సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1996వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా అనుగ్రహంతో రెండో పెళ్లి


నేను ఒక సాయి భక్తురాలిని. 2019, ఏప్రిల్లో నాకు పెళ్లి అయింది. పెళ్లికి ముందు బాబా కలలో, ఇంకా క్వశ్చన్ & ఆన్సర్స్ సైట్‌లో 'ఆ పెళ్లి విషయంలో ముందుకు పోవద్దని' చెప్పారు. కానీ నేను అర్థం చేసుకోలేక, బాబా చెప్పిన మాటల్లో అంత అర్థం ఉంటుందని తెలియక నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్ళైనప్పటినుంచి అతని ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. మా వైవాహిక జీవితం ఎంతమంత్రమూ బాగుండేది కాదు. అందువల్ల నేను అతని నుండి విడాకులు తీసుకోవాలనుకొని బాబాని అనుమతి అడిగితే, ఆయన అనుమతి ఇచ్చారు. ఇంకా నేను విడాకుల విషయంలో ముందుకు వెళ్ళాను. ఆ విషయం అలా ఉంచితే, 2013 నుంచి నేను, నా స్కూల్ ఫ్రెండ్ ఒకతను మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. మామూలుగా మాట్లాడుకుంటూ ఫేస్‌బుక్‌లో గేమ్ రిక్వెస్ట్‌లు పంపించుకుంటూ ఉండేవాళ్ళము. అలా ఉండగా అతనకి నా మీద ఇష్టం ఏర్పడి 2015లో ఆ విషయం నాకు తెలియజేశాడు. అయితే నాకు అప్పట్లో అతని మీద ఎలాంటి ఆసక్తి లేకపోవడం వల్ల, "నేను అలాంటి భావంతో మాట్లాడలేదు" అని చెప్పాను. అతను కొంచెం బాధపడినప్పటికీ తర్వాత కూడా ఎప్పుడైనా మామూలుగా మాట్లాడుకునేవాళ్ళం. హ్యాపీ బర్త్‌ డే, హ్యాపీ న్యూ ఇయర్ అని శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళము. 2019లో నా పెళ్లి అయ్యాక కూడా అలాగే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళము. 'ఎప్పుడైనా ఎలా ఉన్నావు?, ఎక్కడున్నావు?' అని అడగటం తప్ప అంతకుమించి ఏం ఉండేది కాదు. ఇలా ఉండగా మా ఇద్దరిదీ ఒకే ఊరు అయినందున 2022లో నేను, నా భర్త విడాకులు తీసుకోవాలనుకుంటున్న విషయం అతనికి వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అయినా తను నన్ను ఏమీ అడగలేదు. నేను కూడా ఏం చెప్పలేదు. ఒక వైపు విడాకుల ప్రక్రియ నడుస్తుండగా నేను నా జీవితం గురించి చూసుకుంటూ ఉండేదాన్ని.

2022, అక్టోబర్ లేదా నవంబర్‌లో ఒకరోజు నేను బాబా గుడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఎందుకో నా మనసుకనిపించి బాబాని, "ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్ కనిపిస్తే బాగుండు బాబా. కనిపించేలా చేయండి బాబా" అని అడిగాను. అంతే, ఆరోజు ప్రారంభమైంది బాబా అనుగ్రహం మా మీద వర్షించడం. అదేరోజు నేను ఏం వెళతాం లే అనుకుంటూనే ఇష్టం లేకున్నా మా కజిన్స్‌తో కలిసి ఒక సినిమాకి వెళ్ళాను. ఆ థియేటర్లో నా స్కూల్ ఫ్రెండ్ నాకు కనిపించాడు. నేను బాబాని అడిగినందుకు కనిపించాడని అనుకున్నాను. తర్వాత నేను కోరుకున్నట్టే అతను కనిపించాడు కదా అని అతనికి మెసేజ్ చేశాను. ఇంకా ఆ రోజు నుండి నెమ్మదిగా ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. అలా మాట్లాడుకుంటున్నప్పుడు నేను నా విడాకుల విషయం అతనితో చెప్పాను. అప్పుడు అతను, "నేను విన్నాను. నిజమేనా?" అని అడిగాడు. అతను నా ఫ్రెండ్ అయినప్పటికీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. అయినా నా వైవాహిక జీవితం గురించి కొంచం కొంచం అతనితో పంచుకున్నాను. అప్పటికే నాకు అతని మీద ఆసక్తి పెరిగి '2015లో నేను ఎందుకు అతనిని వదులుకున్నాను' అనిపించింది. అతని మాటల బట్టి అతనికి కూడా నా మీద ఇంకా ఆసక్తి ఉన్నట్టే అనిపిస్తూ ఉండేది. కానీ నిజంగా తనకి ఇంకా నా మీద ఆసక్తి ఉంటుందని అనుకోలేదు. ఒకరోజు మేము కలుద్దామనుకొని ముందు బాబా గుడిలో కలిసి తర్వాత లంచ్‌కి వెళ్ళాము. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు అతను పరోక్షంగా నేనంటే తనకి ఇష్టం ఉన్నట్లు చెప్పి, 'అది నెరవేరాలంటే ప్రస్తుతం తన ముందు 3 షరతులున్నాయని, అందులో మొదటిది తను తన ఉద్యోగ జీవితంలో స్థిరపడటం(అతను ఎంబీబీఎస్ చేసి డాక్టరుగా చేస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తై 6/7 ఏళ్ళు అవుతుంది. కేవలం ఎంబీబీఎస్ డాక్టరుగా చేస్తూ ఉండటం కంటే ఏదైనా పీజీ చేస్తే తన జీవితంలో బాగా స్థిరపడొచ్చు అని అతని ఆశ), రెండోది తన సోదరి పెళ్లి జరగడం, మూడోది తన తల్లిదండ్రులు మా పెళ్ళికి ఒప్పుకోవటం' అని చెప్పారు. ఆ సమయంలో బాబాని తలుచుకుంటూ ఉన్న నాకు, తను నా మీద ఇంకా తనకి ఆసక్తి ఉందని చెప్పడంతో చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత నేను నా వైవాహిక జీవితం గురించి అతనికి అంతా స్పష్టంగా వివరించి చెప్పాను. ఇంకా నా కుటుంబం, నా సమస్యలు అన్నీ చెప్పాను. తను వాటినన్నిటిని కూడా అంగీకరించారు. ఆ తర్వాత నేను తను చెప్పిన 3 షరతులలో మూడవది అయినా తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం కష్టమని, అది అవుతుందో, లేదో అని తనతో అన్నాను. ఎందుకంటే, నేను పెళ్లై విడాకులు తీసుకుంటున్నాను, తను ఇంకా అవివాహితుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోడం ఈ కాలంలో చాలా తక్కువ. ఊర్లలో ఉండే తల్లిదండ్రులు రెండో పెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరువు, మర్యాదలు పోతాయని దాదాపు వద్దంటారని నేను భావించాను. అతను మాత్రం మొదట తను ఉద్యోగంలో స్థిరపడితే తన తల్లిదండ్రులను ఒప్పిస్తానని అన్నారు. నేను నా మొదటి పెళ్లి విషయంలో కుటుంబంతో మంచి సంబంధ బాంధవ్యాలు లేక చాలా బాధపడ్డాను. అందుకని అతని తల్లిదండ్రులు 100% ఇష్టపడి నన్ను స్వీకరిస్తేనే మనం పెళ్లి విషయంలో ముందుకు వెళదామని ఇద్దరం అనుకున్నాము.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను అప్పుడప్పుడు బాబాని, "బాబా! మీరు మమ్మల్ని ముందుకు వెళ్ళమంటే మీరు నిర్ధారణ(కన్ఫర్మేషన్) ఇవ్వండి" అని అడుగుతూ ఉండేదాన్ని. ఆ క్రమంలో ఒకసారి నవంబర్‌లో బాబా దగ్గర చీటీలు వేస్తే, 'అతను ముందు చెప్పాక నువ్వు ఒప్పుకో!' అని వచ్చింది. అలానే అతను ముందు నేను అంటే తనకి ఇష్టం ఉందని చెప్పాడు. నేను బాబాని కలలో కూడా కన్ఫర్మేషన్ ఇమ్మని అడిగాను. అప్పుడొకసారి కలలో నేను బాబాని, "అతను ఓకేనా?" అని అడిగి ఆయన ముందు నా ఎడమ చేయి పెడితే నా చేతిలో ఒక పువ్వు వేశారు బాబా. దాన్ని బాబా ఇచ్చిన కన్ఫర్మేషన్గా నేను తీసుకున్నాను. ఇంకోసారి కలలో మేమిద్దరం బాబా గుడికి వెళ్ళాము. అక్కడ నేను అతనితో, "బాబాకి థాంక్స్ చెప్పు" అని అన్నాను. అతను, "ఎందుకు?" అని అడిగితే, "నన్ను నీకు ఇచ్చారు కదా! అందుకు" అన్నాను. అప్పుడతను, "సరే" అని బాబా పాదాలకు నమస్కరించాడు. దాన్ని కూడా బాబా నాకు తనతో ముందుకెళ్ళమని కన్ఫర్మేషన్ ఇచ్చినట్లు భావించాను. అయినా మద్యమద్యలో 'అతను ఓకేనా', 'కాదా' అని చీటీలు వేసి బాబాని అడుగుతుండేదాన్ని. ప్రతిసారీ బాబా 'ఓకే' అనే ఇచ్చేవారు. అన్నిసార్లు బాబాని ఎందుకు అడుగుతుండేదాన్ని అంటే, మునుపు బాబా చెప్పినా వినకుండా ముందుకెళ్ళినందున నా వైవాహిక జీవితం బాగాలేకుండా పోయింది, విడాకులు వరకు వెళ్ళింది.

కాలగమనంలో అతని సోదరికి పెళ్లి అయింది. అతను తన కెరీర్ సెట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలలో 2 సార్లు యుఎస్ వీసా తిరస్కరించబడింది. దాంతో అతను యుఎస్ వెళ్ళడానికి అవుతుందో, లేదో అని ఇండియాలోనే పీజీ ఎంట్రన్స్ పరీక్ష వ్రాయడానికి ప్రిపేర్ అవ్వసాగాడు. కానీ అతని తండ్రి, సోదరి ఆరోగ్య పరిస్థితి బాగాలేక తను పూర్తిగా ప్రిపేర్ అవ్వకుండానే పరీక్ష వ్రాయాల్సి వచ్చింది. అందువల్ల నవంబర్‌లో వచ్చిన ఫలితాలలో తను క్వాలిఫై అవలేదు.

ఇక మా కుటుంబాల విషయానికి వస్తే, నాకు ఒక చెల్లి ఉంది. తనకి పెళ్లి వయసు వచ్చినప్పటికీ నాకు విడాకులై మళ్లీ పెళ్లి చేసుకుంటేగానీ తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనని పట్టుబట్టింది. అందువల్ల నా గురించి, నా స్నేహితుని గురించి తెలిసిన మా ఇంట్లోవాళ్ళు అతనిని వాళ్ళింట్లో చెప్పమని బలవంతం చేస్తూండేవాళ్లు. మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టి రెండేళ్లు అవుతుంది కాబట్టి వాళ్ళింట్లో చెప్తే, ఒప్పుకుంటారో, లేదో తెలుస్తుందని అంటుండేవాళ్లు. నేను మాత్రం అతనిని బలవంతపెట్టే దాన్ని కాదు. అందుకు కారణం నేను ఒకసారి పెళ్లై విడాకులు తీసుకున్న అమ్మాయిని. అతను కూడా ఆ విషయం నా కెరీర్ స్థిరపడితేనే దైర్యంగా ఇంట్లో మాట్లాడగలనని అనేవారు. కానీ మా ఇంట్లో నన్ను ఇంకా ఎప్పుడు వాళ్ళింట్లో చెప్తారని అడగటం తెలిసి ఒక వినాయకచవితి రోజున అతను తన తండ్రితో మా గురించి చెప్పేసారు. ఆ విషయం గురించి వాళ్ళింట్లో వాళ్ళ నాన్న, అమ్మ, సోదరి, ఆమె భర్త మాట్లాడుకోసాగారు. నేను వాళ్ళు ఒప్పుకుంటారో, లేదో అని అనుకుంటూ ఉండగా నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోడ్ ఫర్ అండ్ ఇఫ్ లూప్‌లతో రాస్తే, ఆ కోడ్ చాలా కరెక్ట్‌గా వర్క్ అవుతోంది. నేను బాబాని 'అది కరెక్టేనా' అని అడిగితే, బాబా 'కరెక్టే' అన్నట్లు ఆ కోడ్ మీద పువ్వులు వేసారు. దాంతో అబ్బాయి వాళ్ళ నాన్న ఒప్పుకుంటారులే అని నాకనిపిచింది. అయితే ఆయన మొదట పరువు పోతుందని అన్నారు. కానీ ఆ అబ్బాయి "నేను ప్రేమించిన దానికి అర్థం ఉంది. అందుకే ఆ అమ్మాయి విడాకులు తీసుకున్నప్పటికీ నాకు తన మీద ఇష్టం అలానే ఉంది" అని చెప్పి వాళ్ళ నాన్నకి ధైర్యం చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న నాతో మాట్లాడతానని అన్నారు. నేను మేము ఎప్పుడూ వెళ్లే బాబా గుడిలో కలిసి మాట్లాడదాం అని చెప్పాను. తర్వాత నేను బాబా ఆశీస్సులతో ఆయన గుడికి వెళ్లి వాళ్ళ నాన్నను కలిసి నా గతం, గతం నుండి నేను నేర్చికున్నది, ప్రస్తుతం నేను ఆశించేవి అన్నీ స్పష్టంగా మాట్లాడాను. ఆయన కూడా స్పష్టంగా మాట్లాడి, "ఇక నువ్వు మా పెద్దకూతురులా అనుకో!" అని అన్నారు. నేను ఆనందంగా బాబాకి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇంకా మా పెళ్లి మాటలు మొదలయ్యాయి. అయితే 2024లో ఆ అబ్బాయి తండ్రి, సోదరిల ఆరోగ్యం బాగాలేకపోవడం, వాళ్ళ పెంపుడు కుక్క చనిపోవడం వాళ్ళకి సెంటిమెంట్‌గా అనిపించి 2025లో పెళ్లి పెట్టుకుందాం అన్నారు.

మా పెళ్లి ప్రయత్నాల్లో భాగంగా మా జాతకాలు చూపిస్తే, మా జాతకాలు కలవలేదని, వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తే 15 రోజుల్లో అబ్బాయికి ఏదో ఒకటి అవుతుందని అన్నారు. ఆయన అదే మాట 2 సార్లు అనడంతో నాకు భయమేసి, "బాబా! మీరు నిర్ధారణ ఇచ్చాక ఇలా ఎందుకు అంటున్నారు? ఈ విషయానికి సంబంధించి మీరు నాకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వండి" అని బాబాను అడిగాను. ఒకరోజు బాబా నాకు స్వప్నదర్శనమిచ్చి, 'అందరి విషయంలో అలా కాదు. ముఖ్య భక్తుడి విషయంలో జాగ్రత్త అవసరం. జాతకాల గురించి బాహాయపడొద్దు. ఆ జ్యోతిష్యుడు చెప్పింది తప్పు. నేను అలా జరగనివ్వను' అన్నట్టు చెప్పారు. తర్వాత నాకు ఇంకొక కల వచ్చింది. ఆ కలలో నా జాతకం, ఆ అబ్బాయి జాతకం బాబా దగ్గర పెడితే, ఆయన చూసి "ఇది అవ్వదు" అన్నారు. నేను, "బాబా! మామూలుగానే కాకుండా కలలో కూడా అన్నిసార్లు నిర్ధారణ(కన్ఫర్మేషన్) ఇచ్చి, ఇప్పుడు మళ్లీ ఇలా అంటున్నారు ఏంటి?" అని అన్నాను. అంతలో పక్కనుంచి మా పెదమ్మ, "బాబా ముందు పేరు తప్పు రాసారు. వేరేవాళ్ళ పేరు రాసారు" అని అన్నారు. అప్పుడు నాకు 'బాబా అతని పేరులో ఏదో మార్పు చేయాలని చెప్తున్నారని' అర్థమైంది. కానీ ఏం మార్పు చేయాలో నాకు స్పష్టంగా అర్థమేకాక గందరగోళంలో ఉండిపోయాను. బాబాని, "మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ స్పష్టంగా చెప్పండి, ప్లీజ్ బాబా" అని అడుగుతూ ఉండేదాన్ని. కొన్ని రోజులకి మరొక కల వచ్చింది. ఆ కలలో నేను మా పెళ్లి సాయంత్రం అనగా మా పెళ్లి శుభలేఖ ఆ రోజు మద్యాహ్నం బాబా దగ్గర పెట్టి, ఆయన్ని ఆహ్వానిస్తే, బాబా పక్కకి నెట్టేసారు. "అదేంటి బాబా?" అని అడిగితే, మేము ఎప్పుడూ వెళ్లే గుడిలో బాబా సేవ చేసుకుంటూ ఉండే ఒక అంకుల్ ఆ శుభలేఖ చూసి, 'అందులో పేరు తప్పు ఉంది కదా!' అన్నట్టు ఏదో చెప్పారు. ఇంకా అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే, 'అతని పేరు సర్టిఫికెట్లలో ఒకటి ఉండగా తనకి 10-11 ఏళ్ల వయస్సున్నప్పుడు తన తల్లి తనని ఒక గురువుగారి దగ్గరకి తీసుకొని వెళితే, ఆయన అతని పేరుకి 'రామ్' అని జత చేయమన్నారు. దాంతో అతని తల్లిదండ్రులు అతని పేరుకి 'రామ్' అని జత చేసారు. మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టిన ఫేస్బుక్‌లో కూడా అదే పేరు ఉంది అతని అకౌంటుకి. కానీ కాలక్రమంలో వాళ్ళు అతనిని 'రామ్' అని పిలవడం మానేశారు. చివరికి 'రామ్' అని జత చేశామన్న విషయం పూర్తిగా మర్చిపోయారు కూడా. ఇంకా ఆ విషయాలు గుర్తొచ్చాక నేను శుభలేఖలో 'రామ్' జత చేయమంటారేమో అనిపించి అదే విషయం చీటీలు వేసి బాబాని అడిగితే, "అవును" అని బదులిచ్చారు. ఆ తర్వాత కూడా బాబా నాకు కలలో "సాయి వారాహి అమ్మని నమ్ముకో. అంత మంచిగా జరుగుతుంది" అని చెప్పారు. ఆ కలలోనే నాకు ఎందుకో తెలియదుగాని అదే బాబా మాకు ఇచ్చిన చివరి కన్ఫర్మేషన్ అనిపించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. తర్వాత వేరే జ్యోతిష్యుడు దగ్గరకు వెళితే, మా జాతకాలు చూసి, "ఇవి చాలా బాగున్నాయి(రామ్ అని పేరుకి జత చేయకుండానే). ఇద్దరి జాతకాలు కలిసాయి. ముందుకు వెళ్ళండి" అని చెప్పారు. దాంతో ఇంట్లోవాళ్ళు సంతృప్తి చెంది సంతోషించారు. ఆ జ్యోతిష్కుడు 2025, మార్చి 6న బాగుందని మా వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. బాబా చెప్పినట్లే అబ్బాయి పేరుకి 'రామ్' అని జతచేసి శుభలేఖల్లో వేయించాము.

నేను పెళ్లి ఖర్చులకి అవసరమైన డబ్బుకోసం బ్యాంకు లోన్‌కి ప్రయత్నిస్తే 2024, అక్టోబరులో లోన్ తీసుకొని ఉన్నందున మళ్ళీ కొత్త లోన్ అప్రూవ్ అవ్వలేదు. అప్పుడు, "బాబా! పెళ్లికోసం డబ్బులు కావాలి. దయచేసి సహాయం చేయండి" అని బాబాని వేడుకున్నాను. తర్వాత బాబా దయవల్ల ఒక ప్రయివేట్ నాన్ బ్యాంకింగ్ ద్వారా లోన్ దొరికింది. ఇలా అన్నీ జరుగుతుండగా అతను అదివరకు వ్రాసిన పరీక్షలో క్వాలిఫై అవ్వలేదని చెప్పాను కదా! ఆ పరీక్షకి సంబంధించి 2025, జనవరిలో క్వాలిఫైయింగ్ మార్క్ తగ్గించడంతో అతను క్వాలిఫై అయి తనకి కావాల్సిన పీజీ సీట్ ఎంచుకొని ఫిబ్రవరిలో జాయిన్ అయ్యారు. అలా అతను ముందుగా చెప్పిన 3 షరతులు: తన కెరీర్ సెట్ చేసుకోవడం కోసం పీజీలో జాయిన్ అవ్వడం, వాళ్ళ సిస్టర్ పెళ్లి, తన తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోవడం అన్నీ బాబా నెరవేర్చి మార్చి 6న మా పెళ్లి జరిపించారు. "ధన్యవాదాలు బాబా".

చివరిగా ఇంకో విషయం, మా పెళ్లి జరిగేటప్పుడు పూజలో బాబా విగ్రహం పెట్టాలని మా ఇంట్లో నుంచి ఒక వెండి బాబా విగ్రహం తీసుకొని ఫంక్షన్ హాల్‌కి వెళ్ళేముందు మా పెదమ్మకి ఇచ్చాం. ఆవిడ హడావిడిలో ఆ బాబా విగ్రహం ఎక్కడో పెట్టేసింది. అలాగే బాబా గుడిలో మేము మా పెళ్లి శుభలేఖ పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంకుల్ మాకు పెళ్లిలో పూజ దగ్గర పెట్టమని ఇచ్చిన బాబా శాలువా కూడా కనపడకుండా పోయింది. వేరే బాబా విగ్రహం తీసుకొచ్చి పూజలో పెట్టారుగాని ఆ బాబా విగ్రహం, శాలువ కనపడకుండా పోయాయని నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఒకరోజు బాబా నాకు ఆ విగ్రహం దొరికినట్టు కలలో చూపించారు. కానీ నేను పోయింది, ఇంకేం దొరుకుతుందిలే అనుకున్నాను. అయితే ఆ కల వచ్చిన 15 రోజులకి మా అత్తయ్య ఒక ఫోటో పెట్టి, 'ఇదే నా బాబా విగ్రహం?' అని అడిగారు. నేను బాబా లీలకి - నాకు తెలియకుండానే బాబా నాతో మా ఇంటికి వచ్చారని చాలా సంతోషించాను. అలానే బాబా ఆ శాలువా కూడా కనిపించేలా చేస్తారని అనుకుంటున్నాను. మొత్తానికి బాబా ఆశీస్సులతో నేను నా మొదటి భర్తతో విడాకులు తీసుకొని, నా బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

8 comments:

  1. Om Sri Samartha Sadguru sachidananda Sainath Maharaj ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  3. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  4. I am totally surrendering myself at your lotus feet I am experiencing your omnipresence. Continue your blessings on our family members 🙏🙏💐💐

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  7. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo