సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2019వ భాగం...


ఈ భాగంలో అనుభవం:
  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 35వ భాగం

నా పేరు సాయిబాబు. నాకు అయ్యప్పస్వామి ప్రసాదం అంటే ఇష్టం. ఆంధ్రాలో ఉంటే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు అయ్యప్ప ప్రసాదం తెచ్చి నాకు ఇస్తుంటారు. కానీ 2024లో నేను బెంగళూరులోని మా అమ్మాయి వాళ్ళింటిలో ఉన్నాను. అందువల్ల ఆ సంవత్సరం నాకు అయ్యప్ప ప్రసాదం లభించలేదు. మా అమ్మాయివాళ్ళకి పాలుపోసే అతను అయ్యప్పమాల వేసుకున్నప్పటికీ నేను అతన్ని ప్రసాదం కావాలని అడగలేకపోయాను. బాబా మనసులోని మాట గ్రహించి అది నెరవేరుస్తారు కదా! మేము డిసెంబర్ నెలలో శిరిడీ వెళ్దామని బస్సు టికెట్లు బుక్ చేసుకున్నాము. మా ప్రయాణానికి ముందురోజు మేము అడగకుండానే తెలిసినవాళ్లు అయ్యప్పస్వామి ప్రసాదం తెచ్చి ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. మేము శిరిడీకి వెళ్లొచ్చిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుందామని సీల్ ఓపెన్ చేయకుండా బాబా దగ్గర పెట్టి, ఇంటికి తాళాలు వేసి శిరిడీ వెళ్ళాము. 4 రోజుల తర్వాత తిరిగి వచ్చాము. మేము తలుపు తెరవగానే బాబా దగ్గరున్న అయ్యప్ప ప్రసాదం సీల్ ఓపెన్ చేసి మూత పక్కన పెట్టి ఉండటం చూసి ఆశ్చర్యపోయాము. తలుపులు, కిటికీలు మొత్తం అన్నీ మూసి ఉన్నందున బాబానే మూత తీసి ప్రసాదం స్వీకరించారని ఆనందించాము. అదీ బాబా లీల.


బాబా అనుగ్రహంతో 2025, మే 1న శిరిడీలో బాబా చరణల వద్ద నేను, నా కుటుంబం శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాము. మేము శిరిడీ వెళ్ళినప్పటినుండి బాబా సమయానికి మాకన్నీ సమకూరుస్తున్నారు. ఉదాహరణకు గ్యాస్ కనెక్షన్, ఆధార్‌లో చిరునామా మార్పు, బ్యాంకు అకౌంట్ మొదలైనవి. ఊదీ వితరణ సేవ కూడా లభించింది. అంతేకాకుండా బాబా దయవల్ల మా మనవడికి అక్కడ మంచి కాలేజీలో సీటు వచ్చింది. మామూలుగా బెంగళూరు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకు ఒక సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండగా శిరిడీకి దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీవాళ్ళు మావాడి మెరిట్ చూసి ప్రవేశ పరీక్ష పెట్టి, అందులో తనకి మంచి మార్కులు రావడంతో సంవత్సరానికి నామమాత్రం ఫీజుతో సీటు ఇచ్చారు. అది మామూలు కాలేజీ కాదు. వందకు పైగా బస్సులు, అన్ని కోర్సులు ఉన్న యూనివర్సిటీ. ఇదంతా బాబా దయ. ఆయనకు మా కుటుంబం మీద ఉన్న ఆపారమైన కరుణాకటాక్షాలు.

శిరిడీ వచ్చినప్పటినుండి నేను ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో బాబా దర్శనానికి వెళుతున్నాను. ఒకరోజు నేను ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబా ముందు కొన్ని పూలు ఉన్నాయి. వాటిలో నుండి కొన్ని మల్లెపూలు నా ముందున్న వ్యక్తికి పూజారి ఇచ్చారు. కానీ నేను అడిగితే ఇవ్వలేదు. అంతలో వేరే అతను బాబా వద్దనున్న పెద్ద బంతిపువ్వు నా చేతికి ఇచ్చారు. అది బాబా అనుగ్రహం.


ఒకరోజు నేను, మా అమ్మాయి ఇంట్లో బాబాకి నైవేద్యం తయారు చేసి మధ్యాహ్న హారతి సమయంలో బాబాకి నైవేద్యం సమర్పించే వేళకి ద్వారకామాయికి వెళ్లి బాబాకి నివేదించాము. హారతికి అక్కడే ఉండి హారతి అనంతరం ప్రసాదం భక్తులకి పంచాము. ఆ సమయంలో వేరే వాళ్ళు కూడా ప్రసాదం పంపిణి చేసారు. నేను వాళ్ళు పంచుతున్నది కేసరి అనుకున్నాను. కానీ తీరా నా చేయి చెపితే, వాళ్ళు ఇచ్చింది కేసరి కాదు, కిచిడి. తర్వాత బయటకు వస్తే, అక్కడ ఇంకొకరు ప్రసాదం పంచుతున్నారు. చూస్తే, అది కేసరి. బాబా మన మనసు గ్రహిస్తారు కదా!


మా మనవడి ఆధార్ కార్డులో అడ్రస్ శిరిడీగా మార్చుకున్నందున మేము ప్రతిరోజూ సామాన్య భక్తులు వెళ్లే క్యూలైన్ గుండా కాకుండా శిరిడీ స్థానిక భక్తుల లైన్లో నేరుగా బాబా దర్శనానికి వెళుతున్నాము. అయితే 2025, జూన్ మొదటి వారంలో ఒకరోజు నేను, మా మనవడు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న సెక్యూరిటీ నా ఆధార్ కార్డు చూసి, అందులో శిరిడీ అడ్రెస్స్ కాకుండా వేరే అడ్రస్ ఉన్నందున ససేమిరా లోపలికి పంపనని అన్నాడు. అప్పుడు చేసేదిలేక ముందు ద్వారకమాయిలో దర్శనం చేసుకుని తర్వాత ముఖదర్శనంకి వెళ్ళాము. అక్కడ నేను బాబాని చూస్తూ, "బాబా! ప్రతిరోజూ నేరుగా నీ దర్శనం ఇస్తున్నావు. మరి ఈరోజు ఎందుకు ఇవ్వటం లేదు. నన్ను లోపలికి అనుమతించు బాబా" అని మనసులో అనుకున్నాను. తర్వాత బయటికి వెళ్లి చూస్తే, మునుపు నన్ను లోపలికి పంపనన్న సెక్యూరిటీ స్థానంలో వేరొక సెక్యూరిటీ ఉన్నారు. మేము వెళ్లి నా మనవడి ఆధార్ కార్డు చూపిస్తే, అతను మమ్మల్ని లోపలికి అనుమతించాడు. సంతోషంగా మందిరంలో బాబా దర్శనం చేసుకుని పది నిమిషాల్లో బయటకు వచ్చాము. అప్పుడు చూస్తే, కొత్త సెక్యూరిటీ అతని స్థానంలో నన్ను లోపలికి పంపని సెక్యూరిటీనే ఉన్నాడు. అంటే, బాబా నా మనసులోని మాట విని మాకు తమ దర్శన భాగ్యం కలిగించారు.


ఒక గురువారం ఉదయం నేను ఒక్కడినే బాబా దర్శనానికి వెళ్తున్నప్పుడు చాలా జనం ఉన్నారు. నేను మందిరం దగ్గరకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక కాషాయ వస్త్రధారి ఐన సాధువు నన్ను పిలుస్తూ నావైపు రాసాగాడు. అతను మామూలు సాధువులా కాక వేరుగా కనిపించాడు. అతను నన్ను రెండుసార్లు పిలిచినా నేను వినిపించుకోక వేగంగా మందిరంలోకి వెళ్ళిపోయాను. గురుస్థానం, ముఖదర్శనము, ద్వారకమాయి, చావడి దర్శించుకొని మధ్యాహ్న హారతి అక్కడున్న టీవీలో చూశాను. ఆరతి అనంతరం నాకు బాబా తీర్థ, ప్రసాదాలు లభించాయి. సాయంత్రం వరకు మందిరంలో ఉండి ఇంటికి వచ్చేసాను. మర్నాడు ఫేస్బుక్‌లో 'నేను నిన్ను ఒక కాషాయ వస్త్రం ధరించిన సాధువు రూపంలో కలుస్తాన'న్న సారాంశంతో ఒక మెసేజ్ వచ్చింది. తద్వారా నిన్న ఆ సాధువు రూపంలో వచ్చిన నన్ను మిస్ అయ్యావు, మళ్లీ కలుస్తాను గుర్తుంచుకో! అని బాబా నాకు సెలవిచ్చారు. లా అంటాయి బాబా లీలలు. ఒక పట్టాన అర్థం కావు. మనం జాగ్రత్తగా ఉండాలి.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo