సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాధువులను గౌరవించాలని భక్తులకు తెలియజేసిన బాబా లీల


బప్కర్ మహరాజ్ ఒక బైరాగి సాధువు. ఆయనొకసారి ముంబాయికి వచ్చారు. ఆయన భక్తుడైన నానాసాహెబ్ పిట్కర్ ఆయనను కలిసి, తన ఇంట్లో కొన్నిరోజులు ఉండమని అభ్యర్ధించాడు. అయితే బప్కర్ మహరాజ్ శిరిడీ సందర్శించాలన్న సంకల్పంతో, తనని నిర్బంధించక వెళ్ళనివ్వమని పదేపదే చెప్పారు. అసలు విషయం ఏమిటంటే, బప్కర్ మహరాజ్ తన కొడుకుకు మరుసటిరోజుకల్లా శిరిడీలో ఉండమని ఉత్తరం వ్రాసి ఉన్నారు. అందువలన ఆయన కూడా మరుసటిరోజుకి తప్పనిసరిగా శిరిడీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ సమయానికి నానాసాహెబ్‌ పిట్కర్‌తోపాటు చాలామంది భక్తులు ఆయన దర్శనం కోసం వచ్చి ఉన్నారు. అంతమంది భక్తులను నిరాశపరిచి వెళ్లలేకపోయారాయన. ఎందుకంటే సాధువులు తమ భక్తుల కోరికలు తీర్చి వారిని సంతృప్తిపరచి ముందుకు సాగిపోతారు.

ఇదిలా ఉంటే బప్కర్ కొడుకు తన తండ్రి చెప్పిన ప్రకారం శిరిడీ చేరుకున్నాడు. అక్కడ అతనికి ఎవరూ తెలియనందున నేరుగా ద్వారకామాయికి వెళ్లి ఒక మూలన కూర్చున్నాడు. మధ్యాహ్న హారతి సమయానికి కొంచెం ముందుగా మూలన కూర్చున్న ఆ యువకుని మీద బాబా దృష్టి పడింది. బాబా తన దివ్యదృష్టితో ఆ యువకుడు ఎవరన్నది గ్రహించి, "ఆ యువకుడిని ఇక్కడకు తీసుకుని రా!" అని శ్యామాను పంపించారు. తరువాత బాబా అక్కడ కూర్చున్న భక్తుల వైపు తిరిగి, "ఈ యువకుడి తండ్రి ఆధ్యాత్మికంగా గొప్ప స్థితిని అందుకున్నాడు. ఆయనొక గొప్ప సాధువు. ఆయన ఈరోజు ఇక్కడకు రావాలని అనుకున్నారు. కానీ ఆయన భక్తులు ఆయనను ఇంకోరోజు ముంబాయిలో ఉండమని అభ్యర్థించారు. వాళ్ళని నిరాశపరచడం ఇష్టంలేని ఆయన అక్కడ ఉండిపోయారు. ఆయన కొడుకుని మనం తగిన విధంగా గౌరవించాలి. శ్యామా! ఈరోజు ఈ యువకుడు నా ఆసనంలో కూర్చుంటాడు, హారతి నిర్వహింపబడుతుంది" అని చెప్పారు.

అందువలన ఆరోజు బాబా భక్తులందరూ ఆచారపూర్వకంగా ఆ యువకుడిని పూజించి, హారతి ఇచ్చారు. బాబా ఎప్పుడూ తమని దర్శించడానికి వచ్చిన యోగులను, సాధువులను చాలా గౌరవించేవారు. ఈ సన్నివేశంతో తమ భక్తులు కూడా యోగులను గౌరవించాలని బాబా తెలియజేసారు.

Ref: సాయి ప్రసాద్ మ్యాగజైన్, దీపావళి సంచిక, 1993.
Source: Baba’s Divine Manifestations  compiled by విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 15వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  • కలలో ముందుగానే సూచించారు బాబా..
  • ఊదీ చూపిన ప్రభావం.


కలలో ముందుగానే సూచించారు బాబా.

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

బాబా కృపవలన మా అమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్‌లో ఉండగానే ఎన్రిచ్‌మెంట్ ప్రోగ్రాంకి ఎంపికైంది. అదే సంవత్సరం నేను శిరిడీతోపాటు మహారాష్ట్రలోని మరికొన్ని పుణ్యక్షేత్రాలు కూడా దర్శించాను. తర్వాత స్కూల్ నుండి, "మీ పాప ప్రతి సంవత్సరం ఇదే స్థాయి(పర్సెంటేజ్) కొనసాగిస్తే తన ఎలిమెంటరీ చదువు మొత్తం ఈ ప్రోగ్రాం క్రింద నడుస్తుంద"ని మెసేజ్ వచ్చింది. మేము చాలా సంతోషించాము. అయితే మా పాప సెకండ్ స్టాండర్డ్ వరకు ఆ స్థాయి కొనసాగించింది కానీ, థర్డ్ స్టాండర్డ్ మధ్యలోకి వచ్చేసరికి నిదానంగా తన పర్సెంటేజ్ పడిపోయింది. ఆ విషయమై నేను బాబాను ప్రార్థించాను. ఆయన కృపవలన తన పర్సెంటేజ్ పుంజుకుంది కానీ, మేము కొన్ని కుటుంబపరంగా అత్యవసర పరిస్థితులలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుండటంవలన అనుకున్న స్థాయిలో తన పర్సెంటేజ్ పెరగలేదు. నేను ఇంక ఆశ వదులుకుని మళ్లీ వేరే పనిమీద దేశం వదిలి వెళ్ళాను. తల్లి మనస్సు కదా! ఉండబట్టలేక నేను, "బాబా! మా పాప మునుపటిలా మంచి పర్సెంటేజ్ తెచ్చుకునేవరకు వంకాయకూర తినను" అని ప్రార్థించాను. అలా అనుకున్న తర్వాత ఒకరోజు కలలో నా ఫ్రెండ్ ఒక పాత్రనిండా వంకాయకూర నాకు తినడానికి ఇచ్చింది. రెండురోజుల తర్వాత నా భర్త ఫోన్ చేసి, "మన పాప మళ్ళీ ఎన్రిచ్‌మెంట్ ప్రోగ్రామ్‌కి సెలెక్ట్ అయింది" అని చెప్పారు. బాబా లీల చూసారా! ముందుగానే ఆయన నాకు కలలో నా ఫ్రెండ్ ద్వారా నాకు వంకాయకూర ఇచ్చి నా కోరిక నెరవేరుతుందని సూచించారు.

ఊదీ చూపిన ప్రభావం

సాయిభక్తురాలు సునందన తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

నేను బాబాకు చిన్న భక్తురాలిని. గత కొన్ని నెలలుగా బాబాకి నేను చాలా దగ్గరయ్యాను. బ్లాగులో భక్తుల అనుభవాలు చదవడంవలన బాబాపట్ల భక్తివిశ్వాసాలు పెరుగుతూ, రోజురోజుకీ బాబాకి ఎంతో దగ్గరవుతున్నాను. బ్లాగులు నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదములు.

మొదటి అనుభవం:

ఒకరోజు సంవత్సరం రెండునెలల వయసున్న నా సోదరి కొడుకు అర్థరాత్రి హఠాత్తుగా ఏడవడం మొదలుపెట్టాడు. కారణం ఏమిటో మాకు అర్థం కాలేదు. తనను ఉరుకోబెట్టడానికి మేమెంతగానో ప్రయత్నించాము కానీ, వాడు బిగ్గరగా ఏడుస్తూ ఉండటంతో మేము భయపడిపోయాము. ఆ సమయంలో నేను బాబాని ప్రార్థించి, వాడి నుదుట ఊదీ పెట్టాను. కేవలం 5 నిమిషాల్లో వాడు సాధారణ స్థితికి వచ్చి చక్కగా నవ్వడం మొదలుపెట్టాడు.

రెండవ అనుభవం: కొన్నిరోజులపాటు రోజూ ఉదయాన్నే యూరిన్ కి వెళ్లే సమయంలో మా మేనల్లుడు ఏడుస్తూ ఉండేవాడు. మేము డాక్టరుని సంప్రదిస్తే యూరిన్ టెస్టులు చేసారు. రిపోర్టులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అని వచ్చింది. డాక్టర్ కొన్ని మందులు, క్రీమ్ వ్రాసి, "ఇన్ఫెక్షన్ పూర్తిగా పోవడానికి సమయం పడుతుంది. వారం తరువాత మళ్లీ టెస్టులు చేయించండి" అని చెప్పారు. ఆ వారంలో మేము ఊదీని నీళ్లలో కలిపి వాడికిస్తూ, "బాబా! వాడికి నయం చేయండి" అని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. తర్వాత గురువారంనాడు పరీక్షలు చేయిస్తే రిజల్ట్స్ నార్మల్ గా వచ్చాయి. ఈ సంఘటనతో మా సోదరికి ఊదీ శక్తి అర్థమైంది. "థాంక్యూ సో మచ్ బాబా!"

సాయిభక్తులఅనుభవమాలిక 14వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  • బాబా చేసిన చిన్న సహాయం
  • ఫోన్ బిల్లు పదోవంతుకు తగ్గేంచేసిన బాబా


బాబా చేసిన చిన్న సహాయం

సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నాకు నా చిన్ననాటినుండి నాకు బాబాతో అనుబంధం ఉంది. నేను ఎన్నో బాబా లీలలు చవిచూశాను. నాకే సమస్య వచ్చినా నేను బాబాతోనే చెప్పుకుంటాను. ఆయన కృపతో అవి ఇట్టే తీరిపోయాయి. ఒకసారి ఉద్యోగవిషయంగా ఒక సైంటిస్టుతో మాట్లాడాల్సి వచ్చింది. అయితే నాకు ఇంగ్లీష్ అంతగా రాకపోవడంతో చాలా ఆందోళనపడ్డాను. దాంతో, "బాబా! అతను నాతో తెలుగులో మాట్లాడాలి" అని బాబాను ప్రార్థించాను. తరువాత నేను అతనికి ఫోన్ చేస్తే చక్కగా తెలుగులోనే మాట్లాడారు. నాకు గొప్ప ఆనందంగా అనిపించింది. ఆ ఉద్యోగం నాకు వస్తుందో లేదో నాకు తెలియదుగానీ బాబా నాకు సహాయం చేసారు. "థాంక్యూ సో మచ్ బాబా! ఉద్యోగం నాకు, నా కుటుంబానికి అవసరమని మీకు తెలుసుకదా! నాకది మంచిదనిపిస్తే ఆ ఉద్యోగం నాకివ్వండి."


ఫోన్ బిల్లు పదోవంతుకు తగ్గేంచేసిని బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. నేను జపాన్ నివాసిని. 2019లో ఒకనెల మా ఇంట్లోని ఇంటర్నెట్ కనెక్షన్ పనిచేయకపోవడంతో మావారు తన ఆఫీసు ఫోనులోని హాట్‌స్పాట్ ఆన్ చేసి తన ఆఫీసు పని చేసుకున్నారు. దానితో ఆ నెల బిల్ చాలా ఎక్కువ వచ్చింది. మరీ అంత వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. మావారు చాలా ఆందోళనపడ్డారు. ఆ సమస్యనుండి బయటపడేస్తారని సాయిపై మాకున్న పూర్తివిశ్వాసంతో ఆయనను ప్రార్థించాము. మరుసటిరోజు మావారు ఆఫీసుకు వెళ్లి బాబా చూపిన కృపకు చాలా ఆశ్చర్యపోయారు. ఏదో డిస్కౌంట్ కారణంగా బిల్ ఎమౌంట్ పదో వంతుకు తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా!"

సాయిభక్తుల అనుభవమాలిక 13వ భాగం....


సాయి ఆశీర్వాదంతో పుట్టిన మా అందమైన పాప

పేరు వెల్లడించని ఒక సాయిబంధువు బాబా తనకిచ్చిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు.

నేను బాబాపై పరిపూర్ణ భక్తివిశ్వాసాలు ఉన్న భక్తురాలిని. ఒక బ్లాగుని రూపొందించి బాబాపై మా నమ్మకాన్ని దృఢపరుస్తున్నందుకు ముందుగా బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. బాబా లేని మా జీవితాలు శూన్యం. బాబా ఏ లోటూ లేకుండా నాకన్నీ ఇచ్చారు. ఇకపోతే నా అనుభవానికి వస్తే.. మంచి తల్లితండ్రులు, ప్రేమగా చూసుకునే భర్తతో ఆనందంగా రోజులు గడిచిపోయేవి. కానీ మాకున్న పెద్ద లోటు ఏమిటంటే, మాకు సంతానం లేకపోవడం. నా గతజన్మల పాపకర్మల కారణంగా పిల్లలకోసం లక్షలు ఖర్చుచేసి చాలా చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. కానీ అవేవీ ఫలితాన్ని చూపలేదు. మా వివాహమైన నాలుగేళ్ళ తరువాత నేను 'నవ గురువార వ్రతం' చేశాను. సరిగ్గా సంవత్సరం తర్వాత మొదటిసారిగా నేను గర్భవతినయ్యాను. కానీ అనుకోకుండా 9వ వారంలో నాకు గర్భస్రావం జరిగింది. ఆ దిగులుతో నేను బాగా క్రుంగిపోయి నాకింక పిల్లలు పుడతారనే ఆశని కోల్పోయాను. అయితే ఇది జరిగిన 10 నెలల తరువాత, అంటే 2016 చివరిలో బాబా భక్తురాలైన నా స్నేహితురాలు, "ప్రతిరోజూ పరగడుపున బాబా ఊదీ తీసుకోమ"ని సలహా ఇచ్చింది. నేను తను చెప్పినట్లుగానే ఊదీ తీసుకుని, నుదుటిపై ఊదీ పెట్టుకుని, ఎప్పుడూ 'సాయి సాయి సాయి' అని స్మరిస్తూ ఉండేదాన్ని. నిదానంగా వైద్యపరంగా ఏ సమస్యలున్నా సాయి వాటిని తొలగించి నాకు సంతానాన్ని అనుగ్రహిస్తారని నా నమ్మకం దృఢపడింది.

2017 జనవరిలో ఒకరోజు స్వప్నంలో సాయి నాకు దర్శనమిచ్చి, నాకు స్వీట్స్ ఇచ్చారు. ఆరోజు నాకు కలిగిన సంతోషాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు, పట్టరాని ఆనందంతో ఏడ్చేసాను. మళ్ళీ సరిగ్గా ఒక నెల తరువాత, మరుసటిరోజు నేను ప్రెగ్నన్సీ టెస్టుకోసం డాక్టరు దగ్గరకి వెళ్లాల్సి ఉందనగా ముందురోజు రాత్రి స్వప్నంలో బాబా దర్శనమిచ్చి, పుట్టిన బిడ్డకి నామకరణం చేస్తున్నారు. నేను గర్భవతినని బాబా ఇస్తున్న శుభసూచకంగా భావించాను. బాబా అద్భుతం చేసి చూపారు. నేను నిజంగానే గర్భవతినయ్యాను. నేను, మావారు, మా కుటుంబసభ్యులు పొందిన ఆనందానికి అవధుల్లేవు. బాబా కృపతో 9నెలల కాలం సాఫీగా సాగిపోయింది. ఇప్పుడు మాకు 3 నెలల అందమైన పాప ఉంది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!” బాబా దయవలన నేనిప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో చెప్పలేను. “ఈ ఆనందానికి కారణం మీరే బాబా!” దృఢమైన విశ్వాసంతో సాయిపై భారం వేస్తే ఖచ్చితంగా మన బాబా అద్భుతం చేసి చూపుతారు. అహంకారాన్ని వదిలిపెట్టి ఆయన దివ్యపాదాలపై మనసు కేంద్రీకరించి, ఆయన వాక్కులను అనుసరించి నడుచుకుంటే శుభం కలుగుతుంది. సాయి సాయి సాయి సాయి సాయి.

సాయిభక్తుల అనుభవమాలిక 12వ భాగం....


సాయిబాబా సత్యం, ఆయన తన భక్తులకోసమే ఉన్నారు.

అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

మొదటిసారి నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటున్నాను. భక్తుల అనుభవాలు చదవడం వలన మనసులోని ఆందోళనలు దూరం కావడం మాత్రమే కాకుండా, ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ చేకూరి ప్రతికూల పరిస్థితులలో సైతం జీవితంపై ఆశ సంతరించుకుంటుంది. ఇటువంటి చక్కటి బ్లాగులు నిర్వహిస్తున్నవారికి ముందుగా నా ధన్యవాదాలు.

నేనుగానీ, మా కుటుంబంలోనివారు కానీ ఎవ్వరూ సాయిభక్తులు కాదు. అయినప్పటికీ పదేళ్లక్రితం శిరిడీ దర్శించే భాగ్యం లభించింది. అయితే అప్పుడు దాని ప్రాముఖ్యతను నేను అర్థం చేసుకోలేకపోయాను. మామూలుగా తీర్థయాత్రకు వెళ్లినట్లు శిరిడీ దర్శించామంతే! కానీ బాబా దర్శనం మాత్రం మర్చిపోలేనిది. ఆరోజు నేను పొందిన అనుభూతిని, భావోద్వేగాలను మాటలలో వివరించలేను. తరువాత మూడేళ్ళక్రితం మేమొక కొత్త ప్రాంతానికి మారాం. అక్కడికి దగ్గరలో ఉన్న చిన్న గుడికి తరచూ వెళ్తుండేదాన్ని. ఆ గుడిలో సాయిబాబా మూర్తి కూడా ఉంది. అందరి దేవుళ్ళతో పాటు బాబాను కూడా దర్శిస్తుండేదాన్ని. ఒకరోజు గుడినుండి తిరిగివచ్చేముందు కాసేపు కూర్చోవాలని అనుకున్నాను. అయితే జనసందోహం ఎక్కువగా ఉండటంతో కూర్చోవడానికి నాకు బాబా ముందు మాత్రమే చోటు దొరికింది. ఆయన ఎదురుగా ప్రార్థన ఏమీ చేయకుండా కన్నులు మూసుకుని కేవలం కూర్చున్నానంతే! ఏదో ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ నాలో ప్రవహించి తెలియని సంతోషంలో ఎంతసేపు కుర్చున్నానో కూడా నాకు తెలియలేదు. తెలియని తన్మయత్వంలో సమయం గడిచిపోయింది. ఆ స్థితి నుండి బయటకు రావాలని అనిపించలేదు. కనులు తెరుస్తూనే నా మనసులోని ఆందోళనలకు, ప్రార్థనలకు సమాధానం దొరికినట్లు అనిపించింది. సమస్యలన్నీ వాటికై అవి తొలగిపోతాయని అనిపించింది. అటువంటి అనుభూతి మళ్ళీ ఇంతవరకు కలగలేదు. కానీ ఆ క్షణంనుండి సాయిబాబా సత్యం, ఆయన తన భక్తులకోసం ఉన్నారని నాకు అర్థమైంది. ఆరోజునుండి నేను మళ్ళీ వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇటీవల నా పూజ కాస్త మందంగా ఉన్నప్పటికీ బాబా నన్ను విడిచిపెట్టలేదు. నాకున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఒకసారి బాబాని ప్రార్థించాను. మరుసటిరోజునుండి ఆ సమస్యలు పూర్తిగా పోయి, నేను నార్మల్ అయ్యాను. ఏ సమస్యకూ నేను బాబాని తప్ప ఇంకెవరినీ ప్రార్థించలేను. "థాంక్యూ సాయి! మేముండే అంధకారంలో ఎల్లప్పుడూ మా వెనుక ఉండే వెలుగు మీరే బాబా! జ్ఞానాన్ని ప్రసాదించి మీ చైతన్యాన్ని తెలియజేయడానికి మీరు అవతరించారు. థాంక్యూ సో మచ్ బాబా! నాకు సరైన మార్గాన్ని చూపిస్తున్నారు. మీ భక్తులందరూ ఇటువంటి అందమైన అనుభూతి పొందాలని ప్రార్థిస్తున్నాను బాబా!" ఈ ప్రయాణాన్ని అనుభూతి చెందవలసిందే గాని, మాటల్లో చెప్పలేనిది.

సాయిభక్తుల అనుభవమాలిక 11వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  • ఉజ్జయినిలో బాబా మాపై చూపిన అనుగ్రహం
  • అద్దంలో బాబా దర్శనం

ఉజ్జయినిలో బాబా మాపై చూపిన అనుగ్రహం

సాయిబంధువు కృష్ణవేణి గారు తన రీసెంట్ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ సాయిరాం! బాబా అనుగ్రహం వలన మా ఇంట్లో అందరం ఆయన భక్తులం. జీవితంలో ఎన్నోసార్లు ఆయన ప్రేమతో మమ్మల్ని కాపాడారు. కొన్నిసార్లు కఠినంగా పరీక్షించినా మళ్ళీ నిలదొక్కుకునేలా కూడా అనుగ్రహించారు. ఆయన వెన్నకన్నా మృదువుగా ఉంటారు, ఒక్కోసారి వజ్రంకన్నా కఠినంగా ఉంటారు. ఎలా ఉన్నా, వారే మన ఆశ, శ్వాస.

ఇటీవల బాబా మాకు చూపిన ఒక లీలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2019, మార్చి 23వ తేదీన నేను, మావారు, మా ఇద్దరు పిల్లలు కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం మరియు మమలేశ్వరం జ్యోతిర్లింగ యాత్రకు వెళ్ళాము. 23వ తేదీ శనివారం సాయంత్రం ఉజ్జయిని చేరుకుని హోటల్లో ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్ళాము. మేము క్యూలైన్లో ఉండగా తెలిసిన విషయమేమిటంటే, "శని, ఆదివారాలు మామూలుగానే సెలవుదినాలు కాగా, సోమవారంనాడు రంగ్ పంచమి(నార్త్‌లో ఆరోజు హోళీ జరుపుకుంటారు) రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఆ కారణంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నందున స్వామిని స్పర్శిస్తూ అభిషేకించే వీలులేదని, కాబట్టి స్వామిని దూరంనుంచే దర్శించుకోవాలి" అని. ఇది విన్నాక మా అందరికీ బాధగా అనిపించింది. అప్పుడు నేను నా మనసులో, "బాబా! మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో తెలీదు. శివయ్యకు అభిషేకం చేసుకోవాల్సిందే. ఇంతదూరం వచ్చి అభిషేకం చేయకుండా వెళ్తే ఎంత బాధాకరం! ఐనా మీరుండగా మాకేంటి? గర్భగుడిలో దర్శనం, అభిషేకం మీరు ఇప్పించాల్సిందే" అని బాబాని ప్రార్థించి, "శివయ్యా! అభిషేకం చేయకుండా మేము వెళ్ళేదే లేదు" అని శివయ్యని ప్రార్థించుకున్నాను. ఇంకా, బ్లాగులోని అనుభవాలలో కొంతమంది భక్తులు, "మాకు ఇలా జరిగితే మా అనుభవాలు బ్లాగులో పంచుకుంటాం" అని అనుకుంటే వాళ్ళ కోరికలు బాబా తీరుస్తున్నారు. ఆ విషయం గుర్తుకొచ్చి, "బాబా! మేమిప్పుడు అభిషేకం చేసుకునేలా అనుగ్రహించండి. నేను కూడా నా అనుభవాన్ని బ్లాగులో షేర్ చేసుకుంటాను" అని అనుకున్నాను. ఇంతలో మావారు అక్కడ ఉన్న పూజారిని సంప్రదిస్తే వారు, "అభిషేకానికి ప్రత్యేక టికెట్ ఉంటుంది. అయితే గర్భగుడి లోపలికి ప్రవేశించాలంటే తప్పనిసరిగా పురుషులు ధోవతి, స్త్రీలు చీర ధరించాల్సిందే, లేకపోతే ప్రవేశం నిషేధం" అని చెప్పారు. అక్కడ మొదలైంది మాకు చిక్కు. సాధారణంగా ప్రతి యాత్రలో తప్పనిసరిగా ఇవన్నీ సర్దుకునే మేము ఈసారి అవి తీసుకెళ్ళలేదు. అయితే బాబా కృపవలన ఈ సమస్యకి పరిష్కారం కూడా పూజారులే చూపారు. ఇక మేము శివయ్యను స్పర్శిస్తూ అభిషేకించి తృప్తిగా పూజ చేసుకున్నాము. మా శిరస్సును స్వామి పానవట్టానికి తాకించే అదృష్టం కూడా మాకు ప్రసాదించారు మన సాయీశ్వరుడు. నాకైతే 'జన్మ ధన్యమైంది' అని అనిపించింది. అది మా జీవితంలో మరిచిపోలేని అనుభవం. మరుసటిరోజు పంచామృతాభిషేకం చేసుకోవాలన్న కోరికతో ఎంత ఖర్చవుతుందో వివరాలు తెలుసుకుని, అలా కూడా శివయ్యను అభిషేకించుకున్నాము. అసలు జరగదు అనుకున్నది బాబా అనుగ్రహంవలన రెండుసార్లు సాధ్యమైంది. "థాంక్యూ బాబా! ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే మీ సేవలో తరింపజేయండి". మరోసారి ఓంకారేశ్వర, మమలేశ్వర యాత్రకు సంబంధించిన అనుభవాలను పంచుకుంటాను.


అద్దంలో బాబా దర్శనం


నాపేరు సాయిసురేష్. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అద్భుత అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

సాధారణంగా నేనెప్పుడూ హెయిర్ కట్ చేయించుకోవడానికి సెలూన్ కి రాత్రి 8 గంటల సమయంలో వెళ్తుంటాను. ఆ సమయంలో అయితే ఎవరూ ఉండరు, వేచి ఉండనవసరం లేకుండా త్వరగా అయిపోతుందని నా ఉద్దేశ్యం. అయితే 2019, ఫిబ్రవరి 27న సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటినుంచి వెళ్తూ, "సెలూన్లో ఎవరూ ఉండకపోతే బాగుంటుంది బాబా, ఉంటే అక్కడ సమయం వృధా అయిపోతుంది" అనుకుంటూ సెలూన్‌ కి చేరుకున్నాను. అక్కడ చూస్తే, ఇద్దరికి హెయిర్ కట్ అవుతుండగా, ముగ్గురు వేచి ఉన్నారు. సరే ఎలాగూ వచ్చాను కదా, సమయం వృధా చేసుకోవడం ఎందుకు, కూర్చుని బాబా నామస్మరణ చేసుకుందామనుకున్నాను. కూర్చుని రెండు, మూడు సార్లు బాబా నామం అనుకుని ఎదురుగా ఉన్న అద్దంలో చూస్తే, బాబా దర్శనమిచ్చారు. అద్దంలో కనిపిస్తున్న ఒక బాక్సుపైన ఆర్ట్ డిజైనులా బాబా ముఖం కనిపిస్తుంది. బాబా ఉన్నారని సంతోషంగా అనిపించి, ఇవతల ఉన్న బాక్స్ వైపు నేరుగా చూసాను. ఆశ్చర్యం! దానిమీద బాబా కనపడటం లేదు. ఇదేమిటని మళ్ళీ అద్దంలో చూస్తే బాబా కనపడుతున్నారు. మళ్ళీ బాక్స్ పై చూసాను, బాబా లేరు. అద్దంలో మాత్రమే బాబా దర్శనమిస్తున్నారు. ఆశ్చర్యానందాలతో బాబాని చూస్తూ బాబా స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను.

సాయిభక్తుల అనుభవమాలిక 10వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  • 1. సిల్లీ కోరికను కూడా నెరవేర్చిన బాబా
  • 2. కొడుకుని ప్రమాదం నుండి కాపాడిన దయాసముద్రుడైన సాయిబాబా


సిల్లీ కోరికను కూడా నెరవేర్చిన బాబా

నేను యూఏఈ నుండి ఒక సాయిభక్తురాలిని. నేను నా భర్త, ఐదు సంవత్సరాల కొడుకుతో యూఏఈలో నివసిస్తున్నాము. నేను ప్రతి గురువారం బాబా గుడికి వెళ్తుంటాను. 2018లో ఒకసారి నేను సాయి నవగురువార వ్రతం మొదలుపెట్టాను. 8వ గురువారంనాడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే, రెండు రోజుల్లో ఇండియాకి వెళుతుండటం వలన గిఫ్ట్స్ తీసుకోవడం కోసం షాపింగుకి వెళ్ళాల్సి ఉంది. అయినప్పటికీ ఆరోజు బాబా గుడికి వెళ్ళే అవకాశం మాత్రం నేను వదులుకోదలుచుకోలేదు. సమయం తక్కువగా ఉండటంతో నా భర్త నన్ను టెంపుల్ దగ్గర విడిచిపెట్టి, తను మాత్రమే షాపింగుకి వెళ్తానన్నారు. కానీ నాక్కూడా షాపింగుకి వెళ్లాలని ఉంది. ఎందుకంటే గిఫ్టులతోపాటు నేను తీసుకోవలసిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అందువలన ఇద్దరం కలిసి షాపింగుకి వెళ్తే మొత్తం పని అయిపోతుందని నా ఆలోచన. కానీ ఆ విషయం మావారికి చెప్తే ఆయన కోప్పడతారని నేను మౌనంగా ఉండిపోయాను. కానీ త్వరగా గుడికి వెళ్లి, దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేస్తే మావారితో కలిసి షాపింగుకి వెళ్లొచ్చని ఆలోచించి నేను వెంటనే గుడికి వెళ్ళాను. నేను గుడిలో అడుగుపెట్టేసరికి మధ్యాహ్న ఆరతి మొదలుకాబోతోంది. నవగురువార వ్రతం చేస్తున్న 8వ గురువారంనాడు నాకు ఆరతిలో పాల్గొనే అవకాశం రావడం ఆశీర్వాదపూర్వకంగా అనిపించి చాలా సంతోషించాను. అప్పటికి నేను హారతికి హాజరై చాలారోజులై ఉండటంతో హారతిలో పాల్గొనే అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. కానీ నేను పెద్ద సందిగ్ధంలో పడ్డాను. కారణం నేను హారతిలో పాల్గొంటే  షాపింగుకి వెళ్లే అవకాశాన్ని కోల్పోతాను. అయినా హారతికి ఉన్నాను. హారతి కొనసాగుతుండగా, "బాబా! నాకు షాపింగుకి వెళ్లాలని ఉంది. మీరు ఏదైనా చేసి మావారు ఇంట్లో వేచి ఉండేలా చూడండి" అని ప్రార్థించాను. అలా జరిగితే ఈ అనుభవాన్ని పంచుకుంటానని కూడా బాబాను అడగబోయాను, కానీ సిల్లీగా ఉంటుందేమోనని ఆగిపోయాను. హారతి పూర్తయ్యాక నేను మావారికి ఫోన్ చేశాను కానీ, ఆయన ఫోన్ కట్ చేశారు. నేను త్వరత్వరగా ఇంటికి వెళితే మావారు ఇంట్లోనే కూర్చుని ఫోనులో మాట్లాడుతూ కనిపించారు. అనుకోకుండా తన సహోద్యోగి నుండి ఫోన్ వస్తే, ఆఫీస్ విషయాలు డిస్కస్ చేస్తున్నందున బయటకు వెళ్లలేకపోయానని మావారు చెప్పారు. బాబా నా సిల్లీ కోరికను కూడా నెరవేర్చారని నేను పట్టరాని సంతోషంతో, "థాంక్యూ సో మచ్ బాబా! నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. కోటి కోటి ప్రణామాలు బాబా!" అని చెప్పుకున్నాను.


కొడుకుని ప్రమాదం నుండి కాపాడిన దయాసముద్రుడైన సాయిబాబా

నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి నేను, నా ఐదేళ్ల కొడుకు ఒక సహాయకునితో యు.ఏ.ఈ నుండి ఇండియాకు బయలుదేరాము. ఏడేళ్ల కాలంలో నేనెప్పుడూ బాబా ఊదీగాని, ఆయనకు సంబంధించిన ఏ వస్తువుగాని తీసుకుని ప్రయాణం చేయలేదు. కానీ ఆసారి నేను ఇండియాలో నా నవగురువార వ్రతాన్ని ముగించాల్సి ఉండటంతో ఒక పసుపు రంగు వస్త్రం, ఊదీ, బాబా ఫోటో ఒకటి నా  హ్యాండ్‌బ్యాగులో పెట్టుకున్నాను. మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత మా అబ్బాయి నిద్రపోయాడు.  తను ఇండియా చేరుకునేవరకు పడుకునే ఉంటాడని నేను అనుకున్నాను. కానీ, ఒక గంటలోనే వాడు లేచాడు. ఇంకో గంటలో ఇండియాకి చేరుకుంటామనగా నాకెందుకో మా అబ్బాయి విషయంలో ఏదో జరగబోతుందన్న ప్రతికూల ఆలోచనలతో గుండె వేగంగా కొట్టుకోసాగింది. తన టెంపరేచర్ చూస్తే నార్మల్‌గానే ఉంది. నా మనసులో మాత్రం ఆందోళనగా ఉండడంతో వెంటనే ఊదీ తీసి వాడికి పెట్టి, "బాబా! మీరు మాకు తోడుగా ఉండి రక్షించండి" అని ప్రార్థించాను. మేము ముందు సీట్లలో ఉన్నందున ఫ్లైట్ ల్యాండ్ అవుతూనే త్వరగా బయటకు వచ్చాము. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ ఖాళీగా ఉండడంతో ముందు ఆ పని పూర్తి చేద్దామని నేను అనుకున్నాను. మా అబ్బాయి ఎప్పుడూ చలాకీగా ఆటలు ఆడుతూనే ఉంటాడు. అందువలన ఎస్కలేటర్ మీద కుదురుగా ఉండమని వాడిని హెచ్చరించి ఎస్కలేటర్ పైకి వెళ్ళాం. ఇంతలో మావారు ఫోన్ చేస్తే, "మేము ఇండియా చేరుకున్నాము. ఇమ్మిగ్రేషన్ గురించి వెళ్తున్నాన"ని చెప్తున్నాను. ఇంతలో మా వాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఏమిటా అని చూస్తే, వాడి కాలు ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయి, కాలు బయటికి తీయలేక ఏడుస్తున్నాడు. ఎస్కలేటర్‌లో పిల్లల కాళ్లు ఇరుక్కోవడం వలన జరిగే పరిణామాలకు సంబంధించిన వీడియోలు నా మదిలో మెదిలి, ఏమైనా జరుగుతుందేమోనని భయంతో చాలా కంగారుపడ్డాను. "బాబా! ఎటువంటి చెడు పరిణామాలు జరగకుండా మీరు మాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. ఇంతలో ఎస్కలేటర్ ఆగింది. వాడి కాలు బయటికి తీయడానికి ప్రయత్నిస్తే, ముందు షూ వచ్చింది కానీ, కాలు బయటికి రాలేదు. నెమ్మదిగా ప్రయత్నించగా కాలు బయటకు వచ్చింది. తన కాలికేమైనా గాయం అయివుంటుందేమోనని సాక్స్ తీసి చూసాను. ఆశ్చర్యం! తన కాలిపై చిన్నగా గీసుకున్న ఆనవాలు కూడా లేదు. అంతా బాబా కృప. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఈ పరిస్థితిలో మీరు లేకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉండేదో నేనసలు ఊహించలేను కూడా. మీరు మాపై చూపే ప్రేమకి  థాంక్స్ అన్నమాట చాలా చిన్నది".

ఇండియా చేరుకున్న తర్వాత వచ్చిన మొదటి గురువారంనాడు నేను నా నవగురువార వ్రతాన్ని పూర్తిచేసి స్వీట్స్, కొన్ని ఆహారపదార్థాలు, వ్రత పుస్తకాలు బాబామందిరంలో పంపిణి చేయాలని మందిరానికి వెళ్ళాము. అక్కడ బాబా దర్శనం కోసం భక్తుల రద్దీ చాలా ఉంది. నేను, మా సిస్టర్ లేడీస్ క్యూలో నిల్చొని, మా నాన్నని, మా అబ్బాయిని జెంట్స్ క్యూలో పంపించాం. కాసేపటికి అల్లరి పిల్లవాడైన మా అబ్బాయి తిరుగుతున్న ఫ్యాన్లో తన వేళ్ళు పెడుతుండటం హఠాత్తుగా మా సిస్టర్ గమనించి, "నాన్నా, వాడేం చేస్తున్నాడో చూడండి" అని గట్టిగా అరిచింది. కానీ అప్పటికే వాడు తన వేలు ఫ్యాన్‌లో పెట్టడం వలన ఫ్యాన్ శబ్దం మారిపోయింది. మేము వెంటనే గాభరాగా వాడి వద్దకు పరుగుతీసాము. ఇంతలో గుడిలో ఉన్న గార్డ్స్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి, "ఫస్ట్ ఎయిడ్ రూముకి వెళ్ళండి" అని చెప్పారు. కానీ ఆశ్చర్యం! వాడి వేళ్ళు నల్లగా అయ్యాయిగానీ ఎటువంటి గాయం కాలేదు. ఈసారి కూడా బాబా తన మిరాకిల్ చూపించారు. ఆయన దర్బారులో, ఆయన కళ్ళముందు ఎవరికైనా ఏ హాని అయినా ఎలా జరుగుతుంది? "మీ కృపకు చాలా చాలా ధన్యవాదములు బాబా".


తర్వాత ఒకరోజు నేను నా అత్తమామలతో ఫోనులో మాట్లాడుతున్నాను. మా అబ్బాయి నా చుట్టూ తిరుగుతూ ఆటలాడుతూ నా డ్రెస్సుకి అలంకరించబడివున్న ఒక స్టోన్‌ని తీసి తన నుదురు మీద బొట్టులా పెట్టుకుని తనని తాను చూసుకోవడానికి అద్దం వద్దకు పరుగుతీసాడు. అక్కడికి వెళ్ళాక హఠాత్తుగా ఆ స్టోన్ తన ముక్కులో పెట్టేసుకున్నాడు. తరువాత నా వద్దకు పరుగున వచ్చి విషయం చెప్పాడు. ఇక నాకు టెన్షన్ మొదలైంది. వెంటనే బాబాని ప్రార్థించి, మావాడికి ఊదీ పెట్టి, వాడిని తీసుకుని హాస్పిటల్‌కి పరుగుతీసాను. డాక్టర్ ENT స్పెషలిస్టుని సంప్రదించమని చెపితే, అతని వద్దకు వెళ్లి విషయం చెప్పాను. అతను ఏవో పరికరాలు వాడి ముక్కులో పెట్టి చెక్ చేసి, "ముక్కులో ఏమీ లేద"ని చెప్పారు. అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను. "బాబా! నా బిడ్డని కాపాడారు. మీకు నా కోటి ప్రణామాలు. థాంక్స్ అన్న మాట సరిపోదు బాబా. లవ్ యు సో మచ్! ఎప్పుడూ మాకు తోడుగా ఉండి రక్షణనిస్తూ ఉండండి. మీ బిడ్డలందరికీ మీ దివ్యపాదాల చెంత చోటివ్వండి".

సాయిభక్తుడు దాజీసాహెబ్ పట్వర్ధన్


1914 నాటికి బాబా కీర్తి నలుమూలలా వ్యాపించింది. ఒక్క మహారాష్ట్రలోనే ఆయనకు అసంఖ్యాక భక్తులున్నారు. అదేవిధంగా ఆయనను సందేహించేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో దాజీసాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతనొక పెద్ద అనుమాన పిశాచి. అటువంటి అతను బాబాకు అంకితభక్తునిగా ఎలా మార్పు చెందారో మనమిప్పుడు తెలుసుకుందాం.

దాజీ పూర్వీకులు సంగ్లీ జిల్లాలోని మీరజ్‌లో నివాసముండేవారు. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న కారణంగా వారికి 'సర్కార్' అనే బిరుదు ప్రదానం చేయబడింది. వాళ్ళది బాగా ధనిక కుటుంబం. విస్తారమైన వ్యవసాయ భూములు, ఒక పెద్ద వాడా కూడా ఉన్నాయి. ఆ వాడాలోనే వాళ్ల కుటుంబమంతా నివాసముండేది. దాజీ తాతగారైన హల్‌బాత్‌బాబా పట్వర్ధన్ గొప్ప సాధు సత్పురుషులు. ఆ కుటుంబమంతా గణేశుడిని పూజించేవారు. దాజీ కూడా గణేశుని అంకిత భక్తుడు. అతడు బాగా పుస్తకాలు చదువుతుండేవాడు. ఆ కాలానికి చెందిన మహాత్ముల చరిత్రలన్నీ చదివాడు. అయితే వాటిని భక్తి విశ్వాసాలతో కాకుండా కేవలం విశ్లేషణాత్మక దృష్టితో చదివేవాడు. "వాటిలో ఉన్న లీలలు నిజంగా జరిగాయా?" అని ఆశ్చర్యపడుతుండేవాడు. ఒకసారి అతని సన్నిహిత స్నేహితుడు, గొప్ప మహాత్ములైన సాయిబాబా దర్శనం చేసుకోవాలని తనకు ఉందని, కావున తనకి తోడుగా తనతోపాటు శిరిడీ రమ్మని దాజీని పిలిచాడు. బాబా ఒక ముస్లిం ఫకీరని, ఎంతోమంది హిందువులు ఆయనను అనుసరిస్తారని, వాళ్లలో కూడా ఎక్కువమంది బ్రాహ్మణులని, బాబా ఏదో మాయ చేసి వాళ్ళని తమవైపు తిప్పుకున్నారని, శిధిలమైన మసీదులో ఉంటారని, భిక్ష చేస్తారని, మసీదులో తులసిమొక్కను కూడా నాటారని దాజీ విని ఉండటం వలన శిరిడీ వెళ్ళడానికి విముఖత చూపాడు. ముఖ్యంగా అతన్ని ఎక్కువ చికాకు పెట్టింది, అందరూ నిజమని నమ్మే బాబా నీళ్లతో దీపాలు వెలిగించిన లీల. అయితే తానే స్వయంగా వెళ్లి బాబాని పరీక్షించి, ఆయనొక గారడీలమారి అని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు.

ఆ ఆలోచన ప్రకారం 1914, మే నెలలో దాజీ శిరిడీ ప్రయాణమయ్యాడు. ఈరోజుల్లోలాగా ఆరోజుల్లో శిరిడీ వెళ్లడం అంత సులువైన విషయమేమీ కాదు. అదొక సుదీర్ఘమైన దుర్భర ప్రయాణం. దాజీ మిరాజ్ నుంచి రైలులో పూణే వరకు ప్రయాణం చేసి, అక్కడ ఇంకొక రైలు పట్టుకుని మన్మాడ్ చేరి, అక్కడనుంచి కోపర్‌గాఁవ్ ప్రయాణమయ్యాడు. కోపర్‌గాఁవ్‌లో దిగాక చివరిగా టాంగాలో శిరిడీ వెళ్లాల్సి ఉంది. అప్పటికే అతడు సుదీర్ఘమైన, ప్రయాసకరమైన ప్రయాణంతో బాగా అలసిపోయి, బట్టలు మురికిపట్టిపోయి చాలా చికాకుగా ఉన్నాడు. అందువలన స్నానం చేసి బట్టలు మార్చుకుంటే కాస్తైనా ఉపశమనంగా ఉంటుందని ఆలోచిస్తూ రైల్వేస్టేషన్ బయటకు వచ్చాడు.

స్టేషన్ సమీపంలోనే  దాదాపు 60 అడుగుల లోతున్న ఒక పెద్ద బావి ఉంది. దాజీ బావి దగ్గరకి వెళ్లి లోపలకి చూసాడు. లోపల స్వచ్ఛమైన చల్లని నీళ్లు చాలా ఆకర్షణీయంగా కనిపించాయి. అప్పుడు దాజీ వయస్సు 20 సంవత్సరాలు. బలమైన యువకుడు, పైగా ఈతలో మంచి నైపుణ్యం కలవాడు కావడంతో ఎక్కువ ఆలోచించకుండా బావిలోకి దూకేసాడు. అది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యంతో, "ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలు తీసుకోవడానికి బావిలో దూకేసాడు" అంటూ కేకలు పెట్టారు. బావిలో పడ్డ దాజీకి తాను మునిగిపోతున్నానని అర్థమై, నిస్సహాయతతో చేతులు ఊపసాగాడు. కానీ తాను ఎంతగా ప్రయత్నించినా ఇంకా ఇంకా లోతుకి మునుగిపోతున్నాడు. నీటి లోపలనుండి పైకి రావడానికి, ఊపిరి తీసుకోవడానికి నిర్విరామంగా పోరాడాడు కానీ, ప్రయోజనం లేకపోయింది. ఇక కొద్దిక్షణాల్లో పూర్తిగా మునిగిపోయి తన ప్రాణాలు కోల్పోతానని అతను గ్రహించాడు. ఆ క్షణంలో అతనికి బాబా జ్ఞప్తికి వచ్చారు. వెంటనే, "బాబా! నిన్ను పరీక్షించడానికి అంతదూరంనుండి వచ్చాను. మీరు నాకు గొప్ప గుణపాఠం నేర్పారు. మిమ్మల్ని కలవకుండానే నన్నిప్పుడు స్వర్గానికి పంపుతున్నారు. నాకు ఈమధ్యనే వివాహమైంది. ఇంకా పిల్లలు కూడా లేరు. నా భార్య యుక్తవయస్సులోనే విధవరాలవుతుంది. దీన్నైనా దృష్టిలో పెట్టుకుని నా ప్రాణాన్ని కాపాడండి. మీరు నన్ను కాపాడితే, మిగిలిన నా జీవితమంతా మిమ్మల్ని భక్తితో పూజిస్తాను" అని మనస్సులోనే బాబాని ప్రార్థించాడు. మరుక్షణం ఒక రాయి కొన తన కాళ్లకు తగలడంతో దానిపై నిలుచున్నాడు. ఆ రాయి ఇంకా లోతుకు మునిగిపోకుండా అతనిని ఆపింది. తరువాత బావి అంచు గోడ పట్టుకొని నిదానంగా పైకి వచ్చే ప్రయత్నం చేసాడు. అప్పటికే అక్కడికి గుంపుగా చేరి ఉన్న గ్రామస్తులు అతనికి సహాయం అందించి సురక్షితంగా బయటికి లాగారు. దాజీ ప్రమాదంనుండి బయటపడుతూనే చేతులు జోడించి, తన ప్రాణాలు కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తరువాత ఒక టాంగా తీసుకుని శిరిడీ ప్రయాణమయ్యాడు. దాజీ ద్వారకామాయిలోకి ప్రవేశించిన వెంటనే బాబా, "అరే బ్రాహ్మణుడా! కనీసం ఇప్పుడైనా నమ్మకం వచ్చిందా?" అని పలకరించారు. దాజీ ముందుకు వెళ్లి సాష్టాంగపడి బాబా పాదాలు పట్టుకున్నాడు. అప్పటినుండి అతను బాబాకు అంకిత భక్తుడయ్యాడు. ప్రతిరోజూ ఉదయాన లేస్తూనే, "ఈ జీవితం బాబా ఇచ్చిన ప్రసాదమ"ని భావించేవాడు.

మనలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా గొప్పగా ఈ కష్టాలనే సముద్రాన్ని ఈది దాటగలమనుకుంటాము. నిజం చెప్పాలంటే మనం మునిగిపోతాం. అయితే సద్గురువుని ప్రార్థించి, శరణు పొందిన తరువాత ఆయన దయతో బయటికి లాగబడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటాము. ఒకసారి రక్షింపబడ్డాక, నిజంగా మనం ఎవరమన్న దానిమీద శ్రద్ధ పెట్టి, ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి. అందుకే బాబా, భావూని 'బ్రాహ్మణుడా' అని సంబోధించారు.


Ref: శ్రీసాయి సాగర్ మ్యాగజైన్, వాల్యూం 3, జనవరి - మార్చ్ 2013.
సోర్స్: Baba's divine manifestations by విన్నీ చిట్లూరి.

సాయిభక్త అనుభవమాలిక 9వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  • సాయి స్వప్నదర్శనంతో నన్ను అనుగ్రహించారు.
  • సాయిబాబా యందు విశ్వాసం

సాయి స్వప్నదర్శనంతో నన్ను అనుగ్రహించారు.

అమెరికా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడి అనుభవం : 

సాయిబంధువులందరికీ ఓం సాయిరామ్.
నేను ఐదువారాల సాయి దివ్యపూజ చేయాలన్న సంకల్పంతో 2018 జనవరిలో మొదలుపెట్టాను. మొదటి గురువారం పూజ ప్రారంభిస్తూ, "బాబా! నాకు స్వప్నంలో మీ దర్శనం ఇవ్వండి, ఆ దర్శనం ద్వారా నేను నా మనస్సులోని ఆందోళనలు, భయాలు, ప్రతికూల ఆలోచనల నుండి బయటపడేలా నన్ను ఆశీర్వదించండ"ని బాబాని ప్రార్థించాను. మూడోవారం నేను దివ్యపూజ పూర్తి చేసిన తరవాత బాబా నాకు స్వప్నంలో దర్శనమిచ్చారు. కలలో నేను నిద్రపోతున్నాను. కలలో నేను నిద్రలేచిన తరువాత నా నుదుటి మీద, ముఖం మీద ఊదీ ఉండటం చూశాను. నేను ఆశ్చర్యపోతూ నా భార్యను "నా ముఖంపై ఊదీ ఉందా?" అని అడగగా, ఆమె, "అవును, మీ ముఖంపై ఊదీ ఉంది" అని చెప్పింది. అప్పుడు నేను ఆమెను అదెలా వచ్చిందని అడిగాను. ఆమె ఏమోనంది! ఇంతలో నేను తల పైకెత్తి ఆకాశం వైపు చూశాను. ఆకాశంలో బాబా కనిపించి, నన్ను చూస్తూ నవ్వుతున్నారు. అది ఒక ఆనందకరమైన దర్శనం. వెంటనే నాకు మెలకువ వచ్చి లేచాను. కలను గుర్తుచేసుకొని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నేను బాబాను స్వప్న దర్శనమిమ్మని ప్రార్థించాను, అలాగే ఆయన దర్శనమిచ్చి, నేను నా ఆందోళనలు, భయాలు, ప్రతికూల ఆలోచనల నుండి పూర్తిగా బయటికి వస్తానన్న సూచనగా నా నుదుటిమీద ఊదీని పూసారు. బాబా ఆశీస్సుల వలన ఆయన కృపతో నేను ఈ సమస్యల నుండి చాలావరకు బయటకు వచ్చాను. తరువాత నా మానసికస్థితి చాలా అభివృద్ధి చెందింది. నేను ఇప్పుడు ఆ సమస్యల నుండి పూర్తిగా బయటపడ్డాను. "సాయిదేవా! మీ యందు నాకు పూర్తి విశ్వాసం ఉంది. మళ్ళీ అటువంటి ఆలోచనలు రాకుండా మీరు చూసుకుంటారు. సంతోషకరమైన దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించారు. మీకు నా కోటి కోటి ప్రణామములు బాబా! ఎక్కడెక్కడో ఉన్న మీ బిడ్డలందరి అవసరాలపట్ల మీరే శ్రద్ధ వహించండి బాబా!" మనల్ని సదా గమనిస్తూ, మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ ఉంటారు బాబా. నిజంగా ఆయన ప్రేమమూర్తి.


సాయిబాబా యందు విశ్వాసం


సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

సాయిబాబాయే నాకు తల్లి, తండ్రి. సాయిబాబా సర్వశక్తిమంతుడు. ఊహకందని ఎన్నో లీలలు ఆయన నా జీవితంలో చేసారు.

ఒకరోజు నేను పూజగదిలో బాబాని ప్రార్థిస్తూ, హఠాత్తుగా ఒక తెల్లని పేజీలో బాబా ముఖాన్ని చూశాను. ఆశ్చర్యంగా మళ్లీ చూసేసరికి అక్కడ ఏమీ లేదు. నేను అదేదో ఊహ అయివుంటుందనుకున్నాను. తర్వాత నా సోదరి అదే పేజీలో సాయిబాబా ఫోటో ప్రింట్ చేయిస్తానని చెప్పింది. అప్పుడు నాకర్థమైంది, సాయిబాబా నాకు ముందుగానే అది సూచించారని.


నేను దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాను. ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నా కానీ, నేను కోరుకున్న ఉద్యోగం నాకు లభించేది కాదు. ఎదురు చూసి చూసి నేను బాగా నిరాశ చెందాను. ఆ సమయంలో సాయిబాబాతో నాకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుని ప్రతిరాత్రి సాయిభక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా నా ప్రార్థనలను ఎందుకు వినట్లేదు? బహుశా నన్ను పరీక్షిస్తున్నారేమో!?" అనుకున్నాను. తరువాత నేను వ్రతం, సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. కానీ రోజులు గడుస్తున్నా పారాయణ పూర్తి చేయలేకపోయాను. నేను చాలా బద్ధకంగా ఉంటున్న ఆ స్థితిలో, "త్వరగా పారాయణ పూర్తి చేయి. ఇంటర్వ్యూ కాల్ వస్తుంది" అని సాయిబాబా చెబుతున్నట్లు నా మనస్సుకు అనిపించి, ఆ రోజు అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి చివరి అధ్యాయాలు పూర్తి చేశాను. మరుసటిరోజే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నా ఆనందానికి అవధుల్లేవు. చివరికి అన్ని రోజుల సహనం ఫలించింది. నేను కోరుకున్న ఉద్యోగం నాకు లభించింది. అంతేకాదు, నేను ఉద్యోగం చేసే చోటే నాకు కాబోయే నా భర్తని కూడా కలుసుకున్నాను. ఎప్పుడూ ఆశను కోల్పోకండి. బాబా ఉండగా భయమెందుకు?

సాయిభక్త అనుభవమాలిక 8వ భాగం....


బాబా చూపిన అపార అనుగ్రహం

నా పేరు పద్మ. మాది గుంటూరు. నేను పూజలు ఎక్కువగా చేయను గానీ, నిత్యం బాబా నాతో ఉన్నారన్న ధ్యాసతో ఆయనను తలుచుకుంటూ ఉంటాను. 2019, మార్చిలో మా అమ్మాయి మెడిసిన్ చివరి సంవత్సరం పరీక్షలు వ్రాసింది. తను చాలా బాగా చదువుతుంది. మొదటి రెండుపరీక్షలు బాగా వ్రాసింది కూడా. అయితే మూడవ పరీక్ష రేపనగా ముందురోజు ఉదయం తనకి వైరల్ ఫీవర్ వచ్చింది. దానికి తోడు విరోచనాలు మొదలయ్యాయి. దాదాపు పది, పదిహేనుసార్లు విరోచనాలు అయ్యేసరికి తను పూర్తిగా నీరసించిపోయింది. కనీసం పుస్తకం పట్టుకునే శక్తి కూడా లేక, పరీక్షకు ప్రిపేర్ కాలేక చాలా చాలా ఏడ్చింది. చివరికి పరీక్షమీద ఆశ వదిలేసుకుంది. మేము కూడా, "సరేలేమ్మా, పర్వాలేదు. వచ్చే సంవత్సరం వ్రాసుకుందువు" అని తనని ఓదార్చాము. ఆ రాత్రంతా తన పరిస్థితి అలానే ఉంది. టాయిలెట్‌కి వెళ్లడం, రావడం. అసలు రోజంతా ఆహారంలేక, ఆ విరోచనాలతో బాగా నీరసించిపోయి నడవలేని స్థితికి వచ్చింది. నిద్రమాత్ర వేసుకున్నా కాసేపు కూడా పడుకోలేక పోయింది. రాత్రంతా మాకెవరికీ కంటిమీద కునుకులేదు. "బాబా! మీరే ఏదో ఒకటి చేయండి" అని ప్రార్థిస్తూ ఉన్నాం. తను తెల్లవారాక కూడా పుస్తకం పట్టుకోలేక పోయింది. ఇక మేము పరీక్ష వ్రాయవద్దని పూర్తి నిర్ణయానికి వచ్చాము. తరువాత తన పరిస్థితి దారుణంగా ఉండటంతో 10 గంటలకి పరీక్షనగా 8 గంటల సమయంలో డాక్టరు వద్దకు తనని తీసుకుని వెళ్తూ డోర్ లాక్ చేస్తుండగా, తన ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది. మా అమ్మాయి అయితే మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. నేను తనతో మాట్లాడమని కాస్త నచ్చజెపితే మాట్లాడింది. పరీక్ష వ్రాయనని నిశ్చయించుకున్న తరువాత చివరి నిమిషంలో బాబా మిరాకిల్ చూపించారు. అందరి రూపంలో ఉన్న ఆ సాయినాథుడే తన ఫ్రెండ్ రూపంలో పరీక్షకు వెళ్లేందుకు తనని ఒప్పించారు. మేము వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి డాక్టరుని సంప్రదిస్తే, డాక్టరు కేవలం ఒకేఒక్క మాత్ర ఇచ్చారు. అంతవరకూ ఏ మందుకూ తగ్గనిది కాస్త ఉపశమనం కనిపించింది. మేము ఇంటికి వచ్చాక తన ఫ్రెండ్ కారు తీసుకుని మా ఇంటికి వచ్చి, మమ్మల్ని కారులో కాలేజీకి తీసుకుని వెళ్లారు. నేను కూడా తనతో పాటు కాలేజీకి వెళ్ళాను. ఏమాత్రం పరీక్షకు ప్రిపేర్ కానందున తను పరీక్షకు కూర్చోవడానికి ఇష్టపడకపోయినా తన ఫ్రెండ్స్ తనని ఒప్పించి కూర్చోబెట్టారు. అయినప్పటికీ దాదాపు అరగంటసేపు తను, "నేనేమీ చదవలేదు, నాకేమీ గుర్తురావడం లేదు" అని బాధపడుతూనే ఉండిపోయింది. బయట రిసెప్షన్ వద్ద కూర్చుని ఉన్న నాకు హఠాత్తుగా ఒక పెద్ద బాబా ఫోటో అక్కడ కనిపించింది. ఇక నేను ఆయనను చూస్తూ, "బాబా! తనకి సహాయం చేయండి" అని ప్రార్థించి, ఆయనను స్మరిస్తూ కూర్చున్నాను. చివరికి బాబా కృపతో తను పరీక్ష చాలా బాగా వ్రాసింది. ముందురోజంతా ఫీవర్, వాంతులు, విరోచనాలతో నీరసించిపోయిన అమ్మాయి, నడిచే ఓపికలేక, నడుము పట్టుకుని ఆపసోపాలు పడిన అమ్మాయి ఎటువంటి ఇబ్బందీ లేకుండా మూడు గంటల పాటు కూర్చుని పరీక్ష వ్రాసిందంటే అది బాబా అపార అనుగ్రహమే. ఆయన ఎప్పుడూ తన భక్తులకు అండగా ఉండి ఆదుకుంటారనడంలో సందేహమే లేదు.

సర్వం శ్రీ సాయినాథ దివ్యచరణారవిందార్పణమస్తు!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo