సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 387వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా మాత్రమే డిప్రెషన్‌ను తొలగించారు
  2. 'నేనుండగా భయమేల?'

బాబా మాత్రమే డిప్రెషన్‌ను తొలగించారు

నా పేరు శ్రావణి. నా జీవితంలో సాయిబాబా నాకు చేసిన సహాయాన్ని సాటి సాయిబంధువులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2019వ సంవత్సరంలో నేను సాయిబాబాకు భక్తురాలినయ్యాను. నేను 2014వ సంవత్సరంలో నా చదువు పూర్తి చేశాను. అప్పటినుండి ప్రభుత్వ బ్యాంకింగ్ పరీక్షలకు ప్రయత్నిసున్నాను. 2018వ సంవత్సరం వరకు నేను మూడు బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇంటర్వ్యూలను కేవలం ఒకటి రెండు మార్కులలో చేజార్చుకున్నాను. ఇక క్లర్క్ పరీక్షలైతే ఎన్ని చేజారిపోయాయో చెప్పనక్కర్లేదు. ఈ బాధతో నేను మానసికంగా చాలా కృంగిపోయాను. నాకు ఉద్యోగం రావాలని మా అమ్మ అందరి దేవుళ్ళకీ పూజలు చేసింది. ఎన్నో మ్రొక్కులు మ్రొక్కింది. నేను కూడా పూజ చేయని దేవుడు లేడు. ఎన్ని పూజలు చేసినా నాకు ఉద్యోగం రాలేదు సరికదా, కనీసం నేను డిప్రెషన్ నుండి కూడా బయటకి రాలేకపోయాను. 2018వ సంవత్సరంలో నా ఆరాధ్యదైవమైన శివుడి గుడినుండి వస్తూంటే, ఎందుకో దారిలోనే వున్న సాయిబాబా మందిరానికి వెళ్దామనిపించి వెళ్ళాను. బాబాను దర్శించుకున్న తరువాత నా మనసు చాలా కుదుటపడింది. కానీ ఆ సంవత్సరంలో కూడా బ్యాంకింగ్ ప్రిలిమ్స్ పరీక్ష ఒక్కసారి కూడా నేను పాసవలేదు. దాంతో ఇంక నేను సాయిబాబా మందిరానికి వెళ్ళడం మానేశాను. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో శ్రీరామనవమి ముందురోజున నేను ఒక చోటికి వెళ్ళడానికి బస్సు ఎక్కాను. బస్సులో ఒక సీట్లో ఒక పెద్దాయన కూర్చుని కనిపించారు. ఆయన ప్రక్కసీటు ఖాళీగానే ఉన్నప్పటికీ, ఆయన ప్రక్కన ఎందుకులే కూర్చోవడం, ముందుకు వెళ్లి వేరే సీట్లో కుర్చుందామని అనుకున్నాను. కానీ పండగ ముందురోజు కావటంతో నాకు బస్సులో సీటు దొరకలేదు. చివరకు వచ్చి ఆయన ప్రక్కనే కూర్చున్నాను. ప్రయాణం మధ్యలో ఆయన ఏం చేస్తున్నావమ్మా? అని నా గురించి అడిగారు. నేను ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాననీ, కానీ ఒకటి రెండు మార్కులతో చేజారిపోతోందనీ చెప్పాను. అప్పుడాయన నాతో, “సాయిబాబా సచ్చరిత్ర పారాయణ చెయ్యి” అన్నారు. నేను ఆయనతో, “మా ఇంట్లో సాయిబాబాని పూజించరు. బాబాని పూజిస్తే కలిసిరాదని మా ఇంట్లోవాళ్ళు చెప్పారు” అని అన్నాను. అప్పుడు ఆ పెద్దాయన బాబా అనుగ్రహంతో తనకు జరిగిన అనుభవాలని నాతో చెప్పి సచ్చరిత్ర పారాయణ చేయటానికి నన్ను ఒప్పించారు. సచ్చరిత్ర పారాయణ చేయటం ప్రారంభించిన తరువాత నేను డిప్రెషన్ నుండి, బాధ నుండి బయటపడ్డాను. ఆ తరువాత ఒకసారి యూట్యూబ్‌లో ‘సాయి దివ్యపూజ’ ఎలా చేయాలో చూసి, నాకు ఉద్యోగం రావాలని బాబాకు మ్రొక్కుకొని, అయిదు వారాలు సాయి దివ్యపూజ చేశాను. అయినా నాకు ఉద్యోగం రాలేదు. ఆ తరువాత నాలుగు నెలలకు నాకు మంచి అబ్బాయితో పెళ్లి కుదిరింది. కానీ, నేను అతన్ని పెళ్లి చేసుకోవచ్చా, లేదా అని సందిగ్ధంలో పడ్డాను. అప్పుడొకరోజు రాత్రి కలలో నాకు బాబా దర్శనమిచ్చి,అతన్ని పెళ్లి చేసుకోమ్మా, మంచిది” అని చెప్పారు. బాబా మాటపై భరోసాతో ఏ భయమూ లేకుండా నేను అతనిని ఫిబ్రవరి 13, 2020న పెళ్ళి చేసుకున్నాను. వివాహమైనప్పటికీ మేము మంచి స్నేహితుల్లా ఉన్నామే కానీ, భార్యాభర్తల్లా ఎప్పుడూ మెలగలేదు. ఒకసారి మా అమ్మ, “మీరిద్దరూ ఎలా వున్నార”ని అడిగింది. అమ్మకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, బాబాతో, “బాబా! మేమిద్దరం భార్యాభర్తల్లా మెలిగేలా అనుగ్రహించమ”ని చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో మేమిద్దరం ఇప్పుడు భార్యాభర్తల్లా మెలుగుతున్నాము. బాబా ఆశీస్సులతో త్వరలోనే నాకు ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగం వస్తున్నదని ఆశిస్తున్నాను. అందరికీ సాయిబాబా ఆశీస్సులు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

'నేనుండగా భయమేల?'

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

నా పేరు ఎన్.సత్యనారాయణమూర్తి. నేను హైదరాబాదులోని విజయనగర్ కాలనీవాసిని. 34 సంవత్సరాల క్రితం 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' నామ ప్రచారకులైన శ్రీ శంకరయ్యగారి ద్వారా నేను సాయి మార్గంలోకి వచ్చాను. అప్పటినుండి సాయి మహారాజ్ ద్వారా ఎన్నో అనుభవాలు పొందుతున్న అదృష్టవంతుడను. 2020, ఏప్రిల్ 16, గురువారం రాత్రి నాకు కలిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

లాక్‌డౌన్ కారణంగా ఇరవైరోజులు ఆఫీసు పనులు లేక ఇంట్లోనే ఉంటున్నందున శ్రీసాయిసచ్చరిత్ర మూడు పారాయణలు పూర్తి చేశాను. ఏప్రిల్ 16, గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో నాకు విపరీతమైన దగ్గు, దానితోపాటు తుమ్ములు వచ్చాయి. దాంతో ఆ సమయంలో నెలకొన్న కరోనా భయంకర పరిస్థితుల దృష్ట్యా నా భార్య చాలా ఆందోళన చెందింది. తుమ్ములు, దగ్గు ఇంకా ఎక్కువైతే గనక పక్కవాళ్ళేమైనా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తారేమోనని భయపడింది. కానీ నేను కొద్దిగా బాబా ఊదీ తీసుకొని నుదుటిపై ధరించి, "సాయితండ్రీ! మరలా నాకు తుమ్ము, దగ్గు రాకుండా కాపాడండి" అని బాబాని ప్రార్థించి నిద్రకు ఉపక్రమించాను. రాత్రి ఒక్కసారి కూడా తుమ్ముగాని, దగ్గుగాని రాలేదు. నిద్రలో 'నేనుండగా భయమేల?' అన్నట్లు సాయిసచ్చరిత్ర పుస్తకాలు గుట్టలుగా కనపడ్డాయి. బాబా దయవలన రాత్రంతా చక్కగా నిద్రపోయాను. ఇప్పుడీ అనుభవాన్ని వ్రాస్తున్న సమయం వరకు కూడా ఎటువంటి ఇబ్బందీ లేదు. 'సాయీ' అని పిలిచినంతనే రక్షణనిచ్చే ఆ సాయితండ్రికి నా ధన్యవాదాలు. ఈ కొరోనా వ్యాధి బారినపడకుండా సమస్త జనులు సుఖంగా ఉండాలని మన తండ్రి సాయిని ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాను.


సాయి అనుగ్రహసుమాలు - 345వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయ్యవ భాగం  

11-2-1912.

ఈ ఉదయం నా ప్రార్థన ముగిసే సమయానికి గద్రే పైకి రావటాన్ని చూసి అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను. తిరిగి వెళ్ళిపోవటానికి బాబా వద్ద అనుమతిని పొంది అతను నాసిక్ వెళ్ళిపోయాడు. సాయిసాహెబ్ బయటకు వెళ్ళటం చూసి ఉపాసనీ, కౌజల్గి, బాపూసాహెబ్ జోగ్‌లతో కలసి పంచదశి తరగతి నిర్వహించాము. నాసిక్ జిల్లా రెవిన్యూ అధికారి లేలే కూడా పంచదశి తరగతికి హాజరయ్యాడు. అతను చాలా మంచివాడిలా అనిపించాడు. సాయిమహారాజు అతన్ని చాలా ఇష్టపడ్డారు. సాయిబాబా తిరిగి వచ్చాక యథాప్రకారం మశీదుకు వెళ్ళాను, కానీ అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. వారిలో చాలామంది క్రొత్తవారు. వారిలో ఒకాయన అకోలా పోలీసు. అతను తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నాగపూర్ బారిష్టర్ గోవిందరావు దేశ్‌ముఖ్ దగ్గర పనిలో చేరానని నన్ను చూడగానే నాతో చెప్పాడు. మధ్యాహ్న ఆరతి, భోజనమూ అయ్యాక కొద్దిసేపు నడుంవాల్చి దీక్షిత్ రామాయణ పురాణానికి హాజరయ్యాను. తరువాత సాయంత్రవు వ్యాహ్యాళి నమయంలో ఒకచోట నిలుచుని లేలేతో మాట్లాడుతున్న సాయిబాబాను చూడ్డానికి వెళ్ళాము. సాయంత్రం వాడా ఆరతి, ఆ తరువాత శేజారతి, భీష్మ భాగవతం, దీక్షిత్ రామాయణం అన్నీ జరిగాయి. ఈరోజు తిరిగి వెళ్ళటానికి శివానందశాస్త్రికి అనుమతి దొరకలేదు.

13-2-1912.

దీక్షిత్ రామాయణం చదివాక మేం మశీదుకి వెళ్ళాము. నేను లోపలికి అడుగుపెట్టిన వెంటనే సాయిమహారాజు నాకు ఊదీ ఇచ్చారు. 'నన్ను వెళ్ళిపొమ్మనటానికి సంకేతంగా ఇచ్చారా!' అని నేను ఆశ్చర్యపోతుంటే, “వెళ్ళమని ఎవరన్నారు? కూర్చో!" అన్నారు. కూర్చున్న తరువాత హాయిగా మాట్లాడారు. "ఇప్పుడు దీక్షిత్‌కి చెందిన ఆవు మొదట మహల్సాపతిది. అప్పుడది ఔరంగాబాదు వెళ్ళింది. ఆ తరువాత జాల్నా వెళ్ళినప్పుడు దీక్షిత్ ఆస్తిగా తిరిగి వచ్చింది. అసలది ఎవరి సొత్తో భగవంతుడికే ఎరుక" అన్నారు. నావంక చూస్తూ ఆయన, "భగవంతుడి మీద దృఢమైన విశ్వాసమున్న వాళ్ళెవరూ ఏదీ కోరరు" అన్నారు. నా భార్య, ఇంకా మిగతా వారంతా అక్కడే ఉన్నారు. మేమంతా సాయంత్రపు వ్యాహ్యాళిలో బాబాను చూశాము. అప్పుడు వాడా ఆరతి, తరువాత శేజారతి జరిగింది. రాత్రి భీష్మ భజన చేస్తే దీక్షిత్ రామాయణం చదివాడు. ఈరోజు మధ్యాహ్న ఆరతి, శేజారతి రెండు ఆరతులు అయ్యాక రెండుసార్లు సాయిబాబా ప్రత్యేకంగా నా పేరుతో పిలిచి వాడాకు వెళ్ళమన్నారు.

14-2-1912.


పెందరాళే లేచి కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిబాబా చావడి వదిలే సమయంలో తన చిన్న బెత్తాన్ని తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కుగా ఊపటం చూసి ఆశ్చర్యపోయాను. పంచదశి తరగతి నిర్వహించి సాయిబాబా బయటకు వెళ్ళటం, తరువాత మశీదుకు వెళ్ళటం చూశాము. 

సాయిబాబా రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి:- ఒక ప్రయాణీకుడ్ని ఒక ఉదయం, ఒక రాక్షనుడు వెంబడించాడట. దానిని ఒక దుష్టశకునంగా పరిగణించి, ముందుకు సాగిపోతూ అతను రెండు బావుల్ని చూశాడట. అందులో ఒక బావిలో నీరు తియ్యగా ఉండి అతని దాహాన్ని తీర్చిందిట. అతనికి ఆకలి వేసినప్పుడు అతను ఒక వ్యక్తిని కలిశాడట. ఆ వ్యక్తి తన భార్య సలహాపై అతనికి ఆహారం ఇచ్చాడట. పంటకి వచ్చిన ఒక జొన్నచేనుని ఇతను చూసి ఒక కంకిని తిందామనుకున్నప్పుడు పొలం యజమాని దాన్ని అతనికిచ్చాడట. ఆ ప్రయాణీకుడు ఆనందించి హాయిగా పొగత్రాగుతూ ముందుకు సాగాడట. అడవిలో నుంచి అతను ప్రయాణిస్తున్నప్పుడు ఒక పులిని చూసి ధైర్యాన్ని కోల్పోయి ఒక గుహలో దాక్కున్నాడట. ఎంతో పెద్దగా ఉన్న ఆ పులి అతని కోసం వెతుకుతోందట. సాయిబాబా అదే మార్గంలో పోవటం తటస్థించి, ఆయన ఆ ప్రయాణీకుడిలో ధైర్యాన్ని నింపి, అతన్ని బయటకు తెచ్చి అతని మార్గంలో పెట్టి “దాన్ని నువ్వు బాధిస్తే తప్ప ఆ పులి నిన్నేమీ చేయదు” అని చెప్పారట. 

రెండో కథ:- సాయిబాబాకి నలుగురు సోదరులున్నారట. అందులో ఒకడు బయటకు వెళ్ళి భిక్షచేసి, అన్నం, రొట్టె, వండిన జొన్నలు తెచ్చాడట. అతని భార్య అతని తల్లితండ్రులకి సరిపోయినంత మాత్రమే ఇచ్చి మిగతా సోదరుల్ని పస్తుంచేదట. సాయిబాబా అప్పుడొక కాంట్రాక్టు కుదుర్చుకొని ఆ డబ్బు ఇంటికి తెచ్చినప్పుడు అది ఆయన డబ్బున్న సోదరుడితో సహా అందరూ పంచుకొనేవారట. తరువాత ఆ సోదరుడికి కుష్టు వస్తే అందరూ అతణ్ణి దూరం చేశారట. తండ్రి బయటకు వెళ్ళగొట్టాడట. అప్పుడు సాయిబాబా అతనికి ఆహారం ఇచ్చి అతని సౌకర్యాలు చూసేవారట. చివరికి ఆ సోదరుడు చనిపోయాడట. 

మధ్యాహ్న ఆరతి యథాప్రకారం జరిగింది. మేము భోజనం చేసి, విశ్రాంతి తీసుకున్నాము. శివానందశాస్త్రి, విజయదుర్గ ఠాకూరు ఈరోజు వెళ్ళిపోయారు. ప్రాంతీయాచార్యుడు వ్యాహి అందర్నీ భోజనానికి పిలిచాడు. నేను వెళ్ళలేదుగానీ అందరూ వెళ్ళారు. సాయంత్రం వ్యాహ్యాళిలో సాయిబాబా "భోజనానికి ఎందుకు వెళ్ళలేదని" నన్నడిగారు. ఒకే మధ్యాహ్నం రెండు భోజనాలు నేను చేయలేనన్న నిజాన్ని వారికి చెప్పాను. సాయిబాబా దేనిగురించో ఆలోచనలో మునిగిపోయినట్లు, తూర్పు, పడమరలవైపు దీర్ఘంగా చూస్తూ 'వాడాకి వెళ్ళండి' అని మమ్మల్నందర్నీ పంపేశారు. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 386వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ‘బాబాది, నాది 18 జన్మల సంబంధం’
  2. శిరిడీ సందర్శించాలన్న కలను బాబా నెరవేర్చారు

‘బాబాది, నాది 18 జన్మల సంబంధం’

సాయిబంధువులకి నమస్కారం. నా పేరు సంహిత. ఇంతకుముందు బాబా ఒకే సంవత్సరంలో (2019) అయిదుసార్లు నన్ను శిరిడీకి రప్పించుకొని తమ దర్శనభాగ్యాన్ని ప్రసాదించిన అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా నాకు కలలో చెప్పిన ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను.

2019 అక్టోబరు నెలలో నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక ప్రదేశానికి వెళ్తున్నాను. ఆ ప్రదేశం కొంచెం ఇరుకుగా ఉంది. దారంతా సన్నగా ఉంది. అయినా అక్కడ చాలామంది ఉన్నారు. అలాగే వెళ్తూ ఉంటే చిన్న బాబా మందిరం కనిపించింది. బాబా ఆకుపచ్చని రంగు దుస్తులలో చక్కగా ఉన్నారు. ఇప్పటికీ ఆ రూపం నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఆ మందిరం కట్టి రెండు సంవత్సరాలు అవుతోందని, అక్కడి వాళ్ళు బాబా మందిరం రెండవ వార్షికోత్సవం జరుపుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసం అందరినీ విరాళాలు అడుగుతున్నారు. నా దగ్గర డబ్బులు లేనందువల్ల, “Paytm నుంచి డబ్బులు పంపించవచ్చా?” అని వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళు, “ఆఁ, ఇంటికి వెళ్ళాక కూడా డబ్బులు పంపించవచ్చు” అని చెప్పారు. “విరాళం ఎంత ఇవ్వాలి?” అని అడుగుతున్నాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. నాకేమో రూ. 2,000 ఇవ్వాలని ఉంది. అక్కడికి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ బయట ఒక డాక్టర్ ఉంది. తను నా దగ్గరకి వచ్చి, “నీకు నచ్చితే ఒక్క రూపాయి అయినా ఇవ్వచ్చు. బాబాది, మనది 18 జన్మల సంబంధం. కాబట్టి, ఒక్కో జన్మకి ఒక్కో రూపాయి చొప్పున 18 రూపాయలు ఇవ్వు” అని చెప్పింది. తరువాత నాకు మెలకువ వచ్చింది. కలని గుర్తుచేసుకుంటూ, ‘బాబాది, నాది 18 జన్మల సంబంధం’ అని చాలా ఆనందించాను. “థాంక్యూ సో మచ్ బాబా!”. నాకు ఈ కల అక్టోబరులో వచ్చింది కదా, నేను నవంబరులో శిరిడీ వెళ్ళినప్పుడు బాబాకి 18 రూపాయలు సమర్పించుకున్నాను. “బాబా! మీ ఆశీస్సులు ఎప్పటికీ అందరిమీదా ఉండాలి. అందరినీ కాపాడండి. బాబా! కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకడం లేదు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. బాబా! దయచేసి నన్ను కాపాడండి, నన్ను నడిపించండి”.

శిరిడీ సందర్శించాలన్న కలను బాబా నెరవేర్చారు

యు.ఎస్. నుండి సాయిభక్తురాలు కవిత తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఈ లోకంలోని అసంఖ్యాకమైన సాయిభక్తులలో నేనూ ఒకదానిని. 2018 ఆరంభం నుండి నేను ఆయన భక్తురాలిని. అప్పటినుండి నేను శిరిడీ సందర్శించాలని కలలుగన్నాను. 2018 వేసవిలో నేను భారతదేశానికి వెళ్లాను గానీ, శిరిడీ వెళ్ళలేకపోయాను. అందువల్ల నేను చాలా నిరాశపడ్డాను. అప్పటినుండి నేను, "బాబా! దయచేసి శిరిడీ దర్శించాలన్న నా కలను నెరవేర్చండి" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని.

2019లో మేము ఇండియా వెళ్ళడానికి 2 నెలల ముందు నుండి "అతి త్వరలో మీరు శిరిడీ సందర్శిస్తారు" అని వివిధ మార్గాల (ఇన్‌స్టాగ్రామ్/ఇంటర్నెట్) ద్వారా నాకు సందేశాలు వస్తుండేవి. బాబా చాలాసార్లు ఇస్తున్న ఆ సందేశంతో ఈసారి శిరిడీ సందర్శిస్తానని నమ్మకం నాలో ఏర్పడింది. ఆశ్చర్యకరంగా తేదీలన్నీ చక్కగా అమరాయి. శిరిడీ వెళ్లాలన్న నా ఆలోచనకు మావారు సంతోషంగా అంగీకరించారు(గత సంవత్సరానికి భిన్నంగా). ఆయనంతట ఆయనే 'మనం గురువారం శిరిడీ వెళదామ'ని అన్నారు. బాబా అనుగ్రహంతో అనుకున్నట్లుగానే మేము గురువారం శిరిడీ చేరుకున్నాము. బాబా అద్భుతమైన దర్శనం ప్రసాదించారు. నేను మాటలలో చెప్పలేనంత అనుభూతి పొందాను. ఆనందం కన్నీళ్ల రూపంలో వ్యక్తమైంది. ముఖ్యంగా ద్వారకామాయిలో బాబా ఉనికిని బాగా అనుభవించగలిగాను. ఎప్పటికీ మరువలేని ఆనందమది.

కొన్ని ఆరోగ్యసమస్యలున్న మా పాపకు నేను రోజూ బాబా ఊదీని ఇస్తూ ఉంటాను. అందువలన నేను ఎప్పుడూ ఊదీ ప్యాకెట్లు కావాలని ఆరాటపడుతుంటాను. ఆ కారణంగా మేము మందిరం నుండి బయటికి వచ్చేముందు అక్కడున్న సెక్యూరిటీతో నేను, "మాకు ఎక్కువ ఊదీ లభిస్తుందా?" అని అడిగాను. వాళ్ళు, "డొనేషన్ కౌంటర్లో సంప్రదించండి" అని చెప్పారు. మేము ఆ కౌంటరుకి వెళ్లి కొంత డబ్బు విరాళంగా కట్టాము. అతను కొన్ని ఊదీ ప్యాకెట్లను మాకు ఇచ్చాడు. చూస్తే, మా ఊహకందనంత ఎక్కువ ఊదీ ప్యాకెట్లున్నాయి. పూర్తిగా అది బాబా కృప. ఆయన చూపిన ప్రేమకు నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.

మరుసటిరోజు (శుక్రవారం) మా తిరుగు ప్రయాణం. ఆ రాత్రి నేను అలారం పెట్టుకోకుండానే నిద్రపోయాను. సరిగ్గా తెల్లవారుఝామున 3.30 గంటలకు నాకు మెలకువ వచ్చింది. కాకడ ఆరతి సమయానికి నేను వెళ్ళగలిగాను. సమయానికి బాబానే నన్ను మేల్కొల్పారని భావించి కృతజ్ఞతతో ఆయనకు నమస్కరించుకున్నాను.

ఇప్పుడు బాబా ఇచ్చిన అద్భుత అనుభవాన్ని చెప్తాను. నేను శిరిడీలోని షాపింగ్ సెంటర్‌లో తెల్లని పాలరాతి బాబా విగ్రహాన్ని కొనాలని అనుకున్నాను. కానీ తగినంత సమయం దొరకక నేను కలత చెందాను. హోటల్ చెకౌట్ చేయడానికి మేము సిద్ధమవుతున్న సమయంలో హోటల్ సిబ్బంది మమ్మల్ని పిలిచి మాకొక బహుమతి ఉందని చెప్పారు. నేను దానిని అందుకుని ప్యాకెట్ తెరచి చూసి అవాక్కయ్యాను. అది తెల్లని పాలరాతి బాబా విగ్రహం! బాబా అంత ప్రేమ కురిపిస్తారని నేనస్సలు ఊహించలేదు.

ఇక చివరిగా మేము శిరిడీ నుండి బయలుదేరేముందు మా పాపకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. దాంతో ముందుగా అనుకున్నట్లుగా ఆరోజు తిరిగి వెళ్లగలమా అని మేము ఆలోచనలో పడ్డాము. నేను తనకి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. కొద్దినిమిషాల్లో తన తలనొప్పి తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మొత్తం మీద నేను కలలు కన్న శిరిడీ సందర్శించగలిగాను. మీ అనుగ్రహాన్ని చాలా పొందగలిగాను".

అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2589.html


సాయి అనుగ్రహసుమాలు - 344వ భాగం


ఖపర్డే డైరీ - ఇరవై తొమ్మిదవ భాగం

8-2-1912.

కాకడ ఆరతి కోసం లేచి, ఆరతి అయ్యాక నా దినచర్య మొదలుపెట్టాను. నారాయణరావు వామన్ గావోంకర్ తిరిగి వెళ్ళిపోవటానికి అనుమతి సంపాదించాడు. నా భార్య నుండి కొన్ని వస్తువులు అమరావతికి అతను తీసుకెళ్ళవలసివుంది. అవి తీసుకొని అతను టాంగాలో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళబోయేముందు మా బంధువూ, సతారాకి చెందిన ఓ పెద్ద ఆఫీసరూ అయిన కర్బారీ కొడుకు గణవతిరావు అనే అతను తిల సంక్రాంతి కోసం సాంప్రదాయబద్ధమైన నువ్వులు, బహుమతులతో వచ్చాడు. వాటిలో చక్కెర, నువ్వులతో కలిపి ఎంతో కళాత్మకంగా చేసిన వస్తువులు వున్నాయి. ఈ మూడు వారాల్లో మొట్టమొదటిసారిగా బల్వంత్ మశీదు వరకు ఎలాగో నడవటం అనే సాహసం చేసి సాయిమహారాజు పాదాల మీద తల పెట్టాడు. కొంతవరకు అతని ఆరోగ్యం బాగుపడింది. రంగపంచమికి మా అబ్బాయి బల్వంత్‌ను సతారాకి రమ్మని గణపతిరావు కోరాడు. అతన్ని సాయిబాబాని అడగమన్నాను.

మధ్యాహ్న ఆరతి చివరిలో సాయిమహారాజు కోపాన్ని ప్రదర్శించటం తప్ప అంతా మామూలుగానే జరిగిపోయింది. దీక్షిత్ రామాయణం చదవగా నేను దాసబోధ చదివి మధ్యాహ్న సమయాన్ని గడిపాము. పొద్దున పంచదశి తరగతి నిర్వహించాము. సాయిసాహెబ్‌ను సాయంత్రపు వ్యాహ్యాళిలో చూశాము. బొంబాయి నుంచి కులకర్ణి అనే అతను వచ్చాడు. అక్కడ అతని లాబొరేటరీలో ఖనిజాలు మొదలైనవి పరీక్షిస్తారట. 1907వ సంవత్సరంలో నన్ను సూరత్‌లో అతను చూశానని చెప్పాడు. మేము పాతవిషయాలు మాట్లాడుతూ కూర్చున్నాము. రాత్రి భీష్మ భజన చేస్తే, దీక్షిత్ రామాయణం చదివాడు.

9-2-1912.

నేను మామూలుగానే లేచి ప్రార్థన చేసుకొని, పంచదశి తరగతికి హాజరయ్యాను. అప్పుడు సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూశాము. తరగతి పూర్తయ్యాక నేను మశీదుకు వెళ్ళాను. సాయిబాబా చాలా మంచి ధోరణిలో ఉన్నారు. మేమంతా పిష్యా అని పిలిచే కిష్యా అనే చిన్న పిల్లవాడు యథాప్రకారం వచ్చాడు. అతడిని చూడగానే సాయిసాహెబ్, పిష్యా తన పూర్వజన్మలో ఒక రోహిల్లా అనీ, అతను చాలా మంచివాడనీ, అతను చాలా సుదీర్ఘంగా ప్రార్థించి సాయిబాబా తాతగారికి అతిథిగా వచ్చాడనీ చెప్పారు. ఆయనకు ఒక సోదరి ఉండేదనీ, ఆమె విడిగా జీవించేదనీ చెప్పారు. అప్పుడు సాయిబాబా చిన్న పిల్లవాడట. సరదాకి ఆ రోహిల్లా ఆమెను పెళ్ళాడాలని అనేవారట. అలాగే జరిగి అతను ఆమెను పెళ్ళాడాడట. చాలారోజులు రోహిల్లా తన భార్యతో అక్కడే ఉండి, ఆ తరువాత ఆమెతో వెళ్ళిపోయాడట. కానీ ఎక్కడికెళ్ళాడో ఎవరికీ తెలీదట. అతను చనిపోయాక సాయిసాహెబ్ అతన్ని ప్రస్తుతపు తల్లి గర్భంలో పెట్టారుట. పిష్యా చాలా అదృష్టవంతుడు అవుతాడని, వేలకొద్దీ మానవులకు రక్షకుడౌతాడనీ ఆయన చెప్పారు. మధ్యాహ్న ఆరతి యథాప్రకారం జరిగిపోయింది. ఆ సమయంలో సాయిబాబా శివానందశాస్త్రికి ఏదో చెప్పి కొన్ని సంజ్ఞలు చేశారు. దురదృష్టవశాత్తూ శాస్త్రి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయాడు. సాయిసాహెబ్ బాపూసాహెబ్ జోగ్‌కి కూడా కొన్ని సంజ్ఞలు చేశారు. ఠాణాలో ప్లీడరైన ఓక్ ఇక్కడే ఉన్నాడు. బాబాగుప్తేకీ, నా ఇతర స్నేహితులకీ నన్ను గుర్తుచేయమని అతన్ని నేనడిగాను.

10-2-1912

ఉదయం కాకడ ఆరతికి హాజరయ్యాను. మా అబ్బాయి బల్వంత్‌తో సతారా వెళ్ళటానికి గణపతిరావు ఈ ఉదయం బాబా వద్ద అనుమతి సంపాదించాడు. ఆ సమయంలో అతనితో పాటు మాధవరావు దేశ్‌పాండే కూడా ఉన్నాడు. నేను బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ, శ్రీమతి లక్ష్మీబాయి కౌజల్గిలతో కలసి పంచదశి పఠించి, ఆ తరువాత మశీదుకు వెళ్ళాను. సాయిసాహెబ్ చాలా మంచి ధోరణిలో ఉండి తన శరీరం తన కాళ్ళనుండి విడివడిందనీ, శరీరాన్ని తాను పైకి లేపగలిగాను కానీ కాళ్ళను మాత్రం లేపలేకపోయాననీ అన్నారు. తేలీతో తనకు గొడవ జరిగిందనీ, తను బాల్యంలో కుటుంబ పోషణార్థం అప్పుచేసి, అప్పు తీర్చేందుకు అప్పిచ్చినవాడికి పనిచేసి పెట్టేందుకు ఒప్పుకున్నానని, అయితే ఆ పని చేయలేకపోయాననీ చెప్పారు. అందుకని జీడిగింజను తన కళ్ళకి, మంటపుట్టించే మరో పదార్థాన్ని శరీరానికి పూసుకొని మంచానపడ్డారట. అలా ఒక సంవత్సరం మంచంలోనే పడివుండి, ఒంట్లో ఆరోగ్యం చేకూరిన వెంటనే రాత్రింబవళ్ళు పనిచేసి ఋణం తీర్చేశారట. చాలా హాయిగా మాట్లాడుతూ కూర్చున్న సాయి ఆరతి అయిపోవచ్చే సమయంలో కొంచెం అసహనాన్ని ప్రదర్శించారు. నాసిక్ ప్లీడరు గద్రే ఉన్నాడిక్కడ.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 385వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. మనసులో మెదిలిన చిన్న కోరికను బాబా తీర్చిన వైనం
  2. మనం బాధలో ఉంటే బాబా కూడా ఏడుస్తారు

మనసులో మెదిలిన చిన్న కోరికను బాబా తీర్చిన వైనం

ఓం శ్రీ సాయిరాం! అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా మనుమడి రూపంలో బాబానే మా ఇంటికి రాబోతున్నారని ఇంతకుముందు నేను మీతో పంచుకున్నాను. సాయి కృపతో మళ్ళీ ఇంత త్వరగా మరో అనుభవంతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాబా అనుగ్రహంతో మార్చి 10వ తేదీన మా మనుమడు జన్మించాడు. బాబానే మా మనవడి రూపంలో పసిబిడ్డగా వచ్చి మా వంశాన్ని వృద్ధి చేస్తున్నారు. మా ఆనందానికి అవధుల్లేవు. బాబా దయవల్ల బాబు బాగున్నాడు.

ఇటీవల జరిగిన మరొక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. నేను మొన్న నా స్నేహితురాలి ఇంటికి వెళుతూ బొబ్బట్లు తీసుకువెళ్ళాను. బొబ్బట్లు కొనే సమయంలో ఒకరి ఇంటివద్ద సాయి దివ్యపూజ ఉద్యాపన జరుగుతోందని తెలిసింది. “ఈ బొబ్బట్లలో కొన్నైనా బాబాకు నైవేద్యంగా వాళ్ళింటికి చేరితే బాగుండు” అనిపించింది. కానీ, “వాళ్ళు ఐదుగురినే ఆహ్వానించారు, మనం వెళితే బాగుండదు కదా” అని అనుకున్నాను. అయితే ఉద్యాపనకు ఆహ్వానించిన ఆవిడ బాబా కోసం స్వీటు తయారుచేయడం మరచిపోయారట. నేను బొబ్బట్లు ఇచ్చిన నా స్నేహితురాలు తనకు ఆ విషయం తెలియకుండానే, ఇంట్లో బొబ్బట్లు ఉన్నాయి కదా అని నేనిచ్చిన బొబ్బట్లు తీసుకుని ఉద్యాపనకు వెళ్లారట. అది చూసి ఉద్యాపనకు ఆహ్వానించిన ఆవిడ  ఎంతో సంతోషంతో, సాయిభక్తురాలు పంపిన స్వీటు వచ్చింది” అని అన్నారట. ఇది నిజంగా బాబా సంకల్పం. నాకు ఈ విషయం తెలియగానే, "బొబ్బట్లు కొంటున్నప్పుడు నా మనసులో మెదిలిన చిన్న కోరికను బాబా ఇలా తీర్చార"ని ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

కొరోనా వైరస్‌తో ప్రపంచమంతా వణికిపోతున్న ఈ సమయంలో, ఒకరోజు మావారికి ఒక తుమ్ము వస్తే, “బాబా! నీవు ఉండగా ఏమీ కాదు” అనుకుని బాబా ఊదీని మావారి నోట్లో వేశాను. అంతే! వెంటనే తగ్గిపోయింది. మనందరినీ చూసుకునే బాబా మనకు ఉండగా మనకి ఏమీ భయం లేదు. “బాబా! మీరు ప్రపంచాన్నంతటినీ కొరోనా బారినుండి కాపాడండి”.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

మనం బాధలో ఉంటే బాబా కూడా ఏడుస్తారు

సాయిభక్తురాలు కోమల్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న డాక్టర్ని. నేను సాయిబాబా భక్తురాలిని. ఆయన చాలా దయగలవారు. 7 సంవత్సరాల కాలంలో ఆయన నాకు 4సార్లు స్వప్నదర్శనం ఇచ్చారు. చివరిసారిగా ఇటీవల ఆయన స్వప్నదర్శనం ఇచ్చినప్పుడు నేను బాబాని చాలా దగ్గరగా చూశాను. అయితే ఆయనెందుకో ఏడుస్తున్నారు. ఆయన మౌనంగా ఉన్నారు, కళ్ళనుండి కన్నీళ్లు చెంపల మీదుగా క్రిందకి జారుతున్నాయి. ఆయన బాధ నన్ను మేల్కొనేలా చేసింది. చూస్తే సమయం తెల్లవారుఝామున 4.30 అయ్యింది. ఏమీ అర్థంకాక చుట్టూ చూస్తూ బాబా ఫోటో చూశాను. నేను, “ఏమి జరిగింది బాబా? ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాను. తరువాత 'నాకు ఏదైనా చెడు జరగబోతోందా?' అని భయపడ్డాను. కానీ బాబాతో, "నన్ను రక్షించడానికి మీరున్నారు. కాబట్టి చింతించకండి సాయీ" అని అన్నాను. అప్పుడు నేను, “మీ భక్తులు మీకు భారంగా అనిపిస్తున్నారా?” అని అడిగాను. అందుకు ఆయన సమాధానం కూడా నేనే, చింతించకు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను!” అని చెప్పి నిద్రపోయాను. ఆశ్చర్యం! కలలో మళ్ళీ బాబా దర్శనం ఇచ్చారు. కలలో నేను పనిమీద ఎక్కడికో వెళ్లడంలో బిజీగా ఉన్నాను. ఎవరో నా కుడిచేయి పట్టుకుని నన్ను ఆపారు. నేను వెనక్కి తిరిగి చూశాను. సాయి నా చేయి పట్టుకుని నిలబడి ఉన్నారు. నేను “సాయీ!” అన్నాను. ఆయన నన్ను చూస్తూ నవ్వారు. ఆయన ముఖం ప్రకాశవంతంగా, సంతృప్తికరంగా ఉంది. నాకు మెలకువ వచ్చి గడియారం చూస్తే ఉదయం 6.30 అయ్యింది. కేవలం రెండు గంటల వ్యవధిలో బాబా నాకు రెండుసార్లు దర్శనం ఇచ్చారు. రోజంతా నేను 'మొదట ఆయన ఏడ్చారు, రెండోసారి నవ్వారెందుకని' ఆలోచిస్తూ గడిపాను. చివరికి ఇలా అర్థం చేసుకున్నాను: 'ఆయన ఏడ్చారు ఎందుకంటే నా హృదయంలో బాధ ఉందని ఆయనకు తెలుసు. నా బాధను ఆయన చూడలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ఆయనతో, “చింతించకు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను!” అని ఆయన సమాధానం కూడా నేనే చెప్పడంతో మళ్ళీ బాబా కలలో దర్శనమిచ్చి నవ్వారు'.

గురువే సర్వము. ఆయన మన దేవుడు. ఆయన మాత్రమే మన బాధను అర్థం చేసుకుంటారు. మనం బాధలో ఉంటే ఆయన ఏడుస్తారు.


సాయి అనుగ్రహసుమాలు - 343వ భాగం.


ఖపర్డే డైరీ - ఇరవైఎనిమిదవ భాగం 

6-2-1912.

నేను లేచి కాకడ ఆరతికి హాజరయ్యాను. నేను తిరిగి వెళ్ళేందుకు అనుమతి ఈరోజు దొరకవచ్చునని మాధవరావ్ దేశ్‌పాండే చెప్పాడు. అందుకని నేను అతనితోనూ, వామన్ గావోంకర్‌తోనూ కలిసి ఉదయం ఏడున్నర గంటలకు సాయిసాహెబ్ వద్దకు వెళ్ళాను. సాయిసాహెబ్ మధ్యాహ్నం మళ్ళీ రమ్మన్నారు. అందుకని మేము వెనక్కి తిరిగి వచ్చాక నేను నా నిత్యక్రమాన్ని ప్రారంభించాను. నేను, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్ పంచదశి చదివి, సాయిమహారాజు బయటకు వెళ్ళటాన్ని చూశాము. తరువాత మధ్యాహ్న ఆరతికి హాజరయ్యాము. బ్రహ్మానందబాయి అక్కడ ఒక ఆరతి, కొన్ని పదాలు పాడింది. బాపూసాహెబ్ జోగ్ తన పెన్షన్ తెచ్చుకునేందుకు ఈరోజు కోపర్గాం వెళ్ళాల్సి ఉండటంతో ఆరతి త్వరగా అయింది. మధ్యాహ్నం భోజనానంతరం నేను, వామన్ గావోంకర్ మశీదుకు వెళ్ళాము. కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడే ఉన్నాడు. సాయిసాహెబ్ రేపు మేము వెళ్ళవచ్చునన్నారు. మాధవరావు దేశ్‌పాండే కూడా అక్కడకు వచ్చాడు. 

సాయిసాహెబ్, ఆ ప్రయాణానికి ఎంతగానో ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాననీ, రాత్రింబవళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నాననీ అన్నారు. "అందరూ దొంగలే, కానీ వారితోనే మనం వ్యవహరించాలి" అన్నారు. ఆయన భగవంతుణ్ణి "వారు బాగైనాపడాలనీ లేక వారిని తొలగించటమైనా జరగాలని" రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నారట. అయితే భగవంతుడు ఆలస్యం చేస్తూ బాహ్యానికి ఆ దృక్పథాన్ని అంగీకరించక ఆ పార్థనను ఆమోదించలేదన్నారు. “మనం ఒక నెలో, రెండు నెలలో వేచి ఉండి అప్పుడు చూద్దాం. మనం చచ్చో, బ్రతికో ఆయన్ని దేనికోసం ప్రార్థిస్తున్నామో దాన్ని పొందుదాం. తేలి దగ్గరకు వణీ దగ్గరకూ పోయి వారిని యాచించను. మనుషుల్లో మంచితనమూ, భక్తితత్పరతా లేవు. వారు వారి చిత్తాల్లో అస్థిరంగా ఉన్నారు. కొద్దిమంది స్నేహితులు ఒకచోట చేరి దివ్య జ్ఞానాన్ని గురించి చర్చించుకుంటూ కూర్చుని ధ్యానం చేసుకోవాల"ని అన్నారు. వారు "కొన్ని వేల రూపాయలు” అని అన్నారు కానీ అది దేనికి సంబంధించి అన్నారో నాకు గుర్తులేదు. 

నేను అప్పుడు తిరిగి వచ్చి దీక్షిత్ రామాయణ పురాణం విన్నాను. వారు వ్యాహ్యాళికై బయటకు వచ్చినప్పుడు వారిని దర్శించుకోవటానికి వెళ్ళాము. వారు చాలా సంతోషకరమైన ధోరణిలో ఉన్నారు. రాజారాంపంత్ దీక్షిత్ ఈరోజు ఖాండ్వా వెళ్ళాడు. ఉపాసనీశాస్త్రి భార్యను కోల్పోయాడు. ఈ దుర్వార్త ఉత్తరం ద్వారా వచ్చింది. నేను, దీక్షిత్ ఉపాసనీ వద్దకు వెళ్ళి అతనిని ఓదార్చి వాడాకు తీసుకువచ్చాము. నేను తిరిగి వెళ్ళటం గురించి ఫకీరుబాబా అడిగినట్లు, సాయిబాబా నేను రేపు వెళుతున్నానని ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. నా భార్య నా తిరుగు ప్రయాణం గురించి మాట్లాడినప్పుడు, నేను స్వయంగా సాయిబాబాను అనుమతి కోసం అడగలేదు కనుక ఆయనేమీ చెప్పలేనన్నారట. వెంటనే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. సాయిబాబా దాదాభట్టు దగ్గరనుంచి ఐదు వందల రూపాయలూ, మరొకరి వద్దనుండి రెండువందల రూపాయలూ తీసుకొని దాన్ని ఆయనకు ఇవ్వకుండా నేను వెళ్ళలేనని చెప్పారు. బాపూసాహెబ్ జోగ్ కోపర్గాం నుండి తిరిగి రావాలి కనుక వాడా ఆరతి కొంచెం ఆలస్యమైంది. బ్రహ్మానందబాయి, శివానందశాస్త్రి భజన చేశారు. భీష్మ కూడా చేశాడు.

7-2-1912

నేను త్వరగా లేచి ప్రార్థన ముగించి మా పంచదశి తరగతి మామూలుగా నిర్వహించాను. అనుమతి కోసం సాయిమహారాజు వద్దకు వెళ్ళలేదు. వారు బయటకు వెళ్ళటం చూసి, మళ్ళీ వారు మశీదుకి తిరిగి వచ్చాక నేను వెళ్ళాను. సాయిమహారాజు ఆరుబయట కూర్చుని, ఒకడు తాను నేర్పిన విద్యలను కోతి చేత చేయిస్తుంటే చూస్తూ ఉన్నారు. అక్కడే ఒక గాయకురాలూ, నాట్యకత్తె కూడా ఉన్నారు. మంచి కంఠస్వరం ఉన్న ఆమె మతపరమైన పాటలు పాడింది. తరువాత బ్రహ్మానందబాయీ, ఆమె సహచరులు నలూబాయీ, శివానందశాస్త్రి వచ్చారు. వారు పూజ చేశాక అందరిచేత 'అమ్మగారు' అని పిలిపించుకొనే బ్రహ్మానందబాయి మధురంగా గానం చేసింది. సాయిసాహెబ్ సింహాసనం మొదలైనవన్నీ తెమ్మని ఆజ్ఞాపించగా వాటిని అమరుస్తున్నప్పుడు మేము మా స్తంభాల వద్ద నిలబడ్డాము. అమ్మగారు మళ్ళీ రెండు పాటలు అత్యద్భుతంగా పాడినప్పుడు మా ఆనందం అవధులు దాటింది. సాయిసాహెబ్ వాళ్ళని ఇష్టపడ్డారనుకొంటా. తరువాత మేము మామూలు ఆరతిచ్చి మధ్యాహ్న భోజనానికి తిరిగి వచ్చాము. అమ్మగారూ, వారి మనుషులూ మా బసలోనే భోజనం చేశారు. భోజనానంతరం వామన్ గావోంకర్, అమ్మగారూ వారి మనుషులతో తిరిగి వెళ్ళిపోయేందుకు సాయిసాహెబ్ అనుమతి కోసం వెళ్ళారు. అమ్మగారూ, నలూబాయీ అనుమతిని పొంది బండిలో వెళ్ళిపోయారు. శివానందశాస్త్రి, వామన్ గావోంకర్ సాయిమహారాజు చెప్పటం వల్ల ఆగిపోయారు. 

నేను పడుకుని ఒక మంచి కునుకు తీశాను. దీక్షిత్ రామాయణం చదివాక నేను దాసబోధ చదువుకున్నాను. మేమంతా సాయిసాహెబ్‌ను వారి సాయంత్రపు వ్యాహ్యాళిలో చూసి వాడా ఆరతి ఆయ్యాక శేజారతికి హాజరయ్యాము. రాత్రి భీష్మ భాగవతం చదివితే, దీక్షిత్ రామాయణం చదివాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 384వ భాగం....


సాయిబాబా ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ
'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు'
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ఈ భాగంలో అనుభవం:
  • శిరిడీ దర్శనంతో క్యాన్సర్ మాయం

శిరిడీ సాయిబాబా భక్తురాలు మీను తన స్నేహితురాలు సంధ్య అనుభవాన్ని పంచుకుంటున్నారు.

బాబా ఇంకా మనతోనే, మన మధ్యనే ఉన్నారు. మన ప్రార్థనలన్నీ వింటున్నారు. అందుకు నిదర్శనమైన నా స్నేహితురాలి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

శ్రీమతి సంధ్య ఖురానా అనే నా స్నేహితురాలు బాబా అనుగ్రహాన్ని పొందింది. బాబా తన ప్రాణాలను కాపాడారు. ఆమె క్యాన్సర్‌ వ్యాధితో చాలా బాధపడింది. క్యాన్సర్ చివరి దశలో ఉన్నందున డాక్టర్లందరూ ఇంకేమీ చేయలేమని చేతులెత్తేశారు. ఆరు నెలల పాటు ఆమె ఏమీ తినలేదు. నిరంతరం ఏడుస్తూనే ఉండేది. ఏ క్షణంలోనైనా తన శ్వాస ఆగిపోతుందని ప్రతిక్షణం తనకున్న ఒక్కగానొక్క కొడుకు గురించి ఆందోళనపడుతూ తన భర్తతో కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని పదేపదే చెబుతూ ఉండేది. కుటుంబసభ్యులందరూ బాధలో కూరుకుపోయి ఉన్నారు. ఇల్లంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అటువంటి సమయంలో బాబా అద్భుతం చేశారు. ఏ జన్మలో పెనవేసుకున్న ఋణానుబంధమో బాబా ఆమెకు పునర్జీవితాన్ని ప్రసాదించటానికి వచ్చారు. నిజానికి అప్పటికి సాయిబాబా ఎవరో ఆమెకు తెలియదు.

ఒకరాత్రి కలలో ఆమెకు బాబా కనిపించారు. ఆయన, “బేటా, రో క్యోం రహే హో? డాక్టర్స్ నే జవాబ్ దియా హై. మైనే తో అభీ తక్ కోయీ జవాబ్ నహీ దియా. తుమ్ మేరే పాస్ శిరిడీ ఆవో” ("బిడ్డా నువ్వెందుకు ఏడుస్తున్నావు? వైద్యులు తమ సమాధానం చెప్పారు. నేనింతవరకు నా సమాధానం ఇవ్వలేదు. నువ్వు నా దగ్గరకు శిరిడీ రా") అని చెప్పారు. ఆమెకు మెలకువ వచ్చి అటు ఇటు చూసింది కానీ, ఎవరూ లేరు. ఆమెకేమీ అర్థంకాక మళ్ళీ నిద్రపోయింది. ఆమె సరిగ్గా వినలేదని అనుకున్నారేమో, బాబా మళ్ళీ దర్శనమిచ్చారు. "బేటా ఉఠో, ఔర్ మేరే పాస్ ఆవో" ("బిడ్డా, లే! నా దగ్గరకు రా") అని అన్నారు. ఈసారి కూడా ఆమె మళ్ళీ నిద్రపోయింది. చివరికి బాబా స్వయంగా ఉదయం 5 గంటలకు ఆమెను మేల్కొల్పి, "బేటా! శిరిడీ ఆవో, సబ్ ఠీక్ హో జాయేగా" ("శిరిడీ రా.. అంతా బాగుంటుంది") అని అన్నారు. ఆమె ఈసారి తన భర్తను లేపి అంతా వివరించింది. అతనికి కూడా సాయిబాబా గురించి గానీ, శిరిడీ గురించి గానీ తెలియనందున తెలిసినవాళ్ళని శిరిడీ గురించి అడిగారు. వాళ్ళ ద్వారా బాబా గురించి తెలుసుకుని శిరిడీ వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.

ట్రైన్ ఎక్కాక వాళ్ళు మన్మాడ్ వరకు వెళ్లాలా, కోపర్‌గాఁవ్ వరకు వెళ్లాలా అని వాళ్ళని, వీళ్ళని అడుగుతున్నారు. అంతలో బాబా వాళ్లకు కనపడి, "మీరు మన్మాడ్ చేరుకోవాలి. అక్కడ టాక్సీ తీసుకోవాలి" అని చెప్పి అదృశ్యమైపోయారు. బాబా చెప్పినట్లే వాళ్ళు శిరిడీ చేరుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె సమాధిమందిరంలో బాబా విగ్రహం ముందు నిలబడింది. అకస్మాత్తుగా విపరీతంగా చెమటలు పట్టి ఆమె స్పృహకోల్పోయింది. వెంటనే ఆమె భర్త ఆమెను తీసుకుని బయటకు వెళ్ళాడు. స్పృహ వచ్చిన వెంటనే ఆమె, "నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఏదైనా తినాలనుకుంటున్నాను" అని చెప్పింది. ఆరు నెలల తరువాత మొదటిసారి ఆమె మళ్ళీ ఆహారం తీసుకుంది. తరువాత వాళ్ళు అన్నిచోట్లా దర్శనాలు చేసుకుని తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లారు. డాక్టర్ ఆమెను పరీక్షించి, "ఏమిటి ఈ అద్భుతం. ఇప్పుడీమె ఆరోగ్యం నార్మల్‌గా ఉంది" అన్నారు. తరువాత పాత రిపోర్టులను, కొత్త రిపోర్టులను చూసి నిర్ఘాంతపోయారు. ఈవిధంగా సాయిబాబా ఆమె ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు సంధ్య సాయిబాబాకి అంకిత భక్తురాలు. సాయిబాబా మన అందరినీ తన బోధలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

మీనూ గుప్తా.

source:http://www.shirdisaibabaexperiences.org/2009/05/shirdi-sai-baba-devotee-experience.html


సాయి అనుగ్రహసుమాలు - 342వ భాగం.


సాయిబాబా ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ
'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు'
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ఖపర్డే డైరీ - ఇరవైఏడవ భాగం 

3-2-1912.

నేను చాలా ఆలస్యంగా లేచాను. సోమరితనపు తరంగం అంతటా ఆవరించినట్లు అనిపిస్తోంది. బాపూసాహెబ్ జోగ్ ఆలస్యంగా లేచాడు. అలాగే దీక్షిత్‌కీ, దాదాపు అందరికీ అయింది. నా ప్రార్థనానంతరం నేను మశీదుకి వెళ్ళానుగానీ, సాయిబాబా, “లోపలకి రాకుండా ఊదీ తీసుకొని వెళ్ళు” అన్నారు. నేను అలాగే చేసి బాపూసాహెబ్ జోగ్ బసకి వెళ్ళి ఉపాననీ, శ్రీమతి కౌజల్గిలతో కలసి పంచదశి చదువుతూ కూర్చున్నాను. మధ్యాహ్నం వరకూ అలాగే చదువుతూ కూర్చుని తరువాత అందరం సాయిబాబా ఆరతికి వెళ్ళాం. దాని తరువాత మధ్యాహ్న భోజనం అయింది. కొంత విరామం తరువాత దాసబోధ చదువుతూ కూర్చున్నాము. మధ్యాహ్నం దీక్షిత్ రామాయణం చదివాడు. సాయిబాబాకు స్థానిక భక్తుడైన గనోబా ఆబా అది వినటానికి వచ్చాడు. అతనికి చాలా శ్లోకాలు, కొన్ని కంఠస్థంగా కూడా వచ్చు. వారి వ్యాహ్యాళి సమయంలో సాయిబాబాను వెళ్ళి చూశాం.

మాధవరావు దేశ్‌పాండే సాయిబాబాకి నా విషయం చెప్పినట్లున్నాడు. కానీ వారు అవసరమైన అనుమతిని ఇవ్వక, “తను వృద్ధుణ్ణనీ, తన ప్రతిష్ఠని వదులుకోవటం ఇష్టంలేదని చెప్పార"నీ చెప్పాడతను. సుమారు రెండు వందలమంది పొరుగు పట్టణానికి వెళ్ళారనీ, వాళ్ళు తిరుగుబాటుదార్లుగా గుర్తింపబడ్డారనీ, మాధవరావు పేరు కూడా ఆ లిస్టులో ఉత్త పుణ్యానికి ఇరికించబడిందనీ, అందువల్ల దాని గురించి గొడవగా ఉందనీ చెప్పాడతను. రాత్రి జరిగిన వాడా ఆరతి, శేజారతికి నేను హాజరయ్యాను. భీష్మ భజన బదులు భాగవతం చదివితే దీక్షిత్ రామాయణం చదివాడు.

4 -2-1912.

ఉదయం త్వరగా లేచి కాకడ ఆరతికి హాజరై తరువాత నా ప్రార్థనను పూర్తిచేసుకున్నాను. నేను స్నానం చేసేటప్పుడు నారాయణరావు వామన్ గావోంకర్‌ని గురించి అడుగుతూ ఇద్దరు పెద్దమనుషులు వచ్చారు. వాళ్ళు లింగాయత శాస్త్రులు. పెద్దతని పేరు శివానందశాస్త్రి. వారితో ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. ఈ స్త్రీలు బ్రాహ్మణులు. పెద్దావిడ పేరు బ్రహ్మానందబాయి. మూడు సంవత్సరాల క్రితం నిత్యానందబాయి అనే లింగాయత స్త్రీని నాసిక్ వద్ద కలుసుకుంది. ఆమె పురోగమించిన యోగిని కనుక బ్రహ్మానందబాయికి దీక్ష ఇచ్చింది. మేమంతా సాయిమహారాజుని ఆయన బయటకు వెళ్ళేటప్పుడూ, తిరిగి మశీదుకు వచ్చేటప్పుడూ చూశాము. బ్రహ్మానందబాయి వారిని పూజించి రెండు ఆరతులు చాలా అద్భుతంగా పాడింది. మధ్యాహ్నం ఆరతయ్యాక భోజనం కానిచ్చి కొద్దిసేపు విశ్రమించాను. అప్పుడు దీక్షిత్ పురాణం విని, సాయిబాబాను సాయంకాలం వ్యాహ్యాళి సమయంలో చూశాము. వాడా ఆరతి అయ్యాక దీక్షిత్ పురాణమూ, భీష్మ భజనా జరిగాయి. బ్రహ్మానందబాయీ, ఆమె సహచరీ చాలా అద్భుతంగా పాడటంతో మేం భజనను చాలా ఆస్వాదించాము. శివానందశాస్త్రి కూడా పాడాడు. ఆ స్త్రీలు నాసిక్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ ఆ ప్రాంతంలోనే ఉంటారు.

5-2-1912.

ఉదయం నా ప్రార్థన పూర్తిచేసుకోగానే నాగపూర్ నుంచి రాజారామ్‌పంత్ దీక్షిత్ వచ్చాడు. అతను కాకాసాహెబ్ దీక్షిత్ పెద్దసోదరుడు. అతను సాయిసాహెబ్ దర్శనం కోసం వెళ్ళాడు. నేను మా పంచదశి తరగతికి హాజరై బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ శాస్తి, శివానందశాస్త్రి , బ్రహ్మానందబాయి, ఇంకా మిగతావారితో కలసి అమృతానుభవంలోని ఒక శ్లోకం చదివాను. సాయిబాబా బయటకు వెళ్ళటమూ, తిరిగి మశీదుకు వెళ్ళటమూ మేమంతా చూశాము. వారు నాపట్ల ఎంతో కరుణ చూపి కొన్ని మాటలు చెప్పారు. ఆరతయ్యాక అందర్నీ బయటకు పంపేటప్పుడు నన్ను నా పేరుతో పిలిచి, "సోమరితనాన్ని వదులుకొని స్త్రీలనూ, పిల్లలనూ చూడాల"ని చెప్పారు. శ్రీమతి లక్ష్మీబాయికి ఒక రొట్టెముక్క ప్రసాదించి, రాధాకృష్ణఆయి వద్దకు వెళ్ళి ఆమెతో కలిసి తినమన్నారు. ఇది చాలా గొప్ప అదృష్టం. ఇకనుంచి ఆమె చాలా ఆనందంగా ఉంటుంది. నేను శివానందశాస్త్రినీ, బ్రహ్మానందబాయినీ, వారితో ఉన్న మిగతా అందర్నీ మాతో మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించాను. అదయ్యాక కాసేపు విశ్రమించాను. దీక్షిత్ రామాయణం చదివాక సాయిబాబా వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు వారిని చూసేందుకు మేము వెళ్ళాము. వాడా ఆరతి అయ్యాక శేజారతి అయింది. రాత్రి బ్రహ్మానందబాయి అద్భుతంగా చేసిన భజన మధ్యరాత్రి వరకూ కొనసాగింది. నా తిరుగు ప్రయాణ విషయం ఈరోజు చర్చకు తీసుకురాబడింది. అది రేపు నిర్ణయించబడవచ్చు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 383వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అంతులేని ప్రేమను పంచిన సాయి - మూడవ భాగం... 

యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తురాలు బాబా తనకు ప్రసాదించిన అనుభవాలలో నిన్నటి తరువాయి భాగం:

నా జీవితంలో నేనెప్పుడూ ఊహించని అతిపెద్ద అద్భుతం జరిగింది. మన బాబా ఈ సాధారణ భక్తురాలిపై ప్రేమతో గొప్ప లీల చేశారు. వెనుకద్వారం గుండా విఐపిలను లోపలికి పంపుతున్నారు. వాళ్ళు వస్తుండటంతో నేను వాళ్ళకి దారి ఇవ్వడానికి పక్కకి తప్పుకుంటున్నాను. అంతలో సెక్యూరిటీ లేడీ, "నువ్వెందుకు ఇక్కడ నిలుచున్నావు? లోపలికి వెళ్ళు" అని అన్నది. నేను నిర్ఘాంతపోయాను, నా గొంతు మూగబోయింది. ఊహించని ఆ పరిణామానికి నా ఇంద్రియాలు స్తంభించిపోగా లోపలికి అడుగులు వేయడం మొదలుపెట్టాను. హాల్ మధ్యలో ఉన్నందున ఇక నేను బాబాను చూడగలను అనుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాను. అయితే వాళ్ళు ఇంకా ముందుకు తరుముతూనే ఉన్నారు. ఏమి జరిగిందో తెలుసా? మీరు నమ్ముతున్నారా? నేను పూజారి పక్కగా బాబా ముందు నిలబడి ఉన్నాను, వాళ్ళు బాబా కోసం చేసేవన్నీ స్పష్టంగా చూడగలుగుతున్నాను. నేను ఆనందంతో, "బాబా! ఉదయాన నేను ఏదో మాములుగా మీతో, 'ఎప్పుడైనా మీ ముందు నిలబడే అవకాశం నాకు వస్తుందా?' అని అన్నాను. మధ్యాహ్నానికే అది మీరు చేసి చూపించారు. చాలా చాలా ధన్యవాదాలు బాబా" అని ఆయనతో చెప్పుకున్నాను. మనం ప్రేమతో ఏది అడిగినా ఆయన వెంటనే మనకోసం చేస్తారు. ఎంత అమాయక ఫకీరు! మనం 'సాయి, సాయి' అని పలికితే చాలు, ఆయన కడుపు నిండిపోతుంది. ప్రేమతో మనకోసం ప్రతిదీ చేస్తారు. ఆరతి జరుగుతున్నంతసేపూ నేను ఆనందంతో ఏడుస్తూనే ఉన్నాను, ఒక్క పంక్తి కూడా పాడలేకపోయాను. ఆరతి ముగిసిన తరువాత బాబా పాదాలను తాకే అవకాశం కూడా లభించింది. నేను ఇంకా కలో, నిజమో తెలియని పరిస్థితిలోనే ఉన్నాను. తొలి ఏకాదశి అయినందున ఆరోజు బాబా ధరించిన తెల్లని వస్త్రాలు, బిల్వ పత్రాల మాల, బంగారు ఆభరణాల అలంకారం నేను ఈరోజుకీ మరచిపోలేను.

బాబా అనుగ్రహం అక్కడితో ఆగలేదు. నన్ను ఇంకా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నేను నా భర్త, పిల్లలకోసం ద్వారం వద్ద నిలబడి వేచి చూస్తున్నాను. సెక్యూరిటీ గార్డు అందరినీ బయటకు పంపుతున్నారు. నేను అతనితో 'నా కుటుంబంకోసం చూస్తున్నాన'ని ఒక్క మాట చెప్పానంతే. అతను నాతో, "ఇక్కడకు రండి. మీరు బాబాను దర్శిస్తూ ఉండొచ్చు" అని చెప్పాడు. నేను బాబాను చూస్తూ అక్కడే వేచి ఉన్నాను. నాలాగే తమ కుటుంబం కోసం చూస్తున్నామని వేరేవాళ్లు చెబితే, అతను 'వాళ్ళు బయటకు వస్తారు, అక్కడ కలుసుకోండి' అంటూ ప్రతి ఒక్కరినీ చాలా కఠినంగా పంపించేస్తున్నాడు. నన్ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. ఇంతలో సంస్థాన్ కుర్రాళ్ళు వి.ఐ.పిలను ఒక గదిలోకి తీసుకొని వెళ్లి వాళ్ళకి బాబా ప్రసాదం ఇస్తున్నారు. తరువాత ఆ కుర్రాళ్ళు ప్రసాదం పళ్లెంతో బయటకు వచ్చి నన్ను పిలిచి నా చేతిలో ప్రసాదం పెట్టారు. ఆరతి సమయంలో బాబాకు నివేదించిన నైవేద్యం నాకు లభించడంతో నేను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ బయటకు వచ్చాను.

బాబా అనుగ్రహంతో లభించిన చక్కటి దర్శనాలతో తృప్తి చెంది రైలు ఎక్కాము. మాకు కూర్చోవడానికి రెండు సీట్లే వచ్చినందున చిన్న పిల్లలతో ఎలా అని నాన్న టెన్షన్ పడటం ప్రారంభించారు. నేను తనతో, "చింతించకండి. అంతా బాగానే ఉంటుంద"ని చెప్పాను. టి.సి వచ్చి అర్థరాత్రి 12:30 సమయంలో బెర్త్ ఇవ్వగలనని చెప్పాడు. ఇంతలో మా పక్కన ఉన్న ఒక వ్యక్తి తన బెర్త్ మీద సర్దుకోమని అన్నారు. నాన్న కొంచెం ప్రశాంతించారు కానీ పిల్లలకోసం ఆలోచిస్తూ ఉన్నారు. బాబా మాకోసం ఏదైనా ఏర్పాటు చేస్తారని నేను నవ్వుతున్నాను. నాకోసం సాయి ఉన్నారని నాకు తెలుసు కాబట్టి నేనస్సలు ఆందోళన చెందలేదు. అరగంటలో టి.సి మళ్ళీ వచ్చి మా టిక్కెట్లన్నీ కన్ఫర్మ్ అయ్యాయని చెప్పారు. మేము సాయంత్రం 6:00 గంటలకు రైలు ఎక్కాము. అర్థరాత్రి 12:30కి మాకు సీట్లు వస్తాయని చెప్పినతను, 7:00 కల్లా మా సీట్లు కన్ఫర్మ్ అయ్యాయని చెప్పాడు. అప్పుడు నేను నాన్నతో, "నా సాయి ఏం చేశారో చూశారా?" అని అన్నాను. నాన్న చాలా సంతోషంగా "అంతలా బాబాను ఎలా నమ్ముతావు?" అని అడిగారు. అందుకు నేను, "లేదు నాన్నా, నా నమ్మకమేమీ అంత గొప్పది కాదు. కానీ నా సాయి నన్ను అమితంగా ప్రేమిస్తారు" అని చెప్పాను. చివరిగా నేను బాబాను ఒక విషయం మాత్రం అడిగాను, "బాబా! నాకు అవసరమైనదానికన్నా ఎక్కువే మీరు ఇచ్చారు. కానీ నేను ఈసారి వచ్చేటప్పుడు నాకు పవిత్రమైన మీ అభిషేక తీర్థాన్ని ఇవ్వండి" అని.

చివరిగా మేము యు.ఎస్.ఏకి తిరిగి ప్రయాణమవ్వాల్సిన రోజు వచ్చింది. బాబా చెన్నైలో అందమైన దర్శనంతో నన్ను స్వాగతించారు. మాకు వీడ్కోలు చెప్పడానికి నా సోదరుని అత్తగారి కుటుంబం కూడా వచ్చింది. ఆమె కేవలం రావడమే కాదు, నాకోసం శిరిడీ నుండి గురుపౌర్ణమినాటి అభిషేక తీర్థాన్ని సీసాలో తీసుకొచ్చింది. నేనింకేమి చెప్పగలను? పదాలు లేవు. బాబా అభిషేక తీర్థాన్ని కూడా ఇచ్చి నన్ను తిరిగి మా ఇంటికి సురక్షితంగా పంపుతున్నారు. నాకు ఇంతకన్నా ఏమి కావాలి? అలా బాబా ప్రేమ, ఆశీర్వాదాలతో నా భారత పర్యటనంతా అద్భుతంగా ముగిసింది.

నేను తట్టుకోలేనంత ప్రేమను బాబా నాపై కురిపించారు. అవి నా జీవితంలో అత్యంత ఉత్తమమైన, మరపురాని రోజులు, క్షణాలు. ఈ అనుభవాల గురించి ఎప్పుడు తలచుకున్నా నేను కన్నీళ్లపర్యంతమై 'బాబా నాపై ఎంత ప్రేమ చూపించారో!' అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు వ్రాస్తూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. బాబా నిజంగా పేద ఫకీరు. ఆయన కపటం లేనివారు. మనం ఆయన్ని 10 శాతం ప్రేమిస్తే, ఆయన మనల్ని 100 శాతం ప్రేమిస్తారు. అసలు మనం తనని ప్రేమిస్తున్నామో లేదో కూడా పట్టించుకోకుండా మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంటారు. ముఖం మీద అందమైన చిరునవ్వుతో ఆయన మనల్ని సదా ఆదరిస్తూ ఉంటారు.

నిజానికి నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవాలని అనుకోలేదు. కానీ బాబా నేను పొందిన అమితమైన ఆనందాన్ని, ఆయన ప్రేమను మీతో పంచుకొనేలా ఎలా చేసారంటే, నేను శిరిడీ నుండి వచ్చిన తరవాత ఒకరోజు ఏదో మాములుగా అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు, 'నేను శిరిడీ వెళ్ళానని, మంచి దర్శనం అయ్యింద'ని తనతో చెప్పాను. తను, "సమయం ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని నాకు పంచండి" అని అడిగారు. ఈ విషయం గుర్తు లేకుండానే అన్నయ్యతో నా అనుభవాన్ని శ్రీరామనవమినాడు పంచుకున్నాను. ఆతరువాత అన్నయ్య శిరిడీ దర్శన అనుభవాలు చదువుతున్నప్పుడు గతంలో అన్నయ్య నన్ను అడిగిన విషయం గుర్తొచ్చి, నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోమని బాబానే అన్నయ్య ద్వారా అడిగారని అర్థమై చాలా సంతోషంగా అనిపించింది. వాస్తవానికి ఆరోగ్యసమస్యల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయట పడటంలో బాబా నాకు ఎలా సహాయం చేసారో అనే అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ నేను నా శిరిడీ అనుభవాలను ముందుగా మీతో పంచుకోవాలని బాబా అనుకున్నారు. అందుకే ఆ అనుభావాన్ని పవిత్రమైన శ్రీరామనవమినాడు వ్రాసేలా చేసి, బ్లాగులో పబ్లిష్ అయ్యేలా చేసారు. తెలుగులో అనుభవాలు చదువుతుంటే బాబా మళ్ళీ నన్ను అశీర్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది.

"బాబా! దయచేసి నా జీవితాంతం ఇలాగే నాతో ఉండండి, నా తదుపరి జన్మలలో కూడా. నేను ఎప్పటికీ మీ భక్తురాలిగా ఉండాలి. నేను గొప్ప భక్తురాలిని కాదు కానీ, దయచేసి ఎప్పుడూ నాతో ఉండండి బాబా. మీ బిడ్డలందరినీ అన్ని అడ్డంకులనుండి రక్షించండి".


సాయి అనుగ్రహసుమాలు - 341వ భాగం.


ఖపర్డే డైరీ -  ఇరవైఆరవ భాగం

31-1-1912.

నేను కాకడ ఆరతి సమయానికి లేచి, నారాయణరావు వామన్ గావోంకర్‌తో కలసి వెళ్ళాను. మేము తిరిగి వచ్చేటప్పుడు సాయిమహారాజు కొంచెం కోపాన్ని ప్రదర్శించారు. బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ శాస్త్రి, కౌజల్గిలతో కలిసి మా పరమామృతం తరగతి బాగా సాగింది. నా బసకి పదకొండు గంటలకి వచ్చి కొన్ని జాబులు రాద్దామని కూర్చున్నానుగానీ, రాసే ప్రక్రియలో చాలా నిద్ర ముంచుకువచ్చింది. దాదాకేల్కరు కొడుకు భావూ నన్ను నిద్రలేపగా మధ్యాహ్న ఆరతికి మశీదుకి వెళ్ళిపోయాను. అంతకుముందు మామూలు ప్రకారం సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూశాను. మధ్యాహ్న ఆరతి మామూలుగా జరిగిపోయింది. రెండు వాడాల్లో నివసించేవారినీ, ఇంకా వేరే కొందర్నీ మేఘుడు చనిపోయిన పదమూడవరోజున అతని సంస్మరణార్ధం దాదాకేల్కర్ విందుకు పిలిచాడు. భోజనం సహజంగానే ఆలస్యమైంది. దానికోసం పిలిచేవరకు నేను పడుకొని గాఢంగా నిద్రపోయాను. ఐదుగంటలకు పూర్తయిందది. 

నేను అక్కడనుండి మశీదుకు వెళ్ళి సాయిసాహెబ్ దగ్గర కూర్చున్నాను. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. హాయిగా మాట్లాడారు, నృత్యం చేశారు, పాటలు పాడి  నాకూ, మిగతా అందరికీ కూడా అలనాటి గోకులంలోని చిన్నికృష్ణుణ్ని గుర్తుకుతెచ్చారు. వారి సాయంకాలపు వ్యాహ్యాళి సమయంలో వారిని చూశాం. వాడా ఆరతి అయ్యాక భీష్మ కొంచెం భజన చేశాడు. దీక్షిత్ రామాయణం చదివాడు. అందులో సుందరకాండను ఈ రాత్రి పూర్తి చేశాము.

1-2-1912.

ఈరోజు నేను లేవటం కొంచెం ఆలస్యమైనా సమయానికి ప్రార్థన పూర్తిచేసుకొని పరమామృతం తరగతికి హాజరవగలిగాను. ఈరోజు పుస్తకం పూర్తవుతుంది, రేపు పురశ్చరణ చేస్తాం. నేను తరువాత మశీదుకి వెళ్ళి సాయిమహారాజుతో కూర్చుని వారితో కలసి సాఠేవాడా వరకు వెళ్ళాను. వారికి నమస్కరించుకోవటం కోసం భక్తులు అక్కడ గుమికూడారు. వాళ్లతోపాటు నేను కూడా ఆయనకు నమస్కరించి, తరువాత బావూసాహెబ్ జోగ్ ఇంటికి వెళ్ళి పంచదశి మొదలుపెట్టాను. దాదాపు గ్రంథంలోని సారాంశమంతా ఇమిడి ఉన్న మొదటి పదిశ్లోకాలు వివరించాను. తిరిగి నా బసకు వచ్చి కొన్ని జాబులు వ్రాసి పోస్టుచేసి, మధ్యాహ్న ఆరతికి హాజరయ్యేందుకు మశీదుకు వెళ్ళాను. ఆరతి బాగానే జరిగింది. ఈ సంవత్సరమే ఎల్.ఎల్.బి డిగ్రీ తీసుకున్న అహ్మద్ నగర్‌కి చెందిన మాణిక్‌చంద్ ఇక్కడకు వచ్చి రోజంతా ఇక్కడే గడిపాడు. ఆరతి నుంచి వచ్చాక భోజనం చేసి సాఖ్రేబువా పర్యవేక్షించిన జ్ఞానేశ్వరి చదువుతూ కూర్చున్నాను. దురదృష్టవశాత్తూ మిగతా అన్ని ప్రచురణలలాగానే ఇదీ నా అన్ని సందేహాలనూ తీర్చలేదు. తరువాత దీక్షిత్ రామాయణం చదివాడు. శిరిడీ మామల్తదారు సానే, డిప్యూటీ కలెక్టరు, సబ్ డివిజనల్ ఆఫీసరూ అయిన సాఠే వచ్చి కొంతసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. వారు వెళ్ళిపోయాక మా రామాయణం కొనసాగించి, సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళే సాయిని చూసేందుకు మశీదుకి వెళ్ళాము. వాడా ఆరతి అయ్యాక శేజారతికి వెళ్ళాం. భీష్మ భజన చేయకుండా సఖారామ్ గారి ప్రాకృత భాగవతం చదివాడు. రాత్రికి దీక్షిత్ రామాయణం చదివాడు. ఈరోజు సాయంత్రం సాయిబాబా వద్దకు మేమందరం వారు సాయంకాలవు వ్యాహ్యాళికి వెళ్ళేముందు చేరాము. సాయిసాహెబ్ తమ కాళ్ళు మర్దన చేస్తున్న నా భార్యకు రెండువందల రూపాయిలు ఇవ్వమని దీక్షిత్‌తో చెప్పారు. ఈ ఆజ్ఞ తిరుగులేనిది. నేను మరొకరి దయాధర్మం మీద బ్రతకవలసి వచ్చిందా! దీనికంటే నాకు మరణమే నయం. నా అహాన్ని మచ్చిక చేసి చివరకు నశింపచేయాలని అనుకుంటున్నారేమో ఈయన. అందుకే ఆయన నన్ను పేదరికానికి, ఇతరుల దయాధర్మానికి అలవాటు చేస్తున్నారు అని అనుకున్నాను.

గమనిక: డైరీలో ఫిబ్రవరి 1, 1912 తారీఖు పేజీలు తిరగేసి నీతో గుర్తించబడ్డ పేరాను చదివాను. అది సరిగ్గా నా భావాలకు ప్రాతినిధ్యం వహించింది. మన సద్గురు సాయిమహారాజు ఆజ్ఞలను జారీచేశారు. ఆయన సర్వాంతర్యామి. నా మనసులో ఉన్న ఆలోచనలతో సహా ప్రతీదీ ఆయనకు తెలును. తన ఆజ్ఞలను నెరవేర్చే విషయంలో ఆయన ఎన్నడూ బలవంతం చేయరు. ఇప్పుడు నా భార్య కష్టతరమైన జీవితాన్నీ, పేదరికాన్ని ఇష్టపడకపోవటం మీదకు నా దృష్టి పోయింది. ఆమె అలా ఇష్టపడనట్లు నాకు తోచింది. కాకాసాహెబ్ దీక్షిత్ ఆ జీవితాన్ని అంగీకరించాడు కనుక హాయిగా ఉన్నాడు. అందుకే సాయిమహారాజు అతన్ని రెండువందల రూపాయలు అంటే పేదరికాన్ని, సహనాన్ని నా జీవితానికి ఇవ్వమని అతనికి చెప్పారు.

2-2-1912.


కాకడ ఆరతికి లేచి దాని తరువాత పంచదశి తరగతిని నిర్వహించాము. అయితే పంచదశి గురించే మాట్లాడాలనిపించి, దాన్ని చదవటం మొదలుపెట్టాము. అది చాలా గొప్ప గ్రంథం. ఏదీ దాన్ని అధిగమించలేదు. నేను సాయిమహారాజుని వారు బయటకు వెళ్ళే ముందు చూడటానికి వెళ్ళి వారిని సాఠేవాడా వరకు అనుసరించి తరువాత మధ్యాహ్న ఆరతికి హాజరయ్యాను. ఈరోజు అమరావతి నుండి నన్ను ప్రాక్టీసు చేసుకోవటానికి తిరిగి రమ్మంటూ మళ్ళీ ఒక జాబు వచ్చింది. సాయిమహారాజుని అడగమని మాధవరావు దేశ్‌పాండేకి నేను చెపితే అతను అలాగే చేస్తానని వాగ్దానం చేశాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo