|
సాయి వచనం:-
|
|
|
తాత్యాకోతేపాటిల్ - నాలుగవ భాగం...
సాయిభక్తుల అనుభవమాలిక 950వ భాగం....
1. ఆపదలందు రక్షకుడు శ్రీ సాయినాథుడు
2. బాబా ప్రసాదించిన అద్భుత దర్శనం - అమోఘమైన ఊదీ మహిమ
3. నాన్నపై సాయి అనుగ్రహం
ఆపదలందు రక్షకుడు శ్రీ సాయినాథుడు
ముందుగా మన బ్రహ్మాండనాయకుడు సాయినాథునికి నా నమస్కారాలు. నా పేరు మహేష్. మాది సిద్దిపేట జిల్లా. ఈమధ్య నేను మా స్నేహితులతో కలిసి వ్యాక్సిన్ వేసుకున్నాను. తరువాత జ్వరం వస్తుందేమోనని భయపడి, "బాబా! నాకు ఏ జ్వరం రాకుండా ఆరోగ్యంగా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. బాబా దయవలన నాకు జ్వరం రాలేదు. తరువాత సెప్టెంబర్ 30న మా అక్క కూడా వ్యాక్సిన్ వేసుకుంది. తనకి చాలా జ్వరం వచ్చిందని ఆరోజు సాయంత్రం మా బావ ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను, "అక్కకి జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. కాసేపయ్యాక నేను ఫోన్ చేస్తే, "కొంచం తగ్గింది" అని అక్క చెప్పింది. "ధన్యవాదాలు బాబా. అక్కకి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించండి సాయిదేవా".
ఒకరోజు రాత్రి హఠాత్తుగా నాకు తట్టుకోలేనంత విపరీతమైన తలనొప్పి మొదలయ్యింది. అప్పుడు నేను బాధతో, "బాబా! ఈ తలనొప్పి తగ్గి, నాకు నిద్రపడితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా కరుణతో వెంటనే తలనొప్పి తగ్గి, నాకు నిద్రపట్టింది. ఇలాగే ఇంకో రోజు రాత్రి కూడా విపరీతంగా తలనొప్పి వచ్చింది. అప్పుడు కూడా నేను బాబాను వేడుకోగానే నెమ్మదిగా తలనొప్పి తగ్గుముఖం పట్టింది. "నాకు తరచూ వచ్చే ఈ తలనొప్పి నుండి విముక్తుని ప్రసాదించండి బాబా".
ఒకసారి నాకు డబ్బులు అవసరమై హైదరాబాదులో ఉన్న అక్క వాళ్ళ దగ్గరకి వెళ్లి ఒక ఐదురోజులు పని చేసుకుందామని అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్లేసరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో పనికి వెళ్ళటం కుదరలేదు. అప్పుడు నేను, "బాబా! నా ఆరోగ్యం మంచిగా ఉండి, పని మంచిగా జరిగి, నాకు కావలసిన డబ్బులు వస్తే నేను నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో నేను కోరుకున్నట్లు నాకు అంతా మంచే జరిగింది. బాబా నాపై చూపుతున్న అనుగ్రహాన్ని చూస్తుంటే బాబా ఎల్లప్పుడూ నాతోనే ఉన్నట్లనిపిస్తుంది. నేను పిలవగానే, బాబా నన్ను, మా కుటుంబాన్ని రక్షిస్తున్నారు. ఆపదలందు రక్షకుడు మన శ్రీసాయినాథుడు. "ధన్యవాదాలు బాబా. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి.
బాబా ప్రసాదించిన అద్భుత దర్శనం - అమోఘమైన ఊదీ మహిమ
సాయినాథునికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహకులకు ధన్యవాదాలు. నా పేరు మురళీమోహన్. నేను సాయిబాబాను చాలాకాలంగా కొలుస్తున్నాను. నేను బాబా దయవల్ల 1999లో మొదటిసారి శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. అందులోని చావడి ఉత్సవానికి సంబంధించిన సన్నివేశాలు నాకు చాలా బాగా నచ్చాయి, నా మనసును ఎంతగానో హత్తుకున్నాయి. అందువల్ల ఆ ఉత్సవాన్ని చూడాలని నాకనిపించింది. ఆ రోజు రాత్రి కలలో ఐదుగురు వ్యక్తులు బాబాని పల్లకిలో ఊరేగిస్తునట్లు దర్శనమైంది. నేను మేల్కొన్న తరువాత 'కలే కదా!' అని అనుకున్నాను. మూడునెలల తరువాత అదే సంవత్సరం నేను మొదటిసారి శిరిడీ వెళ్లి బాబాని దర్శించాను. బాబా దర్శనంతో నా ఆనందానికి అవధుల్లేవు. శిరిడీలో నేనున్న మూడురోజుల్లో నాకు చాలా అనుభవాలు జరిగాయి. చివరి రోజు తిరుగు ప్రయాణమయ్యే ముందు బాబా దర్శనం చేసుకుని నా గదికి వెళ్లాను. అంతే, మూడు నెలలకు ముందు కలలో నేను చూసిన అదే పల్లకి, అదే మనుషులు బాబాని ఊరేగిస్తూ కనిపించారు. పది నిమిషాలపాటు నా ఆనందానికి అవధుల్లేవు. అంతలో హఠాత్తుగా ఎవ్వరూ లేరు. నాకేమీ అర్థం కాలేదు. అక్కడున్న అందరినీ, "పల్లకి ఉత్సవం చూసారా?" అని అడిగాను. వాళ్ళు లేదన్నారు. అందుకు నేను ఆశ్చర్యపోతూ, "అదేంటి, ఇప్పుడే కదా, మీ అందరి ముందుగా ఈ గది నుంచి పల్లకి వెళ్ళింది" అని అన్నాను. వాళ్ళు, "లేదు మాకేమీ కనిపించలేదు" అన్నారు. నాకంతా అయోమయంగా అనిపించి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాను. ఇప్పటికీ నేను అదంతా నమ్మలేకపోతున్నాను. కానీ ఏదేమైనా కలలో కనిపించిన పల్లకి ఉత్సవాన్ని మెలకువలో నా కన్నులకు ప్రత్యక్షంగా చూపించారు బాబా. నిజంగా అది ఓ అద్భుత దర్శనం. అదేకాక కోపర్గావ్ నుండి కాలినడకన నేను తెచ్చిన గోదావరి నది జలాలతో తమ సమాధికి అభిషేకం చేయించుకున్నారు బాబా. ఇది నా మొదటి అనుభవం.
ఇప్పుడు అదే సంవత్సరం బాబా ప్రసాదించిన అమోఘమైన ఊదీ మహిమను చెప్తాను. అప్పటికి ఎన్నో సంవత్సరాలుగా నా తలలో బఠాణిగింజ పరిమాణంలో రబ్బరు వంటి ఒక కురుపు ఉండేది. హెయిర్ కట్ కోసం ఎప్పుడు సెలూన్ కి వెళ్ళినా పొరపాటున ఆ కురుపు కట్ అయి బ్లీడింగ్ అవుతుండేది. ఆ కురుపు కారణంగా నేను చాలా బాధను అనుభవించాను. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. ఖచ్చితంగా చెప్పాలంటే దానికి సరియైన మందు లేదని డాక్టరు చెప్పారు. దాంతో నేను హోమియో మందులు కూడా వాడాను. అయినా ఆ కురుపు తగ్గలేదు. ఇక చసేది లేక చివరిసారిగా శిరిడీలో సాయిబాబా సమాధికి ఊదీని తాకించి, "బాబా! ఈ ఊదీని నా తలపై ఉన్న కురుపుకి రాస్తాను. మీలో మహిమ ఉంటే, ఆ కురుపు తగ్గిపోవాలి" అని అనుకుని కురుపుపై ఊదీ పెట్టాను. అదే రోజు సాయంత్రం నేను హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యాను. మరుసటిరోజు ఉదయం నేను నా తలలో చెయ్యిపెట్టి ఆశ్చర్యపోయాను. అన్ని సంవత్సరాలుగా ఉన్న కురుపు పూర్తిగా తగ్గిపోయింది. ఆ భాగంలో నొప్పి మాత్రం ఉంది. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. "బాబా! నేను తెలిసీతెలియక కొన్ని తప్పులు చేశాను. నన్ను క్షమించండి. ఎల్లపుడూ మీ నామస్మరణ చేసేలా అనుగ్రహించండి. నేను ఇంతవరకూ జీవితంలో స్థిరపడలేదు బాబా. తొందరగా మంచి ఉద్యోగాన్నిచ్చి నేను అనుభవిస్తున్న మానసిక క్షోభ నుండి విముక్తి ప్రసాదించండి బాబా".
సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నాన్నపై సాయి అనుగ్రహం
సాయిభక్తులందరికీ మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నమస్కారం. నా పేరు రాజు. నేను సాయి భక్తుడిని. నేను శ్వాసించే శ్వాస, వేసే ప్రతి అడుగు సాయి వలనే జరుగుతున్నాయని బలంగా నమ్ముతాను. పది నెలల క్రితం మా నాన్నగారికి కరోనా వచ్చి ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్నారు. బాబా దయవల్ల నాన్న తొందరగానే కోలుకున్నారు. 90 రోజుల తరువాత అమ్మ, నాన్నలిద్దరూ మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. తరువాత కొన్నిరోజులకి నాన్నకి జ్వరం వచ్చి కొద్ది రోజులు బాధపడ్డారు. అప్పుడు నేను మనసులో, "నాన్నకు ఏ కష్టమూ లేకుండా తొందరగా జ్వరం తగ్గేలా అనుగ్రహించు తండ్రీ" అని బాబాను కోరుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా నాన్నకి జ్వరం తగ్గించారు. "చాలా చాలా థాంక్స్ బాబా. ఈ అనుభవాన్ని చాలా ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా". మళ్ళీ ఇంకొక అనుభవంతో కలుస్తాను.
సాయిభక్తుల అనుభవమాలిక 949వ భాగం....
1. 'ఏమీ భయపడకు! నేనెప్పుడూ కాపలా కాస్తున్నాను'
2. చిన్న సమస్యతో సరిపెట్టిన బాబా
'ఏమీ భయపడకు! నేనెప్పుడూ కాపలా కాస్తున్నాను'
ఓం నమో శ్రీసాయినాథాయ. నేను విశాఖపట్నం నుండి వెంకట శ్రీదేవి. బాబా నాకు ప్రసాదించిన వివిధ అనుభవాలను మీతో పంచుకోవాలని ఇలా వ్రాస్తున్నాను. ముందుగా ఈ బ్లాగును ఆదరిస్తూ తమ తమ అనుభవాలను పంచుకుంటూ అడుగడుగునా, అణువణువునా సాయితండ్రే నిండి ఉన్నారన్న నమ్మకం కలిగిస్తున్న భక్తులకు ఇంకా సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ప్రతి ఉదయం నా నిత్య దైవారాధన పూర్తికాగానే ముందుగా ఈ బ్లాగులోని భక్తులు అనుభవాలను (ఆధునిక సాయి సచ్చరిత్రను)చదివాక నా రోజువారీ పనులు మొదలుపెడతాను.
ఒకసారి నేను ఒకటిన్నర సంవత్సరంగా ద్వారకాతిరుమల వెళ్లి మ్రొక్కు తీర్చుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నా పలురకాల కారణాల వల్ల అది వాయిదాపడుతూ వచ్చింది. ఆ క్రమంలో విచిత్రంగా, 2021 వినాయకచవితి సమయంలో వరుసగా మూడురోజులు సెలవులు వచ్చాయి. ఇక అప్పుడు వెళ్ళొద్దామని నాకు బలంగా అనిపించింది. అయితే మావారికి శనివారం ఒక్కరోజే పర్మిషన్ దొరికింది. మరుసటిరోజు ఆదివారం అయినప్పటికీ ఆయన విశాఖలో ఉండాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి భక్తిశ్రద్ధలతో వినాయకచవితి జరుపుకుని మరునాడు శనివారం వేకువఝామున 5 గంటలకు ద్వారకాతిరుమల బయలుదేరాము. మాతోపాటు సాయిసచ్చరిత్ర, బాబా జీవితచరిత్ర, శిరిడీ నుండి తెచ్చుకున్న బాబా శేషవస్త్రం రక్షగా తీసుకుని వెళ్ళాము. ఎందుకంటే, కారులో ప్రయాణం, అదీ 24 గంటల్లో తిరిగి విశాఖ చేరుకోవాలి. అందువలన ఏ ఇబ్బందీ లేకుండా బాబానే మా ప్రయాణాన్ని సాఫీగా జరిపించాలని గట్టిగా సంకల్పించుకుని బయలుదేరాము. కొంతదూరం వెళ్ళాక నేను మన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ఓపెన్ చేశాను. అక్కడ 'బాబా దయతో ఎప్పటినుండో, ఎంతగానో అనుకుంటున్న తిరుపతి బాలాజీ దర్శనం ఎలా సాధ్యమయిందో, బాబా ఎలా తనకి మార్గం సుగమం చేశారో' ఒక భక్తురాలు పంచుకున్న అనుభవం కనబడగానే నా ఒళ్ళు పులకరించిపోయిందంటే నమ్మండి. ఆనందాశ్రువులతో ఆ భక్తురాలి అనుభవం చదివి ఎంతో ఆశ్చర్యపోయాను. నేను ఎదురుచూస్తున్నది ద్వారకాతిరుమల వెంకన్న దర్శనం కోసం, మ్రొక్కు తీర్చుకోవడానికైతే, ఆ భక్తురాలు తిరుపతి వెంకన్న దర్శనం కోసం. బాబా దయతో ఆమె కోరిక నెరవేర్చిన అనుభవం అదేరోజు బ్లాగులో రావడం, తద్వారా నేను కూడా వారి దయతోనే ద్వారకాతిరుమలకు బయలుదేరానని నాకు తెలిసేలా చేశారు బాబా. ఆయన దయతో ముందుగా అన్నవరం, తరువాత చిన్నతిరుపతి దర్శనాలు చక్కగా పూర్తిచేసుకున్నాము.
అక్కడినుండి భీమవరం మావుళ్ళమ్మవారి దర్శనానికి బయలుదేరాము. దారి కనుక్కుంటూ సాయంత్రం 6 గంటలకి భీమవరం చేరుకున్నాము. తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో ఒకచోట టీ స్టాల్ దగ్గర ఆగి విచారిస్తే, "తాడేపల్లిగూడెం రోడ్డు బాగాలేదు, వీరవాసరం వైపుగా వెళ్లి హైవేకి చేరుకోవచ్చు" అని చెప్పారు. దాంతో వాళ్ళు చెప్పిన మార్గంగుండా గూగుల్ మ్యాప్ సహాయంతో వెళదామనుకున్నాము. అయితే అప్పటికే చీకటి పడిపోయింది. దారులు తెలీవు, ఊరిపేర్లు తెలిపే బోర్డులు కూడా లేవు. అందువలన వాళ్లని, వీళ్ళని అడుగుతూ కటిక చీకటి, గోతులమయమైన రహదారిలో ఎక్కడ ఏం జరిగినా, కారుకి రిపేర్ వచ్చినా మా పరిస్థితి ఊహకందనంత భయంకరంగా ఉంది. అయితే భయమెంత ఉన్నప్పటికీ మనకు బాబా అండగా ఉన్నారన్న నమ్మకం అంతకన్నా ఎక్కువగా ఉంది. నేను నా బ్యాగులో ఉన్న సాయిబాబా జీవితచరిత్ర పుస్తకం బయటకి తీసి కారు స్టీరింగు ముందుభాగంలో పెట్టి, "సాయీ! నా తండ్రీ! నువ్వే క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చాలి" అని దణ్ణం పెట్టుకున్నాను. పదేపదే బాబా చరణాలను గట్టిగా పట్టుకుని మనసులోనే ప్రార్థిస్తున్నాను. అంతలో ఒరిస్సా రిజిస్ట్రేషన్ గల ఒక తెల్లని కారు మా ముందు వెళ్తూ కనపడింది. దాని వెనుకభాగంలో సాయిబాబా స్టిక్కర్ ఉంది. వెంటనే నేను మావారితో, "అనుమానం లేదు. ఆ కారుని అనుసరిస్తూ పోండి" అని చెప్పాను. ఆ కారు వైజాగ్ వరకు వెళ్తుందని మేము అనుకున్నాముగానీ, కాదు. ఓ చోట ఆ కారు నడుపుతున్న అతనితో మాట్లాడితే, దగ్గరలో వాళ్ళ సొంత ఊరు ఉందనీ, ఇంకా మేము వెళ్లాల్సిన దారి కూడా చెప్పి ఒక మలుపు తీసుకుని వెళ్ళిపోయారు. చిమ్మచీకటి దారిలో సుమారు 35 కిలోమీటర్లు ఆ కారును అనుసరిస్తూ బాగా లైట్లు ఉన్న ఊరి వరకు చేరుకున్నాము. మా రెండు కార్లు తప్ప జన సంచారం కూడా లేని ఆ మార్గంలో బాబానే ఆ కారు రూపంలో మాకు తోడుగా ఉండి, మా ప్రయాణాన్ని ముందుకు నడిపించారు. మొత్తానికి అతికష్టంమీద పెనుగొండ జంక్షన్‍కి చేరుకున్నాము. అక్కడ మలుపు తిరిగితే హైవేకి చేరుకుంటామని అనుకున్నాము. కానీ మావారు ఒక ఆటోడ్రైవరుని అడిగితే, పెరవలి వరకూ వెళ్లాలన్నారు. అంటే, మరో 20 కిలోమీటర్ల దూరమన్నమాట. కొంతదూరం వెళ్ళాక ఒక బడ్డీకొట్టు దగ్గర జనం కనిపించారు. నేను మావారితో, "వాళ్ళని అడిగి చూద్దాం. ఇప్పటికే 8:45 అయింది. నాకెందుకో ఆ జనాన్ని అడగమని బాబా ప్రేరణ ఇస్తున్నారు" అని అన్నాను. వాళ్ళని అడిగితే వాళ్ళు, "పెరవలి వరకూ ఎందుకు?" అని చెప్పి, ఆ బడ్డీకి పక్కనే ఉన్న ఒక చిన్న రోడ్డు చూపించి, "ఈ రోడ్డు గుండా వెళితే 3 కిలోమీటర్ల ప్రయాణంతో హైవే చేరుకుంటారు" అని చెప్పారు. దాంతో ఆ మార్గాన్ని బాబానే చూపించారని ఆ మార్గంగుండా ప్రయాణం సాగించాము. చిమ్మచీకటిమయమైన ఆ ఇరుకు మార్గం వెంబడి మూడు కిలోమీటర్లు ప్రయాణించేసరికి నేషనల్ హైవే వచ్చింది. ఉదయం నుంచి ప్రయాణం చేసి చేసి అలసిపోయి ఉన్నాం, పైగా నిద్ర కూడా వస్తుంది. అయినా మా ప్రయాణాన్ని సాగించి వేకువఝామున 3:30కి ఇంటికి చేరుకున్నాము. మొత్తం యాత్రలో మాకు తోడుగా ఉండి క్షేమంగా ఇల్లు చేర్చింది బాబానే, సందేహమేమీలేదు. "ధన్యవాదాలు బాబా".
2021, సెప్టెంబర్ 23, గురువారం నేను స్కూలుకి బయలుదేరే హడావిడిలో నా చెవిదిద్దు ఎక్కడో పడేసుకున్నాను. స్కూలుకు వెళ్ళాక ఆ విషయం గ్రహించి, 'ఎక్కడ పడిపోయిందో ఏమిటో, ఇక అది దొరకద'ని ఆశ వదిలేసాను. తరువాత ఎందుకో నా మనసుకి నేను క్యాబ్ ఎక్కిన ప్రదేశంలో పడిపోయిందేమోననిపించి మనసులో, "చెవిదిద్దు దొరకాల"ని బాబాని వేడుకుంటూ ఎందుకైనా మంచిందని ఇంటికి ఫోన్ చేశాను. బాబా దయవల్ల అది ఇంటిలోనే దొరికింది.
2021, సెప్టెంబర్ 30, గురువారంనాడు ఉదయం 4 గంటలకే లేవాల్సిన నేను 5.10కి లేచాను. హడావిడిగా వంట మొదలుపెట్టి బాబాకు నైవేద్యంగా కిచిడి తయారుచేసాను. తరువాత పూజ చేస్తూ కొబ్బరికాయ తెచ్చివ్వమని మా పాపని అడిగాను. తను తెచ్చివ్వగానే అది నా చేతిలోంచి జారిపోయి కిందపడి పగిలింది. చూస్తే, ఆ కాయ కుళ్ళిపోయి ఉంది. నాకు టైం అయిపోతుండటంతో ఇంకేమీ పట్టించుకోకుండా హడావుడిగా దేవుడికి హారతి ఇచ్చి స్కూలుకి బయలుదేరిపోయాను. తరువాత మా పనమ్మాయి వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్ళింది. తను అలా వెళ్లిన పది నిమిషాలకి గ్రానైట్ సింక్ పెద్ద శబ్దంతో ఒకపైపు భాగం క్రిందపడి విరిగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేనందున ఎవరికీ ఏ గాయాలు కాలేదు. జరిగిన సంఘటన దృశ్యాలను మా పాప ఫోటో తీసి స్కూల్లో ఉన్న నాకు పంపింది. అవి చూడగానే అప్పటికి రెండురోజుల ముందు బ్లాగులో నేను చూసిన, "ఏమీ భయపడకు. నేనెప్పుడూ నీ ఇంటికి కాపాలా కాస్తున్నాను" అన్న బాబా సందేశం గుర్తుకొచ్చి, బాబా నన్ను పెద్ద ప్రమాదం నుండి కాపాడారని మనసులోనే బాబాకు నమస్కరించుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఎందుకంటే, సాధారణంగా నేను ఎప్పుడూ పగిలిన ఆ సింక్ అంచుపైనే కొబ్బరికాయ కొడతాను. ఆరోజు కొబ్బరికాయ చేయిజారి కింద పడకుండా ఉంటే, నేను దాన్ని తీసుకుని వెళ్లి ఆ సింక్ అంచుపైనే కొట్టేదాన్ని. అదే జరిగితే ఆ బరువైన గ్రానైట్ పలకలు అప్పుడే పగిలి నా కాళ్ళ మీద పడి గాయాల పాలయ్యేదాన్ని. అసలే నేను డయాబెటిక్ అయినందున గాయాల నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టేది. అంతటి కష్టం నాకు రానివ్వకుండా నన్ను రక్షించడానికే నా చేతినుండి కొబ్బరికాయ జారిపోయేలా చేసారు బాబా. చూసారా! ఆ సర్వాంతర్యామి లీలలు. అంతటితో ఆయన లీల అయిపోలేదు.
అదేరోజు సాయంత్రం నేను స్కూలు నుండి తిరిగి వస్తున్నప్పుడు 5:30 - 6 గంటల మధ్యలో క్యాబ్‍లో నా స్నేహితురాలు విజయతో ఉదయం జరిగిన సాయి మహిమ గురించి పంచుకుంటుంటే మా స్కూల్లో మాథ్స్ టీచర్ అయిన పద్మజగారు వింటూ అనాలోచితంగా బాబాని తలుచుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పద్మజ గారింట్లో ఆమె కూతురు పెరట్లోకి వెళ్ళబోతూ ఒక అడుగు బయటకు వేసి, రెండో అడుగు వేయబోతుండగా ఒక పెద్ద నాగుపాము బుసకొడుతూ తనపైకి వచ్చిందట. తక్షణం అప్రమత్తురాలైన ఆ పాప పరుగున ఇంటి లోపలికి వెళ్లి తలుపు వేసుకుందట. పాప చూడకుండా అడుగు వేసుంటే చాలా ప్రమాదం జరిగేది. ఆ పాపని బాబానే కాపాడారు. ఈ విషయాన్ని తాను బాబా లీలలు వింటున్న సమయంలోనే బాబా ఈ అద్భుతం చేసారని పద్మజగారు ఉద్వేగంతో చెప్పారు. "బాబా! దయగల ఓ తండ్రీ! సర్వవేళ, సర్వావస్థలందు మీరు ఇదేవిధంగా మమ్మల్ని కాపాడండి. మా అనారోగ్య సమస్యలను తొలగించి సర్వశుభములు చేకూరేలా ఆశీర్వదించండి".
చిన్న సమస్యతో సరిపెట్టిన బాబా
నా పేరు యశోద. మాది అనంతపురం. మా అమ్మాయి నాగశ్వేత, మా అల్లుడు, మనవడు స్వీడన్‍లో నివాసముంటున్నారు. 2021, సెప్టెంబర్ నెల చివరి వారంలో మా అమ్మాయి మెట్ల మీద నుంచి జారిపడటంతో కాలు మలబడి బాగా వాపొచ్చి తను నడవలేకపోయింది. ఆ విషయం తెలిసి తన కాలు ఫ్రాక్చర్ అయ్యిందేమోనని నేను చాలా భయపడ్డాను. అప్పటి కరోనా పరిస్థితుల్లో నేను స్వీడన్ వెళ్ళలేను. వెంటనే నేను మన తండ్రి సాయినాథునికి నమస్కరించుకుని, "అమ్మాయి కాలుకి ఫ్రాక్చర్ కాదు, చిన్న దెబ్బ, తగ్గిపోతుందని డాక్టరు చెప్పాలి" అని వేడుకున్నాను. డాక్టర్లు టెస్టులు చేసి, "కాలుకి చిన్న క్రాక్ వచ్చింది. పదిరోజుల్లో తగ్గిపోతుంద"ని చెప్పారు. ఆ విషయం తెలిసి నేను ఎంతలా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానో ఆయనకే తెలుసు. "బాబా! ఇలాగే మా అందరి మీద కరుణ చూపించు తండ్రి. మా అమ్మాయి విషయంలో ఇంకొక సమస్య ఉంది. అది కూడా మీరే తీరుస్తారని ఆశిస్తున్నాను. తొందరగా ఆ సమస్యను తీరుస్తారని నమ్ముతున్నాను బాబా".
ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.
సాయిభక్తుల అనుభవమాలిక 948వ భాగం....
1. ప్రేమతో సమస్యలు తీర్చే బాబా
2. బాబా చల్లని దృష్టి
3. తలచుకుంటే చాలు - సమస్యలన్నీ పరిష్కరిస్తారు బాబా
ప్రేమతో సమస్యలు తీర్చే బాబా
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు గోష్ఠేశ్వరి. నా అనుభవాలను పంచుకునే అవకాశమిచ్చిన బాబాకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. ఈమధ్యకాలంలో మా పాప అదివరకు చదివిన స్కూలు కరోనా కారణంగా సరిగా నడపలేకపోతున్నందువలన బాబా అనుమతి తీసుకుని పాపని స్కూలు మార్చాలని నిర్ణయం తీసుకున్నాము. మా పాప కూడా మేము అనుకున్న కొత్త స్కూల్లో చదవడానికి చాలా ఉత్సాహం కనబరిచింది. వరలక్ష్మీవ్రతం రోజున పాపని కొత్త స్కూల్లో జాయిన్ చేయడం కోసంగా మేము ఇంటినుండి బయలుదేరే సమయానికి బాబా ఫోటో రూపంలో మాకు ఎదురొచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ సంతోషంలో పాపని జాయిన్ చేసి వచ్చాము. అయితే, పాప రెండురోజులు స్కూలుకి వెళ్లి, తరువాత కొత్త వాతావరణం నచ్చకనో ఏమోగానీ స్కూలుకి వెళ్లనని మారాం చేయడం మొదలుపెట్టింది. నేను, నా భర్త ఇద్దరమూ టీచర్లమే. సరిగ్గా మేము స్కూలుకి వెళ్లేందుకు బయలుదేరే సమయానికి పాప స్కూలుకి వెళ్ళనంటూ రోజూ అల్లరి చేస్తుండేది. దాంతో మాకు స్కూలుకి వెళ్లడం ఆలస్యం అయిపోతుండేది. నాకు చిరాకొచ్చి పాపను కొట్టేదాన్ని. తరువాత మనసుకి కష్టంగా అనిపించి, "బాబా! మీ అనుమతితోనే కదా పాపను కొత్త స్కూల్లో జాయిన్ చేశాను. చక్కగా చదివే పిల్ల ఇలా స్కూలుకి వెళ్ళనంటుంటే నేను ఏం చేయాలి?" అని బాబాతో చెప్పుకుని బాధపడేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు పాపకి విపరీతంగా జ్వరం వచ్చింది. నేను కొట్టడం వల్లనే పాపకు జ్వరం వచ్చిందేమోనని నాకు చాలా బాధగా అనిపించి, "బాబా! పాపకు తొందరగా జ్వరం తగ్గి, తను చక్కగా స్కూలుకి వెళ్ళినట్లైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో పాపకి జ్వరం తగ్గింది. అంతేకాదు ఇప్పుడు పాప చక్కగా స్కూలుకి వెళ్తూ, మంచిగా చదువుకుంటోంది. "థాంక్యూ బాబా. థాంక్యూ సో మచ్".
మరో అనుభవం: ఇటీవల కొన్నిరోజుల క్రితం మావారికి జ్వరం వచ్చింది. "బాబా! ఆయన జ్వరం తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఒక్కరోజులోనే ఆయన జ్వరం తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".
ఇంకో అనుభవం: ఇటీవల మావారు, "ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు కదా, సింహాచలం వెళ్ళొద్దామ"ని అన్నారు. సరేనని 2021, సెప్టెంబర్ 26, ఆదివారంనాడు వెళ్ళడానికి కారు బుక్ చేసుకున్నాము. తరువాత మేము వెళ్ళేరోజు తుఫాను ఉందని తెలిసింది. అయినాసరే అనుకున్నట్లే ఆరోజు బయలుదేరాము. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చాలా చక్కగా జరిగింది. అయితే ఆ రోజంతా వర్షం పడుతున్న కారణంగా మేము కాస్త తడిసాము. "మాకు, మాతో స్వామి దర్శనానికి వచ్చిన వారెవ్వరికీ జ్వరం, జలుబు రాకుండా ఉన్నట్లయితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మొక్కుకున్నాను. అలా మ్రొక్కిన కాసేపటికి బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. బాబా దయవలన ఎవరికీ జ్వరం, జలుబు రాలేదు. అందరూ బాగానే ఉన్నారు. నేను ఏ పని మీద, ఎక్కడికి వెళ్లినా సాయిగణేషుడిని మొక్కుకొనే బయలుదేరుతాను. నేను వెళ్లే ప్రతీచోటా బాబా ఫోటో రూపంలో నాకు ఎదురొచ్చి ఆశీర్వదిస్తారు. "ధన్యవాదాలు బాబా. ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేను తండ్రీ".
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా చల్లని దృష్టి
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు లత. బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. కొన్నిరోజుల క్రితం నా చేతివేళ్ళు(జాయింట్స్) బాగా నొప్పి పెట్టసాగాయి. డాక్టరు దగ్గరకి వెళితే, "కీళ్ల నొప్పులేమో! బ్లడ్ టెస్టు చేయించ"మన్నారు. నేను బాబాకు నమస్కరించుకుని, "రిపోర్టు నార్మల్ అని వస్తే, ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మొక్కుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టు నార్మల్ అని వచ్చింది. "చాలా చాలా కృతఙ్ఞతలు బాబా".
ఒకసారి మా వారికి తరచూ రాత్రుళ్ళు వాంతులవుతూ ఉండేవి. అలా సుమారు నాలుగైదు నెలల వరకు అవుతుండేసరికి మాకు చాలా భయమేసింది. ఇక డాక్టరుని సంప్రదిస్తే, 'హెర్నియా' అని చెప్పారు. అయితే మా వారికి ఈ సమస్య రావడానికి మూడు నెలల ముందే బైపాస్ సర్జరీ అయినందున మళ్ళీ ఆపరేషన్ అవసరమవుతుందేమోనని నేను చాలా భయపడి, "ఇంతలోనే మళ్ళీ ఇదేమిటి బాబా?" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవలన డాక్టరు, "టాబ్లెట్స్ వాడితే సరిపోతుంద"ని చెప్పారు. దాంతో నా మనసు కుదుటపడింది. "బాబా! మీ దయ, చల్లని దృష్టి ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".
నాకు ఈమధ్య జుట్టు ఎక్కువగా రాలిపోతుండేది. దానికి కారణం ఏమిటో అర్థం కాలేదు. కొంతమంది థైరాయిడ్ వల్లనేమో, ఒకసారి టెస్టు చేయించుకోండి అన్నారు. కానీ నాకు హాస్పిటల్ అన్నా, టెస్టులు అన్నా చాలా భయం. అందువలన నేను, "తండ్రీ నీవే నాకు రక్ష, ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. నా ఈ సమస్య తగ్గిస్తే, ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. ఆశ్చర్యకరంగా అలా చెప్పిన వారం రోజులకే జుట్టు రాలడం అదుపులోకి వచ్చింది. "హే సాయి భగవాన్! ఏమి మీ లీలలు? ఎంత దయామయుడవి, ఎంత కరుణామూర్తివి తండ్రి. మిమ్మల్ని ఎప్పుడూ విసిగిస్తూనే ఉంటాము సాయీ, అయినా ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తూ ఉంటావు. అనుకున్న ప్రకారం వారం రోజుల్లో 'శ్రీసాయి సచ్చరిత్ర' పారాయణ నాచేత చేయించి, నాకెంతో ఆనందాన్ని కలిగించావు. అందుకు మీకు సదా ఋణపడి ఉంటాను తండ్రి. ఎప్పుడూ నా చేయి వదలకుండా పట్టుకుని కాపాడు తండ్రి".
అందరికీ వందనాలు. సాయి రక్ష.
తలచుకుంటే చాలు - సమస్యలన్నీ పరిష్కరిస్తారు బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. గత కొన్నినెలలుగా ఈ బ్లాగులోని సాయి లీలలను క్రమం తప్పకుండా చదివే అవకాశం బాబా నాకు కల్పించారు. ఇందులో ప్రచురింపబడ్డ సాయిభక్తుల అనుభవాలను ప్రేరణగా తీసుకుని నేను కూడా నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. 2020, ఆగస్టులో నా భర్త చనిపోయారు. భర్తలేని నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆ సాయిబాబానే. ప్రతి విషయంలో ఆయన మాకు తోడుగా ఉన్నారు. ఇక ముందు కూడా ఇలాగే తోడుగా ఉంటారని నమ్ముతున్నాను. ఆ బాబా దయవల్లే మేము ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము. ఇకపోతే, నా కూతురు పెళ్లి వద్దని మొండిపట్టు పట్టింది. నేను ఈ విషయంలో, "సహాయం చేయమ"ని బాబాను కోరాను. అద్భుతం! బాబా సహాయాన్ని అర్థించిన వారం రోజులకు మా అమ్మాయి, "నీ ఇష్టం అమ్మా" అని చెప్పింది. ఇదేవిధంగా మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరేలా అనుగ్రహించమని ఆ సాయిబాబాను వేడుకుంటున్నాను. ఈ బ్లాగు ద్వారా మేము బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై! సద్గురు సాంబశివ మహరాజ్ కి జై!
సాయిభక్తుల అనుభవమాలిక 947వ భాగం....
1. ఆరోగ్య సమస్యలను పరిష్కరించిన బాబా
2. ముందు నుండి హెచ్చరిస్తూ జాగ్రత్తపరిచి కాపాడిన బాబా3. బాబా దయార్ద్రహృదయం వలన కోరుకున్న ఉద్యోగం
ఆరోగ్య సమస్యలను పరిష్కరించిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై.
సాయిబంధువులకు మరియు ఈ బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంగీత. నేను బాబా భక్తురాలిని. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురితమయ్యే 'సాయిభక్తుల అనుభవమాలిక'ను చదువుతుంటాను. బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకసారి నా ఆరోగ్యం బాగాలేక డాక్టరు దగ్గరకి వెళితే, పదిహేను రోజులకు మందులిచ్చి, థైరాయిడ్ తోపాటు మరికొన్ని పరీక్షలు చేయించుకుని పదిహేనురోజుల తర్వాత రమ్మన్నారు. నేను వెంటనే అన్ని పరీక్షలు చేసుకున్నాను. డాక్టరు దగ్గరకి వెళ్లడానికి ఇంకా పన్నెండు రోజులు ఉండటంతో మావారు నా రిపోర్టులు తీసుకుని వెళ్లి తనకి తెలిసిన ఒక ఫిజియోథెరపిస్ట్‌కి చూపించారు. ఆ ఫిజియోథెరపిస్ట్ నా రిపోర్టులు చూసి థైరాయిడ్ బోర్డర్ లైన్‌లో ఉందని అన్నారు. అది తెలిసి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, థైరాయిడ్ ఒక్కసారి వచ్చిందంటే, జీవితాంతం ఉంటుందంటారు. వెంటనే నేను, "బాబా! నేను డాక్టరు దగ్గరకి వెళ్ళినప్పుడు, నాకు థైరాయిడ్ లేదని చెప్పాలి. అలా జరిగినట్లయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. నేను కోరుకున్నట్లే డాక్టరు థైరాయిడ్ గురించి ఏమీ మాట్లాడలేదు. అంటే నాకు థైరాయిడ్ సమస్య లేకుండా బాబా అనుగ్రహించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఒకరోజు నేను చెప్పులతో కొంచం వేగంగా నడిచాను. ఆ రోజు ఏమీ అనిపించలేదు కానీ, మరుసటిరోజుకి కాలునొప్పులు, వాపు మొదలయ్యాయి. డాక్టరు దగ్గరకి వెళితే, ఎక్స్-రే తీసి, కొంచెం కాల్షియం లోపం ఉందని చెప్పి ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్లు వాడినా నొప్పి తగ్గలేదు. చాలారోజుల వరకు నొప్పి అలాగే ఉంది. వాపు మాత్రం అప్పుడప్పుడు రావడం, తగ్గడం జరుగుతుండేది. అలా కొన్నిరోజులు చూసాక నొప్పి తట్టుకోలేక, "బాబా! మీ దయవల్ల నా కాలునొప్పి తగ్గిపోవాలి. అదే జరిగితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నొప్పి చాలావరకు తగ్గింది. "ధన్యవాదాలు బాబా. ఉన్న ఆ కాస్త నొప్పి కూడా తగ్గిపోయేలా అనుగ్రహించండి బాబా. మీకు మాటిచ్చి ఈ అనుభవాన్ని పంచుకోవడం మర్చిపోయినందువల్ల చాలా ఆలస్యంగా పంచుకున్నాను. దయచేసి నన్ను క్షమిచండి బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
ముందు నుండి హెచ్చరిస్తూ జాగ్రత్తపరిచి కాపాడిన బాబా
ఓం శ్రీసాయి ఆపద్బాంధవాయ నమః. సాయిబంధువులకు, బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇదివరకు బాబా ప్రసాదించిన అనుభవాలు కొన్ని మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మహాపారాయణ చేస్తున్న ఒక భక్తురాలు తన అనుభవాన్ని అందరితో షేర్ చేయమని చెప్పినందువల్ల మళ్లీ మీ ముందుకు వచ్చాను. ఆ అనుభవాన్ని ఆమె మాటల్లోనే వివరిస్తాను.
'అందరికీ నమస్కారం. మాది పెద్ద కుటుంబం. నలుగురు అన్నదమ్ములు నాలుగు కుటుంబాలుగా ఒకే భవనంలో కింద రెండు కుటుంబాలు, పైన రెండు కుటుంబాలు ఉంటున్నాము. 20 ఏళ్లుగా మా కుటుంబంలోని అందరమూ బాబా భక్తులం. సాయి మాకు ఎన్నో అనుభవాలు, ఆశీస్సులు ఇచ్చారు, అపదల నుంచి గట్టెక్కించారు. నేను ఇప్పుడు 2021, సెప్టెంబర్ 27న బాబా మమ్మల్ని కాపాడిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. సెప్టెంబర్ నెల చివర్లో నాలుగైదు రోజులపాటు మావారికి రోజూ కలలో మండ్రగబ్బ కనిపిస్తుండేసరికి, 'ఎపుడూ లేనిది, ఇప్పుడు ఎందుకిలా కనిపిస్తుంద'ని మేమంతా చాలా భయపడ్డాము. 'ఏదైనా అపశకునమా?' ఇలా కల వస్తుందని అనుకున్నాము. దాంతో మావారు పువ్వులు కోయటానికి వెళ్ళేటప్పుడు, ఇంకా ఇతరత్రా సమయాల్లో చాలా జాగ్రత్త వహించసాగారు. అలాగే మేమంతా భయపడుతూ ఇంట్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించసాగాము. ఒక్క మాటలో చెప్పాలంటే, కలలు రావటం మొదలైన దగ్గరనుంచీ ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. సెప్టెంబర్ 26 రాత్రి కూడా కలలో మండ్రగబ్బ కనిపించింది. మరుసటిరోజు ఉదయం పైన వంటగదిలో ఏదో పనిలో ఉన్న నేను ఫోన్ మాట్లాడుతూ బయటకి రాబోతుండగా అప్పుడే బయటనుంచి వచ్చిన మావారు నన్ను బయటకు రావొద్దని గట్టిగా అరిచారు. ఏమైందని కంగారుగా చూస్తే, సరిగ్గా వంటగది గుమ్మం దగ్గర మండ్రగప్ప ఉంది. కలలో మండ్రగప్ప కనిపించడం వెనక మర్మమేమిటో మాకు అప్పుడు అర్థమైంది. ఆ కల ద్వారా బాబా హెచ్చరిస్తూ మమ్మల్ని జాగ్రత్తపరిచి జరగనున్న ఆపద నుండి కాపాడారు. అలా కలలు రాకుండా ఉండుంటే ఇంట్లో అందరం అజాగ్రత్తగా ఉండేవాళ్ళం. అప్పుడేం జరిగేదో ఊహించటానికే భయం వేస్తుంది. ఇదంతా కేవలం అంటే కేవలం మన సాయినాథుని దయవల్ల మాత్రమే జరిగింది. అందుకు సాయికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. "ఎల్లపుడూ ఇలాగే మమ్మల్ని చల్లగా చూడు తండ్రీ".'
ఈ అనుభవం ద్వారా ఆవిడకి, నాకు, ఇంకా సాయి బిడ్డలందరికీ అపశకునాలనేవేమీ ఉండవని, సాయి తల్లి చూపే ప్రేమ మాత్రమే అన్ని ఆపదల నుండి రక్షణనిస్తుందని అవగతమవుతుంది. "బాబా! మాకెన్ని జన్మలున్నా మేము మీ బిడ్డలుగానే ఉండాలి. ఎందుకంటే, నువ్వుంటే మాకు దేని గురించి భయం ఉండదు, బాధలుండవు, అన్నిటికి మించి ప్రేమకు లోటుండదు".
శుభం భవతు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
బాబా దయార్ద్రహృదయం వలన కోరుకున్న ఉద్యోగం
నా పేరు శివ. నేను ఇదివరకు నోయిడాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక సంవత్సర కాలంపాటు హైదరాబాదులోని వేరే కంపెనీలో ఉద్యోగం కోసం ఎంతగానో ప్రయత్నించాను. ముఖ్యంగా ఆరునెలల కరోనా కాలంలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. అయితే అంతలా ప్రయత్నించినప్పటికీ నాకు ఏ కంపెనీ నుండి ఉద్యోగం రాలేదు. దాంతో నేను మానసికంగా చాలా కుమిలిపోయాను. కానీ నేను ఎప్పుడూ బాబాపై విశ్వాసాన్ని కోల్పోక, “బాబా! నీవే దిక్కు. నాకు త్వరగా ఉద్యోగాన్ని ప్రసాదించండి” అని బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. బాబా దయార్ద్రహృదయం వలన మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందీ లేకుండా కాలం గడిచి, చివరికి 2020 నవంబర్‌లో నాకు హైదరాబాదులో ఉద్యోగం లభించింది. అది కూడా ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా. పూర్వజన్మ కర్మఫలం వలన అంతకాలం నేను కోరుకున్నట్లు వేరే కంపెనీలో ఉద్యోగం రాకపోయినా బాబా దయార్ద్రహృదయం వలన ఇప్పుడు సంతోషంగా మా ఊరికి దగ్గరగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాను. అంతా బాబా లీల. సద్గురు శ్రీసాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ నా కోరికను నెరవేర్చినందుకు శతకోటి ప్రణామాలు తెలుపుకుంటున్నాను. శిరిడీ దర్శించాలని నా చిరకాలవాంఛ. ఆ అవకాశం నాకు ఇప్పటివరకు రానందున బాబా పిలుపుకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నా మనస్సులో ఒక విన్నపం ఉంది. దాన్ని బాబా వింటారని ఆశిస్తున్నాను. “బాబా! చాలా చాలా ధన్యవాదాలు. నాకు అండగా నిలిచి నా జీవితాన్ని అందంగా మలిచారు”. నా అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకునే అవకాశాన్ని కల్పించిన ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు నా అనుభవాన్ని చదివిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మనమందరం బాబా లీలలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ వారి స్మరణలో సదా ఆనందంగా ఉందాం. చివరిగా "అందరినీ ఆశీర్వదించమ"ని, అలాగే "మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకునే అవకాశాన్ని త్వరలోనే నాకు ప్రసాదించమ"ని బాబాను ప్రార్థిస్తూ.. సెలవు.
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిభక్తుల అనుభవమాలిక 946వ భాగం....
1. ఆపరేషన్ లేకుండా ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా2. బాబాపై విశ్వాసం అత్యంత అవశ్యకం
ఆపరేషన్ లేకుండా ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అంజనా గుప్తా. మాది నర్సంపేట, వరంగల్ జిల్లా. నేను మీకు సుపరిచితురాలినే. ఎందుకంటే, గతంలో నేను రెండు అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు పంచుకోబోయే మూడవ అనుభవంలో బాబా నన్ను పావుగా చేసుకుని ఇతరులకు సహాయం చేసిన పద్ధతి గురించి చెప్తాను.
నేను బాబాను ఎంతగానో నమ్ముతాను. నేను ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు, పడుకున్నాక మెలకువ వచ్చినప్పుడు బాబాను తలుస్తూ ఉంటాను. అలా బాబా స్మరణలో ఉంటూ, సచ్చరిత్ర పారాయణ చేస్తూ బాబానే లోకంగా ఉంటాను. ఇంతకుముందు సోషల్ సర్వీస్, ఫంక్షన్స్, టెంపుల్స్ తదితర వాటిలో తిరుగుతుండే నేను ఇప్పుడు పూర్తిగా బాబా స్మరణ, ధ్యానం, బాబా చెప్పే విషయాల మననం వంటి వాటితో బాబా ధ్యాసలోనే ఉంటున్నాను. ఎక్కడికైనా వెళ్లాలన్నా మనస్సు పోవడం లేదు. అంతలా నాలో మార్పులు వచ్చాయి. నిజానికి 1994 నుండి బాబా భక్తురాలినైన నేను గత ఐదారు సంవత్సరాల నుండి పూర్తిగా బాబా సేవలో తరిస్తున్నాను. బాబా సేవకే అంకితమైన నాకు అడుగడుగునా ప్రతి విషయంలోనూ నాతో ఉన్నానని బాబా నిరూపణ ఇస్తున్నారు. ఒకసారి నేను వంట చేస్తూ అన్నం పొంగుతుంటే, మూత తీసి గరిటతో కలుపుతున్నాను. అంతలో గరిట చేజారి ఉడుకుతున్న అన్నంలో పడిపోయింది. తొందరలో ఉడుకుతున్న అన్నంలో చేయి పెడుతున్నానన్న స్పృహ కూడా లేకుండా నా చేయి నేరుగా ఆ పాత్రలో పెట్టేసి గరిటను బయటకు తీశాను. అద్భుతం ఏమిటంటే, వేడి తగలడంగాని, నా చెయ్యి కాలడంగాని జరగలేదు. బాబా చేసిన మిరాకిల్‍ని తలచుకుంటే, ఇప్పటికీ నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈవిధంగా ప్రతి విషయంలోనూ నేనున్నాను అని బాబా తెలియజేస్తూ ఉంటారు.
నాకు ఒక స్నేహితురాలు ఉంది. తన పేరు శోభ. ఐదేళ్ల క్రితం ఒక గ్రూపు ద్వారా తనతో నాకు పరిచయం జరిగింది. ఇప్పటివరకూ మేము ఒకరిని ఒకరం చూసుకోలేదు. అయితే తను కూడా బాబా భక్తురాలైనందున మా ఇద్దరి మధ్య బంధం పటిష్టం అయ్యింది. 5 సంవత్సరాలగా ప్రతి విషయంలోనూ తను నన్ను సలహాలు, సూచనలు అడుగుతూ ఉంది. 2020, ఆగస్టు ఒకటో తారీకు, గురువారం అర్ధరాత్రి 12:00 గంటలకు తన నుండి నాకు ఫోన్ వచ్చింది. మెలకువ వచ్చి చూస్తే, శోభ ఫోన్ చేస్తుంది. నిజానికి నేను రాత్రి 9 - 9:30 తర్వాత ఎవరి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయను. అలాంటిది అర్ధరాత్రి వచ్చిన తన ఫోను లిఫ్ట్ చేశాను. కారణం అంత అర్థరాత్రి వేళ ఫోన్ చేసిందంటే ఏదో పెద్ద సమస్య వచ్చి ఉంటుందనిపించింది. తన భర్త భాస్కర్ సి.ఆర్.పి.ఎఫ్‍లో ఉద్యోగం చేస్తారు. అందువల్ల శోభ ఒక్కతే ఇద్దరు పిల్లలతో హైదరాబాదులో ఉంటుంది. అందువల్ల నా అవసరం వచ్చి ఉంటుందని ఫోన్ లిఫ్ట్ చేశాను. మరుక్షణం తను బాగా ఏడుస్తుంది. అది విని నాకు కూడా బాధేసి, "ఎందుకు ఏడుస్తున్నావ్ శోభ? ఏం జరిగింది? ముందు విషయం చెప్పు" అని నేను ఒకటికి, రెండుసార్లు అడిగాను. చివరికి, "పిల్లలకు ఏమైనా అయిందా?" అని అడుగుతుంటే, "కాదు,భాస్కర్ కు యాక్సిడెంట్ అయ్యిందంట" అని చెప్పి ఏడ్చింది. అప్పుడు నేను, "బాబా ఉన్నారు. ఏమీ భయపడవద్దు. ధైర్యంగా ఉండు" అని చెప్పాను. కానీ తన బాధ వర్ణనాతీతం. ఆ క్షణంలో నాకు కూడా ఏడుపొచ్చింది.
ఇంతకీ అసలు విషయమేమిటంటే, తన భర్త డ్యూటీ పూర్తి చేసుకుని వస్తుండగా పదిమంది ఉన్న వ్యాన్ యాక్సిడెంట్‍కి గురైంది. ఆ యాక్సిడెంట్ ఫోటోలు, అతను పడిపోయిన విధానము చూస్తే, ఆ ప్రమాదంలో ఎంతమంది బ్రతికి ఉన్నారో, అతనికి ఏమైందో తెలియని అయోమయం. ఆ విషయం తెలియగానే శోభ నాకు ఫోన్ చేసి, విషయం చెప్పడం, నేను తనకి బాబాను ప్రార్థించమని ధైర్యం చెప్పడం జరిగింది. కానీ అప్పటినుంచి నా మనసు ఆమె చుట్టూ తిరుగసాగింది. గంటగంటకి ఫోన్ చేస్తూ, "ఎలా ఉంది? వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశారా? డాక్టరు ఏమన్నారు? ఇక్కడికి తీసుకొస్తారా?" అని అడుగుతూ పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నాను. యాక్సిడెంట్ జరిగిన పదిమందిలో డ్రైవరుకి, మరో ఇద్దరికి కాలు తీసేయడం, తలకి గాయం అవ్వడం వంటి మేజర్ ప్రాబ్లమ్స్ జరిగాయి. అలాంటిది బాబా దయవలన భాస్కర్‍కి చిన్నగా గీరుకుపోవడం తప్ప పెద్ద గాయాలు ఏమీ కాలేదు. కానీ అతను స్పృహలో లేడు. పైకి తెలియని దెబ్బలు తగిలి ఉంటాయేమో, అందుకే స్పృహ లేకుండా ఉన్నాడని అనుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం భద్రాచలానికి సమీపంలో ఉన్నందున భాస్కర్‍ని భద్రాచలంలోని ఒక హాస్పిటల్లో చూపించారు. వాళ్ళు కొంత ట్రీట్మెంట్ చేసి, "హైదరాబాద్ తీసుకెళ్ళమ"ని చెప్పారు. తెల్లవారుతునే నేను శ్రీసాయి సన్నిధి గ్రూపులో జరిగిన సంఘటన గురించి తెలియజేసి, అందరినీ అతనికోసం ప్రార్థించమని మెసేజ్ పెట్టాను. శ్రీసాయి సన్నిధి గ్రూపులోని ప్రతి ఒక్కరూ బాబాను ప్రార్థించి, "బాబా ఉన్నారు. అతనికేమీ కాదు. అంతా మంచి జరుగుతుంది. మీ స్నేహితురాలిని ధైర్యంగా ఉండమని చెప్పండి" అని చెప్పారు.
అయితే, బాబా ఊరికే చూస్తూ ఉంటారా! తమను నమ్మిన వాళ్లకు తోడుగా ఉండి అన్నీ చూసుకుంటారు. డాక్టర్లు ఆపరేషన్ కోసంగా టెస్టులు మొదలుపెట్టారు. అందులో భాగంగా అతనికి కోవిడ్ టెస్ట్ కూడా చేశారు. రిజల్ట్ కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. దాంతో డాక్టర్లు పదిహేను రోజుల తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పి ఆపరేషన్ పోస్ట్ ఫోన్ చేయడమేకాక భాస్కర్‍ని డిశ్చార్జ్ కూడా చేశారు. అప్పుడు వేరే హాస్పిటల్లో మరోసారి భాస్కర్‍కి టెస్ట్ చేయిస్తే, "కోవిడ్ పాజిటివ్ కాద"ని చెప్పారు. ఇంకా "ఆపరేషన్ కూడా అవసరం లేదు. కాకపోతే మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలి. కోలుకోవడానికి కనీసం ఆరునెలలైనా పడుతుంది" అని చెప్పారు. అలా బాబా దయవలన ఆపరేషన్ ఐతే తప్పిపోయిందికానీ, భాస్కర్ ఆరు నెలలు మంచంలోనే ఉండాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన భాస్కర్ బాబా దయవలన 15 రోజుల్లో చాలావరకు కోలుకున్నాడు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు, మందులు వాడుతుండటం వలన నెమ్మదిగా మూడు నెలలకి అతను నడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు భాస్కర్ చక్కగా డ్యూటీలో తిరిగి జాయిన్ అయ్యారు. అలా ఆ బాబా అనుగ్రహం వల్ల, అందరి సహాయసహకారాలు, ప్రార్థనలు వల్ల మహర్షి వారి ద్వారా బాబా చెప్పించినట్లే ఆపరేషన్ లేకుండానే భాస్కర్ ఆరోగ్యం కుదుటపడింది. వాళ్లు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు.
ఆ సాయినాథుడు తమను నమ్ముకున్న ప్రతి ఒక్కరి చెంతనుంటూ 'నేనున్నా'నని సేద తీరుస్తారు. ఆ చల్లని తండ్రి తీర్చని సమస్య అంటూ ఉంటుందా? ఆయన అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ఒంటిమీద చిన్న మరక కూడా కనిపించకుండా చేశారు. ప్రతినిత్యం, ప్రతిక్షణం మనసులో ఆ సాయినాథుని స్మరిస్తున్న వారి 'సాయీ' అన్న పిలుపుకు 'ఓయ్' అని తప్పక పలుకుతారు బాబా. నా విషయంలో ఎప్పుడూ పలుకుతున్నారు. ఆయన దయతో నేను శోభ, భాస్కర్‍ల సమస్యల్లో పాలుపంచుకోవటం, నా వంతు సహాయసహకారాలు అందించటం, తద్వారా నన్ను ఒక పావుగా చేసుకుని వాళ్లకు 'నేనున్నాను' అని నిరూపణ ఇస్తున్నారు బాబా. అందుకు నేను ఎంతో ధన్యురాలిని. భాస్కర్ యాక్సిడెంట్ గురించి నేను శ్రీసాయి సన్నిధిలో విన్నవించిన మరుక్షణమే స్పందించిన ప్రతి ఒక్కరికీ నా తరఫున మరియు శోభ, భాస్కర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ అనుభవం గురించి బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవాలని శోభ ఎన్నోసార్లు నాతో చెబుతూ వచ్చింది. కానీ సమయం లేక నేను వ్రాయలేకపోయాను. ఇప్పటికైనా సమయం దొరికి వ్రాయగలినందుకు బాబాకు వేలవేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా సాయిబాబా ఎంతోమంది భక్తులకు ప్రసాదించిన అనుభవాలను సేకరించి, ఈ బ్లాగులో ప్రచురించి సాయి బంధువులందరికీ తెలియజేస్తున్న సాయికి కృతజ్ఞతలు.
మీ... అంజనా గుప్తా.
సర్వం శ్రీసాయినాథ చరణారవిందార్పణమస్తు.
బాబాపై విశ్వాసం అత్యంత అవశ్యకం
ఓం నమో సద్గురు శ్రీ సాయినాథాయ. సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉపేంద్ర. మాది విజయవాడ. నేను గత రెండు నెలలుగా తీవ్రమైన బ్యాక్ పెయిన్‍తో బాధపడుతున్నాను. డాక్టరు వద్ద చూపించుకుని మందులు వాడుతున్నా నొప్పి తగ్గలేదు. ఆ నొప్పి వలన స్థిమితంగా కూర్చోలేక రోజూ ఎంతో ఇబ్బందిపడుతుండేవాడిని. ఇలా ఉండగా ఒకరోజు బాబాను ప్రార్థించి, 'మళ్లీ డాక్టరు దగ్గరకు వెళ్ళాలా, వద్దా' అని చీటీలు వేస్తే, 'వద్దు' అని వచ్చింది. దాంతో డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు. తరువాత ఒక సోమవారంనాడు మన బాబాకు నా బాధ చెప్పుకుని, "నొప్పి తగ్గితే, రాబోయే గురువారంనాడు బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని ప్రార్థించాను. ఆశ్చర్యంగా ఆ రోజు మధ్యాహ్నం నుండి మూడురోజులపాటు నొప్పి అసలు లేదు. అయితే, నేను నా ఈ అనుభవాన్ని డైరీలో వ్రాసుకున్నానుగాని బ్లాగులో ప్రచురణకు పంపలేదు. పైగా నొప్పి మళ్లీ వస్తుందేమోనని కించిత్ సందేహం నా మనసులో ఉండేది. బాబా మీద విశ్వాసం ఉన్నప్పటికీ పొరపాటున నా మనసులో ఆ సందేహం కలగడం వలన నాలగవరోజున మళ్లీ నొప్పి మొదలై క్రమంగా పెరిగింది. అప్పుడు నేను మన బాబాతో, "తండ్రీ! మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించినట్లయితే తగ్గిపోయిన నొప్పి తిరిగి వచ్చేది కాదు. బ్లాగులో పంచుకుంటానని మీకు చెప్పి, వెంటనే పంచుకోకుండా ఆలస్యం చేశాను. నన్ను క్షమించు తండ్రీ" అని ప్రార్థించి వెంటనే నా అనుభవం పంచుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. ఆశ్చర్యమేమిటంటే, ఈ అనుభవం పంపుతున్న సమయానికే నాకు కొంచెం ఉపశమనం కలిగినట్లు అనిపించింది. ఇప్పుడు నాకు 100 శాతం నమ్మకం ఉంది, 'బాబా నా బాధను త్వరలో పూర్తిగా తగ్గిస్తార'ని. నొప్పి పూర్తిగా తగ్గిన వెంటనే నా అనుభవాన్ని మళ్లీ మన బ్లాగులో పంచుకుంటాను.
ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః.
సాయిభక్తుల అనుభవమాలిక 945వ భాగం....
1. సాయి మహిమలు2. పిలిచిన పలికే దైవం, దయామయుడు బాబా
సాయి మహిమలు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శేఖర్. నేను ఏడు సంవత్సరాల నుండి బాబాకు భక్తుడిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. మా అమ్మకి హైషివరింగ్ సమస్య ఉంది. గుంటూరులోని హాస్పిటల్లో చూపిస్తే, "ఆ సమస్య CIDP అనే దీర్ఘకాలిక వ్యాధి అని, లక్షల్లో ఒకరిద్దరికి వస్తుంద"ని చెప్పారు. ఆ వ్యాధి కారణంగా మందులు వాడుతున్నా అమ్మ నడవలేకపోతున్నారు. ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కనుండి సహాయం అందించాలి. ఈ సమస్యని నయం చేయమని నేను సాయిబాబాను ప్రార్థిస్తున్నాను. ఇకపోతే, 2021, సెప్టెంబర్ 13న సచివాలయంలో పని ఉండి నేను మా అమ్మని తీసుకుని వెళ్ళాను. నరాల బలహీనత ఉన్నందువల్ల అమ్మ ఫింగర్స్ స్కాన్ చేస్తుంటే మిషన్ తీసుకోలేదు. దాంతో వాళ్ళు ఆధార్ అప్డేషన్ సెంటరులో చేయించుకోమన్నారు. కానీ అమ్మ సరిగా నడవలేరు. అందువల్ల నాకు ఏం చేయాలో అర్థంకాక బాబా మీద భారం వేసి, నాన్నకి చెప్పి వాళ్ళిద్దరిని ఆధార్ అప్డేషన్ సెంటరుకి పంపించాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఫింగర్స్ స్కాన్ అయ్యాయి.
2021, సెప్టెంబర్ 21న ఒకటే వర్షం పడుతుంటే నేను, "వర్షం తగ్గేలా చూడమ"ని బాబాని ప్రార్ధించాను. కాసేపట్లో వర్షం తగ్గిపోయింది. నేను కెసిపి సిమెంట్స్ వారి కిడ్స్ స్కూలులో కంప్యూటర్ టీచరుగా పనిచేస్తున్నాను. ఇదివరకు కరోనా తీవ్రంగా ఉన్నందువలన స్కూల్స్ లేవు. ఆరు, ఏడు నెలల తర్వాత మా స్కూలు ప్రిన్సిపాల్ నాకు ఫోన్ చేసి నన్ను స్కూలుకి రమ్మని చెప్పారు. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న రిపోర్టు తెమ్మన్నారు. బాబా చేసిన చమత్కారం చూడండి. ప్రిన్సిపాల్ కాల్ చేయడానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందే నర్సు ఫోన్ చేసి రెండో డోసు కో-వ్యాక్సిన్ వేయించుకోడానికి రమ్మని చెప్పింది. కానీ ఆ రోజు నాకు వేరే పని ఉండటం వల్ల వ్యాక్సిన్ వేయించుకోడానికి వెళ్లలేక, ముందే వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే బాగుండేదని కాసేపు బాధపడ్డాను. కానీ బాబా దయవలన రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోకపోయినా ఏ ఇబ్బందీ లేకుండా నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. అయితే అన్నిరోజులు స్కూలు లేనందున నేను కంప్యూటర్ ల్యాబ్‍లో ఉపయోగించే పాస్వర్డ్ మర్చిపోయాను. నాతో పనిచేసే ఇద్దరికీ ఫోన్ చేసి అడిగినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండగా కాసేపట్లో బాబా కృపవల్ల నాకు పాస్వర్డ్ గుర్తుకు వచ్చి సమస్య పరిష్కారమైంది. తరువాత వారానికి వ్యాక్సిన్ వేయించుకున్నాను. బాబా కృప వలన ఏ సమస్యా రాలేదు.
నేను మా స్కూల్ ప్రిన్సిపాల్‌కి, ముగ్గురు టీచర్లకి 'శ్రీసాయి సచ్చరిత్ర' పుస్తకాలు ఇద్దామనుకున్నాను. కానీ ఏ రోజు ఇస్తే బాగుంటుందో అని నెట్లో వెతుకుతుంటే, '1838, సెప్టెంబర్ 27' అన్న తేదీ కనిపించింది. ఆశ్చర్యంగా అదేరోజున అంటే సెప్టెంబర్ 27న సాయి సచ్చరిత్ర పుస్తకాలు కొరియర్ ద్వారా నాకు అందాయి. దాంతో అదేరోజు పుస్తకాలు పంపిణీ చేయాలన్నది బాబా సంకల్పంగా తలచి ఆ పుస్తకాలను నేను ఇవ్వదలచిన వాళ్ళకి ఇచ్చాను. తరువాత నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు తెరిస్తే, "గురువు యొక్క గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులౌతారు. గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడౌతాడు. భవబంధనాలు విడిపోతాయి" అన్న సాయి వచనం దర్శనమివ్వడంతో నేను ఆశ్చర్యపోయాను.
గత కొన్నిరోజులుగా నేను నా తల్లిదండ్రుల గురించి బాగా ఆందోళన చెందుతూ, 'వాళ్ళు ఈ జన్మ తరువాత స్వర్గానికి వెళ్తారా? లేక నరకానికా? లేదా మోక్షం వరిస్తుందా?' అని చాలా ఆలోచిస్తున్నాను. నరకం తలుపుకు రాగానే నాకు మా నాన్న గుర్తుకు వచ్చేవారు. ఎందుకంటే, 'నాన్న ఎక్కువగా దేవుడిని పూజించరు. నా చిన్నతనంలో ఆయనకి దేవుడిపట్ల ఉన్న నమ్మకం ఇప్పుడు లేదు'. అందువలన నాన్న గురించే ఎక్కువగా ఆలోచించేవాడిని. ఆయనకి నరకం ప్రాప్తిస్తుందా అని అప్పుడప్పుడు నాకు చాలా భయం వేసేది. అవే ఆలోచనలతో నేను 2021, అక్టోబర్ 6, ఉదయం ఇంటర్నెట్లో పితృకర్మ గురించి సెర్చ్ చేస్తుంటే, కింద ఇవ్వబడ్డ బాబా మెసేజ్ వచ్చింది.
తెలుగు అనువాదం: 'బిడ్డా! నేను ఉండగా భయమెందుకు? నేను నీకు మాటిస్తున్నాను, 'నేను నీ కుటుంబమంతటిని జాగ్రత్తగా చూసుకుంటాను. వాళ్ళు నన్ను పూజిస్తారా, లేదా అన్నది విషయం కాదు'. నువ్వు నా భక్తుడివి. నీ కుటుంబమంతా నా భాద్యత'.
అదేరోజు మధ్యాహ్నం ఈ బ్లాగులో కింది సాయి వచనం కనిపించింది.
పై రెండూ మెసేజ్లను చూడగానే నాకు చాలా చాలా సంతోషం కలిగింది.
ఇలా బాబా మనం ఉన్న పరిస్థితికి తగ్గట్టు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సందేశాలు ఇస్తున్నారు. నేను ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు శ్రీసాయిబాబాను అడుగుతాను. ఆయన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయి వచనాల రూపంలో నాకు సమాధానం ఇస్తున్నారు. బాబా మన కళ్ళముందే ఉన్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది? సాయిబాబా అనంతుడు. ఆయన సర్వవ్యాపి, బాహ్యాంతరాలలో నిండి ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని రక్షించండి తండ్రీ. నా జీవితమంతా సదా మీ సేవలో, స్మరణలో ఉండాలని కోరుకుంటున్నాను బాబా". చివరిగా అందరూ 'శ్రీసాయి సచ్చరిత్ర' పారాయణ చేసి బాబా అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా సాయిబాబాను ప్రార్థిస్తున్నాను.
పిలిచిన పలికే దైవం, దయామయుడు బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అంజలి. నేనిప్పుడు ఈమధ్య బాబా నాపై చూపిన ప్రేమను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, సెప్టెంబర్ రెండో వారంలో నా కుడికాలి మడం బాగా వాచింది. ఎందుకలా వాపు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ, బాబాని వేడుకుని రెండు రోజులు వాకింగ్ చేశాను. బాబా దయవల్ల వాపు పూర్తిగా తగ్గిపోయింది. తరువాత ఒకసారి వారం రోజులపాటు కుడివైపు పన్ను నొప్పి, దాంతోపాటు తలనొప్పి కూడా బాగా ఉండేది. చివరికి ఒకరోజు నేను, "బాబా! నా ఈ బాధను మీరే ఎలాగైనా తగ్గించాలి" అని బాబాను ప్రార్థించి, ఊదీ పెట్టుకున్నాను. ఆ రాత్రి కాస్త ఉపశమనంగా అనిపించింది. కానీ మరుసటిరోజు ఉదయం తింటుంటే బాగా నొప్పిగా అనిపించింది. ఎందుకు అంత నొప్పి వస్తుందో అప్పటివరకూ అర్థం కానిది, అప్పడు అర్థమైంది. అసలు విషయమేమంటే, ఆ పన్ను అదివరకు సగం విరిగిపోయింది. మిగిలిన సగభాగం కొంచెంగా కదులుతుండటం వలన బాగా నొప్పి వస్తుంది. అది గ్రహించాక వెంటనే నేను డెంటిస్ట్ దగ్గరకు వెళదామని అనుకున్నాను. అయితే ఆదివారం డాక్టరు లేనందున మరుసటిరోజు రమ్మన్నారు. ఇక చేసేదిలేక బాబాకి దణ్ణం పెట్టుకుని, "ఎలాగైనా ఈ బాధ నుండి నన్ను కాపాడు తండ్రీ" అని వేడుకున్నాను. ఇంకా కదులుతున్న ఆ పన్నును బాబాని తలుచుకుంటూ నేనే నా చేత్తో పీకేసాను. బలవంతంగా లాగినందువల్ల రక్తం చాలా పోతుందేమోనని భయపడ్డాను. కానీ బాబా దయవల్ల కొంచెం రక్తం మాత్రమే పోయింది. ఇక అప్పటినుండి నొప్పి లేదు. అంతా బాబా దయ. పిలిచిన వెంటనే పలికే దైవం, దయామయుడు నా తండ్రి.
మన బ్లాగులోని అనుభవమాలికలో వేరే భక్తులు పంచుకున్న లిఫ్ట్‌కి సంబంధించిన ఒక అనుభవం చూశాక నాకు కూడా జరిగిన అటువంటి అనుభవం గుర్తుకువచ్చి మీతో పంచుకుంటున్నాను. మేము ఈమధ్య బాబా అనుమతితో గుంటూరులో ఒక ఫ్లాట్ తీసుకున్నాము(దానికి సంబంధించిన పూర్తి అనుభవం కొద్దిరోజుల్లో పంచుకుంటాను). రెండోసారి ఆ ఫ్లాట్ చూడటానికి వెళ్ళినప్పుడు 5వ అంతస్థులో ఉన్న ఆ ఫ్లాట్ చూసి తిరిగి లిఫ్ట్‌లో వస్తుంటే, లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఏ ఫ్లోర్‌లో ఉన్నామో అర్థం కాలేదు. లిఫ్ట్ తలుపులు క్లోజ్డ్‌గా ఉన్నందున నాకు చాలా భయమేసింది. తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్నా తలుపు తెరుచుకోలేదు. ఇంకా నేను బాబాని తలుచుకుని, "ఏ ప్రమాదమూ జరగకుండా నువ్వే ఎలాగైనా కాపాడాలి బాబా" అని వేడుకున్నాను. అలా బాబాని వేడుకున్న కొంతసేపటికి లిఫ్ట్ తలుపు తెరుచుకుంది. బాబా దయవల్ల ఏటువంటి ఇబ్బందీ లేకుండా అందరమూ బయటపడ్డాము. పిలిస్తే పలికే దైవం నా తండ్రి. "ధన్యవాదాలు బాబా".
2021, అక్టోబర్ 1, శుక్రవారంనాడు నేను ట్రేడింగ్ బిజినెస్స్‌లో పెట్టిన డబ్బులు నష్టపోతానేమో అనిపించి నాకు చాలా బాధేసి బాబాను, "డబ్బులు నష్టపోకుండా కాపాడమ"ని వేడుకున్నాను. బాబా దయతో నా డబ్బులు పోకుండా కాపాడారు. "వేలవేల కృతజ్ఞతలు బాబా. మీ దయ నా మీద, నా కుటుంబం మీద, అందరి మీద ఎప్పుడూ ఇలాగే ఉండేలా చూడండి బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


