ఈ భాగంలో అనుభవం:
- బాబా చూపిన దయ - 1వ భాగం
సాయి బంధువులందరికీ నమస్కారాలు. నా పేరు శాంతి. మేము అమెరికాలో ఉంటున్నాము. నేను చదువుకునే రోజుల్లో రెండుసార్లు 'సాయి సచ్చరిత్ర' సప్తాహ పారాయణం చేసాను. మొదటిసారి చదివేటప్పుడు నాకు అంత భక్తి లేదు, దేవుడు గురించి కూడా అంతగా తెలియదు. ఏదో ఊరికే చదవాలనిపించి చదివాను. బాబాకి హారతి ఇచ్చి, వచ్చి సోఫాలో కూర్చున్నాను. మరుక్షణం ఇంటి ముందు ఒక బిక్షగాడు ఉండటం చూసి మా అమ్మ ఇచ్చిన ఆహారం అతనికి ఇచ్చాను. నేను అతనిని అంతకు ముందుగాని, ఆ తరువాతగాని చూడలేదు. ఆ రూపంలో బాబానే వచ్చారని అనుకున్నాను. తరువాత నేను ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మరోసారి సచ్చరిత్ర పారాయణ చేసాను. అప్పుడు హారతి అవ్వగానే బాబా వస్తారని అప్రమత్తంగా చూస్తుంటే మునపటిలాగే బిక్షగాడు వచ్చాడు. అతనిని కూడా నేనెప్పుడూ మా కాలనీలో చూడలేదు. మా అమ్మ 'బాబా వచ్చార'ని వేడివేడిగా దోశలు చేసి అతనికిమ్మని నాకు ఇచ్చింది. నేను ఆ దోశలు అతనికిస్తూ గమనిస్తుంటే, వెలిగిపోతున్న వదనంతో, చిన్న చిరునవ్వుతో 'నన్ను గుర్తుపట్టావులే!' అన్నట్టు చూశాడతను. నేను కావాలని అతని చేత మాట్లాడించాలని ఏదో ఒకటి అడుగుతుంటే, నా ఉదేశ్యం అర్థమై అతను నవ్వుతూ ఒక్క ముక్కలో బదులిచ్చారు. నేను అతని పాదాలు తాకాల్సింది. కానీ ఎవరైనా చూస్తే బిక్షగాడి పాదాలు పట్టుకుంటుందని నవ్వుతారేమోనని అలా చేయలేకపోయాను. నా దురదృష్టం అలా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. బాబా కూడా మనకి ఆలోచించుకునే సమయమివ్వరు.
ఇది జరిగి 25 సంవత్సరాలవుతుంది. కానీ అతని నవ్వు ముఖం ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉంది. ఇకపోతే, నేను మూడోసారి పారాయణ చేసినప్పుడు మేము హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం. ఆరోజు హారతి అయ్యాక చూస్తే ఎవరూ రాలేదు. సాయంత్రం వరకు ఎవరూ రాకపోయేసరికి, 'బాబా రావట్లేదు. నేను నచ్చలేదా బాబాకి' అని బాబా ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుని "బాబా! నేను చేసిన ఈ పారాయణ మీరు స్వీకరించట్లేదా? అందుకే రావట్లేదా?" అని బాధపడ్డాను. నేను అలా అనుకున్న కొంచెం సేపటికి ఒక 13ఏళ్ళ అబ్బాయి వచ్చి, "మేము శిరిడీకి వెళ్తున్నాము. ప్రయాణ ఖర్చులకు సహాయం చేయండి" అని అడిగాడు. నేను స్పందించేలోపు మా పెదనాన్న, "ఇలాంటివన్నీ నమ్మొద్దు. డబ్బులకోసం అబద్ధాలు చెప్తారు" అని అన్నారు. నేను మౌనంగా ఉండిపోయాను. ఆ అబ్బాయి అసహనంగా ముఖం పెట్టి వెళ్ళిపోయాడు(బహుశా 'రాకపోతే రాలేదని ఏడుస్తారు. వస్తే ఇలా పంపించేస్తారు' అనుకున్నారేమో ఆ రూపంలో ఉన్న బాబా). ఆ రోజు రాత్రి నాకు, 'వచ్చింది బాబానే, మరెవరో కాదని' అనిపించి శిరిడీ అని చెప్పినా కూడా నేను బాబాని గుర్తుపట్టలేదు అనుకున్నాను. ఏం చేస్తాను, నా మనసులో బాబా బిక్షగాడి రూపంలో వస్తారనే వుంది. తర్వాత అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో పారాయణలు చేసాను కానీ, బాబా దర్శనం మాత్రం లభించట్లేదు. అలా ఎందుకు చేస్తున్నారో ఆ తండ్రి!
ఇప్పుడు బాబా మాపై చూపించిన దయని పంచుకోబోతున్నాను. ఒకసారి మా కుటుంబం సెలవుల్లో న్యూయార్క్ పర్యటనకి వెళ్ళాము. న్యూయార్క్ చాలా పెద్ద నగరం. జనాభా అధికంగా ఉంటారు. అక్కడ మార్గాలు చాలా గందరగోళంగా ఉంటాయి. మేము సమీపంలో ఉన్న ప్రదేశాలు చూడటానికి సబ్వే ట్రైన్లో వెళ్లి అక్కడ అన్ని చూసాక రాత్రి తిరిగి మేము బస చేసిన హోటల్‌కి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఎక్కాము. కొంచెం దూరం వెళ్ళాక ఆ ట్రైన్ మేము అనుకున్న మార్గంలో వెళ్లట్లేదని అర్థమైంది. అది మాకు కొత్త ప్రదేశం. పైగా రాత్రి సమయమైనందున మేము చాలా కంగారుపడ్డాము. ఎందుకంటే, న్యూయార్క్‌లో రాత్రిళ్ళు బయట ఉండడం ప్రమాదకరం. నాకు ట్రైన్లో ఉన్న అన్ని దేశాల ప్రయాణికులను చూసి కొంచెం భయమేసింది. కానీ మరుక్షణం 'అందరిలో బాబా వుంటారు. చూసి భయపడొద్దు. బాబాకి అలా వేరుగా చూస్తే నచ్చదు' అనుకొని బాబాకి క్షమాపణలు చెప్పుకున్నాను. తర్వాత ధైర్యం చేసి పక్కనున్న వాళ్ళని 'ఈ ట్రైన్ ఏ మార్గంలో వెళ్తుంది?' అని అడిగితే, నిజంగానే అది మేము వెళ్లాల్సిన మార్గంలో వెళ్లట్లేదని నిర్ధారణ అయింది. ఇంతలో అక్కడున్న వాళ్ళు ఒకతనిని చూపి 'అతను రోజూ ఆ ట్రైన్లో వెళ్తుంటారని, అతనికి మార్గాలన్నీ అవగాహనా ఉంటాయని' చెప్తే, అతనిని అడిగాము. అతను నెక్స్ట్ స్టాప్‌లో దిగి ఒక ట్రైన్ నెంబర్, రంగు చెప్పి ఆ ట్రైన్ ఎక్కమన్నారు. సరేనని మేము నెక్స్ట్ స్టాప్‌లో దిగాము. అప్పటికే అతను చెప్పిన ట్రైన్ సిద్ధంగా ఉండటంతో అక్కడ ట్రైన్లు రెండు నిమిషాలకు మించి ఆగవని ఆలస్యం చేయకుండా ఎక్కేసాం. తర్వాత నేను ఎందుకో మేము అదివరకు దిగిన ట్రైన్ వైపు చూస్తే, అందులోని మాకు ట్రైన్ ఎక్కమని చెప్పినవాళ్ళు 'మేము ఎక్కిన ట్రైన్ రివర్స్ వెళ్లేదని, దిగిపొమ్మని' సైగ చేస్తున్నారు. నేను వెంటనే నా భర్తతో చెప్తే, ఆయన మా 9ఏళ్ళ పెద్దపాప చేయి పట్టుకొని ట్రైన్ దిగేసారు. నేను కూడా వేగంగా 7ఏళ్ళ మా చిన్నపాప చేయి పట్టుకొని దిగుతుంటే ట్రైన్ డోర్ క్లోజ్ అయింది. నేను కింద, పాప ట్రైన్ లోపల, తన మోచేయి డోర్ మధ్యలో ఇరుక్కుపోయింది. మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరు కదా! ట్రైన్ లోపల ఉన్నవాళ్ళు బలవంతంగా ట్రైన్ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసారు. బాబా దయవల్ల డోర్ కొంచెం తెరుచుకోవడంతో పాప బయటకి వచ్చేసింది. తనకి ఎలాంటి గాయాలు కాలేదు. మేము ఊపిరి పీల్చుకున్నాము. ఒకవేళ నేను మా పాప చేయి పట్టుకోకపోయి ఉంటే తను ఆ ట్రైన్ లోపలే ఉండిపోయి ఎక్కడికో వెళ్లిపోయేది. 7ఏళ్ళ పాపకి ఫోన్ నెంబర్ అంతగా ఏమి గుర్తు ఉంటుంది? చిన్నపిల్ల టెన్షన్‌తో ఎవరి సహాయం తీసుకుంటుంది? మేము నెక్స్ట్ ట్రైన్ పట్టుకొని వెళ్లినా తను ఎక్కడ దిగుతుందో తెలియదు. రాత్రి వేళ పోలీసులు కూడా అంతగా అందుబాటులో వుండరు. ఇలాంటి పరిస్థితులు నుండి బాబా రక్షించకపోయి ఉంటే మేము ఏమి అయిపోయేవాళ్ళమో అనిపిస్తుంది. ఇది జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది. కానీ ఆ సంఘటనను ఎప్పుడు తలుచుకున్నా వెన్నులో వణుకు వస్తుంది. మాపై ఎంతో చూపించిన సాయితండ్రికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? మరికొన్ని అనుభవాలు తరువాయి భాగంలో పంచుకుంటాను.
ఓం సాయిరామ్
ReplyDeleteBaba mi Daya bhaktulandaripaina chupinchu🥲🙏 Meenakshi ki Pelli kudirinchi, nuvve daggarundi pelli jaripinchu, please baba🥲🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omesairam ❤
ReplyDelete