ఈ భాగంలో అనుభవం:
- బాబా కృపాశీస్సులు
నా పేరు మాధవి. ప్రస్తుతం మేము అమెరికాలో నివసిస్తున్నాము. ఒకవేళ మేము ఎప్పుడైనా భారతదేశానికి తిరిగి వెళితే, అక్కడ మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అందువల్ల అక్కడ మేమొక స్థలం లేదా ఇల్లు కొనాలకొని, "మాకు తగిన ఒక ఆస్తి చూపించమ"ని బాబాను ప్రార్థించి నా కోరికను వారి పాదాల వద్ద ఉంచి మా తల్లిదండ్రులతో, "సమీపంలో ఉన్న నగరంలో స్థలం లేదా ఇళ్లకోసం వెతకమ"ని చెప్పాను. వాళ్ళు సరేనన్నారు. కాలం తొందరగా గడిచిపోయింది. ఒకరోజు మా అమ్మానాన్నలు దగ్గరలో ఉన్న ఒక నగరానికి వెళ్లి, అక్కడ బిల్డర్లతో మాట్లాడారు. వాళ్ళు అనేక ప్లాట్లు, ఇల్లు చూపించారు. ధరల గురించి చర్చించిన మీదట మా బడ్జెట్‌కు అందుబాటులో ఉండే ప్లాట్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని మాకనిపించింది. నేను నా తల్లిదండ్రులతో తుది ధరను మాట్లాడమని చెప్పాను. కానీ నా అంతరంగంలో మాత్రం, 'ఇది సరైన నిర్ణయమేనా?' అని బాబాను అడుగుతూ ఉండేదాన్ని. చీటీల ద్వారా నేను నిర్ణయం తీసుకోలేకపోయాను. అందుచేత, “బాబా! ఎలా నిర్ణయించుకోవాలో నాకు తెలియడం లేదు. ఈ ప్లాట్ కొనడం సరైనదైతే, దయచేసి మీ ఆమోదానికి చిహ్నంగా మీ మూర్తి నుండి పువ్వు జారడం లేదా మీరు ఆకుపచ్చ రంగు దుస్తులలో దర్శనం ఇవ్వడం వంటి సంకేతమివ్వండి" అని బాబాను ప్రార్థించాను. తర్వాత బాబా హారతి సమయంలో ఆ సంకేతం కోసం చూశానుకానీ, కనపడలేదు. బాబా పచ్చని వస్త్రాలలో చూస్తానేమోనన్న ఆశతో సోషల్ మీడియాలో వెతికినా కనిపించలేదు. దాంతో నాకు కొంచెం నిరాశ కలిగింది. అప్పుడు నేను ఒక దీర్ఘ శ్వాస తీసుకుని, “బాబా! సమయం మించిపోతోంది. ఇది సరైనదైతే దయచేసి దీన్ని ముందుకు నడిపించండి. లేకపోతే, ఇది జరగకుండా చేయండి. ఏదేమైనా అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించండి” అని బాబాను మళ్ళీ ప్రార్థించి, భారమంతా ఆయన మీద వేసి నిద్రపోయాను. ఒక అద్భుతం జరిగింది! తెల్లవారుజామున సుమారు 3 గంటలకు మా అమ్మ నాకు ఒక బాబా ఫోటో ఫ్రేమ్ యొక్క ఫోటో పంపింది. సరిగ్గా అదే క్షణాన నాకు మెలకువ వచ్చి ఆ బాబా ఫోటోని చూసి అపారమైన ఆనందాన్ని పొందాను. నేను దానిని ఒక శుభసూచకంగా భావించి, ఆ ఫోటో ఎందుకు పంపిందో అమ్మని అడుగుదామని వెంటనే అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ తాము బిల్డర్ కార్యాలయానికి వెళ్లి, ఒప్పందాన్ని ఖరారు చేసి, ప్లాట్‌ను బుక్ చేసుకోవడానికి కొంత అడ్వాన్స్ చెల్లించామని, అప్పుడు బిల్డర్ తమకి ఆ బాబా ఫోటో ఇచ్చారని చెప్పింది. ఆ ఫోటో ద్వారా బాబా తమ దర్శనాన్ని, భరోసాను నాకు ఇచ్చారని నేను భావించాను. కానీ బాబా అద్భుతం అక్కడితో ముగియలేదు. ఆయన తమ బిడ్డ కోరికను ఎలా విస్మరిస్తారు? మర్నాడు నేను శిరిడీ సాయిబాబా హారతి గ్రూపు తెరిచినప్పుడు, కాకడ హారతికి బాబా ఆకుపచ్చ వస్త్రాలు ధరించి ఉండటం చూశాను. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. "చాలా ధన్యవాదాలు బాబా. మీకు కోటి కోటి ప్రణామాలు. దయచేసి ఎల్లప్పుడూ మాతో ఉండండి. మరియు మీ నామస్మరణను కొనసాగించడానికి మమ్మల్ని ఆశీర్వదించండి.
షుగర్, హైబీపీ ఉన్న మా నాన్న 2026, ఫిబ్రవరిలో టెస్టింగ్‌కి వెళ్ళినప్పుడు షుగర్ కాస్త ఎక్కువ చూపించింది. ఈ ఒక్కసారికే కదా అనుకున్నాము గానీ, మళ్ళీ టెస్టుకి వెళ్లినప్పుడు షుగర్ ఇంకా ఎక్కవ చూపించింది. దానికి తోడు నాన్న చర్మం మీద ఏదో గడ్డలా కనిపించిందని అమ్మ చెప్పింది. అమ్మకి కూడా వయసు అవుతుంది. ఆరోగ్యం కోసం అన్నీ చేసుకొని తినే ఓపిక ఉండదు. నేనేమో అమ్మానాన్నలకు చాలా దూరంగా ఉన్నాను. కొన్నిరోజులు వెళ్లి వంట మొదలైనవి ఏవైనా చేసి వాళ్ళకి సహాయం చేద్దామన్నా నాకు కుదరదు. అందువల్ల నేను చాలా బాధపడ్డాను, చాలా ఆందోళన చెందాను. వెంటనే బాబా గదిలోకి వెళ్లి "అంతా మీ మీద భారం వేస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది. నాకు తోడుగా ఉండండి. నాన్నకి అంతా మామూలు అవ్వాలి. అంతా మామూలైతే అన్నదానం చేస్తాను. ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నాకు వేరే దారి లేదు. మీరు చూసుకుంటారన్న నమ్మకముంది కానీ, ఏదో ఒక భయం. అమ్మానాన్న కదా! ఉండలేకపోతున్నాను" అని చెప్పుకున్నాను. అక్కడ నాన్న వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. నేను ఇక్కడ బాబా నామస్మరణ చేసుకుంటూ, "నాన్నకి బాగవ్వాలి. చర్మంపై ఉన్న గడ్డ పోవాలి" అని బాబాని అడుగుతూ ఉండేదాన్ని. బాబా దయతో ఆ గడ్డ ఆరోజు సాయంత్రానికల్లా పోయింది. ఆ విషయం విన్నాక నాకు ఒక పెద్ద టెన్షన్ పోయింది. మరుసటి వారం నాన్న షుగర్ చెకప్‌కి వెళ్ళారు. అప్పుడు కూడా నేను నామస్మరణ చేశాను. బాబా దయతో షుగర్ నియంత్రణలోకి వచ్చింది. "ధన్యవాదాలు బాబా. కోటి కోటి ప్రణామాలు తండ్రీ. ఈ కలియుగంలో కూడా మాపట్ల ఇంతలా ప్రేమ చూపించడానికి మీరున్నారు. ఇలా ఎవరు ఆదరణ చూపుతారు? మీరు నా తల్లి, తండ్రి, గురువు. మీకు సర్వస్య శరణాగతి చేస్తున్నాను. అన్నీ మీరే చూసుకోండి. మేము దారి తప్పకుండ కాపాడండి తండ్రీ. మీరెప్పుడూ నా పక్కన ఉన్నారనే అనుభూతి నాకెప్పుడూ ఉండేలా చూడండి బాబా. ఒక్కోసారి జీవితంలో ఎదురయ్యే పరీక్షలకు నేను భయపడతాను, నాకు తెలుసు మీరున్నారని, కానీ ఆ సమయంలో మీ ఉనికిని అనుభూతి కాలేకపోతున్నాను. అందుకే భయంగా అనిపిస్తుంది. మీ నామస్మరణలో నేను ఎప్పుడూ ఉండేలా నన్ను దీవించండి తండ్రీ".
