1. బాబా దయ లేకుంటే ఏమైపోతామో!
2. అర్ధరాత్రి బాబా అందించిన సాయం
బాబా దయ లేకుంటే ఏమైపోతామో!
నా పేరు జగదీశ్వర్. నేను కొంతకాలంగా ప్రోస్టేట్ విస్తరణ(prostate Enlargement)తో బాధపడుతున్నాను. నాకు అదివరకే బీపీ ఉంది. 2022లో మధుమేహం కూడా ఉన్నట్టు బయటపడింది. నేను క్రమం తప్పకుండ మందులు వాడటంతోపాటు ప్రతిరోజూ పూజ సమయంలో బాబా ఊదీ నీళ్లలో కలిపి తీర్థంలా తీసుకుంటాను. ఆ కారణంగా ఆ ఆరోగ్య సమస్యలన్నీ అదుపులో ఉన్నాయి. మందులు కేవలం మాధ్యమంగా ఉన్నా బాబా ఆశీస్సులే ప్రధాన కారణమన్నది సత్యం. ఇక విషయానికి వస్తే.. 2025, ఫిబ్రవరిలో ఆల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకుం టే, రిపోర్టులో ప్రోస్టేట్ సైజు తగ్గిందని వచ్చింది. దాంతో డాక్టర్ ప్రోస్టేట్ సంబంధిత మందులు వాడటం ఆపమన్నారు. నేను ఏప్రిల్ నెల నుండి ఆ మందులు తీసుకోవడం ఆపేసాను. తర్వాత కొంతకాలానికి రోజూ నా కిడ్నీలకి కింద నొప్పి వస్తుండేది. కిడ్నీలు పాడయ్యాయేమో, టెస్టు చేయించుకుంటే రిపోర్టులో ఏమొస్తుందో అని భయంతో చెకప్‌కి కూడా వెళ్ళలేదు. అలా 2025, సెప్టెంబర్ 26 వరకు టెస్టుకి వెళ్లకుండా ఉన్నాను. ఒక దశలో ఒకవేళ కిడ్నీలు పాడైతే ఆత్మహత్యే శరణమనుకుంటూ ప్రతిరోజూ బాబాని, "రిపోర్టులన్నీ నార్మల్ వచ్చి నా మెంటల్ టెన్షన్ తగ్గితే గురువారం మీ గుడిలో 27 మందికి బెల్లం ఉండలు పంచుతాను" అని వేడుకుంటుండేవాడిని. మనం ఇటువంటి మొక్కులు మొక్కినా, మొక్కకున్నా బాబా ఏది చేయాలో అది చేస్తారు. మొక్కుకో వడం కేవలం మన తృప్తికోసమేనని నా అభిప్రాయం. చివరికి ధైర్యం చేసి సెప్టెంబర్ 26న అన్ని టెస్టులు చేయించుకున్నాను. నాలో ఉన్న భయం, టెన్షన్ అన్ని పటాపంచలు చేస్తూ ప్రోస్టేట్ విస్తరణ అయినప్పటికి మిగతా రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా బాబా కరుణించారు. ఇంకా నా భయం మొత్తం తొలగిపోయింది.
మా పెద్దమ్మాయివాళ్లు పోలాండ్ దేశంలోని క్రకౌలో ఉంటారు. ఇటీవల ఒకసారి అక్కడున్న మా మనవరాలికి జ్వరమొచ్చింది. ఇక్కడ నేను ఊదీ పెట్టుకొని, బాబాకి దణ్ణం పెట్టుకుంటే, బాబా ఆశీస్సులతో పాపకి జ్వరం తగ్గింది. సాధారణంగా క్రకౌలో ఉన్న తెలుగువాళ్లు వారాంతంలో అంటే శని, ఆదివారాల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. అందులో భాగంగా ఆసారి ఆడవాళ్లు మాత్రమే వెళ్లేందుకు ప్లాన్ చేసుకొని ముందుగానే అన్నీ బుక్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణానికి మూడురోజుల ముందు మా అమ్మాయికి జ్వరం, దగ్గు మొదలయ్యాయి. హాస్పిటల్‌కి వెళ్తే, టెస్టులు చేసారు. కోవిడ్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. నేను ప్రయాణం మానుకోమని చెప్పాను. కానీ, వాళ్ళు ప్రయాణమయ్యేరోజు మా అమ్మాయికి కొద్దిగా ఉపశమనంగా ఉండడంతో 8 మంది ఆడవాళ్లు ముందుగా అనుకున్నట్లు ప్రయాణమై వెళ్లారు. ఇంట్లో మా అల్లుడు, మనవరాలు ఉన్నారు. మరునాడు ఉదయానికి మా అల్లుడికి 103 డిగ్రీల జ్వరం వచ్చింది. అది తెలిసి నాకు భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకొని, ఊదీ పెట్టుకొని, "మా అల్లుడుకికి జ్వరం తగ్గాలి. మా అమ్మాయి, తనతోపాటు వెళ్లిన అందరూ క్షేమంగా తిరిగి రావాలి" అని వేడుకున్నాను. మా అల్లుడు వాళ్ళింటి కింద అంతస్తులో ఒంటరిగా ఉన్న మా అల్లుడు ఫ్రెండ్ మా అమ్మాయి వాళ్ళింటికి వచ్చి మా అల్లుడికి తోడుగా ఉన్నాడు. పారాసిటమాల్‌తో మా అల్లుడికి జ్వరం తగ్గింది. కాదు కాదు, కేవలం బాబా ఆశీస్సులతో తగ్గింది. మా అమ్మాయివాళ్లు కూడా 3 రోజుల యాత్ర పూర్తి చేసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. సర్వం సాయి మహిమ. బాబా దయ లేకుంటే ఏమైపోతామో అని ఒక్కోసారి అనిపిస్తుంది. బాబా సాయి చరణం, సర్వదా శరణం శరణం.
అర్ధరాత్రి బాబా అందించిన సాయం
అందరికీ నమస్కారం. నా పేరు అలేఖ్య. మేము హైదరాబాద్‌లో ఉంటాము. ఒకరోజు మేము మా సొంతూరు వరంగల్ వెళ్ళడానికి కారులో ప్రయాణమయ్యాము. మధ్య దారిలో తినడానికని ఒక చోట ఆగి, తిన్న తర్వాత తిరిగి బయల్దేరుతుంటే కారు స్టార్ట్ అవ్వలేదు. అసలు సమస్యేమిటో తెలుసుకుందామంటే దగ్గర్లో మెకానిక్ షాపు లేదు. అక్కడ ఆ హోటల్ తప్ప చుట్టుపక్కల ఎక్కడా ఒక్క షాపు కూడా లేదు. మెల్లగా వర్షం కూడా మొదలయింది. గంటకు పైగానే వర్షంలో పిల్లలతో మేము ఇబ్బందిపడ్డాము. అక్కడ ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా మాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మనసులో "బాబా! మీరే ఏదో ఒకటి చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది(రాత్రి 11 గంటలు). ఏదో ఒక రూపంలో మాకు సాయమైన చేయండి. లేదా తొందరగా కారు స్టార్టు అయ్యేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. చాలాసేపటికి ఒక ముస్లిం అతను తనంతట తానుగా వచ్చి నేను సహాయం చేస్తానని చెప్పి, ఇంకొకరిని కూడా తీసుకొచ్చి సహాయం చేసాడు. 2 నిమిషాల్లో కారు స్టార్ట్ అయ్యింది. కొంతదూరం వెళ్ళాక సాయిబాబానే ఆ ముస్లిం అబ్బాయి రూపంలో వచ్చి మాకు సహాయం చేసారని నాకనిపించింది. ఎప్పటికీ మా వెంటే ఉండే తండ్రి మా సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
