్టేషన్‌కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్టేషన్‌లో మా ట్రైన్ ఆపేశారు. అప్పుడు ఒక సింగిల్ లోకో అదే మార్గంలో వెళ్తుంది. మా ట్రైన్, ఆ సింగిల్ లోకో వేర్వేరుగా ఎందుకు వెళ్ళడం, మా ట్రైన్‌ని, ఆ లోకోని కలిపి కప్లింగ్ చేసి పంపితే లోకోపైలట్ ఒకరే సరిపోతారు, డీజిల్ కూడా అదా అవుతుందని పై నుండి ఆదేశాలు వచ్చాయి. అయితే అసలు చిక్కు ఏంటంటే, లోకో కప్లింగ్ అన్నది చాలా సంవత్సరాల తరువాత చేయడం, పైగా మా ట్రైన్ బ్రేక్ పైప్స్ చాలా పాతవి, చాలారోజుల నుండి వాడకపోవడం వల్ల పైప్ మీద పగుళ్లు కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి కప్లింగ్ ప్రక్రియలో ఏదన్నా సమస్య రావచ్చు. ఒకవేళ అదే జరిగితే మా ట్రైన్ సమయానికి మా రైల్వేస్టేషన్‌కి చేరుకోదు. ఆలా అయితే నేను హైదరాబాద్ వెళ్లాల్సిన ట్రైన్ అందుకోలేను. అందువల్ల నాకు భయమేసి, "బాబా! ఎటువంటి సమస్య రాకుండా చూసి, సమయానికి నేను మా ఇంటికి వెళ్లి, ఆపై హైదరాబాద్ వెళ్లి అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకునేలా కరుణించండి. ఒక పేదవానికి అన్నదానం(ఫుల్ మీల్స్) చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయ చూపారు. కప్లింగ్ అయ్యాక 100 కిలోమీటర్ల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేశారు. దాంతో నేను రాత్రి 7:30కి ఇంటికి చేరుకొని, 10 గంటలకి ట్రైన్ హైదరాబాద్ ఎక్కి వెళ్ళాను. అక్కడ నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంకా చాలా రోజుల తర్వాత మా బంధువులందరినీ కలిసాను. కొంతమంది బంధువులు ఇంటికి చాలా సంవత్సరాల తరువాత వెళ్లి కలవగలిగాను. ఇదంతా బాబా దయవల్లే జరిగింది.

రైల్వే జీఎం మా ఆఫీసులో వార్షిక ఇన్స్పెక్షన్ డిసెంబర్ 13న చేయడానికి నిశ్చయించారు. కిందటి సంవత్సరం ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఇన్స్పెక్షన్‌లో భాగంగా ఒక ఇంచార్జికి అతని తప్పు అంతలా లేకపోయినప్పటికీ చార్జిషీట్ ఇచ్చి, పెద్ద పనిష్మెంట్ కూడా ఇచ్చారు. ఈసారి నేను ఇంచార్జిగా ఉన్న సెక్షన్‌లో ఇన్స్పెక్షన్ జరగనుండటం వల్ల నేను బాబాని, "ఈ ఇన్స్పెక్షన్ బాగా అయితేనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా భార్య కాన్పు సమయానికి నాకు సెలవులు దొరుకుతాయి. కాబట్టి అలా అయ్యేటట్లు అనుగ్రహించినట్లైతే నేను మీ మందిరంలో పాలకోవా సమర్పించి, అందరికీ ఆ ప్రసాదం పంచుతాను" అని ప్రార్థించాను. బాబా దయవల్ల ఇన్స్పెక్షన్ చాలా బాగా జరిగి GM సార్ మా సెక్షన్‌కి స్పాట్ క్యాష్ అవార్డు ప్రకటించారు. అది కూడా నా చేతులకు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం బాబా మందిరంలో పాలకోవా సమర్పించి అందరికీ పంచాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలానే మీ కరుణ మీ భక్తులపై చూపండి".

నా భార్య 8 నెలల గర్భవతి ఉండగా రెండు నెలల నుంచి తనకి కడుపులో మరియు వెన్నులో కాస్త నొప్పి వస్తూ ఉండేది. డాక్టరుకి చూపిస్తే, "కడుపు కిందకు జారింది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలానే ఎందుకైనా మంచిది ఫెటల్ ఎకో స్కాన్ చేయండి" అని సలహా ఇచ్చారు. స్కాన్ చేయించడానికి అపాయింట్మెంట్ కోసం చూస్తే వారం తరువాత దొరికింది. బాబా దయవల్ల ఆరోజు నాకు ఎటువంటి ఎమర్జెన్సీ డ్యూటీ పడలేదు, స్కాన్ కూడా బాగా జరిగింది. కానీ రిపోర్టులో ఏమొస్తుందోనని కాస్త టెన్షన్ పడ్డాను. వెంటనే బాబాని తలుచుకొని, "బాబా! స్కాన్‌ రిపోర్టులో అంతా బాగుండేలా చేయండి. ఎటువంటి సమస్య లేకుండా ఉండేలా చూడండి. ఒకరికి అన్నదానం చేస్తాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల స్కాన్ రిపోర్ట్ బాగా వచ్చింది. కానీ కాస్త నీరు ఎక్కువగా ఉంది, మరే సమస్య లేదని డాక్టర్ చెప్పారు. "ధన్యవాదాలు బాబా".

2024, నవంబర్ 28 నాటికి నా భార్యకి 8 నెలలు పూర్తై 9వ నెల వచ్చింది. దాంతో నేను తనని హైదరాబాదులో ఉన్న తన పెద్దక్క వాళ్ళింటికి పంపాలనుకున్నాను. కానీ 2 నెలల ముందు నుండి గైనకాలజిస్ట్, "గర్భం కిందకు జారడం, ఉమ్ము నీరు ఎక్కువగా ఉండడం వల్ల చివరి నిముషం వరకు ప్రయాణం చేయొచ్చా, లేదా అన్న దాని గురించి నేనేం చెప్పలేను. 8 నెలలు పూర్తయ్యాక ఒకసారి రండి. స్కాన్ చేసి రిపోర్టు చూసాక పుట్టింటికి వెళ్లాలా, వద్దా అన్నది చెప్తాను" అని అన్నారు. ఒకవేళ డాక్టర్ వద్దంటే, మహారాష్ట్రలోని సోలాపూర్ వరకు ఇంత దూరం వచ్చి చూసుకొనే వాళ్ళే లేరు. ఎందుకంటే, నా భార్య తల్లిదండ్రులు దూరంగా విజయనగరంలో ఉంటారు. పైగా నా భార్య తండ్రికి వారంలో రెండుసార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. పోనీ హైదరాబాద్‌లో ఉన్న తన అక్క రావాలంటే, వాళ్ళ బాబు స్కూలు పోతుంది. కాబట్టి తప్పనిసరిగా నేను నా భార్యని హైదరాబాద్ పంపించాల్సి ఉంది. అందువల్ల నేను బాబాని, "బాబా! స్కాన్‌లో అంతా బాగుండాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే నేను నా భార్యని హైదరాబాద్ పంపగలను. అక్కడ తన ఇద్దరు అక్కల కుటుంబాలు, మా బంధువులు అందుబాటులో ఉంటారు గనక ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చూసుకుంటారు. అందువల్ల అంతా బాగుండి హైదరాబాద్ వెళ్లడానికి డాక్టర్ అనుమతిస్తే, ముగ్గురు అభాగ్యులకు అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. బాబా దయ చూపారు. రిపోర్ట్ నార్మల్‌గా వచ్చింది. డాక్టర్, "కాస్త ఉమ్మనీరు ఎక్కువగా ఉంది. జాగ్రత్త!" అని చెప్పి హైదరాబాద్ వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అయితే నేను రైల్వే ఎమర్జెన్సీ సెక్షన్‌లో పని చేస్తుండటం వల్ల నాకు ఎప్పుడు డ్యూటీ వేస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి నేను బాబాని, "నా భార్యని హైదరాబాద్ తీసుకొని వెళ్లేరోజు ఎటువంటి ఎమర్జెన్సీ డ్యూటీ పడకుండా, అలాగే తనకి తోడుగా వెళ్లేందుకు నాకు సెలవు దొరికేలా అనుగ్రహించి మమ్మల్ని క్షేమంగా హైదరాబాద్ చేర్చండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా మా ట్రైన్లో హైదరాబాద్కి ప్రయాణం సాగింది. అంతేకాదు, మర్నాడు డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. డాక్టర్ చూసి నా గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉందని అన్నారు. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి అన్నదానం చేశాను. "ధన్యవాదాలు బాబా. ఇలానే మీ దయ మాపై కురిపిస్తూ నా భార్యకి కాన్పు సక్రమంగా అయి ఆరోగ్యవంతురాలైన చక్కటి ఆడబిడ్డని ప్రసాదించండి".

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo