ఈ భాగంలో అనుభవాలు:
1. ప్రమాద తీవ్రతను తగ్గించిన బాబా
2. బాబా ఏమైనా ఇవ్వాలనుకుంటే అన్నిటికంటే ఉన్నతమైనది ఇస్తారు!
3. మొర విని ఆరోగ్యంగా ఇంటికి పంపిన బాబా
ప్రమాద తీవ్రతను తగ్గించిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. ప్రియమైన సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు శివగణేష్. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. నేను రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాను. నాకు ప్రతి గురువారం సెలవు దినం. 2024, డిసెంబర్ 11, బుధవారం సాయంత్రం గం.4:30ని.లకు ఎప్పటి మాదిరిగానే నా డ్యూటీ అయిన తర్వాత విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా స్వగ్రామమైన మునగపాకలో ఉన్న నా తల్లిదండ్రులు వద్దకు బయలుదేరాను. వెళ్లేముందు మా ఊరిలో చలి ఎక్కువగా ఉంటుందని మా అమ్మానాన్నలకోసం చలికోట్లు, వాటితోపాటు నా జర్కిన్ బ్యాగులో పెట్టుకున్నాను. నాకు జరగబోయే ప్రమాదం గురించి బాబాకి ముందుగానే తెలుసునేమో! నేను బైక్ మీద 'ఎన్ఏడి' దగ్గరకు వచ్చిన తర్వాత నాకెందుకో జర్కిన్ వేసుకోవాలనిపించి వేసుకున్నాను. తర్వాత నేను నా బైక్ మీద వెళ్తుండగా సరిగ్గా విశాఖ డైరీ సమీపంలోకి రాగానే హఠాత్తుగా ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు బైక్ మీద చాలా వేగంగా నా వెనుకనుండి వచ్చి నా బైక్ హ్యాండిల్‌ని ఢీకొట్టారు. దాంతో నా బైక్ జారి బైక్ తోపాటు నేను కింద పడిపోయాను. క్షణకాలం ఏం జరిగిందో నాకు తెలియలేదు. ఆ కుర్రాళ్ళు కనీసం ఆగకుండా వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. దాదాపు ఐదు నిమిషాల వరకు నన్ను పైకి లేపడానికి కూడా ఎవరూ రాలేదు. ఆ సమయంలో భారీ వాహనాలు ఏవైనా వచ్చుంటే నా పరిస్థితి వేరుగా ఉండేది. కానీ బాబా దయవల్ల అలాంటిదేమీ జరగలేదు. ఇంకా ఆయన కృపవల్ల రోడ్డుపై పడ్డ నాకు ఎక్కువ గాయాలు కాకుండా నేను వేసుకున్న జర్కిన్, నా తలకు ఏమీ కాకుండా నా హెల్మెట్ కాపాడాయి. అంతేకాదు, బైకుపై నా వెనక పెట్టుకున్న మా అమ్మానాన్నల చలికోట్లున్న బ్యాగు నా నడుము కింద దిండులా పడి నా నడుముకి ఏమీ కాకుండా కాపాడింది. ఇలా అన్నివిధాలా బాబా నన్ను ఒక అతిపెద్ద ప్రమాదం నుండి కాపాడారు. కాకపోతే, నా ఎడమ కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. దానికోసం నేను ఆ రోజు వేసుకున్న టాబ్లెట్ల కారణంగా ఏమోగానీ నాకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఎంత ప్రయత్నించినా నొప్పి భరించలేకపోయాను. చివరికి బాబాని వేడుకొని ఊదీ కలిపిన నీళ్లు తాగాను. అంతే, అద్భుతం జరిగింది. నిమిషాల్లో అంత నొప్పి మాయమైపోయింది. అప్పుడే అనుకున్నాను, ఈ విషయాన్ని ఖచ్చితంగా బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవాలని. చివరిగా ఎవరూ కర్మ నుండి తప్పించుకోలేరు కానీ, మన ఇష్టదైవం సులభంగా దానిని నుండి బయటపడేలా చేస్తారు. ఆరోజు నాకు చాలా పెద్ద ప్రమాదం జరగాల్సి ఉండి ఉంటుంది. కానీ ఆ ప్రమాద తీవ్రతను తగ్గించారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.
బాబా ఏమైనా ఇవ్వాలనుకుంటే అన్నిటికంటే ఉన్నతమైనది ఇస్తారు!
నా పేరు శ్రద్ధ. నేను ఒక సంవత్సరం నుండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వచ్చిన కొన్ని అవకాశాలు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అయి చివరికి రద్దు అయ్యాయి. నేను తట్టుకోలేక, "ఎందుకిలా అవుతుంది?" అని బాబాని చాలా కోపంగా అడిగాను. ఎందుకంటే, అది చాలా కష్టకాలం. నేను ఆర్థికంగా పూర్తిగా నష్టపోయి అప్పుల్లో ఉన్నాను. ఎందుకో తెలీదు హఠాత్తుగా నా దగ్గరున్న గురుచరిత్ర రోజుకు కనీసం ఒక అధ్యాయం చదవడం మొదలుపెట్టి ప్రతి రాత్రి బాబాని, "నాకు సహాయం చేయమ"ని ప్రార్థిస్తుండేదాన్ని. అద్భుతంగా ఆ పుస్తకం పూర్తయ్యేలోపు నేను సరిగా చేయలేదన్న కంపెనీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. అంతకుముందు నేను పోగొట్టుకున్న అన్నీ అవకాశాల కంటే ఇది చాలా మంచి ఆఫర్. అప్పుడు అర్థమైంది, 'బాబా మనకి ఏమైనా ఇవ్వాలనుకుంటే అన్నిటికంటే ఉన్నతమైనది ఇస్తార'ని. మనం శ్రద్ధ, సబూరి కలిగి ఉంటే బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. "చిన్ననాటి నుండి నాకు తోడుగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".
మొర విని ఆరోగ్యంగా ఇంటికి పంపిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారాలు. నా పేరు శిరీష. సాయిబాబా నాకు ఎన్నోసార్లు సమస్యల్లో తోడు ఉన్నారు. ఒకసారి నా భర్త ఆరోగ్యం బాగోకుంటే డాక్టరుని సంప్రదించాము. డాక్టరు చూసి, "కడుపులో ప్లేగు దగ్గర చిన్న కాయ ఉంద"ని అన్నారు. దానివలన నా భర్తకి నొప్పి ఎక్కువగా ఉండేది. అస్సలు భరించలేకపోయేవారు. డాక్ టర్స్ ఆపరేషన్ చేయాలన్నారు. నాకు చాలా భయమేసి, "ఆపరేషన్ చక్కగా అవ్వాల"ని సాయిబాబాకు మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఆపరేషన్ బాగానే అయింది. కానీ ఆపరేషన్ తర్వాత కూడా మావారు నొప్పి భరించలేకపోతుండేవారు. అప్పుడు నేను సాయిబాబాని, "బాబా! నొప్పి తగ్గి మావారు చక్కగా ఇంటికి రావాల"ని వేడుకున్నాను. బాబా నా మొర విని నా భర్త బాధని తగ్గించి ఆరోగ్యంగా ఇంటికి వచ్చేలా చేశారు. అందుకు నేను బాబాకి చాలా ఋణపడి ఉంటాను. "ధన్యవాదాలు బాబా".
శ్రీ సచ్చిదానంద సమర్థ సాయినాథ్ మహారాజ్ కీ జై.