సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1118వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉన్నారు
2. కాపాడిన బాబా
3. ఇల్లు దొరికేలా అనుగ్రహించిన బాబా

బాబా ఉన్నారు


నా పేరు రేవతి. నేను బాబాను పూజిస్తాను. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటినుండి కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ముందుగా సాయితండ్రికి శతకోటి పాదాభివందనాలు. నేను 2002లో ఉపాధ్యాయ వృత్తిలో చేరాను. ఆ ఉద్యోగం బాబా భిక్ష. నేను ఆ వృత్తిలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఒకరోజు బాబా నా కలలో, "మొదటి ప్రయత్నంలో నీకు ఉద్యోగం రాదు, రెండవ ప్రయత్నంలో వస్తుంది" అని చెప్పారు. బాబా చెప్పినట్లే 2001లో నాకు ఉద్యోగం రాలేదు, 2002లో వచ్చింది.


కరోనా రెండో వేవ్‌లో ముందుగా మా అమ్మకి కోవిడ్ వచ్చింది. తరువాత మా ఇంటిల్లిపాదికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అమ్మ షుగర్ పేషెంట్ కావడం వల్ల ఆమెను హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. కానీ బాబా దయవల్ల అమ్మ కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి వచ్చింది. ఇంకా మేము కూడా కోవిడ్ నుండి బయటపడ్డాము. అంతా బాబా  దయే.


ఇటీవల ఒకసారి మా అమ్మకు ఏం తిన్నా జీర్ణం అవ్వక వాంతులు అయ్యాయి. మేము అమ్మకి బాబా ఊదీ పెట్టి, ఊదీ నీళ్లు త్రాగించి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. బాబా దయవల్ల అమ్మకి వాంతులు తగ్గాయి కాని, విపరీతమైన నీరసం ఉండేది. నేను బాబా ఫోటో దగ్గర, "బాబా! అమ్మకి నీరసం కూడా తగ్గేలా చూడు తండ్రి, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత మా సిస్టర్‌కి "ఊదీ నీళ్లు త్రాగించండి, ఒక గంటలో ఆరోగ్యం చేకూరుతుంది" అని బాబా సందేశం వచ్చింది. మేము అలాగే చేసాము. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న అమ్మ బాబా చెప్పినట్లే ఒక గంటలో లేచి నిదానంగా నడవసాగింది. అప్పుడు అర్థమైంది, 'బాబా మాటలు పొల్లుపోవు. అక్షర సత్యాలు. బాబా మీద నమ్మకంతో ఓపికగా ఉండటమే మనం చేయాల్సిన పని' అని.


రెండు నెలల క్రితం నా కడుపులో విపరీతమైన మంట వచ్చింది. హాస్పిటల్‌కి వెళ్తే, ఎండోస్కోపీ తీశారు. డాక్టరు రిపోర్టు చూసి, "పేగుల్లో రంధ్రం ఉన్నట్లుగా ఉంది. అది రంధ్రమా లేక మచ్చా తెలియడం లేదు" అని అనుమానం వ్యక్తం చేసి, "ఒకసారి బాడీ స్కాన్ చేద్దాం" అన్నారు. దాంతో, 'డాక్టరు ఎందుకిలా అనుమానంగా చెప్పారు. అల్సర్, క్యాన్సర్ వంటివేమైనా నాకు వస్తున్నాయా?' అని నాకు టెన్షన్ మొదలైంది. వెంటనే, "ఏమిటి సాయి? దయచేసి మీరే నన్ను రక్షించాలి తండ్రి" అని బాబాకి వేయిసార్లు దణ్ణం పెట్టుకున్నాను. తరువాత స్కాన్ చేసే గదిలో బెడ్ మీద పడుకుని 'సాయి సాయి' అనుకుంటూ లలిత అమ్మవారిని, ఆంజనేయున్ని కూడా వేడుకోసాగాను. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆ టెస్టులు, ఈ టెస్టులు చేసాక చివరికి రిపోర్టులు డాక్టరు దగ్గరకి వెళ్లాయి. వాటిని చూసి డాక్టరు, "ఏమీ లేదు, రెండు నెలలు టాబ్లెట్లు వాడండి" అని చెప్పారు. ఆ రకంగా సాయి నన్ను రక్షించారు. "బాబా! నువ్వు ఉన్నావు తండ్రి. మీకు శతకోటి ధన్యవాదాలు. ఈ అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు దేవా. ఎల్లప్పుడూ మా కుటుంబంపై కృప చూపించు తండ్రి. జన్మజన్మలందు మేము మిమ్మల్ని గుర్తు పెట్టుకునేటట్లు అనుగ్రహించండి సాయి".


కాపాడిన బాబా


నేను సాయి భక్తురాలిని. బాబా నా జీవితంలో ఎన్నో లీలలు చూపారు. ఎన్నోసార్లు కష్టాల నుంచి గట్టెంక్కించారు. ఇప్పుడు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుగ్రహాన్ని మీతో పంచుకుంటున్నాను. మావారి స్నేహితుల కుటుంబీకులు నాతో మాట్లాడుతారు. మేము ఓదార్పు కోసం మా ఇళ్ళల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరోజు మావారి ఫ్రెండ్ భార్య నాకు కాల్ చేసి, తన భర్త చేసిన పనుల గురించి చెప్పింది. నిజానికి ఆ అన్నయ్య నాకు తెలిసి మంచివారే. కానీ వాళ్లూవీళ్లూ కలిసి తమ మధ్య గొడవ జరిగేలా చేస్తున్నారని ఆమె నాతో చెప్పింది. తరువాత మావారు నన్ను, "ఆమె నీకు ఫోన్ చేసిందా?" అని అడిగారు. "చేసింద"ని చెప్తే, ఏమంటారో ఏమోనని భయపడి "లేద"ని అన్నాను. అయితే సాయంత్రానికి వాళ్ల మధ్య పెద్ద గొడవ అయ్యి మమ్మల్ని కూడా రమ్మన్నారు. అప్పుడు మావారు, "ఆమె నీకు ఫోన్ చేసిందా, లేదా" అని గట్టిగా అడిగేసరికి, "చేసింద"ని చెప్పాను. దాంతో ఆయన "నాకు ఎందుకు అబద్ధం చెప్పావు?" అన్నారు. "భయమేసి" అని చెప్పాను. అదలా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఋజువులకోసం పిలిచారేమోనని నాకు చాలా భయమేసింది. అందుచేత వాళ్ళింటికి వెళ్లేటప్పుడు, "బాబా! నన్ను ఏమి ఋజువులు అడగకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఆ భార్యాభర్తలిద్దరూ ముందు పొట్లాడుకున్నా తరువాత బాబా దయవల్ల కలిసిపోయారు. నన్ను ఏమీ అడగలేదు. దయగల బాబా నన్ను కాపాడారు. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం పంచుకోవడం ఆలస్యం చేసినందుకు దయచేసి క్షమించండి బాబా. నేను ఒక విషయంలో చాలా డోలాయమానంలో ఉన్నాను. దయచేసి నాకు దారి చూపండో బాబా. నా దృష్టి మీపై నిలిచేలా చూడు సాయి".


ఇల్లు దొరికేలా అనుగ్రహించిన బాబా

 

ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. మేము ఉంటున్న అద్దె ఇంటి వల్ల మాకు చాలా సమస్య అయింది. రెండు సంవత్సరాల, ఆరు నెలల మా బాబు ఏడవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని మా ఇంటి ఓనర్ మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నారు. ఇక్కడ యూరప్‌లో ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా మాకు ఇల్లు దొరకలేదు. కొంత సమయం కావాలని అడిగితే, ఇంటి ఓనర్ ఒప్పుకోలేదు. పైగా మా మీద కేసు పెట్టి చాలా ప్రాబ్లమ్ చేసాడు. నాకు చాలా భయమేసింది, ఇండియాకి వెళ్లిపోవాలి అనిపించింది. తరువాత మా ఫ్రెండ్ ద్వారా నాకు మహాపారాయణ గురించి తెలిసి అందులో చేరాను. బాబా దయవల్ల పారాయణ మొదలుపెట్టిన రెండో వారంలో మాకు ఇల్లు దొరికింది. 2022, మార్చ్ 5న ఆ ఇంటికి మారాం. "థాంక్యూ బాబా. సదా మాకు తోడుగా ఉండండి తండ్రి". మాకు ఇల్లు దొరికితే,  బ్లాగులో పంచుకుంటానని బాబాకిచ్చిన మాట ప్రకారం ఇలా మీతో పంచుకున్నాను. అందరికీ బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.



సాయిభక్తుల అనుభవమాలిక 1117వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కరుణించిన బాబా
2. ఎన్నో విధాలా రక్షణనిచ్చిన బాబా
3. దయతో హాస్పటల్లో చేరాల్సిన పరిస్థితి రాకుండా చూసిన బాబా

కరుణించిన బాబా


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! నేను ఒక సాయి భక్తురాలిని. తోటి సాయి బంధువులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. ముందుగా శ్రీసాయినాథుని దివ్య పాదాలకు నమస్కరించి, ఆయన నాకు ఇటీవల ప్రసాదించిన ఒక అనుభవాన్ని స్పష్టంగా తోటి సాయి భక్తులకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఒక ఉద్యోగస్తురాలిని. నా ఉద్యోగ 'సమయాలు, పనిచేసే ప్రదేశం, చుట్టూ ఉన్న మనుషులు, వారి మనస్తత్వాల కారణంగా నేను కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనుకుని మూడు నెలల ముందు అంటే 2021, అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో ముప్పై రోజులు సెలవు పెట్టాను. కానీ, 'సెలవు రద్దు చేసుకుని విధులకు హాజరవ్వమ'ని నా తోటి ఉద్యోగస్తులు చేసిన ఒత్తిడి మూలాన నేను ఆ ముప్పైరోజుల సెలవు దినాల్లో పడిన వేదన ఆ సాయినాథునికే ఎరుక. ఆ బాధాకరమైన రోజుల్లో ఈ బ్లాగు నాకు చాలా ఉపశమనం ఇచ్చింది. తోటి సాయి భక్తుల అనుభవాలను చదువుతుంటే నాలో ధైర్యం, కొత్త ఆశ చిగురించింది. నేను బాబాకు చాలా దగ్గరయ్యాను. అనుక్షణమూ నా మనసు 'బాబా బాబా' అని జపిస్తూ ఉండేది. మనసులోని భావాలను ఎవ్వరితోనూ పంచుకునే అలవాటు నాకు లేదు. కేవలం బాబా ముందర నిలబడి ఏడుస్తూ చెప్పుకుని నా సమస్య విషయంగా క్వశ్చన్ & ఆన్సర్ సైటులో బాబా సమాధానం కోసం చూసేదాన్ని. అలా చూసిన సందర్భాలలో ఒకసారి నాకు అనుకూలంగా, ఇంకోసారి "వేచి ఉండమ"ని వచ్చేది. నేను బాబాను చాలా వేదనతో, "నన్ను ఇంకో సెక్షనుకు మార్చండి బాబా ప్లీజ్" అని అడుగుతూ రోజూ సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తుండేదాన్ని. ఇలా నా సెలవు దినాలు పూర్తయి తిరిగి నేను నా విధులకు హాజరు కావాల్సిన రోజు వచ్చింది. ఆ రోజు నేను పడ్డ కంగారు కేవలం బాబాకు మాత్రమే తెలుసు. నేను ఆఫీసుకు వెళ్లి నా పై అధికారికి(చీఫ్ ఇంజనీర్), అలాగే సెక్షన్ ఆఫీసరుకి రిపోర్టు చేసాను. పైఅధికారికి రిపోర్టు చేసేటప్పుడు, "నన్ను ఇంకో సెక్షన్‌కి మార్చమ"ని అభ్యర్థించాను. అందుకాయన సానుకూలంగా స్పందించారు. కానీ తర్వాత ఆర్డర్స్ తీసుకోవడానికని నేను చీఫ్ ఇంజనీర్ గారి ఆఫీసుకు వెళ్ళినప్పుడు నా అభ్యర్థనను వారు పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది. అప్పుడు నేను బాధతో, "బాబా! ఈ బిడ్డను మళ్ళీ కష్టాల్లోకి తోసేయకండి ప్లీజ్. మిమ్మల్నే నమ్ముకున్నాను. మీరు ఉన్నారన్న ధైర్యంతో ఉన్నాను" అని చాలా దీనంగా బాబాను వేడుకుంటూ రెండు రోజులు గడిపాను. ఆ రెండు రోజుల్లో బయటకు భయంగా ఉన్నా లోపల మాత్రం 'బాబా ఉన్నారు. భయమెందుకు?' అని అనుకుంటూ ఉండేదాన్ని. చివరికి బాబా కరుణించారు. నన్ను ఇంకో సెక్షనుకు మారుస్తూ ఆర్డర్లు వచ్చాయి. కానీ అవి తాత్కాలికమైన ఆర్డర్లు అన్నారు. "ఇదేంటి బాబా?" అనుకున్నాను కానీ, "బాబా ఉన్నారు" అని నా మనసు నాకు చెప్తుంది. ఆయన కృపవలన అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం పంచుకోవడానికి చాలా ఆలస్యం చేశాను. నన్ను క్షమించండి బాబా. ఈ ఆలస్యానికి కారణాలు, ఉన్న ఇతరత్రా సమస్యలు మీకు తెలుసు బాబా. వాటిని మీరు త్వరలోనే పరిష్కరిస్తారు. అప్పుడు మళ్ళీ నా అనుభవాలను ఇందులో పంచుకుంటాను తండ్రీ. ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉండాలి బాబా".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


ఎన్నో విధాలా రక్షణనిచ్చిన బాబా


నేనొక సాయి భక్తురాలిని. సాయి బంధువులందరికీ నమస్కారం. మళ్ళీ సాయి కుటుంబంతో కలిసినందుకు, బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మేము యు.ఎస్.ఏలో ఉంటున్నాము. 2021, డిసెంబరులో మా పిల్లలకి క్రిస్మస్ సెలవులు మొదలవ్వడంతో మేము మా సిస్టర్ కుటుంబంతో కలిసి సెలవులు గడుపుదామని ప్లాన్ చేసుకున్నాము. మూడేళ్ళ తరువాత మేము, మా సిస్టర్ కుటుంబం కలుస్తున్నందుకు మేమంతా చాలా సంతోషించాము. అయితే గురువారం ప్రయాణం అవుతామనగా రెండు రోజుల ముందు మా అబ్బాయికి తీవ్రమైన జ్వరం వచ్చింది. మేము తనని వెంటనే డాక్టరు దగ్గరకి తీసుకెళ్లాము. ఆమె బాబుని పరిశీలించి, "చాలావరకు ఫ్లూ లక్షణాలున్నాయి. ఫ్లూ టెస్టుతో పాటు కోవిడ్ టెస్టు కూడా చేసి నిర్ధారించుకుందాం" అని అన్నారు. దురదృష్టవశాత్తూ బాబుకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఒక్కసారిగా మేమంతా షాక్‌కు గురయ్యాము. వెంటనే బాబును గృహ నిర్బంధంలో ఉంచాము. తరువాత ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ మేము కోవిడ్ పరీక్ష చేయించుకుంటే, మా అందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో మా ప్రయాణం రద్దు అయినందుకు నా సిస్టర్, పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. నేను కూడా చాలా బాధపడి, "బాబా! ఇలా ఎందుకు జరిగింది?" అని బాబాను అడగసాగాను. కానీ ఆయన నా కర్మను చిన్నదానితో తీసేస్తున్నారు అనుకున్నాను. ఎందుకంటే, మొదటి రెండు కరోనా వేవ్‌ల్లో మేము కోవిడ్ బారినపడి ఉంటే చాలా కష్టాన్ని అనుభవించి ఉండేవాళ్ళము. ఇకపోతే ప్రయాణానికి ముందే మాకు కోవిడ్ అని తెలియజేసి బాబా మాకు ఎంతో మేలు చేసారు. మొదటిది ప్రయాణ మార్గంలో నా పిల్లలు అనారోగ్యం పాలైతే చాలా బాధపడేవాళ్ళు. రెండవది, మేము మా సిస్టర్‌వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటే, వాళ్లంతా కూడా కోవిడ్ బారినపడి ఉండేవారు. ఇన్నివిధాలా మేలు చేయడమే కాకుండా కోవిడ్ సమయంలో మాకు పెద్ద ఆరోగ్య సమస్యలేమీ లేకుండా అనుగ్రహించారు బాబా. ఇంకో ముఖ్య విషయం, ఆ కష్ట సమయంలో 2022, జనవరి 1వ తేదీన బాబా మమ్మల్ని తమ గుడికి రప్పించుకుని ఊదీ, ప్రసాదాలను మాకు అనుగ్రహించారు. యు.ఎస్.ఏలో ఉంటున్న ఈ 18 ఏళ్లలో ఇలా ఎన్నడూ జరగలేదు. ఆశ్చర్యకరంగా అదేరోజు మా అందరికీ చాలా శక్తి చేకూరి ఎటువంటి బలహీనత లేకుండా పోయింది. మమల్ని ఆశీర్వదించడానికే బాబా ఆరోజు మమ్మల్ని గుడికి రప్పించుకుని ఊదీ, ప్రసాదాలను ఇచ్చి 'అంతా బాగుంటుంద'ని చెప్పారు. దూరదేశంలో ఉన్నందున నీడలా వెంటుండి బాబా మమ్మల్ని చూసుకున్నారని నా నమ్మకం. "బాబా! నేను ఎంత ఒత్తిడికి గురయ్యానో, మిమ్మల్ని ఎంతలా పిలిచానో మీకు తెలుసు. సదా నా పక్కన నిలబడినందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి ఇతర ఒత్తిళ్ల నుండి కూడా నన్ను విడుదల చేసి ఆటంకాలు లేకుండా నా జీవితాన్ని మలచండి బాబా. ఇంకా దయచేసి అందరికీ సహాయం చేయండి బాబా. నేను ఏదైనా తప్పు వ్రాసి ఉంటే దయచేసి క్షమించండి బాబా". త్వరలో మరో అనుభవంతో మీ అందరినీ కలుస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ బాబా చేయి గట్టిగా పట్టుకోండి. ఆయన మనల్ని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టరు. మనకొచ్చే ప్రతి సమస్య మన మంచికోసమే అయుంటుంది. మనం ఎదుర్కుంటున్న సమస్యను బాబా అప్పటికే తగ్గించి ఉంటారని, దాని పరిష్కారం ఆయన చేతిలో ఉంటుందని, సరైన సమయంలో ఆయన మనల్ని ఆ సమస్యల నుండి బయటపడేస్తారని గుర్తుంచుకోండి.


శ్రీసాయినాథార్పణమస్తు.


దయతో హాస్పటల్లో చేరాల్సిన పరిస్థితి రాకుండా చూసిన బాబా


అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. సాయి నాకు ప్రసాదించిన ఇంకొక అనుభవంతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మా బాబుకి పది నెలల వయస్సు. పుట్టినప్పటి నుంచి తనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది 2022, ఫిబ్రవరి నెలాఖరులో ఒకరోజు రాత్రి ఒంటిగంటకు తనకి బాగా వాంతులు, విరోచనాలు అయ్యాయి. అర్థరాత్రి అలా అవ్వడం వల్ల నేను చాలా భయపడ్డాను. మందులు వేసిన తర్వాత కూడా తగ్గకపోయేసరికి నేను చాలా ఆందోళనకి గురయ్యాను. విరోచనాలవ్వడం కాస్త నెమ్మదించినా వాంతులు అలాగే అవసాగాయి. అప్పుడు నేను, "బాబా! ఈరోజు సాయంత్రం వరకు బాబుకి వాంతులు కాకుండా ఉంటే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల బాబుకి వాంతులు తగ్గాయి. ఇప్పుడు బాగున్నాడు. అయితే, విరోచనాలు ఇంకా అడపాదడపా అవుతున్నాయి. కానీ అంత ఇబ్బందిలేదు. బాబా దయవల్ల తగ్గిపోతాయనే విశ్వాసంతో నా అనుభవాన్ని ముందుగానే మీతో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా. దయతో హాస్పటల్లో చేరాల్సిన పరిస్థితి రాకుండా చూసారు తండ్రి. ఇలాగే నాకున్న ఆరోగ్య సమస్య తగ్గేలా చేయండి బాబా. ఇంకా నాకున్న రెండు కోరికలు తీరుస్తారని ఆశిస్తున్నాను బాబా. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రి".



సాయిభక్తుల అనుభవమాలిక 1116వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిబాబా అనుగ్రహం
2. బాబా ఎప్పుడూ మనల్ని బాధపెట్టరు, నిరాశపరచరు
3. స్వప్నంలో బాబా ఉపదేశం

సాయిబాబా అనుగ్రహం


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. నా పేరు పి.సి.శేఖర్. నేను ఏడు సంవత్సరాలుగా సాయిభక్తుడిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. నాకు, నేను పని చేసే స్కూల్లోని నరేష్ సార్‍కి పిల్లలు లేరు. మేము 2022, ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 'ఏ దేవుణ్ణి పూజిస్తే పిల్లలు పుడతారు? ఏ హాస్పిటల్లో చికిత్స బాగుంటుంది?' అనే విషయాలపై చర్చించుకున్నాము. తరువాత నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్  చేస్తే, అక్కడ 'సాయిభక్తుల అనుభవమాలిక 1064వ భాగం....'లో సాయిని ప్రార్థించడం ద్వారా ఒక భక్తురాలికి బాబు పుట్టాడని, మరో భక్తుడి భార్య గర్భం దాల్చిందని ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. కాసేపటి క్రితం మేము చర్చించుకున్న దానికి బాబా అలా సమాధానం ఇచ్చారని చాలా సంతోషించాను.


తరువాత మహాశివరాత్రి రోజు ఉదయం నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేస్తే, "నీకోసం నేను విమానాన్ని పంపి, దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకుని వెళ్తాను. నీవు నిశ్చింతగా ఉండు!" అన్న బాబా మెసేజ్ వచ్చింది. అది చూసి నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అదేరోజు నేను అదివరకు క్రియేట్ చేసిన ఒక ఫ్రీ వెబ్సైటును ఓపెన్ చేయాలనుకుంటే ఆ వెబ్సైటు అడ్రస్ గుర్తు రాలేదు. అప్పుడు నేను సాయిబాబాను ప్రార్థించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే కాసేపట్లో ఆ వెబ్సైటు వచ్చింది. "ధన్యవాదాలు బాబా".


నేను రోజూ పొద్దున్నే సాయినాథ అష్టోత్తర శతనామావళి, సాయి కష్ట నివారణ స్తోత్రం, శ్రీసాయినాథా మూలబీజాక్షర మహామంత్ర స్తోత్రం, శ్రీసాయిబాబా అష్టకం, శ్రీసాయి ఊదీ ధారణ, మానసిక పూజ(రోజుకు నాలుగుసార్లు), సాయి సచ్చరిత్ర ఒక అధ్యాయం, గురుచరిత్రలో ఒక అధ్యాయం పారాయణ చేస్తాను. అయితే 2021, డిసెంబర్ 06న కొద్దిగా ఆలస్యమై నా నిత్యక్రమం మొదలుపెట్టేసరికి పాలబ్బాయి వచ్చే సమయం అయింది. అప్పుడు నేను బాబాను, "బాబా! పాలబ్బాయి కొంచెం ఆలస్యంగా వచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే పాలబ్బాయిని ఆలస్యంగా పంపించారు బాబా. ఈ అవకాశమిచ్చిన సాయికి, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు. "ఎల్లప్పుడూ ఇలాగే మమ్మల్ని అనుగ్రహించండి బాబా. అందరూ సచ్చరిత్ర చదివి మీ అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను తండ్రి".


బాబా ఎప్పుడూ మనల్ని బాధపెట్టరు, నిరాశపరచరు


శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!! సాయి బంధువులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. బ్లాగులో పంచుకుంటామని సాయికి చెప్పుకోవడం వల్ల చాలా సమస్యలు తీరుతున్నాయి. నేను ఈరోజు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను పంచుకోబోతున్నాను. ఈ మధ్య మానాన్న మా ఊరు వచ్చి రాత్రి తిరుగు ప్రయాణమవుతుంటే బస్సు సమయానికి రాలేదు. నిజానికి అప్పటికే చాలా ఆలస్యమైంది. చాలాసేపు వేచి చూసాక మా ఊరు వైపు వెళ్లే వేరే బస్సు వచ్చింది. నాన్న ఆ బస్సు ఎక్కారు. అయితే ఆ బస్సు ఊరికి దూరంగా రాత్రి 12 గంటల సమయంలో ఆగుతుంది. నాన్న దగ్గర చాలా విలువైన వస్తువులున్నాయి. అందువలన మాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. నేను, "బాబా! నాన్నని క్షేమంగా ఇంటికి చేర్చు. అలా జరిగితే, నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. 12 గంటలకి నాన్నకి ఫోన్ చేస్తే, "బస్సు దిగగానే తెలిసినవాళ్ళు కనిపించారు. వాళ్ళ స్కూటర్ ఉంటే ఇంటికి వెళ్తున్నాను" అని చెప్పారు. వేళకాని వేళలో బాబా నాన్నకి ఆ విధంగా సహాయం చేశారు. "ధన్యవాదాలు బాబా".


ఇంకొకసారి నాన్న వేరే వాళ్ళ దగ్గరకెళ్ళి బంగారం వస్తువొకటి తెమ్మని మాతో చెప్పారు. దాన్ని తర్వాత రోజు మేము నాన్నకి చేర్చాలి. మేము వెళ్లి ఆ వస్తువు తీసుకున్నాము. మావారు దాన్ని తన జేబులో పెట్టుకున్నారు. తర్వాత మిగతా పనులన్నీ చూసుకుని ఇంటికి వచ్చాక చూస్తే, ఆ వస్తువు జేబులో లేదు. మాకు చాలా ఆందోళనగా అనిపించింది. నేను, "బాబా! ఆ వస్తువు వెంటనే దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. తరువాత మేము వచ్చిన దారిలో వెతకడానికి వెళ్ళాము. నేను దారంతా 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని చెప్పుకుంటూ ఉన్నాను. దారంతా వెతికాము కానీ, ఆ వస్తువు ఎక్కడా దొరకలేదు. అప్పుడు మేము వెళ్లొచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి, "మీ ఇంటి దగ్గర ఎక్కడైనా పోగొట్టుకున్నామేమో! కాస్త చూడండి" అని చెప్పాము. వెంటనే ఇంటి బయట చూసిన వాళ్ళ అబ్బాయి. "రోడ్డు మీద ఆ ప్యాకెట్ పడి ఉంద"ని చెప్పారు. నేను ఆనందంతో మనసులోనే బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మన బాబా ఎప్పుడూ మనల్ని బాధపెట్టరు, నిరాశపరచరు.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


స్వప్నంలో బాబా ఉపదేశం


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నాకు బాబా అంటే చాలా ఇష్టం. ముందుగా శ్రీసాయినాథునికి నమస్కరిస్తూ ఆయన ఇటీవల నన్ను అనుగ్రహించిన తీరును నేనిప్పుడు మీకు తెలియజేస్తున్నాను. 2022, ఫిబ్రవరి 17, తెల్లవారుఝామున బాబా నాకు స్వప్న దర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో బాబా ఒక ఇంట్లో ఉన్నారు. ఆయన తమ తలకి గుడ్డ కట్టుకుని, కఫనీ ధరించి ఎంతో తేజోవంతంగా వెలిగిపోతున్నారు. ఆయన ఆ ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్న నన్ను లోపలి నుండే చూసి, బయటకు వచ్చి, "నువ్వు మహాభాగవతం చదవటం ప్రారంభించు" అని చెప్పి ఇంటి లోపలికి వెళ్లిపోయారు. నాకు చాలా చాలా ఆనందమేసింది. నాకు మెలకువ వచ్చాక కలలో బాబా నాకు ఉపదేశించిన తీరును నేను నమ్మలేకపోయాను. నేను మహాపారాయణ గ్రూపులో ఉన్నాను. ఆ రోజు నేను చేయాల్సిన పారాయణలో ఎక్కడైనా మహాభాగవతం గురించి కనిపిస్తే, 'నిజంగానే బాబా నన్ను మహాభాగవతం చదవమని చెప్పినట్ల'ని అనుకుంటూ పారాయణ ప్రారంభించడానికి పూజగదిలోకి వెళ్లి 'సాయి సచ్చరిత్ర' తెరిచాను. 18-19అధ్యాయంలోని సాఠేకి స్వప్నంలో గురుచరిత్ర పారాయణ చేయమని బాబా ఉపదేశించిన పేజీ తెరుచుకుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇకపోతే ఆరోజు నేను పారాయణ చేయాల్సింది -22వ అధ్యాయం. ఆ అధ్యాయం చివరిలో కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజూ ఏకనాథ మహారాజ్ రచించిన మహాభాగవతం చదువుతుండేవాడని కనిపించింది. నేను అనుకున్నట్టుగానే ఆ రోజు పారాయణలో మహాభాగవతం గురించి ఉండటంతో నిజంగానే బాబా నన్ను మహాభాగవతం చదవమని ఉపదేశించారని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. "ఈవిధంగా నాకు స్వప్నంలో ఉపదేశమిచ్చి నాపై కరుణ చూపిన మీకు ధన్యవాదాలు శ్రీసాయినాథా!".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1115వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కరోనా నుండి కాపాడిన బాబా
2. తలచినంత మాత్రాన్నే సమస్యలను పరిష్కరించే దయామయుడు సాయినాథుడు
3. బాబాను నమ్ముకున్నవారికి ఎలాంటి బాధా ఉండదు

కరోనా నుండి కాపాడిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారిపై బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నేనొక సాయిభక్తురాలిని. బాబా మాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2022, జనవరి 20వ తేదీన మా అమ్మకి కొద్దిగా జలుబు చేసింది. మరుసటిరోజుకి జలుబు ఎక్కువ అవడంతోపాటు దగ్గు కూడా మొదలైంది. నాకు కొంచెం టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే, బయట ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అదీకాక, అమ్మకి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి, వయసు కూడా ఎక్కువే. అమ్మని టెస్టు చేయించుకోమంటే, "మామూలు జలుబు అయుంటుంది" అని అంది. అయితే మరుసటిరోజుకి జ్వరం కూడా మొదలైంది. దాంతో ఇంకా ఆలస్యం చేయొద్దని టెస్టు చేయించాము. రిపోర్టు పాజిటివ్ అని వచ్చింది. ఇంకా సి.టి స్కాన్ వాల్యూ 17 అని వచ్చింది. నేను, "బాబా! అమ్మని మీరే కాపాడాలి తండ్రీ" అని బాబాను వేడుకుని, ఆయన మీదే భారం వేశాను. మాకు తెలిసిన డాక్టరుకి అమ్మ రిపోర్టులు పంపించాము. డాక్టరుగారు మందులు రాసి పంపించి, "ఈ మందులు వాడండి. టెన్షన్ పడకండి" అని చెప్పారు. మామూలుగా అమ్మ తనకున్న ఆరోగ్య సమస్యలకు హోమియో మందులు వాడుతుంది. తనకి అల్లోపతి మందులు పడవు. అయినా బాబా మీద భారం వేసి మందులు వాడడం మొదలుపెట్టాము. అమ్మకి రెండురోజుల్లో జ్వరం తగ్గింది, కానీ జలుబు, దగ్గు ఎక్కువగానే ఉండేవి. డాక్టరుగారు 5 రోజుల మందుల కోర్సు వాడమని చెప్పారు. ఆ కోర్సు పూర్తయ్యేలోపు జలుబు చాలావరకు తగ్గింది. కానీ దగ్గు మాత్రం అలాగే ఉంది. మళ్ళీ డాక్టరుగారికి కాల్ చేసి చెప్తే, సిరప్ కంటిన్యూ చేయమని చెప్పారు. అంతటితో బాబా చూపిన ప్రేమవల్ల అమ్మ కరోనా నుంచి త్వరగానే కోలుకుంది. కానీ తనకు నీరసంగా ఉండేది.


ఇకపోతే, అమ్మ అనారోగ్యం పాలైన నాలుగు రోజుల తర్వాత నా భర్తకి కూడా కొన్ని కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్టు చేయిస్తే, రిపోర్టు నెగిటివ్ వచ్చింది. అయినా మావారు మందులు వాడారు. బాబా దయవల్ల నా భర్త కూడా ఏ ఇబ్బందీ లేకుండా త్వరగా కోలుకున్నారు. అయితే అమ్మకి, నా భర్తకి కరోనా లక్షణాలన్నీ తగ్గాక నాక్కూడా లక్షణాలు మొదలయ్యాయి. టెస్టు చేయిస్తే, పాజిటివ్ వచ్చింది. ఆ స్థితిలో నేను ఇంక అమ్మవాళ్ళకి వంట చేసి పెట్టలేక 'అన్నీ బాబానే చూసుకుంటార'ని ఆయన మీదే భారం వేశాను. ఆయన దయవల్ల నాక్కూడా ఒక ఐదు రోజుల్లో తగ్గిపోయింది. అమ్మకి కరోనా ఉన్న సమయంలో మేము ఎక్కువగా మా నాన్నగారి గురించి టెన్షన్ పడ్డాము. ఎందుకంటే, నాన్నకి ఆస్తమా ఉంది. కానీ, బాబా కృపవలన నాన్నకి, అన్నయ్యకి, మా పిల్లలకి ఏ ఇబ్బందీ కలగలేదు. ఏదేమైనా బాబా చూపిన కరుణవల్ల అందరమూ ఏ ఇబ్బందీ లేకుండా కరోనా నుంచి బయటపడ్డాము. కానీ ఈమధ్య అమ్మ ఆరోగ్యం మళ్ళీ బాగుండడం లేదు  "బాబా! మీరే అమ్మకి ఏ ఆరోగ్య సమస్యగానీ, ఇంకా ఏ ఇతర సమస్యలుగానీ లేకుండా కాపాడాలి తండ్రీ. అలాగే నాన్న ఆరోగ్యాన్ని కాపాడు తండ్రీ. అమ్మకి, నా భర్తకి కరోనా తగ్గాక మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మీకు చెప్పుకుని ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. దయచేసి కరోనాని పూర్తిగా అంతమొందించండి బాబా. ప్రతిఒక్కరూ మీ పాదాలను గట్టిగా పట్టుకుని ఎప్పటికీ మీ నామస్మరణ చేస్తూ ఉండేలా అనుగ్రహించండి బాబా. మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ ఉండాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను తండ్రీ". చివరిగా, బాబా మాకు ప్రసాదించిన అనుభవాలన్నీ చదివిన మీ అందరికీ ధన్యవాదాలు. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి.


సర్వేజనాః సుఖినోభవంతు.

సాయి రక్షక శరణం దేవా.


తలచినంత మాత్రాన్నే సమస్యలను పరిష్కరించే దయామయుడు సాయినాథుడు.


సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నేను ఈరోజు మీతో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఆమధ్య ఒకసారి మా అమ్మ తన ఎడమచేయి భుజం నుండి వేళ్ళ వరకు విపరీతంగా లాగుతోందనీ, తిమ్మిర్లు ఎక్కుతున్నాయని రోజూ చెప్తూ ఉండేది. నేను అమ్మతో, 'బాబాకు కిచిడీ నైవేద్యం పెడతానని మరియు నవగురువారవ్రతం చేస్తాన'ని మ్రొక్కుకోమని చెప్పాను. అమ్మ అలాగే మ్రొక్కుకుంది. మరుసటిరోజు ఉదయం అమ్మ తన చెయ్యి బాధ చాలావరకు తగ్గిందని చెప్పింది. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది.


మా పెద్దమ్మాయికి PCOD సమస్య ఉంది. వాడుతున్న మందుల వలన పెద్దగా ఫలితం కనిపించలేదు. మందులు మార్చాలంటే స్కానింగ్ చేయాల్సి ఉంది. అయితే రెండునెలలపాటు ఎంత ప్రయత్నించినా స్కానింగ్‍కు వెళ్ళడానికి వీలుపడలేదు. తరువాత ఒక ఆదివారం నిద్రలేవగానే నేను బాబాని తలచుకుని, "బాబా! ఈరోజు ఎలాగైనా స్కానింగ్ చేయించేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా దయవలన అనుకోకుండా ఆరోజు స్కానింగ్ సెంటర్‌కి వెళ్లడం, స్కానింగ్ చేయడం, రిపోర్టు కూడా అదేరోజే రావడం జరిగిపోయాయి. 


గత రెండు సంవత్సరాల నుండి మా ఇంటి దగ్గర ఉన్న ఒక దేవతకు పూజ చేయకపోవడం వల్ల నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఎంత చెప్పినా మావాళ్ళు పూజ చేసేవాళ్ళు కాదు. అప్పుడు నేను బాబాతో, "బాబా! మా డబ్బులతో అయినా పూజ చేయించండి. అలాగే ఏ సమస్యా రాకుండా చూసుకోండి" అని చెప్పుకున్నాను. బాబా నేను కోరుకున్నట్లే చేయించారు. ఇంకా ఏ సమస్యా రాకుండా చూసుకున్నారు. అదే సమయంలో నేను సరిగ్గా 20 నిమిషాలు కూడా నిలబడలేకపోయేదాన్ని, కాళ్ళు విపరీతంగా లాగేవి, చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బాబా ఊదీ తీసుకుని, "తండ్రీ! ఈ ఊదీ నా కాళ్ళకు రాస్తాను. నా కాళ్ళనొప్పి తగ్గించండి బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన మూడునాలుగు రోజులు ఊదీ రాయడంతో నా కాళ్లనొప్పి తగ్గి నేను నిలబడగలుగుతున్నాను. తలచినంత మాత్రాన్నే సమస్యలను పరిష్కరించే దయామయుడు సాయినాథుడు. ఆయనకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే.


బాబాను నమ్ముకున్నవారికి ఎలాంటి బాధా ఉండదు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద  సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రావణి. నేనొక సాయిభక్తురాలిని. గత 22 సంవత్సరాలుగా మా ఇంట్లో అందరమూ సాయిభక్తులం. మా ఇంట్లో ఎవరికి ఏ బాధ కలిగినా మేము మన బాబానే ప్రార్థిస్తాము. ఒకసారి నెలసరి సమయంలో నాకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. నేను అస్సలు తట్టుకోలేకపోయాను. అప్పుడు నేను, 'ఓం సాయిరామ్' అని స్మరిస్తూ, "బాబా! నా ఈ కడుపునొప్పి తగ్గితే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అలా మ్రొక్కుకున్న 30 నిమిషాల్లో కడుపునొప్పి తగ్గిపోయింది. బాబా దయవల్ల ఏ బాధా లేకుండా హాయిగా నిద్రపోయాను.


ఒకరోజు నాకు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల గుండె దగ్గర మరియు వెన్నులో చాలా నొప్పిగా అనిపించింది. ఆ కారణంగా నేను పడుకోలేను, నడవలేను, పైగా శ్వాస కూడా సరిగా అందట్లేదు. దాంతో నాకు ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. కానీ అంతలోనే, 'మన బాబా ఉండగా నాకేం అవదు' అని ధైర్యం తెచ్చుకుని 'ఓం శ్రీసాయినాథాయ నమః' అని స్మరిస్తూ, "బాబా! మీ దయతో నా ఈ సమస్య పరిష్కారమైతే,  ఈ అద్భుతాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. అలా అనుకున్నంతనే మన బాబా నా సమస్యను పరిష్కరించారు. బాబాను నమ్ముకున్నవారికి ఎలాంటి బాధా ఉండదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


'ఓం శ్రీ సాయినాథాయ నమః'.



రావుబహద్దూర్ ఎస్.బి.ధుమాళ్ - మొదటి భాగం...



శ్రీసాయిని ప్రత్యక్షంగా దర్శించి, వారిని ఎంతగానో ప్రేమించిన ప్రముఖ సాయిభక్తులలో ఎస్.బి.ధుమాళ్ ఒకరు. ఇతను 1873లో జన్మించాడు. ఇతని స్వస్థలం మహారాష్ట్రలోని నాశిక్. ఇతను వృత్తిరీత్యా ప్లీడరు(లాయర్). ఇతనికి బాబా ప్రసాదించిన అనుభవాలను తెలుసుకునేముందు, అనుభవాలు పంచుకునే విషయంలో ధుమాళ్ వెల్లడించిన అభిప్రాయాలను అతని మాటల్లోనే చూద్దాం...

1936వ సంవత్సరంలో శ్రీబి.వి.నరసింహస్వామిగారు సాయిభక్తుల అనుభవాలను సేకరించే క్రమంలో ఎస్.బి.ధుమాళ్‌ను కలిసి, ‘బాబాతో మీ అనుభవాలేమిటో చెప్పండి’ అని అడిగినప్పుడు ధుమాళ్ వారితో ఇలా అన్నారు:


"బాబాతో మీ అనుభవాలేమిటి?" అని మీరడిగిన ప్రశ్నకు నేనేమి సమాధానం చెప్పగలను? ఒకటా, రెండా? ప్రతిరోజూ, ప్రతిక్షణమూ బాబా నాకు అనుభవాలను ప్రసాదిస్తూనే ఉన్నారు. నా జీవితంలో బాబా ప్రమేయం లేని సంఘటన అంటూ ఏదీ లేదు. అది ఎంతటి చిన్న విషయమైనా! నేను చేసే ప్రతి పనీ, వేసే ప్రతి అడుగు బాబాచే నిర్దేశింపబడిందే! అలాంటప్పుడు, దేనిని నా అనుభవంగా చెప్పగలను? బయటి ప్రపంచం నా మాటలు నమ్మకపోవచ్చు. నేను ఆ విషయం పట్టించుకోను. వాస్తవానికి ఎవరైనా తమ అనుభవం వెల్లడి చేయకపోవడానికి, ఎదుటివారు ఆ అనుభవాన్ని నమ్మకపోవడం ఒకానొక కారణం కావచ్చు. ప్రతిభక్తుడు తనకు కలిగిన అనుభవం తనకు మాత్రమే సంబంధించినదనీ, అది తన ఐహిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమే ప్రసాదింపబడిందనీ అనుకుంటాడు. అంతేగానీ అజ్ఞానులు, కువిమర్శకులు, అకారణంగా అపహసించేవారితో నిండివుండే సామాన్య ప్రజానీకానికి ప్రకటించేందుకు కాదని భావిస్తాడు. అయితే, పట్టుదలగల చరిత్రకారులు, వాళ్ళు వ్రాస్తున్న గ్రంథాలను మెరుగుపరుచుకోవడానికి భక్తుల ఆంతరంగిక రహస్యాలను, అనుభవాలను వెలికి తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ, తాను గోప్యంగా ఉంచుకున్న తన అనుభవాన్ని బహిర్గతం చేసే ప్రక్రియలో, ఆ అనుభవం యొక్క జీవము, సారము నాశనమైపోతుందని భక్తుడు భావిస్తాడు. శరీరధర్మశాస్త్రజ్ఞుడు ప్రాణమున్న జీవిని అణువణువూ పరీక్షించదలచి, తనకు కావలసిన భాగాలను కోసి మైక్రోస్కోప్‌లో పెట్టి పరీక్షిస్తాడు. కానీ, అలా చేసే ప్రక్రియలోనే ఆ జీవి యొక్క ప్రాణం పోతుంది. చివరకు అతడు పరీక్షించేది నిర్జీవ పదార్థాన్నే. బాబాను గురించి తెలుసుకోవాలంటే, స్వయంగా బాబా ఇచ్చే అనుభవాలను పొంది తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గం. బాబా ఎక్కడికీ వెళ్ళలేదు. వారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. మహాసమాధి ముందుకన్నా ఇప్పుడు తమ కర్తవ్యాన్ని మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శ్రద్ధగలవారికి ఈనాటికీ బాబా సన్నిధి అనుభవైకవేద్యం. కానీ అలా శ్రద్ధను పెంపొందించుకోకుండా ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అనుభవాలు చేరే క్రమంలో వాటిలోని ఆంతర్యం అస్పష్టమవుతుంది, శక్తి తరిగిపోయి బలహీనమవుతుంది. దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు.


స్వభాషలో వ్యక్తం చేసిన అనుభవాలకు ప్రాముఖ్యత, శక్తి ఉంటాయి. నేను చెప్పిన అనుభవాలను మీరు ఆంగ్లంలోనికి అనువదించి పాఠకులకందిస్తారు. ఇలా భాషాంతరీకరణము చేసే ప్రక్రియలో మూలభావానికి లేదా అనుభవానికి జరిగే నష్టం తీవ్రంగానే ఉంటుంది. ఏదేమైనా మీరు బాబాను గురించి కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి నేను యదార్థమని దృఢంగా చెప్పగలిగిన నా అనుభవాలను కొన్నింటిని వివరిస్తాను. నేను ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తున్నట్లే, బాబా కూడా నా గురించి ఆలోచించేవారు. వారిని గురించిన నా ఆలోచన ప్రేమతో నిండివున్నప్పటికీ అది శక్తిహీనమైనది, వారికి నిజమైన సేవ చేసుకోలేనిది. కానీ, బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉండేది! ఈ విషయాన్ని ఋజువు చేయడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. నేను పొందిన, పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించినదే. దీనిని ఇతరులు నమ్మకపోవచ్చు. కానీ బాబా నాకు సహాయపడిన కొన్ని సందర్భాలు ఎంత స్పష్టమైనవంటే సరియైన దృక్పథం గల జిజ్ఞాసువులెవరైనా బాబా మాటల్లోని, నా మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తారు. నిజానికి బాబాతో నా అనుభవాలు ఇవీ అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చర్య, ప్రతి సంఘటన బాబాచే మలచబడింది. బాబా తత్త్వాన్ని, నాలాంటి భక్తులకు వారు చేసిన, ఇంకా చేస్తున్న సహాయాన్ని తెలియజేసే బాబా చర్యలను, వారి ప్రబోధాన్ని మీతో పంచుకుంటాను”.


ఇక ఇప్పుడు ధుమాళ్‌కు బాబా ప్రసాదించిన అనుభవాలను తెలుసుకుందాం:


ధుమాళ్‌ మొదట్లో శ్రీగజానన్ మహరాజ్ యొక్క భక్తుడు. ఆ మహాత్ముడిని తన సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటీ వద్దకు తీసుకెళ్ళాడు ధుమాళ్. సుమారు 1907లో ధుమాళ్ ప్రథమంగా బాబాను దర్శించాడు. ఆ ప్రథమ దర్శనంలోనే బాబా అసాధారణమైన వ్యక్తిత్వం అతనిని అమితంగా ఆకర్షించింది. తరువాత అతను బూటీని కూడా బాబా వద్దకు తీసుకెళ్ళాడు. బూటీని తన వద్దకు తీసుకురమ్మని బాబా వాచా ఆదేశించనప్పటికీ బూటీని బాబా దగ్గరకు తీసుకెళ్ళడం బాబా ప్రేరణగానే భావించాడతను. ఆ తరువాత బూటీ కూడా బాబా భక్తుడయ్యాడు. 1918లో బాబా మహాసమాధి చెందిన తరువాత బూటీ నిర్మించిన భవంతిలోనే బాబా భౌతికదేహం సమాధి చేయబడింది. అదే ఈనాడు 'సమాధిమందిరం'గా రూపొంది, ఎందరో భక్తులు బాబాను పూజించుకోవడానికి అవకాశమేర్పరిచింది. బాబాకు బూటీ చేసిన సేవలలో అది చిరస్మరణీయమైనది.


ఒకసారి ధుమాళ్‌తో బాబా, “నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను. లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎఱుక!” అన్నారు. అది అతిశయోక్తి కాదు. బాబా త్రికాలజ్ఞులు కాబట్టి, మనం చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు సరియైనదో కాదో తెలుసుకొని సరియైన మార్గంలో నడిపిస్తుంటారు. బాబా మనలను సర్వదా జాగరూకతతో గమనిస్తూ రాబోయే ప్రమాదాల నుండి కాపాడి మనకు మంచి జరిగేటట్లు చూస్తుంటారు. మరోసారి, తమ సన్నిధిలో ధుమాళ్ మాత్రమే ఉన్నప్పుడు బాబా అతనితో, "భావూ, నాకు రాత్రంతా నిద్రపట్టలేదు” (ధుమాళ్‌‌ను బాబా "భావూ” అని పిలిచేవారు) అని అన్నారు. అందుకు ధుమాళ్, "ఎందుకు బాబా?" అని అడిగితే, "రాత్రంతా నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను" అన్నారు బాబా. ఆ మాటలు విన్నంతనే, బాబా తనపై చూపుతున్న ప్రేమకు, తన శ్రేయస్సుకోసం వారు తీసుకుంటున్న శ్రమకు ధుమాళ్ మనసంతా ఆనందంతోనూ, బాబాపట్ల ప్రేమతోనూ, కృతజ్ఞతతోనూ నిండిపోగా ఆనందభాష్పాలతో బాబా పాదాలకు నమస్కరించుకున్నాడు.


బాబా సశరీరులుగా ఉన్నప్పుడు తన సమస్యల పరిష్కారానికై ధుమాళ్ తరచూ బాబాకు ఉత్తరాలు వ్రాస్తుండేవాడు. మాధవరావు దేశ్‌పాండే(షామా) వాటిని బాబాకు చదివి వినిపించి, బాబా చెప్పిన విధంగా సమాధానాలను వ్రాసి ధుమాళ్‌కు పంపేవాడు. అంతేకాదు, (బాబా సశరీరులై ఉన్న కాలంలోనే) కొన్ని సందర్భాలలో ధుమాళ్ తన సమస్యల పరిష్కారానికై బాబాను ప్రార్థించి, వారి పటం ముందు చీటీలు వేసేవాడు. ఆ చీటీలో వచ్చినదానిని బాబా ఆదేశంగా భావించి తు.చ తప్పకుండా పాటించేవాడు. బాబా మహాసమాధి అనంతరం కూడా అతను ఇదే పద్ధతిని కొనసాగించాడు. ఇది సమాజానికి శాస్త్రవిరుద్ధంగా, అవివేకంగా అనిపించినప్పటికీ అతను వాటినే తు.చ తప్పకుండా పాటించేవాడు. ఈ పద్ధతి ద్వారా బాబా ఇచ్చిన ఆదేశాలు ఎల్లప్పుడూ అతనికి శ్రేయోదాయకంగానే ఉండేవి.


నాశిక్ మెయిన్‌రోడ్డులో ఉన్న తన పూర్వీకుల ఇంట్లోనే తన జీవితాంతం నివసించాడు ధుమాళ్. ఒకసారి నాశిక్‌లో ప్లేగువ్యాధి ప్రబలింది. ధుమాళ్ నివసిస్తున్న ఇంట్లో కూడా చచ్చిన ఎలుకలు కొన్ని కనిపించాయి. వెంటనే అతను ఈ విషయాన్ని బాబాకు ఉత్తరం ద్వారా తెలియజేశాడు. బాబా ఆదేశం లేనిదే అతను ఏ పనీ చేసేవాడు కాదు. తాను సదా బాబా రక్షణలోనే ఉన్నందువల్ల, బాబా నుండి సమాధానం వచ్చేవరకు ఆ ఇంట్లోనే గడపడం క్షేమమని భావించి ధుమాళ్ అక్కడే ఉన్నాడు. “నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నేను మార్గదర్శకునిగా ఉంటాను” అని బాబా అతనితో చెప్పేవున్నారు. అతనికి బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నాశిక్‌లోనూ, ఇతర ప్రదేశాలలోనూ జరుగుతున్న, జరగబోయే సంఘటనలు సర్వమూ బాబాకు తెలుసు కనుక, ఒక పసిబిడ్డలా బాబాపై ఆధారపడిన తనకు ఎటువంటి హానీ కలుగకుండా బాబా కాపాడుతారన్నది అతని నమ్మకం. అతను బాబాపై పెట్టుకున్న ఈ నమ్మకం ఏ ఒక్క విషయంలోనూ వమ్ము కాలేదు.


‘ఆ ఇంటిని విడిచి వేరే ఇంటికి మారు’ అని బాబా నుండి సమాధానం రావడంతో, ధుమాళ్ వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి నాశిక్‌లోని వేరొక బంగళాకు నివాసం మార్చాడు. కానీ, ఆ బంగళాలో చేరిన రాత్రే అతని సోదరుని కుమారుని పడక దగ్గర చచ్చిన ఎలుక ఒకటి కనిపించింది. ఈ విషయాన్ని బాబాకు మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ, తిరిగి వేరొక ఇంటికి మారమంటారేమో తెలుపమని కోరాడు ధుమాళ్. ఈసారి, ‘మారవద్దు’ అని బాబా నుండి సమాధానమొచ్చింది. డాక్టర్లు, స్నేహితులు ఆ బంగళాలో ఉండటం శ్రేయస్కరం కాదనీ, వేరే ఇంటికి మారిపొమ్మనీ ధుమాళ్‌కు సలహా ఇచ్చారు. కానీ, అతనికి బాబా మాటే వేదవాక్కు. బాబా కృప తనపై ఉన్నంతవరకు ఏ ఆపదా సంభవించదని అతని నమ్మకం. అందువల్ల ఎవరి సలహాలు పాటించకుండా అతను ఆ బంగళాలోనే నివసించసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత, పనివాళ్ళ గదులలోను, ఇంటి లోపల, బయట ఆవరణలోనూ చచ్చిన ఎలుకలు ఎన్నో కనిపించాయి. చివరకు వాళ్ళు త్రాగడానికి, వంటకు ఉపయోగించే మంచినీటి బావిలో కూడా చచ్చిన ఎలుక కనిపించింది. దాంతో, ఇక ఆ బంగళాలో ఉండటం మంచిది కాదని తోచి, అన్ని విషయాలు బాబాకు వివరంగా ఉత్తరం వ్రాసి, ఇల్లు మారడానికి అనుమతించవలసిందిగా ప్రార్థించాడు ధుమాళ్. ఈసారి వేరే ఇంటికి వెళ్ళడానికి బాబా తప్పక అంగీకరిస్తారని తలచి సామానంతా సర్ది, మూటలు కట్టి, 'బజార్' వీధిలోనున్న తమ ఇంటికి బండిలో పంపాడు. తరువాత కుటుంబంతో సహా వేరొక బండిలో ఆ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తాళం తీయడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో శిరిడీ నుండి వచ్చిన ఉత్తరం అందింది. అందులో, "మనం నివసిస్తున్న ఇంటిని ఎందుకు విడిచిపెట్టాలి? (ఆపణ్ కశాలా సోడావే? తేత్తేచ్ రాహావే)" అన్న బాబా సందేశం ఉంది. ధుమాళ్ మరేమీ ఆలోచించలేదు. బాబా ఆజ్ఞను శిరసావహించి, వెంటనే ఖాళీ చేసి వచ్చిన బంగళాకు తిరిగివెళ్ళి తన కుటుంబంతో అక్కడే నివసించసాగాడు. నీటి విషయంలో మాత్రం వారు కాస్త జాగ్రత్త వహించి, గోదావరి నుండి నీటిని తెప్పించి వాడుకోసాగారు. నాశిక్‌లో ప్లేగు బాగా వ్యాపించి రోజుకు 14-15 మంది చనిపోతున్నా, బాబా మాత్రం వారిని అదే ఇంటిలో నివసించమని ఆదేశించారు. చూసేవారికి ధుమాళ్ చేసిన పని అవివేకంగానూ, ప్రమాదకరమైనదిగానూ అనిపించినప్పటికీ బాబా అనుగ్రహంతో వారికి ఎటువంటి హానీ జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు.


ధుమాళ్‌పై బాబా అనుగ్రహం కేవలం ప్రాపంచిక విషయాలకే పరిమితం కాలేదు. 1909లో అతని భార్య మరణించింది. ఆమె ఆత్మశాంతి కోసం అతను ప్రతినెలా 'మాసికం' పెట్టేవాడు. ఆరవ మాసికం పెట్టవలసిన సమయం ఆసన్నమైనప్పుడు బాబా అతనితో, "ఈసారి మాసికం శిరిడీలో పెట్టు. నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను" అన్నారు. బాబా ఆదేశానుసారం ఆరవ మాసికం శిరిడీలో పెట్టాడు ధుమాళ్. బాబా అతనిని 15 రూపాయలు దక్షిణ అడిగారు. అతను దక్షిణ సమర్పించాడు. బాబా మాటలపై ధుమాళ్‌కు అచంచల విశ్వాసముంది. బాబా మాటలు అక్షరసత్యాలని అనేక ఋజువులు దొరికినందువల్ల బాబా పట్ల అతని విశ్వాసం ఎంతో దృఢపడింది. ఈ నమ్మకం అతనికి తెలియని అతీత విషయాలపై (ఋజువుపరచలేని) కూడా నమ్మకమేర్పడడానికి తోడ్పడింది. అందువల్ల, బాబా అనుగ్రహంతో తన భార్య సద్గతి పొందిందని ధుమాళ్ సంపూర్ణంగా విశ్వసించాడు.


1909 సంవత్సరం నాటికి ధుమాళ్ వయస్సు 36 యేళ్ళు. అతను ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. పైగా పేరున్న న్యాయవాది కూడా. దానికి తోడు సంతానం లేకుండానే అతని భార్య చనిపోయినందువల్ల, అతని స్నేహితులు, బంధువులు అతనిని ద్వితీయ వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. వీరిలో నాగపూరుకు చెందిన న్యాయవాది, ధుమాళ్ మామగారైన రావుబహద్దుర్ బాపూరావ్ దాదాకింఖేడే కూడా ఉన్నారు. బాబా అనుమతి లేనిదే తాను ఏ పనీ చేయనని ధుమాళ్ తన మామగారికి చెప్పాడు. అందువల్ల ఆయన ధుమాళ్‌ను శిరిడీ తీసుకెళ్ళారు. ముందు ఆయనొక్కరే మసీదులోనికి వెళ్ళి బాబాతో మాట్లాడి, ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి, ‘బాబా కనులలో విముఖత కనిపించిందనీ, బాబా ఆజ్ఞ లేకుండా ద్వితీయ వివాహం చేసుకోవద్ద’నీ ధుమాళ్‌తో చెప్పారు. బాబా అనుజ్ఞకు విరుద్ధంగా ధుమాళ్ ఏనాడూ నడుచుకోలేదు. బాబా తన వివాహానికి సమ్మతించనందున తన మిగిలిన జీవితమంతా ఒంటరితనంలోనే బాబా అనుగ్రహంతో ఆనందంగా గడిపాడు ధుమాళ్.


ప్రాపంచిక జీవితంలో ధుమాళ్ సాధించిన విజయాలు ఎనలేనివి. వృత్తిపరంగా అతని విజయ పరంపరలు మకుటాయమానమైనవి. అతను ఆర్థికంగా ఎదిగాడు. అతను చెల్లిస్తున్న ఆదాయపుపన్నే అందుకు నిదర్శనం. ఇదంతా కేవలం బాబా అనుగ్రహంతోనే సాధ్యమయింది. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ బాబా అతనిని ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండేట్లు చేశారు. బాబా అతనికి విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తరువాత పారమార్థిక విషయాల వైపు అతని దృష్టిని మరలించారు. బాబా చర్యలు నిగూఢాలు, అనూహ్యాలు. అతనికి ప్రాపంచిక - పారమార్థిక విషయాలపట్ల చింత లేకుండా చేసి, వారి చెంత శరణాగతి పొందడానికి, వారి ఆదేశం అందిన వెనువెంటనే అన్నీ వదిలి వెళ్ళేందుకు ధుమాళ్‌ను సమాయత్తపరిచారు బాబా.


బాబా అనుమతితో ధుమాళ్ ప్రజోపయోగ కార్యాలు చేపట్టాడు. వీటన్నింటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపిస్తుంది. ముందుగా, అతని న్యాయవాద వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలను తెలుసుకున్న తరువాత ప్రజోపయోగ కార్యక్రమాలలోనూ వారు అతనికి ఎలా తోడ్పడ్డారో తెలుసుకుందాం. వీటిలో కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నప్పటికీ అవి వాస్తవాలు. 


సుమారు 1911వ సంవత్సరంలో శిరిడీ నుండి ఒక క్రిమినల్ కేసు ధుమాళ్ వద్దకు వచ్చింది. చాలా గ్రామాలలో మాదిరిగానే శిరిడీలో కూడా పార్టీ తగాదాలు, ముఠాకక్షలు ఉండేవి. ఒక మార్వాడీ స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని, మరో ఐదుమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాలామంది ఉన్నట్లు చూపించారు. న్యాయమూర్తి వాళ్ళకి ఆరునెలల కారాగార శిక్ష విధించాడు. తాత్యాకోతేపాటిల్‌కు వీళ్ళపై ప్రత్యేకమైన అభిమానం, జాలి ఉన్నాయి. వాళ్ళనెలాగైనా విడుదల చేయించాలని తలచి, న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుప్రతులను తీసుకొని, అప్పుడు శిరిడీలో ఉన్న ప్రముఖ న్యాయవాదులైన దీక్షిత్, ఖాపర్డే మరియు మెజిస్ట్రేటుగా రిటైరైన హెచ్.వి.సాఠే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ ప్రతులను చదివి, తీర్పు చాలా బలంగా ఉందనీ, అప్పీలు చేసినా ప్రయోజనం స్వల్పమేననీ చెప్పారు. తాత్యా బాబాను ఆశ్రయించాడు. "భావూ దగ్గరికి పేపర్లు తీసుకుపో" అని బాబా ఆదేశించడంతో, తాత్యా ఆ తీర్పు ప్రతులను తీసుకుని నాశిక్ వెళ్ళి ధుమాళ్‌ను కలిశాడు. వాటిని చదివిన ధుమాళ్‌కు నిరాశ కలిగింది. అప్పీలు చేసినా ఈ కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనపడలేదు. అందువల్ల, ‘ఈ కేసును బొంబాయికిగానీ, అహ్మద్‌నగర్‌లో ఉన్న ప్రముఖ న్యాయవాదుల దగ్గరికిగానీ తీసుకెళితే మంచిద’ని తాత్యాకు సూచించాడతను. అయితే తాత్యా అతనికి బాబా ఆదేశాన్ని గుర్తుచేయడంతో ఇక ఆ విషయంలో తన బాధ్యతగానీ, తనకు మరో మార్గంగానీ ఏమీలేదని ధుమాళ్‌కు అర్థమయింది. దాంతో అతను మారుమాట్లాడకుండా కేసును పరిశీలించి, అప్పీలు పిటీషన్ వ్రాసి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన అదేమీ చదవకుండా విషయమేమిటో తెలుపమని అడిగారు. కేసు విషయం క్లుప్తంగా వివరించాడు ధుమాళ్. ఆయన అంతా విని, “నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుందే! దీనిపై నీ అభిప్రాయమేంటి?” అనడిగారు. “అసలు ఆ కేసు, అంతమంది సాక్ష్యులు వీటన్నింటికీ ముఖ్యకారణం గ్రామంలోని ముఠా తగాదాలనీ, వాటివల్లే ఆ నేరం ఆరోపించబడింద”నీ చెప్పాడు ధుమాళ్. “నువ్వు అలాగే అనుకుంటున్నావా?” అని మేజిస్ట్రేటు అతనిని అడిగారు. “అనుకోవడం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను” అని జవాబు చెప్పాడు ధుమాళ్. మేజిస్ట్రేటు ఇంకేమీ ఆలోచించలేదు. ధుమాళ్ వ్రాసి తెచ్చిన అప్పీలు పిటీషనుపై, వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు వ్రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా, క్రిందికోర్టు న్యాయమూర్తి తీర్పు పరిశీలించకుండా, పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు నోటీసులు ఇవ్వకుండా వారిచ్చిన తీర్పు అసాధారణమైనది! ఆ తరువాత మేజిస్ట్రేటు, "మీ శిరిడీ సాయిబాబా ఎలాంటివారు? వారు హిందువా, ముస్లిమా? వారు మీకేమి బోధిస్తారు?" అనడిగారు. "సాయిబాబా హిందువూ కాదు, ముస్లిమూ కాదు. ఈ రెండింటికీ అతీతులు" అని జవాబిచ్చాడు ధుమాళ్. అంతేకాదు, బాబా బోధించేదేమిటో తాను వివరించలేననీ, స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలనీ కూడా చెప్పాడు. ‘వీలుచూచుకొని సాయిబాబాను దర్శిస్తాన’ని మేజిస్ట్రేటు అతనికి మాట ఇచ్చారు. (వాస్తవానికి ఆ మేజిస్ట్రేటు వేసవిలో ఒకరోజున బాబాను దర్శించాలని శిరిడీ బయలుదేరి, ఎండ తీవ్రంగా ఉండడంతో, కోపర్‌గాఁవ్ నుండే వెనుదిరిగారు.) ఎటువంటి విచారణలు లేకుండా ముద్దాయిలను విడుదల చేయాలన్న మేజిస్ట్రేటు నిర్ణయం, ఆ వెనువెంటనే ఆయన బాబాను గురించి అడగడం - ఇదంతా కేవలం బాబా మహిమవలనే జరిగిందనడానికి నిదర్శనం. ఈ విషయాన్ని ఈ క్రింది సంఘటన బలపరుస్తుంది.


ఆ తరువాత ధుమాళ్ అక్కడినుండి శిరిడీకి బయలుదేరాడు. ఆరోజు శిరిడీలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాదవదనాలతో ఆమె అంత్యక్రియలకు వెళ్తున్న భక్తులలో కొందరిని పిలిచి, "వెళ్ళిపోకండి. మీకొక చమత్కారం చూపిస్తాను!" అని బాబా అన్నారు. కానీ, భక్తులకు ఏ చమత్కారమూ కనిపించనందున, వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత కాసేపటికి రఘు తదితరుల విడుదలకు సంబంధించిన వార్తతో ధుమాళ్ శిరిడీ చేరాడు. బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని అప్పుడు భక్తులు గ్రహించారు.


మూలం:  శ్రీసాయిభక్త అనుభవసంహిత
(డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ శ్రీసాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి)

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.


సాయిభక్తుల అనుభవమాలిక 1114వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. ఊహకందని బాబా అద్భుతలీల
2. సాయినాథుని దయవల్ల సుఖప్రసవం

ఊహకందని బాబా అద్భుతలీల


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నడుపుతున్న సాయిభక్తులకు నా అభినందనలు. బాబా కృపతో ఈ బ్లాగు చాలా బాగా పరుగులు పెడుతూ ఉంది. నా పేరు మాధవి. మాది భువనేశ్వర్. నేను ఇదివరకు చాలా అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అద్భుతమైన బాబా లీలను పంచుకుంటున్నాను. మా బావగారు(మావారి అన్నయ్య) బాబా భక్తుడు. ఆయన 2021వ సంవత్సరం మధ్యలో ఏదో విషయంగా ఎక్స్-రే తీయించుకుంటే, "మీ కాలికండరం వద్ద ట్యూమర్ ఉంది. భువనేశ్వర్‌లో చూపించుకోండి" అని చెప్పారు. దాంతో మా బావగారు, అతని భార్య భువనేశ్వర్‌లోని 'హేమలత క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్'కి వచ్చారు. డాక్టరు ఎమ్.ఆర్.ఐ స్కాన్ చేసి, అది ట్యూమరేనని నిర్ధారించి, "వెంటనే ఆపరేషన్ చేయాల"ని చెప్పారు. మా బావగారువాళ్ళు ఝార్సిగూడలో ఉంటారు. వాళ్ళకి బుర్లా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దగ్గర. అక్కడ ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పి మా బావగారువాళ్ళు వెళ్లిపోయారు. అక్కడ 20% ఆపరేషన్ అయ్యాక పొరపాటున కాలిలో నరాలు కట్ అయ్యాయి. దాంతో ఆపరేషన్ చేస్తున్న డాక్టరు, "మీరు ఆలస్యం చేయకుండా పది గంటలలోపు భువనేశ్వర్‌లోని అపోలో హాస్పిటల్‌కి వెళ్లిపోండి. నేను అక్కడి డాక్టరుతో మాట్లాడతాను" అని చెప్పాడు. వాళ్ళు పాపం వెంటనే అంబులెన్సులో భువనేశ్వర్ అపోలోకు వచ్చారు. అక్కడ డాక్టర్లు తెగిన నరాలను బాగుచేశారు. కానీ, ట్యూమర్ మాత్రం అలాగే ఉంది. మనం సాధారణ మనుషులం. డాక్టర్ ఏది చెప్తే అదే నిజం అనుకుంటాము. వాళ్ళు బాగవుతుందని ఝార్సిగూడ వెళ్లిపోయారు. 


రోజురోజుకీ అతని కాలు లావెక్కిపోతూ బాత్‌రూమ్ వరకు నాలుగు అడుగులు వేయగలుగుతున్నారేగానీ అంతకంటే నడవగలిగే పరిస్థితి లేకపోయింది. దాంతో వాళ్ళు ఏమైపోతుందో, ఏమిటోనని భయపడి ఎవరో తెలిసిన బెంగాలీ డాక్టరు ఉన్నారని వెల్లూరులోని సి.ఎమ్.సి హాస్పిటల్‍కి వెళ్లారు. అక్కడ డాక్టర్లు చూసి, "మీకు ఆపరేషన్ ఈమధ్యనే అయినందున మళ్ళీ వెంటనే ఆపరేషన్ చేయలేము. మీకు ఒక ఇంజక్షన్ వేస్తాము. ఈ ఇంజక్షన్ నెలకు ఒకటి చొప్పున ఐదు ఇంజెక్షన్లు వేసుకుని ఐదు నెలల తరువాత మళ్ళీ రండి" అని చెప్పి 50,000 రూపాయలు ఖరీదైన ఒక ఇంజక్షన్ ప్రిస్క్రైబ్ చేశారు. వీళ్ళు "సరేన"ని అక్కడినుండి వచ్చేశారు. అయితే, ఐదు ఇంజెక్షన్లు వేసుకున్నా కాలివాపు కొంచెం కూడా తగ్గలేదు. 2022, జనవరి నెల చివరిలో మా బావగారువాళ్ళు మళ్ళీ వెల్లూరు వెళ్లారు. డాక్టర్లు చూసి, "ఇంజక్షన్ పనిచేయలేదు. ట్యూమర్ మోకాళ్ళను దాటి నడుముకు కొద్దిగా కిందవరకు విస్తరించింది. ట్యూమర్ నడుము దాటి విస్తరిస్తే ప్రమాదం. కాబట్టి కాలు పూర్తిగా తీసెయ్యాలి" అని చెప్పారు. అంతే, వీళ్లకు బుద్ధి పనిచేయలేదు. చాలా భయపడిపోయారు, బాబా గుర్తుకు వచ్చారు.


ఆరోజు 2022, ఫిబ్రవరి 12. నేను ఆఫీసులో ఉండగా మా బావగారువాళ్ళు నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి, "మాధవీ, నువ్వే  ఎలాగైనా నా కాలు బాగుచేయమని బాబాకి చెప్పుకుని, మాకోసం ఆయనను ప్రార్థించు. బాబా నీ మాట వింటారు" అని అన్నారు. నేను వాళ్ళతో, "నాకు అంత శక్తి ఎక్కడిది? అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా బాబాను ప్రార్థించండి. బాబా అందరి మాటలు వింటారు. మీదీ వింటారు, నాదీ వింటారు, కష్టంలో ఉన్న ప్రతివారి మొర వింటారు. మనం సంపూర్ణ సమర్పణ చేసుకోవాలి, అంతే" అని అన్నాను. వాళ్ళు చాలా బాధపడ్డారు. నేను కూడా ఏడుస్తూ కూర్చున్నాను. ఆ సమయంలో నాతోపాటు డ్యూటీలో ఉన్న ఒక అబ్బాయి, "మేడమ్, మా బావ కటక్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‍లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‍గా ఉన్నారు. మీరు మీ బావగారి రిపోర్టులు వాట్సాప్‍లో పంపండి. నేను వాటిని మా బావగారికి పంపి ఈరోజు రాత్రి మాట్లాడతాను" అని అన్నాడు. నేను సరేనని రిపోర్టులన్నీ ఆ అబ్బాయికి పంపాను. రాత్రి 12 గంటలకి అతని బావ ఫోన్ చేసి, "మేడమ్, ఇది చాలా సివియర్ కేసు. ట్యూమర్ బాగా విస్తరించింది. ఆ కాలు తీసేయాలని సి.ఎమ్.సి వాళ్ళు సరిగానే చెప్పారు. ఆయనకి ఆపరేషన్ అయితేనే మంచిది" అని అన్నారు.


మరుసటిరోజు నాకు మార్నింగ్ డ్యూటీ. ఆరోజు ఉదయం నేను నా అలవాటు ప్రకారం కాస్త ముందుగానే వెళ్లి ఆఫీసులో వాకింగ్ చేస్తూ మా బావగారి గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నాను. అంతలో ఎవరో పూరీ జగన్నాథస్వామి వీడియో ఒకటి నాకు షేర్ చేశారు. ఢిల్లీలో నాకు తెలిసిన సీమ అనే అమ్మాయికి పూరీ జగన్నాథస్వామి అంటే  ఇష్టం. అందుకని ఆ వీడియోని ఆమెకి పంపించాను. తను ఆ వీడియో చూసి చాలా సంతోషించి, థాంక్స్ చెపుదామని నాకు ఫోన్ చేసింది. మాటల మధ్యలో నేను ఏదో బాధలో ఉన్నానని గ్రహించిన తను, "ఎందుకు ఆంటీ, ఏదో బాధలో ఉన్నట్లున్నారు. ఏమైంది?" అని అడిగింది. అప్పుడు నేను జరిగినదంతా చెప్పాను. అందుకు సీమ, "ఏమీ కాదు లెండి ఆంటీ. అంతా బాగుంటుంది. నేను ఇప్పుడే స్నానం చేసి పూజకి కూర్చున్నాను. బాబాను అడుగుతాను. ఏమన్నా చెప్తారేమో చూద్దాం" అని ఫోన్ పెట్టేసింది. నేను కూడా నా డ్యూటీలో నిమగ్నమయ్యాను. అక్కడ సీమ ధ్యానం చేస్తుంటే, ఎప్పుడూ లేనిది ఆమె శరీరంలో తీవ్రమైన వైబ్రేషన్స్ కలగడమేకాక, "ఆయనకి ఆపరేషన్ జరగదు. సరైన సమయానికి ఒక వ్యక్తి వచ్చి, ఆపరేషన్ జరగకుండా ఆపుతాడు. నువ్వు మాధవితో, 'బాధపడొద్దు. అంతా బాగవుతుంది' అని చెప్పు" అన్న మాటలు వినిపించాయి. ఆమె వెంటనే ఆ విషయాన్ని తెలియజేస్తూ నాకు మెసేజ్ పెట్టి, "ఆంటీ, అతనికి ఏమీ కాదు. సమయానికి ఒక వ్యక్తి వచ్చి అతన్ని కాపాడుతారని బాబా చెప్తున్నారు. అది ఎలా, ఏమిటి అన్నది నాకు తెలీదు. కానీ అతని కాలుకి మాత్రం ఏమీ అవదు" అని ఖచ్చితంగా చెప్పింది. నేను ఆ మెసేజులన్నీ మా బావగారికి ఫార్వర్డ్ చేసి, "ఒక అమ్మాయి ఈ మెసేజెస్ పెట్టింది. మీరు బాధపడకండి. బాబా ఏదో ఒకటి చేస్తారు. ఏదో అద్భుతం జరుగుతుంది" అని చెప్పాను. కానీ వాళ్ళు నమ్మలేదు. వాళ్లేకాదు, అసలు ఎవరూ నమ్మలేరు అలాంటివి. ఆయన, "ఇంకా ఆపరేషన్‍కి ఒక్కరోజే ఉంది. నా కాలు తీసేస్తారు. నేను అవిటివాడినైపోతున్నాను. నా బ్రతుకు ఇలా అయిపోయింది" అని ఒకటే బాధపడసాగారు.


2022, ఫిబ్రవరి 15న ఆపరేషన్ చేస్తారనగా ఫిబ్రవరి 14న వాళ్ళు ఒక టెస్టుకోసం వెళ్లి ఓ.పి.లో కూర్చుని ఉన్నారు, నెక్స్ట్ ఈయననే పిలుస్తారు. అంతలో నేపాల్ నుండి ఒక అంకాలజిస్ట్ (క్యాన్సర్ స్పెషలిస్ట్) వచ్చి డాక్టర్ల దగ్గరకి వెళ్లి, "నేను నేపాల్ నుంచి వచ్చాను. నేను అక్కడ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‍లో పనిచేస్తున్నాను. నాకొచ్చిన ఒక ఆదేశానుసారం నేను మీ దగ్గరకి వచ్చాను. ప్రస్తుతం మీ ఇన్‌స్టిట్యూట్‍లో ఏ కేసులు నడుస్తున్నాయి?" అని అడిగాడు. డాక్టర్లు నెక్స్ట్ పేషెంట్ అయిన మా బావగారిని పిలిచి, "ప్రస్తుతం ఈయన కేసు నడుస్తుంది. ఇవి ఈయన రిపోర్టులు. రేపు ఈయన కాలు తీయడానికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించాం" అని చెప్పారు. ఆ నేపాలీ డాక్టరు ఆ రిపోర్టులు చూసి, "ఎందుకు ఈయనకు కాలు తీసేస్తున్నారు? ఇది ట్యూమర్ మాత్రమే, క్యాన్సర్ కాదు కదా? మందులతో ఇతనికి మనం బాగుచేయవచ్చు" అని డాక్టర్లతో చెప్పాడు. తరువాత మా బావగారితో, "మీ కాలు తీయాల్సిన పనిలేదు, భయపడకు, నేను ఒక ఇంజక్షన్ ఇస్తాను. ఇలాంటివి మరో రెండు తీసుకుంటే మీ కాలికి ఉన్న ట్యూమర్ చిన్నగా అయిపోతుంది. అప్పుడు ట్యూమర్ ఆపరేషన్ చేస్తాం. మీరు ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుని, హాయిగా ఇంటికి వెళ్ళండి" అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. మా బావగారిపై బాబా ఎంత కృప చూపారో చూశారా! అసలు కాలే పోతుందనుకుంటే సమయానికి ఆయన రావడమేమిటి? ఆపరేషన్ జరగకుండా ఆపడమేమిటి? ఎంత ఆశ్చర్యమో కదా!


నెలరోజుల తరువాత మా బావగారు మళ్ళీ వెళ్లి రెండో ఇంజక్షన్ వేయించుకున్నారు. మీరంతా మా బావగారికోసం బాబాను ప్రార్థించండి. మనం మామూలు మనుషులం. బాబాను వేడుకోగలం, అంతే. 'పూర్వజన్మ కృతం పాపం, వ్యాధి రూపేణ పీడితం' అని సాయిచరిత్రలో చదువుతాం. సుఖమైనా, దుఃఖమైనా పూర్వజన్మ ఆర్జిత పాపపుణ్యాల వల్ల మనకు ప్రాప్తమవుతాయి. ఎంతటివారికైనా అవి తప్పవు. కానీ బాబా పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన కృపతో ఎంతటి కష్టమైనా తొలగిపోతుంది. 


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


సాయినాథుని దయవల్ల సుఖప్రసవం


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మేము యు.ఎస్.ఏలో ఉంటున్నాము. నాకు బాబా అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఆయన నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటినుండి ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మా  తమ్ముడి భార్య కడుపుతో ఉన్నప్పుడు, "బిడ్డ కాళ్ళు కిందకి, తల పైకి ఉన్నాయి. ప్రేగు కూడా మెడకి చుట్టుకుని ఉంది" అని డాక్టరు చెప్పారు. ఆ కారణంగా కాన్పు కొంచెం కష్టం అవుతుందని మేము భయపడ్డాము. నేను, "సాయితండ్రీ! మీ చల్లని చూపు వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ డెలివరీ అయితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆయన మీద భారం వేసి కాన్పు సమయంలో ఊదీ పెట్టడం వలన ఎలాంటి ఇబ్బందీ లేకుండా కాన్పు చాలా సులభంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నా మ్రొక్కు చెల్లించుకున్నాను. మీ ఆశీస్సులు, దయ మాపై ఇలాగే ఉండనివ్వండి బాబా. మీరే మాకు దిక్కు. మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రీ".




సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo