సాయిబాబా ది మాస్టర్(సాయి లీలామృతం పాత ముద్రణ)లో శ్రీఎక్కిరాల భరద్వాజగారు వ్రాసిన ఒక భక్తుని అనుభవం:
మానేపల్లి(హిందూపూర్ తాలూకా, ఆంధ్రప్రదేశ్) గ్రామస్తుడు చిరంజీవి వేణుగోపాల్ రెడ్డి అనే యువకునికి బాల్యం నుండి కనులు మూసుకున్నప్పుడు భుృకుటిలో వెలుగు కనిపించేది. అతను మంత్రముగ్ధుడై తన సమయమంతా ఆ కాంతిని గమనిస్తూ ఉండేవాడు. ఆటలూ, పాటలూ వంటి బాల్యంలో ఉండే కాలక్షేపాలపట్ల అతను ఆసక్తికనబరచకపోవడం, ఎప్పుడూ కనులు మూసుకొని ఉండడం వలన అతనిని భూతం ఏదైనా ఆవహించిందేమోనని ఇంట్లోవాళ్ళు భయపడి ఎందరో భూతవైద్యులను సంప్రదించారు. కానీ వాళ్ళ ప్రయత్నాల వల్ల ఏ మార్పు రాలేదు. చివరికొక సాధువు బాలుడిని భూతం ఆవహించడం వంటిదేమీ లేదు, పూర్వ జన్మ సంస్కారం వలన అతనికి సాధన అబ్బినదని తెలిపి దానిని కొనసాగించేందుకు అతనికి కొన్ని సూచనలు ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక వేణుగోపాల్‌కి వెలుగు మధ్యలో లక్ష్మిదేవి దర్శనమిచ్చి అతనితో మాట్లాడటం, శివలింగాలు, చిన్న విగ్రహాలు, కుంకుమ, విభూతి మొదలైనవి ప్రసాదించడం ఆరంభించింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇలా మహిమలు చేసే స్థాయినతిక్రమించాలని అతడెందరో సాధువులను కలిసాడు కాని, ఫలితం కన్పించలేదు. శ్రీశైలం(హఠకేశ్వరం)కి చెందిన శ్రీపూర్ణానందస్వామి 'సశరీరులుగా ఉన్న గురువు అతనికి అవసరం లేదని, లక్ష్మిదేవే అతన్ని పైస్థాయికి తీసుకువెళ్ళగలదని' చెప్పారు.
నాకు(ఎక్కిరాల భరద్వాజ) వేణుగోపాల్ గురించి తెలిసి సంతోషించాను కానీ, అంతటి స్థితినందిన తర్వాత ఎందరో మహిమల వలయంలో చిక్కి నైతికంగానూ, ఆధ్యాత్మికంగానూ పతనమైన సంగతి తెలిసి ఉంటంవల్ల అతని సరైన ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి ఆందోళనపడ్డాను. 1978, జనవరి 2న నేను శిరిడీ వెళ్ళినపుడు అతను గుర్తొచ్చి సాయిని ప్రార్థించి, తిరిగి వచ్చేప్పుడు 8వ తేదీన మానేపల్లిలో అతనిని కలుసుకున్నాను. అతను తన సంగతంతా చెప్పి నా సలహా కోరాడు. 'జ్ఞానానికి సద్గురువును ఆశ్రయించడమవసరమని, కనుక సద్గురువులలో మేటియైన శ్రీసాయినాథుని గురువుగా ఎన్నుకుని ధ్యానించమని' చెప్పాను. అది విని అతనెంతో సంతోషించాడు. కారణం కొద్దిరోజులముందు అతడు లక్ష్మిదేవిని ఉత్తమ ధ్యానస్థితికై ప్రార్ధించగా ఆమె నవ్వి ఊరుకున్నదట. తిరిగి అందుకు మార్గం సూచించమని కోరగా 'శిరిడీ సాయినాథుని గురువుగా ఎన్నుకొని ధ్యానించమని' చెప్పిందట. నేను శిరిడీ నుండి తిరిగి వస్తూ అనుకోకుండా అదే సలహా అతనికి ఇచ్చాను.
తర్వాత 22-3-78న వేణుగోపాల్ నాకిలా జాబు వ్రాశాడు: "నాకు 20వ తారీకు నుండి విద్యానగర్ పోవలెనని తీవ్రమైన కోరిక కలిగింది. కారణం మీ ధ్యానశక్తి అని నేను భావించాను. 21వ తేదీ, మంగళవారం సాయంత్రం గం.7:40ని.లకు నేను ధ్యానం చేస్తుండగా మీ దర్శనమైంది. అప్పుడు నేను ఆమ్మ(లక్ష్మీదేవి)ను తీవ్రంగా ధ్యానిస్తే, అమ్మ దర్శనమిచ్చి "నీవక్కడకి వెళ్ళిరా" అని చెప్పింది. నేను చాలా సంతోషించాను కాని పోవడానికి డబ్బు లేదు కదా అని ఊరుకున్నాను. 22వ తేదీ సాయంత్రం గం.9:10ని.లకు సాయి లీలామృతం తెరిస్తే, మళ్ళీ మీ దర్శనమైంది. మిమ్మల్ని కలవాలని గుర్తొచ్చింది కానీ, ఎలా వెళ్లాలని తీవ్ర ఆలోచనలో పడ్డాను. 23వ తేదీ గురువారం సాయంత్రం గం.5:50ని.లకు గురుచరిత్రలో 4వ అధ్యాయం పూర్తిచేసి 5వ అధ్యాయం మొదలుపెట్టినంతనే, నా మదిలో విద్యనగర్ వెళ్లాలనే ఆలోచన తళుక్కుమంది. వెంటనే, "డబ్బు గురించి చింతించక వెంటనే విద్యానగర్ వెళ్లేందుకు బయల్దేరు" అన్న మాటలు వినిపించాయి. అవి ఆమ్మ మాటలు కావు. ఆ మాటలు చాలా గంభీరంగా, లోతైన అర్థం ఉన్నట్లుగా ఉన్నాయి. అవి శ్రీసాయిబాబా మాటలని నాకు తోచింది. వెంటనే నాకు తీవ్ర సమాధి స్థితి కలిగి నాలుగు గంటలసేపు అలానే ఉండిపోయాను".
తర్వాత వేణుగోపాల్ విద్యానగర్ వచ్చి నాతో వారం రోజులు గడిపాడు. ఆ సమయంలో అతను శ్రీమాణిక్యప్రభు, అక్కల్ కోటస్వామి, మిలారెపావంటి యోగుల చరిత్రలను, నేను దర్శించిన కొంతమంది సత్పురుషుల చరిత్రలు శ్రద్ధగా చదివాడు. ఒకరోజు ధ్యానంలో అమ్మ అతనిని ఇక్కడ విద్యానగర్‍లో నిర్మించనున్న మందిర స్థలానికి వెళ్ళమని ఆజ్ఞాపించి, అక్కడ అతని చేతికి అక్షతలిచ్చి, ఆ ప్రదేశంలో చల్లమని చెప్పి, 'మందిర నిర్మాణం విజయవంతంగా కొనసాగుతుందని, అభివృద్ధిలోకి వస్తుందని' కూడా చెప్పారట.
తరువాత ఒకనాడు నాకు స్వప్నంలో రాగి రేకు మీద తెలుగులో "వేణుగోపాల్ మహిమలలో చిక్కి ఆధ్యాత్మికంగా పతనమయ్యే అవకాశం ఉంది" అన్న అక్షరాలు కన్పించాయి. నేనెంతో ఆలోచించి అతనికా విషయం వ్రాశాను. అతడు 22-5-78న "ఓం శ్రీభరద్వాజగారికి నమస్కరిస్తూ వేణు వ్రాయడము. మందిరం పనులన్నీ సక్రమంగా జరగాలని అమ్మను బాగా వేడుకొన్నాను, 'నా అనుగ్రహమూ, మహాత్ముల ఆశీర్వాదాలూ పూర్తిగా మందిరానికి ఉన్నాయి, త్వరగానే అన్ని కార్యక్రమాలూ జరుగున'ని అమ్మ అన్నారు. మీరు మీ లేఖలో మహిమలవలన పతనమయ్యే ప్రమాదముందని వ్రాసారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చెప్పింది ముమ్మాటికీ వాస్తవం. సాధనచేస్తే ఒక స్థితిలో మహిమలొస్తాయి. పూర్ణులు కావాలంటే మహిమలు విడిచి ఇంకా పైస్థితినందుకోవాలి. ఆ పైస్థితి నాకు కొంచం అనుభవముంది. కాని ఆ స్థితిలో కొద్దిసేపుంటానో, లేదో మరలా మనస్సు మహిమలస్థితికొస్తుంది. మరలా కొద్దిపాటి ప్రయత్నంతో పైస్థితి కలుగుతుంది. ఆ స్థితిలో మనసు, ప్రపంచం, శరీరం ఏమీ గోచరించవు, శూన్యంగా ఉంటుంది. ఆ స్థితి రోజులో ఒక గంటసేపు మాత్రమే ఉంటుంది. మహాత్ములెప్పుడూ ఆ స్థితిలో ఉంటారని వారి చరిత్రలలో నేను చదివాను. శ్రీపూర్ణానందస్వామి అది నిర్వికల్ప సమాధి అని చెప్పారు. నేను ఆస్థితికోసం ప్రయత్నిస్తున్నాను. ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మ దర్శనమౌతుంది. అమ్మ రూపాన్నే తదేకంగా చూస్తూ ఉంటే అమ్మ నాలోనూ, నేను అమ్మలోనూ ఉన్నట్లు తెలుస్తుంది. అట్లా కొద్దిసేపు మాత్రమే అనుభవమౌతుంది. అమ్మ దర్శనమైనప్పుడు మాత్రమే మహిమలు చూవడానికి వీలౌతుంది. కానీ సాధకులకు మహిమల వలన ఏమీ ప్రయోజనం లేదు. అంతకు పైస్థితిలో జరిగే మహిమలు వేరు. నేను అమ్మను పైస్థితి గలిగేటట్లు చేయమని అడిగితే, కొంతకాలం తర్వాత నేను ఆ స్థితిని పొందుతానని ఆమె నాతో చెప్పింది. శ్రీశివబాలయోగి కూడా అదే చెప్పారు. నేను ఆ స్థితి గురించి అమ్మను అడుగుతున్నప్పుడల్లా ఆమె నా మనసును శిరిడీ శ్రీసాయిబాబా వైపుకు మళ్ళిస్తుంది. నేను ఆయనపై దృష్టి పెట్టినప్పుడు పైస్థితిలో ఎక్కువకాలం ఉండగలుగుతున్నాను. నేను తొందరగా పైస్థితినందుకొనేట్లుగా, ఎప్పుడూ ఆ స్థితిలోనే పుండేట్లు మీరు కూడా బాబాను ప్రార్ధించండి. ఇక్కడ సాయిచరిత్ర, గురుచరిత్ర పారాయణం, భజన జరుగుతున్నాయి. సాయిబాబా భజన వ్రాసి పంపండి. వీలు చేసుకుని మీరు రాగలరని ప్రార్థిస్తున్నాను".
తర్వాత వేణుగోపాల్ ఇలా వ్రాసారు: "నేను 1978, జూన్ 1న శిరిడీ వెళ్లి, అక్కడ మూడురోజులున్నాను. బాబా దర్శనం, అక్కడి వాతావరణం ఉత్సాహకరంగా ఉన్నాయి. బాబాను దర్శించినప్పటి నుండీ నా ఆధ్యాత్మిక స్థితిలో మార్పు వచ్చింది. ఇప్పటివరకు నేను ధ్యానంలో కొద్దిసేపు మాత్రమే ఉండగలిగేవాడిని. మిగిలిన సమయం నేను వ్యవసాయం చేసేవాడిని. కానీ బాబా దర్శనమైనప్పటి నుండి నేను చాలా సమయం ధ్యానంలో ఉండగలుగుతున్నాను. ఈ మార్పు అయస్కాంతం వల్ల ఇనుపముక్కలో వచ్చేటటువంటిది. నా మనసుకి వ్యవసాయం చేయాలనిపించడం లేదు. బాబా కృపవల్ల అలా చేయవలసిన అవసరం ఇప్పుడు లేదు. నేను నా ఎక్కువ సమయాన్ని బాబా సేవకే కేటాయించగలుగుతున్నాను".
తర్వాత 30-11-78న వేణుగోపాల్ ఇలా వ్రాశాడు: "1978, జూలై 22, శనివారం నాడంతా నేను ధ్యానంలో గడపాలనుకున్నాను. నేను రాత్రి భోజనానంతరం 9 గంటలకి ధ్యానంలో కూర్చోగా గం.10:46ని.లకు అమ్మ దర్శనమిచ్చి "రేపు తెల్లవారుజామున నీకు గురుప్రసాదం లభిస్తుంది" అని చెప్పింది. నేను, "అమ్మా! నాకు గురువెవరమ్మా మీరు తప్ప!" అని అమ్మను అడిగాను. అందుకు అమ్మ, "ఇంకెవరున్నారు! ఆ సాయిబాబా. వారి సంపూర్ణ దర్శనం, ప్రసాదమూ నీకు లభిస్తాయి" అని బదులిచ్చింది. నేను అలాగే కూర్చున్నాను, నా మనసు బాబానామం వల్లించడంలో నిలిచింది. సుమారు రాత్రి గం.2:20ని.లకు నేను పడుకుంటే, వెంటనే గజ్జల శబ్దం, "గురుప్రసాదం లభించగలదు. ధ్యానమగ్నుడవుకమ్ము!" అని అమ్మ మాటలు వినిపించాయి. రాత్రి సమయమైనందున నాకు భయమేసింది. తర్వాత సరిగ్గా గం.3:30ని.లకు నా గదంతా ఒక దివ్యకాంతితో నిండిపోయింది. నేను ఒకవైపు సంతోషంతో, మరొవైపు ఆశ్చర్యంతో బాబా నామం ఉచ్చరిస్తున్నాను. అకస్మాత్తుగా నా కుడిప్రక్క కొద్దిదూరంలో బాబా నిలబడి కనిపించారు. నేను జాగురూకతతో ఉన్నానో, లేదో తెలుసుకోవడానికి నా శరీరం కొంచం కదిలించాను. బాబా నవ్వుతూ, "అరే, లక్ష్మికా బేటా! ఇది తీసుకో" అని నా చేతిలో ఊదీ వంటిది(గోధుమపిండిలా ఉంది) వేశారు. నేను మౌనంగా ఆయననే చూస్తున్నాను. బాబా కన్నులు ఎఱ్ఱగా, భయంకరంగా వున్నాయికాని వారి ముఖం చిరునవ్వుతో అందంగా ఉంది. ఆయనేదో మాటాడుతున్నారు. ఆ మాటలు మరాఠిలా ఉన్నాయి. నేను వాటిని అర్ధం చేసుకోలేకపోయాను. అప్పుడు బాబా నవ్వుతూ తెలుగులో, "నేను ఇచ్చినదాన్ని పూజలో భద్రంగా ఉంచు. కొద్దిగా పాలలో వేసుకొని తాగితే, అది వ్యాధులను నయం చేస్తుంది" అని చెప్పారు. అంతలో సామూహికముగా భజన చేస్తున్నట్లు విన్నాను, అదీ బహుశా హిందీలో. బాబా ఎడమ చేతిలో భిక్షచేసే జోలెలు రెండున్నాయి. వాటిలో ఒకదానిమీద ఓర్పు, రెండవ దానిమీన నిష్ట అని వ్రాసి ఉన్నాయి. బాబా వాటిని నా(శిరస్సు)పైకి విసిరి, "ఎల్లప్పుడూ ఈ రెండింటిని వృద్ధిపరుచుకో" అని చెప్పారు. బాబా మోకాళ్ళవరకూ జుబ్బా పట్టుకుని ఉన్నారు. ఆయన కుడిచేతిలో ఏమీలేదు. ఆయన ముందు దూపం వంటి పొగ నిదానంగా పైకి వెళ్తుంది. నేను భయభక్తులతో, "బాబా! నేనెప్పుడూ సమాధిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నాను. అందుకాయన, "అలా ఉండనవసరం లేదు. రోజుకు ఆరుగంటలు ధ్యానం చేయి. నిరంతరం 'ఓం సాయిబాబా' అని జపిస్తూ ఉండు. అది చాలు. నీకు ధ్యానంలో ఏదైనా అవాంతరం ఎదురైనప్పుడల్లా నీ ఈ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకో" అని చెప్పారు. కొన్ని నిమషాల తర్వాత భక్తులు ఆరతికోసం ఆయన దగ్గరకి వచ్చినట్లు అనిపించింది. వెంటనే బాబా అదృశ్యమయ్యారు. నేను, 'బాబా బాబా!' అని అరుస్తూ కింద పడిపోయాను. గదంతా చీకటి ఆవరించింది. అప్పుడు ఉదయం 5:45 అయింది. బాబా ఇచ్చిన ఊదీ నా చేతిలో చెక్కు చెదరకుండా ఉంది. దానిని పూజలో దాచాను. బాబా ఇంకా కొన్ని రహస్యాలు చెప్పారు. వాటిని వ్రాయడానికి కాని, చెప్పడానికి కాని వీలులేదు. అమ్మ నాకు చాలామార్లు దర్శనమిచ్చింది గాని బాబా దర్శనం మాదిరిగా లేదు. ఈ విషయాన్ని 'వ్రాయి వ్రాయి' అని తీవ్రంగా అనిపించింది. ఎంత రాయకూడదనుకున్నా బాబానే వ్రాయించినట్టు నా మనసుకి తోస్తుంది"....
