సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అణ్ణా చించణీకర్


బాబాను శ్రద్ధ, సబూరీలతో సేవించిన వారిలో దామోదర్ ఘనశ్యామ్ బాబరే అలియాస్ అణ్ణా బాబరే అలియాస్ అణ్ణా చించణీకర్ ఒకడు. ఇతడు రాణి జిల్లాలోని 'చించణీ' అనే గ్రామానికి చెందినవాడు. అందుకే అందరూ అతనిని 'అణ్ణా చించణీకర్' అని పిలిచేవారు. అతడు ఎవ్వరినీ లెక్కచేసేవాడు కాదు. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడేవాడు. గుళ్లతో నిండి నొక్కగానే పేలిపోయే తుపాకిలా ఉండేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చునేమో గానీ, అణ్ణా మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతుండేవాడు. అతనికి పనులన్నీ చకచకా సాగిపోవాలి. అరువు బేరం ఎరుగడు. మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు. ఇలా బాహ్యానికి కఠినంగా, రాజీలేనివ్యక్తిగా, మొరటువానిలా కనిపించినప్పటికీ అతను నిష్కపట స్వభావి, సజ్జనుడు, సాత్త్వికుడు, మోసమన్నది ఎరుగనివాడు. అందుకే బాబాకు అతడు ప్రియమైనవాడు.

అణ్ణా చించణీకర్ మొదటిసారి శిరిడీ వెళ్ళినపుడు అకస్మాత్తుగా ఆ గ్రామంలో ప్లేగు చెలరేగింది. గ్రామంలోని అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య లక్ష్మీబాయి మాత్రమే గ్రామంలో మిగిలింది. సహజంగానే ఆమె భయపడింది. అప్పుడు బాబా ఆమెకు భౌతికంగా దర్శనమిచ్చారు. అంతటితో ఆమె ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఉంది. వ్యాధి అంతరించి, గ్రామస్థులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10, 12 సార్లు సాక్షాత్కరించి అభయమిచ్చారు. ఈ సంఘటనతో ఆ దంపతులకు బాబాపట్ల అత్యంత భక్తిశ్రద్ధలు ఏర్పడ్డాయి.

తరువాత అణ్ణా చించణీకర్, లక్ష్మీబాయి ఇరువురూ శిరిడీ వచ్చి బాబా సన్నిధిలో నివసించసాగారు. వారు బాబా నుండి ఏమీ ఆశించకుండా చాలా సంవత్సరాలు నిష్కామసేవ (నిస్వార్థసేవ) చేశారు. అతనికి 50 సంవత్సరాలు దాటినా సంతానం కలుగలేదు. ఒకనాడు ఆ దంపతులు బాబాకు సేవ చేస్తుండగా శ్యామా, కాకాసాహెబ్ దీక్షిత్‌లు అక్కడే వున్నారు. శ్యామా బాబాతో, "దేవా! ఏమిటి మీ లీల? ఎక్కడెక్కడినుండో భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి మీ వద్దకు వస్తుంటే, వారందరి కోరికలు తీరుస్తున్నారు. కానీ ఈ అణ్ణా, లక్ష్మీబాయి మిమ్మల్ని ఇంతకాలంగా సేవిస్తున్నా మీరు వీళ్ళకు సంతానం ప్రసాదించరేమిటి?" అన్నాడు. బాబా చిన్నగా నవ్వి, "శ్యామా, నీవు చిన్నవాడివి, నీకేమీ తెలియదు. ఎవరైనా మనస్పూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఏమీ తెలియనివాడిలా మాట్లాడతావేం? ఈ దంపతులు నన్నేమీ కోరలేదు. కావాలంటే వారిని అడుగు. వారికి నిజంగా బిడ్డ కావాలంటే ఇస్తాను. కానీ ఒక్కతరం కంటే వీరి వంశం నిలవదు. అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠను ప్రసాదిస్తాను" అన్నారు. ఆయన భావమెవరికీ అర్థం కాలేదు.

అప్పట్లో అణ్ణా చించణీకర్ పొలాలకు సంబంధించిన వ్యాజ్యమొకటి దహనూ కోర్టులో నడుస్తుండేది. అచ్యుత్ నారాయణ్ ఖరే అనే ప్రఖ్యాత న్యాయవాది ఆ కేసును వాదిస్తుండేవాడు. అప్పుడప్పుడు అణ్ణా దాని గురించి బాబాను అడుగుతుండేవాడు. అతడెప్పుడడిగినా బాబా "అల్లా అచ్ఛా కరేగా!" (దైవం మేలు చేస్తాడు) అని మాత్రమే సమాధానమిస్తుండేవారు. అలా మూడు సంవత్సరాలు గడచిపోయాయి. ఒకసారి అణ్ణా చించణీకర్‌ను కష్టపెట్టడానికి గిట్టనివారెవరో అతడు కేసు ఓడిపోయినట్లుగా తెలియజేస్తూ ఉత్తరం పంపారు. ఆ ఉత్తరాన్ని చూస్తూనే అతను కాకాసాహెబ్ దీక్షిత్ వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. ఆ విషయమై బాబాను అడగాలని ఆ ఇద్దరూ మసీదుకు వెళ్ళారు. వాళ్ళు మసీదులో ప్రవేశిస్తుండగానే బాబా వారికేసి చూసి, "ఈ ముసలాడికి నామీద నమ్మకం లేదు. ఆ ఉత్తరం చింపి అవతల పారేయండి!" అన్నారు. 

కొద్ది నెలల తర్వాత లాయర్ వద్దనుండి అణ్ణాకు 'కేసు నెగ్గినట్లు, రూ.1800/- లు కోర్టు ఖర్చులు కూడా చెల్లించమని కోర్టు డిక్రీ ఇచ్చినట్లు' ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని పట్టుకొని అణ్ణా, కాకాసాహెబ్ దీక్షిత్‌లు మసీదుకు వెళ్లారు. బాబా అతనిని చూస్తూనే, "నీకిప్పటికైనా విశ్వాసం కుదిరిందా?" అన్నారు. అప్పుడు అణ్ణా ఆ ఉత్తరాన్ని బాబా పాదాలవద్ద వుంచి, "బాబా, ఇదంతా మీదే! నాకేమీ వద్దు" అన్నాడు. అప్పుడు బాబా, "ఫకీరునైన నేను ఈ ధనం ఏమి చేసుకుంటాను? నాకేమైనా కుటుంబమున్నదా? నువ్వే తీసుకో!" అన్నారు. అణ్ణా ఆ ధనాన్ని తీసుకోమని ఎంతగానో అభ్యర్థించినప్పటికీ బాబా అంగీకరించలేదు. అలా కొంతసేపు వారి మధ్య చర్చ జరిగాక ఆ డబ్బుతో రోజు విడిచి రోజు బాబా నిద్రించే చావడికి మరమ్మత్తులు చేసి పునరుద్ధరించి, ఆ దంపతుల పేర్లు లిఖించాలని కాకాసాహెబ్ దీక్షిత్ సలహా ఇచ్చాడు. ఆ సలహా అణ్ణాకు నచ్చి అలానే చేశాడు. ఇప్పటికీ భక్తులు అక్కడున్న "శ్రీ సాయినాథ్ బాబాంచీ లక్ష్మీబాయి దామోదర్ బాబరే, చించణీకర్ చావడి, శక సం.1859" అనే ఫలకాన్ని చూడవచ్చు. అలా బాబా ఆ వంశప్రతిష్ఠను చిరస్మరణీయం చేశారు.
భక్తులు తమదైన రీతిలో ప్రేమతో సాయిబాబాను సేవిస్తుండేవారు. ఒకరు ఆయన నడుం పట్టేవారు. ఒకరు వారి పాదాలు ఒత్తేవారు. మరొకరు వారి వీపును, పొట్టను మర్దించేవారు. బాబా ఎవరికీ అడ్డు చెప్పక అందరినీ సేవ చేయనిచ్చేవారు. ఒకనాటి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. బాబా తమ ఎడమచేతిని పక్కనే ఉన్న కఠడాపై వేసి కూర్చొని ఉన్నారు. కఠడాకు ఇవతలివైపు నిలబడివున్న అణ్ణా కాస్త వంగి బాబా ఎడమచేతిని మెల్లమెల్లగా ఒత్తుతున్నాడు. కుడివైపు బాబా పట్ల అనన్య భక్తిప్రపత్తులు కలిగిన వేణుబాయి కౌజల్గి (మావిసీ బాయి) అనే వృద్ధ వితంతువు ఉంది. బాబా ఆమెను 'ఆయీ!' (అమ్మా) అని అనేవారు. జనులు ఆమెను 'మౌసీ' (పిన్నమ్మా) అని పిలిచేవారు. ఆమెకు సాయి పాదాలయందు అనుపమానమైన ప్రేమ. ఆమెది స్వచ్ఛమైన హృదయం. ఆమె తన రెండు చేతుల వేళ్లను బాబా పొట్ట చుట్టూ చుట్టి పొత్తికడుపు మర్దన చేస్తోంది. ఆమె బాబా స్మరణ చేస్తూ చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా గట్టిగా ఒత్తుతూ ఉంది. బాబా కిమ్మనకుండా వారికి ఏ బాధా లేదన్నట్లు ఉన్నారు. భక్తులకు మేలు కలగాలని, వారు అనవరతం తమ స్మరణలో ఉండాలని వారినుండి సాయి నిష్కపటమైన ప్రేమను తీసుకుని ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు. దీనవత్సలుడైన సాయి తన భక్తులనెన్నడూ ఉపేక్షించేవారు కాదు. ఆమె బలంగా ఒత్తుతూ ఉంటే బాబా క్రిందకి పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అలాగే కదులుతూ ఉంది. ఇవతలవైపు ఉన్న అణ్ణా ముందుకు వంగి ఉన్నప్పటికీ కదలక స్థిరంగా ఉన్నాడు. ఇరువురూ తమ తమ సేవలలో లీనమై ఉండగా ఆమె ముఖం క్రిందకి పైకి కదులుతూ అణ్ణా ముఖం వద్దకు వచ్చింది. మంచి హాస్యస్వభావం గల ఆమె అదే అవకాశంగా తీసుకుని, "ఈ చపలుడైన అణ్ణా నన్ను ముద్దివ్వమని కోరుతున్నాడు. ఇదేమిటి అణ్ణా? తల నెరిసినా నీకు సిగ్గులేదు. నన్ను ముద్దుపెట్టుకోవాలని చూస్తున్నావు" అని అన్నది. వెంటనే అణ్ణా తన చొక్కా చేతిని మడుచుకొని, "నేను ముసలివాణ్ణా? పిచ్చివాణ్ణా? నేనేమైనా మూర్ఖుణ్ణా? నీవే మొహంలో మొహం పెట్టి తగవుకు తయారయ్యావు" అని అన్నాడు. వారిద్దరినీ సమానంగా ప్రేమించే బాబా వారిని శాంతింపజేయాలనుకొని ఒక మంచి యుక్తిని పన్నారు. ఎంతో ప్రేమగా ఆయన, "అరె అణ్ణా! ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవటంలో అనుచితమేముందో అర్థం కావడం లేదు" అని అన్నారు. ఆ మాటలు విని ఇద్దరూ శాంతించారు. ఆ హాస్యరసవాణిని ఆస్వాదిస్తున్న వారంతా సాయిబాబా చమత్కారానికి ముగ్ధులయ్యారు. చూడటానికి ఇది చిన్న కథే అయినా అందులోని మర్మాన్ని తెలుసుకోగల శ్రోతలు "తల్లీబిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండుంటే వారికలా కోపం వచ్చేది కాదు, తగవు పుట్టేది కాదు" అన్న మాధుర్యాన్ని ఆస్వాదించగలరు.

బాబా సేవలో తరించిన శ్రీ అణ్ణా చించణీకర్ చించణీలో సాయి శివ మందిరాన్ని నిర్మించాడు. అతను 1920, ఏప్రిల్ 15న తుదిశ్వాస విడిచాడు. ఇప్పుడు ఆ మందిరం 'అణ్ణా చించణీకర్ ట్రస్ట్' పర్యవేక్షణలో ఉంది. చివరివరకు హృదయపూర్వకంగా బాబా సేవలో తమ జీవితాన్ని గడిపిన ఆ దంపతులు తమ యావదాస్తిని శిరిడీసాయి సంస్థానానికి వీలునామా ద్వారా ధారాదత్తం చేశారు. అంతేగాక, సమాధిమందిరానికి ఎదురుగా ఉన్న సభామండప నిర్మాణంలో ఖర్చయిన మొత్తంలో ఎక్కువభాగం 'అణ్ణా చించణీకర్ ట్రస్ట్' భరించింది.

అణ్ణా చించణీకర్చిన్చానికర్ నిర్మించిన మందిరం 

అణ్ణా చించణీకర్ ట్రస్ట్ కాంటాక్ట్ డిటెయిల్స్:

Sai Shiv Mandir,
C/o.Anna Chinchanikar Trust,
Chinchani-401 503,
Dahanu Taluk,
Thane District,
Maharashtra,India
Contact Person:Smt.Vidya Churi
Contact Number: 97656 75825 

సమాప్తం 

Source: Shri Sai Satcharitra by Govind Raghunath Dhabolkar alias Hemadpant, Shri Sai Leela Magazine, January 1978 Chinchani Sai Shiv Mandir Photo Courtesy: Shri.Vinod Patil, Mumbai)
http://www.saiamrithadhara.com/mahabhakthas/anna_babare.html

సాయిభక్తుల అనుభవమాలిక 250వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా పట్ల ప్రేమ నాకు కోపం రాకుండా చేసింది
  2. నిజంగా బాబా ఊదీ అద్భుతమైన ఔషధం

బాబా పట్ల ప్రేమ నాకు కోపం రాకుండా చేసింది

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బాబా నన్ను తన సంరక్షణలోకి తీసుకోవడం నా అదృష్టం. నాపై దయతో ఆయన తమ ఆశీస్సులనిచ్చి నా జీవితంలో అడ్డంకులు దాటడానికి సహాయం చేస్తున్నారు. ఆయన ఉనికి లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేను. బాబా ప్రేమను, ఆశీస్సులను అందరికీ పంచుతున్న 'సాయి యుగ్‌నెట్‌వర్క్.కామ్' బృందానికి నా ధన్యవాదాలు. మీరంతా బాబా ఆశీస్సులు పొందిన భాగ్యవంతులు. ఇక నా అనుభవాలకు వస్తే...

మొదటి అనుభవం:

ఒకసారి నేను 10 గంటలు విమాన ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చాను. వచ్చాక నా పాదాలలో వాపు వచ్చి ఉండటం నేను గమనించాను. మొదట కొన్నిరోజులు నేను వాటిని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజులు గడుస్తున్నా వాపు అలాగే కొనసాగుతుండటంతో నాలో ఆందోళన పెరిగింది. దాంతో పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. కానీ ఎటువంటి చేదు ఫలితాన్ని వినాల్సి వస్తుందోనన్న భయంతో, "రిపోర్టులన్నీ నార్మల్ గా ఉండేలా చూడండి బాబా" అని బాబాను వేడుకున్నాను. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని కూడా ఆయనకు మాట ఇచ్చాను. తరువాత నేను పరీక్షలకోసం పాథాలజీ ల్యాబ్‌లోకి వెళ్తూ, "ఏదో ఒక రూపంలో మీరు నాతో ఉన్నారన్న భరోసా ఇవ్వమ"ని(ఆయన ఎప్పుడూ నా హృదయంలో ఉంటూ భరోసా ఇస్తున్నప్పటికీ) బాబాను అడిగాను. అకస్మాత్తుగా రోడ్డుమీద వెళ్తున్న ఒక కారు వెనుక భాగంలో ఉన్న 'ఓం సాయిరామ్' అనే అక్షరాలు నా దృష్టిలో పడ్డాయి. నేను చాలా సంతోషించాను. సాయంత్రం వచ్చిన రిపోర్టులన్నీ నార్మల్ గా వచ్చాయి. "బాబా! ఎల్లప్పుడూ నాతో ఉన్నందుకు మీకు ధన్యవాదాలు".

రెండవ అనుభవం:

సాధారణంగా నాకు కోపం చాలా త్వరగా వస్తుంది. నేను పనులు సంపూర్ణంగా చేయడాన్ని ఇష్టపడతాను. కళ్ళముందు అన్యాయం జరుగుతుంటే అస్సలు సహించలేను. ఏమాత్రం తేడా వచ్చినా హృదయంలో నేను చాలా దయతో ఉన్నప్పటికీ ముందు వెనక చూడకుండా ఇతరుల మీద అరిచేస్తాను. దగ్గరి బంధువులపై కూడా అలాగే అరిచేస్తాను. అలా చేసేసి మళ్ళీ "నా స్వభావాన్ని ఎందుకు మార్చడం లేదు?" అని బాబాను ప్రశ్నిస్తుంటాను. కానీ ఆయనను అలా అడిగినందుకు కూడా చాలా అపరాధభావం కలిగి నాలో నేనే బాధపడతాను. నేను సదా బాబాను, "సబూరీని ప్రసాదించి నన్ను ఆశీర్వదించండి" అని ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే అది ఆయన కృపతో మాత్రమే సాధ్యమవుతుంది.

ఇటీవల ఒకసారి నేను చాలా క్లిష్టమైన కుటుంబ విషయాలను చర్చించడానికి దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు, "మీరు నాతో ఉండండి బాబా. సబూరీతో ఉండేలా నన్ను ఆశీర్వదించండి" అని బాబాను ప్రార్థించాను. ఆరోజు బాబా నన్ను ఎంతోగానో ఆశీర్వదించారు. నా జీవితంలో మొదటిసారి నేను ఆరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను హృదయంలో 'సాయి, సాయి' అని అనుకుంటూ నిశ్శబ్దంగా కూర్చున్నాను. లోలోపల నేను బాబాతో ద్వారకమాయిలో ఉన్నట్లు ఊహించుకుంటూ, "అన్ని విషయాలూ చక్కగా నిర్వహించండి" అని చెప్పుకుంటూ ఉన్నాను. ఆరోజు నేను మూమూలుగా ఎప్పుడూ చేసే విధంగా టెన్షన్ పడటంగాని, కోపం తెచ్చుకోవడంగాని, ఏడవటంగాని చేయలేదు. ప్రశాంతమైన నా ప్రవర్తనకు నేనే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. సమస్య విషయం ఎలా ఉన్నా బాబా నన్ను ప్రశాంతంగా, ఆనందంగా మరియు ఆయన ప్రేమలో మునిగివుండేలా చేశారు. నా ప్రియమైన బాబాపై నాకు నమ్మకం ఉన్నందున ఆ సమస్యను ఆయనకే వదిలేసి అక్కడినుండి తిరిగి ఇంటికి బయలుదేరాను. దారిలో బాబా నాపై కురిపించిన ప్రేమను తలచుకుంటూ ఏడ్చేశాను. "బాబా! దయచేసి నా తప్పులను క్షమించండి, నన్ను శిక్షించకండి. నన్ను ఎప్పుడూ వదిలివేయకండి. మీరే నా సర్వస్వం. నేను మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను. మీ దయతోనే జీవితాన్ని సాగిస్తున్నాను. అందరికీ తోడుగా ఉంటూ, అందరినీ ఆశీర్వదించండి. మీ దివ్యపాదాలకు శరణు అనేలా నన్ను అనుగ్రహించండి".

source: http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2472.html

నిజంగా బాబా ఊదీ అద్భుతమైన ఔషధం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బాబా భక్తురాలిని. రెండున్నర సంవత్సరాల మా పాప ఒక సంవత్సరకాలంగా స్కిన్ అలెర్జీతో బాధపడుతోంది. డాక్టర్ రోజుకు 3 సార్లు చొప్పున నెలా పదిహేను రోజులు మందులు వాడమని సూచించారు. అయితే ఒకరోజు మా ఇంటికి చాలామంది అతిథులు వచ్చారు. అతిథులకు ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉండి నేను తనకి మందులు ఇవ్వలేకపోయాను. రాత్రి 8 గంటలకు నిద్రపోయిన తను హఠాత్తుగా 11 గంటలకు లేచి ఒళ్ళంతా గోక్కోవడం మొదలుపెట్టింది. చూస్తే, తన శరీరమంతా దద్దుర్లు లేచి ఉన్నాయి. తక్షణ ఉపశమనం కోసం ఒక లేపనం(ఆయింట్మెంట్) డాక్టర్ ఇచ్చి వున్నారు గానీ సమయానికి ఆ మందు ఇంట్లో అందుబాటులో లేదు. రాత్రివేళ మందులషాపు తెరచి ఉంటుందో లేదో తెలీదు. ఒకవేళ షాపు ఉన్నా ఔషధం ప్రభావం చూపడానికి కనీసం 1, 2 గంటల సమయం పడుతుంది. తను చూస్తే బాధను తట్టుకోలేక, నిద్రపోలేక ఒకటే ఏడుస్తూ ఉంది. ఆ కారణంగా అతిథులకు కూడా నిద్రాభంగమైంది. ఏమి చేయాలో అర్థంకాక ఆలోచిస్తున్న తరుణంలో అద్భుతమైన మన బాబా ఔషధం నా మనసుకి తట్టింది.  వెంటనే నేను పూజగదిలోకి వెళ్లి, శిరిడీ నుండి తెచ్చుకున్న ఊదీ తీసుకుని, బాబాను ప్రార్థించి, తన శరీరమంతా పూస్తూ నెమ్మదిగా తన శరీరంపై రుద్దుతూ, తడుతూ వున్నాను. కేవలం కొన్ని నిమిషాల్లో తను ఏడుపు ఆపి, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మంచి నిద్రలోకి జారుకుంది. నిజంగా బాబా ఊదీ అద్భుతమైన ఔషధం. క్షణాల్లో ఉపశమనం కలిగించింది. "నేను మిమ్మల్ని ప్రార్థించినప్పుడల్లా తక్షణ రక్షణ కల్పిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!" ఎప్పుడైతే మనం ఎదుర్కొనే సమస్యలు మన నియంత్రణలో లేకుండా పోతాయో అప్పుడు వాటిని బాబా చేతుల్లో పెట్టడం ఎంతో ఉత్తమం. ఆయన ఉత్తమరీతిలో వాటిని పరిష్కరిస్తారని మనం భరోసాతో ఉండవచ్చు. ఎందుకంటే ఆయన తన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తారు. 

సాయిభక్తుల అనుభవమాలిక 249వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. పదమూడేళ్ల కలను సాకారం చేసిన బాబా 
  2. సోదరునికి ఉద్యోగాన్ని అనుగ్రహించిన సాయి

పదమూడేళ్ల కలను సాకారం చేసిన బాబా 

నా పేరు దీప్తి. నేను బెంగళూరు నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేను 2018, డిసెంబరు నుండి క్రమంతప్పకుండా బాబా గుడికి వెళుతున్నాను. అయితే అప్పటికి ఒక నెల ముందు నుండి ప్రతినెలలో ఒక వారం అన్నదానానికి డొనేషన్ కట్టడం మొదలుపెట్టాను. బాబా దయతో అది ఇప్పటికీ కొనసాగుతోంది. నేను బాబా చల్లని నీడలోకి చేరి ఒక సంవత్సరంకన్నా కాస్త ఎక్కువ కాలమయ్యింది. ఈ కాలంలో అడగకుండానే బాబా మా కుటుంబంపై కురిపించిన ప్రేమ అంతులేనిది. బాబా ఇచ్చిన ఆ అపూర్వమైన అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.


13 సంవత్సరాలుగా నా భర్తకు విదేశాలకు వెళ్లే అవకాశం రావాలని మేమంతా ఎంతగానో ఎదురుచూస్తున్నాం. అందుకు తగిన ప్రయత్నం కూడా జరుగుతూ ఉండేది. కానీ మాకు ఆ అవకాశం అందనిద్రాక్షలానే ఉండిపోయింది. 2018, ఆగస్టు నెలలో మాత్రం ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. నేను బాబా గుడికి వెళ్లడం మొదలుపెట్టిన కొన్నిరోజులకి, అంటే 2019, జనవరి 2 గురువారంనాడు మావారికి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. అదేరోజు దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా జరిగింది. మరుసటి గురువారం ఇంటర్వ్యూ విజయవంతమైనట్లు తెలియజేస్తూ ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆ తరువాత గురువారం వీసా ప్రాసెస్ చేశారు. ఇలా అన్నీ గురువారమే జరగడం బాబా అనుగ్రహమే! చివరిగా జనవరి 29న వీసా ఆమోదించబడింది. అలా బాబా కృపతో నా భర్త సౌదీ అరేబియా వెళ్లి ఫిబ్రవరి 10న ఉద్యోగంలో చేరారు. వాస్తవానికి అది ఆరునెలల కాంట్రాక్ట్ ఉద్యోగం. ఆ గడువు ముగియనుందనగా నేను నవగురువార వ్రతం ప్రారంభించాను. వ్రతం పూర్తయ్యే లోపల నా భర్త ఉద్యోగాన్ని మరో మూడునెలలు పొడిగించారు. 2019, అక్టోబరు 31తో ఆ గడువు కూడా ముగియడంతో మావారు తిరిగి ఇండియాకి వచ్చారు. మొత్తం మావారు విదేశాలలో 9 నెలలపాటు ఉద్యోగం చేశారు. బాబా ఇచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.


నాలుగేళ్ళక్రితం  2015, అక్టోబరు 24న ఒక పెద్ద ప్రమాదంలో నా నడుము భాగం పూర్తిగా దెబ్బతిన్నది. 2016, ఫిబ్రవరి 23న సర్జరీ చేసి ఆర్టిఫిషియల్ నడుమును ఏర్పాటు చేశారు. అలాంటి నేను నా భర్త మా దగ్గర లేని ఆ తొమ్మిది నెలల కాలంలో వేరే ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అంటే మాములు విషయం కాదు. కానీ కేవలం బాబా దయవలన అది సాధ్యమైంది. అంతేకాదు, 'విదేశంలో ఉద్యోగం' అన్న మా కల కూడా కేవలం బాబా అనుగ్రహంతోనే సాకారమైంది. బాబా లేకుంటే జీవితంలో మేము ఈ ఆనందాన్ని అనుభవించేవాళ్ళం కాదు. ఎవరైతే సదా ఆయనపై దృష్టి నిలిపి ఆయన స్మరణ చేస్తూ ఉంటారో బాబా వారి వెన్నంటే ఉండి సహాయం చేస్తారనడానికి నిదర్శనమే నా ఈ అనుభవం అని అనిపిస్తుంది.


తరువాత నవంబరు నెలలో మావారు మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. నవంబరు 27వ తేదీ రాత్రి ఏడుగంటల ముప్ఫై నిమిషాల సమయంలో నేను బాబా భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! మావారికి మంచి ఉద్యోగం రాబోతుంటే, అందుకు సంకేతంగా రేపు గురువారం (నవంబరు 28) శిరిడీ ప్రసాదం పంపండి" అని బాబాను వేడుకున్నాను. అలా బాబాని వేడుకోవడమైతే వేడుకున్నానుగానీ 'ఇది జరుగుతుందా?' అని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం నేను యథావిధిగా బాబా గుడికి వెళ్లి ప్రసాదం పంచుతున్నాను. 10:30 సమయంలో ఒకాయన వచ్చి శిరిడీ ప్రసాదమని చెప్పి, దూద్ పేడా నా చేతికి అందించి, "అందరికీ పంచమ"ని చెప్పారు. జరిగినదానికి నన్ను నేనే నమ్మలేకపోయాను.  బాబా స్వయంగా నాకోసం ప్రసాదం పంపారు! కొద్దినిముషాలు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంకేతంతో మా ఆయనకి మంచి ఉద్యోగం వస్తుందని ధైర్యంగా ఉన్నాను. ఇది బాబా నాకిచ్చిన మరో అద్భుతమైన అనుభవం. ఈ అనుభవాలను మీతో పంచుకోవడం మహాదానందమైన అనుభూతిని కలిగిస్తుంది. మా వారికి ఉద్యోగం వచ్చిన వెంటనే బాబా ఆశీర్వాదాన్ని మీ అందరితో పంచుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయిభక్తులకు నా నమస్కారాలు. ఓం సాయిరామ్!

సోదరునికి ఉద్యోగాన్ని అనుగ్రహించిన సాయి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బాబాకు సాధారణ భక్తురాలిని. ఆయనను తలచుకోనిదే నాకు తృప్తి ఉండదు. నాకు శ్రద్ధ ఉంది కానీ సబూరీతో ఉండలేకపోతున్నాను. ఆయనకు నా పరిమితులు తెలుసు కాబట్టి ప్రతీసారి నన్ను క్షమిస్తూ వస్తున్నారు. బాబాకు తనదైన సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వస్తే ఆయన సబూరీ కూడా నాకు ప్రసాదిస్తారు.

నా సోదరుడు బ్యాంక్ పరీక్షలలో విజయం సాధిస్తుండేవాడు, కానీ ఇంటర్వ్యూ వరకు వచ్చేసరికి ఏదో ఒక సమస్య వచ్చేది. ఆ విషయమై నేను 2018, జూన్-జులైలో ప్రశ్న-జవాబుల వెబ్‌సైట్‌లో బాబాను అడిగాను. "రామనవమి సమీపంలో తనకి ఉద్యోగం వస్తుంద"ని సమాధానం వచ్చింది. రామనవమి అంటే వచ్చే ఏడాది అని నేను నిరాశ చెంది, "బాబా! మీరెందుకు అంత ఎక్కువ సమయం తీసుకుంటున్నారు?" అని అడిగాను. రోజులు గడిచేకొద్దీ నా సోదరుడు తను శాశ్వత ఉద్యోగం పొందగలననే ఆశను కోల్పోతుండేవాడు. బాబా మాటలు అసత్యం కావనే నమ్మకం నాకుండటంతో తనతో, "ఆశను కోల్పోకుండా ధైర్యంగా ఉండమ"ని చెప్పాను. తనకి పూజలపట్ల అంత ఆసక్తి లేకపోయినప్పటికీ నేనొక బాబా విగ్రహాన్ని తనకి పంపించి, ప్రతి ఆదివారం లేదా వీలుకుదిరినప్పుడు బాబాకు అభిషేకం చేయమని చెప్పాను. తను అలాగే చేస్తుండేవాడు. కొన్నిసార్లు తనే చేసేవాడు, కొన్నిసార్లు నేను గుర్తుచేసేదాన్ని. 2019లోకి వచ్చేసరికి తను పూర్తిగా నిరాశకు లోనయ్యాడు. బాబా సమాధానం గురించి నేను ఎప్పుడూ తనికి చెప్పలేదు. కానీ, నేను మాత్రం పూర్తి నమ్మకంతో ఉండేదాన్ని. చివరికి బాబా మాటలు నిజమయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుఝామున ఒక బ్యాంకు ఉద్యోగానికి తను ఎంపికైనట్లు సందేశం వచ్చింది. ఆ తేదీకి సమీపంలోనే రామనవమి ఉంది. నా ఆనందానికి హద్దులు లేవు. బాబా దయవలన నేనీరోజు ఆయనకిచ్చిన మాట ప్రకారం ఈ అనుభవాన్ని మీతో పంచుకోగలుగుతున్నాను. "ధన్యవాదాలు బాబా! మీ దయవలన మా తల్లిదండ్రుల టెన్షన్ తీరింది. ఇంకా నాకున్న ఒక కోరిక మీకు తెలుసు. త్వరలోనే మీరు దాన్ని నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉంది. బాబా! దయచేసి నాకు సహనంతో ఉండగలిగే శక్తినివ్వండి". 

సాయిభక్తుల అనుభవమాలిక 248వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఈ సంవత్సరం బాబా నాపై కురిపించిన అనుగ్రహం
  2. అన్నీ రుగ్మతలకు ఊదీ తిరుగులేని ఔషధం

ఈ సంవత్సరం బాబా నాపై కురిపించిన అనుగ్రహం

పేరు వెల్లడించని  ఒక సాయిభక్తురాలు తన అనుభావాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఈ సంవత్సరంలో బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను చిన్నప్పటినుంచి సాయిని పూజిస్తున్నాను. ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్తున్నాను. కానీ ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. ఎందుకంటే, బాబా ఈ సంవత్సరంలో నాలుగుసార్లు శిరిడీ రప్పించుకుని నన్ను ఎంతగానో అనుగ్రహించారు. అద్భుతమైన దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు. కాకడ ఆరతికి హాజరయ్యే అవకాశాన్నిచ్చారు. ఆరతి అయ్యాక అభిషేకజలాన్ని ప్రసాదించారు. మధ్యాహ్నం ఆరతి తర్వాత తమకు నివేదించిన ప్రసాదాన్నిచ్చారు. ధూప్ ఆరతి తరువాత తీర్థం కూడా నాకు ఇచ్చారు. ఇంకా గురుస్థాన్ వద్ద నాకు చాలా వేపాకులు కూడా ప్రసాదించారు బాబా.

మరో విషయం: ఐదేళ్లుగా నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ ఐదేళ్ళలో నేను శిరిడీ వెళ్లిన ప్రతిసారీ బాబాని అడుగుతున్న మొదటి కోరిక, "బాబా! నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి" అని. అంతలా నేను ఎదురుచూస్తున్న ఆ కోరికను కూడా ఈ సంవత్సరమే తీర్చారు బాబా. అయితే ఎందుకోగానీ నాకు ఆ ఉద్యోగం అస్సలు నచ్చలేదు. 2019, నవంబర్ 12, కార్తీక పౌర్ణమినాడు మేము శిరిడీలో ఉన్నాము. ఆరోజు బాబా దర్శనానికి వెళ్లినప్పుడు, "బాబా! నేను నా ఉద్యోగ విషయంలో సంతోషంగా లేను. ఐదు సంవత్సరాలుగా నేను ఎంతో ఆత్రంతో ఎదురుచూస్తే, నాకు అస్సలు నచ్చని ఉద్యోగం వచ్చింది" అని మాటల్లో చెప్పలేనంతగా ఏడ్చాను. తరువాత మళ్ళీ, "బాబా! నాకు ఎందుకు ఇలాంటి ఉద్యోగాన్నిచ్చారు? ఇలా అడిగినందుకు నన్ను క్షమించండి. మీరు ఏది చేసినా దానిలో ఏదో మంచి ఉంటుంది. కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి బాబా" అని కూడా చెప్పుకున్నాను. మేము నవంబరు 15 వరకు శిరిడీలోనే ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడే ఒకరోజు నా స్నేహితురాలు ఫోన్ చేసి, "నీకు బాబా ఇన్నిసార్లు శిరిడీ దర్శించే భాగ్యాన్ని ఇస్తున్నారు. నువ్వు చాలా చాలా లక్కీ" అని చెప్పింది. నేను తనతో, "నేను లక్కీ కాదు. బాబా నాకు మంచి ఉద్యోగం ఇవ్వలేదు" అని అన్నాను. అందుకు తను, "అలా అనుకోకు. బాబా ఏది చేసినా దానిలో ఏదో అర్థం దాగివుంటుంది. తర్వాత నీకు నచ్చింది ఇస్తారేమో, మనకేమి తెలుసు?" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నిజంగా ఆ అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడటం ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే, తను ఎవరితోనూ అంతగా మాట్లాడదు. అలాంటి తను నాకు ఫోన్ చేయటమంటే అద్భుతమే! బాబానే ఆ ఫోన్ కాల్ చేయించారు. అయినా నా మనసు కుదుటపడక బాధలో ఉన్న నేను చాలా ఏడ్చాను. తరువాత శిరిడీ నుంచి వచ్చినరోజు నాకు చాలా జ్వరం వచ్చింది, జ్వరం తగ్గేసరికి మైగ్రేన్ తలనొప్పి వచ్చింది. ఎందుకిలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. "ప్లీజ్ బాబా! నన్ను క్షమించండి. నేను లక్కీనే, ఎందుకంటే నాకు తోడుగా మీరున్నారు. నేను మీ చర్యలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. దయచేసి నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించి నాకు పూర్తి ఆరోగ్యం ఇవ్వండి బాబా!"

అన్నీ రుగ్మతలకు ఊదీ తిరుగులేని ఔషధం.

కెనడా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మాతో ఇలా పంచుకుంటున్నారు: 


నేను ఒక టీచరుని. నా వయసు 40 సంవత్సరాలు. నేను కొంతకాలంగా నా శరీరంలో ఉన్న కణుతుల మూలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. రెండేళ్ల క్రితం నా గొంతుమీద ఒక గడ్డ ఉన్నట్టు గమనించాను. డాక్టరు సలహాతో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నాను. రిపోర్టులో గొంతుభాగంలో మరికొన్ని గడ్డలు ఉండడం గమనించిన డాక్టరు వాటిని బయాప్సీ చేయించమని చెప్పారు. ఆరోజు నుండి బయాప్సీ చేయించుకునేరోజు వరకు ప్రతిరోజూ బాబాను ప్రార్థించి, బాబా ఊదీని కొంత నుదుటికి పెట్టుకొని మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగేదాన్ని. బాబా అనుగ్రహంతో రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మూడు నెలల క్రితం నేను అనారోగ్యానికి గురయ్యాను. నా రొమ్ము భాగంలో విపరీతమైన నొప్పితో బాధపడ్డాను. చాలా ఏళ్లుగా నా రొమ్ములో ఒక గడ్డ ఉంది. నాకెందుకో అవన్నీ రొమ్ముక్యాన్సర్ లక్షణాలని అనిపించింది. నేను చాలా భయపడిపోయి వెంటనే గైనకాలజిస్టుని సంప్రదించాను. ఆవిడ మొదట అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఆ తర్వాత మామోగ్రామ్ చేశారు. రొమ్ములో నొప్పి భరించలేనంతగా ఉండేది. నేను ప్రతిరోజూ బాబాను ప్రార్థించి, బాబా ఊదీని రొమ్ము భాగంలో రాసుకుని, బాబా ఊదీ కలిపిన నీళ్లను త్రాగేదాన్ని. నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని కన్నీటితో బాబాను వేడుకునేదాన్ని. ఎందుకంటే, నాకు రెండు సంవత్సరాల పాప ఉంది. తను మా వివాహమైన 14 సంవత్సరాలకు బాబా వరప్రసాదంగా మాకు కలిగిన సంతానం. నాకేమైనా జరిగితే పాప పరిస్థితి ఏమౌతుందో అని చాలా దిగులుపడేదాన్ని. కొన్ని రోజుల తర్వాత మామోగ్రామ్ ప్రోగ్రాం రిపోర్టు వచ్చింది. అందులో గడ్డలు ఉన్న ఛాయలే లేవు. అంతా నార్మల్ గా ఉంది. "థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా! నా జీవితంలో మీరు ఎన్నో అద్భుతమైన అనుభవాలను ప్రసాదించారు. మీరే నా సంరక్షకులు. జన్మజన్మలకూ మీకు కృతజ్ఞురాలినై ఉంటాను". 
శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2541.html

సాయిభక్తుల అనుభవమాలిక 247వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా దయ, బాబా ఊదీ మహిమ
  2. ఊదీ చేసిన అద్భుతం 

బాబా దయ, బాబా ఊదీ మహిమ

బాబాకి ఉన్న కోటానుకోట్ల భక్తులలో నేను ఒక ఇసుకరేణువు వంటి భక్తురాలిని. నా పేరు అంజలి. ఇటీవల బాబా మా మీద చూపించిన కరుణను మీతో పంచుకోవాలని ఈ అనుభవాన్ని రాస్తున్నాను.

2019, ఏప్రిల్ నెల ప్రారంభంలో మావారు తన ఛాతీలో మంటగా వుందని చెప్పారు. మేము హాస్పిటల్‌కి వెళ్లి హార్ట్ చెకప్ చేయించుకోవాలని అనుకున్నాము. అయితే హాస్పిటల్‌కి వెళ్ళేరోజు నేను ఆయన ఛాతీకి బాబా ఊదీని రాశాను. అంతే! ఊదీ రాయగానే ఆయనకు ఛాతీ మంట తగ్గిపోయింది. ఆ తరువాత ఆయుర్వేద హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించాము. డాక్టర్ పరీక్షించి, "సమస్యేమీ లేదు, కేవలం కండరం పట్టేసిందంతే, ఏమీ కంగారుపడకండి" అని చెప్పి మందులు ఇచ్చారు. బాబా దయవల్ల మావారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.

మరోసారి మా పాప కళ్ళకి సైట్ వచ్చింది. రావటమే చాలా ఎక్కువ వచ్చింది. కళ్ళతో వ్యాయామం చేయాలని డాక్టర్ సూచించారు. పాప కంటిచూపు మెరుగుపడాలని బాబాను ప్రార్థించి ప్రతిరోజూ నిద్రపోయేముందు మా పాప కళ్ళకి బాబా ఊదీ రాసేదాన్ని. కొద్దిరోజుల తరువాత చెకప్ చేయిస్తే కంటిచూపు కొంచెం మెరుగుపడిందని చెప్పారు. అంతా బాబా దయ, బాబా ఊదీ మహిమ. ఇలా బాబా నా మీద చాలా కృప చూపించారు.

ఊదీ చేసిన అద్భుతం 

నా పేరు రిచా. నేను ఏమాత్రం సహనమే లేని దానిని. అయినా బాబా నన్ను ఎప్పటికప్పుడు క్షమిస్తూనే ఉన్నారు. నేను బాబాను ఎంతో ప్రేమిస్తున్నాను. ఎల్లప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తుంటాను. ప్రతిరోజూ ఈ బ్లాగులో సాయిభక్తుల అనుభవాలు చదవడం నాకు అలవాటు. బ్లాగును చక్కగా నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు.

ఒకరోజు రాత్రి ఫ్రైడ్‌ రైస్ తయారుచేయడం కోసం పెద్ద పచ్చిమిరపకాయలను కోసి లోపల గింజలను తొలగిస్తున్నాను. ఆ మిరపకాయలు అంత కారంగా ఉండవు కాబట్టి వాటి గురించి నేను అంతగా ఆలోచించలేదు. కాస్త సమయం గడిచాక నా కళ్ళు మండటం మొదలైంది. చల్లటి నీళ్లతో కళ్ళను కడుక్కుని పడుకున్నాను. పడుకునేముందు ముఖానికి క్రీం రాసుకోవడం వల్ల ముఖం కూడా మండసాగింది. క్రీం పూసుకోబోయే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కున్నట్లు నాకు బాగా గుర్తు. ముఖం మండుతున్నప్పటికీ అదృష్టవశాత్తూ నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. ఉదయం నిద్ర లేచేసరికి నా వేళ్లు భరించలేనంతగా మంటపుట్టసాగాయి. నా చేతుల్ని మళ్ళీ మళ్ళీ సబ్బుతో శుభ్రంగా కడుక్కున్నాను. వేళ్ళకి పాలు, పెరుగు ఇలా ఎన్నో రాసుకున్నాను. ఎన్ని రాసినా ఏమీ ఉపశమనం లేదు. అలాగే బాధను భరిస్తూనే పనులు చేసుకుని మా వారిని ఆఫీసుకి పంపించాను. తర్వాత పూజాగదిలోకి వెళ్లి, నాకు సహాయం చేయమని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. తర్వాత నేను బాబాతో, "బాబా! నేను మీ ఊదీని నా వేళ్ళకు రాసుకుంటున్నాను. నేను పూజ పూర్తి చేసేలోపు నా వేళ్ళ మంట పూర్తిగా తగ్గిపోయేలా అనుగ్రహించండి. నేను మధ్యాహ్నానికి భోజనం తయారుచేయాలి" అని చెప్పుకున్నాను. ప్రతిరోజూ బాబా అష్టోత్తరం చదవడం నాకు అలవాటు. ఆరోజు అష్టోత్తరం అయ్యాక కూడా నా వేళ్ళ మంట తగ్గలేదు. నాకు చాలా బాధగా అనిపించి, "బాబా! మీరు నన్ను ప్రేమించట్లేదు. ఈమధ్య నా ప్రార్థనలకు మీరు సరిగా స్పందించడం లేదు. ఇప్పుడు నేను అడిగింది ఎంతో చిన్నదే అయినా మీరు అసలు స్పందించనేలేదు" అని అన్నాను. ఇలా అనుకుంటూ నేను నా వేళ్ళ మీద నీళ్లు పోసుకుందామని మగ్గు పట్టుకోగానే నా వేళ్ళు మొద్దుబారిపోయాయి. నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా ఎల్లప్పుడూ అంతా మంచే చేస్తారు, కానీ నాకే సహనం లేదు. "బాబా! గత ఏడు సంవత్సరాల నుండి సంతానం కోసం ఎదురు చూసి చూసి నిరాశతో నాకు కన్నీళ్లే మిగిలాయి. నాపై దయచూపి నాకు సంతాన భాగ్యం కలిగించండి బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2510.html?m=0

సాయిభక్తుల అనుభవమాలిక 246వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అమ్మకు ప్రాణభిక్ష పెట్టిన బాబా
  2. బాబా ఊదీ

అమ్మకు ప్రాణభిక్ష పెట్టిన బాబా

సాయిభక్తుడు సాయి సుధీంద్ర భరణి తమకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నా పేరు సాయి సుధీంద్ర భరణి. మాది పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు. మా కుటుంబమంతా సాయిభక్తులం. నేనిప్పుడు 2019, ఆగష్టులో బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను. 

మా అమ్మగారికి ఆగష్టు 11న తీవ్రంగా చెవిపోటు వచ్చింది. రాత్రి పదిగంటల సమయంలో ఆమెకు హర్ట్‌ఎటాక్ కూడా వచ్చింది. కానీ మాకది హార్ట్‌ఎటాక్ అని అర్థం కాలేదు. ఉదయం కూడా అమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో మేము తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాం. అప్పుడు తనకి హార్ట్‌ఎటాక్ వచ్చిందని తెలిసి మేము నిర్ఘాంతపోయాము. అయితే బాబా దయవలన ఆమె క్షేమంగా ఉన్నారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక కూడా ఆమె పూర్తిగా కోలుకోలేదు. హార్ట్ ఫెయిల్యూర్ సంభవించి అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి కూడా దారితీసింది. తనని మేము విజయవాడ రమేష్ హాస్పిటల్లో చేర్చాము. డాక్టర్స్ ఆశలేదని చెప్పారు. మేమంతా చాలా బాధపడుతూ ఉండగా మా అమ్మగారికి కలలో బాబా దర్శనమిచ్చి, "కుక్కకు మూడు రొట్టెలు పెట్టు" అని ఆదేశించారు. మేము అలానే చేశాము. అద్భుతం! కుక్కలకు రొట్టెలు పెట్టాక ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఇదంతా మా కుటుంబంపై ఉన్న బాబా కృప, దయ వల్లనే సాధ్యమైంది. "బాబా! మీరు మాపై చూపుతున్న అనుగ్రహానికి చాలా చాలా కృతజ్ఞతలు".

బాబా ఊదీ

ఆస్ట్రేలియా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

రెండేళ్ల క్రితం బాబా నా జీవితంలోకి ప్రవేశించి నన్ను తన భక్తునిగా మలచుకున్నారు. నేను ఇప్పుడు బాబా ఊదీ మహిమను మీతో పంచుకుంటాను.

ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం చలికాలంలో ఫ్లూ వ్యాధి బాగా విజృంభిస్తుంటుంది. అయినా నేను మాత్రం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆ వ్యాధి బారిన పడుతుండేవాడిని. ఒక చలికాలంలో ఉదయం నిద్రలేస్తూనే గొంతు నొప్పిగా అనిపించింది. ఇదే ఫ్లూ వ్యాధి మొదలవుతుంది అనడానికి మొదటి సూచన. ఇంకెప్పుడైనా ఈ సమస్య వస్తే అంతగా ఆందోళనపడేవాడిని కాదు. కానీ, ఈసారి మరో 24 గంటల్లో నాకు డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ ఉంది. అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ మరో అపాయింట్‌మెంట్ దొరకడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అది మాత్రమే కాదు, అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే కనీసం 24 గంటల ముందు వాళ్లకు తెలియజేయాల్సి ఉంటుంది. నేను జలుబు, జ్వరం తగ్గడానికి మందులు వేసుకున్నాను. అలాగే గొంతునొప్పి తగ్గడానికి స్ట్రెప్సిల్స్ తీసుకున్నాను. కానీ, గొంతునొప్పి అలానే ఉంది. ఆరోజు రాత్రి నేను మంచంమీద పడుకుని ఉన్నప్పుడు బాబా ఊదీ గుర్తుకొచ్చింది. నేను బాబాతో, "బాబా! నేను మీ ఊదీని తీసుకుంటున్నాను, రేపు డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ సమయానికి నా ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించండి. డెంటిస్టుని కలిసిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చినా పర్వాలేదు" అని చెప్పుకున్నాను.

క్రితం సంవత్సరం నా  స్నేహితురాలు శిరిడీ నుండి చిన్న ఊదీ ప్యాకెట్, అలాగే వేరు వేరు సాయిమందిరాల నుండి కొంత ఊదీని నాకు పంపి అన్నిటినీ కలుపుకుని ప్రతిరోజూ పెట్టుకోమని చెప్పింది. అప్పటినుండి ఆ ఊదీలన్నీ కలిపి ఒక భరణెలో పెట్టుకుని రోజూ పెట్టుకుంటున్నాను. బాబాను ప్రార్థించి, ఆ భరిణెలోంచి చిటికెడు ఊదీ తీసుకొని నోట్లో వేసుకుని కొద్దిగా మంచినీళ్లు తాగి పడుకున్నాను. కొద్దిసేపట్లోనే నేను విపరీతమైన చలితో వణకడం మొదలుపెట్టాను. నాలుగు మందపాటి దుప్పట్లు కప్పుకున్నప్పటికీ వణుకు తగ్గలేదు. ఇక మరుసటిరోజు డెంటిస్ట్ దగ్గరకు వెళ్లే అవకాశం లేదని అనుకుని, ఉదయం లేచాక హాస్పిటల్‌కి ఫోన్ చేసి పరిస్థితి వివరించాలని నిర్ణయించుకున్నాను. తర్వాత నాకు తెలియకుండానే నిద్రపట్టేసింది. అర్థరాత్రి మెలకువ వచ్చి లేచి చూసుకుంటే వణుకు తగ్గిందన్న సంగతి గమనించాను. నాకు వేడిగా అనిపించి దుప్పట్లు తీసి ఫ్యాన్ ఆన్ చేసుకున్నాను. ఆ రాత్రంతా వేడివల్ల నేను ప్రక్కమీద అటూ ఇటూ పొర్లుతున్నప్పటికీ నా ఆరోగ్యం కాస్త మెరుగ్గానే అనిపించింది. శిరిడీ నుంచి తెచ్చిన ఊదీని వేరే సాయిమందిరాల నుండి తెచ్చిన ఊదీతో కలిపినప్పటికీ అది చాలా శక్తివంతమైనది. మరుసటిరోజు ఉదయం నా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. నేను డెంటిస్ట్ వద్దకు వెళ్లాను కూడా. "థాంక్యూ బాబా! మీకు మాట ఇచ్చిన ప్రకారం నా ఈ అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకున్నాను".

source: http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2535.html?m=0

శ్రీమాధవరావు అడ్కర్


ప్రముఖ సాయిభక్తులలో ఒకరైన శ్రీమాధవరావు అడ్కర్ తన జీవితకాలంలో ఎక్కువభాగం శ్రీసాయి సన్నిధిలోనే గడిపిన భాగ్యశాలి. ప్రతిరోజూ మధ్యాహ్న, సంధ్య ఆరతులలో వినిపించే 'ఆరతి సాయిబాబా - సౌఖ్యదాతార జీవా' అనే సుప్రసిద్ధ ఆరతి గీతం రచించినది ఇతడే. ఈ భక్తుని గురించిన సమాచారం సాయిభక్తుల ముందు ఉంచుతున్నాము.

శ్రీమాధవ్ అడ్కర్ భక్తిప్రపత్తులు కలిగిన ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబంలో  1877, సెప్టెంబర్ 5న జన్మించాడు. ఇతని తండ్రి శ్రీవామనరావు విఠల భక్తుడు. సంవత్సరంలో నాలుగుసార్లు పండరియాత్ర చేస్తుండేవాడు. తల్లి శ్రీమతి గోదావరి. వీళ్లది అహ్మద్‌నగర్ దగ్గరలో ఉన్న ధనోరా గ్రామం. వాళ్ళకి అక్కడ సొంత ఇళ్ళు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇతని పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకనాడు మాధవ్ తాతగారైన త్రయంబకరావు సాలీవిఠల్ మందిరంలో నిద్రిస్తుండగా అర్థరాత్రి 2 గంటల సమయంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో, "లే! భగవంతుని ఆశీస్సులతో నీకు మనవడు పుట్టాడు!!" అన్న మాటలు వినిపించాయి. వెంటనే అతడు లేచి ఇంటికి వెళ్లి చూస్తే, నిజంగానే తన కూతురు ఒక మగబిడ్డకి జన్మనిచ్చివుంది. మందిరంలో వచ్చిన కల సత్యమైనందున ఆ బిడ్డకి 'మాధవ్' అని నామకరణం చేశారు.

మరో ఆసక్తికరమైన విషయం: ఒకసారి తల్లి మాధవ్‌ని ఆడిస్తూ గాల్లోకి ఎగరవేసింది. తిరిగి ఆమె బిడ్డను పట్టుకోవడంలో విఫలమవ్వడంతో మాధవ్ ఇసుక మీద పడ్డాడు. ఆమె కంగారుగా బిడ్డని తన చేతుల్లోకి తీసుకుంటే, ఆశ్చర్యంగా బిడ్డ ఏడవకుండా ఆమెను చూస్తూ నవ్వుతున్నాడు.  దాంతో ఆమె 'ఈ బిడ్డలో ఏదో ప్రత్యేకత ఉంది' అనుకుంది. మాధవ్ తరువాత ఆ దంపతులకు మరో ఇద్దరు బిడ్డలు జన్మించారు. మాధవ్ తమ్ముడి పేరు గణేష్, చెల్లెలి పేరు దుర్గ. మాధవ్‌కు తొమ్మిదేళ్ల వయస్సున్నప్పుడు తల్లి మరణించింది. అప్పటినుండి మాధవ్ తాతగారి ఇంట అహ్మద్‌నగర్లో ఉండి మెట్రిక్ వరకు చదువుకున్నాడు.

ఆ సమయంలోనే దాసగణుతో మాధవ్‌కు పరిచయం ఏర్పడింది. అహ్మద్‌నగర్‌కు సమీపంలో ఉన్న ఝాముఖేడలో దాసగణు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండేవాడు. మాధవ్ 8వ తరగతి చదువుతుండేవాడు. ఇరువురి మనోభావాలు, ఆసక్తులు ఒకేలా ఉండటంతో ఇద్దరూ తొందరగానే మంచి స్నేహితులయ్యారు. దాసగణు చాలా చిన్నవయస్సు నుండే లావణీలు (మహారాష్ట్ర జానపద గీతాలు. వీటిని 'తమషా'లని కూడా అంటారు.), పౌడాస్ (చరిత్రలోని సాహసోపేత వ్యక్తుల వీరోచిత పనులను వివరించే పాటలు) వ్రాస్తుండేవాడు. మాధవ్ చిన్నప్పటినుంచి భజనలపట్ల, సాంప్రదాయ సంగీతంపట్ల ఆసక్తి కనబరిచేవాడు. చక్కటి గాత్రం కలిగివుండటంతో దేవాలయాలలోను, వేడుకలలోను పాటలు పాడుతుండేవాడు. ఆ ఆసక్తి వివిధ మతసంబంధిత చారిత్రాత్మక విషయాలపై, పౌరాణిక అంశాలపై లోతైన అధ్యయనం చేసేందుకు దోహదం చేసింది. తాను చదివిన ఆయా విషయాలు తన కీర్తనలలో, భజనలలో, ప్రవచనాలలో ప్రకటమవుతుండేవి. ప్రజలు వాటిని ఎంతగానో ఇష్టపడేవారు. అతడు చూడటానికి చక్కగా ఉండి, మంచి నటనా ప్రతిభ కలిగి ఉండేవాడు. ఈ లక్షణాలతో దాసగణు వ్రాసే జానపద రచనలు సాధారణ ప్రజలలో ప్రాచుర్యం పొందటానికి ఒక చక్కటి మాధ్యమం అయ్యాడతడు. ఒకసారి ఆ గ్రామప్రజల అభ్యర్థనమేరకు మృత్యుకటిక నాటకం ప్రదర్శించడానికి దాసగణు నిశ్చయించుకొని, ఆ నాటకంలోని 'చారుదత్త' పాత్రను మాధవ్‌కి ఇచ్చాడు. అక్కడి ప్రేక్షకులు అతని నటనకు, గానానికి మైమరిచి ప్రశంసల వర్షం కురిపించారు. మాధవ్ జ్యోతిషశాస్త్రంలో కూడా ప్రవీణుడు. ఖాళీసమయంలో తనను సంప్రదించే వారికోసం అతను జాతకాలు వ్రాస్తుండేవాడు.

1895లో తాత, నానమ్మల మరణంతో మాధవ్ అహ్మద్‌నగర్ వదిలి తన తండ్రి వద్దకు తిరిగి చేరుకున్నాడు. తండ్రి బలవంతంమీద తనకి ఇష్టం లేకపోయినా పనిచేయడం మొదలుపెట్టాడు. ప్రాపంచిక ఆసక్తి తక్కువగా ఉండి, ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువగా ఉండే మాధవ్ మనస్సు తెలిసిన దాసగణు సుమారు 1897 ప్రాంతంలో మాధవ్‌ను సాయిబాబా దర్శనానికి తీసుకువెళ్ళాడు. తొలిసారి బాబా దర్శనంతో మాధవ్ ఎంతో మానసిక ప్రశాంతతను పొందాడు. అంతవరకూ తాను వెతుకుతున్న ఆనందాన్ని ఆయన సన్నిధిలో అనుభవించాడు. అప్పటినుండి శిరిడీ ఎక్కువగా వెళ్తుండేవాడు. పూర్వజన్మ పుణ్యంకొద్దీ మాధవ్‌కు శ్రీసాయిబాబా సద్గురువుగా లభించారు.

అతడు తీర్థక్షేత్ర దర్శనాలను, మహాత్ముల సహచర్యాన్ని ఎంతగానో ఇష్టపడేవాడు. అతను శిరిడీతోపాటు కాశీ, రామేశ్వరం, బాలాజీ, గాణ్గాపూర్, నరసోబావాడి, మహూర్, తుల్జాపూర్, పండరిపురం తదితర అనేక పుణ్యక్షేత్రాలను తరచు సందర్శిస్తుండేవాడు. ఆ సమయంలో అతను గజానన్ మహరాజ్, అక్కల్కోటస్వామి, బల్బీమ్ మహరాజ్, సఖయస్వామి దేహుకర్, వాసకర్, వైకట్ స్వామి, వినాయక్ బువా, దాదామహరాజ్ వంటి సాధుసత్పురుషులను దర్శించి, వారి ఆశీస్సులు అందుకుంటుండేవాడు. తనలాగే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి కనబరిచే తన స్నేహితులకి ఆ విషయాల గురించి రోజుకు మూడు నాలుగు ఉత్తరాలు వ్రాస్తుండేవాడు. వాళ్లు పంపిన ప్రత్యుత్తరాల ద్వారా మాధవ్ మనసులో ఏర్పడుతున్న ఆధ్యాత్మిక చింతన గురించి తండ్రికి తెలిసి, అతనికి వివాహం చేస్తే కుటుంబ వ్యవహారాలలో పడి అతని మనస్సు మారుతుందని తలచి పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. 

మాధవ్ యొక్క సునిశిత పరిజ్ఞానం, చేతివ్రాతలు బాగా నచ్చి షోలాపూర్ జిల్లా కర్మాల తాలూకా సాడే గ్రామ నివాసి అయిన నగల వ్యాపారి రఘోపంత్ కావడే తన కుమార్తె గంగూబాయిని అతనికిచ్చి వివాహం చేయడానికి ఆసక్తి కనబరిచాడు. అలా 1899లో సాడే గ్రామంలో మాధవ్ వివాహం జరిగింది. అప్పటికి మాధవ్ వయస్సు 22 ఏళ్లు. వివాహమైన కొద్దిరోజులకే అతడు కుటుంబసభ్యులకు చెప్పకుండా ఉద్యోగం వదిలి తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. దానితో అందరూ కలత చెందారు, ముఖ్యంగా అతని మామ. రెండునెలల తర్వాత మాధవ్ ఇంటికి రావడంతో అందరూ సంతోషించారు గానీ, మళ్లీ రెండు నెలలు గడిచేసరికి ఒక శుభదినాన తన ఆధ్యాత్మిక పుస్తకాలను, సామానులను సర్దుకొని ఇంటినుండి మళ్ళీ వెళ్ళిపోయాడు. కుటుంబసభ్యులంతా అతనికోసం చాలా గాలించారు గానీ అతని ఆచూకీ తెలియలేదు.

ఇంటినుండి వెళ్ళిపోయిన మాధవరావు శిరిడీ చేరుకున్నాడు. నిత్యం బాబా దర్శనం చేసుకుంటూ, ఆయన సన్నిధిలో ఆనందంగా కాలం గడుపుతూ శిరిడీ గ్రామంలోని పది, పన్నెండుమంది పిల్లలకి పాఠాలు చెబుతూ జీవనాన్ని సాగిస్తుండేవాడు. సాయిబాబా తనకి ప్రతిక్షణం అండగా ఉంటూ ప్రతిక్షణం తన బాగోగులు చూసుకుంటారని నిశ్చింతగా ఉండేవాడు. బాబా దర్శనం కోసం వచ్చే భక్తులతో బాబా గురించి చెప్తూ సత్సంగం చేస్తుండేవాడు. ఈ సమయంలో అతడెన్నో బాబా లీలలను అనుభూతి చెందాడు. అలా శిరిడీలో ఉన్నప్పుడు, అంటే 1903-04 ప్రాంతంలో ఒకసారి అతని మనస్సు పూర్తిగా బాబా ఆలోచనలతో నిండిపోగా ఎంతో తన్మయత్వానికి లోనయ్యాడు. ఆ స్థితిలో అతని మనస్సునందు  'ఆరతి సాయిబాబా - సౌఖ్యదాతార జీవా' అన్న పద్యం ఊపిరి పోసుకుంది. శ్రీసాయిబాబాపై ఆరతి రూపంలో ఉన్న ఆ పద్యాన్ని చూసిన దాసగణు ఆశ్చర్యచకితుడై ఆనందపరవశుడయ్యాడు. అతడెంతగానో ప్రశంసించినప్పటికీ మాధవ్ తన రచన గురించి పెద్దగా ఏమీ పొంగిపోకుండా ఆ కాగితం ముక్కను మడిచి తన జేబులో పెట్టుకున్నాడు. తరువాత ఇద్దరూ బాబా వద్దకు వెళ్లారు. తన జేబులో ఉన్న ఆ కాగితాన్ని ఎవరి కంటా పడకుండా మాధవ్ దాచడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన బాబా, ‘‘అరె మాధవ్! ఆ కాగితాన్ని ఎందుకు దాచడానికి ప్రయత్నిస్తున్నావు? బిగ్గరగా చదువు!’’ అని అన్నారు. దాంతో అతడు ఆ ఆరతి పాటను బాబాకు పాడి వినిపించాడు. అది విన్న బాబా, ‘‘నీ ఆరతి భక్తుల సంక్షేమాన్ని చూస్తుంది’’ అని ఆశీర్వదించారు. ఈనాటికీ బాబా అన్న ఆ మాటలు ఎంత సత్యమో భక్తులు అనుభవిస్తున్నారు. అదే బాబాపై వ్రాయబడ్డ మొట్టమొదటి ఆరతి గీతం.

ఒకసారి బాబా దర్శనార్థం చాలామంది భక్తులు రావడంతో ద్వారకామాయి ప్రాంగణమంతా నిండిపోయింది. ఇంకా చాలామంది భక్తులు బాబా దర్శనం కోసం బయట వేచివున్నారు. ద్వారకామాయి ప్రవేశద్వారం వద్ద ఉన్న మాధవ్ తనలో తాను, "ఏమిటి బాబా! మీ దర్శనం కోసం మాలాంటి పేదవాళ్ళం చాలా సమయం వేచివుండాలా?" అని అనుకున్నాడు. మరుక్షణం బాబా, "మాధవ్‌ని లోపలికి రానివ్వండి" అని బిగ్గరగా అరిచారు. అది వింటూ ఆశ్చర్యపడిన అతడు, 'బాబా అంతర్యామి. ఆయనకన్నీ తెలుసు. మనలోని చిన్న ఆలోచన సైతం ఆయనకు తెలియకుండా ఉండద'ని గ్రహించాడు.

కొంతకాలం గడిచిన పిమ్మట రఘోపంత్‌కి ఇంటినుండి వెళ్ళిపోయిన మాధవ్ కాశీయాత్ర చేసి, అక్కడినుంచి షేగాఁవ్ చేరుకొని, చివరిగా శిరిడీలో స్థిరపడ్డాడని తెలిసింది. దాంతో వాళ్ళు మాధవ్‌ని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి శిరిడీకి బయలుదేరారు. అదేసమయంలో సర్వాంతర్యామి అయిన బాబా మాధవ్‌తో, "మాధవ్! నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇద్దరు వ్యక్తులు గుర్రం మీద వస్తున్నారు. నువ్వు వాళ్లతో ఇంటికి వెళ్ళు. కానీ నువ్వేం చింతించకు! నువ్వెప్పుడూ నువ్వు వ్రాసిన ఆరతి పాటతో నా చెంతనే ఉంటావు" అని చెప్పారు. బాబా చెప్పినట్లుగానే మరుసటిరోజు ఇద్దరు వ్యక్తులు అతనిని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చారు. బాబా అప్పటికే వాళ్లతో వెళ్ళమని మాధవ్‌కి చెప్పి ఉన్నందున అతనికి ఇష్టం లేకపోయినా బాబా ఆదేశానుసారం వాళ్లతో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ముగ్గురూ బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళినప్పుడు బాబా మాధవ్‌తో, "ఇప్పుడు నువ్వు వాళ్లతో వెళ్ళు. ఇంకా ఇక్కడ ఉండకు. వెళ్ళు! నీకు కొడుకు పుడతాడు. తనకి 'రామ్' అని పేరు పెట్టు" అని చెప్పారు. వాళ్ళు ముగ్గురూ బాబాకి నమస్కరించుకొని వాళ్ల గ్రామానికి వెళ్లిపోయారు.

బాబా చెప్పినట్లుగానే ఒక సంవత్సరం తరువాత 1915, మార్చి 4న మాధవ్‌కు కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకి 'రామచంద్ర' అని నామకరణం చేశారు. బిడ్డను బాబా దివ్యపాదాలచెంత ఉంచాలని బిడ్డను తీసుకుని మాధవ్ తన భార్య గంగూబాయితో శిరిడీ వచ్చాడు. బాబా రామచంద్రను తమ ఒడిలోకి తీసుకొని ప్రేమగా లాలిస్తూ ఆశీర్వదించారు. తరువాత మాధవ్‌కు ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆమెకు పండరిపురానికి చెందిన శ్రీరోపాలేకర్‌తో వివాహమైంది. అయితే ఆమె తన తల్లిలాగే ఎక్కువకాలం జీవించలేదు. అందువలనే రామచంద్రకి ఉపనయనం జరిగినప్పుడు తన కుటుంబం తరపున తన తండ్రి మాత్రమే ఉన్నాడు.

మాధవ్ అడ్కర్ శిరిడీనుండి దూరంగా ఉన్న సందర్భాలలో అతని మనస్సు చాలా చంచలంగా ఉండేది. 'ఎప్పుడెప్పుడు శిరిడీ చేరుకుంటానా!' అని అతని హృదయం కొట్టుమిట్టాడుతుండేది. ఒకసారి రామనవమి పండుగ సమీపిస్తోంది. అతడు వీలైనంత త్వరగా శిరిడీలో ఉండాలని తపిస్తున్నాడు. అయితే తన ఆరోగ్యం బాగాలేనందున ఆ స్థితిలో శిరిడీ ఎలా వెళ్లగలనా అని భయపడ్డాడు. అంతలో తన స్నేహితులిద్దరు వచ్చి అతన్ని చాలా జాగ్రత్తగా శిరిడీకి తీసుకొని వెళ్లారు. అలా బాబా తన భక్తుని మనస్సులోని తపన తెలుసుకుని దానిని నెరవేర్చారు.

మాధవ్‌పై దాసగణు ప్రభావం చాలా ఉండేది. అతడు దాసగణును తన అన్నగా భావించి గౌరవిస్తూ అతనిపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించేవాడు. అతను దాసగణును కూర్చోబెట్టి, పూలమాలలు వేసి, అతని కాళ్ళకి మ్రొక్కి, కాళ్ళు కడిగి పూజించి, ఆ నీటిని ‘పవిత్రజలం’గా భావించి త్రాగేవాడు. ఇవన్నీ దాసగణుకి ఇబ్బందిగా ఉండేవి, కానీ నియంత్రించలేకపోయేవాడు. ప్రతిరోజూ 12సార్లు విష్ణుసహస్రనామాన్ని పఠించడం దాసగణుకు అభ్యాసం. అది తెలిసిన మాధవ్ కూడా ఆ పద్ధతిని అనుసరించడం ప్రారంభించాడు. అది తన తుదిశ్వాసవరకు కొనసాగించాడు. ఇప్పటికీ అతని కుటుంబసభ్యులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. అతడు చాలా త్వరితగతిన కవితలు రచించగలిగేవాడు. కానీ దాసగణు వంటి గొప్ప కవి యొక్క పాండిత్యం ముందు అతనెప్పుడూ వినయపూర్వకంగా తలవంచేవాడు. దాసగణు కీర్తనలను అతడెంతగానో ఇష్టపడేవాడు. 1952 వరకు ప్రతిసంవత్సరం దాసగణుతో కలిసి రామనవమి పండుగకు హాజరవుతుండేవాడు.

మాధవ్‌కు ఉత్తరాలు వ్రాయడం చాలా ఇష్టం. వాటిలో కుటుంబ విషయాల ప్రస్తావన చాలా అరుదుగా ఉండి ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ఉండేవి. చాలా తరచుగా దాసగణు గురించి ఆ లేఖలలో ప్రస్తావిస్తుండేవాడు. ఆ లేఖల పైభాగంలో అతను ‘శ్రీ శంకర్’ అని వ్రాసేవాడు. అది కూడా దాసగణు యొక్క అలవాటు. ఆ లేఖల కాపీని తన కొడుకు శ్రీరామచంద్రపంత్‌కు కూడా పంపేవాడు. అతడు వాటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచేవాడు. ముఖ్యంగా అతను ప్రతివిషయంలో దాసగణును సంప్రదించేవాడు. అప్పుడప్పుడు శ్రీసాయిశరణానంద్, నానాసాహెబ్ చందోర్కర్, జి. టి. కార్నిక్, రావుబహదూర్ సాఠే, త్రిపాఠి మొదలగు ఇతర సాయిభక్తులతో కూడా సంభాషించేవాడు. ఈ లేఖలు చాలావరకు మొదట్లో మరాఠీ, సంస్కృతంలోనే ఉండేవి. తరువాత తరువాత ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో కూడా ఉండేవి. మాధవ్‌కు సంస్కృతం, మోడీ, ఇంగ్లీషు, ఉర్దూ, పార్సీ, మరాఠీ, తెలుగు, కన్నడ, గుజరాతీ మరియు హిందీ వంటి అనేక భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈ భాషలలో ఆయన వ్రాసిన లేఖలు అతని వారసులవద్ద లభిస్తాయి. ఈ భాషలపై అతనికున్న పాండిత్యం అతని రచనలు, కవితల ద్వారా తెలుసుకోవచ్చు. 1948లో గుజరాత్‌కు చెందిన శ్రీరంగాచార్యస్వామి మహరాజ్ అనే సమకాలీన సాధువుపై మాధవరావు సంస్కృతంలో ఒక గ్రంథాన్ని రచించారు. దాని రూపకల్పనలో అతని కళాత్మకత గోచరిస్తుంది. ఆ గ్రంథాన్ని చూస్తే అది చేతివ్రాత కాదు ముద్రణ అని అనిపించకమానదు. అంత గొప్పగా ఉంటుంది అతని చేతివ్రాత. అతను తన స్వహస్తాలతో ‘విష్ణుసహస్రనామం' కూడా రచించాడు. అది చూసి దాసగణు ఎంతగానో సంతోషించి లోనీ గ్రామంలో వుంటున్న మాధవ్‌కు రూ.3 మనియార్డర్ చేశాడు. తరువాత ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఇరువురి కళ్ళనుండి కన్నీళ్ళు పొంగిపొర్లాయి. వారిరువురి మధ్య అంతటి ప్రేమానురాగాలు ఉండేవి.

ఒకసారి మాధవ్‌ను ఒక చిన్న గ్రామంలో పోస్ట్ చేశారు. అక్కడ ఉండగా ఒక బ్రిటిష్ అధికారి పాఠశాలను తనిఖీ చేయడానికి అక్కడకు వచ్చాడు. మాధవ్‌తో  మాట్లాడుతున్నప్పుడు, ఆంగ్లభాషపై అతనికున్న పాండిత్యం చూసి ఆ బ్రిటిష్ అధికారి ముగ్ధుడయ్యాడు. వెంటనే అతను, 'అటువంటి మారుమూల గ్రామంలో ఇంతటి నైపుణ్యం ఉన్న వ్యక్తిని పోస్ట్ చేయడం చాలా దారుణమ'ని పై అధికారులకు వ్రాశాడు. దానికి పైఅధికారులు, "మీరు చెప్పేది నిజం. కానీ సమస్య ఏమిటంటే ఆ పెద్దమనిషి ఏ ఒక్క ప్రదేశంలోనూ ఎక్కువకాలం కొనసాగడు" అని బదులిచ్చారు.

1955 నవంబరు 13న మాధవ్ అడ్కర్ మరణావస్థలో ఉన్నప్పుడు తన కొడుకు రామచంద్రుని దగ్గరకు పిలిచి, "ఒక మంచి కఫ్నీ పంపించమని శిరిడీ సంస్థాన్‌కి ఉత్తరం వ్రాయమ"ని చెప్పాడు. తర్వాత కొద్దిరోజులకి నవంబరు 18న తన కొడుకుతో, "రామ్, బాబా ఆరతి పాట పాడు. అలాగే భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయం, విష్ణుసహస్రనామం పఠించు. బాబా నామస్మరణ చేయి" అని చెప్పాడు. అప్పుడు రామచంద్ర, "నాన్నగారూ! మీ కోరిక ఏమిటి?" అని అడిగాడు. అందుకు మాధవ్, "నేను సంతృప్తిగా ఉన్నాను. నువ్వు స్మరణ ఆపవద్దు" అని చెప్పాడు. తర్వాత కుటుంబమంతా బాబా ఆరతి పాడుతూ ఉండగా మాధవ్ అడ్కర్ తన తుదిశ్వాస విడిచాడు. అలా బాబా ఆరతి వింటూ, బాబా మీద ధ్యాస నిలిపి తన జీవితాన్ని చాలించిన ధన్యజీవి మాధవ్ అడ్కర్.

సాయిబాబా ఆశీస్సులతో జన్మించిన మాధవ్ అడ్కర్ కుమారుడు రామచంద్ర అడ్కర్ వివిధ రంగాలలో గొప్ప విజయాలను సాధించాడు. బహుముఖ వ్యక్తిత్వం కలిగిన అతడు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సమర్థుడైన వైద్యునిగా, జ్యోతిష్కునిగా, ఉపాధ్యాయునిగా అతడు గొప్ప ఖ్యాతి గడించాడు. వీటిన్నిటికీ మించి అతడు సాయిబాబాకు అంకిత భక్తుడు. అతడు సాయిబాబా ఇచ్చిన ప్రేరణతో పూణే సమీపంలోని 'లోని' అనే ప్రదేశంలో 2001-2005 మధ్యకాలంలో 3 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన సాయిబాబా మందిరాన్ని నిర్మించాడు. ఈ సాయిమందిరం ద్వారా వందలాదిమంది సాయిభక్తులు సాయి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ మందిరంలో మందిర ప్రారంభోత్సవాన్ని (ఫిబ్రవరి 19), శ్రీమాధవ్ అడ్కర్ సంవత్సరీకాన్ని (నవంబర్ 18) ఎంతో భక్తితో జరుపుకుంటున్నారు. శ్రీరామచంద్ర అడ్కర్ సుదీర్ఘకాలం జీవించి తన 103వ ఏట తన జన్మతేదీ అయిన మార్చి 4న 2017లో తుదిశ్వాస విడిచారు. చాలా చిన్నవయస్సులో అతడు బాబాను దర్శించినందున అతనికి బాబా ముఖం సరిగా గుర్తులేకపోయినప్పటికీ బాబా పాదాలు మాత్రం తన చివరిరోజులవరకు చాలా స్పష్టంగా గుర్తున్నట్లు అతడు చెప్పేవాడు.
రామచంద్ర అడ్కర్, అతని భార్య మధురాబాయి అడ్కర్ 
సమాప్తం.

Source: మరాఠీ(ఆంగ్లానువాదం సుధీర్) సాయిలీల సెప్టెంబరు-అక్టోబరు 2010,  http://www.saiamrithadhara.com/mahabhakthas/madhavrao_adkar.html

సాయిభక్తుల అనుభవమాలిక 245వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నాకు సాయి పునర్జన్మనిచ్చారు
  2. మా పాపపై బాబా అనుగ్రహం
  3. బాబా లీల

సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నాకు సాయి పునర్జన్మనిచ్చారు

ఓం సాయి! నేను ఒక సాయి భక్తుడిని. 2014లో నేను నా మిత్రులతో కలిసి ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించి వ్యాపారంలో మోసపోయి నష్టాల పాలయ్యాను. చాలా సమస్యలలో చిక్కుకొని రోజురోజుకీ మానసిక వేదన పెరిగి అనారోగ్యం పాలయ్యాను. నా అనుకున్నవాళ్ళు, నా ఆత్మీయులు అనుకున్నవాళ్ళు నాకు ఎలాంటి సహాయం చేయక‌పోగా నన్ను దూరంగా పెట్టారు. దిక్కుతోచని సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఆ సమయంలో ఆ సాయినాథుడే రమణానందమహర్షి వారి ప్రవచనాల ద్వారా నాకు పునర్జన్మనిచ్చారు. అతను సాయే నిత్యం, సాయే సత్యం, సాయే శాశ్వతం అని తెలిపి, సాయిని ఏవిధంగా ధ్యానించాలో, ఎలా ప్రేమించాలో తెలియజేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు, శతకోటి నమస్కారములు. అప్పటినుండి సాయి ప్రేమను తనివితీరా ఆస్వాదిస్తున్నాను. సాయే నాకు తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, బంధుబలగం. నా జీవితాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న శ్రీ శిరిడీ సాయినాథునికి పాదాభివందనాలు. "సాయీ! సర్వం నీవే తండ్రీ. నీ ప్రేమ వర్ణనాతీతం. మాటలకందని నీ ప్రేమ అందరిపై కురవాలని మనసారా కోరుకుంటున్నాను".

ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!

మా పాపపై బాబా అనుగ్రహం

నా పేరు ప్రియ. నేను యుఎస్ఏలో నివాసముంటున్నాను. నేను మహాపారాయణ గ్రూపులో భాగస్వామిని. నేను నా జీవితంలో ఎన్నో బాబా లీలలను అనుభూతి చెందాను. కానీ, ఈ లీల నా మనసుకి ఎంతో దగ్గరైన లీల. ఎందుకంటే, ఈ లీల ద్వారా బాబా మా పాప అనారోగ్యాన్ని తొలగించారు. ఒకసారి మా పాప 105 డిగ్రీల జ్వరంతో బాధపడింది. నేను, మావారు ఎంతగానో భయపడిపోయాము. అది రాత్రి సమయం కావడంతో రెగ్యులర్ డాక్టర్లెవరూ అందుబాటులో ఉండరు కాబట్టి ఎమర్జెన్సీకి ఫోన్ చేసి పిలిపించమని మా కుటుంబసభ్యులు చెప్పారు. నేను ఎమర్జెన్సీకి ఫోన్ చేసే ముందు బాబాను ప్రార్థించి ఆయన ఆశీస్సులు పొందాలనుకుని పూజామందిరంలోకి వెళ్లాను. బాబా పాదాలపై పడి, "బాబా! మా పాపను కాపాడండి. తన జ్వరం తగ్గి సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చేలా అనుగ్రహించండి. నేను పూర్తిగా మీమీదే ఆధారపడ్డాను. మీరు మాత్రమే మా పాపను ఈ పరిస్థితి నుండి కాపాడగలరు" అని మనస్పూర్తిగా బాబాను  ప్రార్థించాను. తర్వాత కొద్దిగా బాబా ఊదీని పాలల్లో కలిపి మా పాపకి తాగించాను. ఆశ్చర్యకరంగా పదినిమిషాల్లోనే పాపకు జ్వరం తగ్గి చెమటలు పట్టడం మొదలైంది. అది చూసి మా కళ్ళను మేమే నమ్మలేకపోయాము. నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. బాబాకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు. ఆయన ఎప్పుడూ మాతోనే ఉండి మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు. "మాపై ఇంత అనుగ్రహం చూపుతున్నారు. చాలా చాలా ధన్యవాదాలు బాబా!" బాబాపై నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆయన మనల్ని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటారు, మన ప్రార్థనలు వింటారు. నన్ను మహాపారాయణ గ్రూపులో భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు.


బాబా లీల

నేను హైదరాబాదు నుండి రాగశ్రీ. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. నేను మహాపారాయణ గ్రూపులో (ఎంపీ-327) సభ్యురాలిని. బాబా ఊదీ, మహాపారాయణ చాలా శక్తివంతమైనవి. మహాపారాయణ చేస్తున్నప్పుడే నాకు ఉద్యోగం వచ్చింది. ఇక నా అనుభవానికి వస్తే... మా ఆఫీసులో మా మేనేజరు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ప్రతిరోజూ నేను నా రిపోర్టును మా మేనేజరుకు అప్డేట్ చేయాల్సి ఉండేది. అందువల్ల నేను ఎప్పుడూ టెన్షన్ పడుతుండేదాన్ని. ఒకరోజు నేను మేనేజరు క్యాబిన్‌కి వెళ్ళినప్పుడు అతను నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగాడు. నేను వెంటనే 'నాకు సహాయం చేయమ'ని బాబాను మనసులోనే ప్రార్థించాను. సాధారణంగా ప్రతిరోజూ 30 నిమిషాల సమయం తీసుకునే అతను ఆరోజు పదినిమిషాలలోపే నన్ను వెళ్ళమన్నాడు. నా ప్రార్థన విని బాబా నాకు సహాయం చేసినందుకు ఎంతో ఆనందించాను. బాబాకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా!"

సాయిభక్తుడు - బాలకృష్ణ ఖపర్డే


నమ్ముకున్న వారిపై బాబా అనుగ్రహం ఎంతగా ఉంటుందో తెలియజేసే అద్భుతలీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

బాలకృష్ణ ఖపర్డే అలియాస్ బాబాసాహెబ్ ప్రసిద్ధ 'శిరిడీ డైరీ' రచించిన శ్రీదాదాసాహెబ్ ఖపర్డే కుమారుడు. బాబా సమాధి చెందిన తరువాత అతనికి జరిగిన ఈక్రింది సాయిలీలను దాదాసాహెబ్ ఖపర్డే మనుమడైన శ్రీ కేశవ్ ఖపర్డే ఇలా చెప్తున్నాడు:

ఒకప్పుడు బాలకృష్ణ ఖపర్డే భోపాల్ నుండి పచ్మడికి కారులో ప్రయాణిస్తున్నాడు. కొండప్రాంతంలో ఉన్న ఆ మార్గం బాగా ఒంపులతో నిటారుగా ఉంది. మరోవైపు బాగా లోతైన లోయలు ఉన్నాయి. కారు పైకి ఎక్కుతూ ఒకచోట మలుపు తిరుగుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది. అంతే! ఉన్నపళాన అతని కారు లోతైన లోయలోకి పడిపోయింది. అటువంటి నిస్సహాయస్థితిలో నిరాశా నిస్పృహలతో అతడు తమని రక్షించమని బాబాను ఆర్తిగా పిలిచాడు. అంతలో తెల్లని కఫ్నీ ధరించిన ఒక వ్యక్తి చేయి ఆ కారు తలుపు తెరవడం అతడు చూశాడు. మరుక్షణంలో అతను, డ్రైవర్ ఇద్దరూ ఒక బండమీద ఉన్నారు, కారు లోతైన అగాధంలో పడిపోయింది. ఇద్దరూ తమ నుదుటిపై చిన్నగా గీసుకుపోవడం తప్ప తీవ్రమైన గాయాలేమీ లేకుండా అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. సాయిబాబాయే కారు తలుపులు తెరచి, వారిని సురక్షితంగా కాపాడారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సమాప్తం.

మూలం: విన్నీ చిట్లూరి రచించిన బాబా అనురాగ్.

సాయిభక్తుల అనుభవమాలిక 244వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  • భయాందోళనలను అధిగమించడంలో బాబా చేసిన సహాయం

యు.కె. నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

గత 10 సంవత్సరాలుగా నేను సాయిభక్తురాలిని. ముందుగా నేను ఈ బ్లాగ్ నిర్వాహకులకు, తమ అనుభవాలు పంచుకుంటున్న తోటి భక్తులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే, ఈ అనుభవాలు సాయిపై ఉన్న విశ్వాసం మరింత పెంపొందేందుకు దోహదం చేస్తున్నాయి. నేను ఈ అనుభవాలు చదువుతూనే నా రోజును ప్రారంభిస్తాను. ఇటీవల నా కొడుకుకి వినికిడి సమస్య అన్న విషయంలో నేను అనుభవించిన భయాందోళనలను అధిగమించడంలో బాబా చేసిన సహాయాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

3 సంవత్సరాల నా కొడుకు నర్సరీ చదువుతున్నాడు. మా మాతృభాష ఇంగ్లీష్ కాదు. ప్రధాన భారతీయ భాషలు కూడా కావు. ఇంట్లో మేము మా మాతృభాషనే మాట్లాడుతుంటాము. మాకు సమీపంలో ఉన్న కొంతమంది భారతీయ స్నేహితులతో మాత్రం దక్షిణ భారత భాషలో మాట్లాడతాము. కానీ స్కూలులో ఇంగ్లీషులోనే అంతా మాట్లాడతారు. అందువలన నేను నా కొడుకు చదువు గురించి పెద్దగా ఆలోచించేదాన్ని కాదు గానీ, తనకి భాష సమస్య కాకపోతే చాలు అనుకునేదాన్ని. అయితే తను త్వరలోనే ఇంగ్లీషుకి అలవాటుపడతాడు, అంతా బాగానే ఉంటుందని అనుకున్నాను. నేను అప్పుడప్పుడు తన క్లాస్ టీచరుని తన గురించి అడుగుతూ ఉండేదాన్ని. నేను అడిగినప్పుడల్లా ఆమె, "బాబు గురించి ఆందోళన చెందడానికి ఏమీలేదు. అంతా బాగుంది" అని చెప్తుండటంతో నేను ప్రశాంతంగా ఉండేదాన్ని.

3 నెలల తరువాత పేరెంట్స్ మీటింగ్ అని మమ్మల్ని పిలిచారు. అప్పుడు మేము బాబు గురించి అడిగినప్పుడు, "మీ అబ్బాయికి వినికిడి సమస్య ఉన్నట్లుంది. తను సరిగా వినట్లేదు. ఒకసారి డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లి పరీక్ష చేయించండి" అని చెప్పారు. ఒక్కసారిగా నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. నేనస్సలు నమ్మలేకపోయాను. ఈ మీటింగ్ తరువాత హాలిడేస్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత నేను ఆ టీచరుతో "సమస్య భాష కావచ్చు, నాకు తెలిసి వినికిడి సమస్య కాదు. తను చిన్న చిన్న శబ్దాలకు కూడా స్పందిస్తాడు. మేము చెప్పేవి తను చక్కగా వింటాడు" అని అన్నాను. కానీ ఆమె అస్సలు అంగీకరించక బాబు యొక్క వినికిడి సమస్యకు సంబంధించి చాలా ఉదాహరణలు చెప్పింది. అయితే ఒక తల్లిగా నేను ఆమె అభిప్రాయాన్ని అస్సలు అంగీకరించలేకపోయాను. కానీ ఏమి చేయాలో అర్థంకాక నేను తీవ్రమైన నిరాశకు లోనయ్యాను. ఆమె నాకొక నంబర్ ఇచ్చి, వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్ తీసుకుని సమస్యను పరిష్కరించుకోమని చెప్పింది. నేను చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి, బాబా ముందు కూర్చుని చాలా ఏడ్చాను. దేశం కాని దేశంలో నాకిలాంటి పరిస్థితి ఎందుకిచ్చారని కొన్నిసార్లు బాబాపై కోపం కూడా వచ్చింది. రాత్రీపగలూ నా కొడుకు విషయంలో ఆందోళనపడుతూ సరిగ్గా తినలేకపోయేదాన్ని, నిద్రపోలేకపోయేదాన్ని. నాభర్త నాతో, "ఎందుకింత బాధపడతావు? పిల్లల గురించి అందరికంటే బాగా తల్లిదండ్రులకే తెలుస్తుంది. మరి మన బిడ్డ గురించి మనకు తెలియదా? అయినా కేవలం చెక్ చేయడమే కదా, దానికే ఇంత ఆందోళన చెందనవసరంలేదు" అని చెప్పి నన్ను ఓదార్చడానికి చాలా ప్రయత్నించారు. కానీ తల్లి మనసు కుదుటపడలేదు. ఈలోగా స్కూల్ మళ్ళీ మొదలైంది. టీచర్ మా బాబు వినికిడి సమస్యకు సంబంధించిన రిపోర్టు కోసం నన్ను సతాయించడం మొదలుపెట్టింది. నేను ఆమెతో, "ఇంకా డాక్టర్‌ అపాయింట్‌మెంట్ తీసుకోలేదు. త్వరలో అపాయింట్‌మెంట్ తీసుకుని మీకు తెలియజేస్తాను" అని చెప్పి ఇంటికి వచ్చాను. బాబాతో నా బాధ చెప్పుకుని ఏడ్చాను. తర్వాత మావారి వద్ద కూడా ఏడ్చాను. చివరకు మేము మార్చి చివరిలో అపాయింట్‌మెంట్ కోసం ఫోన్ చేస్తే, "చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది. మీరు చాలా రోజులు వేచి ఉండాలి. మేము అపాయింట్‌మెంట్ గురించి మీకు తర్వాత తెలియజేస్తామ"ని చెప్పారు. నేను నిరంతరం సాయి నామాన్ని జపిస్తూ, బాబాతో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒకరోజు, "బిడ్డా! ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను నీ ప్రార్థనలను విన్నాను. మీ సమస్యలన్నీ త్వరలో ముగియనున్నాయి" అని బాబా మెసేజ్ వచ్చింది. అంధకారంలో ఉన్న నాకు ఆ మెసేజ్ ఆశాజ్యోతి అయ్యింది.

ఆ తరువాత, సాయంత్రం ఆరతికి హాజరుకమ్మని మా పక్కింటి వారినుండి ఆహ్వానం వచ్చింది. నేను గురువారం సాయంత్రం బాబా ఆరతికి హాజరై, "నా కొడుకు విషయంలో అంతా బాగుండాలి" అని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. తరువాత వచ్చిన శనివారంరోజున 'జూన్ 6, ఉదయం 9.15 గంటలకి హాస్పిటల్‌కి రమ్మ'ని అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చింది. ఆరోజు గురువారం కావడం చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. అపాయింట్‌మెంట్ గురువారమే రావడం నాకు బాబా మిరాకిల్ అనిపించి, 'బాబా ఎప్పుడూ నాతోనే ఉన్నార'ని నాకు అర్థమై మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను బాబాతో, "మీరు నాతో ఉన్నానని తెలియజేశారు. ఇక నేను ఎటువంటి భయం లేకుండా డాక్టర్ వద్దకు వెళ్తాను. ఆ రోజంతా మంచి జరిగితే నేను మీకు ప్రత్యేక పూజలు చేస్తాను" అని మ్రొక్కుకున్నాను. అప్పటినుండి అపాయింట్‌మెంట్ రోజు వరకు నేనెప్పుడు సాయియుగ నెట్‌వర్క్ లోని భక్తుల అనుభవాలు చూసినా సాయిబాబా ఫోటోపై, ప్రధానంగా ఆయన చెవులపై నా దృష్టి పడేది. దాంతో మా బాబు యొక్క వినికిడి పరీక్ష గురించి భయపడవద్దని బాబా చెబుతున్నట్లు నాకు అనిపించేది.

చివరికి అపాయింట్‌మెంట్ రోజు రానే వచ్చింది. ఆరోజు నేను ఉదయాన్నే మేలుకొని బాబాకు 108 నామాలతో పూజచేసి, నా కొడుకుని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ నా కొడుకుని నిశితంగా పరీశీలించి, "తను చాలా చిన్న చిన్న శబ్దాలు కూడా వినగలడు. ఇది కేవలం భాషకు సంబంధించిన సమస్య. అసలు నర్సరీ పిల్లలకు విద్య నేర్పించే పద్ధతులను మార్చాలి" అని అన్నారు. నేను పట్టలేని ఆనందంతో ఇంటికి వచ్చి, నేను మ్రొక్కుకున్నట్లు బాబాకు పూజ, ఆరతి చేశాను. సాయే నా సంరక్షకుడు.

ఆ రాత్రి బాబా కలలో నాకు దర్శనమిచ్చారు. కలలో నేను బాబా మందిరానికి వెళుతున్నాను. నేను బాబా విగ్రహం ముందు నిలుచుని, కళ్ళు మూసుకుని బాబాని ప్రార్థిస్తున్నాను. కళ్ళు తెరిచేసరికి చక్కటి చిరునవ్వుతో బాబా నాకు ఊదీ ఇస్తున్నారు. మరుసటిరోజు ఉదయాన లేచి కలలో బాబా చిరునవ్వుతో నాకు ఊదీ ఇచ్చి ఆశీర్వదించారని చాలా చాలా సంతోషించాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ!"

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo