ఈ భాగంలో అనుభవాలు:
1. బాబానే దిక్కు - ఆయన లేకపోతే ఏమైపోతామో!
2. ఊహించని విధంగా అనుగ్రహించిన బాబా
బాబానే దిక్కు - ఆయన లేకపోతే ఏమైపోతామో!
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు లలిత. నాకు ఇద్దరు మగపిల్లలు. మొదటి బాబు పుట్టిన 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ గర్భస్రావమై గర్భం నిలువలేదు. ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ అప్పుడు కూడా గర్భస్రావం అయ్యింది. ఇంకా నేను బాబాని, "బిడ్డ పుడితే మీ పేరు పెట్టుకుంటాను. అలాగే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల కొన్నాళ్ళకి నేను మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంటుండేది. 2 నెలల తర్వాత కొంచెం బ్లీడింగ్ అయ్యింది. దాంతో మళ్ళీ గర్భస్రావం అయిపోతుందెమోనని నాకు ఇంకా భయమేసి బాబా దగ్గర ఏడుస్తూ, "నా గర్భం నిలపమ"ని చాలా వేడుకున్నాను. "అన్నదానం చేయిస్తాన"ని కూడా మొక్కుకున్నాను. నేను యూకేలో ఉంటాను. ఇక్కడ అడిగిన వెంటనే స్కానింగ్ చేయరు. ఒక వారం తర్వాత ఎప్పుడో అప్పోయింట్మెంట్ ఇచ్చారు. నేను 'లోపల బేబీకి ఎలా ఉందో? ఏంటో?' అని భయంతో ఆ వారం రోజులు చాలా నరకం చూసాను. కానీ బాబా దయవల్ల స్కానింగ్లో బిడ్డ గుండె కొట్టుకుంటుందని, బిడ్డ ఆరోగ్యంగా ఉందని వచ్చింది. అప్పుడు నేను ఎలా ఫీల్ అయుంటానో వేరే చెప్పాలా? బాబాకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. తర్వాత ఇంకోసారి కూడా కొంచం బ్లీడింగ్ కనిపించింది. బాబానే దిక్కని ఊదీ నీళ్లలో కలుపుకొని రోజూ తాగుతూ 'సాయి సచ్చరిత్ర', సాయిమహారాజ్ సన్నిధి బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతుండేదాన్ని. దాంతో నాకు ఎంతో ఊరటగా, నమ్మకంగా ఉండేది. నా నమ్మకం వృధా కాలేదు. బాబా అడుగడుగునా నన్ను కాపాడుతూ నాకు ఆరోగ్యమైన బాబుని ప్రసాదించారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేముందు బాబుని చెకప్ చేసి, బాబు ఊపిరి ఎక్కువ సార్లు తీసుకుంటున్నాడని చెప్పి చాలా టెస్టులు చేసారు. ఆ సమయంలో నేను బాబా నామస్మరణ చేస్తూ, కాన్పుకోసం హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడే నాతోపాటు తీసుకె ళ్లిన బాబా ఊదీ ప్యాకెట్ నా బిడ్డ తల కింద పెట్టేదాన్ని. బాబా నా మీద దయ చూపారు. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. బాబా కృపవల్ల వారం తర్వాత నేను, నా బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చాము. ఇప్పుడు నా బిడ్డకి ఐదో నెల. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. బాబా లేకపోతే నాలాంటి వాళ్ళందరూ ఏమైపోతారో! ఆయనే అన్నిటికీ, అందరికీ దిక్కు. ఆయన ఊదీ ఎంతో అద్భుతమైనది. అత్యంత ఉత్తమ ఔషధం. ఆ ఊదీ నీళ్ళే ఇదివరకు నా అనారోగ్యాన్ని పోగొట్టి నాకు పునర్జన్మనిచ్చాయి. అందుకే నాకు బాబా ఊదీ అంటే చాలా నమ్మకం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. థాంక్స్ చెప్పుకోవడం తప్ప నేను ఏమి చేయలేను బాబా".
ఊహించని విధంగా అనుగ్రహించిన బాబా
సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు శ్వేత. నేను బెంగుళూరు వాసిని. నేను చెప్పబోయే విషయం చిన్నదే అయినా నా మనసుకు చాలా సంతోషాన్నిచ్చింది. కాబట్టి మీతో పంచుకోవాలనిపించి బాబా కరుణ ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. మేము 2026, మార్చి 25, బుధవారం నాడు బయలుదేరి గురువారం సాయంకాలం 4 గంటలకు శిరిడీ చేరుకున్నాము. రూముకు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళాము. మాది ఎంత అదృష్టమంటే, మమ్మల్నే చివరిగా లోపలికి పంపి గేటు వేసేశారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా మాకు బాబా దర్శనం అయ్యుండేది కాదు. తర్వాత ఆ రాత్రి అనుకోకుండా శేజారతికి హాజరయ్యాము. నిజానికి నేను బెంగుళూరులో ఉన్నప్పుడు శిరిడీలో ఏదైనా ఒక హారతికి వెళ్లాలని, అదే జరిగితే ప్రసాదం పంచాలని అనుకున్నాను. అనుకోకుండా శేజారతి దర్శనం అవ్వడంతో నేను ముందుగా అనుకున్నట్లు అటుకుల ప్రసాదం మనసుకి తృప్తి కలిగేలా పంచాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇకపోతే, మేము ఆన్లైన్లో సాయి సత్యవ్రతానికి టికెట్లు బుక్ చేయాలని చూస్తే, ఏ కారణం చేతనో అమౌంట్ బ్లాక్ అయి టికెట్ బుక్ కాలేదు. దాంతో సాయి సత్యవ్రతానికి వెళ్లే వీలు లేకుండా పోయిందని బాధపడ్డాను. కానీ బాబా నా మనసులోని మాటను ఆలకించారు. మేము దర్శనానికి వెళ్లినప్పుడు సాయి సత్యవ్రతం టికెట్లు ఆఫ్ లైన్లో కూడా దొరుకుతాయని తెలిసి సంతోషంగా సాయి సత్యవ్రతం చేసుకున్నాను. ఇది కూడా అనుకోకుండా జరిగినందువల్ల నా మనసుకి చాలా ఆనందం కలిగింది. ఇంకో విషయం, ఆ రోజు వీఐపీ మార్గంలో మమ్మల్ని దర్శనానికి వదిలారు. దర్శనం చాలా బాగా జరిగింది. అదేరోజు సాయంకాలం ద్వారకామాయి అమ్మ ఒడిలో కూర్చుని ధూప్ హారతి దర్శించాను. ఆవిధంగా మేము శిరిడీలో ఉన్న మూడు రోజులూ బాబాని సంతృప్తిగా దర్శించుకున్నాము. ఇవి ఏవీ నేను జరుగుతాయని అస్సలు ఊహించలేదు. "ధన్యవాదాలు బాబా. ఈ సృష్టిలో మీ కరుణ లేక మాకు మనుగడ లేదు. మీ కరుణను ఎంతని వర్ణించను? మీ కరుణను వర్ణించడానికి నాకు మాటలు లేవు. అందరికీ మంచి ఆరోగ్యన్నివ్వు. కష్టాలు తొలగించి, అందరినీ చల్లగా కాపాడు బాబా. ఈ శరీరం వుండే వరకు మీ పాదాల చెంతే మమ్మల్ని ఉండనీయండి బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

No comments:
Post a Comment