సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 405వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • నా జీవితంలో సాయిబాబా - రెండవ భాగం...

చెన్నై నుండి సాయిభక్తురాలు ఐశ్వర్య నిన్నటి భాగంలో కొన్ని  అనుభవాలు పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు:

బాబా నా చెడు కర్మల ఫలితాన్ని తుడిచిపెడుతున్న క్రమంలో కూడా ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన నాలో రాతిస్తంభం లాంటి విశ్వాసం రూపంలో నిలిచారు. జీవితంలో నేను ఎంత నిరాశకు గురైనప్పటికీ బాబాను విడిచిపెట్టాలని మాత్రం అనుకోలేదు. చివరికి ఒకదాని తరువాత ఒకటి బాబా లీలలు మొదలయ్యాయి.

సెప్టెంబర్ 2, 2014న నేను నా ప్రేమికుడిని తీసుకుని బాబా మందిరానికి వెళ్లి హృదయం పగిలేలా బాబా ముందు ఏడ్చాను. నాకు తెలిసిన గొప్ప సాయిభక్తులైన అమిత్ గారికి 'నా కోసం, నా ప్రేమికుని కోసం, నా సోదరుడి కోసం ప్రార్థించమ'ని ఒక లేఖ వ్రాశాను. తరువాత 'నా సమస్యలను పరిష్కరించమ'ని హృదయపూర్వకంగా బాబాను వేడుకున్నాను. సెప్టెంబర్ 20, 2014న నా లేఖకు స్పందన వచ్చింది. తరువాత సెప్టెంబర్ 23 ఉదయం నాకొక కల వచ్చింది. కలలో కాంచీపురానికి చెందిన ఒక సత్పురుషుడు కనిపించారు. నా వివాహం గురించి నేను ఏడుస్తుంటే, ఆయన మౌనంగా ఉన్నారు. తరువాత నా నుదుటిపై మళ్లీ మళ్లీ కుంకుమ పెట్టి ఆశీర్వదించారు. ఆరోజు నేను నిద్ర లేచిన తరువాత నాకు పూర్తి భిన్నమైన అనుభూతి కలిగింది. నాకు నేనే కొత్తగా కనిపించాను. అప్పటికే ముగిసిన నా ప్రేమ బంధాన్ని మొదటిసారిగా అంగీకరించాలని నిర్ణయించుకున్నాను. నన్ను నిజంగా ప్రేమించే నా కుటుంబసభ్యుల కోసం నేను సంతోషంగా జీవించాలని అనుకున్నాను.

దాంతో నేను నా ప్రేమికుడిని కలిసి నా భావాలు అతనికి తెలియజేశాను. తను నా నిర్ణయానికి చాలా సంతోషించాడు. కానీ ఇన్ని సంవత్సరాలు నాలో చాలా ఆశలు కలిగించినందుకు బాధపడ్డాడు. తరువాత తను నాతో, "దయచేసి నా నుండి దూరంగా వెళ్లి అందమైన జీవితాన్ని గడుపు. నేను నెరవేర్చలేని ఆశలు రేపి నీ జీవితాన్ని దుర్భరంగా మార్చినందుకు నన్ను క్షమించు" అని చెప్పాడు. నేను తనతో, “ఫర్వాలేదు, ఇదంతా నా కర్మ. ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతో చాలా బాగా నడుచుకున్నావు. కాబట్టి, నీ పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు, ఉండదు కూడా. దేవుని దయతో నువ్వు కూడా చక్కటి జీవితాన్ని గడపాలి” అని చెప్పాను. అలా ఇద్దరం మా ప్రేమబంధాన్ని సంతోషంగా ముగించాము.

సెప్టెంబరు తర్వాత వచ్చే పెళ్లి ప్రతిపాదన ఏదైనప్పటికీ వాటిని స్వీకరించడానికి నన్ను నేను మలచుకున్నాను. ఒక నిశ్శబ్ద పరివర్తన బాబా నాలో తీసుకొచ్చారు. ఏ పదాలూ దానిని వివరించలేవు. మార్చి 25, 2015, నేను మొదటిసారి నా భర్తను మందిరంలో కలుసుకున్నాను. (మా తల్లిదండ్రులు ఆ సమావేశం ఏర్పాటు చేశారు.) నేను తనతో, "బాబాను నమ్ముతారా?" అని అడిగాను. అందుకతను, "నమ్ముతాను, నేను ఉద్యోగరీత్యా వేరే సిటీకి వెళ్లేంతవరకు ప్రతి గురువారం నా తల్లిని తీసుకుని బాబా మందిరానికి వెళ్ళేవాడిని" అని చెప్పారు. వెంటనే నేను, 'నా బాబా ఈ వ్యక్తిని నాకోసం ఎన్నుకున్నారు. నేను ఇతన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తాను' అని అనుకున్నాను. కొన్ని కారణాలవల్ల, ఆయన కూడా నన్ను మొదటిచూపులోనే ఇష్టపడ్డారు. అదేరోజు చిన్న ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ కూడా మా మధ్య జరిగింది. ఇది మా కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యునికి ఒక ఆశ్చర్యం, అద్భుతం కంటే ఎక్కువే. నాన్న, నా సోదరుడి ఆనందానికి హద్దుల్లేవు. నేను వారి ఆనందాన్ని చూసి పూర్తిగా ఆనందించాను. అన్నింటికి కలిపి బాబాకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాను. ఆగస్టు 2015లో నా వివాహం జరిగింది. మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నా భర్త నిజంగా చాలా మంచి వ్యక్తి. పెళ్ళికి ముందు తన జీవితంలో జరిగిన కొన్ని కఠినమైన సంఘటనల ద్వారా ఆయన చాలా పాఠాలు నేర్చుకున్నారు. అందుకే బాబా దయతో ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నారు.

నా జీవితం ఒక గాడిలో పడ్డాక నేను నా సోదరుడి వివాహం గురించి ప్రార్థించడం మొదలుపెట్టాను. అయితే తనకి అప్పటికే 35 సంవత్సరాలు, పైగా ఉద్యోగం లేదు. ఆ కారణాల వలన తన వివాహంపట్ల నా విశ్వాసం పూర్తిగా దెబ్బతింది. కానీ బాబా దయ చూపారు. ఆయన ఐటి సంస్థలో పనిచేస్తున్న ఒక మంచి అమ్మాయిని చూపించారు. ఆగస్టు 2017లో తన వివాహం జరిగింది. ఇప్పుడు తనకి సంవత్సరం వయస్సున్న ఒక పండంటి బాబు కూడా ఉన్నాడు. తను బాగా సంపాదిస్తూ కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు.

నా వివాహానంతరం సంవత్సరానికి పైగా నేను గర్భం దాల్చలేదు. అకస్మాత్తుగా 2016 జూన్ నెలలో ఒకరోజు నా సోదరుడు నాకు ఫోన్ చేసి, "బాబాకు అంకిత భక్తుడైన తన స్నేహితుడు "తన సోదరి, అంటే నేను ఆరునెలల్లో గర్భం దాలుస్తానని, కొన్ని గురువారాలపాటు బాబా మందిరంలో పిల్లలకి ఆహారం పంపిణీ చేయమ'ని చెప్పాడ"ని చెప్పాడు. నేను ఆ మాటను పూర్తిగా విశ్వసించి, అలాగే చేశాను. సరిగ్గా ఆరవ నెలలో నేను గర్భం దాల్చాను. 2017, సెప్టెంబరులో ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చాను.

అయితే డెలివరీ తరువాత నేను నా బిడ్డకు తల్లిపాలు ఇవ్వలేకపోయాను. బిడ్డ ఏడుస్తుంటే పాలిచ్చి వాడి ఆకలి తీర్చలేక బాబా ముందు చాలా తీవ్రంగా ఏడ్చాను. బాబా అపారమైన ప్రేమను చూపారు. నా బిడ్డకు 30 రోజుల వయస్సున్నప్పుడు నాకొక కల వచ్చింది. కలలో నా బిడ్డ బాబా పాదాల చెంత ఉండగా నేను ఆయనకు సంపూర్ణ శరణాగతి చెందాను. నేను మేల్కొన్న తరువాత నా భర్తతో, "నేను నా బిడ్డకు త్వరలో తల్లిపాలు పట్టబోతున్నాను. కంచి మహాస్వామి, బాబా నన్ను ఆశీర్వదించినందున నా శరీరం అందుకు సహకరిస్తుంద"ని చెప్పాను. అద్భుతం! సరిగ్గా పదిహేను రోజుల్లో నా బిడ్డకు 45 రోజుల వయస్సున్నప్పుడు డబ్బాపాలను ఆపి పూర్తిగా తల్లిపాలను ఇవ్వగలిగాను. మన దైవం బాబా చేసే అద్భుతాలు అలాంటివి.

మన బాబాను గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. స్వర్గ సుఖాన్ని మించిన ఆనందాన్ని అనుభవించడం తప్ప మాటల్లో చెప్పలేం. నా సమస్యలన్నిటినుండి నేను బయటపడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. కానీ దానిని నేను చాలాకాలం పాటు వాయిదా వేసాను. "నా ప్రియమైన బాబా! నన్ను క్షమించండి. ఎప్పుడూ మీ పాదాల చెంత ఉండాలని కోరుకునే మీ సేవకురాలిని". ప్రియమైన సాయి కుటుంబీకులారా! దయచేసి సాయి పాదాలను అంటిపెట్టుకుని ఉండండి. ఆయనను గుడ్డిగా విశ్వసించండి. దయచేసి సహనాన్ని కలిగి ఉండండి. నా జీవితంలో బాబా ఇచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. వ్రాయగలిగినంత వరకు వ్రాశాను. చాలా ఓపికతో నా అనుభవాలను చదివినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. మీరు కూడా మీ అనుభవాలను వీలైనంత త్వరగా పంచుకోండి, తద్వారా బాబా ప్రేమను అందరికీ పంచండి.

source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2598.html


సాయి అనుగ్రహసుమాలు - 363వ భాగం


ఖపర్డే డైరీ - నలభై ఎనిమిదవ భాగం

శిరిడీ డైరీ మరియు శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డే - వి.బి.ఖేర్

ఖపర్డే శిరిడీలో నాలుగు నెలలూ, అతని భార్య ఏడునెలలూ ఉన్నారు. ఇద్దరూ కూడా అత్యంత ఆనందాన్ని పొందారు. బాబాపట్ల అపరిమితమైన విశ్వాసం గల శ్రీమతి ఖపర్డే స్వయంగా మశీదుకి నైవేద్యాన్ని తీసుకొచ్చేది. బాబా ఆ నైవేద్యంలో నుంచి కొంత భాగమైనా స్వీకరిస్తేగానీ ఆమె ఆహారం ముట్టుకునేది కాదు. బాబా స్వీకరించిన తరువాతే ఆమె భోజనం చేసేది. ఆమెకున్న అకుంఠిత భక్తి విశ్వాసాలను చూసి భక్తులను గాఢంగా ప్రేమించే బాబా ఆమెకు మార్గం చూపటం జరిగింది. గురువులు అనేక రకాలుగా ఉపదేశాలు చేస్తారు. కానీ బాబా పద్ధతి చాలా విశిష్టమైనది. మనసు లోపలి పొరల్లోకి పూర్తిగా చొచ్చుకుపోయేలా తమ అనుగ్రహాన్ని సునాయాసంగా వర్షిస్తారు. 

ఒకసారి శ్రీమతి ఖపర్డే ఒక పళ్ళెం నిండుగా శీరా, పూరీ, అన్నం, పప్పు, పాయసం, ఒడియాలు, అప్పడం, కోషింబర్ (ఉప్పు, నిమ్మకాయ పిండిన వడపప్పు) తీసుకుని మసీదుకు వచ్చింది. ఆమె నైవేద్యం రాగానే బాబా ఆత్రుతగా తన స్థానంలోంచి లేచి తన చొక్కా చేతులు పైకి ముడుచుకొన్నారు. తాను మామూలుగా భోజనం చేసే చోటుకి వచ్చి కూర్చుని ఆ పళ్ళాన్ని తన దగ్గరకు లాక్కుని దానిమీద పెట్టిన మూతను తీసివేసి తినటానికి ఉపక్రమించారు. అక్కడ ఇంకెన్నో నైవేద్యాలున్నా, అందులో కొన్ని ఇప్పుడు తెచ్చిన దానికన్నా ఎంతో విలువైనవైనా, అందులో కొన్ని సామాన్యంగా ఎప్పుడూ ఇతర భక్తులనుండి స్వీకరించేవి ఉన్నా చాలాసేపు బాబా వాటిని ముట్టుకోనేలేదు. మరి శ్రీమతి ఖపర్డే తెచ్చినవి ఆయన కెందుకంత ప్రియమైనాయి? అలా అవటం లౌకికమైన వ్యక్తి ప్రవర్తన; కానీ ఒక మహాత్ముని మననుకు అలాంటి భావం ఎందుకు కలుగుతుంది? అందుకని మాధవరావు దేశ్‌పాండే అటువంటి తరతమ బేధాలను ఎందుకు చూపుతున్నారో బాబాను అడిగి తెలుసుకోవాలనుకున్నాడు.

"బాబా! మీరు మిగతా అన్ని నైవేద్యాలనూ వదిలేశారు. వెండిపళ్ళేలలో వచ్చిన వాటిని కూడా పక్కకు నెట్టేశారు. ఈవిడ నైవేద్యాన్ని తీసుకురాగానే తినటం మొదలుపెట్టారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆమె నైవేద్యం మీకంత రుచిగా ఉండటం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓ గురుదేవా! కొంతమంది పట్ల మీకు పక్షపాతం ఉండటమేమిటి?" అని అన్నాడు. "ఈ ఆహారం ఎంత అద్భుతంగా ఉందో నీకెలా వర్ణించను? తన గడిచిన జన్మలలో ఈమె ఒకసారి ఒక వర్తకుడికి చెందిన ఆవుగా జన్మించి సమృద్ధిగా పాలు ఇచ్చేది. తరువాత కొద్దికాలం ఆమెను నేను కలవలేదు. తరువాత ఆమె ఒక తోటమాలికీ, ఆ తరువాత ఒక క్షత్రియుడికీ జన్మించి అటుతరువాత ఒక వర్తకుడికి భార్య అయి, ఆ తరువాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమెను చూసి ఎంతో కాలమైంది. ప్రేమతో సమర్పించబడిన ఈ ఆహారాన్ని సంతోషంగా కొంత స్వీకరించి ఆమెకు తృప్తి కలుగజేయనీయి" అన్నారు బాబా. అలా అంటూ హృదయపూర్వకంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించి తమ చేతులనూ, నోటినీ కడుగుకొని తృప్తిగా త్రేన్చి తన స్థానంలో కూర్చున్నారు. 

శ్రీమతి ఖపర్డే సాయికి నమస్కరించి ఆయన చరణ సేవ చేయటం ప్రారంభించింది. దాన్ని అవకాశంగా తీసుకొని బాబా ఆమె యోగక్షేమాలను విచారిస్తూ, చరణసేవ చేస్తున్న ఆమె చేతులను బాబా నొక్కసాగారు. భగవంతుడూ, భక్తురాలు ఒకరికొకరు పరస్పరం చేసుకుంటున్న ఆ సేవను చూసి శ్యామా చమత్కారంగా “ఎంత గొప్ప లీలను చూస్తున్నాం! ఓ దేవా! ఒకరిపై ఒకరికున్న అన్యోన్యతను చూసి మాకు ఆశ్చర్యం కలుగుతోంది” శ్రీమతి ఖపర్డే చేస్తున్న సేవను చూసి సంతోషించి బాబా ఆమె చెవిలో మంద్రస్థాయిలో, "రాజారామ్, రాజారామ్" అనే మంత్రాన్ని నిత్యమూ క్రమంతప్పకుండా జపించు. అలా చేస్తే నీకు ఆత్మతృప్తి కలుగుతుంది. నీ చిత్తం ప్రశాంతతను పొంది నీకు అపారమైన ప్రయోజనం సిద్ధిస్తుంది" అని చెప్పారు. ఎంతో శక్తివంతమైన ఆ మాటలు ఆమె హృదయంలోకి చొచ్చుకొనిపోయి, ఒక్క క్షణంలో ఆధ్యాత్మిక శక్తిని సంతరించి పెట్టాయి. అలా దయానిధీ, రక్షకులూ అయిన శ్రీ సమర్థ సాయినాథులు భక్తుల కోరికలను తృప్తిపరచి వారి యోగక్షేమాలను చూస్తారు.

పై  సంఘటనకు సంబంధించిన  వివరాలు  4-3-1912 తేదీన ఈ క్రింది విధంగా క్లుప్తంగా చెప్పబడింది. "నా భార్య సాయిబాబాను పూజించటానికి చాలా ఆలస్యంగా వచ్చినా ఆయన చాలా దయతో తన భోజనాన్ని నిలిపి ఆమెను పూజ చేసుకోనిచ్చారు”.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 404వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • నా జీవితంలో సాయిబాబా - మొదటి భాగం...

చెన్నై నుండి సాయిభక్తురాలు ఐశ్వర్య తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను ఉద్యోగస్థురాలిని. ఒక అందమైన మగబిడ్డకు తల్లిని. బాబా నాకు చక్కటి ఆహ్లాదకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించారు. ఆయన నా జీవితంలో ప్రసాదించిన ప్రతిదానికీ నా శతకోటి ధన్యవాదాలు, ప్రణామాలు.

నేను 2004లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు ఒకరోజు నా తోటి విద్యార్థి తన చేతికి ధరించిన బాబా ఉంగరాన్ని చూశాను. ఈయనెవరని తనని అడిగాను. అప్పుడే నేను తొలిసారి నా బాబా దైవత్వం గురించి తెలుసుకున్నాను. తనని నాకోసం ఒక ఉంగరం తీసుకోమని అభ్యర్థించాను. తరువాత అదృష్టవశాత్తూ మేమిద్దరమూ ఒకే కాలేజీలో ఒకే కోర్సులో చేరి ఒకే బస్సులో ప్రయాణించేవాళ్ళము. ఒకరోజు హఠాత్తుగా తను నాకు బాబా ఉంగరం ఇచ్చింది. ఎన్నో రోజుల క్రితం ఇచ్చిన వాగ్దానాన్ని తను గుర్తుపెట్టుకుని మరీ నాకు ఉంగరాన్ని ఇచ్చింది. అప్పటినుండి నా బాబాతో నా ఆత్మ ప్రయాణం ప్రారంభమైంది.

తరువాత నేను మొదటిసారి సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని తెరచినప్పుడు అందులో ఉన్న బాబా ఫోటోను చూసి ఆయనతో, "బాబా మీరొక సత్పురుషులని నేను ఎలా నమ్మాలి? ఈ ఫోటోలో ఉన్న మీరు ఇప్పుడు మీ కనురెప్పలు వాల్చి(బ్లింక్) చూపించండి. అప్పుడే మిమ్మల్ని నేను నమ్ముతాను" అని అన్నాను. కానీ అలా జరగలేదు. అయినప్పటికీ, నేను ఆ పుస్తకాన్ని చదివాను. ఆరునెలల తరువాత మొదటిసారి నేను నా కుటుంబంతో కలిసి బాబా గుడికి వెళ్ళాను. అకస్మాత్తుగా బాబా కనురెప్పలు వాల్చారు. అది నేను చాలా స్పష్టంగా చూశాను. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు చాలాసార్లు ఆయన కనురెప్పలు వాల్చడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక నిమిషం పాటు ఏమి జరుగుతుందో అర్థంకాని స్థితిలో స్తబ్దంగా ఉండిపోయాను. తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు గతంలో నేను బాబాను అభ్యర్థించిన విషయం గుర్తొచ్చింది. ఆ విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. కానీ నా బాబా మర్చిపోకుండా తమ కనురెప్పలు వాల్చి తాము సత్పురుషులమని నాకు తెలియజేశారు. మొదటిసారి నా కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి. 'ఇది చాలు, నా జీవితాంతం నేను ఆయనను విశ్వసించగలను' అని అనుకుని ఆ క్షణంనుండి నేను బాబాకు శరణాగతి చెందాను.

సాయి సచ్చరిత్ర చదవడం ద్వారా, బాబా సూచించినట్లు నన్ను నేను ఒక మంచి వ్యక్తిగా ఎలా రూపొందించుకోవాలో అర్థం చేసుకున్నాను. ఆయన కారణంగా నా చుట్టుపక్కల అందరిలో ధైర్యం, మంచి హృదయం గల వ్యక్తిగా గుర్తింపు పొందాను. నాకు బాబా చూపుతున్న అద్భుతాలను నా చుట్టూ ఉన్న చాలామందితో పంచుకుంటూ ఉండేదాన్ని. నా స్నేహితులు కూడా చాలామంది బాబా భక్తులయ్యారు. మేమంతా కలిసి ప్రతి గురువారం హాస్టల్‌లో బాబాకు పూజలు చేయడం ప్రారంభించాము. ఆచారం ప్రకారం చెప్పాలంటే మా పూజలో చాలా లోపాలు ఉండేవి, కానీ ఆయన మా స్వచ్ఛమైన మనస్సును స్వీకరించారు. నా స్నేహితులు, కుటుంబసభ్యులతో బాబా గురించి పంచుకుంటూ చాలా సంతోషంగా ఉండేదాన్ని.

అయితే నాకు కఠినమైన కాలం 2007 నవంబర్లో ప్రారంభమైంది. హఠాత్తుగా మా అమ్మ నాల్గవ దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. కానీ బాబా దయతో ఆమె 2009 ఏప్రిల్ వరకు మా మధ్య ఉంది. ఆ సమయంలో మేము తనకోసం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా చేయగలిగినదంతా చేశాము. కానీ దైవనిర్ణయం మరోలా ఉంది. అందుచేత ఆమె మమ్మల్ని శారీరకంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎప్పుడూ మాతోనే ఉంది. ఆ సంఘటన తరువాత జీవితం పట్ల ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది వచ్చినట్లు తీసుకోవడం ప్రారంభించాను. తీవ్ర దుఃఖంతో సంవత్సరానికి పైగా నేను దేవుళ్ళను ప్రార్థించడం మానేశాను.

ఇలాంటి సమయంలో నాకెంతో సన్నిహితుడైన నా పాఠశాల స్నేహితుడు నన్ను ఇష్టపడుతున్నానని ప్రతిపాదన తీసుకొచ్చాడు. చిన్నప్పటినుండి తను నన్ను ఇష్టపడుతున్నాడని నాకు తెలుసు. కానీ మేము మా ఉద్యోగాలలో స్థిరపడ్డాకే నాకీ విషయం చెప్పాడు. అతను మంచి వ్యక్తి, అందులో సందేహం లేదు. కానీ సమస్యేమిటంటే అతను ముస్లిం, నేను హిందువుని. కానీ అది దైవనిర్ణయమని మేము అనుకున్నాము. అందువలన నేను తన ప్రతిపాదనకు సమ్మతించాను. సంవత్సరం తరువాత అతని కుటుంబ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అందువలన ఈ పరిస్థితుల్లో వివాహం చేసుకోవడం కష్టమని తను నాతో చెప్పాడు. ఆ మాటతో నా గుండె బద్దలైపోయింది. అతను ఒక మంచి వ్యక్తిత్వం గల మేలిమి రత్నం. తల్లిని కోల్పోయిన నేను తనని కూడా కోల్పోతున్నందుకు కుమిలిపోయాను. కొన్ని సంవత్సరాలపాటు పగలు రాత్రి, "మా తల్లిదండ్రుల సమ్మతితో మా వివాహం జరిగేలా కృప చూపమ"ని ఏడుస్తూ గడిపాను. బాబాను, శివుడిని ప్రార్థిస్తూ, ఉపవాసాలు చేశాను. సచ్చరిత్ర చదువుతూ ఎక్కువ సమయం ఒంటరితనంలో గడిపాను.

అదలా ఉంటే, మరోవైపు నా తల్లి మరణంతో నా సోదరుడు షాక్ కి గురికావడంతో మానసిక రుగ్మతకు లోనయ్యాడు. ఆ స్థితిలో నాన్నకు, సోదరుడికి నేను మాత్రమే ఆనందం అయ్యాను. అందువల్ల నా లోపల ఏమి జరుగుతుందో బయటకు తెలియనివ్వకుండా నేను పూర్తిగా మౌనంగా, ఒక సాధారణ వ్యక్తిలాగా ఇతరుల ముందు ప్రవర్తించసాగాను. కానీ మానసికంగా బాగా కృంగిపోయాను. ఇవన్నీ 2009-2014 సెప్టెంబర్ మధ్యలో జరిగాయి. నా బాబా, మా కులదేవత నన్ను వారి హృదయానికి చాలా దగ్గరగా ఉంచుకుని ఆ కష్టకాలంలో నాకు సహాయం చేశారు.

అన్ని సంవత్సరాలపాటు బాబా నా చెడు కర్మల ఫలితాన్ని తుడిచిపెడుతున్న క్రమంలో కూడా ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన నాలో రాతిస్తంభం లాంటి విశ్వాసం రూపంలో నిలిచారు. జీవితంలో నేను ఎంత నిరాశకు గురైనప్పటికీ బాబాను విడిచిపెట్టాలని మాత్రం అనుకోలేదు. చివరికి ఒకదాని తరువాత ఒకటి బాబా లీలలు మొదలయ్యాయి.

మిగిలిన అనుభవాలు రేపటి భాగంలో ... 

source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2598.html


సాయి అనుగ్రహసుమాలు - 362వ భాగం.


ఖపర్డే డైరీ - నలభై ఏడవభాగం.

శిరిడీ డైరీ మరియు శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డే - వి.బి.ఖేర్

శ్రీ సాయిబాబా ప్రేమను చూరగొన్న భక్తురాలు శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డే. బాబా వద్ద నుండి ఉపదేశం పొందిన భాగ్యశాలి ఆమె. శ్రీసాయిసచ్చరిత్ర 27వ అధ్యాయం 139-169 ఓవీలలో ఆమెకు శ్రీసాయితో ఉన్న ఋణానుబంధమూ, బాబా ఆమెకు ఇచ్చిన ఉపదేశమూ వర్ణించబడి ఉన్నాయి. అలాగే 7వ అధ్యాయం 100 నుంచి 110 వరకు ఉన్న ఓవీలలో ఆమె కుమారుడికి సోకిన ప్లేగును, అతని కర్మ సంబంధమైన బాధలను సాయిబాబా స్వీకరించి ఆమెను ఆందోళన నుంచి ఎలా విడుదల చేశారో కూడా చెప్పబడి ఉంది. మనం మొదట ఆ లీలలను చెప్పుకుని తరువాత శిరిడీ డైరీలో దానికి సంబంధించిన వివరాల్ని చూసి శ్రీసాయిసచ్చరిత్రలో చెప్పబడని వేరే సంఘటనలను కూడా పరిశీలిద్దాం. అప్పుడు పాఠకులను ఎంతో కదిలించివేసే ఆమె జీవిత గాథను, ఆమె చివరిదశ వరకూ జాగ్రత్తగా తెలుసుకుందాం. ఆమె అంత్యదశ ప్రశాంతంగా ఉండటమే గాక, ఆమె తన సద్గురు సాయిబాబా దర్శనాన్ని కూడా పొందింది. సాయిభక్తులు ఇంతకంటే ఎక్కువ ఏ ఆనందాన్ని ఆశిస్తారు? కనుక ఇప్పుడు ఆమె ఋణానుబంధమూ, ఉపదేశాల లీలను ప్రారంభిద్దాం.

"ఒకసారి దాదాసాహెబ్  శిరిడీకి తన కుటుంబంతో వచ్చి బాబా ప్రేమలో కరిగిపోయాడు. ఖపర్డే సామాన్యమైన మనిషి కాడు. అతను ఎంతో చదువుకున్నవాడైనా బాబా ముందు భక్తిభావంతో తలవంచేవాడు. ఇంగ్లీషు భాషలో ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉండేవాడు. సుప్రీమ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోనూ, స్టేట్ కౌన్సిల్ లోనూ మంచి వక్తగా ఖ్యాతిని సంపాదించడమే కాక, తన వాక్చాతుర్యంతో, వాదప్రతివాదాలతో విధానమండలిని ప్రభావితం చేశాడు. అయినప్పటికీ బాబా ముందు మాత్రం మౌనంగా ఉండేవాడు. 

బాబాకి ఎంతోమంది భక్తులున్నప్పటికీ, ఖపర్డే, గోపాలరావు బూటీ, లక్ష్మణ్ కృష్ణ నూల్కర్‌లు తప్ప బాబా ముందు ఎవరూ మౌనంగా ఉండేవారు కాదు. వారందరూ బాబాతో మాట్లాడేవారు. కొందరు తమ మనసుకు ఏది తోస్తే అది మాట్లాడేవారు. మరికొందరు వివాదాస్పద విషయాల్లో జోక్యం చేసుకొనేవారు. కానీ ఈ ముగ్గురూ మాత్రం పూర్తి సంయమముతో ఉండేవారు. మాట్లాడటం సంగతి అలా ఉంచి వారు బాబా చెప్పిన దానిని తప్పకుండా పాటించేవారు. బాబా మాట వినే విషయంలో వారికున్న మర్యాద, అణకువలు అవర్ణనీయాలు. విద్యారణ్యుని పంచదశిని వివరించటంలో అద్భుతమైన నైపుణ్యం గల ఖపర్డే మశీదుకు రాగానే మౌనంగా అయిపోయేవాడు. వాక్చాతుర్యం ఎంత ఉన్నప్పటికీ సచ్చిదానంద పరబ్రహ్మ అవతారమూర్తియైన సాయి ముందు వెలవెలబోయేది.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 403వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. తమనే నమ్ముకున్న వారికి సదా రక్షణనిచ్ఛే బాబా
  2. మనల్ని రక్షించడానికి బాబా పరుగెత్తుకుని వస్తారు

తమనే నమ్ముకున్న వారికి సదా రక్షణనిచ్ఛే బాబా

బాబా భక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు అంజలి. ఈ బ్లాగ్ వలన ఎంతోమంది బాబా లీలలను తెలుసుకోగలుగుతున్నారు. ఈ బ్లాగులో ప్రచురించే బాబా లీలలను నేను ప్రతిరోజూ చదువుతాను. దానివలన నాకు బాబా మీద నమ్మకం దృఢమవుతుంది. 2018లో మేము సొంత ఇంటికోసం ప్రయత్నం చేస్తుండేవాళ్ళము. ఆ సమయంలో నా భర్తకి కజిన్ ఒకాయన, “మంగళగిరిలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు నలభై లక్షలకి వస్తోంది. ఇల్లు చాలా బాగుంది, మీరు తీసుకోండి” అని చెప్పారు. మేము కూడా ఇండిపెండెంట్ ఇల్లు తీసుకుందామనే ఆలోచనలోనే ఉన్నాము. అందువల్ల నా భర్త ఆ ఇల్లు తీసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. నాకు కూడా ఇల్లు తీసుకోవాలని ఇష్టంగానే ఉంది, కానీ బాబాను అనుమతి అడగలేదు. నా భర్త ఆ ఇల్లు తీసుకుందామని నిర్ణయించుకున్నారు. మేము వెళ్ళి ఆ ఇల్లు చూడాల్సిన సమయం దగ్గరపడుతోంది. ఆ ఇల్లు చూడటానికి బయలుదేరేరోజు బాబా ఫోటో ముందు, ‘ఇల్లు తీసుకుందాము’, ‘వద్దు’ అనే చీటీలు వేసి, బాబాను ప్రార్థించి ఒక చీటీ తీయగా, ‘వద్దు’ అని వచ్చింది. అదే విషయం, అంటే బాబా నిర్ణయాన్ని నా భర్తకు చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. “మనం ఇలాంటి నమ్మకాలు పెట్టుకుంటే ఏమీ కొనలేము” అంటూ నా మాటను కొట్టిపారేశారు. నా భర్త మనసు మార్చమని బాబాను ప్రార్థించి, ఆయన మీదే భారం వేశాను. తరువాత గృహనిర్మాణం, వాస్తు గురించి తెలిసిన మా అంకుల్ ఒకాయన్ని మాతో వెంటబెట్టుకుని ఆ ఇల్లు చూడటానికి వెళ్ళాము. ఆయన ఆ ఇల్లు చూడగానే,  "ఈ ఇంటి వాస్తు బాగోలేదు, అది కొంటే సమస్యలు వస్తాయి, పిల్లలకు ఎదుగుదల ఉండదు” అని చెప్పారు. దాంతో నా భర్త ఆ ఇల్లు కొనడానికి సుముఖత చూపలేదు. చీటీల ద్వారా బాబా తమ నిర్ణయాన్ని ముందుగానే చెప్పారు, అయినా నా భర్త వినలేదు. తన మాట విననప్పటికీ బాబా నన్ను, నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. మావారు బాబాను నమ్మరని కాదు, తను కూడా బాబాను నమ్ముతారు, కానీ అప్పుడప్పుడు అలా చేస్తుంటారు. నేను మాత్రం ఏది ఏమైనా సరే బాబా మీదనే భారం వేస్తాను. మనకేది మంచో, ఏది చెడో బాబాకే తెలుసు. అందుకే బాబా మీద భారం వేసి నిశ్చింతగా ఉంటాను.

ఈ మధ్యకాలంలో నాకు ఛాతీ మీద చిన్న గడ్డలాగా వచ్చింది. బాబాను ప్రార్థించి, ప్రతిరోజూ బాబా ఊదీని ఛాతీపైన రాసుకునేదాన్ని. బాబా ఊదీ మహిమతో ఆ గడ్డ తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".

ఇప్పుడు, ఇటీవలే జరిగిన బాబా లీలను మీతో పంచుకుంటాను. గత కొన్ని వారాలుగా కొరోనా మహమ్మారి అందరినీ భయపెడుతోంది కదా! దానివలన కాస్త దగ్గు, జలుబు అనిపించినా ఎంతో భయం వేస్తోంది. ఇటీవల నాకు, మావారికి జలుబు చేసినట్టు అనిపించింది. జలుబు వల్ల గొంతు కూడా కొంచెం నొప్పిగా అనిపించింది. బాబాను ప్రార్థించి, ఆయన మీద భారం వేసి, ఇద్దరం బాబా ఊదీని నోట్లో వేసుకున్నాం. వెంటనే ఇద్దరికీ జలుబు, దగ్గు, గొంతునొప్పి కూడా తగ్గిపోయాయి. బాబా ఉండగా మనకెందుకు భయం? అంతా ఆయనే చూసుకుంటారు.

నేను నా ఆరోగ్య సమస్యలకు చీరాలలో ఉండే ఆయుర్వేద డాక్టరుకి రెగ్యులర్‌గా చూపించుకొని మందులు వాడుతుంటాను. కొరోనా లాక్‌డౌన్‌కి నాలుగు రోజుల ముందు అనుకోకుండా చీరాల వెళ్లి హాస్పిటల్లో చూపించుకుని రెండు నెలలకు సరిపడా మందులు తెచ్చుకున్నాను. నేను చీరాల నుండి వచ్చిన వెంటనే లాక్‌డౌన్‌ ప్రకటించారు. నిజానికి, డాక్టర్ అప్పాయింట్‌మెంటుకి ఇంకా టైమ్ ఉంది. కానీ ఆ అప్పాయింట్‌మెంటు లాక్‌డౌన్ పీరియడ్‌లో వస్తుంది. జరగబోయేదంతా బాబాకు ముందే తెలుసు కాబట్టి, నేను మందులకు ఇబ్బందిపడకుండా ఎంతో చక్కగా ప్లాన్ చేసి, నన్ను చీరాలకు పంపించి ముందుగానే కావలసిన మందులు సరిపడా ఇప్పించి నన్ను అనుగ్రహించారు. “నిజంగా ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేని దీనురాలిని బాబా. నామీద మీకున్న ప్రేమకు సర్వదా కృతజ్ఞతలు బాబా! లవ్ యు సో మచ్ బాబా!”.

మనల్ని రక్షించడానికి బాబా పరుగెత్తుకుని వస్తారు

నేను గత 19 సంవత్సరాలుగా బాబా భక్తుడిని. నేను మలేషియాలో నివాసం ఉంటున్నాను. 2016లో నా కారు దొంగిలించబడింది. నేను మోటారు భీమా సంస్థకు అప్లికేషన్ పెట్టుకున్నాను. దాదాపు రెండున్నర సంవత్సరాల తరువాత జూన్ 2019లో భీమా సంస్థ నా అభ్యర్థనను తిరస్కరించింది. ఎందుకంటే, దొంగతనానికి ముందు నా కారు నావద్దే ఉందని నేను నిరూపించలేకపోయాను. కారు లేకపోయినా ఇప్పటికీ నేను బ్యాంకు ఋణాన్ని చెల్లిస్తూ మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. పైగా భీమా సంస్థ నుండి కూడా ఎదురుదెబ్బ తగిలింది. దాంతో నేను బాగా కృంగిపోయాను. ఆ సమయంలో ఒక స్నేహితుడి సలహాతో నా సమస్య విషయంలో సహాయం కోసం అంబుడ్స్‌మన్‌కి వెళ్లాను. మొదటి సమావేశంలో భీమా సంస్థ తమ నిర్ణయంలో మొండిగా ఉండటంతో నాకు అనుకూలంగా ఏమీ జరగలేదు. నేను జులైలో మరో సమావేశం కోసం షెడ్యూల్ చేసుకున్నాను. ఆలోగా నేను, "ఈసారి నాకు అనుకూలంగా జరిగేలా అనుగ్రహించమ"ని బాబాను ప్రార్థించాను. "ఇక్కడ నేనుండగా మీరెందుకు భయపడాలి? నాపై విశ్వాసముంచు" అన్న బాబా మాట అక్షరసత్యం. నేను రెండవ సమావేశానికి వెళ్ళకుండానే అంతకాలంగా నలుగుతున్న సమస్యను పూర్తిగా పరిష్కరించి అద్భుతాన్ని చూపించారు బాబా. కాబట్టి ప్రియమైన భక్తులారా! విశ్వాసం, సహనం కలిగి ఉండండి. మనల్ని రక్షించడానికి బాబా పరుగెత్తుకుని వస్తారు. "ధన్యవాదాలు బాబా!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2581.html


సాయి అనుగ్రహసుమాలు - 361వ భాగం.


ఖపర్డే డైరీ - నలభైఆరవ భాగం.

1918 మార్చిలో అయిదవ దర్శనం:

ఈ శిరిడీ యాత్ర తేదీలు దాదాసాహెబు మరాఠీ జీవిత చరిత్ర గ్రంథంలో లేవు. అయితే ఎన్ని రోజులు ఉన్నాడనేది వివరంగా లేని ఈ దర్శనానికి ఒక ఉద్దేశం ఉంది. హోమ్ రూల్ గురించి ఒత్తిడి తీసుకురావటానికి కాంగ్రెసు దౌత్యవర్గంగా దాదాసాహెబ్ ఇంగ్లాండుకు వెళ్ళవలసి రావటం వల్ల ఆ సందర్భంలో అతను ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. ఢిల్లీ నుంచి బయలుదేరేముందు, 1897లో ఆమ్రావతిలో దాదాసాహెబ్ ఖపర్డే తను రిసెప్షన్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నప్పుడు జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు అధ్యక్షత వహించిన సర్ శంకరన్ నాయర్‌ని కలిశాడు. 1918లో సర్ శంకరన్ నాయర్ భారతదేశపు వైస్రాయ్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాను తీసుకొన్న నిర్ణయాలపై కొన్ని అనుమానాలు వచ్చాయతనికి. అందుకని తాను తీసుకున్న నిర్ణయాల గురించి సాయిమహారాజు అభిప్రాయాన్నీ, ఆయన మార్గదర్శకత్వాన్నీ తెలుసుకోమని ఖపర్డేని అర్థించాడు. తేదీలు లేని జీవిత చరిత్ర పుస్తకంలోంచి గ్రహించబడిన భాగాల వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

"శంకరన్ నాయర్ని చూశాను. నన్ను చూసి ఎంతో ఆనందించాడు. నాతో చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాడు. తన తరపు నుంచి శిరిడీలో సాయిమహారాజుని ఈ క్రింది ప్రశ్నలు అడగమని చెప్పాడు. అతను తన సర్వీసులో కొనసాగటం మంచిదేనా? ఆధ్యాత్మికంగా తాను తప్పు మార్గంలో పోతున్నాడా? అలా అయితే సాయిమహారాజు సరైన మార్గంలో నడిపిస్తారా? ఈ ప్రశ్నలు సాయిమహారాజును అడిగి ఆయనేం చెప్తారో అది అతనికి ఉత్తరం ద్వారా తెలియజేస్తానని వాగ్దానం చేశాను".

దాదాసాహెబ్ ఖపర్డే చరిత్రకారుడు, ఖపర్డే శిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శన ఆశీస్సులు తీసుకొని ఆమ్రావతి తిరిగి వచ్చాడని రాశాడు. సర్ శంకరన్ నాయర్ ప్రశ్నలకు సాయిబాబా ఏమని సమాధానాలిచ్చారన్నది డైరీలో ప్రస్తావించబడలేదని వ్రాశాడు రచయిత. బహుశా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమన్న నాయర్‌ కోరికను దాదాసాహెబ్ మన్నించి ఉండవచ్చు. డైరీ నుంచి రహస్యాలను ఉద్దేశ్యపూర్వకంగా వదిలేయటానికి ఇదో నిదర్శనం. ప్రస్తుతం దాదాసాహెబ్ ఖపర్డే డైరీలు నేషనల్ ఆర్కైవ్స్‌లో భద్రపరచబడి ఉన్నాయి.

((సర్ శంకరన్ నాయర్‌గారి అల్లుడు శ్రీ కె.పి.ఎస్ మీనన్ తన మామగారి జీవిత చరిత్రని వ్రాయగా దాన్ని 1967లో భారత ప్రభుత్వపు పబ్లికేషన్స్ డివిజన్ వాళ్ళు ప్రచురించారు. అందులో సర్ శంకరన్ నాయర్‌ వైస్రాయి ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబరుగా 1915 మధ్యలో (55వ పేజీ) ఎన్నుకోబడి జలియన్ వాలాబాగ్(1919) క్రూర హత్యలకు నిరసనగా రాజీనామా చేశారని రాశారు. (పే 104-105). సర్ శంకరన్ యోగాని విపరీతంగా నమ్ముతాడు (133 పేజీ). మతం పట్ల అతని మనసు ఎంతగానో మొగ్గుచూపేది. అతను 22-4-1934న కారు యాక్సిడెంటులో తలకి బలమైన గాయం తగిలి చనిపోయాడు. (138 పేజి) )).

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 402వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • 'సాయిలక్ష్మి'ని ఇంటికి పంపిన సాయి

నా పేరు అరుణాసూధన్. నేను అనంతపురం నివాసిని. 'సాయితో తమకున్న అత్యద్భుతమైన అనుభవాలను పంచుకుంటున్న భక్తులకు సాయి ఆశీస్సులు సదా ఉండుగాక!'. నా జీవితంలో కూడా ఒక అత్యద్భుతమైన అనుభవం చోటుచేసుకుంది. దాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2019వ సంవత్సరం ప్రథమార్థంలో ఒకరోజు మా ఎదురువీధిలో ఒక తెల్లటి గోవు కనిపించింది. వెంటనే నా మనసులో, “సాయీ! ఈ తెల్లని గోవు మా ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది!” అనుకున్నాను. అనుకున్నదే తడవుగా, ఆనాటి సాయంత్రం ఆ గోవు మా ఇంటి ముందుకు వచ్చింది. నా మనస్సులో ఆ గోవుకు ఏదైనా పేరు పెట్టాలని అనిపించింది. తనకు ‘సాయిలక్ష్మి’ అని నామకరణం చేశాను. అప్పటినుంచి సాయిలక్ష్మి ప్రతిరోజూ మా ఇంటికి ఏదో ఒక సమయంలో రావటం మొదలుపెట్టింది. కొన్నిరోజుల తరువాత, ఒక సాయంత్రం నేను ఇంటిపనుల్లో నిమగ్నమై ఉన్నాను. సాయిలక్ష్మి వచ్చి ఇంటిముందు నిలబడిపోయింది. చాలాసేపటి తర్వాత నేను తలుపు తెరచి చూస్తే ఎదురుగా సాయిలక్ష్మి! వెంటనే గోమాతకు రోజూపెట్టే ధాన్యము, పళ్ళు, పసుపు, కుంకుమ తీసుకొని వెళ్ళి సాయిలక్ష్మికి పెడుతూ ఆమెను గుర్తించలేనందుకు మనసులోనే క్షమ యాచించి, “ఇలా ఎంతసేపు నిలబడుతావు తల్లీ? ఇకపై నేను పొరపాటున గమనించకపోతే ఒక్కసారి పిలువు తల్లీ, వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాను” అని చెప్పాను. ఏ నిమిషాన ఆ విషయం నేను సాయిలక్ష్మికి విన్నవించుకున్నానో గానీ ఆ మరుసటిరోజు నుంచి తను వచ్చిన వెంటనే ‘అంబా’ అని అనడం మొదలుపెట్టింది. ఆమె స్వరం వినగానే నాకు శరీరమంతా గగుర్పాటు చెందేది.

సాయిలక్ష్మి ప్రతి మాసంలో మొదటిరోజు వచ్చి మొదటి తాంబూలం తీసుకొని వెళ్తూండేది. మధ్యాహ్న ఆరతి లేదా శేజ్ ఆరతి సమయానికి ఖచ్చితంగా వచ్చేది. ఇలా ప్రతిరోజూ సాయికృప వల్ల గోమాతకు సేవ చేసుకుంటూ ఉంటుండేదాన్ని. ఇలా జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ మాసాలు గడిచాయి. కార్తీక మాసం ప్రారంభమైంది. ఎప్పటిలాగానే సాయిలక్ష్మిదే అగ్రతాంబూలం. కానీ ఈ మాసంలో ఆ తల్లి ఏ పుణ్యతీర్థంలో అభ్యంగన స్నానం చేసి వచ్చేదో గానీ, ఆ తల్లి శరీరం నుంచి, పొదుగు నుంచి, తోక నుంచి నీటిచుక్కలు ధారగా కారుతుండేవి. ప్రతిరోజూ ఆమె శరీరం చల్లగా ఉండేది. ముగ్గురమ్మల మూలపుటమ్మలా అలంకరించుకుని వచ్చేది. కార్తీకమాసమంతా నాకు ఇంటి వద్దనే సాయిలక్ష్మి రూపంలో శ్రీభ్రమరాంబిక మల్లికార్జునుల దర్శనభాగ్యం కలిగింది.

మార్గశిర మాసంలో ఒక ఏకాదశిరోజున మధ్యాహ్న ఆరతి అయిన తరువాత తలుపు తీసేసరికి సాయిలక్ష్మి సుఖాసనంలో ఉన్న సాయిలా ఇంటిముందు కూర్చుని ఉంది. ఒక్క నిమిషం నాకు సాయియే స్వయంగా అక్కడ కూర్చున్నట్టు అనుభవమయింది. వెంటనే ఆమె లేచి నిలబడింది. ఆమెకు ధాన్యము, పసుపు, కుంకుమ పెట్టాను. నాకు అమితానందం కలిగింది.

కొన్నిరోజుల తర్వాత, సాయిలక్ష్మి ఒక బుధవారంరోజున తన దూడతో పాటు మా ఇంటికి వచ్చింది. ఆ దూడ కూడా తల్లి వలె శ్వేతవర్ణంలో ఉంది. రెండిటికీ ధాన్యము, పళ్లు, పసుపు, కుంకుమ పెట్టాను. అప్పుడు నేను ఆ తల్లి కష్టం చూడలేక, “సాయిలక్ష్మీ! ఇంత చలిలో ఈ చిన్న పాపను వెంటబెట్టుకుని రాత్రిళ్లు, వేకువఝాముల్లో ఎందుకు వస్తావమ్మా? కాస్త వెచ్చని వేళలలో రా తల్లీ!” అని చెప్పాను. ఆ తల్లికి నా మాటలు ఏమని తోచాయో ఏంటో, ఆరోజు మొదలు సాయిలక్ష్మి మా ఇంటికి రావటం మానేసింది. పుష్యమాసం కూడా వచ్చింది. అయినా గోమాత జాడ లేదు. ప్రథమ తాంబూలం తీసుకోవటానికి కూడా సాయిలక్ష్మి రాలేదు. నా మనసు చాలా వ్యధ చెందింది. బాబాతో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను, కానీ ఆ తల్లి జాడ తెలియలేదు. ఇలా ఉండగా, ఒకరోజు సాయంకాలం మా కుటుంబీకులతో కలిసి బయటకి వెళ్ళాను. అక్కడ నాకు ఆ తల్లి సాయిలక్ష్మి దర్శనం అయింది. అంతే, నా మనసులో మాతృత్వభావన పెల్లుబికింది. అక్కడ పండ్ల దుకాణాలు ఉంటే యాపిల్ పండ్లు కొనుక్కుని ఆ తల్లికి, దూడకు తినిపించాను. ఆరోజు సాయంత్రం ఇంటినుండి ధాన్యము, పండ్లు తీసుకుని సాయిలక్ష్మి  దగ్గరికి వెళ్ళి ఆమెకు నివేదించాను. అలా ఒక మూడురోజులు చేయగలిగాను. ఆ తర్వాతరోజు అంతా సిద్ధం చేసుకున్నాక అంతదూరం వెళ్ళటానికి వీలుపడలేదు. ఆరోజునుంచి బాబాని క్షమ యాచిస్తూ సాయిలక్ష్మిని తిరిగి పంపమని వేడుకుంటుండేదాన్ని. ఏ గోమాత ఇంటి వద్దకు వచ్చినా సాయిలక్ష్మినే తలచుకునేదాన్ని. “బాబా! పిల్లి, కుక్క, గోమాతలు అన్నింటినీ పంపుతున్నావే, మరి నా సాయిలక్ష్మిని మాత్రం ఎందుకు పంపట్లేదు తండ్రీ?” అంటూ రోజూ బాబాను ప్రాధేయపడేదాన్ని.

కొన్నిరోజుల తర్వాత ఆ తల్లి మా ఇంటికి రావాలని సంకల్పం చేసుకుని శ్రీసాయిసచ్చరిత్రను పారాయణ చేయటం మొదలుపెట్టాను. కానీ ఎందుకో దీనిగురించి బాబాని అడగాలని అనుకున్నాను. 2020, ఏప్రిల్ 15, బుధవారంనాడు “బాబా! సాయిలక్ష్మిని ఎప్పుడు పంపుతావు? ఆ తల్లి ఎప్పుడు నన్ను కరుణిస్తుంది?” అని మనసులోనే బాబాను ప్రశ్నించి, సాయిలీలామృతం పుస్తకంలో ఒక పేజీని కళ్ళుమూసుకొని తీశాను. ఆ పేజీలో ‘శ్రద్ధ సబూరితో ఉండు’ అన్నది సారాంశం. “సరే బాబా, అలాగే ఉంటాను” అని బాబాతో చెప్పుకున్నాను.

అదే వారంలో శనివారంనాడు (18-04-2020) ఏకాదశి. నాకు ఒక వాట్సాప్ గ్రూపులో గురుచరిత్ర నిత్యపారాయణ చేసేందుకు లింక్ వచ్చింది. వెంటనే నేను అది బాబా ఆజ్ఞగా స్వీకరించి గురుచరిత్రను మొదలుపెట్టాను. గురుచరిత్ర మహిమ, సాయి ఆశీస్సుల వల్ల ఆ మరుసటిరోజు(19-04-2020) ప్రొద్దున 7.30 గంటలకు సాయిలక్ష్మి దూడతో సహా వచ్చి నాకు, మా కుటుంబీకులకు దర్శనమిచ్చింది. ఆ తల్లిని చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. తనివితీరా ఆ తల్లిని సేవించుకున్నాను. ఇలా సాయి కృప వల్ల సాయిలక్ష్మి తిరిగి వచ్చింది. ‘సాయీ!’ అంటే ‘ఓయీ!’ అంటాడు ఆ సాయినాథుడు. ఆయన లీలలకు అంతు లేదు. భక్తి శ్రద్ధలతో సాయిని అడిగితే ఆయన తప్పక ప్రసాదిస్తారు. ఇది సత్యం, సత్యం, ముమ్మాటికీ సత్యం.



శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు.


సాయి అనుగ్రహసుమాలు - 360వ భాగం.


ఖపర్డే డైరీ - నలభై ఐదవ  భాగం

మార్చి 15:

మేము సాయంత్రం ఏడు గంటల ట్రైనులో బయలుదేరి మన్మాడు చేరాము. ప్యాసింజర్ రైలు పక్క ప్లాట్‌ఫారం మీద సిద్ధంగా ఉంది. మేము అందులోకి ఎక్కాము. మాకు టిక్కెట్లు కొనమని పాలేకర్‌ని పంపాను. ఈ లోపల రైలు బయలుదేరటంతో పాలేకర్ రైలు ఎక్కలేకపోయాడు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరు మా కంపార్టుమెంటులోనే ఉన్నాడు. పరిస్థితినంతా నేనతనికి వివరించాను. భూసావల్ వరకూ వెళ్ళి అక్కడ పాలేకర్ కోసం ఎదురు చూడమని నాకు సలహా ఇచ్చాడతను. నేను అలాగే చేశాను. నేను ఇక్కడ భూసావల్ స్టేషనులో పాలేకర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా దగ్గర టిక్కెట్టు గానీ, డబ్బుగానీ లేదు. పాలేకర్ ఖపర్డేని భూసావల్ దగ్గర కలిశాడు. ఇద్దరూ కలిసి నాగపూర్ వెళ్ళే ట్రైనులో ప్రయాణించారు. ఖపర్డే మార్చి 16న ఆమ్రావతి చేరుకున్నాడు. అతను తన హృదయాన్ని శిరిడీలోనే విడిచి పెట్టి వచ్చాడన్న విషయం, 1912 మార్చి 18వ తారీఖు ఎంట్రీలో చూడవచ్చు. ఇది కూడా మరాఠీ జీవిత చరిత్ర నుంచి తీసుకొని అనువదించబడింది.

"శిరిడీలో ఉన్న ఆధ్యాత్మిక జీవితం ఇక్కడ కొరవడింది. ఆ నష్టాన్ని పూర్తిగా అనుభూతి చెందుతున్నాను. శిరిడీలో లాగా తెల్లవారుఝామున లేద్దామని అనుకుంటున్నాను, కానీ అలా చేయలేకపోతున్నాను. ఉదయపు స్తోత్రాలు పఠించుకోవటానికి నేను చాలా శ్రమపడవలసి వస్తోంది".

1915 డిసెంబరులో 3వ దర్శనం:

దాదాసాహెబ్ ఖపర్డే తన స్నేహితుడు బాబాగుప్తేను కలుసుకోవటానికి థానే వెళ్ళి అక్కడ నుంచి మన్మాడు మీదుగా డిసెంబరు 29న శిరిడీకి వచ్చాడు. శ్రీమతి ఖపర్డే, మిగిలిన కుటుంబసభ్యులు అప్పటికే నేరుగా శిరిడీ చేరుకున్నారు. డిసెంబరు31వ తేదీన దాదాసాహెబు అమరావతి తిరిగి వెళ్ళడానికి బాబా వద్దనుండి అనుమతి సంపాదించి వెళ్ళిపోయాడు. శ్రీమతి ఖపర్డే, ఇంకా మిగిలినవారు అక్కడే ఆగిపోయారు. ఖపర్డే శిరిడీని దర్శించినందుకు చాలా సంతోషించాడన్న సంగతి వారి మరాఠీ జీవిత చరిత్రలోని కొన్ని భాగాలనుండి తెలుస్తోంది.

డిసెంబరు 29:

"నేను కోపర్గాం నుండి టాంగాలో బయలుదేరి శిరిడీకి ఉదయం 9 గంటలకు చేరాను. త్రోవలో చాలా ప్రమాదాలు ఎదురయ్యాయి. నా భార్యా, పిల్లలూ అప్పటికే శిరిడీలో ఉన్నారు. నేను మశీదుకి వెళ్ళి సాయిబాబాకి నమస్కరించాను. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. పూజా సమయంలో నేను చామరం (నెమలి పింఛాల విసనకర్ర) పట్టుకున్నాను. ఇక్కడ రోజు ఇట్టే గడిచిపోతుంది. గోపాలరావు ఎలియాస్ బాపూసాపాబ్ బూటీ ఇక్కడే ఉన్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్, బాలాసాహెబ్ భాటే ఇంకా మిగిలిన పాత స్నేహితులంతా ఇక్కడే ఉన్నారు. నాకు చాలా ఆనందమనిపించింది".

డిసెంబరు 30:

"ఈరోజు నేను పూజ చేసి నైవేద్యం సమర్పించాను. ప్రసాదం కోసం సుమారు 100 మంది కూర్చుని ఉన్నారు. భోజనం అద్భుతంగా ఉంది. అయితే కొంచెం ఆలస్యంగా, అంటే సాయంత్రం నాలుగు గంటలకి పూర్తయింది. బూటీవాడా నిర్మాణం బాగానే సాగుతోంది. ఈరోజు చావడి ఉత్సవం జరిగింది. నేను నా చేతుల్లో చామరం పట్టుకొన్నాను".

డిసెంబరు 31:

భోజనానంతరం నేను మాధవరావు దేశ్‌పాండేని కలిశాను. ఎటువంటి కష్టమూ లేకుండా తిరిగి వెళ్ళటానికి బాబా వద్ద అనుమతిని సంపాదించుకున్నాను. నా భార్య, మనూతాయి, ఉమ, పిల్లలూ ఇక్కడే ఆగిపోతారు".

1917 మే 19న నాలుగవ దర్శనం:

లోకమాన్య తిలక్‌తో కలిసి దాదాసాహెబ్ ఖపర్డే శిరిడీ వచ్చి పన్నెండు గంటలు ఉండటం అనేది కేవలం లోకమాన్యను సాయిబాబా వద్దకు తీసుకొచ్చి వారి ఆశీస్సులను తన నాయకుడికి ఇప్పించటానికే. శ్రీసాయిలీలలో వచ్చిన వివరాలు దాదాపు సంపూర్ణంగానే ఉన్నాయి.


తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 401వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ప్రత్యక్ష సాయి లీలతో ఏర్పడిన భక్తి విశ్వాసాలు
  2. బిడ్డ హాయిగా నిద్రపోయేలా సహాయం చేసిన బాబా

ప్రత్యక్ష సాయి లీలతో ఏర్పడిన భక్తి విశ్వాసాలు

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శాంతి. నా చిన్నప్పటినుండి బాబాతో నాకు గల అనుబంధం. బాబాకు నాపై గల ప్రేమ, ఆయన నాకు ప్రసాదించిన అనుభవాలను గురించి మీతో పంచుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 8 సంవత్సరాల వయస్సున్నప్పుడు నా స్నేహితురాలి ద్వారా నాకు బాబాపై ఇష్టం ఏర్పడింది. ఇంట్లోవారికి బాబా గురించి చెబితే ‘బాబా ముస్లిం, మనం బాబాను పూజించకూడద’ని అంటారేమోనని వాళ్ళకి చెప్పకుండా నా స్నేహితురాలి దగ్గర చిన్న పాకెట్ సైజ్ బాబా ఫోటోని తీసుకుని పుస్తకంలో పెట్టుకొని మానసికంగా బాబాకు పూజ చేసుకొనేదాన్ని. ఒకరోజు మా మేనత్తగారు వాళ్లింట్లో బాబా భజన ఏర్పాటు చేసుకుని, దానికి మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు. నేను, మా నాన్న బాబా భజనకి వెళ్ళాము. అక్కడ ఒక అద్భుతం జరిగింది. భజన జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి మూడేళ్ళ వయసున్న మా మేనత్త మనుమరాలికి విపరీతంగా చెవిపోటు వచ్చింది. ఒకప్రక్క బాబా సత్సంగం(భజన) జరుగుతోంది, మరోప్రక్క పాప ఏడుస్తూ ఉంది. ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా పాపకి నొప్పి తగ్గలేదు. ఆర్.ఎం.పి డాక్టరుకు చూపించినా తగ్గలేదు. అప్పుడు మా మామయ్య బాబాను ప్రార్థించి కొద్దిగా బాబా ఊదీని పాప చెవికి రాశారు. అద్భుతం! ఊదీ మహిమతో పాపకి చెవినొప్పి తగ్గి తను హాయిగా నిద్రపోయింది. జరిగినదంతా చూసిన మా నాన్నగ ఎంతో ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఆ బాబా లీలను ప్రత్యక్షంగా చూసిన నాన్నకి బాబాపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. ఇక మేము ఇంటికి వచ్చినప్పటినుంచి నాన్న అక్కడ జరిగిన అద్భుతాన్ని గూర్చి ఆలోచిస్తూ, ‘మన ఊరికి కూడా బాబాని తీసుకురావాలి’ అని అనుకొని, మా మేనత్త ఇంట్లో సత్సంగం నిర్వహించినవారిని కలుసుకొని, వారితో మాట్లాడి, వారంలో ఒకరోజు (మంగళవారం) మా ఊరిలో సత్సంగం నిర్వహించుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. (ఆ సమయంలో సత్సంగం నిర్వహించే సాయిబంధువులకు మంగళవారం ఒక్కరోజు ఖాళీ ఉంది. మిగతా రోజులలో వాళ్ళు వేరు వేరు ఊర్లలో సత్సంగం నిర్వహించేవారు.) మొదటిసారి నలుగురు వ్యక్తులతో జరిగిన బాబా సత్సంగం ఇప్పుడు పెద్ద బాబా మందిరంలో వేలాదిమంది భక్తులతో ప్రతి మంగళవారం ఎంతో వైభవంగా జరుగుతోంది

బిడ్డ హాయిగా నిద్రపోయేలా సహాయం చేసిన బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. మా పాపకి రెండు నెలల వయసున్నప్పుడు చాలామంది పిల్లలలాగే తను రాత్రిళ్ళు నిద్రపోయేదికాదు. అది నాకొక పెద్ద సమస్య అయింది. ఎందుకంటే, తను నా మొదటి సంతానం కావడం వలన మాతృత్వాన్ని మొదటిసారి అనుభవిస్తున్నానే గానీ బిడ్డను ఎలా సముదాయించాలో తెలిసేది కాదు. అది నాకెంతో బాధాకరంగా ఉండేది. తనకి గ్యాస్ సమస్య ఉన్నందున పది లేదా పదిహేను నిమిషాలపాటు బిగ్గరగా ఏడ్చేది. ఐదు నిమిషాలు విరామమిచ్చి మళ్ళీ ఏడ్చేది. ఇలా రాత్రంతా ఏడుస్తూనే ఉండేది. మేము తనని చాలామంది వైద్యులకు చూపించి, చాలా మందులు ప్రయత్నించాము. కానీ ఏమీ ప్రయోజనం కనపడలేదు. చివరికి నేను, "నా బిడ్డ రాత్రిళ్ళు హాయిగా పడుకోవాలి. తన గ్యాస్ సమస్యను సరిచేసి ఏడుపు ఆపేలా చేయండి బాబా" అని సాయిబాబాను ప్రార్థించాను. బాబా కృప చూపారు. రెండు మూడురోజుల తరువాత నుండి నా బిడ్డ రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవడం ప్రారంభించింది. నేను దేనివలనైతే ఎక్కువగా బాధపడ్డానో ఆ గ్యాస్ సమస్య కూడా సమసిపోయి ఏడవటం మానేసింది. ఈ సమస్యలోనే కాదు చాలా సమస్యలలో బాబా నాకు సహాయం చేశారు. కానీ నేను బాబా నాకు సహాయం చేస్తే రెండు, మూడురోజుల్లో నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటానని ప్రార్థించి కూడా పంచుకోకుండా వారం రోజులు ఆలస్యం చేశాను. అప్పుడు మళ్ళీ నా బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. అరగంట పాటు ఏడుస్తూనే ఉంది. దాంతో నేను నా అనుభవాన్ని పంచుకుంటానన్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే నేను నా ఆలస్యానికి బాబాకు క్షమాపణలు చెప్పుకుని, మరుసటిరోజు ఎలాగైనా నా అనుభవాన్ని పంచుకుంటానని వాగ్దానం చేశాను. నేను అలా వాగ్దానం చేసిన మరుక్షణంలో నా బిడ్డ ఏడుపు ఆపి సంతోషంగా ఆడటం ప్రారంభించింది. తరువాత హాయిగా నిద్రపోయింది. "నాకు సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".

source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2612.html?m=0


సాయి అనుగ్రహసుమాలు - 359వ భాగం


ఖపర్డే డైరీ - నలభై నాలుగవ  భాగం

1924-25లో శ్రీసాయిలీలలో ఈ డైరీ ప్రచురింపబడింది. అయితే ప్రచురింపబడిన భాగాలలో కొన్ని విషయాలు అసంపూర్తిగానూ, కొన్ని విషయాలు పూర్తిగా తొలగించబడీ ఉన్నాయి. ఆ లోపాలేమిటో ఇప్పుడు చూద్దాం.

8-12-1911: ఈ తేదీలో వ్రాసిన దానినుండి ఈ క్రింది వాక్యాలు  తొలగించబడ్డాయి:

మాధవరావు దేశ్‌పాండే ఇక్కడే నిద్రపోయాడు. కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివినదీ, నేను ఎన్నడూ అనుభవించనిదీ అయిన విచిత్రాన్ని నేను స్వయంగా నా కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను. మాధవరావు దేశ్‌పాండే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ 'సాయినాథ్ మహారాజ్', సాయినాథ్ బాబా' అని స్పష్టంగా వినిపిస్తోంది. మాధవరావు దేశ్‌పాండే గురక పెడుతున్నప్పుడు దూరానికి కూడా ఈ పదాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇది నిజంగా చాలా అద్భుతం.

12-03-1912 నుండి 15-03-1912 వరకు:

ఈ క్రింది వాక్యాలు మార్చి 12, 13 తేదీలలో లేవు. వీటిని మరాఠీ జీవిత చరిత్రలో నుంచి తీసుకొని ఇంగ్లీషులోకి వ్రాయటం జరిగింది.

మార్చి 12:

మేము ఈరోజు తరగతిలో 'పంచదశి' చదవటం పూర్తి చేశాము. ఈ సందర్భాన్ని మేము రెండు దానిమ్మపండ్లతో వేడుకగా జరుపుకున్నాము. 'బాబాపాలేకర్' (దాదాసాహెబ్ ఖపర్డే వద్ద పనిచేస్తున్న ఓ జూనియర్ ఎడ్వొకేట్) ఆమ్రావతి నుంచి వచ్చి, మా కుటుంబసభ్యులు చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పాడు.

మార్చి 13:

రేపో, ఎల్లుండో నన్ను తీసుకు వెళ్ళటానికి బాబాపాలేకరుకు సాయిబాబా నుంచి అనుమతి లభించింది.

1912 మార్చి 14, 15:

తారీఖుల్లోని వివరాలు శ్రీసాయిలీలలో పూర్తిగా వదిలేయబడ్డాయి. ఈ క్రింద ఇవ్వబడిన వివరాలు మరాఠీ జీవితచరిత్ర నుండి తీసుకుని ఇంగ్లీషులోకి అనువదించబడ్డాయి.

మార్చి 14:

బాబాపాలేకర్ నాకంటే ముందు బాబా వద్దకు వెళ్ళి నన్ను తీసుకెళ్ళటానికి అనుమతి సంపాదించాడు.

మార్చి 15:

నేను, బాబాపాలేకర్, దీక్షిత్ మశీదుకు వెళ్ళాం. నేను ఆమ్రావతి తిరిగి వెళ్ళే విషయాన్ని దీక్షిత్ ప్రస్తావించాడు. సాయి అనుమతి ఇచ్చాక నేను తిరిగి వచ్చి నా భార్యను నా సామాన్లు సర్దమన్నాను. ఆమెలాగూ భీష్మ, బందూలతో పాటు ఇక్కడే ఉంటుంది. మధ్యాహ్న భోజనానంతరం నేను, పాలేకర్ సాయిబాబాని దర్శించుకోవటం కోసం వెళ్ళాం. మేము వారిని గ్రామ సరిహద్దు దగ్గర కలిసి వారి ఆజ్ఞానుసారం వెనక్కి వెళ్ళి, కొద్దిగా ఊదీ తీసుకొచ్చి బాబా చేతుల మీదుగా తీసుకున్నాం. బాబా మమ్మల్ని వెంటనే బయలుదేరమని, 'అల్లా భలా కరేగా' (భగవంతుడు నీకు మేలు చేస్తాడు) అని ఆశీర్వదించారు. 


తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo