సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 400వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాను సహాయం అడిగితే తప్పకుండా చేస్తారు
  2. బాబా చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తుంటారు

బాబాను సహాయం అడిగితే తప్పకుండా చేస్తారు

సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

నా పేరు పద్మ. నేను సాయిబాబా భక్తురాలినని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నా జీవితంలో ప్రతిదీ బాబా ఇచ్చిందే. బాబా వద్దకు రాకముందు జీవితానికి, బాబాను నమ్ముకున్న తర్వాత ఆయన ప్రసాదించిన జీవితానికి చాలా తేడా ఉంది. నా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నన్ను మంచి మనిషిగా బాబా మలుస్తున్నారు. నాకు ఏది మంచిదో అది ఇస్తూ బాబా నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నా జీవితంలో బాబా చేసిన లీలలు ఎన్నో వున్నాయి. వాటిలో ఒక లీలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. బాబా దయతోనే మాకు బాబు పుట్టాడు. అడుగడుగునా బాబా దయతోనే మంచివాడుగా పెరుగుతూ చక్కగా చదువుకున్నాడు. తను ఇంజినీరింగ్ చదివేటప్పుడు బాబా దయతో క్యాంపస్ ప్లేస్‌మెంటులో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆ కంపెనీవాళ్ళు 5 సంవత్సరాలు బాండు అడిగారు. మంచి కంపెనీ, మంచి ఉద్యోగమని బాబు ఆ కంపెనీలో జాయిన్ అవుతానంటే, కంపెనీ అడిగిన బాండు గురించి మేము చాలా మదనపడ్డాము. చివరికి బాబా మీద భారం వేసి, ‘అంతా బాబానే చూసుకొంటార’ని ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు మా బాబు. ఒక సంవత్సరం తర్వాత తనకు ఆ ఉద్యోగం నచ్చలేదు. తాను పెద్ద చదువులు చదువుతానని పట్టుపట్టాడు. ‘మరి బాండు సంగతి?’ అని చాలా ఆందోళనపడ్డాము. బాబా నామం స్మరించుకుంటూ, “ఈ నిర్ణయం వల్ల బాబుకి ఏ సమస్యా రాకుండా నువ్వే చూసుకో బాబా” అని బాబాని వేడుకున్నాను. ఒకరోజు నా మనస్సుకు ధైర్యం చెప్పడానికా అన్నట్టు మా ఇంటి ముందుకు బాబా బండి వచ్చింది. ‘నేను ఆ బండి దగ్గర మ్రొక్కితే నా సమస్య బాబా పరిష్కరిస్తారని బాబానే ఆ బండి అతని ద్వారా చెప్పించారు. దాంతో నా మనసు కాస్త కుదుటపడింది. భారమంతా బాబా మీద వేసి మా బాబు ఆ ఉద్యోగం మానేశాడు. తను ఆ ఉద్యోగం మానేసి దగ్గర దగ్గర రెండేళ్ళు అయినా ఆ కంపెనీ నుండి ఎటువంటి సమస్యా లేకుండా బాబా చూసుకున్నారు. ఇప్పుడు మా బాబు బాబా అనుగ్రహంతో CMAT ద్వారా మంచి కాలేజీలో సీటు సంపాదించి ఉన్నత చదువులు చదువుకుంటున్నాడు. మంచి మనసుతో మనం బాబాను సహాయం అడిగితే ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. బాబా పైన భారం వేసి మనం నిశ్చింతగా ఉందాం. ఇకముందు కూడా మా పిల్లలను, నా కుటుంబాన్ని బాబా కంటికి రెప్పలాగా కాపాడుతారని నమ్ముతున్నాను. “బాబా! మా భారం నీదే తండ్రీ. మా బాబు ఉద్యోగం విషయంలో ఏది మంచిదో అది చేయి తండ్రీ. ఎల్లప్పుడూ నీ నామస్మరణ చేసేలా నన్ను దీవించు బాబా! నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతున్నందుకు థాంక్యూ, థాంక్యూ బాబా!”

బాబా చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తుంటారు

నేను బెంగుళూరు నుండి ఒక సాయిభక్తురాలిని. ప్రతి గురువారం నేను బాబాకు నైవేద్యంగా ఏదైనా తయారు చేసుకుని శివమ్మతాయి సాయి మందిరాన్ని సందర్శిస్తుంటాను. అలా ఒకరోజు నేను పులిహార తయారు చేసుకుని ఆ మందిరానికి వెళ్ళాను. బాబాకు నైవేద్య సమర్పణ, ఆరతి అయ్యాక నేను ప్రసాదం పంపిణీ చేయడానికి నిలబడ్డాను. నాతోపాటు ఒక పెద్దాయన ఛోలే (శనగలు) పంపిణీ చేయడానికి నిలుచున్నారు. నేను ఆయనకి పులిహార పెట్టాను. ఆయనకి అది ఎంతగానో నచ్చి మళ్ళీ మళ్ళీ పెట్టించుకుని తిన్నారు. అది నా మనసుకు సంతోషాన్నిచ్చింది. ఆయన నాకు ఛోలే ఇచ్చారు. అది కూడా రుచికరంగా ఉంది. మరోసారి తినాలని నాకున్నా కూడా ప్రసాదం కోసం చాలామంది స్కూలు పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నందున నేను మౌనంగా ఉండిపోయాను. భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేయడం ముగిశాక ఆయన నావైపు చూసి పులిహార పెట్టించుకున్నారు. ఆయన కూడా నాకు ఛోలే ఇస్తారేమోనని చూశాను కానీ అది ఖాళీ అయిపోయినట్లుంది. అందువలన నా కోరిక నా మనస్సులోనే ఉండిపోయింది. తరువాత నేను ఇంటికి వెళ్తూ దారిలో ఎందుకో తినడానికి వడ (తిని చాలా రోజులైనందువల్ల) ఉంటే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన నా మనస్సులోకి వచ్చింది. ఆ కోరికను కూడా మనసులోనే దాచుకుని ఇంటికి చేరుకున్నాను. బాబా చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తుంటారు. కాబట్టి నా మనసులోని కోరిక నెరవేరడానికి ఎంతో సమయం పట్టలేదు. రాత్రి 7 గంటలకు నా స్నేహితురాలొకరు సాయి ప్రసాదం ఇవ్వడానికి వస్తున్నానని చెప్పింది. నేను తనకోసం వేచి చూస్తుంటే ఆమె ఒక ట్రేతో నా ముందుకొచ్చింది. అందులో ఉన్న ఛోలే, వడ చూసి నాకు ఆశ్చర్యం! ఆనందం! అసలు నా స్థితిని ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియడంలేదు. ఇది చాలా చిన్న విషయమే, కానీ హృదయం పులకించిపోయింది. "లవ్ యు బాబా!". నా ఆనందాన్ని నాలోనే దాచుకోలేక మీ అందరితో పంచుకోవాలని అనిపించింది.


సాయి అనుగ్రహసుమాలు - 358వ భాగం.


ఖపర్డే డైరీ - నలభై మూడవ భాగం.

ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చాక నెలలోనే దాదాసాహెబ్ శిరిడీ మొదటిసారి దర్శనం చేసుకోవటం చూశాం. అది ఒక వారంరోజుల్లోనే ముగిసింది. అయితే అప్పటినుంచీ, కొన్ని నెలల్లోనే రాజకీయ పరిస్థితి క్షీణించింది. ప్రభుత్వం జాతీయోద్యమాన్ని అణిచివేయటం కోసం తన అణిచివేత ఫథకాలను మరింత తీవ్రం చేసింది. 1911 అక్టోబరు 7న బిపిన్ చంద్రపాల్ ప్రయాణిస్తున్న స్టీమరు ఇంగ్లాండు నుండి బొంబాయికి చేరగానే అతని మీద దేశద్రోహ నేరం ఆరోపించి అతన్ని అరెస్టు చేయటమే దీనికి గుర్తు. లోకమాన్య విడుదల కోసం ఖపర్డే ఆందోళన చేస్తున్నందువల్ల అతను ప్రభుత్వం వారి బ్లాక్ లిస్టులో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేయటం అతి సమీపంలోనే పొంచి ఉంది. గవర్నమెంటు తీసుకోబోయే నిర్ణయం గురించి సరైన సమాచారాన్ని సేకరించటానికి ఖపర్డే పెద్దకొడుకు ఆ సమయంలో సిమ్లా వెళ్ళాడు. తాము సర్వజ్ఞులు కనుక, ఈ ప్రపంచంలో తమకు తెలీకుండా తమ దృష్టిని తప్పించుకొని ఏదీ ఉండదు కనుక సాయిబాబా తమ దివ్యదృష్టితో దీన్నంతా చూసి ఉండాలి. దానినే సాయిబాబా తమ నిగూఢ పరిభాషలో సూచించారు. 1911 డిసెంబరు 29న వ్రాయబడిన శిరిడీ డైరీలో ఆ విషయం స్పష్టంగా ఉంది. "నేను ఇంకా రెండు నెలలు ఉండాల"ని ఈ మధ్యాహ్నం ఆయన (సాయిబాబా) కబురు చేశారు. మధ్యాహ్నం ఈ సందేశాన్ని స్థిరపరచి, తమ "ఊదీ" గొప్ప ఆధ్యాత్మిక లక్షణాలు కలిగివున్నదని చెప్పారు. సాయిబాబా నా భార్యతో, "గవర్నర్ ఒక ఈటెతో వచ్చాడనీ, తాను (సాయిబాబా) తన వద్దనున్న త్రిశూలంతో బయటకు నెట్టి చివరికి గవర్నరుని సమాధాన పరిచామనీ" అన్నారు. భాష చాలా నిగూఢంగా ఉండటం వల్ల వివరించటం కష్టంగా ఉంది.

బాబాసాహెబ్ ఖపర్డే తన తండ్రి జీవిత చరిత్రలో, "ఊదీ" అనే మాటను సాయిబాబా దయగానూ, "గవర్నరు" యొక్క "ఈటె"ని "అరెస్టు వారెంటు"గానూ, "త్రిశూలాన్ని" బాబా యొక్క దివ్యశక్తిగానూ వివరించాడు.

29-12-1911 శిరిడీ డైరీ ఎంట్రీలో "హంస"గానూ, "స్వామి"గానూ పిలువబడే “మిస్టర్ నటేకర్" గురించిన వివరం కూడా ఉంది. హంస సన్నగా, తెల్లగా, మంచి కనుముక్కు తీరుతో, మంచి గాత్రంతో ఉండేవాడు. దానితో పాటు కొంచెం వాగుడుకాయలా కూడా ఉండేవాడు. అతను బాహ్యంగా ప్రదర్శించే పవిత్రతతోనూ, తన హిమాలయ మరియు మానససరోవర యాత్రావిశేషాలను కథలుగా చెపుతూ ఖపర్డే కుటుంబం యొక్క విశ్వాసాన్ని చూరగొన్నాడు. ఖపర్డే ఇంగ్లాండులో ఉన్నప్పుడు హంస ఓ నెలపాటు ఖపర్డే కుటుంబం వారి అతిథి సత్కారాలను హాయిగా అనుభవించాడు. 

1913లో దాదాసాహెబ్ యొక్క తొమ్మిది డైరీలు  తాళం వేసి ఉన్న చెక్కపెట్టెలో నుండి దొంగిలించబడినట్లు కనుగొన్నారు. అయితే వాటిల్లో నేరారోపణ చేయదగ్గ విషయాలేవీ లేనందువల్ల ప్రభుత్వం ద్వారా ఆ డైరీలు తిరిగి ఖపర్డేకు ఇచ్చివేయబడ్డాయి. ఈ సంఘటన జరిగిన చాలాకాలానికి "హంస" ప్రభుత్వంచే నియోగించబడిన సిఐడి డిటెక్టివ్ అనీ, అతను దాదాసాహెబ్ శిరిడీలో ఉన్నప్పుడు అతని వ్యవహారశైలిని గమనించడానికి శిరిడీ వచ్చాడనీ ఖపర్డేకు తెలిసింది. 

1913 జూన్ 14న దాదాసాహెబ్ తన డైరీలో ఇలా రాశాడు: 

"సాధువులా కనిపించటానికి హంస అనేక ముందుజాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది" అని. 'హంస' శిరిడీలో ఉన్న సమయంలో, ఖపర్డే 29-12-1911 డైరీలో “ఊదీ" గురించి, గవర్నరును "త్రిశూలం"తో తరిమివేయటాన్ని గురించి రాయటంలో అర్థం లేకపోలేదు. హంస కుట్రలను తెలుసుకొని, తన శక్తులను ఉపయోగించి తన విశ్వాసపాత్రుడైన భక్తుడికి రాబోయే ప్రమాదాలను శ్రీసాయిబాబా తొలగించి ఉంటారనటంలో ఆశ్చర్యమేమీ లేదు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 399వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఊదీని మించిన ఔషధం ఉంటుందా!
  2. సాయి కరుణించారు

బాబా ఊదీని మించిన ఔషధం ఉంటుందా!

నా పేరు సుచిత్ర. నేను నిర్మల్ వాసిని. ముందుగా సాయిదేవుని పాదాలకు నమస్కరిస్తూ బాబా నా ఆరోగ్య విషయంలో చేసిన గొప్ప సహాయాన్ని మన సాయికుటుంబంతో పంచుకుంటాను. ఒకరోజు నా గొంతులో బాగా నొప్పిగా ఉందని హాస్పిటల్‌కి వెళ్ళాము. డాక్టర్ పరీక్షించి, “థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది, పరీక్షలు చేసి చూద్దాం, వచ్చిన రిపోర్టులను బట్టి అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది” అని చెప్పారు. ఆపరేషన్ అనగానే చాలా భయపడిపోయాను. ఇంటికి వచ్చి బాబాను పట్టుకొని ఎంతో ఏడ్చాను. “ఏంటి బాబా ఇది? నాకు ఆపరేషన్ చేయాలంటున్నారు. నీ బిడ్డనైన నేను ఆ నొప్పిని ఎలా తట్టుకోగలను బాబా?” అంటూ కన్నీళ్ళతో బాబాకు చెప్పుకున్నాను. బాబాతో నా బాధ చెప్పుకున్న పదినిమిషాల్లో, సాయితండ్రి నాకు ప్రసాదించిన సాయిస్నేహితురాలు కల్పనగారు నాకు ఫోన్ చేసి, “ఈరోజు బ్యాంకుకి సెలవు. అందువల్ల మా ఇంటికి రండి” అని పిలిచింది. ‘నన్ను పిలిచింది కల్పనగారు కాదు, ఖచ్చితంగా బాబానే!’ అని నాకు తెలుసు. వెంటనే వాళ్ళింటికి వెళ్ళాను. “నన్ను పిలవడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారా?” అని తనని అడిగాను. “లేదు సుచిత్రగారూ! మీకు కాల్ చేసిన సంగతే మర్చిపోయాను. ఆ క్షణంలో ఏదో అనిపించింది, కాల్ చేశాను” అన్నారు తను. నేను నిర్ఘాంతపోయాను. నన్ను ఓదార్చడానికి బాబానే ఇక్కడికి పిలిచారని నాకు పూర్తిగా అర్థమైంది. నిజం! కల్పనగారు బాబాకు మంచి భక్తురాలు. కొంతసేపు ఇద్దరం బాబా గురించి మాట్లాడుకున్నాం. ఆ తరువాత తను, “బాబాకు జొన్నరొట్టె మరియు ఉల్లిపాయ పచ్చడి చాలా ఇష్టం. మీకోసం చేశాను, తినండి” అంటూ బాబా ప్రసాదాన్ని నాకు పెట్టింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ తరువాత నుంచి ప్రతిరోజూ నేను బాబా ఊదీని గొంతుకి రాసుకునేదాన్ని. అలా ఒక వారంరోజుల గడిచిన తరువాత డాక్టర్ చెప్పిన పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళాము. డాక్టర్ నా గొంతు పరీక్షించి, “వారం క్రితం ఉన్నంత సమస్య ఇప్పుడు లేదు, చాలావరకు తగ్గింది” అని చెప్పారు. అప్పుడు నేను మనసులో “బాబా ఊదీని మించిన ఔషధం ఉంటుందా మరి!” అని అనుకున్నాను. అదే రోజు బ్లడ్ టెస్ట్ చేయించాము. రిపోర్టులు రావడానికి ఒక వారం పదిరోజులు పడుతుందని చెప్పారు. ఆ పదిరోజుల్లో బాబాను నేను వేడుకుంది ఒక్కటే – “దేవా, సాయినాథా! నా సమస్యని ఆపరేషన్ వరకు తీసుకెళ్ళద్దు, మందులతోనే తగ్గేలా ఆశీర్వదించండి” అని. గురువారంరోజు మధ్యాహ్న ఆరతి కోసం బాబా మందిరానికి వెళ్ళాను. మావారు మందిరానికి వస్తూ దారిలో రిపోర్టులు తీసుకొచ్చారు. ఇంక టెన్షన్‌తో మందిరంలోనే రిపోర్టులు ఓపెన్ చేసి చూస్తే ‘థైరాయిడ్ పాజిటివ్’ అని ఉంది. “ఈ రిజల్ట్ ఆపరేషన్ వరకు వెళ్ళకుండా మీరే నన్ను కాపాడాలి, ప్లీజ్ బాబా!” అని ఆరతిలో బాబాను వేడుకుంటూనే ఉన్నాను. తరువాత ఆ రిపోర్టులు తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్ళాము. డాక్టర్ రిపోర్టులు పరిశీలించి, “థైరాయిడ్ ఉందమ్మా. కానీ ఆపరేషన్ అవసరం లేదు. ఒక మెడిసిన్ ఇస్తాను, క్రమం తప్పకుండా వాడితే సరిపోతుంది” అని చెప్పారు. ఇంక నా ఆనందానికి అంతు లేదు. బయటకు వచ్చాక ఆనందంతో బాబాకు చాలాసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, 5 సంవత్సరాల క్రితం ఇదే సమస్యతో హాస్పిటల్‌కి వెళితే డాక్టర్ చూసి, “భవిష్యత్తులో మీకు థైరాయిడ్ వచ్చే సూచనలు ఉన్నాయ”ని చెప్పారు. తరువాత చాలాసార్లు గొంతునొప్పి వచ్చినా కూడా నేను పట్టించుకోలేదు. నేను నిర్లక్ష్యం చేసినా నా బాబా నన్ను కంటికి రెప్పలా కాపాడి, నాకు ఆపరేషన్ అవసరం లేకుండా చేశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

కరుణించిన సాయి

నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఉద్యోగస్తురాలిని. నా భర్త తన ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఉద్యోగం చేయడం లేదు. మాకు 8వ తరగతి చదువుతున్న అబ్బాయి ఉన్నాడు. నా భర్తకు నోటి క్యాన్సర్ వచ్చింది. 2019 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మావారికి రేడియేషన్, కీమోథెరఫీ జరిగింది. రేడియేషన్ వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మావారు నోరు సరిగా తెరవలేకపోయేవారు. అందువల్ల ఆయన పూర్తిగా ద్రవాహారం పైనే ఆధారపడాల్సి వచ్చింది. ఆ కారణంగా ఆయన బరువు తగ్గారు. డాక్టర్ ఆపరేషన్ చేయాలని, అందుకు 3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అది ఆర్థికంగా మాకు చాలా పెద్ద భారం. ఏమి చేయాలో మాకు అర్థం కాలేదు. ఆ స్థితిలో మేము రెండో అభిప్రాయం కోసం అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాము. డాక్టర్ని సంప్రదించే ముందు నేను, "ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్ చెప్పేలా దయ చూపండి బాబా" అని సాయిని ప్రార్థించాను. నా సాయి కరుణించారు. డాక్టర్స్ ఆపరేషన్ అవసరం లేదని, ఫిజియోథెరపీతో నయం చేయవచ్చని చెప్పారు. "బాబా! మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు. కానీ ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి మీ ఆశీస్సులు మాకు ఇంకా అవసరం. దయచేసి అనుగ్రహించండి".


సాయి అనుగ్రహసుమాలు - 357వ భాగం.


ఖపర్డే డైరీ - నలభైరెండవ  భాగం. 

బాబా సశరీరులుగా ఉన్నప్పుడు దాదాసాహెబ్ ఖపర్డే అయిదుసార్లు శిరిడీ దర్శించాడు. అతను శిరిడీ దర్శించిన తేదీలూ, అక్కడ ఎంతకాలం ఉన్నదీ ఈ క్రింద ఇవ్వబడింది.

మొదటి దర్శనం: 1910 డిసెంబరు 5 నుండి, 1910 డిసెంబరు 12 వరకు.

రెండవ దర్శనం: 1911 డిసెంబరు 6 నుండి, 1912 మార్చి 15 వరకు.

మూడవ దర్శనం: 1915 డిసెంబరు 29 నుండి, 1915 డిసెంబరు 31 వరకు.

నాలుగవ దర్శనం: 1917 మే 19వ లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌తో.

అయిదవ దర్శనం: 1918 మార్చిలో కొన్ని రోజుల పాటు.

ఇప్పుడు ప్రతి దర్శనాన్నీ విడివిడిగా గమనించి, 1924-25లో సాయిలీలా మాసపత్రికలో ప్రచురించబడిన దానికి జతగా దాదాసాహెబ్ ఖపర్డే జీవిత చరిత్రలో ఏ సమాచారం లభ్యమవుతుందో చూద్దాం.

1910 డిసెంబరులో మొదటి దర్శనం:

దాదాసాహెబ్ ఖపర్డే పూణే నుండి బొంబాయికి వచ్చి‌, అక్కడినుండి తన పెద్ద కుమారుడు బాలకృష్ణతో కలిసి డిసెంబరు 5న శిరిడీకి వెళ్ళాడు. అతనక్కడ ఏడురోజులుండి, సాయిబాబా అనుమతి తీసుకొని డిసెంబర్ 12వ తేదీన శిరిడీ నుండి బయలుదేరి డిసెంబరు 13వ తేదీన అకోలాకి వచ్చాడు. రైల్వే ప్రయాణంలో మూడు నుండి నాలుగు తరగతుల వరకూ ఉన్న ఆ రోజుల్లో అతను సాధారణంగా మొదటి తరగతిలో ప్రయాణం చేసేవాడు. అయితే ఈ సందర్భంలో తనవద్ద చాలినంత పైకం లేనందువల్ల, అతను రెండవ తరగతిలో ప్రయాణం చేసి డిసెంబరు 19న అకోట్ మీదుగా ఆమ్రావతి చేరుకున్నాడు. ఆమ్రావతి రైల్వేస్టేషన్ నుంచి తన ఇంటికి నడిచి వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉంది. దాదాసాహెబ్ లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న మనిషి తన ఇంటికి వెళ్ళటానికి వాహనానికయ్యే ఖర్చును కూడా భరించలేకపోవటం చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. జీవనవ్యయం అతి చౌకగా ఉండి, ఆదాయపు పన్ను కట్టవలసిన చట్టం లేనప్పుడే అతని సంవత్సరాదాయం 90,000 నుండి 95,000 రూపాయల వరకూ ఉండేది. దాదాసాహెబ్ తన ఆదాయానికి మించిన జీవనవిధానాన్ని అవలంబించటం వల్ల పైన వర్ణించబడిన పరిస్థితుల నుండి తప్పించుకోలేకపోయాడు.

ఒకప్పుడు అతనికి ఏడు గుర్రాలూ (అందులో రెండు ఆస్ట్రేలియావి), రెండు గుఱ్ఱపుబగ్గీలు, వాటిని చూడటానికి కావలసిన పరివారమూ ఉండేది. అతను తప్పుచేసిన వారిపట్ల చాలా దయగలిగి ఉండేవాడు. ఎన్నో కుటుంబాలకి ఆశ్రయమిచ్చేవాడు. అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతో కిటకిటలాడుతూ ఉండేది. వారి సౌకర్యాల కోసం, కాలక్షేపాల కోసం (సంగీత నృత్య విభావరులతో సహా) చాలా ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది, ఖపర్డే రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి కాలినడకన ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో.

శ్రీసాయిలీలలో చెప్పబడిన ఈ శిరిడీ సందర్శనం - ఖపర్డే జీవిత చరిత్రతో పోల్చి చూస్తే అంతా సమగ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబరు 11న రెండవ దర్శనం:

దాదాసాహెబ్ ఖపర్డే రెండవ శిరిడీ దర్శనం చాలా పెద్దది. అతనక్కడ వందరోజుల వరకు ఉండాల్సి వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనది మరియు లోతుగా పరిశీలించవలసింది. ఎందుకంటే, దాదాసాహెబ్, అతని భార్య ఆమ్రావతికి తిరిగి వెళ్ళాలని అనుకున్నప్పటికీ, సాయిబాబా వారిని శిరిడీలోనే ఉంచేసి, వారిని వెళ్ళనివ్వలేదు. తన సద్గురువైన బాబాపై ధృఢవిశ్వాసంతో, బాబా నిర్ణయమే తనకు శ్రేయోదాయకమని నమ్మిన ఖపర్డే సాయిబాబా ఆజ్ఞలను శిరసావహించాడు.

దాదాసాహెబ్‌ని బాబా అన్ని రోజులు శిరిడీలో ఉంచటానికి కారణమేమై ఉంటుంది? దాదాసాహెబ్ ఖపర్డే లోకమాన్య బాలగంగాధర తిలక్‌కు సహాయకుడూ, సమర్ధించేవాడూ అని పాఠకులకు తెలుసు. 1908, జూన్ 24వ తారీఖున ప్రజలను రెచ్చగొట్టిన అభియోగం మీద తిలక్‌ను అరెస్టు చేసి విచారణ నడిపిస్తున్నారు. ఆ విచారణ 1908, జూలై 13 వరకు కొనసాగి, తిలక్ దోషిగా నిరూపించబడి, 1908, జులై 22న అతనికి 6 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. దాని తరువాత కొద్దిరోజులకే, అంటే 1908 ఆగస్టు 15న లోకమాన్యను దోషిగా బొంబాయి హైకోర్టు వారిచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ప్రైవీ కౌన్సిలులో అప్పీలు చేసుకోవటానికి దాదాసాహెబ్ ఇంగ్లాండు వెళ్ళాడు. 1908, ఆగష్టు 31న అతను డోవర్ చేరి వెంటనే లండనుకి వెళ్ళిపోయాడు. అనుకున్న విధంగా ప్రైవీ కౌన్సిల్‌లో అతను ఒక పిటీషను పెట్టుకొన్నాడు. కానీ బొంబాయి హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా తిలక్‌ను వదిలేయటానికి ప్రైవీ కౌన్సిల్ తిరిస్కరించింది. సరైన మద్దతు లేకపోవటం వల్ల హౌస్ ఆఫ్ లార్డ్స్‌కి అతను పెట్టుకున్న అప్పీలు కూడా విఫలమైంది. ఇండియాకు స్టేట్ సెక్రటరీ అయిన లార్డ్ మోర్లేకు పెట్టుకున్న అర్జీ వల్ల కూడా లాభం లేకపోయింది. చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధమైపోగా, ఖపర్డే 1910 సెప్టెంబరు 15న (ఇంగ్లాండులో రెండు సంవత్సరాలున్న తరువాత) రంగూన్ మీదుగా ఇండియాకు వచ్చాడు. తిలక్‌కి వ్యతిరేకంగా ఇవ్వబడిన తీర్పుని ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్చలేకపోయాడు. తన నాయకుడి విడుదల కోసం తన స్వంత ఖర్చులతో ఇంగ్లాండుకి వెళ్ళాడు. ఇంగ్లాండులో అతను పడిన శ్రమ తన నాయకుడి పట్ల అతనికున్న విధేయతనూ, భక్తినీ మాత్రమేగాక, తను న్యాయమని నమ్మిన సిద్ధాంతం కోసం తన శక్తినీ, కాలాన్నీ, డబ్బునీ పణంగా పెట్టగల అతని స్వార్థరాహిత్యాన్ని కూడా నిరూపిస్తోంది.

అతను ప్రయాణంలో ఉండగానే 1910 సెప్టెంబరు 27వ దాదాసాహెబ్ తల్లి మరణించింది. ఖపర్డే 16-10-1910న రంగూన్ చేరి, 22-10-1910న మాండలే జైలులో తిలక్‌ని కలిశాడు. 27-10-1910న కలకత్తా చేరి, 5-11-1910న ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి అతను ఇల్లు వదలి రెండు సంవత్సరాల రెండునెలల ఇరవై రెండు రోజులు అయింది.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 398వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • తమంతట తాము వచ్చి కాపాడిన బాబా

నేను ఒకసారి వారంరోజులపాటు ఒక విషయం గురించి బాబాతో పోట్లాడినందువల్ల నన్ను నేను బాబాకు భక్తురాలినని చెప్పుకోవచ్చో, లేదో నాకు తెలియదు. నేను బాబా భక్తురాలినని చెప్పుకునే హక్కును కోల్పోయాను. కానీ పోట్లాడినా, అరిచినా బాబా పాదాలనే నేను ఆశ్రయించగలిగేది. "క్షమించండి బాబా! దయచేసి నా ప్రవర్తనకు మన్నించండి".

ఉద్యోగస్తురాలినైన నేను ప్రేమగా చూసుకునే నా భర్త, ఇద్దరు పిల్లలతో దుబాయిలో నివాసముంటున్నాను. మొదట్లో నేను బాబాకు భక్తురాలిని కాదు. కానీ బాబానే నన్ను, నా కుటుంబాన్ని దగ్గరకు తీసుకుని తమయందు దృఢమైన విశ్వాసం స్థిరపడేలా చేసుకున్నారు. ఇప్పుడు బాబా మా కుటుంబంలో ఒకరు. ఆయనతో సంబంధం లేకుండా మా ఇంట్లో ఏదీ జరగదు. కొన్నేళ్ల క్రితం బాబా నన్ను, నా భర్తను మోసపోకుండా కాపాడిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నా భర్త తన పాత కారును ఇచ్చేసి, అధునాతన ఎస్‌యూవీ ల్యాండ్‌రోవర్‌ కారు తీసుకోవాలని అనుకున్నారు. దుబాయిలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వ్యాపారం చాలా చురుకుగా ఉంటుంది. మేము సెకండ్ హ్యాండ్ కార్లు, ఇతర వస్తువుల షోరూమ్ అయిన డుబిజిల్‌లో ఒకటి నుండి రెండు సంవత్సరాలు ఉపయోగించబడిన సెకండ్ హ్యాండ్ ల్యాండ్‌రోవర్ చూడటానికి వెళ్ళాము. మంచి ధరలో ఒక వెహికల్ ఉండటంతో ఆ వెహికల్ అమ్మే వ్యక్తిని సంప్రదించి, కారును కూడా పరిశీలించాము. ఆ వెహికిల్ యజమాని ఒక దంతవైద్యుడు. అతడు ఆ కారు తన భార్యదని చెప్పాడు. అతను చెప్పినవన్నీ మేము విశ్వసించి కారు తీసుకోడానికి సిద్ధపడ్డాము. వ్రాతకోతలన్నీ పూర్తిచేసి, రిజిస్ట్రేషన్ కోసం RTA కార్యాలయానికి వెళ్ళాము. కారు అమ్మే ఆ వ్యక్తి విషయంలో అనుమానించదగ్గ చాలా సంకేతాలున్నాయి కానీ, మా అమాయకత్వం వల్ల వాటిని గుర్తించలేకపోయాము. ఇన్సూరెన్స్ చేయాల్సిన బ్రోకర్ ఆ కారు విషయంలో అసౌకర్యాన్ని వ్యక్తపరుస్తూ మరికొన్ని వివరాలను అడిగాడు. వాటిని కారు అమ్ముతున్న వ్యక్తి అందిస్తాడనే విశ్వాసంతో పేపర్ల మీద సంతకాలు పూర్తయిన తర్వాత అతనికి చెల్లించడానికి మేము డబ్బు కూడా సిద్ధంగా పెట్టుకున్నాము. కొద్దిసేపటికి నేను కొన్ని డాక్యుమెంట్ల ఫోటోకాపీల కోసం వెయిటింగ్ హాల్ నుండి బయటకు వెళ్ళాను. అకస్మాత్తుగా, చూడటానికి అచ్చం బాబాలా ఉన్న ఒక వృద్ధుడు నా దగ్గరికి వచ్చి, మా మాతృభాష అయిన తమిళంలో "అమ్మకందారుడు పెద్ద మోసగాడు" అని హెచ్చరించాడు. ఇంకా, "అతను చెప్పేవన్నీ అబద్ధాలు, అతను దెబ్బతిన్న కార్లను ఎంచుకుని, వాటికి పెయింటింగ్ మొదలైనవి వేసి అమాయకులను మోసం చేసి  అమ్మేస్తుంటాడు. పాపం ఆ అమాయకులు కారు కొనుక్కున్న తరువాత లక్షలు ఖర్చు పెట్టాల్సిన పెద్ద మరమ్మతులు ఉన్నాయని తెలుసుకుంటారు" అని చెప్పాడు. అది విన్న నేను నిర్ఘాంతపోయాను. నేను ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి, మెల్లగా వెళ్లి నా భర్తకు విషయం చెప్పాను. తరువాత భీమా సంస్థ నుండి కొన్ని పేపర్లు తీసుకుని రావడానికి వెళ్తున్నామని అమ్మకందారునితో చెప్పి మేము బయటికొచ్చి ల్యాండ్‌రోవర్ సర్వీస్ సెంటరుకి వెళ్లి, మేము కొనబోయే కారు గురించి వివరాలు చూసి చెప్పమని ఏజెంటుని అభ్యర్థించాము. సాధారణంగా అపరిచితులకు అలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం వాళ్లకు లేదు. కానీ బాబా దయతో వాళ్ళు మాకు సహాయం చేశారు. ఆ కారు ఇటీవలే ఒక పెద్ద ప్రమాదానికి గురైందని, చాలా మరమ్మతులు చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఈ విషయాలేవీ మాకు ముందు తెలియదు. మేము వెంటనే తిరిగి వెళ్లి అబద్ధాలు చెప్పినందుకు అమ్మకందారుని నిలదీసి, మా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాము. మేము ఒప్పందాన్ని పూర్తి చేసుకుని ఉంటే, దెబ్బతిన్న కారుకు డబ్బు చెల్లించి నష్టపోయేవాళ్ళము. కొద్దినిమిషాల కాలవ్యవధిలో మేము పెద్ద సమస్య నుండి బయటపడ్డాము. చివరి నిమిషంలో బాబా తమంతట తాముగా వచ్చి మమ్మల్ని కాపాడారు. ఆ సంఘటన గురించి ఇప్పుడు ఆలోచించినా బాబా తమంతట తాము వచ్చి సహాయం చేసేందుకు తగినట్లుగా మేమున్నామనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాను. "ధన్యవాదాలు బాబా! దయచేసి మా భక్తి విశ్వాసాలు స్థిరంగా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి. గత కొన్ని సంవత్సరాలుగా మా కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. మీ దయవలన మాత్రమే మేము జీవన ప్రయాణం చేయగలుగుతున్నాము. బాబా! మీరే నా దైవం, స్నేహితుడు, మార్గదర్శకుడు. గురుదేవా! మీకు మీ గురువుపట్ల ఉన్నంత భక్తి మేము మీపట్ల కలిగి ఉండేలా అనుగ్రహించండి. మీ ఆశీస్సులతో మాత్రమే ప్రతిదీ సాధ్యమవుతుంది".


సాయి అనుగ్రహసుమాలు - 356వ భాగం


ఖపర్డే డైరీ - నలభైఒకటవ భాగం

తరువాతి కాలంలో దాదాసాహెబ్‌గా వ్యవహరించబడ్డ గణేష్ ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో మొదట జూనియర్ టీచర్‌గానూ, తరువాత సీనియర్ టీచర్‌గానూ సంస్కృతాన్ని, ఇంగ్లీషుని బోధించాడు. ఈ భాషలతో పాటు గుజరాతీలాంటి ఇతర భాషల్లో కూడా అతడు ప్రావీణ్యతను కలిగి ఉండి అనర్గళంగా మాట్లాడటం గమనిస్తే అతను జన్మతః బహుభాషాకోవిదుడని చెప్పక తప్పదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత, 1884లో న్యాయవాద పట్టా పొంది, వెంటనే లీగల్ ప్రాక్టీసు ప్రారంభించాడు. 1885 నుంచి 1889 వరకు మున్సిఫ్‌గా(జడ్జి) పనిచేసి, తరువాత బార్ కౌన్సిల్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే ప్రఖ్యాత న్యాయవాదిగా పేరు గడించాడు. 1890 నుంచి అతను సామాజిక జీవనంలో కూడా పాల్గొని, జిల్లా కౌన్సిల్ ప్రెసిడెంటుగా ఎన్నుకోబడ్డాడు. ఆమ్రావతిలో 1897 భారత జాతీయ కాంగ్రెసు మీటింగులు జరిగినప్పుడు అతను రాష్ట్రీయ జీవనంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడి రిసెప్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఎన్నుకోబడ్డాడు. 

ఇప్పుడు మనం కాలంలో కాస్త వెనక్కి ప్రయాణించి, దాదాసాహెబ్ తన నిత్యజీవితంలోని విశేషాలతో ఎప్పటినుంచి డైరీ రాయటం ప్రారంభించాడో, అలాంటి డైరీలు ఎన్ని అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. 1879లో దాదాసాహెబ్ ఖపర్డే రాసిన పాకెట్ డైరీ లభించింది. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలున్నప్పటికీ, కొన్ని కాగితాల్లోని వాక్యాలు అసందర్భోచితంగానూ, చాలా కాగితాలు ఖాళీగానూ ఉన్నాయి. దాదాసాహెబ్ ఖపర్డే తన స్వదస్తూరీతో 1894 నుండి 1938 వరకు రాసిన 45 డైరీలు లభ్యమయ్యాయి. మొత్తం 46 డైరీలూ ఇప్పటికీ నేషనల్ ఆర్కైవ్స్‌లో జాగ్రత్తగా భద్రపరచబడి ఉన్నాయి.

1879 ముందుగానీ లేదా 1880-1893 మధ్యకాలంలోగానీ ఆయన డైరీలు భద్రపరచిన ఆనవాళ్లు లేవు. 1894 నుంచి 1938 వరకు ఉన్న డైరీలలో, 1938వ సంవత్సరపు డైరీ మాత్రం భారతదేశంలోనే తయారుచేయబడిన 'నేషనల్ డైరీ'. మిగిలినవన్నీ విదేశాల్లో తయారుకాబడిన డైరీలే. వాటిలో నాలుగు డైరీలు 'కోలిన్స్ డైరీలు', మిగతావి 'లేట్స్ డైరీలు'. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో 'లేట్స్ డైరీలు' లభ్యమయ్యేవి కావు. కనుకనే అతను కోలిన్స్ డైరీలు వాడవలసి వచ్చింది. ప్రతీ డైరీ 12.5" పొడుగూ, 8" వెడల్పూ, 4 పౌండ్ల 26 తులాల బరువూ కలిగివుండి, దినచర్య రాసుకోవటానికి వీలుగా ఒక్కొక్క రోజుకి ఒక్కో పేజీ కేటాయించబడివుండేది. దాదాసాహెబ్ ప్రయాణాల్లో తనతో పాటు డైరీని తీసుకువెళ్ళేవాడు. ప్రతిరోజూ రాత్రి పడుకోబోయేముందు ఆరోజులో జరిగిన విషయాలను విడమరచి రాసుకోవటం అతనికలవాటు. అతను ఈ నియమాన్ని శ్రద్ధగా పాటించేవాడు. ఎన్నోసార్లు తన దినచర్యను అర్థరాత్రి ఒంటిగంట, రెండుగంటలప్పుడు కూడా రైల్వే వెయిటింగ్ రూములో తను నిద్రపోబోయేముందు వ్రాసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తరువాతి సంవత్సరాల్లో, రోజువారీ సంఘటనలు రాత్రి పడుకోబోయేముందు రాసుకోవటం ఇబ్బందిగా అనిపించడంతో అతను ముందురోజు జరిగిన సంఘటనలను మరుసటిరోజు ఉదయం రాయటం ప్రారంభించాడు. అందుకనే వాటిలో తనకొచ్చే స్వప్నాలూ, గాఢనిద్రల గురించిన ప్రస్తావనలున్నాయి. జరిగిన సంఘటన చిన్నదైనా, ముఖ్యమైనదైనా, నిత్యమూ వాటి గురించి రాసుకునేవాడు. తనని చూడటానికి వచ్చిన వారి పేర్లూ, వారి సంభాషణలోని సారాంశమూ, ముఖ్యమైన వ్యక్తులయితే వారి మాటలూ, ప్రశ్నోత్తరాల రూపంలో, వివరంగా, నిజాయితీగా, ధైర్యంగా, శుభ్రంగా, స్పష్టమైన చేవ్రాలుతో, ఎటువంటి కొట్టివేతలూ లేకుండా వ్రాయబడి ఉంది. అతను అనారోగ్యంగా ఉన్నా డైరీ రాయటంలో మాత్రం విఫలం కాలేదు. కేవలం తాను మరణించేరోజు, అంటే 1938 జులై ఒకటవ తారీఖునాడూ, అంతకుముందురోజు మాత్రం అతను డైరీ రాయలేదు. అతను చివరిసారిగా డైరీ రాసింది 1938 జూన్ 29న.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 397వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఆ సాయినాథుడే కాపాడారు
  2. బాబా కృపతో వీసా సమస్య పరిష్కారం

ఆ సాయినాథుడే కాపాడారు

నేను సాయిభక్తుడిని. నా పేరు విష్ణువర్థన్. నేనిప్పుడు సుమారు పాతికేళ్ల క్రిందట జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

అది 1995వ సంవత్సరం. ఒకరోజు ఉదయం నేను, నా భార్య, మూడు సంవత్సరాల మా పెద్దబాబు కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు విజయవాడ రైల్వేస్టేషనుకి బయలుదేరాము. మమ్మల్ని ట్రైన్ ఎక్కించటానికి మాతోపాటు మా అన్నయ్య కూడా వచ్చాడు. స్టేషన్ చేరుకున్నాక నేను నా భార్యని, బాబుని వెళ్లి ట్రైనులో కూర్చోమని చెప్పి, నేను టిక్కెట్లు తీసుకోవటానికి టికెట్ కౌంటర్ వద్ద నిలుచున్నాను. అన్నయ్య వాళ్ళను తీసుకొని వెళ్లి ట్రైనులో కూర్చోబెట్టాడు. వాళ్లంతా నాకోసం ఎదురు చూస్తున్నారు. నేను మా టిక్కెట్లు తీసుకొని వస్తూ, అన్నయ్యకు ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకోవడం మరిచిపోయానని గుర్తొచ్చి మళ్ళీ వెళ్లి లైన్లో నిలుచున్నాను. నేను నా పనిలో ఉన్నానేగానీ ట్రైన్ కదిలే సమయమైనదన్న సంగతి చూసుకోలేదు. ఇక ట్రైన్ కదలడానికి కొద్ది సెకన్లు ఉందనగా అన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చి, "ట్రైన్ కదిలే సమయమైంది, త్వరగా రా" అని పిలిచాడు. సరిగ్గా అప్పుడే టికెట్ నా చేతికొచ్చింది. వెంటనే 1వ ప్లాట్‌ఫార్మ్ నుండి 4వ ప్లాట్‌ఫార్మ్‌కు పరుగుతీశాను. అక్కడ సాయిబాబా భక్తురాలైన నా భార్య నాకోసం కంగారుపడుతూ బాబాను తలుచుకుంటూ ఉంది. నేను ఫ్లై ఓవర్ మీదనుండి దిగుతుండగా ట్రైను కదిలింది. సరిగ్గా నేను చివరిమెట్టు దిగే సమయానికి కదులుతున్న ట్రైన్ నుండి నా భార్య దిగబోతూ కనిపించింది. నేను కంగారుగా 'వద్దు, వద్దు' అని గట్టిగా కేకలు వేస్తూ, పరుగున వెళ్లి ఆ బోగీలోకి ఎక్కాను. అప్పటికే ట్రైన్ వేగం అందుకుంది. ట్రైన్ ఎక్కేటప్పుడు ఏమాత్రం తేడా జరిగినా జరిగే ప్రమాదాన్ని ఎవరైనా ఊహించవచ్చు. అంతేకాదు, అప్పుడు నా భార్య 4వ నెల గర్భవతి. తను గనక వేగంగా వెళ్తున్న ట్రైన్ నుండి దిగి ఉంటే, ఇప్పుడు మాకు రెండవ కొడుకు ఉండేవాడు కాదు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ సాయినాథుడే కాపాడారు. తన భకులకు రక్షణనివ్వడానికి బాబా ఉన్నారనడానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి? ఇలాంటి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీరు చేసిన మేలు ఎప్పటికీ మరువలేనిది".

విష్ణువర్ధన్ రెడ్డి

బాబా కృపతో వీసా సమస్య పరిష్కారం

యు.ఎస్. నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను చిన్నప్పటినుంచి బాబా భక్తుడిని. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా నేను ఆయనను అర్థం చేసుకున్నాను. నాకు వచ్చే మంచి, చెడు అనుభవాలన్నీ ఆయన చిత్తంగా భావిస్తాను. వాటిని ఓర్పుతో స్వీకరిస్తాను. ఇక నా అనుభవంలోకి వస్తే...

ఎక్స్టెండెడ్ వీసా కలిగి ఉన్న నేను 5 సంవత్సరాల తరువాత గత సంవత్సరం భారతదేశ పర్యటనకు వెళ్ళాను. మేము ఆ పర్యటనను ప్లాన్ చేసినప్పుడు, ఐదేళ్ళకాలంలో భారతదేశంలో వచ్చిన మార్పులను చూడబోతున్నానని చాలా ఆనందపడ్డాను. ఆ పర్యటనలో భాగంగా స్నేహితులను, బంధువులను కలవడం, దేశమంతటా విహారయాత్ర చేయడంతోపాటు పుణ్యక్షేత్ర (అందులో శిరిడీ ఒకటి) దర్శనాలు కూడా ప్లాన్ చేసుకున్నాము. ఆ పర్యటనకు అవసరమైన వీసా స్టాంపింగ్ కోసం నేను గురువారమని ఆగస్టు 8ని ఎంపిక చేసుకున్నాను. 15 ఏళ్ళకు పైగా యు.ఎస్‌.లో ఉండటం, ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్నందున వీసా స్టాంపింగ్ సుళువుగానే అయిపోతుందని అనుకున్నాను. అయితే, ట్రంప్ పాలనలో కఠినమైన నిబంధనలతోపాటు వీసా అధికారి కొంత అపార్థం చేసుకున్నందున నా వీసా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్‌ ఆఫీసుకు పంపబడింది. వాళ్ళు నన్ను అదనపు పత్రాలు ఏవీ అడగకుండా నేరుగా నాకు 221జి స్లిప్(అప్లికేషన్ కు అవసరమైన సమాచారం లేదు లేదా అప్లికేషన్‌ను అడ్మినిస్ట్రేటివ్ హోల్డ్‌లో పెట్టడం) ఇచ్చారు. దాంతో అన్నేళ్ళుగా నేను యు.ఎస్‌.లో ఏర్పరుచుకున్న జీవితం, కుటుంబం, వృత్తి ప్రశ్నార్థకంగా మారాయి. ఒకవేళ వీసా తిరస్కరించబడితే ఏం చేయాలో మాకు అస్సలు అర్థం కాలేదు. నాలో నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ, కుటుంబం ముందు బయటపడలేదు. ఆ స్థితిలో నేను, "బాబా! వచ్చే గురువారం నాటికల్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు వీసా వస్తే 108 ప్రదక్షిణలు చేస్తానని, నా అనుభవాన్ని వెబ్‌సైట్‌లో పంచుకుంటాన"ని బాబాకు మాట ఇచ్చాను. బాబా కృప చూపించారు. రెండురోజుల తరువాత నా వీసా ఆమోదం పొందింది. పెద్ద కష్టం రాకుండా సహాయం చేసినందుకు నేనెప్పుడూ బాబాకు కృతజ్ఞుడనై ఉంటాను. ఆయన కృపతో నేను 108 ప్రదక్షిణలు పూర్తి చేయగలిగాను. "బాబా! ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి. ఈసారి నేను శిరిడీ వచ్చినప్పుడు మంచి దర్శనం ఇవ్వండి. అలాగే శిరిడీలో పారాయణ, మరో 108 ప్రదక్షిణలు చేయగలిగేలా అనుగ్రహించండి".

జై సాయిరామ్!


సాయి అనుగ్రహసుమాలు - 355వ భాగం


ఖపర్డే డైరీ - నలభయ్యవ భాగం

దాదాసాహెబ్ ఖపర్డే డైరీ గురించి మరికాస్త - వి.బి.ఖేర్ గారి రచన

1985 ఆగస్టు నుంచి గౌరవనీయులైన గణేష్ శ్రీకృష్ణ ఖపర్డే డైరీ శ్రీసాయిలీలా పత్రికలో ప్రతినెలా ప్రచురించబడేది. మొట్టమొదట శిరిడీ డైరీ సాయిలీలా పత్రికలో 1924-25లో ప్రచురించబడింది. నేను కావాలనే అప్పట్లో ప్రచురించబడిన సంకలనాలను చూశాను. ఎందుకంటే శిరిడీ డైరీ అనేది ఇంతవరకూ పూర్తిగా ప్రచురింపబడలేదనీ, గుప్తంగా ఉందనీ నాకనిపించింది. శిరిడీ డైరీ మొదటిసారిగా సాయిలీలలో ధారావాహికంగా ప్రచురిస్తున్న సమయంలోనే, మహాత్మాగాంధీ రాజకీయరంగంలో ఉజ్వలంగా ప్రకాశించి అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌నూ, సామాన్య ప్రజలనూ ప్రభావితం చేయడం వలన కీ.శే.లోకమాన్య తిలక్‌కి కుడిభుజం లాంటివాడైన జి.యస్.ఖపర్డే రాజకీయ జీవితం నుంచి వైదొలగాడు. అప్పటికే తన ఆధ్యాత్మిక గురువైనటువంటి సద్గురు శ్రీసాయిబాబా సమాధి చెందటం వలన ఖపర్డే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఒక చురుకైన నాయకుడిలా హడావుడిగా ఉండే తన రాజకీయ జీవితంలో తన అభిరుచులని ఫలవంతం చేసుకోలేకపోయిన ఖపర్డేకి, జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవటానికి, తన అభిరుచులని గురించి ఆలోచించటానికి కావలసినంత సమయం అప్పుడు దొరికింది. అందుకని అతని అనుమతితోనే, అతనికి తెలిసే శిరిడీ డైరీ 1924-25 లోనే, అంటే శ్రీ సాయిలీలా పత్రిక ప్రారంభించబడిన తొలిరోజుల్లోనే ప్రచురించబడింది. ఏ ఆధారంతో నేనిలా చెబుతున్నానని పాఠకులకు సందేహం కలగవచ్చు. అలా కలగటం కూడా న్యాయమే. ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చేందుకే నాకు లభించిన సమాచారాన్ని పాఠకుల ముందు ఉంచుతున్నాను. 

మనందరి అదృష్టం కొద్దీ బాలక్రిష్ణ ఎలియాస్ బాబాసాహెబ్ ఖపర్డే, అంటే ఖపర్డే పెద్దకొడుకు - తన తండ్రి జీవిత చరిత్రను గ్రంథస్థం చేశాడు. మరాఠీలో వ్రాయబడిన ఈ గ్రంథం 1962లో మొట్టమొదటిసారిగా ప్రచురించబడింది. (బాలకృష్ణ గణేష్ తథా బాబాసాహెబ్ ఖపర్డే, 'శ్రీదాదాసాహెబ్ ఖపర్డేయాంచే చరిత్ర ప్రసాద్ ప్రకాశన్, సదాశివపేట, పూణే, 1962) ముందుమాటల్లో రచయిత, "ఇది జీవిత చరిత్రగాదు, జీవిత చరిత్రకోసం దాదాసాహెబ్ ఖపర్డే డైరీలనుంచి సంకలనం చేసి సమకూర్చబడింది" అని మొదటే స్పష్టంగా చెప్పాడు. ఇందులోని కథానాయకుడు 1854, ఆగస్టు 27వ తారీఖున, వినాయకచవితి రోజున జన్మించటం వల్ల ఆయనకి ఆ గణనాథుని పేరే పెట్టబడింది. గణేష్ బాల్యజీవితాన్ని గురించి ఎక్కువ విశేషాలు తెలీవు. ఈయన తండ్రిగారైన శ్రీకృష్ణ నరహరి ఎలియాస్ బాపూసాహెబ్ తన బాల్యంలో పేదరికాన్ని అనుభవించాడు. తన తెలివితేటలతో కష్టపడి పనిచేసి, బ్రిటిష్ సామ్రాజ్యంలోని సి.పి.బేరర్ ప్రావిన్స్‌ తహసీల్దారు (మామ్లేదారు) స్థాయికి ఎదిగాడు. 

గణేష్ తన ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసాన్ని నాగపూరులోనూ, ఆమ్రావతిలోనూ పూర్తిచేశాడు. పాఠ్యాంశాలకన్నా ఎక్కువగా ఇతనికి వేరే సబ్జెక్టులలోనూ, వేరే పుస్తకాలు చదవటంలోనూ అభిరుచి ఉండటం వల్ల ఇతను మెట్రిక్యులేషన్ రెండుసార్లు తప్పాడు. అంతేకాక, అతను గణితశాస్త్రంలో వెనుకబడి ఉండేవాడు. 1872లో మెట్రిక్యులేషన్ అయిపోయిన తరువాత అతను బొంబాయి ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చేరాడు. సంస్కృతం ప్రొఫెసరయిన డా.రామకృష్ణ భండార్కర్‌కి ఇతను ప్రియశిష్యుడు. అకోలాలో చిన్నప్పుడు ఒక శాస్త్రిగారి వద్ద సంస్కృతం సాంప్రదాయ పద్ధతిలో చాలా లోతుగా అధ్యయనం చేయటం వల్ల గణేష్‌కి సంస్కృతం చాలా అద్భుతంగా అభ్యాసమైంది. పైగా అతను సంస్కృత సాహిత్యాన్ని విపరీతంగా చదువుతుండేవాడు. ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో చేరకముందే బాణుడి కాదంబరీ, భవభూతి ఉత్తర రామచరిత్ర చదివేశాడు. అందుకని కాలేజీలో చెప్పే సంస్కృతం చిన్నపిల్లల ఆటలా ఉండేదతనికి. అతను ఇంగ్లీషు సాహిత్యాన్ని కూడా చాలా ఆనందంగా చదివేవాడు. ఇంగ్లీషు భాషలో ప్రసిద్ధి చెందిన ప్రకృతి కవి విలియమ్ వర్డ్స్‌వర్త్ మనుమడైన ప్రొఫెసర్ వర్డ్స్‌వర్త్ అతనికి ఇంగ్లీషు బోధించేవాడు. ఈ ఇద్దరి ప్రొఫెసర్ల వద్దా అతను ఈ రెండు భాషల్లో అద్భుతమైన పాండిత్యాన్ని గడించాడు. నిజానికి అతని సంస్కృత పరిజ్ఞానం చాలా గొప్పది, కనుకనే ఆర్యసమాజ వ్యవస్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి ఎల్ఫిన్‌స్టన్ కాలేజీకి వచ్చినప్పుడు ఆయనతో సంస్కృతంలో వాదించటానికి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. అతను చేసిన అద్భుతమైన వాదనకి గణేష్‌ని స్వామి ప్రశంసించటంలో ఆశ్చర్యం ఏమీలేదు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 396వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నా వెనుకనున్నది మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ శిరిడీ సాయినాథుడు!
  2. బాబా కృపతో నయమైన పాప కంటిసమస్య

నా వెనుకనున్నది మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ శిరిడీ సాయినాథుడు!

ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాటి సాయిబంధువులకు నా నమస్కారములు. ఈ నా అనుభవాన్ని మీతో ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు సాయిమహరాజును క్షమాపణలు వేడుకుంటున్నాను. నేను గత నాలుగు సంవత్సరముల నుండి బాబాకి భక్తుడనయ్యాను. బాబా నాకున్న ఎన్నో సమస్యలను తీర్చారు. ఈరోజు నేను మీతో నా అనుభవాన్ని పంచుకుంటున్నానంటే అది నా సాయి నా యందు చూపిస్తున్న ప్రేమే. ఇక నా అనుభవంలోకి వస్తే.. 

నేను ఒకరోజు దారివెంట నడుచుకుంటూ వెళ్తున్నాను. ఉన్నట్టుండి నాకు బాగా దాహం వేసింది. ఆ చుట్టుప్రక్కల ఎక్కడా నీళ్ళు లేవు సరికదా ఒక్క ఇల్లు కూడా లేదు. అలా కొంచెం దూరం నడిచాక ఒక ప్రాంగణం లాంటిది కనిపిస్తే అందులోకి వెళ్ళాను. కానీ అక్కడ ఎవరూ లేరు, అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడే ఉన్న వాటర్ ట్యాంక్ నుండి నీళ్ళు రావడం చూసి అక్కడికి వెళ్ళి నీళ్ళు త్రాగుతున్నాను. అకస్మాతుగా గాలిదుమారం లేచి నా వైపు రావడం చూసి భయపడ్డాను. సరిగ్గా అది నా దగ్గరకు రాగానే అందులో నుండి ప్రేతాత్మ ఒకటి నా వద్దకు వచ్చి వికటాట్టహాసం చేస్తూ నా గొంతు పట్టుకొని ‘నిన్ను చంపేస్తా’ అని అంది. నేను కొంచెం ధైర్యం చేసి దాని గొంతు పట్టుకుని, “ఎవరు నువ్వు? నన్నెందుకు పట్టుకున్నావ్? నన్ను వదిలేయ్, నాకు చిన్న పిల్లలున్నారు” అని అంటున్నాను. కానీ, అది వదలకుండా ‘నిన్ను చంపేస్తా’ అని గట్టిగా నా గొంతు నొక్కుతోంది. ఇంతలో నాకు ఎక్కడినుండి వచ్చిందో తెలియదు ఆ శక్తి, ఆ ప్రేతాత్మను గొంతు పట్టి గట్టిగా త్రోసివేశాను. అది క్రిందపడి, “నీకు ఇంత బలం ఎక్కడిదిరా? నీ వెనకాల ఎవరున్నారని నీకింత ధైర్యం?” అని అనగానే, ‘నా వెనకాల ఎవరున్నారు?’ అని ‌వెనక్కి తిరిగి చూసి, నిర్ఘాంతపోయాను. నా వెనుకనున్నది మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ శిరిడీ సాయినాథుడు! ఆ సద్గురువు నా వెనకాల నుండి “తన వెనకాల నేనున్నాను అంటూ ఆ ప్రేతాత్మకు తన వ్రేలితో చూపిస్తూ వెళ్ళ‌డం చూశాను. అంతలోనే నాకు నిద్రనుండి మెలకువ వచ్ఛింది. ‘ఇదంతా స్వప్నమా!’ అని అనుకున్నాను, కానీ నాకు చేతులు, భుజాలు చాలా నొప్పిగా ఉన్నాయి. అంటే, బాబా నా వెన్నంటే ఉండి నన్ను ఎళ్ళవేళలా కాపాడుతున్నారని నాకు అర్థమైంది. నన్ను ఎన్నో సమస్యల నుండి కాపాడుతున్న బాబాకి నా శతకోటి ధన్యవాదాలు. 

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

ఇట్లు 
సాయిభక్తుడు

బాబా కృపతో నయమైన పాప కంటిసమస్య

నా పేరు విజయ. ఇటీవల బాబా నాకు చూపిన మహిమను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా చిన్న కూతురికి ఇప్పుడు 14 నెలల వయసు. ఈమధ్య ఒకరోజు పాపకి సీసాతో పాలు త్రాగిస్తున్నపుడు పాప కంట్లో ఎర్రగా ఉండటం గమనించాను. ఎర్రదనం కాస్త ఎక్కువగానే ఉండటంతో నాకు కంగారుగా అనిపించి, కాస్త జాగ్రత్తగా గమనిస్తే అది నోట్లో ఏర్పడే అల్సర్‌లా కనిపించింది. నోట్లో అల్సర్లు వస్తే పెద్దవాళ్ళే బాధను తట్టుకోలేరు, అలాంటిది చిన్నపాప కంటి తెల్లని భాగంలో వస్తే ఆ నొప్పిని ఎలా తట్టుకుంటుంది? పైగా తన బాధ ఇదీ అని కూడా చెప్పలేదని పలురకాల ఆలోచనలతో చాలా కలవరపాటుకు గురయ్యాను. అసలే ఇప్పుడు లాక్‌డౌన్ రోజులైనందున పీడియాట్రీషన్ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. కనీసం ఇంకాస్త పరిశీలనగా దాన్ని చూద్దామనుకుంటే పాప చూడనివ్వట్లేదు. పాప ఏడవట్లేదుగాని, ఒకవేళ అది ఎక్కువై కంటిచూపుకు ఏదైనా సమస్య అవుతుందేమోనన్న భయంతో నేను చాలా బాధపడ్డాను. నాకు ఏమి చేయడానికీ పాలుపోలేదు. అప్పుడు బాబాని ప్రార్థించి, భారం ఆయన మీదే వేశాను. అప్పటికే మూడు వారాలుగా సాయి నవగురువార వ్రతం చేస్తున్నాను. పాప రాత్రి నిద్రపోయాక కొంచెం ఊదీ తీసుకొని పాప కంటిరెప్పలపై రాశాను. ఇలా ఐదు రోజులు చేశాక, పాపను పైకి చూసేలా చేస్తూ, అతికష్టంమీద తన కన్ను పరిశీలించాను. బాబా దయవలన అల్సర్ పూర్తిగా తగ్గిపోయింది. పట్టరాని ఆనందంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ అనుభవం ద్వారా బాబా యందు భక్తులకు నమ్మకం వృద్ధి చెందాలని ఆశిస్తూ...

సదా బాబా సేవలో

విజయ.


సాయి అనుగ్రహసుమాలు - 354వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయితొమ్మిదవ భాగం

12-3-1912

సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూశాను. ఆయన మశీదుకి వచ్చిన తరువాత ఆయన్ను దర్శించుకోవటం కోసం మశీదుకి వెళ్ళాను. నేను కూర్చుంటున్నప్పుడు సాయిసాహెబ్, "మనుషులు చాలా అజ్ఞానులు. నా భౌతిక శరీరాన్ని చూడనప్పుడు వారు నేను లేను అనుకుంటున్నారు" అన్నారు. 'ఈరోజు ఉదయం పింపల్‌గావ్‌ని తలచుకున్నాన'ని చెప్పారు. ఆయన అక్కడనుండి వచ్చిన నలుగురు మనుషులను కలిశారట. వారు ఈయన్ను అనుసరించి మశీదుకు వచ్చారు. సంభాషణ అనుకోకుండా పెళ్ళిళ్ళకు సంబంధించిన విషయాల వైపుకి మళ్ళింది. కొత్తగా నిర్మించిన గోడ గురించి ప్రస్తావిస్తూ సాయిసాహెబ్ అక్కడ ఒక బాట - అందులో ఉన్న ఒక చిన్న చెట్టు గురించి చెప్పారు. ఎంతో పవిత్రుడైన ఒక వృద్ధుడు అక్కడ కూర్చునేవాడట. ఆయన జాల్నా నుండి వచ్చారట. పన్నెండేళ్ళు గడిచినా, తన సోదరులూ, కుటుంబమూ అతను లేకపోవటం వల్ల ఎంతగా బాధలు పడినా తిరిగి వెళ్ళటాన్ని గురించి అతను పట్టించుకోలేదుట. చివరికి అతను తిరిగి వెళ్ళాలనుకున్నాడట. అతను గుర్రం మీద ప్రయాణిస్తుంటే, సాయిసాహెబ్ ఒక బండిలో అతన్ని అనుసరించారట. వారు జాల్నా చేరుకున్నారట. ఆ వృద్ధుడు భార్యతోనూ, తనకున్న నలుగురు కొడుకులతోనూ ఉంటూ, హఠాత్తుగా తన సోదరుడి కుమార్తెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందరూ నవ్వి ఎగతాళి చేసినప్పటికీ ఆ వివాహం జరిగిపోయింది. పెళ్ళికుమార్తె చాలా చిన్నపిల్ల. చివరికి ఆ అమ్మాయి పెద్దదయింది. ఆ వృద్ధుడికి ఆమె వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి ఆరేళ్ళ వయస్సు వచ్చేటప్పటికి ఆ వృద్ధుడు మరణించాడు. దాయాదులు ఆ అబ్బాయికి విషమిచ్చారు. కొడుకును కోల్పోయిన బాలవితంతువైన ఆ తల్లి సౌశీల్యమైన జీవితాన్ని గడిపి, తిరిగి వివాహం చేసుకోకుండా చనిపోయింది. ఆ పిల్లవాడు 'బాబు'గా మళ్ళీ పుట్టి చనిపోయి మళ్ళీ ముంబాయిలో జన్మించాడు. భగవంతుని కృత్యాలు గొప్ప కళాత్మకమైనవి.

13-3-1912

సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూశాము. తరువాత మశీదులోనూ చూశాము. ఆయన ఒక సుదీర్ఘమైన గాధను చెప్పారు. ఒక వృద్ధుడైన పెద్దమనిషి ఆయన్ను చూడటానికి వస్తుండేవాడట. మొదట నలుగురు‌, ఆ తరువాత పన్నెండుమంది డిటెక్టివ్‌లు అతని చర్యలు కనిపెడుతూ ఉండేవారట. ఆ వృద్ధుడికీ, ఆ డిటెక్టివ్‌లకీ మాటా మాటా పెరిగి తీవ్రంగా ముష్టియుద్ధం అయింది. సాయిసాహెబ్ వృద్ధుడికి సహాయంచేసి, అతన్నా ప్రదేశంలో కలిశారట. ఒక సందర్భంలో ఆ డిటెక్టివ్‌లు అతనిపై దాడి చేసినప్పుడు వాళ్ళని కొట్టారట. చివరికి ఆ వృద్దుడ్ని ఆ వ్యవహారంలో ఒక పెద్ద పట్టణానికి తరలిస్తే, సాయిసాహెబు కల్పించుకొని అతన్ని విడుదల చేయించారట.


సంగమనేరు నుండి శిరిడీకి లోకమాన్య తిలక్ ఆగమనం

19-5-1917

నేను పొద్దున్నే లేచాను కానీ, చాలామంది సమావేశమవటం వల్ల ప్రార్థన చేసుకోలేకపోయాను. మమ్మల్ని ఇక్కడనుంచి మధ్యాహ్నం వరకూ పోనివ్వకుండా ఇక్కడే ఉంచటానికి కొందరు ఒక ఆలోచన చేశారు. కేల్కరు ఆ ఆలోచన వైపుకు మొగ్గుచూపుతున్నట్లు కనిపించింది. నాకు పట్టరానంత కోపం వచ్చి బయలుదేరటానికి తొందరచేశాను. సంగమనేరులో పెద్ద లాయరైన సంత్ వాళ్ళింట్లో తాంబూలం స్వీకరించిన తరువాత మేము ఉదయం ఎనిమిదిన్నరకి బయలుదేరాం. దార్లో మోటారుబండికి పంక్చరై, దాన్ని బాగుచేసుకొన్న తరవాత ఉదయం సుమారు పదిగంటలకి శిరిడీ చేరి దీక్షిత్ వాడాలో దిగాము. బాపూసాహెబ్ బూటీ, నారాయణరావు పండిట్, బూటీ సహచరులు అక్కడ ఉన్నారు. నా పాత స్నేహితులు మాధవరావు దేశ్‌పాండే, బాలాసాహెబ్  భాటే, బాపూసాహెబ్ జోగ్, ఇంకా ఇతరులు కలిశారు. మేము మశీదుకి వెళ్ళి సాయిమహారాజుకి మా అభివాదాలు తెలిపాము. ఆయన అంత ఆనందంగా ఉండటం నేను అంతకుమునుపెన్నడూ చూడలేదు. ఎప్పటిలాగే ఆయన దక్షిణ అడిగితే మేమంతా సమర్పించాము. లోకమాన్యను చూస్తూ ఆయన, “మనుషులు చాలా చెడ్డవారు. నీ ఆలోచనలను గుప్తంగా ఉంచు" అన్నారు. నేను నమస్కరించాను. ఆయన నానుంచి కొన్ని రూపాయలను తీసుకున్నారు. కేల్కరు, పారేగోంకార్ కూడా సమర్పించారు. మాధవరావు దేశ్‌పాండే మేము యవలా వెళ్ళటానికి మా కోసం అనుమతిని అడిగాడు. “ఈ ఎండలో ఎందుకు వెళదామనుకుంటున్నారు? దోవలో చావటానికా? మధ్యాహ్నం చల్లబడ్డాక వెళ్ళండి. శ్యామా! వీళ్ళకి భోజనం పెట్టు” అన్నారు. అందుకని మేము ఆగి, మాధవరావు దేశ్‌పాండే గారింట్లో భోజనం చేసి కొద్దిసేపు విశ్రమించి, మళ్ళీ మశీదుకి వెళ్ళాము. సాయిమహారాజు నిద్రపోతున్నట్లుగా పడుకొనివున్నారు. భక్తులు లోకమాన్యకి చావడి దగ్గర తాంబూలం ఇచ్చారు. మళ్ళీ మేము మశీదుకి వచ్చాము. సాయిమహారాజు లేచి కూర్చుని, మాకు ఊదీ ఇచ్చి, మేము వెళ్ళటానికి అనుమతి ఇచ్చాక మోటారుబండిలో బయలుదేరాము.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo