ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా చూపిన ప్రేమ
2. బాబా దయతో తగ్గిన కాళ్లనొప్పులు
బాబా చూపిన ప్రేమ
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నాకు అన్నీ బాబానే. ఏ కష్టమొచ్చిన అది చిన్నదైనా, పెద్దదైనా బాబానే అడుగుతాను. ఒకసారి మా అమ్మ కాలుకి కత్తితో చిన్న గాయం అయింది. ఆ విషయం మాకు తెలీదు. ఆ సమయంలో మా ఇంటికి పునాదులు వేసాము. అప్పుడు కంకర పూరించడానికి ఒక రెండు రోజులు అమ్మ ఆ దెబ్బ తగిలిన కాలుతో మట్టిలో దిగింది. దాంతో కాలు మొత్తం సెల్యులైటిస్లా ఇన్ఫెక్ట్ అయింద్. హాస్పిటల్కి వెళితే, "ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది. కాలు తీసేయాల్సి రావచ్చు" అని చెప్పి 5 రోజులకు మందులిచ్చారు. వైద్య శాఖలో పనిచేసే నాకు ఆలస్యం చేయకూడదనిపించి తెలిసిన డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పాను. ఆ సార్, "హాస్పిటల్కి తీసుకుని రండి" అని చెబితే, అమ్మని తీసుకోని వెళ్ళాం. ఆ డాక్టర్ కూడా "సర్జరీ పడవచ్చు" అన్నారు. నేను బాబాని, "సర్జరీ లేకుండా తగ్గిపోవాల"ని చాలా వేడుకున్నాను. అయితే అమ్మకి 75 ఏళ్ళ వయసు. ఆ వయసులో నయమవ్వడం కాస్త కష్టమే. అమ్మ 10 రోజులు హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాక ఇంట్లోనే నెల రోజులు నేనే చికిత్స చేసాను. ఆ సమయంలో నేను, నా భర్త చాలా బాధను అనుభవించాము. కానీ చివరికి బాబా దయ చూపారు. 2 నెలలలో అమ్మ కాలు పూర్తిగా నయమైంది. ఇప్పుడు మా అమ్మ దగ్గరుండి మా కొత్త ఇంటి నిర్మాణం చేయిస్తుంది. అంతా బాబా దయ, ఆయన నాపై చూపిన ప్రేమ. "లవ్ యు బాబా".
హఠాత్తుగా ఒకరోజు మా పాపకు కడుపునొప్పి వస్తే, నేను మందు వేసి నా డ్యూటీకి వెళ్ళాను. మధ్యాహ్నం మళ్ళీ నొప్పి వచ్చిందని ఫోన్ చేసి చెప్తే, అదే మందు వేయమని చెప్పాను. సాయంత్రం ఇంటికి వెళ్లి అడిగితే నడుస్తున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు నొప్పి వస్తుందని చెప్పింది పాప. అది విని నాకు భయమేసింది. ఎందుకంటే, అపెండిక్స్ అయితేనే అలా వస్తుంది, కాకపోతే వాంతులు లేవు. నేను సాధారణంగా దేనికి హాస్పిటల్కి వెళ్ళను, ఇంట్లోనే చికిత్స చేస్తాను. అలాంటిది ఈసారి వెంటనే పాపను తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్లి, డాక్టరుకి చూపించాను. ఆ డాక్టర్ కూడా "వాంతులు లేవు గానీ అపెండిసైటిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్కాన్ చేయించమ"ని అన్నారు. నేను స్కానింగ్ కోసం పాపని తీసుకెళ్తూ, 'దారిలో బాబా దర్శనమైతే నా పాపకి ఏం కాదు' అని అనుకుంటుంటే, ఒక షాపుపై బాబా దర్శనమిచ్చారు. అయినా నేను స్కాన్ తీస్తున్నపుడు బాధపడుతూనే, "8 ఏళ్ళ పాప సర్జరీ తట్టుకోలేదు బాబా. సహాయం చేయండి" అని అనుకున్నాను. బాబా ప్రేమతో మళ్ళీ అనుగ్రహించారు. అపెండిక్స్ నార్మల్ అని వచ్చింది. డాక్టర్, "కండరం కొంచం వాపు ఉంది. మందులతో 3 రోజుల్లో తగ్గిపోతుంది" అని చెప్పారు. అలానే జరిగింది. "థాంక్యూ బాబా. మరోసారి లవ్ యు బాబా".
బాబా దయతో తగ్గిన కాళ్లనొప్పులు
ఓం శ్రీసాయినాథాయ నమః. నేను ఒక సాయిభక్తురాలిని. ఒకరోజు రాత్రి పడుకునేటప్పుడు మా అమ్మకి కాళ్ళు అంతా బాగా నొప్పులు వచ్చాయి. దాంతో ఆమె నిద్రపోలేక తెల్లవారుజాము వరకు నొప్పితో బాధపడుతూనే ఉండింది. అలా వరుసగా రెండు రోజులు జరిగింది. ఇంట్లో ఉన్న నొప్పుల టాబ్లెట్లు, మా అన్నయ్య మెడికల్ షాప్ నుండి తెచ్చిన టాబ్లెట్లు వాడినా నొప్పి తగ్గలేదు. అందువల్ల మేము రాత్రి అయ్యేసరికి భయపడుతూ ఉండేవాళ్ళం. నేను అమ్మ బాధ చూడలేక బాబాను తలుచుకొని, "బాబా! అమ్మకి ఆ నొప్పి తగ్గేలా చూడయ్యా" అని ప్రార్థించి అమ్మతో ఊదీ కాళ్లకు రాసుకోమని, నుదుటన ధరించి, ఊదీ నీళ్లు తాగమని చెప్పాను. అలాగే తెలిసిన మెడికల్ షాపులో టాబ్లెట్లు తీసుకోమని చెప్పాను. అప్పుడు మొదలైంది బాబా అద్భుతం. ఊదీ ఉపయోగించాక, షాపతను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకున్నాక బాబా దయవల్ల అవి పనిచేయడం ప్రారంభించి అప్పటినుండి అమ్మకి నొప్పులు రావడం తగ్గాయి. ఇలా బాబా ఎన్నో చక్కని లీలలు చేస్తూనే ఉన్నారు. "ధన్యవాదాలు సాయి. మరో పెద్ద కోరిక తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి ఆ కోరిక తీర్చి నన్ను అనుగ్రహించండి బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.