ఈ భాగంలో అనుభవాలు:
1. కన్నతండ్రిలా బాధ్యత తీసుకొని ఊహించని విధంగా ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
2. అడిగినంతనే దర్శనమిచ్చి ధైర్యాన్నిచ్చిన బాబా
కన్నతండ్రిలా బాధ్యత తీసుకొని ఊహించని విధంగా ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. నేనే కాదు మా కుటుంబం యావత్తు సాయి భక్తులే. మేము విధిగా ప్రతి సంవత్సరం శిరిడీకి వెళ్తాం. రోజూ రెండు పూటలా బాబాకి దీపారాధన చేసి హారతి ఇవ్వడం మా దినచర్య. ఆయన మా ఇంటి పెద్ద. నేను ఆయన్ని నాన్న అని పిలుస్తాను. నేను తినే ప్రతిదీ ఆయనకి నివేదించిన తర్వాతే నేను తింటాను. 'నాన్న అని పిలిచినందుకు ఆయన నిజంగానే కన్నతండ్రిలా బాధ్యత తీసుకొని నేను ఊహించని విధంగా నాకు ఉద్యోగాన్ని ప్రసాదించారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను అనారోగ్య కారణాల వల్ల దగ్గర దగ్గర 7, 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేయడం లేదు. ఉద్యోగం చేయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. అలాంటిది నాకు అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ తేరుస్తుంటే, 'బతుకుతెరువు కోసం నీకు ఉద్యోగం వస్తుంది' అని సాయి సందేశాలు వస్తుండేవి. నేను వాటిని చూసి 'అది ఎలా సాధ్యం? నేను ఉద్యోగం చేయాలనుకోవటం లేదే! ఉద్యోగం చేసే ఆలోచన కూడా నాకు లేదే! మరి నాకు ఉద్యోగం రావడం ఏంటి? నేను ఉద్యోగం చేయడం ఏంటి? అది కూడా ఇప్పుడున్న కఠిన పరిస్థితుల్లో' అని అనుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉండగా ఐదు వారాల సాయి దివ్యపూజలో భాగంగా రెండు వారాల పూజ పూర్తై, మరో మూడు వారాలు ఉన్నాయన్న సమయంలో సాయి నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అనుకోకుండా ఒక MNC కంపెనీ నుంచి వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఉన్న ఒక ఉద్యోగం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చింది. నాలుగు దశల ఇంటర్వ్యూ జరిగితే, ఏ ఒక్క దశ ఇంటర్వ్యూలో కూడా నేను విశ్వాసంతో పాల్గొనలేదు. ఎందుకంటే, ఆ ఉద్యోగం నాకు వస్తుందన్న నమ్మకం లేకపోవడం, నాకెలా వస్తుందన్న ఆలోచనలు ఉండటం వల్ల. ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంది కాబట్టి 'ఓకే పాల్గొందాం' అని పాల్గొన్నాను. అంతేగానీ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం నాకు ఏ కాస్తైనా లేదు. అయితే నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తవుతూనే అదేరోజు(జూలై 22) నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. సాయి ఎప్పుడూ, 'నీ అదృష్టంలో లేనిది కూడా నేను నీకు ఇస్తాను' అని సందేశం ఇస్తుందేవారు. నేను అదేంటో అనుకునేదాన్ని గానీ ఆ ఆఫర్ లెటర్ అందుకున్న తర్వాత నాకు అర్థమైంది. నా సాయినాన్న మా అవసరాల గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో! మా అవసరాలు మేము మర్చిపోయినా ఆయన మర్చిపోవటం లేదనిపిస్తుంది. సాయిబాబా లేనిదే మా కుటుంబం లేదు. ఆయనకి మేము ఎప్పటికీ ఋణపడి ఉంటాం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
అడిగినంతనే దర్శనమిచ్చి ధైర్యాన్నిచ్చిన బాబా
సాయి భక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు వెంకట్. 2024, ఆగస్టు నెలాఖరు నుండి ఒక వారం రోజులపాటు నా భార్యకి మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్, నీరసం, కాళ్ళుచేతులు తిమ్మిర్లుగా ఉండటం ఉండింది. ఆమె నాతో, "నాకు భయమేస్తుంది" అని చెప్పింది. నేను తనతో, "నువ్వు బాబాని ప్రార్థించు. ఏదో విధంగా షుగర్ టెస్ట్ చేయిస్తానులే" అని ఆ టెస్ట్ చేయించాను. తర్వాత, "బాబా! మీ దయవలన టెస్టు రిపోర్టు నార్మల్‌గా రావాలి తండ్రీ. ఇప్పటికే ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. మరలా ఇది కూడా అంటే తట్టుకోలేదు బాబా" అని బాబాని ప్రార్థించాను. అదేరోజు సాయంత్రం టెస్టు రిపోర్టు కోసం ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే, "షుగర్ ఎక్కువగా వుంది" అన్నాడు తను. అది విని నేను, 'ఏంటి బాబా ఇది?' అని బాధపడ్డాను. విషయం నా బార్యకి చెపితే, తను టెన్షన్ పడింది. నేను సరే ఏదైతే అది అయిందని 2024, సెప్టెంబర్ 5న మా అమ్మవాళ్ల వూరు వెళ్ళడానికి బయలుదేరాను. నేను వూరు వెళ్తుంటే నా మనసులో, "ఫ్రెండ్ సరదాగా ఆలా చెప్పాడేమో బాబా! అది నిజమైతే మీరు మీ దర్శనభాగ్యం నాకు ప్రసాదించండి" అని అనుకున్నాను. అంతలోనే ఒక కారు మీద బాబా దర్శనం ఇచ్చారు. నాకు చాలా ధైర్యం వచ్చింది. తర్వాత ఫ్రెండ్ ఫోన్ చేసి, "రిపోర్ట్ నార్మల్ వచ్చింది. నేను ఊరికే అలా చెప్పాను" అని అన్నాడు. అది విని నేను ఆనందంతో బాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను.
సాయి దయవలన నాకు ఒక పాప, బాబు. 2024, సెప్టెంబర్‌లో 20 నెలల వయసున్న మా బాబుకి బాగా జలుబు, దగ్గుతో పాటు స్వల్ప జ్వరం కూడా వచ్చింది. ఆర్ఎమ్‌పి డాక్టరుకి చూపించినప్పటికీ బాబుకి తగ్గలేదు. ఇక అప్పుడు మా పిల్లల డాక్టరుకి బాబుని చూపిస్తే, "వైరల్ ఫీవర్‌లా ఉంది. మూడు రోజులు మందులు వాడండి. తగ్గకపోతే చూద్దాం" అన్నారు. నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, ఆ సమయంలో వైరల్ ఫీవర్స్ చాలా ఉన్నాయి. నేను బాధతో, "బాబా! నా బాబుకి ఏమీ కాకుండా తగ్గిపోవాల"ని బాబాని వేడుకొని రోజూ బాబు చేత ఊదీ నీళ్లు తాగించాను. బాబా దయవలన మూడు రోజులకి బాబుకి పూర్తిగా తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీ దయవలన మాకు అంతా మంచి జరగాలి".
