సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 591వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. చాలా సహాయం చేసిన బాబా
  2. బాబా లీలలు అలానే ఉంటాయి

చాలా సహాయం చేసిన బాబా

ముందుగా ఈ బ్లాగులోని బాబా లీలలను చదువుతున్న తోటి సాయిభక్తులకు నా ధన్యవాదాలు. నా పేరు శ్రీకాంత్. మాది ఒంగోలు దగ్గర కొప్పోలు గ్రామం. 2020, అక్టోబరు 6వ తేదీన మా నాన్నకి తీవ్రమైన తలనొప్పితో పాటు లో-ఫీవర్ కూడా వచ్చింది. అప్పుడున్న పరిస్థితుల్లో తనకు కరోనా సోకిందేమోనని చాలా భయపడ్డాము. అప్పటికప్పుడు నాన్నని మా ఊరిలో ఉన్న ఆర్.ఎం.పి. డాక్టరుకి చూపించాము. ఆయన నాన్నని పరీక్షించి, “కాలికి బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది, అందువల్లనే ఇలా జ్వరం వస్తోంది” అన్నారు. మా నాన్నని అడిగితే, “ఆ గాయం ఎప్పుడో తగిలింది, అది చిన్నదే అనుకున్నాను” అన్నారు. అలా చిన్నది అనుకున్న గాయం వల్లనే ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైంది. ఇంక నేను ఆరోజు నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, “ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, ఇంకా కొన్నిరోజులు ఆలస్యమైతే కాలు అంతవరకు తీసేయాల్సి వచ్చేది” అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. సర్జరీ చేసే సమయానికి నాన్నకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై, ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోవటం ప్రారంభమైంది. “ఈ పరిస్థితిలో ఇక్కడ సర్జరీ చేయటం చాలా కష్టం. పెద్ద హాస్పిటల్లో ఎక్కువ మిషనరీ ఉంటుంది, మీ నాన్నని అక్కడికి తీసుకువెళ్ళండి” అన్నారు డాక్టర్లు. అందువల్ల అప్పటికప్పుడు నాన్నని కిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. అక్కడ అన్ని పరీక్షలు చేసి సర్జరీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడా అదే సమస్య పునరావృతమైంది. అందువల్ల తప్పనిసరై కాలు వరకు మత్తు ఇచ్చి చిన్న సర్జరీ చేశారు. కానీ అప్పటికే ఇన్ఫెక్షన్ రక్తంలో కలిసిపోయి ఊపిరితిత్తులకి చేరింది. Co2 డైవర్ట్ అయింది. దానిని క్లియర్ చేద్దామని ఆక్సిజన్తో ప్రయత్నించినా అది బైటికి రాలేదు. అప్పుడు రెండవ ప్రయత్నంగా వెంటిలేటర్ మాస్కుతో ఎక్కువగా ఆక్సిజన్ పెట్టారు. ఒక రోజంతా గడిచినా Co2 క్లియర్ అవలేదు. ఇంక చివరి ప్రయత్నంగా నాన్నని నేరుగా వెంటిలేటర్ మీదకి పంపించారు. మా నాన్న కాస్త బరువు ఎక్కువగా ఉంటారు. అందువల్ల డాక్టర్లు నాన్న కోలుకోవటం కష్టమని చెప్పారు. ఇంక నేను బాబాకు నమస్కరించి, “బాబా! మీరు ఏమి చేస్తారో ఏమో నాకు తెలియదు. నాన్న కోలుకోవాలి” అని ఆర్తిగా బాబాను వేడుకుని, బాబా నామజపం చేస్తూ ఉన్నాను. మరుసటిరోజు ఉదయానికి వెంటిలేటర్ పైన ఉన్నప్పటికీ నాన్న కళ్ళు తెరచి చూసి అందరినీ గుర్తుపట్టసాగారు. అది చూసి బాబా మిరాకిల్ చేస్తున్నారని అనుకున్నాము. అయినప్పటికీ ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంది. “ఏంటి బాబా, ఇంకా మమ్మల్ని పరీక్షిస్తున్నారా? మీ అనుగ్రహంతో నాన్న కోలుకోవాలి” అని బాబాకు చెప్పుకున్నాను. బాబాకు చెప్పుకున్నప్పటినుంచి ఇన్ఫెక్షన్ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇంక 12వ తేదీ రాత్రి నాన్నకి సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేశారు. డాక్టర్లు మా నాన్న కోలుకోవటం కష్టమని చెప్పేసరికి 24వ తేదీన జరుపుకోవాలనుకున్న మా క్రొత్త ఇంటి గుణార్ధన(శంకుస్థాపన)ను ఆరోజు రాత్రే జరుపుకున్నాము. ఆ సమయంలో కోరుకోగానే వర్షాన్ని ఆపి ఎటువంటి ఆటంకాలు లేకుండా మా భూమిపూజ చక్కగా జరిగేలా బాబా అనుగ్రహించారుఆ మరుసటిరోజు నాన్నకు పెట్టిన వెంటిలేటర్ తీసేసినప్పటికీ సులభంగానే ఊపిరితుత్తులకు ఆక్సిజన్ సరఫరా అవటం ప్రారంభమైంది. డాక్టర్ కూడా, “చాలా పెద్ద మిరాకిల్ జరిగింది, మేమైతే ఆయన బయటపడతారని అనుకోలేదు. నిజంగా మీ దేవుడు మీకు చాలా సహాయం చేశారు” అన్నారు. నిజమే! నేను ప్రతిరోజూ నాన్నకి బాబా ఊదీ పెట్టి వస్తున్నాను. తన ఊదీ మహిమతో సర్జరీ విజయవంతమయ్యేలా చేసి బాబా మా నాన్న ఆరోగ్యాన్ని కాపాడారు. “మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!”.


బాబా లీలలు అలానే ఉంటాయి

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు ఛత్రపతి. ఒక గురువారంరోజు మా నాన్న హడావిడిగా ఇంటికి వచ్చి, తన ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన దస్తావేజుల కోసం వెతకసాగారు. నాన్న అంత హడావిడిగా వెతకడం చూసి నేను, మా చెల్లి కూడా వాటికోసం తలోవైపు వెతకసాగాము. నేను ‘ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః’ అనే నామాన్ని జపిస్తూ వెతుకుతున్నాను. ఎంత వెతికినా ఆ దస్తావేజులు కనిపించట్లేదు. “ఏంటి బాబా, మీ నామం జపిస్తూ వెతుకుతున్నా దస్తావేజులు దొరకటం లేదు? నాకు చాలా భయంగా ఉంది బాబా” అని బాబాకు చెప్పుకుని ఆ రాత్రికి నిద్రపోయాను. ఆ మరుసటిరోజు బాబాకు నమస్కరించి, ఊదీ పెట్టుకొని, “బాబా! దస్తావేజులు దొరికితే మీకు నైవేద్యం సమర్పించుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకుని వెతకటం ప్రారంభించాను. వెంటనే దస్తావేజులు దొరికాయి. ఎక్కడైతే ముందురోజంతా వెతికినా దొరకలేదో ఆ స్థలంలోనే ఇప్పుడు దస్తావేజులు దొరికాయి. ఎంతో సంతోషంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా లీలలు అలానే ఉంటాయి. బాబాను నమ్మండి, అంతే! ఇక మీ రక్షణ, శిక్షణ, పాలన, దండన అన్నీ ఆయనే చూసుకుంటారు. మన సాధనలో తప్పు ఉండవచ్చు, కానీ ఆయన అనుగ్రహంలో తప్పు ఉండదు. కాబట్టి ఏదైనా పనులలో జాప్యం జరిగినా, మ్రొక్కుకున్నది అవకపోయినా నిరాశ వద్దు, సాయియే మనకు ముద్దు.



బాలకృష్ణ వామన్ వైద్య



బాలకృష్ణ వామన్ వైద్య బాంద్రా నివాసి. అతను దభోల్కర్ ఇంటికి సమీపంలో నివసిస్తుండేవాడు. అందరూ దభోల్కర్‌ని 'కాకా' అని పిలిచేవారు. కాబట్టి వైద్య కూడా దభోల్కర్‌ని 'కాకా' అనే పిలుస్తుండేవాడు. ఒకసారి దభోల్కర్ కీర్తనలు చేసే నిమిత్తం దాసగణు మహారాజ్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ కార్యక్రమానికి వైద్యను, అతని కుటుంబాన్ని కూడా ఆహ్వానించారు. దాసగణు తన కీర్తనలో భాగంగా బాబా దైవత్వం గురించి, వారి లీలల గురించి గొప్పగా వర్ణిస్తూ అద్భుతంగా ఉపన్యసించాడు. బాబా లీలలను ఎంతో శ్రద్ధగా వింటున్న వైద్య భక్తిపారవశ్యంతో బాబా ప్రేమలో మునిగిపోయాడు.

తరువాత కొంతకాలానికి వైద్య మొలల వ్యాధితో బాధపడుతూ చాలా నొప్పిని అనుభవించాడు. అతను ఎంతోమంది వైద్యులను సంప్రదించి, వాళ్ళు సూచించిన రకరకాల నివారణోపాయాలు, చికిత్సలు ప్రయత్నించినప్పటికీ తన స్థితిలో ఎటువంటి మెరుగుదల కనపడలేదు. అటువంటి స్థితిలో ఒకరోజు అతను తన సమస్యను దభోల్కర్‌కి తెలియజేసి సలహా కోరాడు. అప్పుడు దభోల్కర్, "జీవితంలో అన్ని అనారోగ్య సమస్యలకి ఒకే ఒక్క పరిష్కారం - శిరిడీ శ్రీసాయిబాబా. శిరిడీ వెళ్లి వారి దర్శనం చేసుకో. ఆయన నీకు ఖచ్చితంగా నయం చేస్తారు" అని చెప్పాడు. వైద్య యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ ఎలాగైనా శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను రైల్వే ఉద్యోగి అయినందున ఉచిత పాస్ లభ్యం కావడంతో శిరిడీ ప్రయాణమయ్యాడు.

వైద్య శిరిడీ చేరుకున్నంతనే ఆలస్యం చేయకుండా బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళాడు. బాబా అతన్ని చూస్తూనే, "రా భావూ! నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ ఉండగా నువ్వెందుకు భయపడతావు? ఇక చింతించకు, నీ మొలల వ్యాధి నయమవుతుంది" అని అన్నారు. తన రాకకు కారణం చెప్పకముందే బాబా అలా చెప్పడంతో వారి సర్వజ్ఞత్వానికి వైద్య ఆశ్చర్యపోతూ బాబాకు నమస్కరించాడు. తరువాత సభామండపంలోకి వెళ్లి కూర్చొని ఇతర భక్తులతో మాటల్లో పడ్డాడు. అంతలో అనుకోకుండా ఒక భక్తుడు అతని చేయి మీద అడుగు వేసి తొక్కడంతో అతను తీవ్రమైన నొప్పితో, "బాబా! నన్ను రక్షించండి" అని అరిచాడు. దానికి బాబా, "నేను నీకు ముందే చెప్పాను, కొద్దిసేపు వేచి ఉండు, నీకు నయమవుతుంది" అని బదులిచ్చారు. ఆ క్షణం నుండి అతని మొలల బాధ నివారణ అయ్యింది. జీవితంలో మళ్ళీ ఎప్పుడూ మొలల వ్యాధి అతనిని బాధపెట్టలేదు. అతను తరచూ సాటి భక్తులతో, "వైద్యులందరూ నాకు నయం చేయలేమని ఆశ వదిలేసినప్పుడు బాబా తమ దైవకృపతో అత్యంత బాధాకరమైన నా సమస్యను నయం చేశార"ని చెప్తుండేవాడు.

రెఫ్: శ్రీసాయి ప్రసాద్ పత్రిక 1988 (దీపావళి ఇష్యూ).
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి,

సాయిభక్తుల అనుభవమాలిక 590వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఉండగా భయం లేదు
  2. బిడ్డల కోరికను మరవక నెరవేర్చే సాయితండ్రి

బాబా ఉండగా భయం లేదు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి శతకోటి ప్రణామములు. తోటి సాయిభక్తులకు నా వందనములు. నేను ఒక సాయిభక్తురాలిని. మా మేనకోడలి కాపురంలో కలతలు ఏర్పడి మనశ్శాంతి కరువైంది. ఆ విషయమై మేము బాబాని అడిగితే, "మీరు ఏమీ ఆలోచనలు పెట్టుకోవద్దు" అని ఆయన సందేశమిచ్చారు. అప్పుడు మేము, "వాళ్ళకి పిల్లలున్నారు. అదే మా భయం. కానీ ఇక భయం లేదు బాబా. తొందరలోనే అతని మనసు మార్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించండి బాబా. వాళ్ళు ఆనందంగా ఉంటే అందరమూ సంతోషంగా ఉంటాము" అని బాబాను వేడుకున్నాము. తరువాత మా మేనకోడలు ప్రతిరోజూ బాబా ఊదీని ‘టీ’లో వేసి తన భర్తకు ఇవ్వడం మొదలుపెట్టింది. బాబా దయవల్ల అతని మనసు కొంచెం కొంచెంగా స్థిమితపడసాగింది. 2020, అక్టోబరు రెండవవారం మొదలవుతూనే మా మేనకోడలు ఫోన్ చేసి, తన భర్తకి మంచి ఉద్యోగం వచ్చిందని సంతోషంగా చెప్పింది. మా అందరికీ కూడా ఆనందంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా".


బిడ్డల కోరికను మరవక నెరవేర్చే సాయితండ్రి

సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు ప్రసన్న. నా పుట్టినరోజు దగ్గర పడుతుండగా ఒకరోజు నేను వెంకటదత్తసాయికి (బాబా) నమస్కరించుకుని, “బాబా! ఈసారి నా పుట్టినరోజుని ఏదైనా పుణ్యక్షేత్రంలో జరుపుకోవాలని ఉంది. నా కోరిక తీర్చండి బాబా” అని కోరుకొన్నాను. తరువాత ఆ విషయం గురించి నేను మరచిపోయాను. కానీ బాబా గుర్తు పెట్టుకున్నారు. మా కుంటుబమంతా తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకోవాలని చాలా రోజులుగా వేచి ఉంది. అనుకోకుండా సరిగ్గా నా పుట్టినరోజున మాకు శ్రీవారి దర్శనం టికెట్లు లభించాయి. నా పుట్టినరోజునాడు బాబా నన్ను తిరుమల పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళి శ్రీవారి దర్శనాన్ని అనుగ్రహించారు. నా సాయిగోవిందుని దయవల్ల నా కోరిక నెరవేరింది. నాకు చాలా అనందం  కలిగింది. “నా కోరిక గుర్తుంచుకుని మరీ తీర్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!”. అంతేకాకుండా, ఆ మరుసటిరోజు నాకు కలలో సాయిగోవిందుని దర్శనం కూడా కలిగింది. “ఇలానే ఎల్లప్పుడూ మా వెంట ఉండి మా అందర్నీ కాపాడండి బాబా!”.

రాజాధిరాజ యోగిరాజ శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 589వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. కష్టమేదైనా అడిగినంతనే ఆదుకునే తండ్రి నా సాయి
  2. ఎంతైనా మన బాబా దయామయుడు

కష్టమేదైనా అడిగినంతనే ఆదుకునే తండ్రి నా సాయి

ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా నమస్కారములు. బ్లాగులోని తోటి సాయిభక్తుల అనుభవాలు చదవడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీతోపాటు మనశ్శాంతి కూడా చేకూరుతుంది. నా పేరు సౌజన్య. మేము అమెరికాలో నివసిస్తున్నాము. నేను సాయిభక్తురాలిని. నా చిన్నతనం నుండి నేను బాబా గుడికి వెళుతూ ఉండేదాన్ని. నా సాయితండ్రి నన్ను, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలో నుండి రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఇంట్లోనే ఉండడం వలన అనుక్షణం వాళ్ళను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. మనమెంత జాగ్రత్త వహిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయి. 2020లో ఒకరోజు రాత్రి 11:30 అప్పుడు పిల్లలిద్దరూ ఆడుకుంటుండగా హఠాత్తుగా నా కూతురు తలకి పదునుగా ఉన్న టేబుల్ కొన తగిలి గాయమైంది. తన తల బొప్పి కట్టి, రక్తం కూడా కారింది. ఆ రాత్రి సమయంలో నాకు ఏమి చేయాలో తోచక భయంతో చాలా ఏడ్చాను. సహాయం కోసం నా సాయితండ్రిని ఎంతగానో వేడుకున్నాను. తరువాత బాబా ఊదీని పాప నుదుటిపై పెట్టి, కొద్దిగా ఊదీని నీటిలో కలిపి తనచేత త్రాగించాను. బాబా కృప అపారం. కొన్ని నిమిషాలలోనే నొప్పి తగ్గడం, బొప్పి తగ్గడం జరిగిపోయింది. అంత రాత్రివేళ ఆర్తిగా అడిగినంతనే హాస్పిటల్‌కి వెళ్ళనవసరం లేకుండా నా సాయితండ్రి నా కష్టాన్ని తీసేశారు. మా పాప క్షేమంగా, ఆరోగ్యంగా ఉండింది. “అంతా నీ దయవల్లనే బాబా. నిజంగా మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే తండ్రీ! అందరికీ దూరంగా అమెరికాలో ఉంటున్న నాకు తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, సర్వబంధాలు నీవే బాబా. లవ్ యు బాబా!” నా అనుభవం చదివిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో అనుభవాలను బాబా మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.


2020, అక్టోబరు నెల మొదటివారమంతా ఛాతీ మరియు భుజం నొప్పితో నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. అసలే అది కరోనా సమయమైనందువల్ల నాకు చాలా భయం వేసింది. ఇంట్లో చెప్తే అందరూ ఆందోళనపడతారని నేను నా కష్టాన్ని బాబాకి చెప్పుకుని చాలా బాధపడ్డాను. తరువాత బాబా ఊదీ తీసుకుని నొప్పి ఉన్న భాగమంతా రాశాను. మరికొంత ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి, 'బాబా! బాబా!’ అని చాలా ఆర్తిగా బాబా నామస్మరణ చేశాను. సాయంత్రానికల్లా నొప్పి సగానికి పైగానే తగ్గిపోయి నాకు ఉపశమనం కలిగింది. ఎవరికీ చెప్పలేక నా బాబాకు చెప్పుకున్నందుకు తల్లిలా ఆయన నా మొర ఆలకించి నాకు బాధ నుండి చాలావరకు విముక్తి ప్రసాదించారు. “థాంక్యూ సో మచ్ బాబా! మా ఆనందాలన్నీ నీవు ఇచ్చినవే. నాకు పూర్తిగా నయమయ్యేలా చేసి పూర్తి ఆనందాన్ని ప్రసాదించు. నీ దయ ఉంటే అన్నీ సాధ్యమే. తండ్రీ! మమ్మల్ని చల్లగా చూడు. నాకు నీవే దిక్కు. మరొక్కసారి థాంక్యూ బాబా! ఐ లవ్ యు బాబా! అందరినీ చల్లగా చూడు బాబా!”.


ఎంతైనా మన బాబా దయామయుడు

అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. మేము నకిరేకల్‌లో నివసిస్తున్నాము. ఇటీవల కొన్ని రోజుల క్రితం మా పాప ఆడుకుంటూ క్రింద పడింది. పెదవికి మంచం కొట్టుకుని పెదవి చీలింది. రక్తం కూడా చాలా పోయింది. ఆరాత్రి నకిరేకల్‌లోని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. డాక్టర్ పాపను పరీక్షించి, గమ్ పెట్టి పెదవిని అతికించారు. కానీ మరుసటిరోజు చూస్తే పెదవి అతకలేదు. మావారి కజిన్ గుంటూరులో డాక్టర్. తనకు విషయం చెప్పి పాప ఫోటో పంపిస్తే, “పాపను గుంటూరు తీసుకురండి, సర్జరీ చేయాల”ని చెప్పారు. మేము చాలా ఆందోళనపడ్డాము. నేను బాబాను ప్రార్థించి భారమంతా బాబాకే వదిలేశాను. మేము అక్టోబరు 2వ తారీఖున హాస్పిటల్‌కి వెళ్ళాలనగా ముందురోజు అక్టోబరు 1వ తారీఖున నేను సబ్‌స్టేషన్‌లో రీడింగ్స్ తీసి, మరుసటిరోజు గుంటూరు బయలుదేరాలి. అయితే ఎంతసేపటికీ లాప్‌టాప్‌లో రీడింగ్స్ రాలేదు. నేను బాబాను తలచుకుని, “బాబా! ఎలాగైనా నువ్వే రీడింగ్స్ తెప్పించు. ఎందుకంటే తెల్లారి పాపను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాలి” అని వేడుకున్నాను. నిజంగా బాబా అద్భుతం చేశారు. రీడింగ్స్ రావటం లేదు అనుకున్నది, బాబాను వేడుకోగానే లాప్‌టాప్‌లో రీడింగ్స్ వచ్చాయి. ఎంతైనా మన బాబా దయామయుడు. తన పిల్లలు కష్టపడుతుంటే ఆయన చూడలేరు. అలా నా రీడింగ్స్ సమస్యను బాబా పరిష్కరించారు. ఇంకో అద్భుతం ఏమిటంటే, మా పాపను హాస్పిటల్‌కి తీసుకెళ్ళినరోజు ‘సంకల్ప విజయ సాయి’ గ్రూపులో మా పాప పేరు మీద సంకల్ప పారాయణ చేయించాను. అది కూడా బాబానే ఏర్పాటు చేశారు. లేదంటే అంత త్వరగా ఆ గ్రూపులో ప్రార్థన పెట్టించలేము. మా పాపను పరీక్షించిన డాక్టర్, “ప్రస్తుతానికి సర్జరీ అవసరం లేదనిపిస్తోంది. మందులు ఇస్తాను, క్రమంతప్పకుండా వాడండి. రెండు నెలల తరువాత చూద్దాం” అని చెప్పి మందులిచ్చారు. అంతా బాబా దయ. “బాబా! దయామయా! నీ కృప నా కుటుంబం మీద, అలాగే అందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను”.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 588వ భాగం...


ఈ భాగంలో అనుభవాలు:
  • బాబా దయతో సుఖప్రసవం
  • అమెరికా ప్రయాణానికి బాబా సాయం
  • బాబా లీలలకు ప్రత్యక్ష నిదర్శనమైన అనుభవం

నా పేరు N.సూర్యనారాయణమూర్తి. నేను  హైదరాబాదు వాసిని. ముందుగా ఈ బ్లాగును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న శ్రీ సమర్థ సద్గురు సాయిబాబాకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. 2020లో బాబా దయవలన నాకు కలిగిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.

బాబా దయతో అమ్మాయికి సుఖప్రసవం:

బాబా నాకు ప్రసాదించిన అద్భుతఫలం - నా రెండవ కూతురు సాయిలీల. తను అమెరికాలోని చికాగోలో ఉంటోంది. ఆమెకు రెండవసారి డెలివరీ డేట్ 2020, మే నెలాఖరున ఇచ్చారు. మేము 2020, మార్చి నెలలో అమెరికా వెళదామని ప్లాన్ చేసుకున్నాము. కానీ కోవిడ్ కారణంగా మార్చి నెల నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో ఏం చేయాలో మాకు పాలుపోలేదు. నేను, నా భార్య అనేక సంవత్సరాలుగా ప్రతిదినమూ క్రమంతప్పకుండా శ్రీసాయిసచ్చరిత్ర పఠనము చేస్తున్నాము. అందువల్ల సాయిమీదే భారం వేసి రోజులు గడిపాము. మాకు తెలిసిన అనేకమంది స్నేహితులు, బంధువులు అమెరికాలో ఉన్నా ఎవరూ కూడా ఈ కరోనా సమయంలో మాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యంగా మేము మా అమ్మాయి మొదటి డెలివరీకి అమెరికా వెళ్ళినప్పుడు మాకు పరిచయమై మంచి స్నేహితులైన ఇద్దరు పెద్దవారు బాబా దయతో మా అమ్మాయి రెండవ డెలివరీ సమయంలో తనను ఆదుకున్నారు. వారిలో ఒకరు శ్రీమతి పి.హైమగారు. ఆవిడని అందరూ ‘హేమ ఆంటీ’ అని పిలుస్తారు. ఆవిడ ఆ కమ్యూనిటీలో తలలో నాలుకలాంటివారు. రెండవవారు - ఆమె స్నేహితురాలైన శ్రీమతి స్వర్ణలతగారు. మా అమ్మాయికి మే 27న సుఖప్రసవం అయ్యాక హేమగారు మా అమ్మాయిని 10 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుని స్నానం చేయించి పంపారు. ఆ తరువాత 15 రోజులు శ్రీమతి స్వర్ణలతగారు మా అమ్మాయివాళ్ళ ఇంట్లో ఉండి తనను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇది కేవలం శ్రీసాయి వాళ్ళకు ఇచ్చిన ప్రేరణ, మాకు కలిగించిన ఓదార్పు.

అమెరికా ప్రయాణానికి బాబా సాయం:

పైన చెప్పినట్లు మా అమ్మాయికి ప్రసవం అయ్యాక జూన్, 2020 నుంచి అమెరికాకు విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ మాకు సెప్టెంబరు మొదటివారం దాకా బాబా ప్రయాణానికి అనుమతిని ఇవ్వలేదు. ఆయన అంతా మంచి చేస్తారని ఎంతో ఓర్పుతో ఎదురుచూశాక సెప్టెంబరులో సాయి సందేశం అందింది, ‘మీరు అమెరికా వెళ్ళవచ్చు’ అని. బాబా అనుమతితో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని, అందులో భాగంగా సెప్టెంబరు 23వ తేదీన కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాము. ఎంతో ఆందోళన చెందిన మాకు సెప్టెంబరు 24, గురువారం మధ్యాహ్న ఆరతికి ముందు కోవిడ్ నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. ఆనాడు మా శ్రీమతి, “మమ్మల్ని చేయిపట్టుకుని అమెరికా తీసుకువెళ్ళమ”ని బాబాను ప్రార్థించింది. తన ప్రార్థనకు మా ఇంట్లో పటములోని బాబా ‘అలాగే’ అని తల ఊపారు. మేము సెప్టెంబరు 27న ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాదు నుండి ఢిల్లీకి, ఆరోజు రాత్రి ఢిల్లీ నుండి చికాగోకి విమానాలలో సీట్లు బుక్ చేసుకున్నాము. అనేక అపోహలు పడిన మాకు విమానంలో చక్కటి ఏర్పాట్లుగా సీటు వదలి సీటు కేటాయించి, చక్కటి ఆహారం అందేలా బాబా చూసుకున్నారు. ఆ తరువాత అమెరికాలోనూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా బాబా చూసుకున్నారు. మన కోరికలు తీర్చే కల్పవృక్షమైన శ్రీసాయి పాదాలకు సర్వస్యశరణాగతి చేస్తున్నాను. “బాబా! అందరినీ కాపాడండి. కరోనాను పారద్రోలండి”.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి 


బాబా లీలలకు ప్రత్యక్ష నిదర్శనమైన అనుభవం

భగవాన్ శ్రీసాయి బంధువులకు నమస్కారం. నా పేరు వైద్య వెంకటేశ్వర్లు. మాది జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం, స్తంభంపల్లి గ్రామం. 2020లో బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. 2020లో మా చిన్నాన్న చనిపోయారు. ఆనవాయితీ ప్రకారం మా చిన్నమ్మను, తన ఇద్దరు కొడుకులను (మా తమ్ముళ్ళను) అక్టోబరు 7వ తారీఖు, బుధవారంరోజు మా ఇంటికి నిద్రకు తీసుకువచ్చాము. మరుసటిరోజు గురువారం మంచిర్యాలలోని వాళ్ళింటికి సొంత కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో వాళ్ళ కారు ప్రమాదానికి గురైంది. కారులో చిన్న జెండాలు పెట్టడానికి ఉంచిన ఒక లోహపుకడ్డీ పైనున్న బొడిపెతో సహా కారు ముందుభాగంలో కూర్చున్న మా తమ్ముడు వేణుమాధవ్ కంటి కొలికి దగ్గర గుచ్చుకొని వంకరపోయి లోపలి వరకు దిగిపోయింది. చిన్నమ్మకి ఎడమచేయి మోచేతి కీలు పూర్తిగా తొలగిపోయి వదులుగా వ్రేలాడింది. వారిద్దరినీ కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించాము. ఆరోజు నేను పూజగదిలోకి వెళ్ళి బాబాకు నమస్కరించి, “బాబా! మా చిన్నమ్మ, తమ్ముళ్ళు మా ఇంటికి వచ్చి వెళ్తుండగా వాళ్ళకు ప్రమాదం జరిగింది. వాళ్ళను ఎలాగైనా నువ్వే కాపాడాలి” అని ఆర్ద్రంగా బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యకరంగా, ఎలాంటి అనస్థీషియా గానీ, ఆపరేషన్ గానీ లేకుండా బాబానే డాక్టర్ కిషోర్ రూపంలో వచ్చి మా తమ్ముడి కంటి దగ్గర గుచ్చుకున్న లోహపుకడ్డీని తొలగించారు. తన కంటిచూపుకు కూడా ఎలాంటి సమస్యా రాలేదు. తరువాత కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళగా మా తమ్ముడిని పరీక్షించి, “ఒక నేత్ర వైద్యనిపుణుడు లేకుండా ఆ లోహపుకడ్డీని ఎలా తొలగించారు?” అని ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. కారులో దొరికిన మరో జెండా కడ్డీని పరిశీలించగా దానికి ఉన్న పైన బొడిపె ఊడి వచ్చింది. అప్పుడు అనిపించింది, కంటిభాగంలో నుంచి కడ్డీని తొలగించే ప్రయత్నంలో ఆ లోహపు బొడిపె లోపలే ఊడిపోయివుంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. కానీ బాబా దయవల్ల ఇవేమీ జరగలేదు. మా తమ్ముడు సురక్షితంగా ఉన్నాడు. మా చిన్నమ్మ చేతికి కూడా ఎలాంటి ఆపరేషన్ లేకుండా కేవలం సిమెంట్ పట్టీ వేశారు. ‘ఒకవేళ సిమెంట్ పట్టీతో సెట్ కాకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంద’ని డాక్టర్ చెప్పారు. బాబా కరుణ వల్ల మా చిన్నమ్మ చెయ్యి కూడా త్వరలోనే సెట్ అవుతుందని ఆశిస్తున్నాను. నా మొర ఆలకించి మావాళ్ళను సురక్షితంగా ఉంచినందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. వాళ్ళు తొందరగా కోలుకోవాలని మరోసారి బాబాను వేడుకున్నాను. బాబా లీలలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.



సాయిభక్తుల అనుభవమాలిక 587వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. ఈరోజు నాకు బాబు ఉన్నాడు అంటే, అదంతా నా తండ్రి బాబా చలవే!
  2. సాయి కృప - కోమా నుండి బయటపడ్డ స్నేహితుడు


ఈరోజు నాకు బాబు ఉన్నాడు అంటే, అదంతా నా తండ్రి బాబా చలవే!

సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఎప్పటినుంచో ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతూ ఉన్నాను. ఇప్పుడు నేను బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. నా పేరు జానకి. ఈరోజు నాకు మా బాబు ఉన్నాడు అంటే అదంతా నా తండ్రి బాబా చలవే. నేను గర్భవతిగా ఉన్నప్పుడు స్కానింగ్ చేసిన డాక్టర్, “గర్భసంచికి చీలిక ఉంది, లోపల బిడ్డ పెరుగుదల సరిగా ఉండదు” అని చెప్పారు. నాకు ఏం చేయాలో తోచక బాధపడుతూ ఉండేదాన్ని. 3వ నెలలో బాగా రక్తస్రావం జరిగి నాకు ఆందోళన ఎక్కువై తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నప్పుడు మా అత్తయ్య తమ్ముడు (నాకు బాబాయి వరుస అవుతారు) వచ్చి, “నీకేమీ కాదు. బాబాను నమ్ముకో! నీకు కొడుకు పుడతాడు, ఏం భయపడకు!” అని అన్నారు. తరువాత నేను, మా అత్తయ్య హాస్పిటల్‌కి వెళ్ళాము. ఆ డాక్టర్ స్కానింగ్ చేసి బ్లీడింగ్ కాకుండా మందులిచ్చారు. ఆ స్కానింగ్ రిపోర్ట్ పరిశీలించిన డాక్టర్, “అంతా బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. అంతా దేవుడి దయ” అని అన్నారు. ఒక ముఖ్య విషయం చెప్పాలి, నేను ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. స్కానింగ్ తీసేటప్పుడు కూడా నా ఎదురుగా బాబా ఫోటో ఉంది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నా బిడ్డని రక్షించు” అని వేడుకున్నాను.

ఇంటికి వచ్చిన తరువాత మా బాబాయ్ నాకు సాయిసచ్చరిత్ర, 9 గురువారాల పుస్తకాలు ఇచ్చారు. నేను 3 వారాలు మాత్రమే పారాయణ చేసి, ‘కడుపుతో ఉన్నప్పుడు పారాయణ చేయకూడదు’ అని అందరూ చెప్పేసరికి పారాయణ చేయడం ఆపేశాను. కానీ నా బాబాను స్మరించుకుంటూ ఉండేదాన్ని. ప్రతినెలా చెకప్‌కి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారీ ఆ డాక్టర్, “బాబు పెరుగుదల సరిగా ఉంటుందని నమ్మకం లేదు, అంతా దేవుడి దయ” అని అనేవాళ్ళు. కానీ వాళ్ళకు తెలియదుగా, నా బాబా నాకు మేలు చేస్తాడని. అయినా నాకు లోపల మాత్రం భయంగానే ఉండేది. చివరికి 2015, ఫిబ్రవరి 15న డెలివరీ డేట్ ఇచ్చి, ఆరోజు సిజేరియన్ చేస్తామని చెప్పారు. ఈ 9 నెలలు ఎంత బాధపడ్డానో అది నా బాబాకు మాత్రమే తెలుసు. నా బాబా నాకు ఎంత పరీక్ష పెట్టినా చక్కని ఫలితాన్నే ఇస్తారని నాకు తెలుసు. ఆ ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళేటప్పుడు ఒక్కటే అనుకున్నా, ‘బాబానే డాక్టర్ రూపంలో వచ్చి నా బిడ్డను రక్షిస్తారు’ అని. నాకు గర్భసంచి చీలిక ఉండేసరికి లోపల బాబు తల పైకి, కాళ్ళు క్రిందకి ఉండేవి. ఆపరేషన్ థియేటరులో డాక్టర్లు, “ఈ అమ్మాయి గర్భసంచికి చీలిక ఉంది, ఆపరేషన్ కొంచెం కష్టం” అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బాగా భయమేసి 'బాబా, బాబా' అని స్మరించుకుంటూ ఉన్నాను. చివరికి బాబా అనుగ్రహంతో ఆపరేషన్ సక్సెస్ అయింది. “నీకు బాబు పుట్టాడు” అని ఆ డాక్టర్ చెప్పేసరికి నాకు బాగా ఏడుపు వచ్చేసింది. “బాబాకు నేనంటే ఎంత ప్రేమో” అని ఎంతో ఆనందం వేసింది. “బాబు ఎదురుకాళ్ళతో పుట్టాడు, కృష్ణుడు కూడా ఎదురుకాళ్ళతోనే పుట్టాడు” అని అందరూ అన్నారు. కానీ ఎంతటి కష్టమైనా నా బాబాకు చెప్పుకుంటే అది కొంచెం ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. నా విషయంలో కూడా అలానే జరిగింది. ఎందుకంటే, ప్రతి 500 మంది అమ్మాయిలలో ఒకరికి గర్భసంచి సమస్యలు ఉంటాయి. నాలాంటి సమస్యలున్న అమ్మాయిలు కూడా అదే హాస్పిటల్లో జాయినయ్యారు. కానీ వాళ్ళలో ఒకరికి 3వ నెలలోను, ఇంకొకరికి 6వ నెలలోను అబార్షన్ అయింది. ఈ విషయం తెలిసి నేను బాధపడ్డాను. నాకు ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ నా బాబా నన్ను రక్షించారు. కాకపోతే, బాబు ఉమ్మనీరు బాగా మింగాడని హైదరాబాదుకి వెళ్ళి బాబుని చిన్నపిల్లల హాస్పిటల్లో చేర్చి 10 రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాము. బాబుని పరీక్షించిన డాక్టర్లు, “బాబు ఉమ్మనీరు బాగా త్రాగాడు. ఇన్‌ఫెక్షన్ బాగా చేరింది. బాబుకు 5 సంవత్సరాలు వచ్చేవరకు తనను జాగ్రత్తగా చూసుకోవాలి” అని చెప్పారు. బాబు పుట్టినప్పటినుంచి బాబాను తలచుకుంటూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బాబుకి బాబా ఊదీని పెట్టేదాన్ని. ఇప్పుడు మా బాబుకు 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు బాబానే నా కొడుకుని జాగ్రత్తగా చూసుకున్నారు. ఇకముందు కూడా ఆయనే జాగ్రత్తగా చూసుకుంటారు. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ బాబానే అన్నీ చూసుకుంటూ ఉన్నారు. బాబా తన సూక్తుల్లో, “మీ భారం నా మీద పడవేయండి, నేను చూసుకుంటాను” అని అన్నారు కదా! ఆయన్ని(నా బాబాను) నమ్ముకుంటే చాలు, అంతా ఆయనే చూసుకుంటారు.


సాయి కృప - కోమా నుండి బయటపడ్డ స్నేహితుడు

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు పూజ. 2020, ఆగస్టు 20వ తేదీన నా స్నేహితుడు మరికొంతమందితో కలిసి బెంగళూరు వెళ్తుండగా ఒక మేజర్ యాక్సిడెంటుకి గురయ్యాడు. కారు డ్రైవింగ్ చేస్తున్న అతను అక్కడికక్కడే చనిపోయాడు. నా స్నేహితుడు కోమాలోకి వెళ్లాడు. కారులో ఉన్న మిగిలిన ఇద్దరికీ పెద్ద దెబ్బలు తగిలాయి. ఈ వివరాలేవీ నాకు తెలియవు. ఈ సంఘటన జరిగిన పదిరోజుల తర్వాత, "నీ చావు నేను తీసివేశాను" అని బాబా మెసేజ్ ఒకటి నాకు వచ్చింది. ఇలా వచ్చిందేమిటని ముందు బాధపడ్డాను. తరువాత, 'ఎవరికైనా ఆరోగ్యం బాగలేదా ఏమిటి?' అని నేను చాలా ఆలోచించాను. అదే సమయంలో, "నా స్నేహితునికి యాక్సిడెంట్ అయి, కోమాలో ఉన్నాడ"ని నా స్నేహితుల గ్రూపునుండి మెసేజ్ వచ్చింది. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడి, "తనకి ఏమీ కాకూడదు" అని బాబాను చాలా ఆర్తిగా ప్రార్థించాను. అంతేకాదు, నా స్నేహితుని కోసం నిత్యం నేను బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కొన్నిరోజులు గడిచాక సెప్టెంబరు 20వ తేదీన నాకు, "నీ ఆరోగ్యం కుదుటపడుతుంది" అని బాబా నుండి మరో మెసేజ్ వచ్చింది. అది చూసి, 'బాబా అనుగ్రహం వలన త్వరలోనే నా స్నేహితుడు పూర్తిగా కోలుకుంటాడ'ని నేను చాలా ఆనందపడ్డాను. తరువాత అక్టోబరు 4వ తేదీన నా స్నేహితుడు కోమాలో నుంచి బయటకు వచ్చినట్టు కబురు తెలిసింది. ఆరోజు సాయంత్రం తను మా అందరితో ఫోన్లో మాట్లాడాడు కూడా. మేమందరమూ చాలా ఆనందించాము. ఇదంతా సాయి కృప. "బాబా! మీ చల్లని చూపు అందరిమీదా ఉండాలని, ఎల్లప్పుడూ ఇలాగే మీరు మాకు రక్షణనిస్తూ ఉండాలని వేడుకుంటూ మీకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు".



కుశాభావు



సాయిభక్తుడు కుశాభావు అలియాస్ కృష్ణాజీ కాశీనాథ్ జోషీ 1866వ సంవత్సరంలో జన్మించాడు. ఇతని తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషీ అహ్మద్‌నగర్ నుండి 70 మైళ్ల దూరంలో ఉన్న మీర్జాగాఁవ్‌లో ఒక గ్రామ వతనదారుగా ఉండేవాడు. అతనికి ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉండేవి. అతను ధనవంతుడు కాకపోయినప్పటికీ ఉన్నంతలో పేదలకు, రోగగ్రస్తులకు సహాయం చేస్తూ జీవితంలో ఎక్కువభాగం సామాజిక సేవాకార్యక్రమాలలో గడుపుతుండేవాడు.

కుశాభావు ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన ప్రాథమిక విద్యనభ్యసించి నెలకి 5 లేదా 7 రూపాయల వేతనాన్ని అందుకుంటుండేవాడు. అంతేకాక, వంశపారంపర్యంగా వచ్చే గ్రామ పూజారి వృత్తికి అవసరమైన శిక్షణ కూడా పొందాడు. కానీ అతనికి ఉపాధ్యాయ వృత్తిలో గానీ, అర్చకత్వంలో గానీ ఆసక్తి లేదు. అతను భక్తి మార్గానికి తన జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాడు. అతను చిన్నవయసునుండే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి కనబరుస్తుండేవాడు. పౌరాణిక గాథలు వినడంలో ఎంతో మక్కువ చూపేవాడు. గ్రామంలోని అన్ని మందిరాలను దర్శించడం, పవిత్ర గ్రంథాల పఠనం, పలు మంత్రజపాలు చేయడం వంటి వాటిలో నిమగ్నమై ఉండేవాడు. గ్రామంలో ఉన్న మారుతి మందిరానికి ప్రతిరోజూ వెళ్లి పూజ నిర్వహిస్తుండేవాడు. 

ఒకరోజు అలా వెళ్ళినప్పుడు ఆ మందిరం వద్ద పులిచర్మాన్ని ధరించి ఉన్న ఒక సాధువు కూర్చొని ఉండడం కుశాభావు చూశాడు. ఆ సాధువు చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి అతనికి కనిపించింది. కుశాభావు తన అలవాటు ప్రకారం మందిరం లోపలకి వెళ్లి మారుతికి పూజ ముగించిన తరువాత బయటకి వచ్చి ఆ సాధువుకి నమస్కరించాడు. ఆ సాధువు నామధేయం 'దత్తమహరాజ్' (వక్రతుండ మహరాజ్). వారు గొప్ప మహాత్ములు, సాత్వికులు. మహరాజ్ తన ప్రక్కన కూర్చోమని కుశాభావుకు సైగ చేయగా, అతనలాగే చేశాడు. అప్పుడు ఆ మహరాజ్ అతనికి కొన్ని ఆధ్యాత్మికపరమైన కథలను వినిపించాడు. ఆ మహరాజ్ ఆహారంగా వేరేదీ తీసుకోక, కేవలం పాలు మాత్రమే తీసుకొని జీవనం సాగిస్తుండేవాడు. అందుచేత మహరాజ్ ప్రతిరోజూ కుశాభావుకి కొంత ధనమిచ్చి, పాలు తెచ్చిపెట్టమని చెబుతుండేవాడు. కుశాభావు సంతోషంగా ఆ పని చేస్తుండేవాడు. ఒకరోజు కుశాభావు పాలు తెచ్చి మహరాజ్‌కిచ్చి, మిగిలిన చిల్లర మాత్రం ఇవ్వక తన వద్దే ఉంచుకున్నాడు. మరుసటిరోజు మహరాజ్ కుశాభావుని “ఆ చిల్లరతో ఏమి చేశావ"ని అడగగా కుశాభావు సౌమ్యంగా, "ఆ చిల్లరతో నేను పేడాలు కొనుక్కొని తిన్నాన”ని చెప్పాడు. మహరాజ్ అతన్ని చూసి నవ్వుతూ, “సమీపంలో ఉన్న ఆ చెట్టుని చూడు. అక్కడికి వెళ్ళు, నీకొక రాయి కనిపిస్తుంది. ఆ రాయి క్రింద ఒక కుండ వుంది. దానిని తెరచి అందులో ఉండేవి తిను” అని చెప్పాడు. మహరాజ్ చెప్పినట్లే కుశాభావు వెళ్లి చూడగా నిజంగానే అక్కడ నిండా పేడాలున్న ఒక కుండ కనిపించింది. కుశాభావు వాటిని తృప్తిగా తిని తిరిగి ఆ కుండని యథాస్థానంలో పెట్టి, మునుపటిలా రాయితో మూసేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ మహరాజ్ రూపంలో కుశాభావుకి గురువు లభించారు.

కుశాభావు దత్తమహరాజ్ శిక్షణలో యోగాసనాలు, ప్రాణాయామం, కుండలిని మేల్కొల్పడం మొదలైన విద్యలు నేర్చుకున్నాడు. కానీ యుక్తవయస్సులో ఉన్న అతనికి వాటితో తృప్తి కలుగలేదు. తన గురువుకి తెలిసిన మారణం, ఉచ్ఛాటనం, వశీకరణం మొదలైన విద్యలు నేర్పమని పట్టుబట్టాడు. అవి నేర్పడం గురువుకి ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ కుశాభావు బాగా ఒత్తిడి చేయడంతో అయిష్టంగానే వాటిని అతనికి నేర్పడానికి అంగీకరించాడు.

గురువు చెప్పినట్లు అందుకు అవసరమైన జపం, సాధన  కుశాభావు చేశాడు. అతను ఒక ఇనుప కడియాన్ని ధరించి మంత్రాలను నిర్ణీత సంఖ్యలో నిష్ఠగా జపించి కొద్దికాలంలోనే తాను ఆశించిన శక్తులను వశపరుచుకున్నాడు. ఒక మంత్రాన్ని ఉచ్ఛరించి పేడాలు వంటి మిఠాయిలను తన చేతుల్లోకి తెప్పించగలిగేవాడు. అయితే వాటిని అతను తినడంగానీ, అమ్మడంగానీ చేయకూడదు. కానీ ఇతరులను మెప్పించేందుకు, అబ్బురపరిచేందుకు వాటిని పంచిపెట్టవచ్చు. ఇవన్నీ అతను మంత్రోచ్ఛరణ ద్వారా చేసేవాడేగానీ యక్షిణి, కామిని మొదలైన దుష్టశక్తులను వశపరుచుకొనటం ద్వారా కాదు. ఇదేకాక, అతను ఇతురులు ప్రయోగించిన దుష్టశక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడు. అది ప్రమాదంతో కూడుకున్నది. ఆ శక్తులను ఉపయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కోసారి ఆ శక్తులను ప్రయోగించినవారికి కూడా భౌతికంగా హాని జరగవచ్చు.

22 ఏళ్ళ వయస్సుకే కుశాభావు ఆ మంత్రశక్తులపై పూర్తి పట్టు సాధించాడు. ఆ సమయంలో అతని గురువు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్లి, ఆమరణాంతం అక్కడే గడపాలని నిశ్చయించుకొని కుశాభావుని వెంట తీసుకొని బయలుదేరాడు. ఢిల్లీ చేరుకున్నాక ఆయన కుశాభావుకి తుది వీడ్కోలు చెప్పి, "మీరు వెళ్ళిపోయాక నేను ఏమి చేయాల"న్న అతని ప్రశ్నకు సమాధానంగా, "శిరిడీలో ఉన్న నా జ్యేష్ఠ సోదరుడు సాయిబాబా దగ్గరికి వెళ్లి వారు చెప్పినట్లు నడచుకో" అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తరువాత కుశాభావుకి ఆయన మళ్ళీ కనిపించలేదు, వారి గురించి ఏ వివరాలూ తెలియలేదు.

చాలా సంవత్సరాల తరువాత, అంటే 1908లో కుశాభావు తన గురువు ఆదేశానుసారం శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. "ఇనుప కడియాన్ని పారవేసి, మంత్రప్రయోగం ద్వారా పేడాలు సృష్టించడం మాననిదే తమతో ఉండేందుకు అనుమతించమ"ని బాబా ఖరాఖండిగా చెప్పారు. ఖచ్చితమైన బాబా ఆదేశాన్ననుసరించి కుశాభావు తన ఇనుప కడియాన్ని విరిచి అవతల పారేసి, మంత్రప్రయోగం ద్వారా పేడాల వంటివి సృష్టించడం మానుకొని శిరిడీలో భిక్ష చేసి జీవనం సాగిస్తుండేవాడు. శిరిడీలో అతనికి ఉండటానికి నివాసం కూడా లేదు. బాబా అతనిని, "మశీదులో ఒక మూల కూర్చొని పగలంతా 'దాసబోధ' చదవమ"ని ఆజ్ఞాపించారు. అతనలాగే చేస్తుండేవాడు. రాత్రి ఎక్కడ చోటు దొరికితే అక్కడ నిద్రపోతుండేవాడు. అతనిలా చెప్పాడు: "బాబా నాకుగానీ, ఇతరులకుగానీ మంత్రోపదేశం వంటివి ఇవ్వలేదు. అప్పటికింకా బొంబాయి తదితర ప్రాంతాల నుండి భక్తులు బాబా దగ్గరకు వచ్చేవాళ్లు కాదు. అప్పుడప్పుడు శిరిడీ గ్రామస్థులు మాత్రమే వారి దగ్గరకు వచ్చి కడుపునొప్పి, జ్వరం మొదలైన సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మశీదులో నిరంతరం జ్వలించే ధునిలోని ఊదీని వారికి ఇస్తుండేవారు. ఆయన అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్దిమంది వద్ద మాత్రమే 4, 5 పైసలు అడిగి తీసుకొని ధునికి అవసరమయ్యే కట్టెలు మొదలైన వాటికోసం వెచ్చించేవారు. బాబా దగ్గరకు వచ్చే గొప్పవారి విషయానికి వస్తే, నానాసాహెబ్ నిమోన్కర్‌ను తరచూ వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలలో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్య తత్వాలు, సాధన చతుష్టయం మొదలైన విషయాల గురించి ప్రస్తావించగా నేను వినలేదు. విశ్వాసంతో తమని ఆశ్రయించినవాళ్ళకి బాబా తమ అద్భుతశక్తులతో భగవంతునిపట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించినవాళ్ళు తమ ఇష్టదేవతను ఉపాసించిన పిదప, వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు".

కుశాభావు పూర్తిగా మూడు సంవత్సరాలు బాబా సన్నిధిలో గడిపాడు. తరువాత అతని తండ్రి వచ్చి అతనిని తనతో తీసుకెళ్లాలనుకున్నాడు. కుశాభావు ఇంటికి వెళ్లేముందు బాబాను దర్శించాడు. అప్పుడు బాబా, "ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి" అని అన్నారు. కొద్దిరోజుల తర్వాత కుశాభావు తన తండ్రితో కలిసి శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా గతంలో తాము చెప్పిన "ఇద్దరుగా రండి" అన్న మాటకు అర్థం - "పెళ్లి చేసుకొని భార్యతో రా" అని వివరించారు. దాంతో అతను శిరిడీ నుండి వెళ్లిన వెంటనే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పటికీ శిరిడీ వెళ్లి, బాబా దగ్గర ఉండడానికే అతను ఇష్టపడేవాడు. అందువలన ఒకసారి ఒంటరిగా శిరిడీ వెళ్లి చాలారోజులు అక్కడే ఉండిపోయాడు. అప్పుడు అతని భార్య వచ్చి అతనిని తనతో తీసుకెళ్ళింది. బాబా కృపవలన ఆ దంపతులకు పిల్లలు, మనవళ్లు ఉన్నారు.

అలా కుశాభావు తొమ్మిది సంవత్సరాల కాలంలో తరచూ శిరిడీ దర్శిస్తుండేవాడు. ఆ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా, “ఆ మూడుతలలవాణ్ణి చూడు" అని అతనితో అన్నారు. దాన్ని అతను గాణుగాపురం వెళ్లి దత్తాత్రేయుని దర్శించమన్న బాబా ఆదేశంగా భావించాడు. ఇక అప్పటినుండి అతను సంవత్సరానికి రెండుసార్లు, గురుపౌర్ణమికి ఒకసారి, మాఘపౌర్ణమికి ఒకసారి గాణుగాపురం వెళ్తుండేవాడు. ఇంకొకసారి బాబా మూడురోజులకి ఒక పారాయణ చొప్పున గురుచరిత్ర 108 పారాయణలు చేయమని ఆదేశించారు. బాబా ఆదేశానుసారం అతను 10, 11 నెలలు గాణుగాపురంలో ఉండి 108 పారాయణలు పూర్తి చేశాడు.

కుశాభావు చేత మంత్రశక్తులు ఉపయోగించడాన్ని నిషేధించిన బాబా దయతో అతనికి ఒక అద్భుతశక్తిని ప్రసాదించారు. అదెలా జరిగిందో చూడండి!

ఒక ఏకాదశినాడు కుశాభావు బాబా చెంత కూర్చొని ఉన్నాడు. అప్పుడు వారివురి మధ్య జరిగిన సంభాషణ:

బాబా: ”ఈరోజు నువ్వు ఏమి తింటావు?”
కుశాభావు: “ఏమీ తినను, ఈరోజు ఏకాదశి”
బాబా: "ఏకాదశి అంటే ఏమిటి?"
కుశాభావు: "ఉపవాసం ఉండే రోజు" 
బాబా: "ఉపవాసం అంటే ఏమిటి?"
కుశాభావు: "అది 'రోజా' వంటిది" (రంజాన్ మాసంలో ముస్లింలు పాటించే ఉపవాసాన్ని రోజా అంటారు) 
బాబా: "రోజా అంటే?"
కుశాభావు: కందమూలాలు తప్ప మరేమీ తినకుండా ఉండటం.

కందమూలాలు అంటే దుంపవేర్లు. మామూలుగా చిలగడదుంపలనే కందమూలాలని అంటారు. వాటినే ఏకాదశిరోజు తింటుంటారు. మరాఠీలో ఉల్లిగడ్డలను 'కాందా' అంటారు. 'కంద' - 'కాందా' పేర్లలో ఉన్న సారూప్యతను అవకాశంగా తీసుకొని బాబా కొన్ని ఉల్లిగడ్డలు కుశాభావుకిచ్చి తినమన్నారు. సనాతనులు ఏకాదశిరోజు ఉల్లి తినకూడదు. కానీ బాబా పట్టుబట్టడంతో వారి అభీష్టానికి వ్యతిరేకంగా నడచుకోవటం ఇష్టంలేని కుశాభావు, “మీరు తింటే నేనూ తింటాను” అని అన్నాడు. అప్పుడు బాబా కొన్ని ఉల్లిగడ్డలు తిన్నారు. తరువాత కుశాభావు కూడా కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాడు. అంతలో కొంతమంది భక్తులు మశీదులోకి రాసాగారు. బాబా కుశాభావును ఆటపట్టించదలచి ఆ వచ్చిన భక్తులతో, “ఈ బాపనోణ్ని చూశారా! ఏకాదశిరోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు” అన్నారు. కుశాభావు తనను తాను సమర్థించుకోదలచి, “బాబా తిన్నారు గనుక నేనూ తిన్నాను” అని అన్నాడు. వెంటనే బాబా, “నేను ఉల్లిగడ్డలు తినలేదు" అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలసలు లేవు, కేవలం చిలగడదుంపలు మాత్రమే ఉన్నాయి. బాబా, "చూశారా! నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలగడదుంపలు!" అన్నారు. కుశాభావు, 'బాబా తన అద్భుతశక్తితో ఉల్లిపాయలను చిలగడదుంపలుగా మార్చేశార'ని ఆశ్చర్యపోతూనే, అదే తనకు గొప్ప అవకాశమని, బాబా కక్కినదానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదుటన దానిపైబడి నోటితో లాక్కొని తినేశాడు.  బాబా తిట్టి, కొట్టి, అవతలకి నెట్టి అతన్ని వారించాలని చూశారు. కానీ బాబా ఉచ్చిష్ఠాన్ని తినగలుగుతున్న మహదానందంలో ఉన్న అతను అవేమీ పట్టించుకోలేదు. 

'బాబా కొన్ని సందర్భాలలో ఎవరైనా ఒక భక్తునికి ముద్దుపెట్టి పంపేవారు. అదేమంత శుభకరమైనది కాదు. కానీ అక్కల్కోట మహరాజ్ వలె బాబా తిట్లు, దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సుని కలగజేస్తాయ'న్నది అతని అభిప్రాయం. అందువల్ల బాబా తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాడు. బాబా కోపం నిజమో, నటనోగానీ మరుక్షణంలో వారి మనోవైఖరి మారిపోయి తమపై అతనికున్న అంచంచలమైన విశ్వాసానికి అభినందనాపూర్వకంగా ప్రేమతో అతని తలపై తమ హస్తాన్నుంచి ఆశీర్వదిస్తూ, "ఇకపై కేవలం నన్ను స్మరించి చేతులు చాచినంతనే నీ చేతుల నుండి సమృద్ధిగా ఊదీ రాలే సామర్ధ్యాన్ని కలిగి ఉంటావు" అని అన్నారు.

ఈ వివరాన్ని 1936లో కుశాభావు పూనాలో తన నివాసమందు మంచంపై కూర్చొని బి.వి.నరసింహస్వామికి తెలియజేస్తూ హఠాత్తుగా తన రెండు చేతులను కలిపి దోసిలిలా పట్టి పైకెత్తి తన ముఖానికి ముందుంచాడు. తరువాత రెండు కళ్ళు మూసుకొని బాబాను ధ్యానించాడు. ఒక నిమిషం తరువాత అతను, "ఇదిగో ఊదీ, మీ చేతులు పట్టండి" అంటూ తన దోసిలి గుండా ఊదీని ధారగా పోయసాగాడు. బి.వి.నరసింహస్వామి, అతనితోపాటు ఉన్న అవస్తే అతని దోసిలి క్రిందగా కాగితం పెట్టి కొన్ని ఔన్సుల ఊదీ సేకరించి పొట్లం కట్టి దాచుకున్నారు. ఈ విషయమై బి.వి.నరసింహస్వామి తాము రచించిన 'లైఫ్ ఆఫ్ సాయిబాబా'లో ఇలా వ్రాశారు: "శీతల వాతావరణంలో కుశాభావు చేతినుండి వచ్చిన ఊదీ అప్పుడే ధునిమాయి నుండి తీసిన ఊదీలా వెచ్చగా ఉంది".

కుశాభావు ఇలా చెప్పాడు, "అద్భుత వరం వల్ల లభించిన ఈ ఊదీని విశ్వాసంతో నా నుండి ప్రసాదం కోరే భక్తులకు పంచిపెడతాను. అది వారి బాధలను, పలురకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానాన్ని కూడా ప్రసాదించేది. ఈ శక్తి ఒక్కసారిగా నాలో నిక్షిప్తమైంది. నేను చేతుల్లోకి ఊదీని సృష్టించడమనేది ఎలాంటి మంత్రాలు ఉచ్ఛరించడం వల్ల జరిగేది కాదు, కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమయింది. కానీ చేతుల్లోనికి పేడాలు, మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యక్షమైన పేడాగాని, మిఠాయిగాని మరోచోట నుంచి తెప్పించబడేవి. అంటే ఒక చోట నుండి మరొక చోటికి బదిలీ చేయడం అన్నమాట. అందుకే బాబా దీనిని నిషేధించారు".

ఇకపోతే పేడాలు సృష్టించే పూర్వపు మంత్రవిద్య విషయంలో కుశాభావు బాబా విధించిన నిషేధాన్ని దాదాపు పాటించేవాడు. కానీ అప్పుడప్పుడు భక్తుల ప్రలోభానికి లోనై ఆ మంత్రశక్తులను ప్రయోగిస్తుండేవాడు. ఒకసారి శిరిడీలోనే పేడాలను సృష్టించాడు. దుష్టశక్తులను తిప్పికొట్టే మంత్రవిద్యను కూడా అతను ప్రయోగిస్తుండేవాడు. ఒకసారి రాజ్ మచికర్ మనవడిపై దుష్టప్రయోగమేదో జరిగింది. ఆ ప్రభావం వలన అతని శరీరంపై, గుడ్డలపై, పడకపై అకారణంగా మచ్చలు ఏర్పడేవి. అదొక రకమైన క్షుద్రశక్తి ప్రయోగం. దాన్ని త్రిప్పికొట్టే ప్రత్యేక మంత్రాలను కుశాభావు అభ్యసించి ఉన్నందువలన రాజ్ మచికర్ అతనికి కబురుపెట్టాడు. అతను వారింటికి వెళ్లి దుష్టప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి, దత్తాత్రేయుని పూజ నిర్వహించి, ఆరతి ఇచ్చాడు. అంతటితో ఆ దుష్టశక్తి ప్రభావం పూర్తిగా నియత్రించబడింది.

ఒకసారి కుశాభావు శిరిడీ వెళ్లి బాబాను దర్శించినప్పుడు బాబా అతనితో, “నన్ను చూడటానికి శ్రమపడి ఇంతదూరం ఎందుకు వస్తావు? నేను అక్కడే ఉన్నాను!” అని, అతని స్వగ్రామమైన మిరాజ్‌గాఁవ్‌లో తామున్న ఒక నిర్దిష్ట ప్రదేశం గురించి వర్ణించి చెప్పారు. తరువాత కుశాభావు ఆ ప్రదేశానికి వెళ్లి ముళ్లపొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరచగా అక్కడ అతనికొక సమాధి కనిపించింది. అది హజరత్ ఫకీర్ షా సమాధి. ఫకీర్ షా 200 సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలం అప్పటి జాగీర్దారువారికి ఈనాముగా ఇచ్చారు. కుశాభావు ఆ స్థలాన్ని కొని ఆ సమాధిని పూజించసాగాడు. అతనికక్కడ బాబా దర్శనం అవుతుండేది. దాంతో అతను శ్రీరామనవమికి మాత్రమే శిరిడీ వెళ్తుండేవాడు. కుశాభావు ఇలా చెప్పాడు: "భక్తులలో నమ్మకం కలిగించేందుకు ఫకీర్ షా దర్శనమిస్తుండేవారు. చాతుర్మాసాలలో వారి దర్శనం లభించదుగానీ వారి మాటలు వినపడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. వారి మాటల ద్వారా భక్తి, జ్ఞాన మార్గాలలో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. వారు అప్పుడప్పుడు సాయిబాబా గురించి మాట్లాడేవారు. తామూ, సాయిబాబా ఒకే కూటమికి చెందినవారమని, వారితో తమకు సన్నిహిత బంధమున్నదని చెప్పేవారు. వారు శ్రీసాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు, కానీ ఏ రూపంలో ఉన్నది మాత్రమే తెలియజెప్పేవారు కాదు".

బాబా మార్గనిర్దేశంలో కుశాభావు ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధి పొందాడు, ఎన్నో సిద్ధులు సంపాదించాడు. వాటిని ధర్మబద్ధంగా మానవాళి సహాయార్థం ఉపయోగిస్తుండేవాడు. ‘బాబా ప్రచారం’ అన్న ధ్యేయంతో కుశాభావు ఒకచోట నుండి ఇంకోచోటికి తిరుగుతూ బాబా భజనలు, ఆరతులు చేస్తూ, బాబా ఊదీతో పలురకాల రోగాలను నయం చేస్తుండేవాడు. పూనాలోని ఒక సంపన్న కుటుంబంలో పక్షవాతం వంటి దీర్ఘకాలిక రోగంతో ఒకతను బాధపడుతుండేవాడు. కుశాభావు ఊదీతో అతనికి నయం చేశాడు. కుశాభావుకి చాలామంది శిష్యులు అయ్యారు. వారిలో ప్రథముడు వి.ఆర్.కులకర్ణి. పూణే నగరంలో ఎక్కువమంది శిష్యులున్నందున కుశాభావు తాను అక్కడే సమాధి చెందాలని తలచాడు. ఆ కారణంగానే అతను పూణేలో నివాసం ఏర్పరచుకున్నాడు. కుశాభావు యొక్క ఇష్టదైవం దత్తాత్రేయుడు. ప్రతి సంవత్సరం స్వగ్రామం వెళ్లి ఎంతో ఉత్సాహంగా దత్తజయంతి జరుపుతుండేవాడు. తన శిష్యులు దత్తాత్రేయుని, బాబాని ఆరాధించేలా అతను చూసుకునేవాడు.

1944, ఫిబ్రవరి 19, శనివారం, మాఘ బహుళ దశమి, మధ్యాహ్నం 12:00 గంటలకు కుశాభావు తుదిశ్వాస విడిచాడు. తన మరణానికి ముందు కులకర్ణి మరియు ఇతర శిష్యవర్గానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. పూణేలో పార్వతి పైథా అనే ప్రాంతంలోని శివాజీ గిరి పాదాల వద్ద ఒక ఇంటిలో కుశాభావు సమాధితో కూడుకున్న మందిరం ఉంది. మందిరంలో కుశాభావు సమాధితోపాటు సాయిబాబా మరియు దత్తాత్రేయుని మూర్తులు దర్శనమిస్తాయి. తన ఇష్టదైవాలైన సాయిబాబా, దత్తాత్రేయులను అభిషేకించిన జలాలు తన సమాధి మీదుగా జాలువారాలని కుశాభావు కోరిక. ఆ కోరికను ‘సద్గురు దాస్ కీ సేన్ సాయిబాబా' మండలిని ఏర్పాటు చేసిన అతని శిష్యులు నెరవేర్చారు. రెండు కారణాల వలన కుశాభావు సమాధి ఉన్న మందిరం పూణేలో ప్రసిద్ధి గాంచింది. మొదటిది, ఇక్కడ సేవ చేసిన వారి కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసం. అత్యంత విశిష్టమైన మరో కారణం ఏమిటంటే, ఇక్కడి సమాధిపై ఉన్న పాలరాతి మీద సాయిబాబా మానవాకృతిలో దర్శమిస్తుంటారు.

source: Baba's Runanaubandha by vinny chitluri.
(Ref: Sbri Krishnanath Mabaraj Yacha Parichay. Published by VR Kulkarni, at Shri Krishnanath Dutt Mandir) 

సాయిభక్తుల అనుభవమాలిక 586వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి ప్రసాదించిన దివ్య అనుభవాలు
  2. మనశాంతి ప్రసాదించిన బాబా

సాయి ప్రసాదించిన దివ్య అనుభవాలు

సాయిభక్తురాలు 'సాయి' తనకి బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

కొన్నిరోజుల క్రితం నేను తీవ్రమైన తలనొప్పితో చాలా బాధపడ్డాను. రెండు రకాల మందులు వాడినప్పటికీ నొప్పి తగ్గలేదు. అసలే కరోనా సమయం కావడంతో నాకు భయమేసి, "నా తలనొప్పి తగ్గించండి బాబా, 5 వారాల దివ్యపూజ చేస్తాను. అలాగే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి, కొంచెం బాబా ఊదీని నీటిలో కలుపుకుని త్రాగాను. ఆశ్చర్యంగా ఒక గంటలో తలనొప్పి తగ్గిపోయింది. మన అందరి వైద్యుడైన బాబా నా తలనొప్పిని తగ్గించడంతో ఎంతో సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

మరో అనుభవం:

కరోనా లాక్‌డౌన్ సెలవుల కారణంగా నేను ఐసెట్-2020 ప్రవేశ పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాను. దానికి తోడు ప్రశ్నాపత్రం చాలా కఠినంగా వచ్చింది. “ఎలా అయినా నేను పాస్ అయ్యేలాగా మీరే చూడాలి బాబా” అని బాబాని ప్రార్థిస్తూనే నేను పరీక్ష వ్రాశాను. బాబా దయవల్ల నేను ఊహించినదానికంటే నాకు మంచి ర్యాంక్ వచ్చింది.

ఇంకో అనుభవం:

నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉన్నపుడు జరిగిన అనుభవం ఇది. నేను ఉండేది పల్లెటూరు. ప్రతిరోజూ నేను మా ఊరినుండి సిటీలో ఉండే కాలేజీకి ఆటోలోగానీ లేదా బస్సులోగానీ వెళ్తుండేదాన్ని. ఒకరోజు అదనంగా ఒక ప్రైవేట్ క్లాసు తీసుకుని సాయంత్రం గం. 6.50 ని.లకి కాలేజీ వదిలారు. ఆలస్యం అవడంతో ఒక్కదాన్నే బస్టాపులో ఉండడానికి నాకు భయమేసింది. "బస్సు వచ్చేదాకా తోడు ఉండమ"ని నా స్నేహితురాలిని అడిగితే, తనకు కూడా ఆలస్యమవుతుంది, వెళ్ళాలి అని అన్నది. ఇక ఏమి చెయ్యాలో తెలీక, "ఇప్పుడెలా బాబా? ఏదో ఒకటి చేయండి" అని అనుకుంటూ ఉన్నాను. అంతలో ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి ప్రక్కకి తిరిగి చూశాను. మా ఇంటి దగ్గర ఉండే నా స్నేహితుడు నా ప్రక్కన నిలుచుని ఉన్నాడు. తను మా కాలేజీలోనే చదువుతున్నాడు. సాధారణంగా ప్రతిరోజూ ఇద్దరం ఒకే బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తాము. అయితే అప్పటికి ఒక నెలరోజుల ముందునుంచి స్పోర్ట్సు కారణంగా తను కాలేజీకి రావట్లేదు. అలాంటిది నేను బాబాని సహాయం అడిగానో లేదో మరుక్షణంలో నా స్నేహితుడు, "సాయీ, సాయీ, రా! బస్సు వస్తోంది" అని పిలుస్తూ నా ముందు ఉన్నాడు. అందరిలో ఉన్నది బాబానే. సహాయాన్ని కోరినంతనే నా స్నేహితుడి రూపంలో నాకోసం వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

సాయిరాం!!!

మనశాంతి ప్రసాదించిన బాబా

ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు, నా తోటి సాయిభక్తులందరికీ నా ధన్యవాదాలు. ఇటీవల మా బాబు ఒక పరీక్ష వ్రాశాడు. తను అందులో ఉత్తీర్ణత సాధించాలని దయచేసి అందరూ బాబాను ప్రార్థించండి. ఇక నా అనుభవానికి వస్తే.. నా పేరు సునీత. నేను పంచుకునే అనుభవం చిన్నదే కావచ్చు, కానీ ఆ అనుభవం ద్వారా బాబా నాకు ఎంతో మనశ్శాంతిని ప్రసాదించారు.

మేము పదిమంది డ్వాక్రా సభ్యులం. ఒకసారి అందరం కలిసి లోన్ తీసుకున్నాము. అందులో ఇద్దరు సభ్యులు, “మేము నెలవారీ వాయిదాలు తిరిగి కట్టలేము” అని లోన్ తీసుకోలేదు. దాంతో ఆ లోన్లు కూడా నేనే తీసుకుని నెలవారీ వాయిదాలు కట్టుకుంటున్నాను. అంతా సాఫీగానే జరుగుతోంది. లోన్ కూడా పూర్తి అయిపోవచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి, ‘మా డబ్బులు మాకు కావాల’ని పేచీ పెట్టారు. “అది ఎలా సాధ్యం? దాదాపు లోన్ అంతా కట్టేశాను. ఇప్పుడెలా డబ్బులిస్తాను?” అన్నాను. దానికి వాళ్ళు చాలా గొడవ చేయాలని వచ్చారు. కానీ నేను బాబానే నమ్ముకున్నాను. “బాబా! అంతా నువ్వే చూసుకో! నాలుగు రోజుల నుండి నాకు మనశ్శాంతి లేదు. నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి బాబా!” అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. పదిమంది డ్వాక్రా సభ్యులు వచ్చారు. అంతలో అద్భుతం జరిగింది. గొడవ చేయాలని వచ్చినవాళ్ళు ఆ పదిమంది చెప్పిన మాట విని చాలా నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. “చాలా సంతోషంగా ఉంది బాబా! ఇదంతా మీ ఆశీర్వాదమే! నా బిడ్డను కూడా ఆశీర్వదించండి బాబా! నా బిడ్డ పరీక్షలో పాసైతే మళ్ళీ నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను బాబా!”

సాయినాథ్ మహరాజ్ కీ జై!



మండేకర్


మండేకర్

దత్తాత్రేయుని గొప్ప భక్తునిగా పూణే నివాసి మండేకర్ అందరికీ సుపరిచితుడు. అతనికి ఒక చిన్న వ్యాపార సంస్థ ఉండేది. ఆ కారణంగా అతను తరచూ కోపర్‌గాఁవ్ వెళ్తుండేవాడు. అలా వెళ్ళినప్పుడల్లా అతను శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడు. 1914వ సంవత్సరంలో అతను వ్యాపార నిమిత్తం వెళ్తున్నపుడు, 15 సంవత్సరాల వయసున్న తన కొడుకును తనతోపాటు తీసుకుని వెళ్ళాడు. అతను వ్యాపార లావాదేవీలలో భాగంగా శిరిడీలో ఒకరికి 1500 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నందున ఆ మొత్తాన్ని కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. తండ్రీకొడుకులిద్దరూ శిరిడీ చేరుకుని ద్వారకామాయికి వెళ్ళారు. బాబా దక్షిణగా పెద్ద మొత్తాన్ని అడుగుతారని మండేకర్‌కి తెలుసు. అందువలన అతను ద్వారకామాయిలోకి అడుగుపెట్టేముందు తన దగ్గరున్న డబ్బును తన కొడుకుకిచ్చి భద్రపరచాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే అతను డబ్బును తన కొడుక్కిచ్చి, "తాను సాయిబాబా దర్శనం చేసుకుని వచ్చేవరకూ ద్వారకామాయి బయటనే వేచి ఉండమ"ని కొడుకుతో చెప్పాడు. తరువాత అతను లోపలికి వెళ్ళి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారాలు అర్పించి వారి ఆశీర్వాదం, ఊదీ తీసుకుని బయటికి వచ్చాడు. అప్పుడు అతను కొడుకు దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని, తనను వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని చెప్పాడు.

మండేకర్ కొడుకు లోపలికి వెళ్ళి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనికి ఊదీ ఇస్తూ, "నాకు 1500 రూపాయలు ఏకమొత్తంగా ఇవ్వు" అని బిగ్గరగా అరిచారు. పిల్లవాడు చాలా భయపడిపోయి, కంగారులో తన దగ్గర డబ్బులు లేవన్న సంగతే మరచి డబ్బుకోసం తన జేబులు తడుముకుని, "నా దగ్గర డబ్బులు లేవ"ని చెప్పాడు. కానీ బాబా శాంతించలేదు. అలాగే కొంతసేపు అరిచారు. పిల్లవాడు భయంతో ఓదార్చశక్యం కానంతగా ఏడ్వసాగాడు. దయాళువైన బాబా శాంతించి, పిల్లవాణ్ణి తమ ప్రక్కనే కూర్చుండబెట్టుకుని, తన చేత దత్తమంత్రాన్ని రమారమి అరగంటసేపు పఠింపజేశారు. ఆ విధంగా తానెంచుకున్న మంత్రాన్ని బాబా సమక్షంలో పఠించే మహద్భాగ్యం ఆ పిల్లవానికి లభించింది. తరువాత పిల్లవాణ్ణి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు బాబా. 

అప్పుడు పిల్లవాడు బయటకి వచ్చి తన తండ్రిని ఇలా హెచ్చరించాడు: "మీరు ఏమి చేసినా దాన్ని బాబా దగ్గర దాచడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఆయన సాక్షాత్తూ భగవంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకి అన్నీ తెలుసు. ఇకమీదట ఇలాంటి పని చేయనని నాకు వాగ్దానం చేయండి" అని. బాబా దైవత్వాన్ని గ్రహించి మండేకర్ తన కొడుకుకి వాగ్దానం చేశాడు. తరువాత తండ్రీకొడుకులిద్దరూ తిరిగి బాబా వద్దకు వెళ్లి క్షమించమని వేడుకున్నారు.

రెఫ్: శ్రీసాయి ప్రసాద్ పత్రిక, 1990 (దీపావళి సంచిక) 
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 585వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అతి పెద్ద గండం (కరోనా మహమ్మారి) నుండి అతి తేలికగా కాపాడిన బాబా
  2. బాబా ప్రసాదించిన స్వప్నానుభవాలు

అతి పెద్ద గండం (కరోనా మహమ్మారి) నుండి అతి తేలికగా కాపాడిన బాబా

సద్గురు సాయినాథునికి హృదయపూర్వక, కృతజ్ఞతాపూర్వక అంగాంగ సర్వాంగ సాష్టాంగ నమస్కారములు. నా పేరు కుమార్. నా వయసు 40 సంవత్సరాలు. నేను ఇంటర్మీడియట్ చదువుకొనే రోజుల నుంచే బాబాను పూజించటం ప్రారంభించాను. ప్రతి గురువారం బాబా గుడికి వెళుతూ, ప్రతిరోజూ ఇంట్లో బాబా పటానికి పూజచేసుకుంటూ ఉండేవాడిని. సాయిలీలామృతము నాకు నిత్యపారాయణ గ్రంథం. నా జీవితంలో బాబా నన్ను ఎన్ని విధాలుగా కాపాడారో, ఎన్నిసార్లు రక్షించారో, ఎన్ని సలహాలనిచ్చి నన్ను ఎన్ని సమస్యల నుంచి గట్టెక్కించారో చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే వ్రాయవచ్చు. అవన్నీ ఒక్కొక్కటిగా నేను మీతో పంచుకుంటాను.

నేను హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. కోవిడ్ సమయంలో ఇంట్లోనే ఉండి ఆఫీస్ పని చేసుకుంటూ ఏదైనా అవసరమైనపుడు మాత్రమే బయటికి వెళుతూ వుండేవాడిని. బయటనుంచి రాగానే చేతులు, కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేవాడిని. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత, ఒకరోజు అకస్మాత్తుగా నాకు జలుబు మొదలైంది. అసలే బయట కోవిడ్ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ వుంది. రోజుకి కొన్ని వేల కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. అలాంటి గందరగోళ పరిస్థితులలో నాకు జలుబు (ముక్కు దిబ్బడ) మొదలైంది. ఆ తరువాత ఒళ్ళునొప్పులు, కొద్దిగా జ్వరం కూడా మొదలైంది. ఆ రాత్రి నిద్రపోవడం కూడా చాలా కష్టమైంది. ఆ తరువాత ముక్కుకి వాసన తెలియడం ఆగిపోయింది. దాంతో నాకు చాలా భయం వేసింది. అసలే ఇంట్లో చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు కూడా వున్నారు. ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే (కోవిడ్ అయితే) అందరం చాలా ఇబ్బందిపడతామని అనుకొని చాలా చాలా భయపడ్డాను. వెంటనే నేను రోజూ పూజ చేసే నా తండ్రి సాయిబాబా పటం ముందు నిలుచొని, “బాబా! ఇప్పటివరకు మాకు ఏ కష్టం వచ్చినా మీకు చెప్పుకుంటే వెంటనే ఆ కష్టాన్ని తీరుస్తూ నన్ను, మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వున్నారు. చల్లటి మీ పాదాల నీడలో మేమంతా హాయిగా వున్నాము. కానీ ఇప్పుడు నాకు వచ్చిన లక్షణాలు చూస్తుంటే చాలా భయంగా వుంది బాబా. నన్ను, నా కుటుంబాన్ని కోవిడ్ బారినుండి కాపాడండి బాబా! నాకున్న ఏకైక దిక్కు మీరే, మీ మీదే ఆధారపడి ఇన్ని రోజులు గడిపాము. ఇప్పుడు కూడా మీరే నాకు దిక్కు. కాపాడండి బాబా! రక్షించండి బాబా!” అని కన్నీళ్ళతో బాబాను వేడుకున్నాను. కొంచెంసేపటి తరువాత, మా అమ్మ మంచినీళ్ళలో బాబా ఊదీ కలిపి తెచ్చి త్రాగమని ఇచ్చింది. ఊదీనీళ్ళు త్రాగిన తరువాత సాయినాథుని దయవలన కొద్దిసేపటికే జ్వరం తగ్గిపోయింది. ఆ తరువాత ఒళ్ళునొప్పులు కూడా తగ్గిపోయాయి. ఆరోజు నుంచి సరిగ్గా నాలుగు రోజులు అలాగే బాబా ఊదీ కలిపిన నీళ్ళు తాగుతూ, మందులు వేసుకుంటూ బాబా పుస్తకాలు, బాబా లీలలు చదువుకుంటూ గడిపాను. అయిదవరోజుకి జలుబు (Nose Block) కూడా పూర్తిగా తగ్గిపోయింది. అసలు విషయం ఏమిటంటే, నాకు హై బి.పి వుంది. హై బి.పి ఉన్నవాళ్ళకి కోవిడ్ వస్తే చాలా సీరియస్ అవుతుందని చాలాచోట్ల చదివాను. కానీ నా బాబా నన్ను అతి పెద్ద గండం నుంచి అతి తేలికగా కాపాడాడు. కేవలం బాబా దయవల్ల మాత్రమే అంత పెద్ద గండం నుంచి బ్రతికి బయటపడ్డాను. ఎంతోమంది జీవితాలు కోవిడ్ బారినపడి, హాస్పటల్ బిల్స్ కట్టలేక, ఉన్న ఆస్తులన్ని అమ్మి, అప్పులపాలై, అస్తవ్యస్తమైపోయిన ఘటనలు ఎన్నో చదివాను. నా జీవితం అస్తవ్యస్తం కాకుండా నా తండ్రి సాయినాథుడు నన్ను కాపాడాడు. “బాబా! అంతటి మహమ్మారి నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడినందుకు ఈ బ్లాగ్ వేదికగా మీకు కోటానుకోట్ల కృతజ్ఞతాపూర్వక, హృదయపూర్వక నమస్కారములు అర్పించుకుంటున్నాను. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను బాబా! ఏ జన్మలోనో నేను చేసిన పుణ్యం ఈ జన్మలో నాకు మీ రూపంలో దొరికింది. బాబా! మీరు ఎప్పుడూ మా క్షేమం కోసం పరితపిస్తూ, మేము ఎప్పుడూ సుఖంగా వుండాలని ఆశిస్తారు. భగవంతుడు ఎలా వుంటాడో మాకు తెలియదు గానీ, మీరు మాపై చూపించే ప్రేమను చూస్తే మాత్రం మాకు మీరే భగవంతుడని ఖచ్చితంగా అర్థమవుతుంది. భగవంతుడు ప్రేమ స్వరూపమని, ఎంతో దయ, జాలి గల ప్రభువని ఇంకా ఖచ్చితంగా అర్థమవుతుంది. బాబా! కన్నీటితో వేడుకుంటే మీరు కరిగిపోతారు. ఎంతో గొప్ప హృదయం మీది. దయ, జాలి చూపించడంలో మీకు మీరే సాటి బాబా. మీలాంటి ప్రేమ స్వరూపం ఈ యుగాంతం వరకు వుండాలి బాబా. మమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళొద్దు బాబా. మీరు లేకుండా మేము ఈ జీవితం ఒక్క క్షణం కూడా గడపలేము బాబా. చివరగా నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే బాబా, మా మనసు వేరే విషయాల జోలికి వెళ్ళకుండా, మా మనసు నిండా మీ రూపం నిండిపోయేలా అనుగ్రహించి, స్థిరమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యములను అనుగ్రహించి, చివరికి మమ్మల్ని గమ్యం చేర్చండి బాబా!”

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా ప్రసాదించిన స్వప్నానుభవాలు

నా పేరు ప్రవీణ్ కుమార్. మాది షాద్ నగర్. సాయే నాకు అన్నీ. నేను చేసే ప్రతి పనీ సాయి చేస్తున్నట్టే ఉంటుంది. ఎందుకంటే, నా చేయి పట్టుకుని నడిపించేది నా సాయే. ఈ బ్లాగులో వచ్చే ప్రతి సాయిభక్తుని అనుభవం నాకు కలిగినట్లే ఉంటోంది. ఇక నా అనుభవానికి వస్తే... 


2020లో నాకు రెండు స్వప్నాలు వచ్చాయి. మొదటి స్వప్నంలో నాకు దత్తాత్రేయుని దర్శనమైంది. ఆ కలలో ఎవరిదో వివాహం జరుగుతున్నది. ఆ కలలోనే రామాయణం పుస్తకం కూడా కనబడుతోంది. నాకు దత్తాత్రేయుడు చెబుతున్నారో లేక ఎవరు చెబుతున్నారో స్పష్టంగా తెలియటం లేదు కానీ ఆ రామాయణం పుస్తకాన్ని చదవమని చెబుతున్నారు. అంతటితో ఆ కల పూర్తయింది.

రెండవ స్వప్నంలో బాబా ఊదీ దర్శనమిచ్చింది. నేను ప్రతి సంవత్సరం విజయదశమికి శిరిడీ వెళతాను. శిరిడీ వెళ్ళినప్పుడు ఒక సంవత్సరానికి సరిపోయేలా బాబా ఊదీని తెచ్చుకుంటాను. ఒకరోజు రాత్రి, ‘ఈ సంవత్సరం కరోనా కారణంగా శిరిడీ వెళ్ళడానికి కుదురుతుందో, లేదో’ అని అనుకుంటూ పడుకున్నాను. అప్పుడు బాబా ఊదీ కలలో దర్శనమిచ్చింది. ఆ మరునాడు మా సార్ నాకు ఫోన్ చేసి, ‘తాము సాయిమందిరం నిర్మించాలని అనుకుంటున్నామని, విజయదశమి రోజున భూమిపూజ చేద్దామనుకుంటున్నామ’ని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషం కలిగింది. ఈ సంవత్సరం శిరిడీ వెళ్ళే అవకాశం లేనందువల్ల ఈ విజయదశమికి బాబా నన్ను ఇక్కడే ఉంచి నా చేత సేవ చేయించుకుంటారని భావిస్తున్నాను.


ఓం శ్రీ సాయి సమర్థ.



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo