సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 632వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఎల్లప్పుడూ మన అన్ని అవసరాలను తీరుస్తారు
  2. అందరికీ బాబానే రక్ష
  3. మనం ప్రార్థిస్తాం - సాయిబాబా అనుగ్రహిస్తారు

బాబా ఎల్లప్పుడూ మన అన్ని అవసరాలను తీరుస్తారు


ఒక అజ్ఞాత సాయిభక్తుడు ఇటీవల బాబా తమకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిరామ్! ఈ బ్లాగ్ నిర్వాహకులకు చాలా కృతజ్ఞతలు. ఇది 'ఆధునిక సాయిసచ్చరిత్ర' అనిపిస్తుంది. ప్రతీ అనుభవం బాబాకు తన భక్తులపై ఉండే ప్రేమను తెలియజేస్తుంది. ఇక నా అనుభవంలోకి వస్తే...  ఇటీవల నేను ఒక అనుభవాన్ని పంచుకున్నాను. అందులో కరోనా కారణంగా మార్చి నుండి మా అబ్బాయి ఇంటినుండి పనిచేస్తున్నాడని చెప్పాను. ఇటీవల తన బాస్ తనను, తన సహచరులను వెంటనే బెంగళూరులోని కార్యాలయానికి రావాలని చెప్పారు. దాంతో మా అబ్బాయి బెంగళూరు వెళ్ళడానికి సమాయత్తమయ్యాడు. కానీ మా మరో అబ్బాయి వివాహం డిసెంబరు 9న ఉన్నందున నేను తనతో, "పెళ్లి చూసుకుని 9వ తేదీ తరువాత బెంగుళూరు వెళ్ళమ"ని చెప్పి, ఆ విషయమై తన బాస్ వద్ద అనుమతి తీసుకోమని కూడా చెప్పాను. తను అలాగే చేశాడు. కానీ, అతని బాస్ అనుమతినివ్వలేదు. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "అతను అనుమతిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. ఆ తరువాత నేను మా అబ్బాయి బాస్‌కి మెసేజ్ చేశాను. వెంటనే అతను డిసెంబర్ 9 వరకు ఇంటినుండి పనిచేసేందుకు అనుమతించాడు. నేను ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మనం శ్రద్ధ, సబూరీలతో బాబాపై విశ్వాసముంచాలి. విషయం చిన్నదైనా, పెద్దదైనా బాబా ఎల్లప్పుడూ మన అన్ని అవసరాలను తీరుస్తారు.


జయహో సాయి.


అందరికీ బాబానే రక్ష


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవంతో మీ ముందుకు వచ్చాను.


ఈమధ్య మావారు బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్ ఇచ్చారు. రిపోర్టుల్లో అన్నీ నార్మల్ గానే వచ్చాయి గానీ, ప్లేట్లెట్ కౌంట్ కొంచెం తక్కువగా ఉందని వచ్చింది. నాకు భయం వేసి ఒకసారి డాక్టరుని కలవమని మావారితో చెప్పాను. సరేనని మావారు డాక్టరుని కలిశారు. డాక్టరు రిపోర్టు చూసి, "కంగారుపడకండి. ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి" అని అన్నారు. నాకు మాత్రం ఏదో ఆందోళనగా అనిపించి, రోజూ మన సమర్థ సద్గురు సాయినాథుని ప్రార్థిస్తూ, బాబా ఊదీని నీళ్లలో వేసి మావారికి ఇస్తుండేదాన్ని. వారం తర్వాత మావారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్టు రెండు రోజుల తర్వాత వస్తుందని అన్నారు. నేను మన సాయితండ్రి మీదనే భారం వేసి, "ప్లేట్లెట్ కౌంట్ పెరగాలని, అలా జరిగితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. మన 'సుప్రీం గాడ్' సాయినాథుని దయవల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరిగింది. ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఎప్పటికీ ఆయన దయ మన అందరిమీదా ఉండాలని బాబాను వేడుకుంటున్నాను. అడుగడుగునా తోడుగా ఉండి నడిపించే దైవం సాయి. అందరికీ ఆయనే రక్ష.


సాయినాథ్ మహరాజ్ కీ జై!


మనం ప్రార్థిస్తాం - సాయిబాబా అనుగ్రహిస్తారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ చాలా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కుంటున్న ఈ సమయంలో బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం బాబా బిడ్డలందరికీ ధైర్యాన్ని, విశ్వాసాన్ని చేకూరుస్తుందని నమ్ముతూ నేను నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

ఇటీవల ఒకరోజు రాత్రి హఠాత్తుగా మా అమ్మ జ్వరం, ఒంటినొప్పులతో అనారోగ్యానికి గురైంది. క్రమంగా జలుబు కూడా మొదలైంది. ఆమె ఈ విషయం మాతో చెప్పగా మేమంతా ఆందోళన చెందాం. మాములుగా అయితే సాధారణ సమస్యే. కాని ప్రస్తుత కరోనా దృష్ట్యా నేను చాలా భయపడి 'ఇది సాధారణమైన జ్వరమే అయి ఉండాల'ని అనుకున్నాను. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు భారాన్ని బాబా చేతిలో పెట్టాలి. నేను అదే చేశాను. నేను సహాయాన్ని అర్థిస్తూ, "ఉదయానికల్లా అమ్మకి నయమయ్యేలా చేయమ"ని సాయిని ప్రార్థించి, నా భయాలు మరియు భారాన్ని ఆయనకి అప్పగించాను. అంతేకాకుండా అమ్మ కోలుకుంటే బాబాకు పూజచేసి, ఖిచిడీ తయారుచేసి నైవేద్యంగా పెట్టాలని కూడా అనుకున్నాను. ఇంకా ఈ కరోనా కఠిన సమయంలో భక్తులకు ధైర్యాన్ని చేకూరుస్తుందన్న ఉద్దేశ్యంతో నా అనుభవాన్ని బ్లాగులో పంచుకోవాలని కూడా అనుకున్నాను.

బాబా అద్భుత లీలను చూడండి! మరుసటిరోజు నేను లేచేసరికి అమ్మ పూర్తిగా కోలుకొని నాన్నకోసం కాఫీ తయారు చేస్తోంది. అలా అమ్మని చూడగానే సాయి సచ్చరిత్రలోని  శ్యామా సోదరుని భార్య అనారోగ్యం పాలుకావడం, మరుసటిరోజు శ్యామా ఆమెను చూడటానికి వెళ్లేసరికి ఆమె టీ తయారు చేస్తూ కనిపించే సాయిలీల నా మదిలో మెదిలింది. నేను సచ్చరిత్ర నిత్యం పఠిస్తూ, అప్పుడప్పుడు ఆ లీలలను అనుభూతి చెందుతూ ఆనాటి భక్తులెంత ధన్యులో అనుకుంటూ ఉంటాను. అలాంటిది అలాంటి అనుభవాన్నే బాబా నాకు ప్రసాదించి ఆనందంలో ముంచేశారు. కాబట్టి ప్రియమైన సాయి భక్తులారా! మన సాయిని విశ్వసించి మీ భారాన్ని ఆయన చేతుల్లో ఉంచి ప్రార్థించండి. మనం ప్రార్థిస్తాం - ఆయన అనుగ్రహిస్తారు. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు".



సాయిభక్తుల అనుభవమాలిక 631వ భాగం.....



ఈ భాగంలో అనుభవం:
  • అడుగడుగునా రక్షణ కల్పించే చల్లని తండ్రి

సాయిబంధువులకు నమస్కారం. తన భక్తుల పట్ల అడుగడుగునా కరుణాకటాక్షాలు చూపే ఆ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయిబాబాకి పాదాభివందనాలు, కోటానుకోట్ల నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నతనంలో, అంటే నాకు 12 లేక 13 సంవత్సరాల వయసున్నప్పుడు మా ఇంటి ప్రక్కన నివసించేవారింట్లో మొదటిసారి నా సాయితండ్రి ఫోటో చూశాను. బాబా కన్నుల నుండి ప్రసరించే కరుణకు నేనెంతో ఆకర్షితురాలినయ్యాను. “ఎవరో ఈ సాధువు, చిరిగిన బట్టలు వేసుకుని ఉన్నారు. ఈ ఆంటీ అంత భక్తిగా పూజిస్తారు. ఆయన పేరు సాయిబాబా అట” అని అనుకుంటూ తరచుగా బాబా ఫోటోను చూస్తూ ఉండేదాన్ని. అలా బాబా నన్ను తన భక్తురాలిగా చేసుకున్నారు. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మీతో పంచుకుంటాను.


మొదటి అనుభవం:


1991లో ఒకసారి బి.ఇడి సీటు కోసం కౌన్సిలింగ్‌కి మేము ఏలూరు వెళ్ళాము. అప్పుడు అక్కడున్న సాయిబాబా గుడికి వెళ్లి నాకు బి.ఇడిలో సీటు వచ్చేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థించాను. కానీ, మనసులో మాత్రం సీటు వస్తుందో రాదోనన్న అనుమానం ఉంది. చివరికి బాబా అనుగ్రహంతో నాకు భీమవరంలో బి.ఇడి సీటు కేటాయించారు. ఫీజు కట్టి, అర్థరాత్రి సమయంలో తిరిగి వచ్చేటప్పుడు రైల్వేస్టేషన్ బయట బాబా దర్శనమిచ్చారు. బాబాకు నమస్కరించుకుని, బి.ఇడిలో సీటు ప్రసాదించినందుకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బి.ఇడిలో చేరిన తరువాత ఆ సంవత్సరం చివర్లో పరీక్షలు రాయాల్సి ఉంది. కానీ, నేను ఒక పరీక్షకు సరిగా ప్రిపేరవలేదు. ఆ సమయంలో మా హాస్టల్‌కి కొద్ది దూరంలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి బాబాకు నమస్కరించుకుని, “బాబా! మిమ్మల్ని మొట్టమొదట బి.ఇడి సీటు కోరుకున్నాను, మీరు ఇచ్చారు. ఇప్పుడు నా నిర్లక్ష్యంతోనూ, తెలియనితనంతోనూ నేను ఒక పరీక్షకి సరిగా ప్రిపేరవలేదు. ఇప్పుడు నేను ఈ పరీక్షలో ఫెయిలైతే నా తల్లిదండ్రులు చాలా బాధపడతారు. దయచేసి పాస్ మార్కులతోనైనా సరే నన్ను ఈ పరీక్ష పాస్ చేయించండి తండ్రీ!” అని ప్రార్థించాను. తరువాత బాబాపైన భారం వేసి పరీక్ష వ్రాశాను. ఫలితాలు వచ్చాక చూసుకుంటే, ఆశ్చర్యం! ఆ పరీక్షలో కాలేజీలో ఫస్ట్ మార్క్ నాకే వచ్చింది. నిజంగా నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఆ పరీక్షలో కేవలం పాస్ మార్కులు వస్తే చాలనుకున్న నన్ను కాలేజీలోనే మొదటి స్థానంలో నిలిపిన నా సాయితండ్రికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ తర్వాత నా ఉద్యోగం, పెళ్లి, సంతానం.. ఇలా అన్ని విషయాల్లోనూ బాబా అడుగడుగునా నాకు తోడు ఉన్నారు.


రెండవ అనుభవం:


2004లో నేను ఎమ్.ఎ ఇంగ్లీషు పరీక్ష కోసం సరిగా ప్రిపేర్ కాలేక చాలా బాధపడ్డాను. ఈ విషయం గురించి బాబాను ప్రశ్నిస్తే, “బీదవారికి మజ్జిగ దానం చెయ్యమ”ని సమాధానమిచ్చారు బాబా. బాబా చెప్పినట్లు మజ్జిగ దానం చేసిన గంటలోనే మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఒక లెక్చరర్ గురించి నాకు తెలిసేలా చేశారు బాబా. ఆమె సహకారంతో చక్కగా ప్రిపేరై అన్ని పరీక్షలూ ఒకేసారి వ్రాశాను, బాబా అనుగ్రహంతో అన్ని పరీక్షలలోనూ పాసయ్యాను. అంతేకాదు, వెంటనే ఉద్యోగంలో ప్రమోషన్ పొందేలా ఆశీర్వదించారు బాబా. బాబా చేసిన సహాయాన్ని నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. “మీకు శతకోటి ధన్యవాదాలు సాయితండ్రీ!”


మూడవ అనుభవం:


ఒకరోజు సాయంత్రం పెద్ద వర్షం కురిసి నేలంతా జలమయమైంది. కాసేపటి తర్వాత వర్షం తెరిపివ్వటంతో, నేను, మావారు రెండు సంవత్సరాల వయసున్న మా పాపను తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్ళాము. హాస్పిటల్ నుండి తిరిగి వస్తూ ఫ్యాన్సీ స్టోర్లో చిన్న పనుండి పాపను మావారి చేతికిచ్చి నేను షాపులోకి వెళ్ళాను. మావారు పాపను బైక్ మీదనుండి దింపగానే పాప ఆ ఫ్యాన్సీ షాపు బయటవున్న బొమ్మల్ని చూసి సరదాగా చప్పట్లు కొడుతూ నవ్వుతూ వచ్చి ఆ బొమ్మల్ని అందుకోబోయింది. ఇంతలో అనుకోకుండా తన చిన్ని పాదాలు గట్టుపై నుండి జారి పాప క్రిందనున్న లోతైన కాలువలో పడిపోయింది. అది చూసి నా గుండె ఆగినంత పనైంది. మావారు తక్షణం స్పందించి దాదాపు నేలపై బోర్లాపడి ఆ కాలువలో చేయి పెట్టి పాపను బయటికి లాగేశారు. ఆరోజు కురిసిన వర్షం వల్ల చెత్త, గాజుపెంకులు ఏవీ లేకుండా కాలువ శుభ్రంగా ఉంది. గాజుపెంకులు లాంటివి ఉండుంటే పాప గాయపడేదే. ఒకవేళ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా పాప ఆ ప్రవాహంలో కొట్టుకుపోయివుండేది. అంతేకాదు, అక్కడికి సమీపంలోనే పెద్ద రాయి ఉంది. ఆ రాయికి తగిలి గాయపడే ప్రమాదం కూడా ఉంది. నా సాయితండ్రే ఆరోజు మా పాపను కాపాడారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ పాపకి స్వెట్టర్, మంకీ క్యాప్ ఉండటం వల్ల చిన్న గాయం కూడా కాలేదు. బాబా ప్రేరణతో మావారు తక్షణమే స్పందించటం, పాప జారుతుండగానే తన రెక్క పుచ్చుకుని పైకి లాగటం, కాలువలోని నీరు మురికి, చెత్త లేకుండా ఉండటం.. ఇవన్నీ పాపను కాపాడటానికి బాబా చేసిన ప్రణాళికలే. అలనాడు కమ్మరి కొలిమిలో పడిపోయిన బిడ్డను కాపాడిన రీతిలోనే ఆరోజు బాబా మా పాపను కాపాడారు. “సాయీ! మీకు సహస్రకోటి వందనాలు”.


నాలుగవ అనుభవం:


మా తాతగారి ద్వారా మాకు వారసత్వ ఆస్తిగా సంక్రమించిన ఒక పాత ఇల్లు ఎన్నో గొడవల వల్ల అనేక సంవత్సరాలుగా నివాసయోగ్యం కాకుండా, అమ్ముడవకుండా ఉంది. అలాగే, 2012లో మాకు చెందిన ఒక స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించాలని చూశారొకరు. ఈ కోర్టు కేసుల విషయంలో ముందుగానే శుభసంకేతాలిచ్చి మాకు విజయాన్ని అందజేశారు బాబా. అది ఎలా జరిగిందో వివరిస్తాను. విశాఖపట్నంలోని ఈస్ట్ శిరిడీ దేవాలయంలో బాబాకు ఆరతి ఇచ్చిన తరువాత అక్కడి భక్తుల పేర్లను లాటరీ తీస్తారు. ఆ లాటరీ వచ్చినవారికి బాబా ప్రసాదంగా పెద్ద లడ్డూని ఇస్తారు. సాధారణంగా నాకెప్పుడూ ఏ లాటరీ రాదు. అలాంటిది ఆశ్చర్యకరంగా ఒకసారి నాకు ఆ లాటరీలో లడ్డూ ప్రసాదం లభించింది. ఎప్పుడూ లేనిది బాబా అనుగ్రహంతో నాకు లాటరీలో బాబా ప్రసాదం వచ్చిందని ఎంతో ఆనందించాను. కొద్ది రోజుల తర్వాత మరోసారి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మందిర నిర్వాహకులు లాటరీ తీస్తుండగా, “ఏదో ఒకసారి అంటే వచ్చిందిగానీ, అసలు నాకు ఎప్పుడైనా లాటరీ వచ్చిందా ఏంటి, ఈసారి కూడా రావడానికి?” అనుకున్నాను. ఇంతలో నా టోకెన్ నెంబర్ పిలవటంతో విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాను. ఇంత తక్కువ వ్యవధిలో రెండుసార్లు లాటరీలో నా పేరు రావటం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, అప్పుడు నాకు అర్థం కాలేదు, కోర్టు కేసుల విషయంలో అది బాబా నాకు ప్రసాదించిన శుభశూచకమని. ఎన్నో సంవత్సరాలుగా మేము అమ్ముకోలేక, అనుభవించలేక గొడవల్లో ఉన్న మా వారసత్వపు ఆస్తి అయిన ఆ పాత ఇంటిని బాబా అనుగ్రహంతో 2019, ఏప్రిల్ నెలలో ఏ గొడవలూ లేకుండా అమ్ముకోగలిగాము. అలాగే, ఆ నెలాఖరున మా స్థలవివాదంలో కూడా కోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చి, ఆ స్థలాన్ని మా ఆధీనంలోకి తీసుకోమని శుభవార్త చెప్పారు. “శతకోటి నమస్కారాలు తండ్రీ!”


అయితే, నా అజ్ఞానం వల్ల ఇదంతా నా సాయితండ్రే అనుగ్రహించారని గుర్తించలేక, నెరవేరని మరో కోరిక కోసం బాధపడుతూ, “సాయీ! నాకు లాటరీలో రెండుసార్లు రెండు లడ్డూలు ప్రసాదించారు. దీని అర్థం ఏమిటి? దీని ద్వారా నా కోరికలేమైనా నెరవేరాయా?” అని నేను అనుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా, “ఒకే నెలలో రెండు అతి పెద్ద సమస్యలు తీర్చాను కదా!” అనే సమాధానం లభించింది. అద్భుతం! అత్యద్భుతం!! నా కళ్ళు తెరచుకున్నాయి. ఈ కేసులలో విజయం లభిస్తుందని నా సాయితండ్రి ముందే నాకు శుభసంకేతాలు ఇచ్చారని అప్పుడు అర్థమైంది. “బాబా! మీకు వేలకోట్ల నమస్కారాలు”.


అయిదవ అనుభవం:


ఈమధ్య విపరీతమైన నడుమునొప్పితో బాధపడుతూ మా ఫ్యామిలీ డాక్టరుకి చూపించుకుందామని హాస్పిటల్‌కి వెళ్ళాను. ఆరోజు శనివారం. నాకు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. కానీ ఆరోజు మా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో లేరు. అందువల్ల ఆదివారంనాడు మరో తెలిసిన డాక్టరుకి రిపోర్టులు చూపిస్తే సర్జరీ చేయాల్సివుంటుందని చెప్పారు. నా పైప్రాణాలు పైనే పోయాయి. బాబాకు నమస్కరించుకుని, నా బాధను విన్నవించుకుని, సర్జరీ అవసరం లేకుండా చేయమని ప్రార్థించి, మా ఫ్యామిలీ డాక్టర్ని కలిసేవరకు ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ బాబా స్మరణలోనే ఉన్నాను. మా డాక్టర్ వచ్చాక రిపోర్టులు పరిశీలించి, సర్జరీ ఏమీ అవసరం లేదని చెప్పి, నడుమునొప్పి తగ్గటానికి మందులు ఇచ్చి పంపించారు. తనను నమ్మిన భక్తులను బాబా ఎంతగా రక్షిస్తారో చూడండి. బాబా నాపై చూపిన కరుణకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


ఆరవ అనుభవం:


2017లో నాతోపాటు మరికొంతమంది టీచర్లను మేముంటున్న ప్రాంతం నుంచి చాలా దూరప్రాంతాలకు బదిలీ చేశారు. ఇంటినుండి అంతదూరం బస్సులో ప్రయాణించాలంటే కనీసం 2.30 నుండి 3 గంటల సమయం పడుతుంది. పైగా బస్సుకోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తొమ్మిదిమంది టీచర్లం కలిసి ఒక క్యాబ్ ఏర్పాటు చేసుకునేలా బాబా అనుగ్రహించారు. బాబా దయవల్ల బస్సు కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి ఆందోళనా లేకుండా మేమంతా మా ప్రాంతం నుండి సుమారు 100 కి.మీ. దూరమున్న స్కూలుకి రెగ్యులర్‌గా వెళ్లి వస్తున్నాము. క్యాబ్ నడిపే అబ్బాయి ఒక క్రిస్టియన్. అయినప్పటికీ క్యాబ్ వెనుక డోర్ గ్లాస్ మీద బాబా స్టిక్కర్ ఉండేది. ఆ 100 కిలోమీటర్ల హైవే ప్రయాణంలో మాకు ఎలాంటి ఆపదా కలుగకుండా నా సాయితండ్రే కాపాడారు. అంత దూరప్రయాణంలో మేము ఏనాడూ ఇబ్బందిపడలేదు. ఎప్పుడైనా క్యాబ్ బ్రేక్‌డౌన్ అయినప్పటికీ, అది మేము దాదాపు మా ఇళ్లకు దగ్గరగా వచ్చాకే అయ్యేది. అక్కణ్ణించి ఏ ఇబ్బందీ లేకుండా మేము ఆటోల్లో మా ఇళ్లకు చేరుకునేవాళ్ళం. ఆ దూరప్రయాణంలో ఎటువంటి ప్రమాదమూ జరుగకుండా మమ్మల్ని నిరంతరం కాపాడిన బాబాకు సహస్రకోటి వందనాలు.


ఏడవ అనుభవం:


ఒకసారి బాబాకు నైవేద్యం సమర్పించి, తరువాత భక్తులకు పంచడం కోసం ఒక క్యాన్ నిండా నైవేద్యం సిద్ధం చేసి బాబా గుడికి బయలుదేరాము. ఇంట్లోనుండి బయటకు రాగానే బాబా క్యాలెండర్లు అమ్ముతూ ఒక అబ్బాయి ఎదురయ్యాడు. బాబానే ఎదురొచ్చి స్వయంగా మమ్మల్ని తీసుకెళ్తున్నారని మేమెంతో సంతోషించాము. తరువాత బస్టాపులో నిలుచుని బస్సుకోసం నిరీక్షిస్తుండగా ఒక కారు వచ్చి మా ముందు ఆగింది. ఆ డ్రైవర్ కారు దిగి మా వద్దకు వచ్చి నన్ను పలకరించారు. నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను. దాంతో ఆయన తనను తాను పరిచయం చేసుకుని, “మీరు చిన్నప్పుడు ఫలానా చోట ఉండేవారు కదా? మీరు ఫలానావారి అమ్మాయి కదా?” అని అడిగారు. అప్పుడు గుర్తుపట్టాను ఆయన్ని. ఎప్పుడో నా చిన్నప్పుడు మేము ఆడుకుంటున్న వయసులో ఒక ట్యాక్సీ డ్రైవరు మా ఇంటిముందు కారు ఆపి భోజనానికి వెళ్లొస్తుండేవారు. ఆయనే ఈయన. చాలా సంవత్సరాల తరువాత చూసినప్పటికీ నన్ను గుర్తుపట్టి పలకరించారు. “ఎక్కడికి వెళుతున్నారమ్మా? రండి నేను దింపుతాను” అని చెప్పి మమ్మల్ని కారు ఎక్కించుకుని భద్రంగా బాబా గుడి దగ్గర దించారు. ఆ విధంగా మేము ఏమాత్రం బరువు మోయకుండా, బస్సు ఎక్కి, దిగి, నడిచి కష్టపడకుండా బాబానే ఏర్పాట్లు చేశారు. ఎంత అద్భుతమైన లీలో చూడండి.


ఎనిమిదవ అనుభవం - అమ్మకి సాయి రక్ష:

 

2007వ సంవత్సరంలో ఒకరోజు మా అమ్మ దివాన్ కాట్ మీద నుంచి క్రిందపడితే తుంటి ఎముక విరిగి తనకు మేజర్ ఆపరేషన్ జరిగింది. ఆనాడు అమ్మ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ సాయిసచ్చరిత్ర గ్రంథాన్ని తన ప్రక్కనే ఉంచి తను త్వరగా కోలుకోవాలని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో త్వరలోనే తిరిగి చక్కగా నడవగలిగింది అమ్మ. ఇంటికి తిరిగి వచ్చాక బాబా చిత్రపటాన్ని అమ్మ నిద్రలేవగానే కనపడేలా పెట్టి అమ్మ క్షేమాన్ని బాబాకే అప్పజెప్పాను. ఇప్పుడు, 2020, నవంబరు 30వ తారీఖు సాయంత్రం అమ్మ బాత్రూం నుండి వస్తూ కాలుజారి పడిపోయింది. నొప్పితో నడవలేకపోయింది. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ సలహా మేరకు హుటాహుటిన అమ్మను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. డాక్టర్ వెంటనే అమ్మకు X-Ray తీసి చూశారు. ఆ కాస్త సమయంలో అమ్మను కాపాడమని గగ్గోలు పెట్టి బాబాను ప్రార్థించాను. ‘ఓం ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే సాయినామాన్ని మా పాపతో విడవకుండా చెప్పించాను. ఆశ్చర్యం! X-Ray రిపోర్టులో అమ్మకు ఎటువంటి ఫ్రాక్చర్ కాలేదని తెలిసింది. 74 ఏళ్ల వయసులో బలహీనంగా ఉన్న మా అమ్మ కాలుజారి పడిపోయినప్పటికీ ఎలాంటి ఫ్రాక్చర్ అవలేదంటే అది ఆ సాయితండ్రి రక్షణ కాక మరేమిటి? “బాబా! మా అమ్మను నువ్వే కాపాడావు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు తండ్రీ! కరుణతో అందరినీ ఎల్లప్పుడూ ఇలాగే కాపాడు బాబా! అడుగడుగునా మమ్మల్ని రక్షించే ఓ చల్లని తండ్రీ! నీ కృప, కరుణాకటాక్షవీక్షణాలు ఎల్లప్పుడూ మాపై ప్రసరింపజేయి. ఎన్నటికీ నీ పాదాలు విడిచిపెట్టని అనంతమైన భక్తిని మాకు ప్రసాదించు తండ్రీ!” 


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 630వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా తగ్గించింది సాధారణ తలనొప్పి, జ్వరం కాదు, కరోనాని
  2. బాబా దయతో తగ్గిన చేయినొప్పి

బాబా తగ్గించింది సాధారణ తలనొప్పి, జ్వరం కాదు, కరోనాని


సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలోనుండి ఒక ముఖ్యమైన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత కొన్ని షరతులతో మా కంపెనీని తిరిగి ప్రారంభించారు.  అయితే చుట్టుపక్కలా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం వల్ల కరోనా భయం చాలా ఉండేది. అందువల్ల బయటివాళ్ళు గ్రామంలోకి రాకుండా అడ్డంగా ముళ్ళకంప వేసేవాళ్ళు. మేమంతా భయం భయంగానే మా విధులకు హాజరయ్యేవాళ్ళం, రోజంతా మాస్క్ వేసుకుని పనిచేసేవాళ్ళం. ఒకరోజు నేను కంపెనీలో పనిచేస్తుండగా, ఉన్నట్టుండి చలితో కూడిన తలనొప్పి మొదలైంది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గింది, కానీ సాయంకాలానికి మళ్ళీ ఎక్కువైంది. చలి, తలనొప్పితో పాటు జ్వరం కూడా వచ్చింది. టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. డాక్టర్ దగ్గరకు వెళదామంటే ఆదివారం సూళ్లూరుపేట మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు. ఎవరినైనా సహాయం అడుగుదామంటే, ‘ఒంట్లో బాగాలేదు’ అని చెప్తే భయంతో అయిదడుగులు వెనక్కి వేసి మాట్లాడటం, ఇంటికి రావడం మానేస్తారు. ఏం చేయాలో తోచలేదు, అలా అని ఇంట్లో పడుకోవడానికి కూడా మనస్కరించలేదు. ఎందుకంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని భయం. రానురానూ జ్వరం, తలనొప్పి ఇంకా ఎక్కువ అయ్యాయి. దాంతోపాటు వాసన కూడా గుర్తించలేకపోయాను. దాంతో కరోనా సోకిందేమోనని భయమేసి ఇంట్లోవాళ్ళకి దూరంగా ఉందామని వెళ్లి పూజగదిలో పడుకున్నాను. తలనొప్పి తగ్గటానికి నా భార్య సాధారణ తలనొప్పి మాత్ర ఇచ్చింది. కానీ, నేను ఆ టాబ్లెట్ వేసుకోకుండా దిండు క్రింద పెట్టుకుని, బాబాకు నమస్కరించుకుని, “బాబా! లాక్‌డౌన్ వలన డాక్టర్ దగ్గరకు వెళ్లలేను, ఎవరినీ సహాయమూ అడగలేను. నాకు చాలా భయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వు మాత్రమే నాకు సహాయపడగలవు. నా వలన నా కుటుంబం ఇబ్బందులు పడకుండా రక్షించు తండ్రీ! నీ అనుగ్రహంతో నా జ్వరం, తలనొప్పి తగ్గిపోవాలి బాబా!” అని ప్రార్థించాను. బాబాను ప్రార్థించిన తరువాత గాఢమైన నిద్ర పట్టేసింది. రెండు మూడు గంటల తరువాత విపరీతమైన చెమటలు పట్టి మెలకువ వచ్చి చూసుకునేసరికి జ్వరమూ లేదు, తలనొప్పీ లేదు. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా నాకు తగ్గించింది సాధారణ తలనొప్పి, జ్వరం కాదు, అది కరోనా అని నేను బలంగా నమ్ముతున్నాను. మామూలు పరిస్థితుల్లో అయితే జ్వరం, తలనొప్పి సాధారణమైనవే కావచ్చు, కానీ నేను అనుభవించిన పరిస్థితులు అసాధారణమైనవి. కొన్ని పరిస్థితుల్లో చేతిలో డబ్బు ఉన్నా మనం ఏమీ చేయలేం. డబ్బు కన్నా గురువు అనుగ్రహం ఎంతో గొప్పది. నా సాయికి అసాధ్యమైనది ఏదీ లేదు. "ధన్యవాదాలు బాబా".


బాబా దయతో తగ్గిన చేయినొప్పి


ప్రియమైన సాయి స్నేహితులకు హాయ్! నా పేరు అనూష. ప్రస్తుతం నేను 6 నెలల గర్భవతిని. కేవలం సాయిబాబా అనుగ్రహం వల్ల పెళ్ళైన మూడేళ్లకు నేను గర్భవతినయ్యాను. ఆ అనుభవాన్ని ఇదివరకు ఈ బ్లాగు ద్వారా 'భక్తురాలినైన మూడు నెలలకే అనుగ్రహించిన బాబా' అన్న టైటిల్‌తో మీ అందరితో పంచుకున్నాను. ఆ అనుభవం చదవాలనుకునేవారికోసం క్రింద లింక్ జతపరుస్తున్నాను.


https://saimaharajsannidhi.blogspot.com/2020/08/493.html


ఇప్పుడు 2020, నవంబరు నెల చివరివారంలో, బహుశా 23 లేదా 24వ తేదీన బాబా ప్రసాదించిన ఒక చిన్న ఊదీ మహిమను పంచుకుంటాను. ఆరోజు రాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా నా కుడిచేయి చాలా నొప్పిపెట్టసాగింది. గర్భవతినైన నాకు ఆ సమయంలో ఏం చేయాలో తోచక బాబాను ప్రార్థించి నిద్రపోయాను. మరుసటిరోజుకి నొప్పి అలానే ఉంది. అప్పుడు నా చేతికి బాబా ఊదీ రాసుకుని, "బాబా! మీ కృపతో ఈ చేయినొప్పి తగ్గిపోవాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన నొప్పి తగ్గిపోయింది. బాబా దయవల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"



సాయిభక్తుల అనుభవమాలిక 629వ భాగం...



ఈ భాగంలో అనుభవాలు:
  1. అన్నిటికీ బాబానే దిక్కు!
  2. మనకేది మంచిదో అదే దయచేస్తారు సాయి 

అన్నిటికీ బాబానే దిక్కు!


నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒకసారి ఒక వర్క్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. అది విజయవంతంగా ఆమోదింపబడటంతో వర్క్ చేయడం ప్రారంభించాను. కానీ, 10 రోజులకే ఆ వర్క్ ఆగిపోతుందని నా స్నేహితురాలు నాతో చెప్పింది. ఆ వర్క్‌తో వచ్చే డబ్బుల కోసం ఎంతో ఆశపడిన నేను వర్క్ ఆగిపోతుందని తెలిసి చాలా బాధపడ్డాను. బాబానే ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని భావించి బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈ వర్క్ ఆగిపోకుండా 3 నెలల వరకు కొనసాగేలా అనుగ్రహించు” అని వేడుకున్నాను. ఆశ్చర్యం! 10 రోజులకే ఆగిపోతుందని భయపడిన ఆ వర్క్ బాబా దయవల్ల ఆగిపోకుండా 3 నెలల వరకు కొనసాగుతూనే పోయింది. నిజానికి ఆ వర్క్ డబ్బుల మీద మా అక్క కుటుంబం ఆధారపడివుంది. కరోనా సమయంలో పనులు లేక చాలా ఇబ్బందిపడిన మాకు ఆ విధంగా దారిచూపారు బాబా. బాబా చూపిన కృపకు మేమంతా ఎంతో సంతోషించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. “ధన్యవాదాలు బాబా”.


నేను కొంతకాలం పెళ్ళి సంబంధాలు కుదరక చాలా ఇబ్బందిపడ్డాను. ‘వయసు పెరిగిపోతోంది, ఎక్కడా సంబంధాలు కుదరటంలేద’ని మా కుటుంబమంతా కూడా బాధపడుతుండేది. అప్పుడు ఒక సాయి బంధువు ద్వారా పెళ్ళి సంబంధం కుదరాలంటే, 11 గురువారాలు పూజ చేయాలని బాబా నాకు తెలియజేశారు. బాబా చెప్పినట్లే నేను 11 గురువారాల పూజ ప్రారంభించగా 8వ గురువారం నాకు ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. అన్నీ కుదిరి, 11వ గురువారంనాడు కట్నకానుకల గురించి మాట్లాడుకుని 2020, డిసెంబరు 23వ మా వివాహం నిశ్చయించటంతో బాబా నాపై చూపిన కృపకు ఆనందంతో నాకు కన్నీళ్ళు ఆగలేదు. 


నాకు ఏ బాధ వచ్చినా బాబాకే చెప్పుకుని ఏడుస్తాను, బాబా నా బాధ వింటూ నన్ను ఓదారుస్తున్న అనుభూతిని పొందుతాను. “బాబా! నీ మీద భారం వేసి, నిన్నే నమ్ముకొని ఈ సంబంధం ఒప్పుకున్నాను. అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబా. ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండు బాబా. సమయానికి అన్నీ సమకూరి, ఎటువంటి ఆటంకాలూ లేకుండా మా పెళ్ళి జరిగేలా దీవించు బాబా! మా వైవాహిక జీవితం ఆనందంగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ! బాబా! మా పెద్దక్కయ్యవాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు నీ మీద భారం వేసి నిన్నే వేడుకుంటున్నారు. ఇంకా వాళ్ళని పరీక్షించకు బాబా. వాళ్ళకు రావలసిన డబ్బులు త్వరగా వచ్చి వాళ్ళ ఆర్థిక సమస్యలు, అప్పులు తీరేలా దీవించు తండ్రీ! నువ్వే మా కుటుంబానికి దిక్కు బాబా. మా కుటుంబానికి ఏ ఆపదా రాకుండా కాపాడు తండ్రీ!” 


మాకు ఏ చిన్న ఆపద వచ్చినా మా నోటినుండి వచ్చే మొదటి పదం – బాబా. మా సర్వస్వం బాబానే.


మనకేది మంచిదో అదే దయచేస్తారు సాయి 

ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు వెంకటరావు. శిరిడీ సాయిని సర్వస్య శరణంగా నమ్ముకున్నవాడిని. ప్రతిక్షణమూ బాబా ఎన్నెన్నో అనుభవాలను కలిగిస్తుంటారు. అందులో ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఆరోజు అక్టోబర్ 15, 2020. తేదీ ప్రకారం బాబా మహాసమాధి చెందినరోజు. అదేరోజు కరోనాతో హాస్పిటల్‌లో ఉన్న మాకు ప్రియమైన వ్యక్తికి ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతోందని డాక్టర్లు వెంటిలేటర్ పెట్టారు. ఆ సమయంలో ఆఫీసులో ఉన్న నేను ఇంటర్‌నెట్‌లో శిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూశాను. బాబా కిరీటధారులై అద్భుతమైన దర్శనమిచ్చారు. బాబా దర్శనంతో మనసుకి ఎంతో ఆనందం కలగటంతో పాటు హాస్పిటల్లో ఉన్న మా ప్రియమైన వ్యక్తిని బాబా ఆపద నుంచి బయటపడేస్తారనే నమ్మకమూ కలిగింది. అదే భరోసాతో అందరికీ ధైర్యం చెప్పాను. ఆ సాయంత్రమే తనకు ప్లాస్మా డోస్ కూడా ఏర్పాటు చేశారు బాబా. అది మాకు మరింత ధైర్యాన్ని కలిగించింది. మరుసటిరోజు ఉదయం డ్యూటీ డాక్టర్లు తన ఆరోగ్య పరిస్థితి మెరుగయిందని కూడా చెప్పారు. అంతా సవ్యంగా సాగుతుందని మేమంతా నమ్మాము. అయితే స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రం, “ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో అంత సులభంగా చెప్పలేము. ప్రస్తుతం 75 శాతం వెంటిలేటర్ సపోర్టుంది. జబ్బు నయమయ్యే కొద్దీ ఆ శాతం తగ్గుతూ వస్తుంది. అందుకని అప్పుడే ఏమీ చెప్పలేము” అన్నారు. మరుసటిరోజుకు వెంటిలేటర్ సపోర్టును 55 శాతానికి తగ్గించారు. బాబా చల్లగా చూస్తున్నారనుకున్నాము కానీ, పిదప దాన్ని 60 శాతానికి పెంచాల్సి వచ్చిందన్నారు డాక్టర్. అలా ఆ డోలాయమాన స్థితి కొనసాగుతూనే ఉండింది, ఆశ నిరాశల మధ్య మా పరిస్థితి కూడా. విజయదశమికి ముందు మూడు రోజులు తన పరిస్థితి నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. కానీ విజయదశమిరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఆక్సిజన్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోయి మా ప్రియమైన వ్యక్తి సాయిలో లీనమయ్యారు. 

మనం కోరేదొకటి, మనకి మంచిదైనది మరొకటి. సాయి ఎప్పుడూ మనకేది మంచిదో అదే దయచేస్తారు. ఎన్నో శుభసూచకాలు చూపించి కూడా ఆ జీవిని మాకు దక్కకుండా తీసుకెళ్ళిపోయారు ఆ సాయిదేవుడు. ఆ జీవి మాకంటే కూడా సాయికే ఎక్కువ అవసరమేమో. బహుశా ఆ కుటుంబాన్ని స్వయంగా చూసుకుని వృద్ధిలోకి తీసుకురావాలని బాబా ఉద్దేశ్యమేమో! “ఆ కుటుంబాన్ని దగ్గరుండి కాపాడు తండ్రీ!”.



బడేమియా



1917లో బడేమియా అను ముస్లిం భక్తుడు బాబాను దర్శించాడు. 1942లో శాంతారామ్ డి.థెట్తే అనునతడు బడేమియాను కలిసి, బాబాతో అతనికున్న అనుబంధం గురించి, ముఖ్యంగా బాబా యొక్క దైవత్వం గురించి తెలుపమని కోరాడు. అప్పుడు బడేమియా ఇలా చెప్పాడు: 

బాబా గొప్ప వైలీ (ముస్లిం మహాత్ములు). వారు మహాసముద్రం వంటివారు. నాలాంటి ఒక గృహస్థుడు ఆ మహాసముద్రం యొక్క లోతును మీకెలా చెప్పగలడు? అయినా నా అనుభవం గురించి చెప్తాను. ఒకప్పుడు నా వద్ద డబ్బు లేనందున నా కూతురి వివాహ విషయమై నేను చాలా ఆందోళనచెందాను. ఆ సమయంలో నేను బాబా గొప్పతనం, వారి దాతృత్వం గురించి విని మరాఠ్వాడ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం నుండి శిరిడీ ప్రయాణమయ్యాను. శిరిడీ చేరుకున్నాక నేను నేరుగా మసీదుకి వెళ్ళాను. బాబా తమ ఆసనంపై కూర్చొని ఉన్నారు. వారి చుట్టూ కొద్దిమంది భక్తులు ఉన్నారు. నేను ఆయన ముందు సాష్టాంగపడి మౌనంగా కూర్చున్నాను. అప్పుడే ఆ గ్రామానికి చెందిన ఒక పాటిల్ వచ్చి, బాబా ముందు మూడు రూపాయలుంచి కూర్చున్నాడు. బాబా అతని వైపు చూసి, “నువ్వు, నీ కుటుంబంలో అందరూ బాగున్నారా?” అని అడిగారు. అతను, “బాబా! నా కూతురి పెళ్లి త్వరలో జరగనుంది. అందుకు అవసరమైన డబ్బు నా వద్ద లేదు. నేను పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాను. ఇప్పుడు పెళ్లికోసంగా మళ్ళీ డబ్బు అప్పుగా తీసుకుంటే, నేను దానిని తిరిగి చెల్లించలేను. మరోవైపు పెళ్లి ఘనంగా చేయించకపోతే నేను గ్రామంలో నవ్వులపాలవుతాను. అలా జరగకుండా ఉండాలంటే, నాకు 3,000 రూపాయలు చాలా అవసరం” అని బదులిచ్చాడు. అప్పుడు బాబా, “నువ్వెందుకు అంతగా ఆందోళన చెందుతున్నావు? దేవుడు నీ పనిని చేస్తాడు. నీ అన్ని చింతలను, భారాన్ని సర్వశక్తిమంతుడైన దేవునిపై వేసి, ఏ చింతా లేకుండా నిశ్చలంగా కూర్చుని ఆయన అభీష్టమేమిటో చూడు! ఆయన కోరుకుంటే నీ కోరికను నెరవేరుస్తాడు, అలా కాకుంటే నీ పని జరగదు. ఏదేమైనా ఆయన ఉంచినట్లు నువ్వు సంతృప్తిగా ఉండాలి” అని చెప్పారు. అందుకు పాటిల్, “బాబా! మీరు చెప్పేది నిజమే. కానీ ఈ భౌతిక ప్రపంచంలో నేనొక గృహస్థునిగా, ఈ గ్రామానికి పాటిల్‌గా జీవిస్తున్నాను. మరి మీరు చెప్పేదాన్ని నేను ఎలా అంగీకరించగలను?” అని అన్నాడు. అందుకు బాబా, “నువ్వెందుకు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు? ఆ మొత్తాన్ని నేను నీకిస్తాను. దాంతో నీ చింత తొలగిపోతుంది” అని అన్నారు.

ఆ సంభాషణ అంతా వింటున్న నేను పాటిల్‌కి అవసరమైన ఆ పెద్ద మొత్తాన్ని బాబా ఎలా ఇవ్వబోతారా అని ఆశ్చర్యపోతూ బాబా ధరించిన చిరిగిన తెల్లని కఫ్నీ, వారి తలకు చుట్టుకున్న మాసిన గుడ్డను చూడసాగాను. అంత పెద్ద మొత్తాన్ని ఆయన దాచిపెట్టేందుకు ఒక పెట్టెగానీ, అల్మరాగానీ అక్కడ లేవు. మరి ఈ ఫకీరు ఆ పాటిల్‌కి ఏమి ఇవ్వగలరని సందేహాస్పదంగా నేను ఆయన వైపే చూస్తున్నాను. అంతలో బాబా తమ కఫ్నీ జేబులో చేయిపెట్టి కొన్ని రూపాయి నాణేలు తీసి పాటిల్‌కు ఇచ్చి, “వీటినిప్పుడు ఇక్కడే లెక్కపెట్టు” అని అన్నారు. అతను అలానే చేశాడు. అవి సరిగ్గా 3,000 రూపాయలు ఉన్నాయి. అప్పుడు బాబా, “ఇక వెళ్లి నీ కూతురి పెళ్లి ఏర్పాట్లు చేసుకో” అని అన్నారు. పాటిల్ బాబా ముందు సాష్టాంగపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. నేను అక్కడ జరుగుతున్నదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. కొంతసేపటికి బాబా వద్ద సెలవు తీసుకొని నేను నా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను.

ఆ రాత్రి నా కంటి మీద కునుకు వాలలేదు. నా కళ్ళముందు మసీదులో జరిగిన సంఘటనే పదేపదే మెదలసాగింది. నాకూ పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. త్వరలో తనకి పెళ్లి చేయాలి. అందుకోసం ఎలా లేదన్నా కనీసం ఒక వెయ్యి రూపాయలు నాకవసరమవుతాయి. ‘పేదవాడినైన నాకు కూడా పాటిల్‌కి చేసినట్లే బాబా సహాయం చేస్తారా?’ అని పరిపరివిధాల ఆలోచించి, మరునాడే శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లుగానే శిరిడీ ప్రయాణమయ్యాను.

నేను తెల్లవారుఝామునే బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళాను. బాబా ముందు సాష్టాంగపడి, ఆయన పాదాలచెంత ఒక రూపాయి ఉంచి, “బాబా! నేను నా కూతురి పెళ్లి చేయాలి. అందుకు నాకు వెయ్యి రూపాయలు కావాలి” అని బాబాతో విన్నవించుకున్నాను. అప్పుడు బాబా, “అది నిజమే!” అంటూ తమ కఫ్నీ జేబులో చేయిపెట్టి, పిడికిలినిండా నాణేలు బయటకు తీసి, “కండువా పట్టు” అని అన్నారు. నేను అలాగే చేశాను. అప్పుడు ఆయన ఆ నాణేలను ఆ కండువాలో పోశారు. కండువాలో పడుతున్న నాణేల గలగల నేను విన్నాను. బాబా నాతో, “ఇక ఇంటికి వెళ్ళు. ఇల్లు చేరాక ఈ నాణేలను లెక్కపెట్టుకో!” అని ఆదేశించారు. వెంటనే నేను తిరుగు ప్రయాణమయ్యాను. ఇల్లు చేరిన వెంటనే ఆతృతగా బాబా ఇచ్చిన నాణేలను నేలపై వేసి లెక్కపెట్టడం మొదలుపెట్టాను. మొత్తం అరవైఎనిమిది రాగినాణేలున్నాయి. దాంతో, బాబా నాతో పరాచికమాడారని తలచి వెంటనే బయలుదేరి శిరిడీ చేరుకున్నాను.

మసీదుకు వెళ్ళి బాబాకు ఎదురుగా నిలబడి, “పాటిల్ గొప్పవాడు కాబట్టి అతను మీకు మూడు రూపాయలు దక్షిణ ఇచ్చాడు. అందుకు బదులుగా మీరు అతనికి మూడువేల రూపాయలు ఇచ్చారు. కానీ నేను బీదవాడిని. ఎంతో దూరంలో ఉన్న మరాఠ్వాఢా నుండి కేవలం వెయ్యి రూపాయలు అవసరమై మీ దగ్గరకు వచ్చాను. అది కూడా నా కూతురి పెళ్ళిఖర్చుల కోసం. నేను ఒక రూపాయి దక్షిణ ఇచ్చిన తర్వాత మీ నుండి నాకు లభించింది అరవై ఎనిమిది పైసలే. నా పేదరికాన్ని మీరిలా అపహాస్యం చేశారు” అని వారిని నిందించాను. బాబా నవ్వుతూ, “నువ్వు నా పాదాల చెంత ఒక రూపాయి దక్షిణ పెట్టినప్పుడే నువ్వు నా నుండి వెయ్యిరూపాయలు ఆశిస్తున్నావని నాకు తెలుసు” అన్నారు. అప్పుడు నేను, “నిజంగానే త్వరలో నా కూతురికి వివాహం చెయ్యాలి” అని అన్నాను. అప్పుడు బాబా, “అరె! నీ కూతురి పెళ్ళి వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఇప్పటినుండే కంగారుపడతావెందుకు? పెళ్ళి నిశ్చయమైనప్పుడు నీకు డబ్బు అందేలా నేను చూస్తాను” అని హామీ ఇచ్చారు. దాంతో నేను వారి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. బాబా ఆశీస్సులతో ఆ సంవత్సరం సాధారణం కంటే నాలుగైదు రెట్లు అధికంగా పంట దిగుబడి వచ్చింది. ఆ విధంగా లభించిన ధనంతో ఎవరిముందూ చెయ్యిచాపకుండా, ఎవరి దగ్గరా అప్పుచేయకుండా నా కూతురి పెళ్లి ఘనంగా జరిపించాను.

సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి
(రెఫ్: సాయి సాగర్ పత్రిక, 2009; దీపావళి సంచిక)

సాయిభక్తుల అనుభవమాలిక 628వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహం వల్ల నెరవేరిన సొంత ఇంటి కల
  2. మా చెల్లిని రక్షించిన బాబా
  3. కొన్ని కోరికలు బాబా ద్వారానే నెరవేరుతాయి

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు అనిల్ కుమార్. నా జీవితంలో బాబా నాకు ఎన్నో మహిమలు చూపించారు. బాబా దయవల్ల జరిగిన రెండు ముఖ్యమైన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.

మొదటి అనుభవం:

  • బాబా అనుగ్రహం వల్ల నెరవేరిన సొంత ఇంటి కల 

మేము బెంగళూరులో ఇల్లు కొనుక్కుందామని ప్రయత్నాలు చేస్తుండగా తెలిసినవాళ్ళ ద్వారా ఒక ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది. ఆ ఫ్లాట్ తీసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాము. కానీ, అన్నీ కుదిరి ఫ్లాట్ తీసుకుందామనుకునేలోపు అది కాస్తా మా చేజారిపోయింది. దానితో ఒక్కసారిగా నేను, నా భార్య ఎంతో దిగులుచెందాము. ఆ తరువాత మేమిద్దరం సొంతిల్లు ప్రసాదించమని బాబాను ప్రార్థించి, సాయి నవగురువారవ్రతం చేద్దామని నిశ్చయించుకున్నాము. నవగురువారవ్రతం ప్రారంభించిన 4వ గురువారం తరువాత మా స్నేహితుడు సూచించిన ఒక అపార్ట్మెంట్ చూడటానికి వెళ్ళాము. కానీ, అది మాకు నచ్చలేదు. అయితే, అక్కడికి వెళ్ళే త్రోవలో మేము వేరే అపార్ట్మెంట్ చూశాము. అది మాకు బాగా నచ్చింది. లీగల్గా కూడా ఎటువంటి సమస్యలూ లేవు. బాబాను ప్రార్థించుకుని ఆ ఫ్లాట్ని మేము కొనుక్కున్నాము. ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇవ్వడం దగ్గర నుండి ఫైనల్ పేమెంట్ వరకు అన్ని విషయాలూ గురువారంరోజున జరిగేలా బాబా ఆశీర్వదించారు. ఈ విధంగా మాకు బాగా నచ్చిన ఇంటిని అందుబాటు ధరలో లభించేలా బాబా అనుగ్రహించారు. ఈ అనుభవం ద్వారా బాబాపై మా నమ్మకం మరింత బలపడింది.

రెండవ అనుభవం:

  • మా చెల్లిని రక్షించిన బాబా

నవంబరు 6వ తేదీన మా చెల్లి ఆఫీసులో ఉన్నప్పుడు తనకు కాళ్లు చేతులు నొప్పిపుట్టడం మొదలైంది. ఇంటికి వచ్చిన తరువాత నొప్పులు ఇంకా తీవ్రమయ్యాయి. కాళ్ళు, చేతుల నొప్పులతో బాధపడుతున్న మా చెల్లిని చూసి మా అమ్మానాన్నలు చాలా భయపడిపోయి నాకు చెప్పారు. నేను వెంటనే మా చెల్లిని కాపాడమని బాబాను మనసారా ప్రార్థించాను. నా భార్య కూడా మా చెల్లి నొప్పులను తగ్గించమని బాబాను ప్రార్థించి, 108 రూపాయలు దక్షిణ సమర్పిస్తామని బాబాకు మ్రొక్కుకుంది. తరువాత చికిత్స కోసం మా చెల్లిని మా బావగారు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. కరోనా పరీక్ష చేస్తే తప్ప చికిత్స చేయడం కుదరదని డాక్టర్ చెప్పటంతో మా అమ్మానాన్నలు ఇంకా భయపడ్డారు. మా బావగారు వాళ్ళకు ధైర్యం చెప్పి తనే దగ్గరుండి మా చెల్లికి కరోనా పరీక్ష చేయించారు. రిజల్ట్ రావడానికి ఒక రోజు పడుతుందని చెప్పారు. మేమంతా చాలా ఆందోళన చెందాము. మా చెల్లికి కరోనా పరీక్షలో నెగిటివ్ వస్తే ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్నాను. మేము కోరుకున్నట్టే మా చెల్లికి కరోనా నెగటివ్ అని మా బావగారి స్నేహితుని ద్వారా మాకు ముందుగానే తెలిసింది. తనకు వచ్చింది డెంగ్యూ జ్వరం అని పరీక్షలో తేలింది. దాంతో మా చెల్లి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటూ మందులు వాడటం మొదలుపెట్టింది. ప్రార్థించిన వెంటనే మా బాధను తెలుసుకుని మా చెల్లిని కాపాడి, తద్వారా నా తల్లితండ్రులను కూడా రక్షించిన నా సాయికి కొన్ని కోట్ల నమస్సులు.


కొన్ని కోరికలు బాబా ద్వారానే నెరవేరుతాయి

సాయిభక్తురాలు అంజలి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

అందరికీ నమస్తే! బాబా దయ అందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. నా పేరు అంజలి. ఈమధ్య నాకు జరిగిన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి నాకు ఒకే ఒక్క బంగారు గాజు ఉంది. మరికొన్ని బంగారు గాజులు తీసుకుందామని ఎంతగా అనుకున్నప్పటికీ నా కోరిక నెరవేరలేదు. గత నెలలో నేను బాబాను, "బాబా! ఎన్నో ఏళ్లుగా నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ నాకు ఒకే ఒక్క బంగారు గాజు ఉంది. దగ్గరలో నా మరదలి పెళ్లి ఉంది. ఆ పెళ్లి సమయానికల్లా నాకు ఎలాగైనా నాలుగు గాజులు కొనిపెట్టమ"ని అర్థించాను. కానీ బాబా అనుగ్రహించలేదు. 'సరేలే, బాబా ప్రణాళిక వేరే ఉండి ఉంటుంది. ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు తెలుసు' అని నేనింక ఊరుకున్నాను. పెళ్లి నుండి వచ్చాక ఒకరోజు హఠాత్తుగా మావారు, "ఎప్పటినుండో బంగారు గాజులు కావాలని అడుగుతున్నావు కదా! చిట్ తక్కువకు వస్తే, ఆ డబ్బులతో గాజులు కొనుక్కో!" అన్నారు. ఇక బాబా అనుగ్రహం చూడండి. మేము అనుకున్నంతలోనే చిట్ తక్కువకు వచ్చింది. నాకు కావలసిన డబ్బులు సమకూరాయి. ఆ డబ్బులతో నవంబరు 11న బాబా నాకు బంగారు గాజులు ప్రసాదించారు. నిజానికి మా మరదలి పెళ్లికి ముందు బాబా వాటిని నాకివ్వకపోవడమే మంచిదైంది. అప్పటి పరిస్థితులు ఇక్కడ వివరించలేనుగానీ, జరగనున్న పరిణామాలు బాబాకి తెలుసు గనక ఎప్పుడు వాటిని నాకు ఇవ్వాలో అప్పుడే ఇచ్చి అనుగ్రహించారు. 'బాబాని ఇలా కూడా అడుగుతారా?' అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ, నేను దాదాపు 17 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. అయినా నాలుగు బంగారు గాజులు కొనుక్కోలేకపోయాను. కొన్ని కోరికలు ఉంటాయి, మనమెంతగా ప్రయత్నించినా అవి నెరవేరవు. అలాంటివి బాబా ద్వారానే నెరవేరుతాయి. "బాబా! ఎంతోకాలంగా ఉన్న నా కోరికను తీర్చినందుకు నా కృతజ్ఞతలు. నా తోడు, నీడ అన్నీ నీవే బాబా".

మరో చిన్న అనుభవం:

నేను ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాను. ఈమధ్య ఒకరోజు మా ఆఫీసులోని ఒక గదికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అసలు సమస్య ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. స్థానిక ఎలక్ట్రీషియన్‌ను సబ్‌స్టేషన్‌కి తీసుకుని రాకూడదు. ఇక ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. సమస్య ఏదైనా నిస్సహాయస్థితిలో భక్తులందరికీ బాబానే తోడు! అందుచేత నేను బాబాని సహాయం చేయమని వేడుకుని, సమస్య పరిష్కారమైతే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని చెప్పుకున్నాను. పరిష్కారమవడమే కష్టం అనుకున్న సమస్య బాబా దయవలన కొద్దిసేపట్లోనే పరిష్కారమైంది. "బాబా! మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 627వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రార్థించినంతనే అనుగ్రహవర్షం కురిపించే సాయితండ్రి 
  2. బాబాను ప్రార్థించినంతనే సమస్యలు తీరుతాయి


ప్రార్థించినంతనే అనుగ్రహవర్షం కురిపించే సాయితండ్రి 

ఓం శ్రీ సాయి లీలానుగ్రహప్రదాయ నమః. అందరికీ సాయిరాం! ఈమధ్య బాబా నాపై చూపిన లీలానుగ్రహాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ముందుగా మన సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. మీరు చేసే సాయిసేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన బాబా తన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలిపే అనుభవాలను అందరితో పంచుకునే గొప్ప అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ మనం ఇలా ఒకరితో ఒకరం సాయి ప్రేమను పంచుకుంటూ ఆనందంగా ఉండాలని బాబాను కోరుకుంటున్నాను. 

ఇక, బాబా నాకు చూపిన లీల గురించి చెప్తాను. ఈమధ్య నేను ఒక వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ చూశాను. అది సాయి కష్టనివారణ మంత్రం గురించిన గ్రూప్ లింక్. అసలు అలాంటి మంత్రం ఒకటుంటుందని కూడా నాకు తెలీదు. వెంటనే గూగుల్ చేసి చూసి ఆ మంత్రాన్ని రాసుకున్నాను. తరువాత ఆ గ్రూపులో చేరాను. ఆ గ్రూపులోని సభ్యులు కనీసం రోజుకి ఒకసారి అయినా ఆ మంత్రాన్ని చదివి ఆ గ్రూపులో రిపోర్ట్ పెట్టాలి. మొదటిరోజు నేను మూడుసార్లు ఆ మంత్రాన్ని చదివి గ్రూపులో రిపోర్ట్ పెట్టాను. కాసేపటికి ఆ గ్రూపు అడ్మిన్ వాళ్ళు అన్ని భాషల్లో ఆ మంత్రం యొక్క pdf ఫైల్, యూట్యూబ్ లింక్ పెట్టారు. నేను pdf సేవ్ చేసుకుందామని డౌన్లోడ్ చేసి చూస్తే, అది నేను అంతకుముందు గూగుల్ చేసి చదివింది కాదు, పూర్తిగా వేరేగా ఉంది. నాకు ఏం చేయాలో తోచలేదు. మొదటిరోజే ఇలా అయిందేమిటి అనిపించింది. అసలు ఆ pdf లో ఉన్నది అర్థం కావటం లేదు. తెలుగులోనే ఉంది, కానీ స్పష్టంగా లేదు. దాంతో మళ్ళీ గూగుల్ చేశాను. అన్ని వెబ్సైట్లలోనూ నేను చదివిన మంత్రమే ఉంది. గ్రూపువాళ్ళు pdf లో ఇచ్చిన మంత్రం ఎక్కడా లేదు. తరువాత వాళ్ళు ఇచ్చిన యూట్యూబ్ లింక్ చూస్తే అక్కడ నేను చదివిందే ఉంది. నాకు చాలా అయోమయంగా అనిపించింది. గ్రూపువాళ్ళే రెండు రకాలుగా ఇచ్చారు. ఏది చదవాలి? ఏది సరైంది? నేను అంతకుముందు చదివి రిపోర్ట్ పెట్టిన మంత్రాన్నే కొనసాగిద్దామని అనుకున్నాను. కానీ అంతలోనే మళ్ళీ సందేహం, రెండిట్లో ఏది అసలైంది అని. దాంతో నేను గ్రూపు నుండి బయటకు వచ్చేద్దామని కూడా అనుకున్నాను. అంతలోనే, “మీకు ఏ సందేహాలు ఉన్నా నన్ను అడగండి” అని సచ్చరిత్రలో బాబా చెప్పిన మాట గుర్తుకొచ్చింది. వెంటనే నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఆ రెండు మంత్రాల్లో నేను ఏది చదవాలో నువ్వే చెప్పు. అప్పటివరకు నేను ఏ మంత్రమూ చదవను” అని చెప్పుకున్నాను. పిలిచినంతనే పలికే నా సాయి ఆ మర్నాడే నా సందేహానికి సమాధానం ఇచ్చేశారు. ఆ మర్నాడు నేను మన బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదవటానికి లింక్ ఓపెన్ చేశాను. అందులో ప్రచురించిన మొదటి అనుభవంలోనే ఉంది నా సాయి ఇచ్చిన సమాధానం. నేను ముందురోజు ఏదైతే చదివి రిపోర్ట్ పెట్టానో ఆ మంత్రమే ఆ అనుభవంలో ఉంది. ఇంతకుముందెప్పుడూ నేను ఆ మంత్రాన్ని మన బ్లాగులో చూడలేదు. అలాంటిది నేను బాబాను అడిగిన మర్నాడే బ్లాగులో వచ్చింది. అంటే, “నువ్వు చదివిందే కొనసాగించుఅని బాబా నాకు సమాధానమిచ్చారు. చాలా సంతోషంగా అనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఒక్కరోజు కూడా ఆటంకం లేకుండా నేను ఆ మంత్రాన్ని చదివేలా చేసిన నా సాయి లీల చూశారా! ఇలాంటివి మనందరికీ నిత్యానుభవాలే కదా! ఇలా అడగగానే అలా సమాధానం ఇచ్చేస్తారు మన సాయి. “లవ్ యు సాయీ!”

ఇక బాబా చూపిన మరో అనుగ్రహం గురించి చెప్తాను. ఈమధ్య మా మేనకోడలి విషయంలో బాబా అనుగ్రహం చూపించారు. మా మేనకోడలు ఈమధ్య వ్యాయామం చేయటం మొదలుపెట్టింది. వ్యాయామం ప్రారంభించిన రెండు రోజులకు తనకు జ్వరం వచ్చేసింది. అది వ్యాయామం వల్ల వచ్చిన జ్వరమే. కానీ, ఈ కరోనా రోజుల్లో జ్వరం వస్తే ఎంత టెన్షన్ పడుతున్నామో మీ అందరికీ తెలుసు. నేను బాబాకు నమస్కరించుకుని, మా మేనకోడలి జ్వరం చాలా త్వరగా తగ్గించమని ప్రార్థించి, తనకు త్వరగా జ్వరం తగ్గిపోతే ఈ అనుభవాన్ని మన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. అదేరోజు పోస్టులో శిరిడీ నుంచి బాబా ఊదీ, ప్రసాదం వచ్చాయి. వెంటనే బాబా ఊదీని మా మేనకోడలికి పెట్టి, ప్రసాదం ఇచ్చాము. బాబా అనుగ్రహంతో మర్నాటికల్లా తన జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ప్రార్థించినంతనే అనుగ్రహవర్షం కురిపించే సాయితండ్రికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? ఆయన బిడ్డగా బాబా పేరు నిలబెట్టేలా బ్రతికితే చాలు. “మేము అలా బ్రతకాలన్నా కూడా నీ అనుగ్రహమే కావాలి బాబా. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు సాయీ!” 

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!

శుభం భవతు!

ఓం సాయిరాం!


బాబాను ప్రార్థించినంతనే సమస్యలు తీరుతాయి

సాయిభక్తుడు రవి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! నా పేరు రవి. నేను ఎప్పుడు బాబాను ప్రార్థించినా బాబా వెంటనే నా సమస్యలను తీరుస్తారు. బాబా అనుగ్రహంతో ఇటీవల జరిగిన రెండు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.

మొదటి అనుభవం:

ఒకరోజు అర్థరాత్రిపూట నాకు అకస్మాత్తుగా గుండెల్లో దడ మొదలైంది. నేను బాబాను స్మరించుకుని, నీళ్ళలో కొద్దిగా బాబా ఊదీని కలుపుకుని త్రాగి, ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే నామాన్ని జపించసాగాను. బాబా అనుగ్రహంతో కేవలం 5 నిమిషాలలో గుండె దడ తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

రెండవ అనుభవం:

నాకు ఆస్త్మా ఉంది. ఒకరోజు ఉదయాన్నే కఫంతోను, దగ్గుతోను బాగా ఇబ్బందిపడ్డాను. బాబాను ప్రార్థించి, “ఈ ఆస్త్మా సమస్యను వెంటనే తగ్గించండి బాబా. మీ దయవల్ల ఈ ఆస్త్మా తగ్గితే నా ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకుని, బాబాను స్మరించుకుంటూ వేడినీళ్ళు నోట్లో పోసుకుని పుక్కిలించాను. బాబా దయవల్ల కాసేపటికి ఆస్త్మా నుండి ఉపశమనం కలిగింది. “థాంక్యూ బాబా! ఇంత ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా. ఐ లవ్యూ బాబా. క్రొత్తగా కిరాణా స్టోర్ పెట్టాను బాబా! దయచేసి ఈ వ్యాపారం మంచి లాభాల్లో నడిచేలా అనుగ్రహించండి. నాకున్న అప్పులు కూడా వీలైనంత త్వరలో తీర్చేలా ఆశీర్వదించండి బాబా. నాకున్న ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తగ్గేలా అనుగ్రహించండి బాబా!”



లక్ష్మీబాయి తుసే



లక్ష్మీబాయి తుసే అనే మహిళ ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ఆచారపూర్వకంగా శ్రీరాముని, హనుమంతుని పూజిస్తుండేది. ఒక రాత్రి ఆమెకు కలలో ఒక ఫకీరు దర్శనమిచ్చి, “శిరిడీకి రా! నీ రాముడు ఇక్కడున్నాడు. కాబట్టి తరచూ నీకిష్టమైనప్పుడు వస్తూండు” అని చెప్పాడు. శిరిడీ గురించి, బాబా గురించి అంతకుముందెప్పుడూ విననందువల్ల తనకు కలలో కనిపించిన ఫకీరు ఎవరో, శిరిడీ ఎక్కడుందో ఆమెకేమీ అర్థం కాలేదు. ఆమె తనకొచ్చిన కల గురించి తన గురువుతో చెప్పినప్పుడు అతను శిరిడీ గురించిన అన్ని వివరాలూ ఆమెతో చెప్పాడు. తరువాత 1913లో మొదటిసారి శిరిడీ దర్శించే అవకాశం ఆమెకు లభించింది. బాబాను చూస్తూనే తనకు కలలో కనిపించిన ఫకీరు వారేనని ఆమె గుర్తించింది. వారి దర్శనంతో ఎంతో తృప్తిచెంది వారి అనుమతి తీసుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోయింది. 

1917లో ఆస్తి సంబంధిత సమస్యలతో ఆమె చాలా ఆందోళన చెంది మరోసారి శిరిడీ సందర్శించింది. ఆమె షామాను కలిసి అతనియందు నమ్మకముంచి, “నాకు మా మామగారు విస్తారమైన వ్యవసాయభూమిని బహుమతిగా ఇచ్చారు. కానీ నా తండ్రి ఆ భూమిని స్వాధీనం చేసుకొని నాకు తిరిగి ఇవ్వడంలేదు. నా ఈ సమస్య గురించి నా తరపున మీరు బాబాతో మాట్లాడండి” అని విన్నవించుకుంది. అయితే, షామా ఆమెనే నేరుగా బాబాతో మాట్లాడమని చెప్పాడు. ఆ సమయంలో బాబా మసీదు గోడకు అనుకొని నిలబడి ఉన్నారు. కొద్దిసేపటి తరువాత బాబా మసీదు లోపలికి వెళ్లి తమ ఆసనంపై కూర్చున్నారు. అణ్ణా చించణీకర్ బాబా పాదాలను ఒత్తుతూ కూర్చున్నాడు. లక్ష్మీబాయి మసీదు మెట్లెక్కి పైకి వెళ్లి కూర్చుంది. కానీ ఏమీ మాట్లాడలేదు. బాబా జోగ్‌తో, “అణ్ణా కాకీ(అత్త)ని మోసం చేసి తన ఆస్తులన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టాడు. అతను నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు” అని అన్నారు. అదంతా వింటున్న అణ్ణా చించణీకర్, తాను అలాంటి పని చేయలేదని బదులిచ్చాడు. బాబా లక్ష్మీబాయి వైపు తిరిగి, “కాకీ! అతనిని తిననివ్వు; తింటున్నది అణ్ణాయే కదా! అతనిపై ఫిర్యాదు నమోదు చేయవద్దు. అల్లా నీకు తగినంత ఇస్తాడు. నీ ఇంట్లో అన్నానికి కొరత ఉండదు. నువ్వు, నేను మరియు అణ్ణా వెళ్లి నాసిక్‌లో నివాసముందాం” అని అన్నారు. అది విన్న లక్ష్మీబాయి ఆశ్చర్యపోయింది. కారణం, ఆమె తండ్రి పేరు ‘అణ్ణా’. అతను ఆమెకు సంబంధించిన వ్యవసాయభూములను మోసం చేసి తీసుకున్నందున, అతనిపై ఫిర్యాదు చేయమని చాలామంది శ్రేయోభిలాషులు ఆమెకు సలహా ఇచ్చి ఉన్నారు. కానీ ఆమె మాత్రం బాబా సలహాననుసరించి తన తండ్రిపై ఫిర్యాదు చేయకుండా ఊరుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె నర్సింగ్, ప్రసూతి వైద్యం నేర్చుకొని తద్వారా వచ్చే సంపాదనతో నాసిక్‌లో హాయిగా జీవించసాగింది.

బాబా ఆమెకు శాంతిని, సామరస్యతను ప్రసాదించారు; సబూరీని బోధించారు. ఎందుకంటే, రోజూ కోర్టు చుట్టూ తిరిగినట్లయితే ఆమె ఎంతో ఆందోళనకు గురై అనారోగ్యం పాలయ్యేది. అంతేకాదు, తోడుగా ఉంటూ ఆమె సంక్షేమాన్ని చూసుకుంటామని బాబా ఆమెకు భరోసా ఇచ్చారు.

సోర్స్: శ్రీసాయిలీల పత్రిక-1926.

సాయిభక్తుల అనుభవమాలిక 626వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. ఆరోగ్యదాత సాయి
  2. మనోవాంఛను నెరవేర్చిన బాబా

ఆరోగ్యదాత సాయి

నేను హైదరాబాద్ నుండి శ్రీమతి లక్ష్మి. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం! 2008, నవంబరు నెలలో నేను హైదరాబాదులో ఒక పెళ్ళికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా బండి మీద నుండి పడిపోవటంతో నుదుటి పైభాగంలో దెబ్బతగిలి నేను స్పృహ కోల్పోయాను. కొంతసేపటికి స్పృహ వచ్చింది గానీ, చాలా మగతగా ఉండింది. ఎలాగో తమాయించుకుని దారిలో ఒక డాక్టరుని సంప్రదించి, మందులు తీసుకుని ఇంటికి వచ్చేశాను. రెండు రోజులకి నా ఎడమకన్ను పూర్తిగా ఎర్రబడి, కమిలిపోయినట్లు అయింది. నాకు చాలా భయమేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన 'బ్రెయిన్ స్కానింగ్ తీయాలి' అన్నారు. అది వింటూనే భయంతో నా గుండె దడదడలాడింది. బాబాను తలచుకుని, "నాపై కృప చూపమ"ని ప్రార్థించాను. బాబా దయవల్ల రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది. డాక్టర్, "భయపడాల్సినంతగా ఏమీ లేదు. మందులతో తగ్గిపోతుంది" అని చెప్పారు. కొద్దిరోజుల్లో నాకు పూర్తిగా నయమైపోయింది

అయితే ఈమధ్యకాలంలో అప్పుడప్పుడు నా తలలో కొంచెం నొప్పిగా అనిపిస్తుండటం వలన పది, పన్నెండేళ్ల క్రితం జరిగిన ఆ దుర్ఘటన మళ్ళీ ఇప్పుడు ప్రభావం చూపుతుందేమోనని భయం వేసింది. అప్పుడు మన 'ఆరోగ్యదాత సాయి' మీద భారం వేసి, "నాకు ఏమీ కాకుండా చూడమ"ని ప్రార్థించాను. తరువాత మాకు తెలిసిన ఒక డాక్టరును కలిసి పరిస్థితి వివరించాను. ఆయన నన్ను పరీక్షించి, "ఏమీ లేదు, అనవసరంగా కంగారుపడవద్దు" అని ధైర్యం చెప్పారు. ఇదంతా సాయినాథుని దయ. "సాయీ! చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ. మీ భక్తులందరికీ ఎల్లప్పుడూ తోడు-నీడగా ఉంటూ రక్షణనివ్వు తండ్రీ!"

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


మనోవాంఛను నెరవేర్చిన బాబా

నా పేరు పుష్పలత. మేము హైదరాబాద్ నివాసులం. నేను గత 20 సంవత్సరాలుగా బాబానే మనసా, వాచా, కర్మణా నమ్మి కొలుస్తున్నాను. ఆయన దయతో వృత్తిరీత్యా, కుటుంబపరంగా సంతృప్తికరమైన జీవితాన్ని పొందాను. బాబా నాకు, నా కుటుంబానికి చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నేను ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. మా పెద్దమ్మాయికి ఎంసెట్ పరీక్షలో 11,043వ ర్యాంకు వచ్చింది. మా అమ్మాయిని కంప్యూటర్ సైన్సులో ఇంజనీరింగు (సి.ఎస్.ఈ) చేయించాలని మా ఆశ. కానీ జనరల్ కేటగిరీకి చెందినందువల్ల మా అమ్మాయికి వచ్చిన ర్యాంకుకు హైదరాబాదులోని టాప్ టెన్ కాలేజీలలో సి.ఎస్.ఈలో సీటు రావడం కష్టమే. అది తెలిసి కూడా మేము బాబాపై నమ్మకం ఉంచి, ఆయన మీదే భారం వేశాము. తరువాత కౌన్సిలింగ్‌లో మా అమ్మాయికి VNRVJIET (Vallurupalli Nageswara Rao Vignana Jyothi Institute of Engineering and Technology) లో EIE (Electronics and Instrumentation Engineering) సీటు వచ్చింది. అదే బాబా ప్రసాదం అనుకుని 1,31,000+12,700 రూపాయలు ఫీజు కట్టి మా అమ్మాయిని ఇంజనీరింగులో చేర్చాము. తరవాత బాబా ప్రసాదించిన అద్భుత వరాన్ని చూడండి!

అనుకోకుండా 2020, నవంబరు 19, గురువారంనాడు ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ ద్వారా జనరల్ కేటగిరిలో మా అమ్మాయికి మేము ఆశపడిన CSE (Internet of Things [IoT]) సీటు వచ్చింది. చిత్రమేమిటంటే, మా అమ్మాయితో CSE సీట్లు అయిపోయాయి. ఈ అద్భుతం కేవలం బాబా కృప వలన మాత్రమే జరిగింది. మేము మా అమ్మాయికి CSEలో సీటు వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను చేసింది ఒక్కటే, ఆరోజు గురువారంనాడు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు బాబాను మనస్ఫూర్తిగా స్మరిస్తూ, నా కోరికను వారితో చెప్పుకుని ఆపై, "నీ నిర్ణయమే మా జీవిత గమ్యమ"ని భారం ఆయన మీద వేశాను. బాబా దయతో మా అమ్మాయికి సీటు వచ్చింది. మా ఆనందానికి హద్దులు లేవు. నా ఆనందాన్ని మా అమ్మకి, అక్కకి ఫోన్ చేసి చెబితే, 'అదంతా బాబా చల్లని చూపు' అని సంతోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో బాబా అద్భుతలీలలు ఎన్నో..! ఎన్నెన్నో...!! "బాబా! మేము అనుకున్న గ్రూపులో సీటు ప్రసాదించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు".

సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 625వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా కరుణామయుడు
  2. బాబాను ప్రార్థించిన మరుసటిరోజుకి జ్వరం మాయం


బాబా కరుణామయుడు

సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనుక బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా మనతో ఉండి మన బాధ్యతలను ఎలా మోస్తున్నారో తెలియజేసే అనుభవాలను మీతో పంచుకుంటాను.

ఇటీవల మా అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. 2020, అక్టోబరు 31వ తారీఖున నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించాము. ఈ కరోనా సమయంలో నిశ్చితార్థం ఎలా జరుగుతుందోనని నేను చాలా ఆందోళనపడ్డాను. ఆ ఆందోళన వల్ల నిశ్చితార్థానికి నెలరోజుల ముందునుండి నా ఆరోగ్యం బాగలేక చాలా ఇబ్బందిపడ్డాను. బాబా మీద భారం వేసి, బాబాకు పూజ చేసుకుంటూ, నా అనారోగ్యాన్ని తగ్గించమని బాబాను కన్నీటితో ప్రార్థిస్తుండేదాన్ని. కొద్ది రోజుల తరువాత బాబా కరుణతో నాకు ఆరోగ్యం చేకూరింది.

ఇంతలో అనుకోకుండా ఒకరోజు మా అమ్మ అనారోగ్యానికి గురైంది. ఆ అనారోగ్యంతో ఒక వారంరోజుల్లోనే అమ్మ మరణించింది. అమ్మ ఇక లేదనే బాధతో నేను చాలా కృంగిపోయాను. ఒకప్రక్క అమ్మ లేదనే బాధ, ఇంకోప్రక్కన అమ్మాయి నిశ్చితార్థం. ఏమి చేయాలో తెలియక నా భారాన్నంతా బాబాపైనే వేశాను. బాబా తన బిడ్డల్ని వదలరు కదా! ప్రతి క్షణం నాకు తోడుగా ఉండి మా అమ్మాయి నిశ్చితార్థాన్ని అనుకున్న దానికన్నా వైభవంగా జరిపించారు బాబా. బాబాను నమ్ముకున్నాక అన్నీ ఆయనే చూసుకుంటారు కదా!

ఈలోపు ఇంకొక సమస్య ఎదురైంది. నేను ఒక సెమినార్ చెప్పవలసి వచ్చింది. అమ్మ పోయిన బాధలో ఉన్న నేను దేనిమీదా సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేకపోయాను. అయినప్పటికీ బాబాపై నమ్మకంతో సెమినార్ ఇవ్వడానికి అంగీకరించాను. తరువాత నేను బాబాను ప్రార్థించి, “బాబా, నాకు ఏదీ గుర్తుండటం లేదు. నువ్వే దగ్గరుండి నాతో సెమినార్ చెప్పించాలి” అని బాబాకు చెప్పుకుని, “అంతా సవ్యంగా జరిగితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. బాబా కరుణామయుడు కదా! ఆయనే దగ్గరుండి నా చేత సెమినార్ బాగా చెప్పించారు. ఇన్ని విధాలుగా నన్ను దగ్గరుండి చూసుకుంటున్న నా సాయితండ్రికి శతకోటి వందనాలు.


బాబాను ప్రార్థించిన మరుసటిరోజుకి జ్వరం మాయం

సాయిభక్తురాలు రూప తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! సాటి సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. నా పేరు రూప. నేను సాయిభక్తురాలిని. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఈమధ్య మా దగ్గరి బంధువులు వాళ్ళింట్లో జరగబోయే ఫంక్షన్‌కి మమ్మల్ని ఆహ్వానించారు. ఈ కరోనా సమయంలో ఫంక్షన్లకు వెళ్లాలంటే భయం. కానీ, వాళ్ళు మాకు ముఖ్యమైనవాళ్ళు. కనుక మా కుటుంబసభ్యులందరం ఆ ఫంక్షన్‌కి వెళ్ళాము. ఫంక్షన్ నించి ఇంటికి వచ్చిన మరుసటిరోజునించి మా అమ్మ తనకు కొద్దిగా జ్వరంగా ఉందనీ, గొంతునొప్పి కూడా ఉందనీ అన్నది. నాకు చాలా భయం వేసింది. అనవసరంగా ఫంక్షన్‌కి వెళ్ళామనిపించింది. ఒకప్పుడు మేము అవసరంలో ఉన్నప్పుడు వాళ్లు మాకు సహాయం చేశారు. అందుకే మేము వెళ్ళక తప్పలేదు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మా అమ్మకి జ్వరం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోవాలి” అని ప్రార్థించాను. బాబాను ప్రార్థించిన మరుసటిరోజుకల్లా తనకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని, గొంతునొప్పి మాత్రం కొద్దిగా ఉందని అమ్మ చెప్పింది. బాబా దయవల్ల అది కూడా త్వరగానే తగ్గిపోతుంది.

“బాబా! మీకు శతకోటి వందనాలు. మా అందరి ఆరోగ్య పరిస్థితి బాగుండేలా అనుగ్రహించండి తండ్రీ! అమ్మకి వేరే ఆరోగ్య సమస్య కూడా వుంది. అది నీకు తెలుసు. అమ్మ మిమ్మల్నే నమ్ముకుని హోమియోపతి మందులు వేసుకుంటోంది. అమ్మకు త్వరగా నయం చేయి తండ్రీ! మీ అనుగ్రహంతో అమ్మ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆ అనుభవాన్ని కూడా నా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను. ‘సాయీ’ అని పిలిస్తే పలికే తండ్రివి నువ్వు. సదా మమ్మల్ని రక్షించు తండ్రీ! మాకు తోడు నీడగా ఉండు తండ్రీ! మేమేమైనా తప్పులు చేస్తే అమ్మలా క్షమించు తండ్రీ! సదా నీ భక్తులను కాపాడు తండ్రీ!”

బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవంతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై సాయిరామ్!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo