సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 23వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  • శ్రీసాయి ఆశీస్సులు
  • శ్రీసాయి దయాసాగరుడు


శ్రీసాయి ఆశీస్సులు

సీతారామాంజనేయులు గారు వాట్సాప్ ద్వారా పంపిన అనుభవాలు:

నాపేరు దివ్వెల సీతారామాంజనేయులు. నేను 25 సంవత్సరాల నుండి సాయిబాబా భక్తుడిని. నా జీవితంలో సాయిమహిమలు ఎన్నో చూశాను. 25 సంవత్సరాల క్రితం బాబా పరిచయమయ్యాక ఆయన దర్శనం కోసం శిరిడీ వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేసాను. కానీ, ఐదేళ్ల పాటు నేనెంత ఆశపడినా ఏదో ఒక కారణం చేత శిరిడీ వెళ్లడం సాధ్యపడలేదు. చివరికి 2000 సంవత్సరంలో తొలిసారి బాబాను దర్శించుకున్నాను. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం శిరిడీ దర్శించుకునే భాగ్యాన్ని బాబా ఇచ్చారు. 25 ఏళ్లుగా నరసరావుపేట బాబా మందిరంలో సేవ చేసుకునేలా అవకాశమిచ్చి నన్నెంతగానో బాబా అనుగ్రహిస్తున్నారు. నేనిప్పుడు మీతో బాబా మహాసమాధి శతాబ్ది సంవత్సరంలో బాబా నాపై కురిపించిన ఆశీస్సులను పంచుకుంటాను.

2018 బాబా మహాసమాధి శతాబ్ది సంవత్సరంలో బాబా నాకు మూడు అద్భుతాలను చూపారు. అవి...

1)నరసరావుపేట సాయిమందిరంలో మహాసమాధి ఉత్సవాలలో భాగంగా భక్తులతో కోటి సాయి నామార్చన చేయించే కార్యక్రమాన్ని బాబా నాచేత మొదలుపెట్టించి, విజయవంతంగా పూర్తి చేయించి నన్ను అనుగ్రహించారు.

2) నరసరావుపేటకు దగ్గరలో ఉన్న కుంకలగుంట గ్రామంలో 1959లో మా నాన్నగారు నిర్మించిన శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం పున:నిర్మాణ పనులు నాచేత మొదలుపెట్టించి, 58 రోజులలో పూర్తి చేయించారు. అంతేకాదు, సాయిమందిర నిర్మాణాన్ని కూడా చేపట్టించి, 75,000 రూపాయలతో బాబా విగ్రహాన్ని కూడా ఇప్పించి ప్రతిష్ఠ కావించటం బాబా నాకిచ్చిన గొప్ప వరం. అప్పుడే ఆ మందిరానికి సంబంధించి 29-5-2019న జరగనున్న మొదటి వార్షికోత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి.

3) మరో అద్భుతమైన విషయం, బహుశా ఎవరికీ ఈ భాగ్యం దక్కి ఉండదు. బాబా ఆరతి పుస్తకములు 6000 కాపీలు వేయించి 260 సాయిమందిరాలలో దర్శనానికి వచ్చిన భక్తులకు అందజేసే మహత్తర కార్యాన్ని బాబా నాచేత చేయించారు. 25 సంవత్సరాల నా సేవకు ఫలితమా అన్నట్లు బాబా నాకీ మహద్భాగ్యాన్ని ప్రసాదించారు.

సద్గురువైన శ్రీ శిరిడీ సాయిబాబా సేవకులు:
దివ్వెల సీతారామాంజనేయులు,
విజయవాడ.

మొబైల్ నెంబర్ - 7396677167.

శ్రీసాయి దయాసాగరుడు

యు.ఎస్.ఏ నుండి శిరిడీ సాయిభక్తుడు హరీష్ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
  
నేనొక సాధారణ భక్తుడిని. నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. తరచూ ఆయనను తలచుకుంటూ ఉంటాను. ఏ పని మొదలుపెట్టినా పెద్దదైనా, చిన్నదైనా ముందు బాబాని తలచుకుని, ఆయన ఆశీస్సులతో మొదలుపెడతాను. సాయి లీలలు వినడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.

ఇక నా అనుభవానికి వస్తే... ఒక వారాంతంలో నేను, నా భార్య ఇద్దరం ఒక ఫ్యామిలీని కలవాలని ఒక ప్రాంతానికి ప్రయాణమయ్యాం. ముందుగా వాళ్లు, అందరం ఒక గుడిలో కలుద్దామని, అక్కడనుంచి వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పారు. మేము అక్కడికి చేరుకునే లోపల గుడిలో వాళ్ళ పని పూర్తి కావడంతో వాళ్ళు అక్కడనుండి వెళ్ళిపోయారు. మేము గుడి వద్దకు చేరుకుని కారు పార్కింగ్ చేస్తుండగా 'బాబా గుడికి దారి' అని వ్రాసి ఉన్న ఒక బోర్డు చూసి, బాబా దర్శనం చేసుకుని వెళదామని నేను, నా భార్య అనుకున్నాం. ఇంతలో వాళ్ళు ఫోన్ చేసి, "వాతావరణం బాగాలేదు, తుఫాను వచ్చేలా ఉంది. నేరుగా మీరు మా ఇంటికి వచ్చేయండి" అని చెప్పారు. మేము, "దర్శనం చేసుకుని వస్తాము" అని చెప్పి ముందుగా హనుమంతుని దర్శనం చేసుకున్నాం. గుడినుంచి బయటకు వచ్చేసరికి అంతా చీకటిగా అయిపోయి, జోరుగా వర్షం మొదలైంది. అయినా మేమిద్దరం, "బాబా దర్శనం వదులుకోవద్దు, దర్శనం చేసుకునే వాళ్ళ ఇంటికి వెళదామ"ని నిశ్చయించుకుని అంత వర్షంలో బాబా గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాం. బాబా దర్శనంతో మాకు చాలా చాలా సంతోషం కలిగింది. తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షంలో బాబాని తలుచుకుని, ఫోనులో జి.పి.ఎస్ ఉపయోగించుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరాము.  ఇరుకైన గ్రామీణ రోడ్లపై ప్రయాణిస్తున్నాము. దట్టమైన చీకటివలన ఆ వర్షంలో కొద్ది అడుగుల దూరం తప్ప ఏమీ కనిపించట్లేదు. మా ఇద్దరికీ చాలా భయమేసి బాబా నామం తలచుకుంటూ వున్నాము. ఆయనే జాగ్రత్తగా మమ్మల్ని ఇంటికి చేర్చుతారని కారు నిదానంగా పోనిచ్చాను. అంతా అటవీ ప్రాంతం, ఎక్కడా ఒక్క మనిషి కూడా లేడు. బాబా కృపవలన మొత్తానికి 40 నిమిషాల ప్రయాణం తర్వాత క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. అంతటితో అయిపోలేదు, మేము వాళ్లతో జిపిఎస్ ఆధారంగా చేరుకున్నామని చెప్తే, వాళ్లంతా షాక్ అయ్యారు. ఎందుకంటే వర్షానికి ఆ రోడ్డు త్వరగా వరదతో నిండిపోతుందట. పైగా ఎక్కడికక్కడ చెట్లు పడిపోయి దారి మూసుకుపోతుందట. చెప్పాలంటే ఆ మార్గంగుండా వర్షంలో ప్రయాణం సాధ్యమయ్యే విషయం కాదట. ఆ విషయాలు వింటూనే నాకు, నా భార్యకు అర్థమైంది, "ఇక్కడికి వచ్చేముందు బాబా తమ దర్శనానికి రప్పించుకుని, మాకు ఆశీస్సులిచ్చి క్షేమంగా ఇల్లు చేర్చార"ని. ఇంతకన్నా దయగల వారెవరుంటారు? శ్రీసాయి దయాసాగరుడు.

రెండవ అనుభవం:

ఇటీవల మా నాన్నగారికి యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యింది. రోజుకు రెండు ఇంజక్షన్ల చొప్పున మొత్తం పది ఇంజక్షన్లు చేయించాలని డాక్టరు చెప్పారు. ఆ మాటే నాకెంతో కష్టంగా అనిపించింది. వెంటనే బాబాని ప్రార్థించి, నాన్న విషయం బాబాకు వదిలేసాను. ఆయన కృపతో అంతా సర్దుకుంది.

మూడవ అనుభవం:

హఠాత్తుగా ఒకసారి మా అమ్మగారికి బ్యాక్ పెయిన్ వచ్చి, ఆమె కాస్త కూడా వంగలేకపోయింది. కనీసం కదలలేక పోయింది. నేను మనసారా బాబాని ప్రార్థించి అమ్మకు ఊదీ పెట్టాను. తర్వాత ఆమె వేడినీళ్లతో మసాజ్ చేసుకుని, కొంచెం వేడినీళ్లలో జీలకర్ర వేసుకుని త్రాగింది. మరుసటిరోజుకి తన నొప్పి తగ్గిపోయింది.

"బాబా! ఎప్పుడూ నీ లీలలు వింటూ ఉండేలా నన్ను అనుగ్రహించండి. ఏమి జరిగినా కలతచెందకుండా మీ దివ్య పాదాలకు శరణాగతి చెందేలా నన్ను ఆశీర్వదించండి!"

సాయిభక్తుల అనుభవమాలిక 22వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  • దసరా రోజు నాతో ఉన్న బాబా
  • సాయి ఊదీ మహిమ

దసరా రోజు నాతో ఉన్న బాబా

నా పేరు కమలిస్ దేవి. 2018 విజయదశమి రోజున మా ఇంట్లో జరిగిన ఒక అద్భుతాన్ని నేను ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను. నేను ఉద్యోగస్తురాలిని కావడంతో నేనెప్పుడూ గురువారం సాయంత్రం బాబాకి పూజ చేస్తూ ఉంటాను. ఉదయాన హడావిడిగా పూజ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రశాంతంగా సాయంత్రం వేళలో పూజ చేసుకుంటూ ఉంటాను. కానీ ఆ సంవత్సరం దసరా గురువారంనాడు రావడంతో దసరా కదా, ఆరోజు ఉదయాన్నే 4.30కి లేచి పూజ చేసుకుందామనుకున్నాను. ముందురోజు రాత్రి బాబా కోసం పూలమాలలు కట్టడంతో ఆలస్యమై 1.30కి పడుకున్నాను. పడుకునే ముందు ఉదయాన 5.00, 5.10, & 5.15కి మూడు అలారమ్స్ పెట్టుకున్నాను. ఉదయం అవి మ్రోగిన ప్రతిసారీ స్టాప్ చేసి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. 5.45 సమయంలో ఎవరో నన్ను కుదిపి, నిద్రలేవమని చెప్పినట్లు అనిపించింది. కానీ కళ్ళు తెరచి చూస్తే ఎవరూ లేరు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. త్వరత్వరగా స్నానం చేసి పూజ మొదలుపెట్టాను. బాబాకు డ్రెస్ మార్చి, నైవేద్యాలన్నీ సమర్పించి బాబా ముందు కూర్చుని ప్రార్థన చేస్తున్న సమయంలో హఠాత్తుగా బాబా విగ్రహం వెనక ఒక నీడను చూసాను. వెనుక్కి తిరిగి చూసాను, కానీ అక్కడ ఏమీ కనపడలేదు. సరేనని నేను ప్రార్థన చేసుకున్నాను. కాసేపటికి నా ప్రార్థనలు ముగించి చూసేసరికి పెద్ద బాబా విగ్రహం ముందున్న రెండు చిన్న విగ్రహాలు వాటి స్థానాలనుండి కదిలి ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను.  దీని అర్థం ఏమిటో నాకు తెలియదు గానీ, దసరా రోజు బాబా నాతో ఉన్నారని మాత్రం నాకు అర్థమయ్యింది. "నేను అనుకున్నట్లుగా ఉదయం పూజ చేయడంలో నాకు సహాయపడినందుకు మీకు ధన్యవాదాలు బాబా! మీరు నాపై, నా కుటుంబంపై ప్రేమతో కురిపిస్తున్న ఆశీస్సులకు కృతజ్ఞతలు బాబా! ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను బాబా!"

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి ఊదీ మహిమ

నేను ఒక సాయిభక్తురాలిని. నేను చెప్పబోయే లీల బాబా ఊదీ మహిమకు సంబంధించినది. మా అమ్మగారు గొప్ప సాయిభక్తురాలు. ఆమె 2009వ సంవత్సరం నుండి బాబాను పూజిస్తున్నారు. ఆమె తన జీవితంలో ప్రతిక్షణం బాబా కృపను అనుభూతి చెందుతూ ఉండేవారు. ఒకరోజు హఠాత్తుగా మా అమ్మ ఛాతీనొప్పితో బాధపడింది. మొదట మేము మాములు నొప్పి అనుకుని, మందులతో తగ్గుతుందని భావించాము. కానీ చీకటిపడేకొద్దీ నొప్పి తీవ్రం కాసాగింది. ఆమె ఆ బాధను తట్టుకోలేక చిన్నపిల్లలాగా ఏడుస్తూ క్రిందపడి దొర్లసాగింది. ఆవిడను అలా చూసేసరికి నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. నొప్పి తగ్గించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆమెకు బదులు ఆ నొప్పిని నాకు ఇవ్వమని అడిగాను. అమ్మ అలా ఏడుస్తుంటే చూడటం కంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? అలా మందులు పని చెయ్యని క్లిష్టమైన పరిస్థితిలో, హఠాత్తుగా ఒక ఆలోచన నా మెదడుకు తట్టింది - ఊదీని మందులా ఆమెకు ఇవ్వాలని. వెంటనే గదిలోకి వెళ్ళి ఊదీ తెచ్చి, బాబాను ప్రార్థించి ఆమెకు ఇచ్చాము. కాసేపట్లో అద్భుతం మొదలైంది. అరగంట తరువాత నొప్పి తీవ్రత తగ్గుతూ వచ్చింది. ఉదయానికి ఆమె పరిస్థితి ఏమీ జరగనట్లుగా మాములుగా ఉంది. ఆమెకు పూర్తిగా నయమైపోయింది. ఈ సంఘటన తరువాత బాబాపై మా విశ్వాసం దృఢమైంది. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా మా అమ్మకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను.

శ్రీ సాయినాథునికి జై!

“సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్” ఏర్పాటులో, నిర్వహణలో బాబా అభయహస్తం


ముందుగా సాయిభక్తులందరికీ బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు. సాయిబంధువులందరిపై ఆ సద్గురు సాయినాథుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.

బాబా కృపాకటాక్షములతో ఈ బ్లాగ్ ప్రారంభమై నేటికి సరిగ్గా ఒక సంవత్సరమయ్యింది. మొదటి వార్షికోత్సవ సందర్భంగా, ఈ బ్లాగ్ ఏర్పాటులో, నిర్వహణలో బాబా చూపిన అనుగ్రహాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

బ్లాగ్ ప్రారంభించేముందు, "బ్లాగ్ నిర్వహించడం నా ఒక్కడి వల్ల ఎలా అవుతుందో?!" అని అనుకున్నాను. అలాంటిది ఒక్క రోజు కూడా మిస్ కాకుండా, ఈ ఏడాది కాలంలో 447 పోస్టింగ్స్ బ్లాగులో ప్రచురింపబడ్డాయంటే అదంతా ఆ సద్గురు సాయినాథుని అపార అనుగ్రహమే!  నిజానికి బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలోనే ఈ వివరాలు ప్రచురిద్దామని టైపు చేయడం మొదలుపెట్టాను. కానీ అది సాధ్యపడలేదు. బహుశా వార్షికోత్సవ సందర్భంగా ప్రచురించాలన్నదే బాబా సంకల్పమేమో! ఇక వివరాల్లోకి వెళితే....

2017, అక్టోబర్ నెలలో బాబాకి సంబంధించిన ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలన్న ప్రేరణ నాలో కలిగింది. అది బాబా ఇస్తున్న ప్రేరణ అవునో, కాదో తెలుసుకోవాలని బాబానే అడిగాను. అందుకు ఆయన సచ్చరిత్రలో ఒక పేజీ సూచించారు. ఆ పేజీ తెరచి చూస్తే, బాబా సచ్చరిత్ర వ్రాయమని హేమాడ్‌పంత్‌కు అనుమతినిస్తున్న సన్నివేశం ఉంది. ఆ సంఘటనతో, ఇప్పటి సాయిభక్తుల అనుభవాలు పంచుకోవడం కోసం వెబ్‌సైట్ ఏర్పాటు చేయడానికి అది బాబా ఇస్తున్న ప్రేరణే అని నిర్ధారణ అయ్యింది.

అంతేకాకుండా, అదేరోజు మరోవిధంగా కూడా వెబ్‌సైట్‌కు బాబా తమ సమ్మతిని తెలియజేసారు. ఆరోజు రాత్రి సాయిబంధువు సుధాకర్ ఫోన్ చేసి తమ అనుభవాలు పంచుకున్నారు. నిజానికి అతను మూడు, నాలుగు నెలల క్రిందట జూన్ నెలలోనే తన అనుభవాలు పంచుకుంటానని నాతో చెప్పారు. కానీ ఏవో కారణాల వలన అతనికి వీలుపడక అసలు ఫోనే చేయలేదు. అన్ని రోజులుగా వీలుపడనిది, సరిగ్గా బ్లాగ్ క్రియేట్ చేయడానికి బాబా అనుమతినిచ్చిన కొద్దిసేపట్లో అతను ఫోన్ చేసి తన అనుభవాలు చెప్పడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బాబా హేమాడ్‌పంత్‌తో, “నా లీలలు నేనే వ్రాసుకుంటాను, నీవు నిమిత్తమాత్రుడివి” అని చెప్పినట్లుగా, ఆయన వెబ్‌సైట్‌కి అనుమతినివ్వడమే కాకుండా వెబ్‌సైట్‌లో ప్రచురించడానికి మొదటిలీలగా సుధాకర్ గారి అనుభవాన్ని కూడా ఇచ్చారు.

బాబా అనుమతి లభించడంతో నిజానికి వెబ్‌సైట్ డిజైన్‌పై నాకెటువంటి అవగాహన లేకపోయినా వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి పూనుకున్నాను. కానీ, నాకెలా చేయాలో అర్థంకాక ఎంత ప్రయత్నించినా పని ముందుకు సాగలేదు. సరే, సమయం వచ్చినప్పుడు బాబాయే చేయిస్తారనుకున్నాను. తరువాత కొన్ని అనుకోని సంఘటనలు జరిగి వెబ్‌సైట్ మొదలుపెట్టే పరిస్థితి కూడా లేకపోయింది. తరువాత మళ్ళీ 2018, మార్చి నెలలో వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి తగిన పరిస్థితులు బాబా కల్పించారు. "బాబా! నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించి, వర్క్ మొదలుపెట్టాను. వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి మొదట ప్రయత్నించినప్పుడు కొంచెం కూడా ముందుకు సాగనిది, ఈసారి వర్క్ సాఫీగా ముందుకు సాగుతుంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒకవైపు వెబ్‌సైట్ డిజైన్ చేస్తూనే, మరోవైపు బ్లాగ్ డిజైన్ కూడా ట్రై చేసాను. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి, "ఇక్కడ ఈ కలర్ తీసుకో, ఇక్కడ ఇలా పెట్టు" అంటూ వెబ్‌సైట్ డిజైన్ చేయడం చూపించారు. మొత్తానికి బ్లూ, గ్రే కలర్స్ కాంబినేషన్ కనిపించింది. ఉదయాన నిద్రలేచి కలలో బాబా వెబ్‌సైట్ డిజైన్ చూపించారని చాలా సంతోషపడ్డాను. మధ్యాహ్నానికి ఆ కల సంగతి పూర్తిగా మర్చిపోయి మాములుగా డిజైన్ వర్క్ చేసుకుంటున్నాను. కాసేపటికి, ఆశ్చర్యం! అద్భుతం! నాకు తెలియకుండానే రాత్రి కలలో బాబా చూపిన విధంగా అవే రంగుల కాంబినేషన్‌లో బ్లాగ్ డిజైన్ వచ్చింది. అది చూశాక నాకు రాత్రి వచ్చిన కల గుర్తుకు వచ్చింది. నేను మరచిపోయినప్పటికీ బాబా నా చేయిపట్టి డిజైన్ చేయించినట్లు సరిగ్గా కలలో చూపిన విధంగా చేయించారు. ఆ తరువాత వెబ్‌సైట్ కూడా అదే కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేద్దామని ప్రయత్నించాను కానీ, సంతృప్తికరంగా రాలేదు. దానితో 'బ్లాగ్ చాలు' అన్నది బాబా నిర్ణయమని నాకు అర్థమయింది.

తరువాత 'బ్లాగుకు ఏ పేరు పెట్టాలా?' అని అనుకున్నప్పుడు, ఒక సాయిబంధువు ద్వారా "సాయి మహరాజ్ సన్నిధి" అని బాబాయే సూచించారు. ఆ టైటిల్ తో 2018, ఏప్రిల్ 19న బాబా చూపించిన సుధాకర్ గారి అనుభవంతో బ్లాగ్ ప్రారంభమయ్యింది. మొదటి బాబా లీల పబ్లిష్ చేసి గ్రూపుల్లో లింక్ షేర్ చేసిన వెంటనే ఒక సాయిబంధువు, "బ్లాగ్ వర్క్ ఏదైనా ఉంటే ఇవ్వండి. నేను కూడా బాబా వర్క్ చేస్తాను" అని మెసేజ్ పెట్టారు. అలా బాబా తమ బ్లాగ్ వర్క్ ఆ సాయిబంధువుకు కూడా ఇచ్చారు. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు జతకూడుతూ ఇప్పుడు మొత్తం 7, 8 మందిమి బాబా వర్క్ చేసుకుంటున్నాము. తరువాత కూడా బాబా ఎప్పటికప్పుడు బ్లాగుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ అందిస్తూ బ్లాగ్ నిర్వహణ చే(యి)స్తున్నారు.

అలా బాబా "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్" (https://saimaharajsannidhi.blogspot.com/) ఏర్పాటు చేయించి, ఆయన భక్తుల అనుభవాలను సాటి సాయిభక్తులకు అందుబాటులో ఉండేవిధంగా బ్లాగులో ప్రచురింపజేయిస్తూ, సదా ఆయన స్మరణలో ఉండేలా మమ్మల్ని అనుగ్రహించారు. 

“బాబా! ఎప్పుడూ ఇలాగే మాపై అనుగ్రహాన్ని కురిపిస్తూ మమ్మల్ని నడిపించండి. పూర్ణమైన భక్తివిశ్వాసాలు మాకొసగి ఎప్పటికీ మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేలా మమ్ము అనుగ్రహించండి. శతకోటి ప్రణామాలు సాయిదేవా!”

అనుభవాలు పంచుకుంటూ బ్లాగుకు సహకరిస్తున్న సాయి బంధువులందరికీ నా అభివందనాలు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

భక్తితో పాటు ధైర్యం, పట్టుదల గల శ్రీమతి ప్రధాన్ పై బాబా అనుగ్రహం


భక్తితో పాటు, శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలన్న ధైర్యం, పట్టుదల గల ఒక మహిళ కథ ఇది. ఆమె కథను థానాలో నివసిస్తున్న భక్తురాలు శ్రీమతి మంగళ ప్రధాన్ వివరిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ మహిళ మొదటి పేరు, ఆమె శిరిడీ వెళ్ళిన సంవత్సరం కూడా పేర్కొనలేదు. ఆ సాహసోపేతమైన స్త్రీ, మంగళ గారి భర్తకు నాయనమ్మ. ఆమెను శ్రీమతి ప్రధాన్ గా ప్రస్తావించారు.

రాయగఢ్ జిల్లాలోని పీణ్ అనే ఊరి సమీపంలో గల సవర్సాయి అనే గ్రామంలో శ్రీమతి ప్రధాన్ నివసించేవారు. బాబా దర్శనం చేసుకోవాలన్న ఆతృత కలిగివున్న ఆమె తన భర్తను శిరిడీ వెళ్ళడానికి అనుమతి ఇమ్మని అభ్యర్థిస్తూ ఉండేది. అందుకతను నిరాకరిస్తూ, "నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. నీవు ఎలా వెళ్లగలవు?" అని అన్నాడు. అంతేకాకుండా కుటుంబమంతా ఆమెకు ఎదురు తిరిగి శిరిడీ వెళ్ళడానికి నిరాకరించారు. 

ఈ విషయమై శ్రీమతి మంగళ మామగారు(శ్రీమతి ప్రధాన్ కొడుకు) ఇలా తెలియజేసారు: "మా అమ్మ చాలా మొండిది. ఒకసారి శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాక ఏవీ తనని ఆపలేకపోయాయి. కొన్నిరోజులపాటు అణిగి మౌనంగా ఉన్నా, తన మనస్సులో మాత్రం రహస్యంగా ఒక ప్రణాళిక వేసుకుంది. ఆమెకు శిరిడీ ఎక్కడ ఉందో తెలీదు, అక్కడికి వెళ్లడానికి ఎంత ఖర్చు అవుతుందన్నది కూడా తెలియదు. కాబట్టి పెద్ద మొత్తమే అవసరమవుతుందని ఆమె అనుకుంది. అందుకోసం తన తల్లిదండ్రులు తనకి కానుకగా ఇచ్చిన నగలన్నీ కుదువ(తాకట్టు) పెట్టింది. తరువాత తెలివిగా కొంత సమాచారం సేకరించి, శిరిడీ అహ్మద్‌నగర్ సమీపంలో ఉందని తెలుసుకుంది. అంతవరకే ఆమెకు తెలుసు. కానీ ఒక భక్తురాలు భగవంతుని చూడాలని గాఢంగా కాంక్షిస్తే, అన్నీ వాటంతటవే సమకూరుతాయి. అప్పటి నా వయస్సు 13 సంవత్సరాలు. ఆమె నన్ను వెంట తీసుకుని, బాగా శ్రమతో కూడుకున్న, సుదీర్ఘమైన దుర్భర ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

ముందుగా ఎడ్లబండిలో సవర్సాయి నుండి 100 మైళ్ళ దూరంలో ఉన్న ఖోపోలి కర్జత్ వరకు ప్రయాణించాము. కర్జత్ నుంచి రైలులో ప్రయాణం సాగించి ఎలాగో మొత్తానికి ఏ ఇబ్బందీ లేకుండా శిరిడీ చేరుకున్నాము. అయితే ప్రయాణంలో ఆమె మనస్సంతా, "శిరిడీలో కలరా వంటి అంటువ్యాధులు తరచూ వస్తుంటాయని విన్నాను. ఇప్పుడు నా కొడుకుకు కలరా వస్తే నేను ఏం చెయ్యాలి?" అన్న అనుమానంతో ఉంది. ఏదేమైనా శిరిడీ చేరాక, బాబా దర్శనం చేసుకుని నమస్కరించుకుందామని ద్వారకామాయికి వెళ్ళాము. మా అమ్మ ద్వారకామాయి మెట్లు ఎక్కిన వెంటనే బాబా, "నిన్ను ఎవరన్నా అడిగారా ఇక్కడకు రమ్మని? నీ నగలు కుదువపెట్టి ఇక్కడికెందుకు వచ్చావు? నీ భర్త నిరాకరించినా కూడా ఎందుకు వచ్చావు? నేనేమైనా నిన్ను ఇక్కడకు రమ్మన్నానా?" అని అరవడం మొదలుపెట్టారు. ఆ క్షణమే మా అమ్మ 'బాబా సర్వవ్యాపి' అని గుర్తించారు. ఆయనకు మా  ఇంట్లో జరిగిన ప్రతీ విషయం తెలుసు. ఆనందం పొంగిపొర్లగా ఆమె, "బాబా! నేను మీకు ఏ సేవ చేయగలను?" అని అడిగింది. అప్పుడు బాబా, "నీ కొడుకుకు కలరా సోకిందా? సరే, అలా ఉండనీ. అరే మాయీ(అమ్మా)! నీ ముందు ఉన్న ద్వారం ప్రక్కన అందమైన మారేడు చెట్టు ఉంది. నాకు దాని ఆకులు(బిల్వ పత్రాలు) సమర్పించు" అన్నారు. తరువాత బాబా మమ్మల్ని ఆశీర్వదించి, పిడికిలినిండా ఊదీ ఇచ్చారు. బాబా తమ స్వహస్తాలతో తమ చిత్రపటాన్ని కూడా మాకు ఇచ్చారు.

శిరిడీ యాత్ర తరువాత మా అమ్మ జీవితం మొత్తం మారిపోయింది. ఆమె తన తుదిశ్వాస వరకు మర్చిపోకుండా ప్రతిరోజూ బాబా చిత్రపటానికి ఆ చెట్టు ఆకులు సమర్పిస్తూ, తన సమయమంతా అవసరంలో ఉన్నవాళ్లకు సేవ చేసేవారు. అమ్మ తెలివిగా ఎక్కువగా కాకుండా మితంగా బాబా ఊదీని జబ్బులతో బాధపడుతున్నవాళ్లకు, ప్రసవం కష్టంగా ఉన్న తల్లులకు ఇస్తుండేవారు. దానితో వాళ్ళ సమస్యలు తీరిపోయేవి. తొందరలోనే ఆమె గ్రామస్థులందరికీ ఇష్టమైన పిన్ని(కాకు)గా మారింది. బాబా ఆమెకు ప్రసాదించిన ఇంకొక వరం ఏమిటంటే, ఉపాయం చెప్పడం(knack of predicting నేర్పుతో అంచనా వేయడం). గ్రామస్తులు ఆమె దగ్గరకు వచ్చి తప్పిపోయిన ఆవులు, దూడలు గురించి అడిగేవారు. అప్పుడు కాకు బాబాను ప్రార్థించి, అవి ఎక్కడ దొరుకుతాయో ఖచ్చితంగా చెప్పేవారు. ఆమె రైతులకు, గొర్రెల కాపరులకు, దళితులకు ఏదో ఒకరకంగా సహాయం చేసేవారు. ఆమె చనిపోయే చివరిరోజు వరకు కూడా ఎన్నడూ బాబా ఆమెకు ప్రసాదించిన చిత్రపటాన్ని పూజించకుండా ఉండలేదు. అది ఇప్పటికీ మాతోనే ఉంది." 

చివరిగా శ్రీమతి మంగళ ఇలా చెప్తున్నారు: "ఈ అద్భుత లీలలు విన్న తరువాత, నేను కూడా ఆ చెట్టు ఆకులు బాబాకు సమర్పించటం మొదలుపెట్టాను. నేను గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, బాబా తమ స్వహస్తాలతో ఆమెకిచ్చిన చిత్రపటం ఇప్పటికీ మా వద్దనే ఉంది, దాన్ని మేము పూజిస్తున్నాము".

Ref: సాయిప్రసాద్ దీపావళి సంచిక, 1999.
సోర్స్: Baba’s Divine Manifestations by విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 21వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  • బాబా నా ప్రార్థన విన్నారు.
  • బాబా నా వైవాహిక జీవితాన్ని నిలబెట్టారు.

బాబా నా ప్రార్థన విన్నారు.

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నా భర్త బాబా భక్తుడు కాదు. అందువలన నేను తనతో నా అనుభవాలను పంచుకోలేను. కానీ ఈ బ్లాగు ద్వారా నా ఆనందాన్ని మీతో పంచుకుంటాను.

ఒకరోజు ఉదయం 5 గంటలకు హఠాత్తుగా నాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. కనీసం మంచంమీదనుంచి లేవలేకపోయాను. మావారిని నిద్రలేపితే అతనికి నిద్ర సరిపోదు, తను ఆఫీసుకు వెళ్ళవలసి ఉంది కాబట్టి తనని మేల్కొల్పదలచుకోలేదు. ఖాళీ కడుపుతో పెయిన్ కిల్లర్స్ వేసుకోలేను. అలాగని కడుపునొప్పి భరించలేకున్నాను. ఆ స్థితిలో, 'ఓం సాయిరామ్' అని స్మరిస్తూ నా పడక పక్కన ఉన్న నీటిలో బాబా ఊదీ కలిపి నన్ను త్రాగమంటున్నట్లు ఊహించుకుని ఆ నీటిని త్రాగాను. నా కడుపుపై బాబా తమ మృదువైన చేతితో స్పృశించినట్లు భావించుకున్నాను. క్షణాల్లో నా కడుపునొప్పి అదృశ్యమైపోయింది. ఇక నా ఆనందాన్ని, ఆ క్షణాన నేను పొందిన భావోద్వేగాలను పదాలలో చెప్పలేను. చాలా చాలా ధన్యవాదాలు బాబా!

బాబా నా వైవాహిక జీవితాన్ని నిలబెట్టారు.

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

కొన్ని నెలల క్రితం బాబా ఇచ్చిన మొదటి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు వివాహమై ఐదేళ్లయినా సంతానం కలగలేదు. మొదట్లో మావారు చికిత్స కోసం నాతోపాటు డాక్టర్ వద్దకు వచ్చేవారు. కానీ, కొన్నాళ్ల తర్వాత రావడం మానేశారు. పిల్లలు లేరన్న ముఖ్యకారణంతో పాటు మరికొన్ని కారణాలవలన నా అత్తమామలు, ఇతర కుటుంబసభ్యులు నన్ను ప్రతిదానికీ అవమానిస్తూ ఉండేవారు. నేనసలే స్వశక్తిపై ఆధారపడలేని బలహీనురాలిని. అలాగని తల్లిదండ్రులకి భారం కాలేను. కానీ అత్తమామల టార్చర్ భరించలేక జనవరి నెలలో ఇల్లు వదిలి బయటకు వచ్చేసాను.



నా మేలుకోరే మా పనిమనిషి (అలా అనే కంటే తనని సహాయకురాలు అంటే బాగుంటుంది.) ఒకరోజు నాకు ఫోన్ చేసినా వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి 'నవ గురువార వ్రతం' చేయమని సలహా ఇచ్చింది. నన్ను కాపాడడానికి బాబాయే తన ద్వారా అలా చెప్పించారని నాకనిపించి వ్రతం మొదలుపెట్టాను. 8వ వారం వ్రతం చేసిన తర్వాత నాకెందుకో తిరిగి ఇంటికి వెళ్ళి నా హక్కు కోసం పోరాడాలనిపించింది. అప్పటికే వాళ్ళు నాకు ఎంతో కొంత మనోవర్తి చెల్లించి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఆ సమయంలో నేను నా భర్త ఇంటికి మళ్ళీ వెళ్లాను. నేను వెళ్ళే సమయానికి నా భర్తగానీ, అత్తమామలుగానీ ఇంట్లో లేరు. నేను సాయి నామం తలుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను. కొద్దిసేపటికి నా భర్త, అత్తమామలు ఇంటికి వచ్చారు. మా అత్తగారు నేను నా భర్తతో కలిసి ఉండడానికి ఒప్పుకోలేదు. నా భర్త కనీసం నాతో మాట్లాడడానికి కూడా అంగీకరించలేదు. నేను బాబా ముందు కూర్చుని"బాబా! నాకెందుకు ఇంతటి అవమానం?" అని చాలా ఏడ్చాను. బాబా కృపవలన అద్భుతంగా నాలో ఏదో తెలియని శక్తి ప్రవేశించి నా హక్కులకోసం పోరాడడానికి మొండిగా నిల్చున్నాను. తొమ్మిదో వారం వ్రతం పూర్తి చేశాక హఠాత్తుగా మా అత్తగారిలో ఏ మార్పు వచ్చిందో గానీ, ఇల్లు వదిలి తన కూతురింటికి వెళ్ళిపోయింది. తర్వాత నిదానంగా అన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు నా భర్త నన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు. ఇదంతా బాబా కృపే. త్వరలోనే బాబా మాకు సంతానాన్ని కూడా అనుగ్రహిస్తారని నాకు తెలుసు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

సాయిభక్తుల అనుభవమాలిక 20వ భాగం....


సాయి ఒక్కరే మాకు ఉన్న తోడు


నేను మలేషియా నుండి కన్మణి. నేను బాబాకు చిన్న భక్తురాలిని. మా అమ్మ మాత్రం సాయిబాబాకు పరమభక్తురాలు. బాబా పాదాలు కడగడం, ఆయన కోసం టీ, టిఫిన్ తయారుచేయడంతో తన రోజు మొదలై, సాయికి సంబంధించిన పుస్తకాలు చదవడంతో ముగుస్తుంది. ఆమె త్రికరణశుద్ధిగా బాబాను ప్రార్థిస్తూ ఉంటుంది. మా జీవితాలలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. అయితే బాబా మాకెంతో సహాయం చేశారు.

2016, ఏప్రిల్‌లో హఠాత్తుగా మా నాన్నగారు చనిపోయారు. దానితో మా అమ్మ చాలా కృంగిపోయింది. అప్పటికి నాకు ఉద్యోగం కూడా లేదు. ఆర్థికస్తోమత అంతంత మాత్రమే ఉన్న మేము మా జీవితాలను ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు. అటువంటి స్థితిలో సాయి ఒక్కరే మాకు ఉన్న తోడు. నేను, "బాబా! మీ మీద నమ్మకంతోనే మా జీవితాలను కొనసాగిస్తాము" అని ప్రార్థించాను. బాబా ఇచ్చిన ధైర్యంతోనే మేము ఆ విషాదకర పరిస్థితినుండి బయటపడగలిగాం. ఒక శుభదినాన మా అమ్మ ట్యూషన్ టీచర్ కావాలని ఇచ్చిన ఒక పాంప్లెట్ నాకు చూపించి, నన్ను ప్రయత్నించమంది. బాబా కృపవలన నాకు ఆ ఉద్యోగం వచ్చింది. కానీ నాకు ఏ అనుభవం లేనందున 30 మంది టీనేజర్స్ ముందు నిలిచి బోధించడానికి చాలా భయపడ్డాను. కానీ బాబా ఇచ్చిన ధైర్యంతో నిలదొక్కుకోగలిగాను. బాబా నాకొక ఉద్యోగాన్ని చూపి మా జీవితాలకు ఒక భరోసా కల్పించారు. ఆయన కృపవలన ఇప్పుడంతా సవ్యంగా సాగుతోంది.

2018లో ఒకసారి మా అమ్మ తీవ్రమైన చేయినొప్పితో బాధపడింది. ఆమె కొంచెం కూడా చెయ్యి పైకి ఎత్తలేకపోయేది. తను పడుతున్న బాధ చూడలేక నేను చాలా ఆందోళనపడి, "బాబాను ప్రార్థించమ"ని తనకి సలహా ఇచ్చాను. అయితే తను బాబాను ప్రార్థించినప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. మరుసటిరోజు నేను ఆఫీసునుంచి వచ్చేసరికి కూడా తనకు నొప్పి అలాగే ఉండటంతో నాకు చాలా దిగులుగా అనిపించింది. వెంటనే ఫ్రెషప్ అయ్యి బాబా ముందు కూర్చుని, "బాబా! అమ్మ చేయినొప్పి తగ్గించండి, తన నొప్పి తగ్గితే జీవితాంతం సచ్చరిత్ర చదువుతాను" అని బాబాకు వాగ్దానం చేశాను. తర్వాత రాత్రి పడుకోబోయే ముందు అమ్మ చేతికి బాబా ఊదీ పూసాను. అద్భుతం! తెల్లవారేసరికి ఆమె చేయినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నాలాంటి మామూలు భక్తురాలి మాట కూడా వింటానని బాబా నాకు ఋజువు చేయడమే కాకుండా, "స్వయంగా నువ్వే హృదయపూర్వకంగా నన్ను ప్రార్థించి అద్భుతాన్ని చూడు!" అనే పాఠాన్ని కూడా నేర్పించారు.

మరోసారి, నేను నా ఆఫీసు పని అయిపోయాక ఫోన్ చూస్తుండగా నా మెడభాగం నుండి తల వరకు లాగేస్తున్నట్లుగా ఉన్నట్లుండి నొప్పి రావడం మొదలైంది. దానితో నేను నా తల పైకి ఎత్తడం గాని, కిందకు దించడం గాని చేయలేకపోయాను. కానీ నేనేమీ ఆందోళనపడలేదు. ఎందుకంటే మా ఇంట్లో అద్భుతమైన ఔషధం(ఊదీ) ఉంది. ఇంటికి వెళ్లాక, బాబా ఊదీ తీసి నొప్పి ఉన్న ప్రాంతమంతా రాశాను. అంతే! కొద్దినిమిషాల్లో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నా జీవితంలో బాబా ఉండటం చాలా చాలా గొప్ప విషయం. "బాబా! తెలిసీ తెలియక చేసిన నా తప్పులు మన్నించి, ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండండి. లవ్ యు సో మచ్ బాబా!"

సాయిభక్తుల అనుభవమాలిక 19వ భాగం....


సరైన సమయంలో బాబా అందించిన సహాయం

యు.ఎస్. నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! హాయ్! నేను సాయి బిడ్డని. 'ఓం సాయి రాం' అన్న మూడు మ్యాజికల్ పదాలు నాకెంతో సంతోషాన్నిస్తాయి. ఆ మూడు పదాలే నా ఊపిరి(om sAIRam).

ఒకసారి నేను దౌత్య(రాయబార) కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూ కోసం కెనడా బయలుదేరాను. నా టికెట్స్ నేరుగా కెనడాకు కాకుండా, మధ్యలో ఒకచోట దిగి, అక్కడినుండి వేరే కనెక్టివిటీ ఫ్లైట్ ఎక్కేలా బుక్ చేయబడ్డాయి. ఫ్లైట్ సమయానికన్నా 4 గంటలు ముందు ఎయిర్‌పోర్ట్ చేరుకుని, చెక్-ఇన్ కూడా అయ్యి, టెర్మినల్ గేటు వద్ద సిబ్బందికి నా టికెట్ చూపించాను. వాళ్లు, "ఫ్లైట్ 30 నిమిషాలు ఆలస్యం. కాబట్టి వేచి ఉండండి" అని చెప్పారు. నేను వాళ్ళ ఎదురుగా కూర్చుని నా భర్తతో ఫోనులో కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటున్నాను. నేను అలా మాటల్లో ఉంటుండగా, ఎయిర్‌లైన్స్ సిబ్బంది కస్టమర్స్‌ని పిలిచి గేట్ క్లోజ్ చేసారు. నేను ముఖ్యమైన వ్యక్తులను ముందుగా పిలుస్తున్నారేమో అనుకున్నాను. కానీ అనుమానం వచ్చి వాళ్లని అడిగాను. వాళ్ళు, "అందర్నీ పంపించేసి గేట్లు క్లోజ్ చేసాం. ఇక మిమ్మల్ని పంపలేము" అన్నారు. నేను వాళ్లకి నా టికెట్ చూపించి, వాళ్ల ముందే కూర్చుని ఉన్నప్పటికీ వాళ్లు నిర్లక్ష్యంగా నన్ను పిలవకుండా వదిలేశారు. నాకు చాలా దిగులుగా అనిపించింది. మరుసటిరోజే ఇంటర్వ్యూ ఉంది. దానికోసం నేనెంతో కష్టపడి ప్రత్యేకమైన కెనడా వీసా కూడా సంపాదించాను. కానీ చివరిక్షణంలో ఇలా అయ్యేసరికి నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. సాయిని ప్రార్థించి, మళ్లీ సిబ్బందిని సంప్రదించి, "వేరే ఫ్లైట్‌లో వెళ్ళడానికి ఏమైనా సర్దుబాటు చేయగలరా?" అని అడిగాను. కానీ వాళ్లు అందుకు కూడా 'నో' అన్నారు. ఏం చేయాలో అర్థంకాక మౌనంగా కూర్చుని, "బాబా! నేనెలాగైనా ఈరోజు ప్రయాణం చేయగలిగితే నా అనుభవాన్ని సైటు ద్వారా పంచుకుంటాను" అని ప్రార్థించాను.

తర్వాత ఎయిర్‌లైన్స్ లేడీ సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నించాను. తను నన్ను చాలాసేపు వెయిట్ చేయించిన తరువాత కూడా అడ్డంగా వాదించింది. అయినా సహనంతో నా పరిస్థితి అంతా వివరించి, "ఏదో ఒక సహాయం చేయమ"ని అభ్యర్థించాను. చివరికి బాబా కృపవలన ఆమె తన మేనేజరుతో మాట్లాడి, వేరే ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన డైరెక్ట్ ఫ్లైట్‌లో నేను వెళ్లేందుకు ఏర్పాటు చేసింది. అప్పుడు అసలు విషయం తెలిసింది, ప్రతికూల వాతావరణం కారణంగా వేరే చోట నేను ఎక్కవలసిన కనెక్టివిటీ ఫ్లైటు ఆరోజు రద్దు చేయబడిందని. నేను గనక ఫ్లైట్ మిస్ కాకపోయి ఉంటే, అటూ ఇటూ కాకుండా మధ్యలో ఇరుక్కుపోయేదాన్ని. నేను ఎక్కిన ఫ్లైట్ ఒక్కటే ఆరోజు నేరుగా కెనడా వెళ్లే ఫ్లైట్. అది కూడా వాతావరణం కారణంగా 5 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. మిగతా అన్ని ఫ్లైట్లు రద్దు చేయబడ్డాయి. ఆవిధంగా బాబా నా ఫ్లైట్ మిస్ అయ్యేలా చేసి, డైరెక్ట్ ఫ్లైట్ అందించి సరైన సమయంలో ఇంటర్వ్యూకు హాజరయ్యేలా చేసారు. ఆయన కృపతో నా స్టూడెంట్ వీసా ఆమోదించబడింది. అంతా బాబా లీల. ఆయనకు భూత, భవిష్యత్, వర్తమానాలు తెలుసు. తదనుగుణంగా ఆయన అన్నీ చేస్తారు. ఆయనే తన భక్తులను నడిపిస్తారు. తన భక్తులకు ఏది అవసరమో అది అందిస్తారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

మరో అనుభవం:

నేను కొన్ని నెలలుగా డ్రైవింగ్ చేస్తున్నాను. వాస్తవానికి ఎవరి సూచనలు లేకుండా ఒక్కదాన్నే చాలా బాగా డ్రైవ్ చేయగలను. అలాంటిది నేను డ్రైవింగ్ టెస్టుకి వెళితే, కొన్ని సూచనలిచ్చి మళ్ళీ రమ్మని చెప్పారు. నేను 3-4 సార్లు వెళ్లినా ప్రతిసారీ ఇదే చెప్తుండేవారు. దానితో నేను విసుగుచెంది కొన్ని నెలల పాటు టెస్టుకు వెళ్లడమే మానేసాను.

ఒకరోజు ఉదయం ఆలస్యంగా లేచినప్పటికీ లేస్తూనే ఆరోజెందుకో డ్రైవింగ్ టెస్టుకు వెళ్లాలనిపించింది. తరువాత వెళ్తున్నప్పుడు కూడా నా మనసులో చాలా సందేహాలు చోటుచేసుకున్నాయి. నేను అక్కడికి చేరాక, ఒక వ్యక్తి సిస్టమ్స్ డౌన్ కారణంగా ఈరోజు ఎవరికీ టెస్టులు తీసుకోవడం లేదని చెప్పారు. కానీ నేను వినిపించుకోకుండా లోపలికి వెళ్లి, పరీక్ష తీసుకోమని బలవంతపెట్టాను. సరే, వేచి ఉండమని చెప్పారు. 2 గంటల కంటే ఎక్కువ సేపు వేచి ఉన్న తరువాత డ్రైవింగ్ టెస్టంటే ఆసక్తి కోల్పోయాను. కొంతసేపటి తరవాత మొత్తానికి నన్ను పిలిస్తే, వెళ్లి క్యూలో నిల్చున్నాను. ఆరోజు ఇద్దరు పరిశీలకులు ఉన్నారు. మొదటి వ్యక్తి కాస్త కూల్ గా కనిపించడంతో తనే నా పరీక్ష తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను కానీ, రెండో వ్యక్తి నా దగ్గరకు వచ్చి తనని అనుసరించమని చెప్పాడు. అప్పుడు నేను, "బాబా! ఈసారి నేనెలాగైనా పాస్ కావాలి. అలా అయితే నా అనుభవాన్ని వెబ్‌సైట్‌లో షేర్ చేస్తాను" అని ప్రార్థించి పరీక్షకు హాజరయ్యాను. డ్రైవింగులో ఒకటి, రెండు చిన్న పొరపాట్లు చేయడంతో, ఖచ్చితంగా మళ్ళీ రమ్మంటారని అనుకున్నాను. అయితే ఆశ్చర్యంగా అతను, "మీరు పాసయ్యారు" అన్నాడు. నేను 6 నెలలుగా ఈ పదాలు వినడానికి వేచి చూస్తున్నాను. చివరకు సాయి ఎంతో కృపతో నాకు సహాయం చేసి డ్రైవింగ్ పరీక్షలో పాస్ చేసారు.

నేను దాదాపు 9 నెలల నుండి మరో విషయంలో సాయి కృప కోసం ఎదురుచూస్తున్నాను. అందుకు సహనంతో ఉండాలి నేను. సహనం అంటే నా ఉద్దేశ్యం - "సంతోషంతో కూడిన సహనం". "బాబా! నా చిన్నప్పటినుండి ఎప్పుడూ నా కోరిక తీర్చడంలో మీరు ఇంత సమయం తీసుకోగా నేను చూడలేదు. కానీ ఇది నా జీవితానికి సంబంధించిన ముఖ్య విషయం. ప్లీజ్ సాయీ! నన్ను ఆశీర్వదించండి".

సాయిభక్తుల అనుభవమాలిక 18వ భాగం....


బాబా చెంతకు చేరిన రెండు పిచ్చుకలు

సాయిభక్తురాలు హేతల్ పాటిల్ రావత్ గారు చెప్తున్న మరికొన్ని అనుభవాలు.

"పిచ్చుక కాలికి దారంకట్టి ఈడ్చునట్లు నా భక్తులను నేను నా వద్దకు లాగుకుంటాను" అని బాబా చెప్పారు. అలా బాబా చెంతకు చేరిన రెండు పిచ్చుకల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అతుల్ అనే వ్యక్తి ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తుండేవాడు. అతనికి బాబాతో ఏ మాత్రం పరిచయం లేదు. ఒకసారి మందులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో అతనిని సస్పెండ్ చేయడమే కాకుండా, అతనిపై కేసు కూడా నమోదు చేసింది కంపెనీ. దాంతో అతను తనపై ఆధారపడివున్న కుటుంబం గురించి చాలా కలతచెందాడు. అటువంటి సమయంలో సాయిబాబాకు అంకిత భక్తుడైన అతని స్నేహితుడు, "ఈ విపత్తునుండి బయటపడటానికి సాయిబాబా పేరుమీద ఉపవాసం ఉండమ"ని సలహా ఇచ్చాడు. తన స్నేహితుని సలహా ప్రకారం అతుల్ 11 గురువారాలు ఉపవాసం పాటించి, సాయి మందిరానికి కాలినడకన వెళ్తుండేవాడు. కొద్దిరోజులు గడిచిన తరువాత కంపెనీనుండి అతనికి ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, అతనిపై పెట్టిన ఆరోపణలను, కేసును కంపెనీ ఉపసంహరించుకోవడమే కాకుండా అతనిని మునుపటి కన్నా చాలా ఎక్కువ జీతంతో తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ సంఘటన అతనిలో బాబాపట్ల పూర్తి విశ్వాసాన్ని నింపింది. ఇప్పుడతడు తరచూ శిరిడీ సందర్శిస్తూ ఎన్నో అనుభవాలను మూటకట్టుకున్నాడు.

మరో అనుభవం:


సాయిబాబా కృపను ఆయన భక్తులు పొందడం సాధారణమైన విషయమే. కానీ ఆయనను విశ్వసించని వాళ్ళపై కూడా ఆయన అంతే కృప చూపుతున్నారు. ఆ విషయాన్నే స్పష్టం చేస్తుంది నేనిప్పుడు చెప్పబోయే నా మేనమామ సునీల్ కలే గారి అనుభవం. ఆయన తన 50 ఏళ్ళ వయస్సులో ఏనాడూ దేవుడిని నమ్మేవారు కాదు. ఎప్పుడూ ఏ దేవుడినీ ప్రార్థించలేదు, పూజించలేదు. కనీసం అన్నేళ్లలో ఒక్కసారి కూడా దేవాలయానికి వెళ్ళలేదు. అలాంటతను ఇప్పుడు సాయిబాబాకి గొప్ప భక్తుడు. 2007 - 2008 లో ఆయన కొడుకు MCA చేస్తున్నాడు. తనకి కంప్యూటర్స్‌లో బాగా ఆసక్తి ఉన్నప్పటికీ కామర్స్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినందువలన MCA సబ్జెక్ట్స్ విషయంలో బాగా కష్టపడాల్సి వచ్చింది. కష్టపడి చదివినప్పటికీ మొదటి సెమిస్టర్ లోని ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దాంతో మా మామయ్య చాలా ఆందోళన చెంది మా అమ్మకు ఫోన్ చేసి, "నా కొడుకు చాలా కష్టపడి చదువుతున్నప్పటికీ కావలసిన ఫలితం పొందలేకపోతున్నాడు. ఏదైనా పరిష్కారం చూపించు" అని అడిగారు. సాయిభక్తురాలైన అమ్మ మా ఆంటీతో, 9 గురువారాలు ఉపవాసం పాటించి సాయిబాబాను ప్రార్థించి, సాయి మందిరానికి వెళ్ళమని చెప్పింది. ఆమె తక్షణమే అందుకు అంగీకరించి అమ్మ చెప్పినట్లు చేసింది. బాబా వారికి తోడుగా నిలిచారు. అంకితభావంతో మా ఆంటీ చేసిన ప్రార్థనలకు బాబా 9 గురువారాలలోపే సమాధానం ఇచ్చారు. ఆ సంఘటనతో మా మామయ్యకు బాబా యందు నమ్మకం కుదిరింది. ఇప్పుడు ఆయన ప్రతి గురువారం సాయి మందిరానికి వెళుతున్నారు. ప్రతి గురువారంనాడు బాబాకు సమర్పించడం కోసం కొబ్బరికాయ, కోవా, పూలు, అగరుబత్తీలు ముందురోజే తెచ్చిపెట్టుకుంటున్నారు. అంతలా ఆయనలో మార్పు వచ్చింది. అంతా బాబా లీల.


గమనిక: ఎన్నో లీలల ద్వారా బాబా ఉపవాసాలు ఉండవద్దని సూచించారు. అందువలన ఉపవాసం ఉండటానికి బాబా అనుగ్రహానికి ఏ సంబంధం లేదు. బాబాకు ఒక చిన్న ప్రార్ధన సరిపోతుంది. బాబా ఇష్టానుకనుగుణముగా నడుచుకోవడం వలన బాబా అపార అనుగ్రహానికి పాత్రులం కాగలం.

సాయిభక్తుల అనుభవమాలిక 17వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  • ఫకీరుబాబా వేరెవరో కాదు, సాయిబాబాయే!
  • మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు బాబా ఎప్పుడూ భక్తునికి అండగా ఉంటారు


ఫకీరుబాబా వేరెవరో కాదు, సాయిబాబాయే

సాయిభక్తురాలు, సాయియుగ నెట్‌వర్క్ (www.shirdisaibabaexperiences.org) బ్లాగు నిర్వాహకురాలు హేతల్ పాటిల్ రావత్ గారి అనుభవాలు:

2007, జనవరి 14 మకరసంక్రాంతికి నేను మా కుటుంబంతో పాటు శిరిడీ వెళ్ళాను. మా అమ్మ బాబాకు సమర్పించేందుకు నువ్వుల లడ్డూలు తయారుచేసింది. మేము కాకడ ఆరతికి హాజరయ్యాము. ఆరతి తరువాత బాబాకు మంగళస్నానం చేయించడం కూడా చూసాం. ఆ తరువాత సమాధిమందిరంలో బాబాకు లడ్డూ ప్రసాదం సమర్పించుకున్నాము. తరువాత మేము ద్వారకామాయికి వెళ్లి అక్కడ ప్రసాదం పంపిణీ చేయగా, రెండు లడ్డూలు మాత్రం మిగిలిపోయాయి. నా సహోద్యోగి ఒకరు బాయజాబాయి ఇంటిని సందర్శించమని సలహా ఇచ్చివుండటంతో అక్కడికి వెళ్ళాలని మేము ద్వారకామాయి ఎదురుగా ఉన్న లైన్లోకి వెళ్ళాము. మేము ఒక స్థలానికి చేరుకున్నాము, అక్కడనుండి లక్ష్మీబాయిషిండే ఇంటిని చూడవచ్చు, కానీ మాకు ఆ విషయం తెలియదు. అక్కడ కూర్చునివున్న ఒక ఫకీరుబాబా, "మీ కళ్ళముందే లక్ష్మీబాయి ఇల్లు ఉంది" అని చెప్పారు. మేము వెంటనే లోపలికి వెళ్లి లక్ష్మీబాయికి సాయిబాబా ఇచ్చిన పవిత్ర నాణేలను దర్శించుకుని ఆనందించాము. తరువాత ఆ ఫకీరుబాబా తనంతట తానే మాతో వచ్చి మహల్సాపతి ఇంటిని, మాధవరావు దేశ్‌పాండే మనవడి ఇంటిని మాకు చూపించారు. మా నాన్నగారు అతను చేసిన సహాయానికి డబ్బులు ఇవ్వబోయారు, కానీ అతను తిరస్కరించి, తనకు ఆహారం కావాలని చెప్పారు. మా ఆహారపదార్ధాలు హోటల్లో ఉన్నాయి. హోటల్ కూడా మేమున్న చోటుకు దూరంగా ఉంది. అంతలో మా అమ్మకు లడ్డూలు గుర్తుకువచ్చి వాటిని అతనికి ఇచ్చింది. లడ్డూలు స్వీకరించాక అతని ముఖంలో సంతృప్తి స్పష్టంగా కనిపించింది. అప్పుడు ఆ ఫకీరుబాబా వేరెవరో కాదు, మన సాయిబాబాయే అని గ్రహించి, ఆయన స్వయంగా మానవరూపంలో వచ్చి మా ప్రసాదం స్వీకరించారని మేమంతా చాలా సంతోషించాము.


మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు బాబా ఎప్పుడూ భక్తునికి అండగా ఉంటారు.

నా పేరు హితేష్(dhara) ఖేరాడియా. "నాకు పూజాసామాగ్రి గాని, అష్టోపచార షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్నచోటే నా నివాసం" అన్న సాయి సచ్చరిత్రలోని వాక్యాలు ఎంత సత్యమో అనడానికి మీరిప్పుడు చదవబోయే అబ్బురపరిచే లీలే సాక్ష్యం!

బరోడా(గుజరాత్)లో నివసిస్తున్న ఒక సాయిభక్తుడు వ్యాపారనిమిత్తంగా తరచూ జామ్‌నగర్(సౌరాష్ట్ర ప్రాంతం, గుజరాత్) వెళ్తుండేవాడు. అలా ఒకసారి జామ్‌నగర్ వెళ్లి పని పూర్తి చేసుకుని తన సొంత కారులో ఒంటరిగా బరోడాకు తిరిగి ప్రయాణమయ్యాడు. అతను బాగా అలసిపోయి ఉండటం వలన అర్థరాత్రి సమయంలో నిద్ర కమ్ముకొచ్చింది. తనకు తెలియకుండానే డ్రైవ్ చేస్తూ నిద్రపోయాడు. కొంతసేపటికి ప్రక్కనుండి ఓవర్‌టేక్ చేస్తున్న ఒక ట్రక్కు కారు యొక్క ఎడమ భాగాన్ని తాకడంతో అతనికి మెలుకువ వచ్చింది. వెంటనే తను అహ్మదాబాదు హైవే మీద ఉండటం గమనించి, బరోడా మార్గంలోకి కారు మళ్ళించాడు. కానీ, జరిగిన అద్భుతానికి ఆశ్చర్యపోయాడు. "నిద్రలో 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించానా?" అని నిర్ఘాంతపోయాడు. మార్గంలో చాలా మలుపులున్నాయి కానీ, కారు సాఫీగా ముందుకెళ్ళింది. దారిపొడవునా ఇతర వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అయినప్పటికీ తన శరీరంపై చిన్న గీత కూడా కాకుండా సురక్షితంగా ప్రయాణం సాగింది. అంచనాలకు అందని అద్భుతం! అదెలా సాధ్యమో ఎవరైనా ఊహించగలరా? అవును... మీ ఆలోచన నిజం! సాయే స్వయంగా అతని కారు నడిపారు. ఆ భక్తుడెప్పుడూ సాయి ముందు ఎటువంటి ప్రార్థనలు చేసి ఎరుగడు. కనీసం తరచూ బాబా మందిరానికి వెళ్లిన వ్యక్తి కూడా కాదు. కానీ అతను మనసారా సాయిని తలుచుకుంటాడు. తన ఆఫీసుకు వెళ్ళినప్పుడు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు తన కారులో సాయి హారతి గాని, సాయి భజనలు గాని పెట్టుకుంటాడు. అంతే అతను చేసేది. కానీ బాబా ఎంతలా అండగా ఉన్నారో చూసారా?

ఈ అనుభవం ద్వారా బాబా, తమను మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు, తామెప్పుడూ భక్తునికి అండగా ఉంటామని నిరూపించారు.

సాయిభక్తుల అనుభవమాలిక 16వ భాగం....


అనుక్షణం అండగా నిలిచే బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను బాబాకు చిన్న భక్తురాలిని. నేనెప్పుడూ బాబా బిడ్డగా అనుభూతి చెందుతూ ఉంటాను. ఇటీవల నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

ఈమధ్య మేమొక పుట్టినరోజు వేడుకకు వెళ్లి తిరిగి కారులో వస్తున్నప్పుడు దారిలో ఒకచోట ఒక ఎడ్లబండి ప్రక్కనుండి వెళ్ళాము. ఆ సమయంలో చాలా పెద్ద శబ్దం వినిపించింది. "ఆ శబ్దమేమిటి? ఎవరికైనా ఏదైనా హాని జరిగిందా?" అని అనుకున్నాము. కొంతసేపటికి ఒక  పోలీసు ఆఫీసరు యూనిఫాంలో బైక్ మీద మమ్మల్ని అనుసరిస్తూ రావడం గమనించాము. అతను మా కారును ఆపి బయటకు రమ్మన్నాడు. నేను అతన్ని చూస్తూనే భయపడిపోయి, "బాబా! మాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. అతను, "మీ కారు నా బైక్ ని గుద్దింది. నా కాలికి గాయమైంది. నా బైక్ కూడా కొంచెం డామేజ్ అయింది" అని చెప్పాడు. ఆ సమయంలోనే బైకుకి వున్న ఒక చిన్న పిన్ను మా కారు టైరుకి తగిలి బరస్టయ్యింది. అదే మాకు వినిపించిన పెద్ద శబ్దం. ఎవరికీ పెద్ద హాని కాలేదని తెలిసి మేము కాస్త ఊపిరి పీల్చుకున్నాము. ఆ పోలీసు ఆఫీసరు కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. మేము కారు మరమ్మత్తు చేయించుకుని ఇంటికి చేరుకున్నాము. బాబా మా చెడుకర్మలను పెద్ద ప్రమాదం జరక్కుండా కొద్ది డబ్బుతో తొలగించారు. "థాంక్యూ సోమచ్ బాబా!"

రెండవ అనుభవం:

మావారు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. తనకి తగినంత అనుభవం ఉండడంతో మేనేజర్ ప్రమోషన్ కోసం మేము ఎదురుచూస్తుండేవాళ్ళం. మావారు పనిచేస్తున్న చోట మేనేజరుగా ఉన్న వ్యక్తి వేరే చోటికి వెళ్లడంతో మావారే కొన్నిరోజులు టీం హెడ్ గా వ్యవహరించారు. కాబట్టి తనకే మేనేజరుగా ప్రమోషన్ వస్తుందని ఆశిస్తుండేవారు. కాకడ హారతి సమయంలో బాబా చాలా ప్రశాంతంగా ఉంటారని, ఆ సమయంలో మనం అడిగిన కోరికలను కరుణతో నెరవేరుస్తారని 'సాయి ప్రేమ'లో వ్రాసి ఉంది. అందువలన నేను 11 రోజులపాటు క్రమం తప్పకుండా కాకడ హారతికి వెళ్లి బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయితే అనుకోకుండా కొత్త మేనేజరుని అపాయింట్ చేయడంతో, బాబా సరైన సమయంలో మాకు శ్రేయస్కరమైనది అనుగ్రహిస్తారని తెలిసినా కాస్త నిరాశపడ్డాము. కొన్నిరోజులకి వేరే చోట మేనేజర్ పొజిషన్లో మావారికి అవకాశం వచ్చింది. అలా బాబా అద్భుతమైన రీతిలో మా కోరికను నెరవేర్చారు. మంచి కంపెనీలో మేము ఊహించని మంచి జీతాన్ని బాబా అనుగ్రహించారు. ఒకవేళ పాత కంపెనీలోనే మేనేజర్ ప్రమోషన్ వచ్చినా ఇంత మంచి జీతం వచ్చేది కాదు. అంతా బాబా కృప. బాబా తన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. ఆయన ఎంతో ఉత్తమంగా ఆలోచించి మన కోరికలు నెరవేరుస్తారు. ఈ కోరిక నెరవేరితే మావారు 11 రోజులు కాకడ హారతికి హాజరవుతారని నేను బాబాకి మ్రొక్కుకున్నాను. మావారు సాయిభక్తుడు కానప్పటికీ బాబా కృపవలన 11 రోజులు హారతికి వెళ్లారు. బాబా మావారి కర్మలను తొలగించి తన ప్రేమలో పడేలా చేస్తున్నారు. నిదానంగా మావారు బాబాని ఇష్టపడుతున్నారు. ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న ఈ కోరికను కూడా బాబా నెరవేరుస్తున్నారు.

మూడవ అనుభవం:

ఒకప్పుడు నాకు చంకలో నొప్పి వస్తుండేది. దానితో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. బాబాని ప్రార్థించి, ఆ చోట ఊదీ రాసి, కొంచెం నీటిలో కలుపుకుని త్రాగాను. బాబా కృపవలన ఆ నొప్పి తగ్గిపోయింది. మరోసారి మా పాప బుగ్గలపై తెల్లని మచ్చలు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా బాబాని ప్రార్థించి ఊదీ రాయడంతో ఆ మచ్చలు పూర్తిగా తొలగిపోయాయి.

నాల్గవ అనుభవం:

ఇటీవల వేరే సిటీలో ఉన్న మా కుటుంబసభ్యులను కలవడానికి టికెట్లు బుక్ చేయాలనుకున్నాను. అయితే నేను అనుకున్న తేదీలలో టిక్కెట్లు దొరకలేదు. బాబా ప్రణాళికలు అమోఘమైనవి. ఆయన మా వివాహ వార్షికోత్సవం, సెలవుదినాలు కలిసివచ్చేలా మా ప్రయాణాన్ని మలిచారు. మా కుటుంబసభ్యులంతా చాలా గొప్పగా మా వివాహ వార్షికోత్సవాన్ని జరిపారు. అందరూ మాపై ఎంతో ప్రేమను కురిపించారు. నిజానికి మా మధ్యన ఎప్పుడూ భేదాభిప్రాయాలుండేవి. కానీ ఈ ప్రయాణం మా మధ్య ఉన్న అపార్థాలను తుడిచేసి మళ్లీ అందరినీ ఒకటి చేసింది. ఇలాగే ఎప్పుడూ మా కుటుంబమంతా సంతోషంగా కలిసి ఉండాలని ఆశిస్తున్నాను. మా వివాహ వార్షికోత్సవాన్ని నేను, నా భర్తే చేసుకోదలచినా బాబా అందరితో కలిసి చేసుకునేలా ఏర్పాటుచేసి కుటుంబమంతా మళ్లీ ఒక్కటయ్యేలా చేశారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo