సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు బాలకృష్ణ రామచంద్ర ఖైరీకర్



సాయి మహాభక్త బాలకృష్ణ రామచంద్ర ఖైరీకర్ ఒక గ్రామీణ బ్రాహ్మణుడు. అతను చితలీ గ్రామానికి 3 మైళ్ళ దూరంలో ఉన్న 'ఖైరీ' గ్రామ నివాసి. జులై 27, 1936న శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాల గురించి శ్రీబి.వి.నరసింహస్వామిగారికి ఇలా వివరించారు:

"35 సంవత్సరాలక్రితం మొదటిసారిగా నేను సాయిబాబా గురించి 'ఆయనొక పిచ్చి వ్యక్తి' అని విన్నాను. కానీ కొంతకాలం తర్వాత ప్రతిఒక్కరూ ఆయనని గురించి చాలా గొప్పగా మాట్లాడటం మొదలుపెట్టారు. దానితో శిరిడీలోని అప్పాకులకర్ణి వంటి కొందరు బ్రాహ్మణులతో నాకు పరిచయం ఉండటం వలన ఒకసారి నేను సాయిబాబా దర్శనంకోసం వెళ్ళాను. పూర్వం రోజులలో ప్రజలు చితలీ, జల్గాఁవ్, రాంపూర్, నాత్పట్లాచా, వాడి, పింపల్వాడి మీదుగా ఉన్న మార్గాన్ని శిరిడీ సందర్శించడానికి ఉపయోగించేవారు. ఈ రహదారి ఇప్పుడు ఉపయోగంలో లేదు. బాబా నూనెకు బదులుగా నీటిని ఉపయోగించి దీపాలు వెలిగించిన లీలను నేను చూసాను. దందేపూర్‌కి చెందిన దేశ్‌పాండే మాస్టర్ తరచుగా బాబా మాటలు వింటుండేవారు. కానీ బాబా చెప్పినదాని గురించి నాకు ఏమీ తెలియదు.

1908లో నేనొకసారి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ద్వారకామాయి మసీదు నేలపై పడివున్న ఒక నాణెం చూశాను. నేను దానిని తీసి బాబా చేతికందించి, "ఇది మీ నాణెం, దీనిని సురక్షితంగా ఉంచండి" అని చెప్పాను. కానీ బాబా నాకు ఆ నాణెం తిరిగిస్తూ, "సరేలే, ఈ నాణాన్ని ఇంటికి తీసుకువెళ్లి, మీ పూజగదిలో మీరు పూజించే ప్రతిమలతోపాటు ఉంచుకో! మీరు శ్రేయస్సు పొందుతారు" అని చెప్పారు. బాబా చెప్పిన ప్రకారం నేను ఆ నాణెం తీసుకుని వెళ్లి ఆరాధించసాగాను. ఆ నాణాన్ని ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత కులకర్ణిగా నేను చాలా ఆదాయం పొందగలిగాను. నా భార్యకు బంగారుగాజులను కూడా చేయించగలిగాను. అంతకుముందు నా పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మూడు సంవత్సరాలలో అనగా 1911 నాటికల్లా నేనెంతో శ్రేయస్సు పొందాను.

తరువాత ఒకసారి నేను ప్రయాణాలలో అపవిత్రంగా ఉన్నందువలన నా పారాయణ గ్రంథాన్ని ఒక స్నేహితుడికి పంపించాను. ఆ గ్రంథంలో బాబా ఇచ్చిన నాణెం ఉందన్న సంగతి నాకు అసలు గుర్తులేదు. కొన్నిరోజుల తర్వాత నాణెం పోగొట్టుకునట్లు గుర్తించాను. అందువలన 1911 తర్వాత నాకు చెడురోజులు ప్రారంభమయ్యాయి. ముందుగా నాణెం కోల్పోయిన ఆరునెలల్లో నేను నా భార్యను కోల్పోయాను. నేను వంశపారంపర్యంగా గ్రామాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని. 1916వ సంవత్సరంలో ప్రభుత్వం వంశపారంపర్య గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. ఆ కారణంగా నేను నా గ్రామాధికారి పదవి కోల్పోయాను. 1917-18లో నేను నా తల్లిని కోల్పోయాను. నేను ఇప్పుడు నా ఆహారం కోసం యాచించడం కూడా చేస్తున్నాను. ఐనా సరే నేను ప్రతీ సంవత్సరం రామనవమికి శిరిడీ వెళ్తూ ఉంటాను.

Source: http://www.saiamrithadhara.com/mahabhakthas/balakrishna_ramachandra_khairikar.html (Devotees' Experiences of Sri Sai Baba Part I, II and III by Sri.B.V.Narasimha Swamiji)

ద్వారంవద్ద కూర్చుని మరణాన్ని తరిమిమేసిన బాబా




నా పేరు వసంతరావుగారు. ఒకప్పుడు మా నాన్నగారు తీవ్ర అనారోగ్యంతో మృత్యుద్వారంవద్ద ఉన్నారు. ఆయన్ని పరీక్షించిన డాక్టర్, "ఇంక ఆశలు లేవు. ఎవరైనా దగ్గర బంధువులను పిలిపించుకోవాలంటే పిలిపించుకోండి" అని చెప్పారు. మేము మా మామయ్య యశ్వంత్‌రావుగారిని పిలిపించాం. ఆ రాత్రి నాన్న పరిస్థితి మరింత క్షీణించింది. తను అధిక జ్వరంతో బాధపడుతున్నారు. రాత్రంతా మా అమ్మ, మామయ్య ఆయన మంచం ప్రక్కనే కూర్చొని ఉన్నారు. మధ్యరాత్రిలో నాన్న లేచి, తలుపువైపు చూస్తూ తన చేతులు జోడించి నమస్కరించారు. ఆ తరువాత తనెంతో ప్రశాంతంగా నిద్రపోయారు. సుమారు తెల్లవారుఝామున 5 గంటల సమయంలో నిద్రలేచి తనకు తినడానికి ఏదైనా కావాలని అమ్మని అడిగారు. అమ్మ అన్నం కలిపి ముద్దలు పెడితే తిన్నారు. తరువాత ఆయన, "మీరు నా మంచం ప్రక్కన ఎందుకున్నారు? నేను బాగున్నాను" అని అన్నారు. ఆ మాటలు చెప్తూనే తను తలుపువైపు చూస్తున్నారు. నాన్న ఎందుకు అటువైపు చూస్తున్నారా అని నేను కూడా అటువైపు చూసాను. అక్కడ తలుపు దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఒక వెండి సట్కాను చేతిలో పట్టుకొని ఉన్నారు. ఆయన ఆ సట్కాను ఊపుతూ, "నేను ఇక్కడ ఉండగా ఎవరు ఈ గది లోపలికి ప్రవేశిస్తారో చూస్తాను" అన్నారు. నేను వెంటనే ఆయనకు నమస్కరించాను. ఆ వృద్ధుడు అచ్చం నేను నా చిన్నవయస్సులో చూసిన సాయిబాబాలాగానే ఉన్నారు. యమదూతలను తరిమివేయడానికి ఆయన ద్వారంవద్దనే కూర్చొని ఉన్నారు. తన భక్తులపై ఆయన చూపే కరుణ ఎనలేనిది.

ఆ తరువాత తొందరలోనే నాన్న పూర్తిగా కోలుకున్నారు. మళ్లీ ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు. కారుణ్యంతో అంతలా నా తండ్రిని సంరక్షించిన బాబాకు మా కుటుంబమంతా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈ సంఘటన బాబాపట్ల నాకు భక్తి, విశ్వాసాలను పెంపొందింపజేసింది.

మూలం: శ్రీ సాయిలీలా మ్యాగజైన్, ఫిబ్రవరి 1985. (విన్నీ చిట్లూరి రచించిన 'డివైన్ సింఫనీ ఆఫ్ బాబా')

సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు శిరిడీ వెళితే మేలు జరుగుతుంది




నేను ఒక సాయిభక్తురాలిని నేనిప్పుడు 2018లో బాబా నాకు ప్రసాదించిన గొప్ప అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఈరోజు వరకు బాబా నాకు ఇచ్చిన అతి పెద్ద అనుభవం ఇదే. గత ఏడాది(2017) నుండి మేం ఒక తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నాము. మా 4 సంవత్సరాల పాప ఆరోగ్యం స్థిరంగా ఉండేది కాదు. పుట్టుకతో తనకున్న జన్యు సమస్య తన ఉదరభాగంపై తీవ్రమైన ప్రభావం చూపింది. పుట్టిన ఏడాదిలోపే తనకి రెండు పెద్ద ఆపరేషన్స్ జరగడంతో తను మామూలుస్థితికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వయస్సుతోపాటు పెరగాల్సిన తన బరువు పెరగలేదు. చాలా సమస్యలతో పోరాడి ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కొంచెంగా స్థిరపడుతూ ఉంది.

2017 ఏప్రిల్ నుండి మా జీవితం అంధకారంలోకి తోసి వేయబడింది. మేము సాధారణ చెకప్ కోసం పాపని డాక్టరు వద్దకు తీసుకుని వెళితే పాపకి శరీరంలో రక్తం శాతం చాలా తక్కువగా ఉందని, అందువలన తనకి రక్తమార్పిడి చేయాల్సి ఉంటుందని తెలిసింది. మేము రక్తమార్పిడి ఒక్కసారి చేస్తే సరిపోతుందేమో అనుకున్నాం. కానీ ప్రతి రెండు మూడునెలలకు ఒకసారి రక్తమార్పిడి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ మాట వింటూనే నా గుండె పగిలినంత పనైంది. తీరా తనకి రక్తమార్పిడి చేశాక అధికంగా విరోచనాలై తన బరువు తగ్గిపోయి, బాగా నీరసించిపోయింది. చాలా సన్నగా, పాలిపోయినట్టుగా అయిపోయింది. ఆ స్థితిలో తనను చూడలేక విలవిలలాడిపోయాను. అసలు సమస్య అర్థమయ్యేది కాదు. అంత చిన్నవయసులో తనకి మేము ఎండోస్కోపీ మొదలైన అన్నిరకాల పరీక్షలు చేయించాం. మా అదృష్టం ఏంటంటే రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా వచ్చేవి. పెద్దగా ఆందోళన చెందే సమస్యలేవీ తనకి లేవు. కానీ తను మాత్రం ఆరోగ్యరీత్యా చాలా గడ్డుకాలం అనుభవించింది.

రక్తమార్పిడి, ఆ తరువాత వచ్చే ఇబ్బందులతో తను ఆటలు ఆడుకోవడం మానేసి, పూర్తిగా సంతోషాన్ని మరచిపోయింది. ఆ స్థితిలో తనని చూడలేక రోజూ ఎంత ఏడ్చేవాళ్ళమో మాకు, ఆ బాబాకే తెలుసు. ఇప్పుడిదంతా వ్రాస్తుంటే ఆనాడు మా ఇంట్లో నిశ్శబ్దం తాండవించిన ఆ దారుణమైన పరిస్థితి మదిలో మెదులుతూనే ఉంది. అప్పటికీ మేము చేయగలిగినదంతా చేసాము. ఎవరు ఏ డాక్టరు పేరు చెప్తే ఆ డాక్టరుని సంప్రదించేవాళ్ళం. వాళ్ళు చెప్పిన అన్ని పరీక్షలు చేయించి, వాళ్ళు చెప్పే అన్ని సూచనలు పాటించేవాళ్ళం. కానీ పాప పరిస్థితిలో ఏ మార్పూ వచ్చేది కాదు. చివరిగా డిసెంబర్ నెలలో ఒకరోజు హఠాత్తుగా మావారు, "రేపు మనం శిరిడీ వెళ్తున్నామ"ని చెప్పారు. ఆమాట విని నేను ముందు షాక్ అయ్యాను. ఎందుకంటే పాపని మేమున్న ఫ్లోర్ నుండి క్రిందకి తీసుకుపోడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాము. అలాంటిది తనని తీసుకుని శిరిడీవరకు వెళ్లడమంటే అది పెద్ద సాహసమే అనిపించింది నాకు. కానీ ఎలాగైనా పాపని శిరిడీ తీసుకుని వెళ్లడం చాలా అవసరం అనిపించింది. బాబా దర్శనంతో అయినా తన ఆరోగ్యం కుదుటపడుతుందని మా ఆశ. ఇంటినుండి బయలుదేరేటప్పుడు మేము ఒక్కటే అనుకున్నాం - శిరిడీ నేలపై అడుగుపెడితే చాలు అని. మేము ఎల్లప్పుడూ బాబా నామాన్ని స్మరిస్తూనే ఉంటాం. కానీ, మేమేదో పెద్ద పాపం చేసి ఉంటాం, ఆ కర్మనిలా అనుభవిస్తున్నాం. అంతకంటే ఎక్కువే మేము బాబాకి చేయవలసిన సమయం వచ్చిందని ప్రయాణానికి సిద్ధమయ్యాం. మేము పాప ఉన్న పరిస్థితిలో తనకి ట్రైన్‌లో ప్రయాణం అనుకూలం కాదని హైదరాబాదునుండి శిరిడీకి కారులోనే వెళ్ళాం. బాబా దర్శనం ఒకసారి చేసుకోగలిగాం. కానీ రద్దీ ఎక్కువగా ఉండటంవలన ద్వారకామాయిలోకి అడుగుపెట్టలేక భారమైన మనస్సుతో తిరిగి వచ్చేసాము. ఎందుకో తెలియదుగాని శిరిడీనుండి ఇంటికి చేరేసరికి నామీదనుండి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది.

బాబా దర్శనం చేసుకోవడం చాలా అవసరమనుకుని మేము శిరిడీ వెళ్లిరావడం మంచిదైంది. క్రమంగా పరిస్థితులలో మార్పు మొదలైంది. 2018, జనవరి 14న మేము పాపని వేరే డాక్టరుకి చూపించాం. ఆ డాక్టరు ఇచ్చిన మందులతో నిదానంగా పాప బరువు పెరగడం మొదలైంది. కానీ ఇంకా రక్తమార్పిడి మాత్రం జరుగుతూనే ఉంది. తనకి 'బోన్ మారో' పరీక్షలు, బయాప్సీ కూడా చేసారు. చివరిగా రిపోర్టుల్లో తనకి 'ఐరన్ లోపం' ఉందని తెలిసింది. అందువలనే తను అన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. అది నయం చేయవచ్చని తెలిసి మేము అన్నాళ్ళు పడ్డ బాధనుండి విముక్తి పొందినట్లు అనిపించింది. కానీ అప్పుడు మేము అనుభవించిన బాధ మాత్రం వర్ణనాతీతం. మన తలరాతనెవరూ మార్చలేరు. కానీ బాబా మాతో ఉన్నారని ఈ అనుభవం ద్వారా మాకు తెలియజేసారు. బాబాకి సదా కృతజ్ఞులమై ఉంటాం. మా సమస్య ఇంకా పూర్తిగా తీరిపోలేదని నాకు తెలుసు, తన ఐరన్ లెవెల్స్ పెరిగేవరకు మేము ఈ బాధని అనుభవించాలి. అయినా గాని బాబా మాతో ఉన్నారు, ఆయన మాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారు. బాబాకి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకైతే తెలియటంలేదు. మనస్ఫూర్తిగా ఆయనకి నా ప్రణామాలు.

సరైన సమయంలో సహాయం అందక సమస్యల వలయంలో చిక్కుకుని నలిగిపోయే నాలాంటివారు చాలామందే ఉంటారని నాకు తెలుసు. అందుకే నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నా బాధను మీకు చాలా తక్కువగానే చెప్పాను. నిజానికి మేము అనుభవించిన ఆవేదన మాటల్లో చెప్పలేను. నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, సహాయాన్ని అందించటానికి బాబా ఉన్నారు. కానీ మనమున్న స్థితిలో ఎలా అనిపిస్తుందంటే, బాబా మన మాటలు వినట్లేదని. కానీ అలా అనుకోవడం మన పొరపాటే. నిజానికి ఆయన చెప్పేది మనమే వినలేకపోతున్నాం. నేను చెప్పేది ఒక్కటే, మీరు ఏ స్థితిలో ఉన్నా, సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, వాటినుండి బయటపడటం సాధ్యంకానిపక్షంలో ఒక్కసారి శిరిడీ వెళ్ళిరండి. అది మీకు ఎంతో మేలు చేస్తుంది. కళ్ళముందే మన బిడ్డపడే బాధ చూడడం కంటే దారుణం ఇంకోటి ఉండదు. మేము ఒక సమస్య తరువాత ఇంకో సమస్య అలా మాకు తెలియకుండానే ఒక వలయంలో చిక్కుకునిపోయి ఉన్నాం. కానీ మాకు పట్టిన పీడలన్నీ మేము శిరిడీ వెళ్ళగానే మమ్మల్ని విడిచి పెట్టాయి.

బాబా దయ - క్యాన్సర్ మటుమాయం!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా చెప్తున్నారు..

నాకు, నా భర్తకు బాబాపట్ల ఎంతో భక్తి విశ్వాసాలు. క్రమం తప్పకుండా 'ఓం సాయి మందిరాని'కి వెళ్తూ, బాబాపట్ల అంకితభావంతో ఉండేవాళ్ళం. నేనెప్పుడూ నా భర్తతో(నాకు నేను కూడా) 'నేను బాబాకు ముద్దుబిడ్డన'ని చెప్పుకునేదాన్ని. ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉండేది మా జీవితం. అలాంటిది అనుకోకుండా 2013, నవంబర్ నెలలో బయాప్సీ రిపోర్ట్ ద్వారా నా రొమ్ము భాగంలో తిత్తి(క్యాన్సర్) ఉన్నట్లు నిర్దారించబడింది. అన్ని పరీక్షలు చేసి, ఫిబ్రవరి 2014, 4వ తేదీన తిత్తిని తీసివేయడానికి శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు. ఒక్కసారిగా ప్రతికూలమైన ఆలోచనలు నన్ను చుట్టుముట్టి చాలా భయాందోళనలకు లోనయ్యాను. నాకేదన్నా అయితే నా భర్త, బిడ్డల పరిస్థితి ఏమిటన్న దిగులుతో కన్నీళ్లు ఆగేవి కావు.  నా భర్త నాకు అండగా ఉంటూ ఎంతో ధైర్యం చెప్పేవారు. నేను కూడా "బాబా ముద్దుబిడ్డకు ఎప్పుడైనా సమస్యలు వస్తాయా?" అని మోముపై చిరునవ్వుతో సాధారణంగా ఉండటానికి ప్రయత్నంచేస్తూ ఉండేదాన్ని. కానీ సర్జరీ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ లోలోపల ఆందోళనపడుతూ ఉండేదాన్ని.

సర్జరీకి ఇంకా వారం ఉందనగా ఒకరాత్రి హఠాత్తుగా బాబా నా దగ్గరకు వచ్చి నా నుదుటిమీద చెయ్యిపెట్టి నిలుచున్నట్లు కనిపించింది. తరువాత బాబా నాతో, "ఎందుకంత బాధపడుతున్నావు? కేవలం రెండు టెంకాయలు 'ఓం సాయి మందిరం'లో సమర్పించు! అంతా బాగైపోతుంది" అని చెప్పారు. మరుసటిరోజు నిద్రలేస్తూనే ముందురాత్రి నేను చూసినది గుర్తుకు తెచ్చుకుని నన్ను నేను నమ్మలేకపోయాను. వెంటనే నా భర్తతో అంతా చెప్పాను. తరువాత మేము బాబా చెప్పినట్లే చేసాము. 

సర్జరీ చేయాల్సిన రోజు రానే వచ్చింది. ఆరోజు తెల్లవారుఝామునే మేమిద్దరం ఆసుపత్రికి బయలుదేరాము. ఆసుపత్రికి వెళ్ళేముందు, మా ఇంట్లో ఉన్న చిన్న బాబా విగ్రహాన్ని పూజించి, విభూది నా నుదుట పెట్టుకున్నాను(ఇది నా రోజువారీ అలవాటు). ఆసుపత్రికి వెళ్ళి ఫార్మాలిటీలు పూర్తిచేసిన తరువాత, నర్సు నా భర్తను బయట వేచివుండమని చెప్పి, నన్ను తనతో తీసుకెళ్ళింది. అప్పటికే నేను ఏడుస్తున్నాను. నేను తేరుకునేసరికి ఆపరేషన్ థియేటర్‌లో  స్ట్రెచర్ మీద ఉన్నాను. పక్కనే ఇదివరకు తిత్తిని నిర్ధారించిన బ్రెస్ట్ (రొమ్ము) సర్జన్ ఉన్నారు. ఆయన నన్ను సమాధానపరచడానికి ప్రయత్నిస్తూ నాకు అర్థమయ్యే విధంగా సర్జరీ గురించి వివరించారు.

తరువాత సర్జరీకి ముందు ఆపరేషన్ చేసి తీసివేయాల్సిన తిత్తిని డాక్టర్ మళ్ళీ ఒకసారి పరీక్షగా చూస్తున్నారు. ఆయన ముఖకవళికలనుబట్టి తను ఆశ్చర్యపోతున్నట్లు, నిశ్చేష్టుడైనట్లు నాకు అనిపించింది. ఆయన ఇంకా ఏవో రిపోర్ట్స్ తెప్పించి, వేరే సర్జన్‌ని కూడా పిలిపించి రిపోర్ట్స్‌ను పరిశీలనగా చూస్తున్నారు. ఏమి జరుగుతోందో అర్థంకాక నేను చాలా ఆందోళనపడ్డాను. ఇదిలా ఉంటే నేను ఆ సమయమంతా నా మనస్సులో 'సాయిరాం! సాయిరాం! సాయిరాం!' అన్న ఒక్క పదం స్మరిస్తూనే ఉన్నాను. కొన్నినిమిషాల తరువాత డాక్టర్ నాకు దగ్గరగా వచ్చి చిన్న స్వరంతో, "మిస్సెస్ ------, మేము దీన్ని 'మిలియన్లో ఒక కేసు'గా పరిగణిస్తాము. మీ రొమ్ముభాగంలో ఉండాల్సిన తిత్తి ఇప్పుడు ఎంత మాత్రం లేదు. ఎంత వెతికినా ఏ తిత్తీ కనపడటం లేదు. కాబట్టి మేమింక సర్జరీ చెయ్యాల్సిన అవసరం లేదు!" అని చెప్పారు. ఆ క్షణాన నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మళ్ళీ మా జీవితాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇదంతా బాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా!"

సర్వం శ్రీ సాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు!

సాయి లీలలు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

రాజమండ్రి నుండి సాయిబంధువు వల్లంకొండ మహేశ్వరిగారు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

18 ఏళ్ళ క్రితం జరిగిన అనుభవమిది. మా వీధిలో పది ఇళ్ళు ఉంటాయి. అందులో నాలుగు ఇళ్ళున్న పోర్షన్‌లోని ఒక ఇంటిలో మేము అద్దెకు ఉంటున్నాము. ఒకరోజు నేను హాస్పిటల్‌కి వెళ్లి వస్తున్నాను. నేను మా వీధి మొదట్లో అడుగుపెట్టే సమయానికి కాషాయవస్త్రాలతో సాధువు వేషధారణలో ఉన్న ఒకతను వీధి దాటిపోతూ ఉన్నారు. బహుశా నా చెప్పుల శబ్దానికి ఆయన వెనుకకు తిరిగారు. ఆయన్ని చూడగానే 'ఈయన అచ్చం సాయిబాబాలాగా ఉన్నారు' అని మనసులో అనుకున్నాను. ఆయన నేరుగా మా ఇంటి దగ్గరకు వచ్చి ఆగారు. నేను దగ్గరగా వెళ్ళగానే, "మంచినీళ్లు కావాలమ్మా" అని అడిగారు. నేను ఇంటి లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చిస్తే ఆయన త్రాగారు. తరువాత నేను ఆయనకు పదిరూపాయలు ఇస్తే, "పదకొండు రూపాయలు ఇవ్వమ్మా! ఇలా సరిసంఖ్యలో ఇవ్వకూడదు, ఎప్పుడూ బేసిసంఖ్యలో ఇస్తూ ఉండమ్మా!" అని చెప్తూ, "నేను బాబాగారిని కాదు. నీకు ఆ బాబా కృప చాలా ఉంది" అని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఈ వీధి చివర మనసులో అనుకున్న మాట ఆ చివరవున్న ఆయన ఎలా చెప్పగలిగారు? ఈయన నిజంగా బాబాయే అయుంటారని నాకనిపించింది. పైగా ఆయన ముఖం ఎంతో తేజోవంతంగా ఉంది. మాములు సాధువులలో ఆ తేజస్సు కనిపించదు. మళ్ళీ ఎప్పుడూ ఆయన కనిపించలేదు.

ఇప్పుడు మరో అనుభవం చెప్తాను. మా పాపకి నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటి దగ్గరలో ఉన్న బాబా గుడిలో చాలీసా చదువుతూ ఉన్నారు. మా ఇంటిలో ఒక పుస్తకం ఉంటే తీసుకుని, పాపతో గుడికి వెళ్ళాను. అక్కడ అందరూ శ్రద్ధగా చదువుతూ ఉన్నారు. అప్పట్లో నాకు చాలీసా అంటే ఏమిటో కూడా తెలియదు. వాళ్ళు ఏమి చదువుతున్నారో అర్థంకాక నా దగ్గరున్న పుస్తకంలో అన్ని పేజీలు తిరగేస్తున్నాను. కానీ వాళ్ళు చదివేది ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. అంతలో మా పాప నా చేతిలో ఉన్న పుస్తకం తీసుకొని ఒక పేజీ తెరచి, "ఇదిగోనమ్మా, వాళ్ళు చదువుతుంది ఇదే!" అని నాకిచ్చింది. అప్పడు వాళ్లతో పాటు కలిసి చదివి, బాబాకి నమస్కరించుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక, "పాప చదివేది ఇంగ్లీష్ ఏ,బి,సి,డి లు. తనకి తెలుగు రాదు కదా! మరి ఆ పేజీ ఎలా తెరచి నాకిచ్చింది?" అని సందేహం వచ్చింది. వెంటనే పాపని పిలిచి, "అమ్మా! సరిగ్గా ఆ పేజీ తీసి ఇచ్చావు కదా, నీకెలా తెలిసింది?" అని అడిగితే, "నేనా! నేనెప్పుడు ఇచ్చానమ్మా?" అని అంది. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. అలా బాబాయే నాచేత చాలీసా పారాయణ చేయించారు. ఇది బాబా నాకిచ్చిన రెండో అద్భుత నిదర్శనం.

పల్లకి సేవనిచ్చి నా మనసులోని బాధను తీసేసారు బాబా.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువు నిరుపమ గారు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

సాయిబంధువులందరికీ నమస్కారం.

2018 డిసెంబర్ 13 గురువారంనాడు పల్లకీ సేవ చేసుకునే అవకాశం బాబా నాకు ఇచ్చారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

ఆరోజు నేను నా స్వంతపనిమీద ఒక నగరానికి వెళ్ళాల్సి వచ్చింది. నా పని పూర్తైన తరువాత ఆ ఊరిలోని నాకెంతో ఇష్టమైన బాబా మందిరాలన్నీ చూసి, బెంగుళూరు తిరిగి వద్దామనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక సమస్య రావడంతో, అదేరోజు అక్కడినుండి బళ్ళారి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ఆ ఊరిలోని నాకిష్టమైన బాబా మందిరాలకు వెళ్ళలేక చాలా బాధపడి, కనీసం బళ్ళారిలోనైనా సాయంత్రం ఆరతి సమయానికి బాబా మందిరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.

నేనెప్పుడు బళ్ళారి వెళ్ళినా అక్కడ MG బాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. కొన్ని కారణాలరీత్యా నేను ఆరతి సమయానికి మందిరం చేరుకోలేకపోయాను. కాస్త ఆలస్యంగా మందిరం చేరుకుని, దర్శనానికి క్యూలో నిలుచున్నాను. అక్కడ కొందరు భక్తులు పల్లకీని అందంగా అలంకరిస్తూ ఉన్నారు. అక్కడ పూజారిగారు నాకు తెలుసు. అయన నన్ను చూసి, "15 నిముషాల సమయం ఉంటే, పల్లకీ దగ్గర వేచి ఉండమ"ని చెప్పారు. నేను కనుక వేచి ఉంటే ఆయన నా పేరు మీద అర్చన చేయాలనుకుంటున్నారని నాకనిపించి, నాకు కూడా వేరే పనులేమీ లేనందువల్ల 'సరే, ఉంటాన'ని చెప్పి పల్లకీ ప్రక్కగా వెళ్లి కూర్చున్నాను. కొద్దిసేపటికి ఆయన నా దగ్గరకి వచ్చి కొన్ని గులాబీపువ్వులు, ఒక అరటిపండు నా చేతిలో పెట్టి, "బాబాతో మాట్లాడుతూ ఉండమ్మా, నేను కొద్దిసేపట్లో వస్తాన"ని చెప్పి వెళ్ళిపోయారు. కొన్నినిమిషాల తరువాత ఆయన వచ్చి పల్లకీలో బాబాకి పూజ చేసి, ఆరతి ఇచ్చారు. తరువాత కొద్దిమంది భక్తులు పల్లకీని తమ భుజాలపైకి ఎత్తుకుని పల్లకీసేవ మొదలుపెట్టారు. నేను కూడా వాళ్లతో కలిసి బయలుదేరాను. నేను పల్లకీ చివరికొన పట్టుకుని, భక్తులందరితో భజన పాటలు పాడుతూ ముందుకుసాగుతూ ఉన్నాను. కొంతసేపటికి హఠాత్తుగా నా ముందు పల్లకీ మోస్తున్న వ్యక్తి నన్ను "పల్లకీ మోయాలనుకుంటున్నారా?" అని అడిగారు. ఆ మాట వింటూనే నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే 'అవున'ని చెప్పి అతని వద్దనుండి పల్లకీ అందుకున్నాను. నా సంతోషానికి అవధులు లేవు. ఆ ఆనందాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు. నేను కొంచెంసేపు పల్లకీ మోసి తరువాత వేరే మహిళకి అవకాశమిచ్చి, నేను మళ్ళీ పల్లకీ చివరికొన పట్టుకుని నడిచాను. పల్లకీసేవ పూర్తయ్యేవరకు ఉండి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఇష్టమైన బాబా మందిరాలకి వెళ్ళలేకపోయానని మనసులోనే నేను పడ్డ బాధను బాబా తమ పల్లకీసేవతో తీసేసారు. ఆ ఆనందాన్ని ఎప్పటికీ మరువలేను. తరువాత డిసెంబర్ 16న ఆరోజు పూజారిగారు ఇచ్చిన రోజాపువ్వు రెక్కలని చూస్తుంటే అందులో బాబా దర్శనం ఇచ్చారు. బాబా రూపాన్ని చూసి ఆనందాన్ని పట్టలేకపోయాను.

మనసులో ఉన్న నెలసరి 'అడ్డంకి'ని తొలగించిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

శ్రీసాయిబాబా తమ లీలల ద్వారా, ఆచరణ రూపంలో, చిన్న చిన్న కథల రూపంలో, సూత్రప్రాయమైన అలతి అలతి మాటలతో మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలు ప్రబోధించారు. అది వారి పద్దతి. అలా బాబా సూక్తులు రూపంలో సంక్షిప్తంగా చెప్పిన ఆధ్యాత్మిక సూత్రాలను, భగవాన్ శ్రీరమణమహర్షి వంటి పరిపూర్ణ జ్ఞానుల వివరణత్మకమైన బోధనల వెలుగులో వ్యాఖ్యానించుకొని సమన్వయం చేసుకుంటే - శ్రీసాయి బోధ ఇంకా సుబోధకమవుతుంది(సాయిపథం ప్రధమ సంపుటం).

ఈరోజు భక్తురాలి అనుభవం చదివేముందు ఈక్రింది భగవాన్ స్మృతులు పుస్తకంలోని సంపూర్ణమ్మ గారి అనుభవం చదవండి. ఆమె ఇలా చెప్తున్నారు.

ఆ రోజుల్లో ఆశ్రమంలో పనిచేసే ఆడవాళ్లం బైట వున్నప్పుడు ఆశ్రమంలో భోజనం చెయ్యం. ఆ వంటని అసలు తినం. ఎక్కడో ఎవరింట్లోనో ఏర్పాటు చేసుకునేవాళ్ళం. ఒకసారి నాకెక్కడా ఏర్పాటు కాలేదు. అందుకని ఆశ్రమం ముందున్న ముష్టివాళ్ళ మంటపంలో కూచున్నాను. తిండిలేదు. ఆశ్రమంనుంచి భోజనం పెట్టరు.

భగవాన్(రమణ మహర్షి) ఆవాళ ఎందుకు అడిగారో - ‘సంపూర్నం ఏది?' అని అడిగారట. వాళ్ళు విషయం చెప్పారు. ఆమెకి భోజనం పెట్టండి అన్నారట భగవాన్.
ఎదురు చెప్పలేక, “ఆ మండపంలో కూచుని వుంది. అన్నం తీసుకుపోయి పెడతాం" అన్నారు.
“ఆ మండపంలో ఏం ఖర్మ! రమ్మనండి” అన్నారు భగవాన్.
“మరి భగవాన్, బైటవుంది అది.”
“వుంటేనే? అంతా బ్రహ్మం! ముట్టేమిటి? రమ్మనండి.”
అట్లా భగవాన్ చెప్పినా, వాళ్ళకి మనసొప్పదు. సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పినా, ఆచారాల్ని వొదులుకోరు. ఇంక గతిలేక నన్ను లోపలికి పిలిచారు. భగవాన్ వంటింటి వేపు వెడుతున్నారు.
"అక్కర్లేదు భగవాన్! మేము వడ్డిస్తాం.”
సరిగా వాళ్ళు పెడతారో లేదో అని భగవాన్ అక్కడే నుంచున్నారు, తనకి పట్టింపు లేకపోతే వాళ్ళకీ పట్టింపు ఉండనక్కర్లేదని వాళ్ళు తెలుసుకోవాలని. కాని, ఏం లాభం? ఆయన వీపు తిప్పగానే నా వల్ల అంత అనాచారం జరిగిందని పెద్దలందరికీ కోపాలు వొచ్చాయి నా మీద.

అంతే మనుషులు!

మనసులో ఉన్న నెలసరి 'అడ్డంకి'ని తొలగించిన బాబా

ఇక ఈరోజు అనుభవానికి వస్తే, పేరు వెల్లడించని ఒక సాయిబంధువు తనకుండే దిగులుకు బాబా ఎలా పరిష్కారం చూపారో ఇలా తెలియజేస్తున్నారు..

నాకెప్పుడూ ఒక దిగులుండేది, "ఆడవారికి నెలసరి ఉండకుండా ఉంటే బాబాని ప్రతిరోజూ పూజించుకోవచ్చు కదా!" అని. ఎప్పుడైనా బాబా ప్రత్యక్షమై, "నీకేం వరం కావాలి?" అని నన్నడిగితే, "నెలసరి అడ్డంకులు లేకుండా ప్రతిరోజూ మనసారా మీ పూజ చేసుకునే వరమివ్వండి బాబా!" అని అడగాలని అప్పుడప్పుడు అనుకునేదాన్ని. మన హృదయవాసి అయిన సాయికి మన మనసులోని అలోచనలన్నీ తెలుసుకదా! నా దిగులుకి ఆయనెలా పరిష్కారం చూపారో ఇప్పుడు నా అనుభవం ద్వారా పంచుకుంటాను.

2017 క్రిస్మస్ సెలవుల్లో శిరిడీ వెళదామని మా కుటుంబసభ్యులందరికీ మా తమ్ముడు టికెట్స్ బుక్ చేసాడు. కానీ ఆ సమయానికి శిరిడీలో రూమ్స్ దొరకని కారణంగా ఆ టికెట్స్ కాన్సిల్ చేసి మళ్ళీ 2018 జనవరి 26కి టికెట్స్ బుక్ చేసాడు. ఎంతో సంతోషంగా అందరం శిరిడీ చేరుకుని బాబా దర్శనం చేసుకున్నాము. ఆ దర్శనానందంలో కాసేపైనా గడపకముందే హఠాత్తుగా నాకు నెలసరి వచ్చేసింది! నిజానికి అది నా నెలసరి సమయం కాకపోయినప్పటికీ నన్ను ఆ సమస్య చుట్టుముట్టింది. ఇక నా బాధ చెప్పనలవి కాదు. మాములుగానే ఆ సమయంలో పూజ చేయలేకపోతున్నందుకు బాధపడే నేను, ఇక శిరిడీ క్షేత్రంలో, బాబా సన్నిధిలో అలా జరగడంతో ఇంకా క్రుంగిపోయాను. ఈ విషయం చెపితే మా వాళ్లు కూడా ఇబ్బందిపడతారు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఇష్టపడక వాళ్ళ టైం కూడా శిరిడీలో వృధా చేసుకుంటారు. నావలన అలా జరగడం నాకిష్టం లేదు. అందువలన ఎవరికీ చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో చెప్పమని నాకు తెలిసిన ఇద్దరు సాయిబంధువులని అడగాలనిపించింది కానీ, ఆడవారి సమస్య గురించి ఎలా వాళ్లతో మాట్లాడాలో అర్థంకాక ఊరుకున్నాను. నేను ఒకటే అనుకున్నాను, "బాబా! దీనిలో నా తప్పేముంది? నేనేదీ కావాలని చేయలేదు. నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించండి. భారం మీ మీదే వేస్తున్నాను. ఈ పరిస్థితిలో మీరే నాకు దారి చూపండి" అని. కానీ మనస్సు స్థిమితంగా ఉంటుందా? అదే ఆలోచనతో నాలో నేను బాధపడుతూనే ఉన్నాను. మరుసటిరోజు కాకడఆరతికి మేము టికెట్స్ బుక్ చేసి ఉన్నాము. తెల్లవారి 3.30కి లేవాలంటూ మా వాళ్ళందరూ నిద్రపోయారు. నేను మాత్రం ఏమి చేయాలో అర్థంకాక దిగులుపడుతూనే ఉన్నాను. ఈలోగా నాకు తెలిసిన పెద్దాయన ఫోన్ చేసారు. అసలు నేనే ఆయన్ని అడుగుదామని ఊరకుండిపోయాను. అలాంటిది నాకు సమాధానం చెప్పించడానికా అన్నట్లు బాబాయే ఆయనతో ఫోన్ చేయించారేమో! నేను ఆయనతో కాసేపు మాట్లాడిన తరువాత నాకొచ్చిన సమస్య గురించి చెప్పి, "ఇప్పుడేమి చేయమంటారు? నాకేమీ అర్థం కావడంలేదు" అని అడిగాను. అందుకు ఆయన, "అమ్మా! బాబా వంటి మహాత్ముల విషయంలో ఇలాంటి శంక అవసరంలేదు. మహాత్ములు వీటిని పట్టించుకోరు. వాళ్ళు చూసేది మన మనో పవిత్రతనే. నీవు నిర్భయంగా ఆయన దర్శనానికి వెళ్లొచ్చు" అని చెప్పారు. "బాబాయే తన మార్గంలో ఉన్న అంతటి పెద్దాయనతో చెప్పించారేమో!" అని నా మనసుకు అనిపించినా, నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను. అందరూ పడుకున్నా, మనసునిండా దిగులుతో నాకు మాత్రం నిద్రపట్టలేదు. 12 దాటింది, ఒంటిగంట దాటింది, రెండు కూడా దాటింది, ఐనా కూడా నాకు నిద్ర రాలేదు. చివరికి గం.2:50 నిమిషాలు కూడా దాటింది. ఆ తరువాత నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. సరిగ్గా గం.3:30ని. సమయంలో అనుకుంటా నాకొక కల వచ్చింది. కలలో మా పెదనాన్నగారు, "ఆరతికి సమయం అవుతుంది చూడు.. చూడు.." అంటూ నన్ను లేపుతున్నారు. వెంటనే నాకు మెలకువ వచ్చి చూస్తే సమయం గం. 3.40ని. అవుతోంది. బాబాయే ఆరతికి రమ్మని పిలుస్తున్నారని నాకు అనిపించింది. వెంటనే అందరినీ లేపితే అందరూ స్నానాలు చేసారు. నేను కూడా తలంటుస్నానం చేసి వాళ్లతోపాటు కాకడఆరతికి వెళ్ళి ప్రశాంతంగా, తృప్తిగా బాబా దర్శనం చేసుకున్నాను.

తరువాతరోజు మధ్యాహ్నఆరతి సమయానికి ద్వారకామాయి వద్దకు నేను, మా చెల్లి వెళ్ళాము. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. మా చెల్లి లోపలకి వెళదామని అంది. నాకేమో మళ్ళీ మనస్సులో అలజడి మొదలైంది. సమాధిమందిరంలోకి బాబా పిలిచారు గాని, ద్వారకామాయిలోకి ఎలా వెళ్ళేది? "నీకు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మశీదుతల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగుతాయి" అని బాబా ఒక సందర్భంలో ద్వారకామాయిని తల్లితో పోల్చుతారు. మరి అంతటి పవిత్రమైన ప్రదేశంలోకి నా ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళాలి? - అన్నది నా సంశయం. ఈ సంశయం వలన "అంత పెద్ద క్యూ ఉంది. లోపలికి వద్దులే, ఈ షాప్స్ దగ్గరే ఉండి టివిలో ఆరతి చూస్తూ ఉందాం" అన్నాను. ఇక్కడ కూడా బాబా, 'నాకటువంటి పట్టింపులు లేవు' అన్నట్లుగా అంతలోనే అంత పెద్ద క్యూలో పది, పదిహేనుమంది మాత్రమే మిగిలారు. ఇంతలోనే అంత క్యూ ఎలా తరిగిపోయిందని నేను ఆశ్చర్యపోయాను. ఇక మా చెల్లి 'పద అక్కా' అంటూ నన్ను బలవంతంగా లాక్కుపోయింది. నేనింక చేసేదేమీ లేక తనతో పాటు లైన్‌లోకి వెళ్ళాను. అప్పటికే ఆరతి ప్రారంభమైంది. లైన్‌లో ఉన్నానే గానీ మనసులో 'వెళ్ళొచ్చా' అని ఇబ్బంది పడుతూనే ఉన్నాను. లైన్ కదులుతూ సరిగ్గా ఇటు ధునికి అటు బాబా పటానికి మధ్యలోకి నేను చేరుకునేసరికి దాదాపు పది నిమిషాలపాటు లైన్ నిలిపేసారు. అక్కడే నిలుచుని బాబాను చూస్తూ ఆరతి పాడుకున్నాను. "తల్లిలాంటి ద్వారకామాయిలోకి పోవాలా, వద్దా?" అని సంశయపడ్డ నన్ను పరమపవిత్రమైన ధునికి, తమకి మధ్య నిల్చోబెట్టి నా సంశయాన్ని తీర్చేసారు బాబా. "బాబా! ఇంతకంటే మీ బిడ్డలమైన మాకు ఏమి కావాలి? ఎన్నాళ్ళనుండో ఉన్న నా బాధని తీర్చేసారు. ధన్యవాదాలు బాబా!" అనుకున్నాను.

తరువాత జరిగిన ఈ  సంఘటనలన్నీ ఆ రాత్రి నాకు ఫోన్ చేసిన పెద్దాయనకు చెప్పి, "బాబా అనుమతి లేకుండా ఏమీ జరగదు కదా! నేను చేసింది కరెక్టే అంటారా సార్?" అని అడిగాను. ఆయన "మంచి అనుభవం, చాలా బాగుందమ్మా! మీ పెద్దనాన్నగారి రూపంలో బాబాయే మిమ్మల్ని లేపి, ఆరతికి అనుమతి ప్రసాదించారు. కారణం, బాబాకు అటువంటి పట్టింపులు లేవు" అని చెప్పి, "మీ పెద్దనాన్నగారు ఎక్కడుంటారు?" అని అడిగారు. నేను, "వారు చనిపోయి సంవత్సరం అయింది సార్" అని చెప్పాను. అప్పుడాయన, "ఇంక సందేహమే లేదు, ఆయన రూపంలోనే బాబా వచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఆరతికి రప్పించుకున్నారమ్మా" అన్నారు.

అయితే మనం మామూలు మనుషులం కదా! మనసు అంత త్వరగా సమాధానపడుతుందా? నాకున్న దిగులుకు, అవకాశమే లేని సమయంలో నాకా సమస్యను సృష్టించి, నా సంశయాలు తొలగించి, అంతగొప్ప అనుభవమిస్తే, ఇంటికి వచ్చాక మళ్ళీ అదే ఆందోళనలో పడ్డాను. ఆ సమయంలో పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ చెప్పిన దిగువ వాక్యాల ద్వారా బాబా మళ్ళీ నా దిగులును కూకటివ్రేళ్ళతో సహా తీసేసారు.

"బాబా మన కోరికలను నెరవేరుస్తూ, ఆ అనుభవంవలన మన స్వభావం సరైన పంథాలో ప్రభావమయ్యేలా చేసి మనలో కావలసిన పరివర్తన తీసుకువస్తారు". 

"ఒకసారి తన కోరిక తీరి భక్తునికి ఆ అనుభవం తన సద్గురువు ద్వారా వచ్చిందని తెలిసాక వారిద్దరి మధ్యనుండే ప్రేమానుబంధం భక్తునిలో పరివర్తనకు దారితీస్తుంది. ఇక్కడ లక్ష్యం ఆ కోరిక తీరడం కాదు, పరివర్తన". 
- శ్రీబాబూజీ (శరశ్చంద్రికలు)

ఆ వాక్యాలు చదివాక, గురువుగారు చెప్పినట్లు నాలో పరివర్తన రాకపోతే బాబా ఇచ్చిన అనుభవానికే అర్థం లేకుండా పోతుంది. అలా జరగకూడదని ఆ క్షణంనుండి నేను ఏ సందేహమూ లేకుండా ఆ సమయంలో కూడా ప్రశాంతంగా, సంతోషంగా బాబా పూజ చేసుకుంటున్నాను. ఇలా నాకు బాబా గొప్ప అనుభవాన్నిచ్చి నా బాధను తీర్చేసారు. "ఇన్నాళ్ల నా బాధను తీర్చి మానసిక ప్రశాంతతనిచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

సాయిభక్తుడు అబాసాహెబ్ - యముడైనా బాబా ఆజ్ఞను శిరసావహిస్తాడు ...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
శ్రద్ధ  -  సబూరి

కృష్ణాజీబ్రహ్మ అలియాస్ అబాసాహెబ్ బాబాకి అంకిత భక్తుడు. అతడు అహ్మద్‌నగర్‌లో నివసిస్తుండేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు. కొడుకు లక్ష్మణ్, కూతురు రుక్మిణి. అబాసాహెబ్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తూ అదృష్టవశాత్తు బాబాను అనేకసార్లు దర్శించుకున్నాడు. అతనే కాదు, అతని కుటుంబమంతా బాబాను ఆరాధిస్తూ తరచూ బాబా దర్శనానికి వెళ్తుండేవారు. బాబా వారికి ఊదీ పెట్టి ఆశీర్వదిస్తుండేవారు. అబాసాహెబ్ తన ఉద్యోగవిరమణ అనంతరం కొడుకు ‌‌లక్ష్మణ్‌తో కలిసి బాడ్‌గాఁవ్‌లో నివసించేవాడు. కూతురు రుక్మిణి పెళ్ళైన తరువాత భర్త మల్హారిబెంద్రేతో అమలనేరులో నివసిస్తుండేది. మల్హారి అక్కడి మునిసిపల్ కార్పోరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండేవాడు.

కొంతకాలం తరువాత లక్ష్మణ్‌కి అమలనేరుకు బదిలీ కావడంతో కొడుకుతోపాటు అబాసాహెబ్ తన కూతురి ఇంటికి దగ్గరలోనే నివసించనారంభించాడు. అబాసాహెబ్ ప్రతిరోజు వేకువఝామునే లేచి, స్నానంచేసి, భక్తితో పూజ చేసుకునేవాడు. తరువాత టిఫిన్ చేసి గ్రంథాలయానికి వెళ్తూ దారిలో రుక్మిణి ఇంటికి వెళ్ళేవాడు. రెండునెలల తరువాత ఒకరోజు అతను రుక్మిణి ఇంటికి వెళ్ళలేదు. మరుసటిరోజు కూడా తన తండ్రి రాకపోవడంతో రుక్మిణి కంగారుపడి తండ్రిని కలవడానికి వెళ్ళింది.

ఆ సమయంలో అబాసాహెబ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అతని భార్య చల్లని గుడ్డతో అతని ఒళ్ళు తుడుస్తోంది. అబాసాహెబ్ తన కూతురివైపు ప్రేమగా చూస్తూ తన కళ్ళలో నీళ్ళు నిండిపోగా, "ఈ అనారోగ్యంనుండి తిరిగి కోలుకుంటానని నాకు నమ్మకం లేదు" అన్నాడు. రుక్మిణి తండ్రిని ఓదారుస్తూ, "నాన్నా! మీరేమీ దిగులుపడకండి. నా భర్త మంచి డాక్టరుని తీసుకొచ్చి మీకు వైద్యం చేయిస్తారు. మీరు త్వరలోనే కోలుకుంటారు" అని చెప్పింది. అంతలోనే వైద్యుడిని కూడా తీసుకొచ్చారు. వైద్యుడు అబాసాహెబ్‌ను పరీక్షించి ఇంజక్షన్ వేసి, ద్రవపదార్థాలు మాత్రమే సేవిస్తూ విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. తీవ్రమైన జ్వరం ఎనిమిదిరోజులు కొనసాగింది. రోజూ వైద్యుడు ఇంజక్షన్ చేస్తున్నా జ్వరం ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. చివరికి ఆ జ్వరప్రభావం వల్ల అబాసాహెబ్ మాట కోల్పోయాడు. అతను మంచానపడినప్పటినుండి అతని కొడుకు, అల్లుడు అతని దగ్గరే కనిపెట్టుకుని ఉంటున్నారు.

9వ రోజున అబాసాహెబ్ పరిస్థితి మరింత విషమించింది. ఆరోజు అర్థరాత్రి సమయంలో ఉన్నట్టుండి అబాసాహెబ్ వింతగా, గట్టిగా అరిచాడు. అరగంట తరువాత మళ్ళీ అలాగే అరిచాడు. దానితో కుటుంబసభ్యులు అతనికి నిద్రమందు ఇచ్చారు. కానీ ఆ రాత్రంతా అతడు ప్రశాంతంగా నిద్రపోకుండా కలతగానే ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన రెండురోజుల తరువాత జ్వరం తగ్గడం మొదలుపెట్టి, సాధారణస్థితికి వచ్చింది. అబాసాహెబ్ సైగలు చేస్తూ తానేదో వ్రాయాలనుకుంటున్నట్లుగా కుటుంబసభ్యులకు తెలియజేశాడు. అతని కొడుకు, అల్లుడు సహాయం చేసి అతన్ని కూర్చోబెట్టి, పలక, బలపం చేతికిచ్చారు. అప్పుడతను ఇలా వ్రాశాడు: "సాయిబాబా నా మంచం చివరన ఉండి, నన్ను కాపాడుతున్నారు. నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చిన నలుగురు భయంకరమైన వ్యక్తులను చూసి నేను ఆరోజు రాత్రి కేకలు వేశాను. వాళ్ళు బాబాతో, "మీరు మంచం దగ్గరనుంచి ప్రక్కకు తొలగితే, మేము అతన్ని తీసుకుని వెళ్తాము" అని చెప్పారు. అప్పుడు బాబా సట్కా ఊపుతూ వాళ్ళను బెదిరించారు. మరుక్షణం చాలా కుక్కలు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఆ నలుగురు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కణ్ణించి పారిపోయారు. తరువాత మృత్యుదేవత అయిన యముడు వచ్చాడు. అతడు తన అనుచరులకంటే అతిభయంకరంగా ఉన్నాడు. అతన్ని చూసి భయంతో నేను మళ్ళీ గట్టిగా అరిచాను. అతను చాలా కోపంగా ఉన్నాడు. అతని కనులు ఎర్రని నిప్పుకణాల్లా ఉన్నాయి. ఎప్పుడైతే అతడు బాబాని చూశాడో, కాస్త శాంతించాడు. బాబా నన్ను చూపిస్తూ ఎంతో శాంతంగా, "ఇతను నా అంకిత భక్తుడు, నేను ఇతని గురువుని. అతన్ని ఇంకా కొంతకాలం ఉండనివ్వు. అతని ద్వారా నా పనిని ఇంకొంతకాలం కొనసాగించాలి" అని అన్నారు. అప్పుడు యముడు, "సరే, మీ ఆజ్ఞ! అతన్ని ఎప్పుడు తీసుకునిపోవాలనేది తెలియజేయండి. మీ అనుమతి కోసం వేచి, తదనుగుణంగా చేస్తాను" అని చెప్పి బాబాకు నమస్కరించి వెళ్ళిపోయాడు". అబాసాహెబ్ వ్రాసినదంతా చదివిన తరువాత, ఆరోజు అర్థరాత్రి అతనంత గట్టిగా ఎందుకు అరిచాడో అందరికీ అర్థమైంది. బాబా చూపిన కరుణకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ మనస్ఫూర్తిగా బాబాకు నమస్కరించుకున్నారు. ఆ తరువాత కొన్నిరోజులకు అబాసాహెబ్ పూర్తిగా కోలుకున్నాడు.

మూలం: సాయి ప్రసాద్ పత్రిక, దీపావళి సంచిక 1993.

కల ద్వారా కష్టాల కడలిలో నుంచి ఒడ్డునపడేసిన బాబా




సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు వై.శ్రీనివాసరావు. మాడు గుంటూరు. అది 1995-96 సంవత్సరం. అప్పటికి నాకు వివాహమై సుమారు 2 సంవత్సరాలై ఉంటుంది. మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆ ఇబ్బందులను తొలగించమని బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను, నా భార్య మా అక్కగారింటికి గుంటూరు వెళ్ళాము. ఆరోజు రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను  పెద్ద నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ నన్ను కాపాడమని పెద్దగా కేకలు వేస్తున్నాను. అప్పుడొక పండుముసలివ్యక్తి ఆ ప్రవాహంలో ఈదుకుంటూ నా వద్దకు వచ్చి, "నీకు నేనున్నాను. నీకు ఏమీ కాదు" అని నన్ను తన భుజాలపై మోస్తూ ఒడ్డుకు తీసుకునివచ్చాడు. అంతే, అక్కడితో కల ముగిసింది. నేను పెద్దగా కేకలుపెడుతూ మేలుకున్నాను. ఆరోజునుండి నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. మా అప్పులు అన్నీ తీరిపోయి పొలము కూడా కొన్నాము. నా భార్యకు ఉద్యోగం కూడా వచ్చింది. అప్పటినుండి మా  బాధలన్నీ తీరిపోయి కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉంటున్నాము. ఇప్పుడు నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఒకరు ఇంజినీర్, ఒకరు డాక్టర్. నాకొచ్చిన కల ద్వారా కష్టాలకడలివంటి ఈ జీవితమనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న నన్ను, నేను నమ్మిన బాబా కాపాడి, నా కష్టాలన్నీ తీర్చి, నా కుటుంబం సంతోషంగా ఉండటానికి సహాయం చేసారు. బాబా తనను నమ్మిన వారెవరూ ఎటువంటి బాధలు పడకుండా సంతోషంగా ఉండేటట్లు చూస్తారు. కనుక అందరం బాబాను నిత్యం స్మరించుకుందాం.

సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

సచ్చరిత్ర చదువుతూ ఉండండి... మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

2018 డిసెంబర్ 22న ఒక సాయిబంధువు తన అనుభవాన్ని మెయిల్ ద్వారా ఇలా పంచుకున్నారు..

నేను 27 ఏళ్లగా బాబా భక్తురాలిని. 2018 జులైలో అనుకోకుండా మీ 'సాయి మహారాజ్ సన్నిధి' ఫేస్‌బుక్ పేజీని చూశాను. అదే సమయంలో నా సహోద్యోగి ద్వారా శిరిడీనుండి బాబా ఫోటో కూడా వచ్చింది. మీ ఫేస్‌బుక్ పేజీ ద్వారా సచ్చరిత్ర గురించి తెలుసుకుని చదవడం మొదలుపెట్టాను. సచ్చరిత్ర చదవడంవలన జులై నుండి నాకు బాబాతో అనుబంధం ఇంకా ఇంకా దృఢపడింది. ఆయనపట్ల భక్తి విశ్వాసాలు బాగా అభివృద్ధి చెందాయి. అందులోని ప్రతి వాక్యం సత్యమైనది. ఆ వాక్యాలు ప్రతి ఒక్కరికీ తమ దైనందిన జీవితంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సచ్చరిత్ర నా మనసుకెంతో ప్రశాంతత చేకూర్చింది.

గతవారం మా నాన్నగారి వెన్నెముకకి శస్త్రచికిత్స జరిగింది. దాని ప్రభావం వలన ఆయన కుడికాలి పాదానికి బలహీనత ఏర్పడింది. అందువలన ఆయన నడవడం కష్టమైన పని. దానితో కుటుంబంలో నేను తప్ప అందరూ ఏడవటం మొదలుపెట్టారు. నాకు బాబాపై పూర్తి విశ్వాసం ఉంది, ఆయన నాన్నని ఈ సమస్యనుండి బయటపడేస్తారని. "నెలలోగా నాన్న కోలుకుంటారు. బాధపడకండ"ని అందరికీ ధైర్యం చెప్పాను. అదే సమయంలో మీ ఫేస్‌బుక్ పేజీలో ఆరోగ్యసమస్యలకు సంబంధించిన సాయిభక్తుల అనుభవాలు షేర్ చేసారు. అది నాకు బాబానుంచి వచ్చిన మంచిసంకేతంగా అనిపించింది. బాబాపై నాకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ, మొన్న నాన్న ఒకరి సహాయంతో నడిచే ప్రయత్నం చేసారు. ఈరోజు స్వంతంగా కూడా నడవడానికి ప్రయత్నిస్తున్నారు. "బాబా! చాలా చాలా కృతజ్ఞతలు మీకు". బాబాపై విశ్వాసం కలిగివుండండి. సచ్చరిత్రను చదువుతూ ఉండండి. అది ప్రశాంతతను చేకూర్చడమే కాదు, మన వ్యక్తిత్వాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్ది ఉన్నతస్థానంలో నిలుపుతుంది.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo