ఈ భాగంలో అనుభవం:
- బాబాతో అనుబంధం
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ఈరోజు మీతో సాయితో నా పరిచయం గురించి, క్రమంగా నాలో వచ్చిన పరిణితి గురించి, ఆయనతో నా అనుబంధం గురించి పంచుకుంటున్నాను. నాకు 1990 వరకు 'సాయి' అంటే ఎవరు తెలీదు. కనీసం ఆ పేరు కూడా నేను వినలేదు. కారణం మా ఇంట్లోగాని, బంధువుల్లో గానీ బాబా భక్తులు లేరు. ఆ సంవత్సరం నేను ఎంసెట్ కోచింగ్ నిమిత్తం హాస్టల్లో ఉన్నాను. అప్పుడే నేను మొట్టమొదట బాబా గురించి విన్నాను. నా స్నేహితురాలు ఒకరు తన కుటుంబమంతా బాబా భక్తులమని చెప్పింది. అయితే ఆయన ఎవరని తెలుసుకోవాలనిగాని, ఆయన ఫోటోని చూడాలనిగాని నేను ఆ సమయంలో అనుకోలేదు. కానీ, ఇప్పుడు ఆలోచిస్తే, 'నా భక్తులను నేనే నా దగ్గరకు రప్పించుకుంటాన'ని బాబా అంటారు కదా! అది నా విషయంలో నిజమైందనిపిస్తుంది. ఎంసెట్ పరీక్షరోజు నా స్నేహితురాలి నాన్న వచ్చి పరీక్ష మధ్యాహ్నం ఉన్నందున గుడికి వెళ్ళొద్దామని అన్నారు. అప్పటికి నా తల్లిదండ్రులు ఇంకా నా దగ్గరికి రాలేదు. అందుకని నేను కూడా వాళ్లతో కలిసి గుడికి వెళ్లాను. అక్కడ ఒక ప్రాంగణంలో చాలా చిన్న మందిరాలు ఉన్నాయి. అక్కడొక రావిచెట్టు ఉంది. దాని కింద ఒక చిన్న మందిరంలో బాబా మూర్తి ఉంది. నేను అదే మొదటిసారి బాబాను చూడటం. నేను ఆ ప్రాంగణంలో వేరే దేవతలకు నమస్కరించానో, లేదో నాకు గుర్తులేదు కానీ, మొదటిసారి బాబాను చూడటం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నేను బాబాకి నమస్కరించి, "మీరు ఎవరో నాకు తెలియదు కానీ, నాకు ఈ పరీక్షలో మంచి ర్యాంకు రావాలి" అని దణ్ణం పెట్టుకున్నాను. అంతకంటే నాకు ఏమీ గుర్తులేదు. నేను మళ్ళీ ఆ గుడికి ఇంతవరకూ వెళ్ళలేదు. అసలు ఆ గుడి ఏ ప్రాంతంలో ఉందో కూడా నాకు గుర్తులేదు. ఏదేమైనా బాబా దయవల్ల నాకు ఎంసెట్ పరీక్షలో 125వ ర్యాంకు వచ్చింది. దాంతో నేను నాకు నచ్చిన కాలేజీలో మెడిసిన్ జాయినయ్యాను. అయినప్పటికీ నాకు బాబా మీద పూర్తి నమ్మకం కలగక మెడిసిన్ చదివే రోజుల్లో ఆయన గురించి మర్చిపోయాను. పరీక్షల సమయంలో హాస్టల్‌కి దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకొనేవాళ్ళం కానీ, బాబా గుడికి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. కారణం నా స్నేహితులు ఎవరికీ బాబా తెలియదనుకుంటా. నాకు సరిగా గుర్తులేదుగాని మెడిసిన్ నాలుగో సంవత్సరంలోనూ, చివరి సంవత్సరంలోనూ ఉన్నప్పుడు మరోసారి బాబా గురించి విన్నాను. మా క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు బాబా గుడికి వెళ్ళేవాడు. తాను, పరీక్ష ముందు గుడికి వెళ్లి బాబాకి దణ్ణం పెడితే మంచి మార్కులు వస్తాయని చెప్పాడు. కానీ నేను ఆ సమయంలో బాబా గుడికి వెళ్లినట్లు గుర్తులేదు.
మెడిసిన్ పూర్తైన తర్వాత హౌస్ సర్జన్ చేయడానికి నేను హాస్టల్ మారాను. అది చాలా చిన్న రూమ్. నా రూమ్మేట్ నాకు సీనియర్. తన ఎప్పుడూ రూమ్లో ఉండేది కాదు. తను తన స్నేహితులతో కలిసి పీజీ ఎంట్రన్స్ కోసం వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్నానని చెప్పేది. మా రూంలో ఒక మంచం మాత్రమే ఉండేది. రెండో మంచం వేయడానికి చోటు లేక నేను కిందే పడుకునేదాన్ని. నా స్నేహితురాలి మంచం కింద చాలా పుస్తకాలు ఉండేవి. వాటిలో సాయిలీలామృతం, గురుచరిత్ర పుస్తకాలు ఉండేవి. నేను వాటిని చూడటం అదే మొదటిసారి. కానీ నేను వాటిని చదివానో, లేదో నాకు గుర్తులేదు. పీజీ ఎంట్రన్స్‌లో నా రూమ్మేటుకి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. తను ఆ పుస్తకాలు పారాయణ చేసినందువల్లే మంచి ర్యాంకు తెచుకోగలిగిందని నేను అనుకున్నాను. దాంతో నాకు బాబా మీద ఆసక్తి కలిగింది. కానీ అది భక్తి కాదు. కేవలం ఏదో పొందవచ్చనే ఆశ అని మాత్రం చెప్పగలను. నేను అప్పుడప్పుడు బాబా గుడికి వెళ్లడం ప్రారంభించాను. ఆ బుక్స్ కూడా కొని చదవడం ప్రారంభించాను. అయితే యాంత్రికంగా, ఏదో పొందాలన్న ఆశతో చాలాసార్లు పారాయణం చేశానుగాని అందులో ఏముందో తెలుసుకోకుండా చదివాను. అలా చిన్నగా బాబా వైపు ఆకర్షితురాలినయ్యాను. బాబా నన్ను ఆయా మిషలతో నన్ను తమ వైపుకు లాక్కున్నారని అనుకుంటున్నాను.
పీజీ ఎంట్రెన్స్ పరీక్షలో నాకు నేను కోరుకున్న బ్రాంచ్‌లో డిప్లమా సీటు మొదటి ప్రయత్నంలోనే వచ్చింది. నా క్లాస్మేట్స్‌లో బాగా చదివేవాళ్ళకు కూడా సీట్ రాలేదు. నాకు మాత్రమే వచ్చింది. ఆ పుస్తకాలు చదవడం వల్లే నాకు ఆ సీటు వచ్చిందని భావించాను. బాబా మీద భక్తి పెరిగింది. కానీ ఆ భక్తి నా కోరిక తీరితే గుడికి వస్తాను, కొబ్బరికాయ కొడతాను అనే భక్తే కానీ, నిజమైన అనుబంధం కాదు.
పీజీ చదివేటప్పుడు మా పక్క వీధిలో ఒక బాబా మందిరం ఉండేది. ప్రతి గురువారం సాయంత్రం అక్కడికి వెళ్లడం అలవాటు అయింది. ఆరతి అర్థం తెలియకపోయినా అందరితో కలిసి పాడుతుండేదాన్ని. పల్లకి సేవలో కూడా పాల్గొనేదాన్ని. కొంతకాలానికి నాకు వివాహమైంది. నా భర్త నాస్తికుడు. వాళ్ళ ఇంట్లోవాళ్లకి బాబా తెలీదు. నేను అత్తింటికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో ఒక చిన్న బాబా ఫోటో చూసాను. దాన్ని నా ఆడపడుచు తన స్నేహితులతో కలిసి శిరిడీ వెళ్లి, వచ్చినప్పుడు తెచ్చిందట. నేను ఆ ఫోటో చూశాను గాని, నాకోసం నాకంటే ముందే బాబా మా ఇంటికి వచ్చారని అప్పుడు తెలుసుకోలేదు. తర్వాత మా అత్తింటివాళ్లకు తెలిసిన ఒకతను ఒక పెద్ద బాబా ఫోటో తెచ్చి వాళ్ళకి ఇచ్చారు. నేను ఆ ఫోటో తీసుకొని నా గదిలో తగిలించుకున్నాను. కానీ ఎప్పుడూ పూజించలేదు. కొన్నిరోజులకి నేను శిరిడీ వెళదామని నా భర్తని అడిగితే, తీసుకొని వెళ్లారు. అలా మొదటిసారి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకొని వచ్చాను. తర్వాత బాధ్యతల వల్ల బాబాను మర్చిపోయాను. 18 సంవత్సరాలలో ఎన్నో సార్లు ఇబ్బందులు వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ బాబాని తలచుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే, బాబా నాకు తోడుగా ఉన్నారని అనిపిస్తుంది. 2018లో మొదటిసారి ఈ బ్లాగు చూశాను. సాయి సచ్చరిత్ర గురించి తెలుసుకున్నాను. బ్లాగు వల్ల, సచ్చరిత్ర వల్ల బాబా తత్త్వం అర్థమై క్రమంగా బాబాతో అనుబంధం పెరిగింది. 2018లో రెండోసారి శిరిడీ వెళ్లాను(ఆ అనుభవాన్ని ఇదివరకు ఈ బ్లాగులో పంచుకున్నాను). 2024, జులైలో మూడోసారి శిరిడీ వెళ్ళాను. నా భర్త దేవుని నమ్మకపోయినా ఆయనకు తెలియకుండానే గురువారం దర్శనానికి బుక్ చేశారు. 2018లో కూడా ఆయనకు తెలియకుండానే దసరా రోజు దర్శనానికి బుక్ చేశారు. ఇప్పుడు బాబాతో నాకు తండ్రితో ఉన్న అనుబంధం ఉంది. ఆశతో కూడుకున్న అనుబంధం కాదు. బాబా క్రమంగా నాలో పరిమితి తీసుకుని వచ్చారు. భక్తుల అనుభవాలు చదువుతుంటే ఇంకా చాలా పరిణితి రావాలని నాకనిపిస్తుంది. ఈ వివరాలు చాలా రోజుల నుండి పంచుకోవాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు బాబా అనుమతించినట్లు ఉంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".