ఈ భాగంలో అనుభవాలు:
1. ప్రాణాలతో ఉన్నామంటే అది బాబా అనుగ్రహమే
2. క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
3. ఆపద్భాంధవుడు సాయినాథ్ మహారాజ్
ప్రాణాలతో ఉన్నామంటే అది బాబా అనుగ్రహమే
సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఒక ప్రైవేటు స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాను. నా భర్త ఆటోడ్రైవర్. 2017, ఏప్రిల్ 8, శనివారంనాడు నేను, నా భర్త మా ఇద్దరు పిల్లలతో కలిసి మా అమ్మవాళ్ళింటికి ఆటోలో వెళ్ళాము. మర్నాడు 9వ తేదీన మా నాన్న పుట్టినరోజు. ఆరోజు ఉదయం నా భర్త బాగానే ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న గుడులకు వెళ్ళొచ్చాము. మా అమ్మవాళ్ళు మా తమ్ముడికి(అప్పట్లో) పిల్లలు లేనందున రెడ్డమ్మ తల్లికి మ్రొక్కుకొని ఆదివారంనాడు మాంసాహారం తినడం మానేసినందున ఆరోజు మాంసాహారం వండలేదు. సాయంత్రం ఆరు గంటలప్పుడు నా భర్త బాగా తాగేసి మాంసం వండలేదని మా వాళ్ళతో గొడవపడ్డారు. తర్వాత మమ్మల్ని తీసుకుని తిరిగి మా ఇంటికి బయలుదేరారు. తాగి ఉన్న నా భర్త బాగా అరుస్తూ ఆటో తోలుతుండగా ఒక 10 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత రాత్రి 9 గంటలప్పుడు మా ఆటో తలకిందులై పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు మధ్యలో పడిపోయింది. అక్కడున్న వాళ్లెవరో మమ్మల్ని లేపి మాకు సహాయం చేశారు. అయితే నా భర్త తాగి ఉన్నారని తెలుసుకొని కేసు పెడతామని బెదిరించారు. మేము ఎలాగో అక్కడినుండి బయటపడ్డాము. ప్రమాదంలో నాకు, మావారికి, 5 సంవత్సరాల మా బాబుకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి కానీ, 14 సంవత్సరాల మా పాపకి మాత్రం ఏమీ కాలేదు. ఆ ఘటనలో నా ఫోన్ ఉంది కానీ, నా హ్యాండ్‌బ్యాగ్ పోయింది. అందులో ఇంటి తాళాలు, ఆధార్, అ నెల జీతం ఉన్నాయి. సరే, మేము తిరిగి మా అమ్మవాళ్ళ ఊరికి బయలుదేరి మా తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. వెంటనే బయలుదేరి మా తమ్ముడు, అమ్మానాన్న వచ్చి మమ్మల్ని హస్పిటల్‌కి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం మా తమ్ముడు మావారిని తీసుకొని పోయినవేవైనా దొరుకుతాయమోనని ప్రమాదం జరిగిన చోటుకి వెళ్ళాడు. అప్పుడు మా తమ్ముడికి దొరికింది ఒకటే. అది బాబా ఫోటో. మా ఆటోలో ఉండే ఆ బాబా ఫోటో ఆటో ముందు పడి ఉంది. ఆ రోడ్ ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది, ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. మేము ప్రమాదానికి గురైనప్పుడు ఏ వాహనం వచ్చినా మేము పెద్ద ప్రమాదంలో పడేవాళ్ళం. కానీ మాకు ఏ ప్రమాదమూ జరగకుండా బాబా అడ్డుగా ఉండి మమ్మల్ని కాపాడారు. ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే అది బాబా అనుగ్రహమే. ఒక 15 రోజుల తర్వాత నా హ్యాండ్‌బ్యాగ్ దొరికిన వాళ్ళు అందులో ఉన్న ఆధార్‌లోని అడ్రస్ ఆధారంగా వాటిని మా అత్తవారింటికి తెచ్చిచ్చారు. కాకపోతే నా జీతం డబ్బులున్న కవర్ మాత్రం తీసుకున్నారు. మిగతా అన్ని వస్తువులు ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా. మీరు అనుక్షణం తోడు ఉండటం వల్లే నేను సమస్యలను దాటుకొని వస్తున్నాను. నా భర్త తాగుడు వదిలేసి బాధ్యతగా ఉండేలా కరుణించు తండ్రీ. నాకు అప్పిచ్చిన అందరికీ తిరిగి ఇచ్చే శక్తిని ప్రసాదించి ఋణశేషం లేకుండా చూడ తండ్రీ. అలాగే ఆర్థికంగా ఎదగడానికి దారి చూపు తండ్రీ".
క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
నా పేరు జగదీశ్వర్. మా చిన్నమ్మాయి 2024, సెప్టెంబర్ 5, రాత్రి చెన్నై నుండి వరంగల్ రావడానికి తమిళనాడు ఎక్స్ప్రెస్ బుక్ చేసుకుని ట్రైన్ ఎక్కింది. ట్రైన్ విజయవాడ చేరుకున్నాక ఉదయం 4:30 అప్పుడు ఎవరో వచ్చి, "ఈ ట్రైన్ వరంగల్ వెళ్లదు. దారి మళ్లించబడింది. వరంగల్ వెళ్ళేవాళ్ళు ఇక్కడ దిగిపోండి" అని చెప్పడంతో మా అమ్మాయి ఆ సమయంలో నాకు ఫోన్ చేసింది. నేను తనతో, "దారి మల్లింపు సమాచారమేదీ లేదు. ఎవరో కావాలని అలా చెప్తున్నట్లు ఉంది. ఏం కాదు, నువ్వు ట్రైన్‌లోనే ఉండు" అని చెప్పి, "ట్రైన్‌లో ఇంకెవరైనా వరంగల్ వచ్చే వాళ్ళుంటే చూడు" అని అన్నాను. అందుకు తను, "ఒకతను ఉన్నాడు. కానీ అతనితో ఎవరూ ట్రైన్ వరంగల్ వెళ్ళదని చెప్పలేదట" అని చెప్పింది. అంతలో టీసీ వచ్చి, "ట్రైన్ వరంగల్ వెళ్లదు. దిగిపోండి" అని చెప్పడంతో మా అమ్మాయి కంగారు పడింది. కొత్త ప్రదేశం, ఎలా రావాలో తనకి తెలియదు. ఆన్లైన్‌లో చెక్ చేస్తే మధ్యాహ్నం వరకు వరంగల్ వైపు వచ్చే బస్సులు లేవు. ఇక అప్పుడు నేను, "బాబా! మీరే ఎలాగైనా మా అమ్మాయిని క్షేమంగా కరీంనగర్ చేర్చండి" అని వేడుకున్నాను. తర్వాత మా అమ్మాయికి కాల్ చేసి, వరంగల్ వచ్చే ప్రయాణికునితో మాట్లాడి, "కాస్త సహాయం చేయమ"ని అర్థించాను. అతను, "పర్వాలేదండి. మీరు ఏం టెన్షన్ పడకండి. నేను కూడా కరీంనగర్ వస్తున్నాను" అని తన సెల్ నెంబర్, ఫోటోలను వాట్సాప్ చేశాడు. తర్వాత వాళ్ళు వరంగల్ బస్సు లేనందున సూర్యాపేట వచ్చి అక్కడినుండి వరంగల్, వరంగల్ నుండి కరీంనగర్ వచ్చారు. అలా మా అమ్మాయి బాబా దయవల్ల క్షేమంగా ఇంటికి చేరింది. "ధన్యవాదాలు బాబా".
అభయప్రదాత సాయిదేవా శరణం శరణం.
ఆపద్భాంధవుడు సాయినాథ్ మహారాజ్
ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!! నా పేరు దేవప్రసాద్. నేను ఇల్లు కట్టి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. 2024, సెప్టెంబర్ నెల నా జీతం డబ్బులు ఖర్చు అయిపోవడంతో లోన్ వాయిదా చెల్లించడానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. నా EPF అకౌంటులో 80,000 రూపాయలు ఉన్నాయి. కానీ అదివరకు 4సార్లు ఆ డబ్బులు విత్ డ్రా కోసం దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించబడింది. అందుచేత సెప్టెంబర్ 2న బాబాని తలుచుకొని, EPF డబ్బు మంజూరు కావాలని చెప్పుకొని దరఖాస్తు చేసుకున్నాను. బాబా దయవల్ల 19వ తేదీన ఆ డబ్బు నా ఖాతాలో జమ అయింది. బాబాను వేడుకోవడం వల్లే ఈసారి మంజూరై డబ్బు నాకు అందింది. "ధన్యవాదాలు బాబా".
ఓం సాయినాథ్ మహారాజ్ కీ జై.