సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 665వ భాగం.....



ఈ భాగంలో అనుభవాల:

  1. గర్భం దాల్చినప్పటినుండి పాపపై వర్షిస్తున్న బాబా అనుగ్రహం
  2. సమయానికి పెన్షన్ డబ్బు అందేలా చేసి ఆదుకున్న బాబా

గర్భం దాల్చినప్పటినుండి పాపపై వర్షిస్తున్న బాబా అనుగ్రహం


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రేవతి. 2013 నుండి నేను బాబాకు అంకిత భక్తురాలిగా మారాను. చిన్నప్పటినుండి అందరి దేవుళ్ళతోపాటు బాబాను పూజించినప్పటికీ, పూర్తి సాయిభక్తురాలిగా మారింది మాత్రం 2013లోనే. 2013లో నేను గర్భవతిగా ఉన్నప్పుడు ప్రారంభదశలోనే కొన్ని సమస్యలు వచ్చాయి. డాక్టర్ వద్దకు వెళ్ళి చూపించుకుంటే, “నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం ఇంజక్షన్స్ చేయించుకుంటేనే గర్భం నిలుస్తుంది” అన్నారు. మొదటి ఇంజక్షన్ హాస్పిటల్లోనే వేశారు. అది చర్మానికి వేసే ఇంజక్షన్. నొప్పి భరించలేకపోయాను. నా బాధను చూసిన నా భర్త, “ఒక్క ఇంజక్షన్‌కే ఇలా ఉంటే నెలరోజుల పాటు రెండు పూటలా ఇలా ఇంజక్షన్స్ వేస్తే, నువ్వు భరించలేవు. ఎలా జరిగితే అలా జరగనీ, భగవంతునిదే భారం” అన్నారు. నేను బాబా వద్దకు వెళ్ళి, “బాబా! నేను ఇంజక్షన్ వేయించుకోలేను. ఇంజక్షన్ బదులు రెండుపూటలా మీ ఊదీతీర్థాన్ని త్రాగుతాను. మీదే భారం తండ్రీ!” అని చెప్పుకుని, నెలరోజులపాటు రెండుపూటలా బాబా ఊదీ కలిపిన నీళ్ళు త్రాగాను. నెలరోజుల తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టరుకి చూపించుకుంటే, ‘బేబీ నార్మల్‌గా ఉందనీ, ఇక ఆ ఇంజక్షన్ చేయాల్సిన అవసరం లేద’నీ చెప్పారు. ఇదంతా సాయి కృప కాక మరేంటి? నా బాబానే నా బిడ్డను కాపాడారు. అప్పటినుండి డెలివరీ అయ్యేవరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బాబా ఊదీ కలిపిన నీళ్ళు త్రాగుతూ ఉండేదాన్ని. మధ్యమధ్యలో నాకు ఆరోగ్య సమస్యలు వచ్చినా బేబీ మాత్రం నార్మల్‌గా ఉందనే రిపోర్టు వచ్చేది. కానీ డాక్టర్ నాకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయినిని. అందువల్ల నేను సెలవుల గురించి భయపడితే బాబా సెలవులు కూడా మంజూరయ్యేలా చేశారు. ఎలక్షన్ డ్యూటీని కూడా రద్దయ్యేలా చేశారు. ఈ విధంగా నేను గర్భవతిగా ఉన్నప్పుడు నాకు ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా వచ్చిన అన్ని సమస్యలనూ బాబా పరిష్కరించారు. డాక్టరు సీజేరియన్ తప్పనిసరని 2014, మే 30, శుక్రవారం చేయడానికి నిశ్చయించారు. అయితే బాబా దయవల్ల ఒకరోజు ముందే మే 29, గురువారంనాడు తెల్లవారుజామూన నొప్పులు మొదలై ఉదయం 9:10కి చక్కటి పాప పుట్టింది. తనకి బాబా పేరు కలిసొచ్చేలా ‘విద్యాసాయిశ్రీ’ అని పేరు పెట్టుకున్నాము. మా పాప కూడా బాబాను బాగా నమ్ముతుంది. తనకు 2 సంవత్సరాల వయస్సున్నప్పుడు మేము మొదటిసారి శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాము. మా పాప టీవీలో ప్రసారమయ్యే ‘సద్గురు సాయి’ సీరియల్ చూసి, “మమ్మీ! మనం శిరిడీ వెళదామా? ద్వారకామాయిలో కూర్చుందామా? ఎప్పుడు వెళ్ళి బాబాని చూద్దాం?” అని అడుగుతుంటుంది. “బాబా పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు శిరిడీ వెళ్ళగలమ”ని తనకు చెప్తాను. పాప పుట్టినప్పటినుండి తనకు ఎక్కిళ్ళు బాగా వస్తుండేవి. ఈ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. అది చిన్న సమస్యే కదా అని మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకసారి నేను బాబా ముందు కూర్చుని, “బాబా! మా పాప ఎక్కిళ్ళ సమస్య తీరిపోవాల"ని వేడుకున్నాను. అలా నేను వేడుకున్న పదినిమిషాల నుండి బాబా దయవల్ల పాప ఎక్కిళ్ళ సమస్య పూర్తిగా తీరిపోయింది. ఇప్పటివరకు ఆ సమస్య మళ్ళీ రాలేదు. అలాగే మా పాపకి వచ్చిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలని బాబానే పరిష్కరించారు. “ధన్యవాదాలు బాబా! మీ కృప అందరిపై ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను”.


సమయానికి పెన్షన్ డబ్బు అందేలా చేసి ఆదుకున్న బాబా


నేను బాబాకు అంకిత భక్తురాలిని. 2019 నుండి నేను మహాపారాయణలో సభ్యురాలిని. ముందుగా బాబాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తీవ్రమైన ఆర్థిక సమస్యల నుండి బాబా మమ్మల్ని కాపాడారు. ఆ అందమైన అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. నా భర్త ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు ప్రభుత్వం నుండి పెన్షన్‌కి సంబంధించి కొన్ని బకాయిలు రావాల్సి ఉన్నాయి. అందుకోసం ఆయన అన్నివిధాలా లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అనుకున్న సమయంలో ఎటువంటి ఫలితమూ కనిపించలేదు. అందుకు కరోనా మహమ్మారి కూడా ఒక కారణం. ఒకప్రక్క మేము ఈ బాధలో ఉంటే, మరోప్రక్క వృత్తిరీత్యా డాక్టరైన మా అమ్మాయి కరోనా మహమ్మారి కారణంగా ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అవి చాలదన్నట్టు మావారు కరోనా బారినపడ్డారు. తరువాత 3 రోజులకి నాకు కూడా కరోనా రావడంతో ఇద్దరమూ హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అసలే పెన్షన్ బకాయలు చేతికందక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మేము హాస్పిటల్ బిల్లులు ఎలా కట్టాలా అని చాలా ఆందోళన చెందాము. బాబా కృపతో మా దగ్గరి బంధువులు మా హాస్పిటల్ బిల్లులు కట్టడానికి ముందుకొచ్చారు. కానీ, ఎప్పటికప్పుడు ఆఫీసువాళ్లతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ రావాల్సిన పెన్షన్ బకాయిలు రాకపోవడంతో మావారి మనసంతా దిగులుగా ఉంటుండేది. బాబాకు అంకిత భక్తురాలినైన నేను మాత్రం ఆశ వదులుకోకుండా విశ్వాసంతో బాబాను సదా ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 2020, డిసెంబరు 24, గురువారంనాడు నేను మహాపారాయణలో భాగంగా సచ్చరిత్రలో నాకు కేటాయించిన 28, 29 అధ్యాయాలు పారాయణ చేస్తూ, "బాబా! ఈ క్లిష్ట సమయంలో నేను మిమ్మల్నే గట్టిగా పట్టుకున్నాను. మీరు కూడా నన్ను గట్టిగా పట్టుకోండి. కరోనా కారణంగా ఈ హాస్పిటల్ మంచంపై పడివుండి కూడా నేను మీ పారాయణ చేస్తుండటం మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి మాకు సహాయం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా అద్భుతం చేశారు. అదేరోజు మావారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. మధ్యాహ్నం గం.2.30ని.లకి, 'మీకు రావాల్సిన బకాయిల సమస్య పరిష్కారమైంద'ని ఆఫీసు నుండి, ‘అకౌంటులో డబ్బు జమ అయింద’ని బ్యాంకు నుండి మావారికి మెసేజ్లు వచ్చాయి. వెంటనే మావారు నాతో, "రావాల్సిన డబ్బంతా నేరుగా బ్యాంకు అకౌంటులో జమ అయ్యింద"ని చెప్పి, అకౌంటు నాకు చూపించారు. ఇంకా ఆయన నాతో, "ఏ చింతా పెట్టుకోకు. ఎప్పటినుండో రావాల్సిన డబ్బంతా మనకి వచ్చేసింది. కాబట్టి నువ్వు డిశ్చార్జ్ అయ్యే సమయానికి నీ హాస్పిటల్ బిల్లు నేను చెల్లించగలను" అని ఆనందంగా చెప్పారు. అంత క్లిష్ట పరిస్థితిలో బాబా ఈ విధంగా మమ్మల్ని ఆదుకున్నారు. బాబాకు కృతజ్ఞతలు తెలపడానికి నా వద్ద పదాలు లేవు. ఇదంతా స్థిరమైన విశ్వాసంతో అవిశ్రాంతంగా నేను బాబాకు చేసిన ప్రార్థనల వల్లనే సాధ్యమైంది.



సాయిభక్తుల అనుభవమాలిక 664వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. భారం బాబా మీద వేస్తే, అంతా ఆయన చూసుకుంటారు
  2. ఎంత చెప్పినా బాబా ప్రేమ ముందు అన్నీ తక్కువే!

భారం బాబా మీద వేస్తే, అంతా ఆయన చూసుకుంటారు


సాయిభక్తురాలు అంజలి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


నమస్తే! నా పేరు అంజలి. ముందుగా బాబాకు వేలవేల ప్రణామాలు. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. ఈమధ్య నాకు కలిగిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.


2020, డిసెంబరు నెల చివరిలో నా ఎడమకాలు బాగా నొప్పి పెట్టింది. బాబా ఊదీ రాసుకొని, "నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నొప్పి తగ్గింది. అయినప్పటికీ ఒక మూడుసార్లు బాబా ఊదీ కలిపిన నీళ్లు త్రాగాను. ఆ తర్వాత మా స్వస్థలానికి వెళ్లి చాలా హుషారుగా తిరిగాను. అప్పుడే నా అనుభావాన్ని బ్లాగులో పంచుకుందామనుకున్నానుగానీ, ఆలస్యమైంది. అంతలో మరలా ఆ నొప్పి మొదలయింది. "మీ బిడ్డను క్షమించండి బాబా. బ్లాగులో పంచుకుంటానని మాటిచ్చి వెంటనే పంచుకోలేదు. నన్ను క్షమించు బాబా. ఈ దీనురాలికి నీవే దిక్కు. నన్ను, నా కుటుంబాన్ని, ఇంకా అందరినీ చల్లగా చూడు తండ్రీ!"


మరో అనుభవం:


నేను ఇంతకుముందు పంచుకున్న ఒక అనుభవంలో బాబా నాతో శ్రీశైల దర్శనం ఎలా చేయించారో పంచుకున్నాను. నాకు డిసెంబరు 8న శ్రీశైలం వెళ్లాలని ఉన్నప్పటికీ డిసెంబరు 7నే వెళ్లేలా బాబా చేశారు. 'బాబా ఎందుకలా చేశారు? ఆయన ప్రణాళిక ఏదో ఉండే ఉంటుంది' అనుకొని అంతా ఆయనకే వదిలేసి డిసెంబరు 7న శ్రీశైలం వెళ్లి, దర్శనానంతరం అదేరోజు రాత్రి తిరిగి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక డిసెంబరు 8న భారత్ బంద్ అని మాకు తెలిసింది. మేముండే ప్రాంతంలో బంద్ చాలా స్ట్రిక్ట్‌గా జరిగింది. దాదాపు సాయంత్రం వరకు రోడ్లు, హైవేలు అన్నీ బ్లాక్ అయ్యాయి. మా ఇంటి నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఆఫీసుకి కూడా నేను వెళ్లలేకపోయాను. మేము ఆరోజు శ్రీశైలం ప్రయాణం పెట్టుకునుంటే చాలా ఇబ్బందిపడేవాళ్లం. అందుకే బాబా మేము ముందురోజే శ్రీశైలం వెళ్లేలా చేశారు. భారం బాబా మీద వేస్తే, అంతా ఆయన చూసుకుంటారు. "ఈ అనుభవం కూడా పంచుకోవడం ఆలస్యమైంది. నన్ను క్షమించండి బాబా!"


ఇంకో చిన్న అనుభవం:


2020 డిసెంబరు నెల చివరివారంలో మావారికి, మా అబ్బాయికి జ్వరం వచ్చింది. నేను బాబాను తలచుకొని, "తెల్లవారేసరికి ఇద్దరికీ జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాను. తరువాత వాళ్ళిద్దరికీ మందులతో పాటు బాబా ఊదీ ఇచ్చాను. బాబా దయవల్ల ఇద్దరికీ తెల్లవారేసరికి పూర్తిగా నయమైంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు". బాబా ప్రసాదించిన మరో అనుభవంతో మరలా మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఓం సాయిరామ్!


ఎంత చెప్పినా బాబా ప్రేమ ముందు అన్నీ తక్కువే!


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తమకు ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి అభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు వందనాలు. కరోనా కారణంగా ఏ ఇబ్బందీ లేకుండా మేమంతా ఇండియా వస్తే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. బాబాకి పని అప్పజెప్పితే ఇక మనకు భయమేల? బాబా ఆజ్ఞతో అన్నీ చక్కగా జరిగాయి. ఎయిర్‌పోర్టులో మాకు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు. మేము క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా, కస్టమ్స్‌కు సంబంధించిన ఇబ్బందులు ఏమీ ఎదురవకుండా సమయానికి అన్నీ బాబానే చూసుకున్నారు. ఇంటికి వచ్చిన తరువాత మా మనవడితో సహా అందరం సాయి రక్షణలో ఆరోగ్యంగా ఉన్నాము. ఫ్లైట్‌లో అయితే మాకు రాజభోగాలే. పన్నెడుమంది ఉండవలసిన ఒక బ్లాక్ మొత్తం మేము అయిదుగురం మాత్రమే ఉన్నాము. మేము ఉన్నది ఒక ప్రత్యేక కూపే, మాకు ఆతిథ్యమివ్వడానికి నలుగురు ఎయిర్ హోస్టెస్‌లు. ఇవన్నీ బాబా ఏర్పాట్లే. ఎంత చెప్పినా, ఎన్ని వ్రాసినా బాబా ప్రేమ ముందు అన్నీ తక్కువే. “బాబా! నేను ఏమైనా మర్చిపోతే నన్ను క్షమించు. ఏదైనా పంచుకోవాలనుకుని మర్చిపోయినా నీదే భారం బాబా!”


బాబా దయతో మా అబ్బాయి గ్రీన్ కార్డు ఫింగర్ ప్రింట్స్ కూడా అప్రూవ్ అయ్యాయి. చిన్నబ్బాయికి, కోడలికి బాబా దయతో వీసా స్టాంపింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టాంపింగ్ వేసేది కూడా బాబానే. ఇంతకుముందు మాకు కొంతమంది పొలాలు, స్థలాలు, ఫ్లాట్లు, డబ్బు బాకీ ఉన్నారని పంచుకున్నాను కదా! బాబా దయవలన వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే బాకీ తీర్చడానికి సిద్ధపడుతున్నారు. బాబా ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాను. 


త్వరలోనే మమ్మల్నందరినీ శిరిడీ రప్పించుకుని తమ దర్శనాన్ని అనుగ్రహించమని బాబాను మనసారా వేడుకుంటున్నాను. తిరుపతి, గాణ్గాపురం మొదలైన పుణ్యక్షేత్రాల దర్శనం కూడా ప్రసాదించమని బాబాను కోరుకుంటూ..


ఇట్లు..

బాబా పాదసేవకురాలు.



సాయిభక్తుల అనుభవమాలిక 663వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. భక్తులకోసం సిద్ధంగా వేచివున్న బాబా
  2. మనస్ఫూర్తిగా అడిగితే, నెరవేరుస్తారు నా సాయితండ్రి

భక్తులకోసం సిద్ధంగా వేచివున్న బాబా


నా పేరు మాధవి. నేను భువనేశ్వర్ నివాసిని. 2021, క్రొత్త సంవత్సరం తొలిరోజే బాబా నాకొక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చారు. దాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.


మా ఇంటిలో ఒక చిన్న బాబా విగ్రహం ఉండేది. ఆ మూర్తికే నేను ప్రతిరోజూ పూజ చేస్తుందేదాన్ని. సంబల్పూరులో నాకు తెలిసిన ఒక సాయిభక్తురాలికి ఆ బాబా విగ్రహం ఎంతగానో నచ్చి, "నాకు ఆ బాబా కావాలి" అని ప్రతిరోజూ నన్ను అడుగుతుండేది. ‘నేను పూజించుకునే బాబాని ఎలా ఇస్తాన’ని చెప్పినప్పటికీ తను, "మేడం, నాకు ఆ బాబానే కావాలి" అంటుండేది. తను కొనుక్కోవాలంటే బాబా విగ్రహాలు దొరుకుతాయి. కానీ, తనకు నా చేతుల మీదుగా బాబా కావాలి, అది కూడా మా ఇంటిలోని బాబానే కావాలి. ఎందుకంటే, మా బాబా తనను అంతగా ఆకర్షించారు. తను చాలా మంచి భక్తురాలు. తనకు బాబాపట్ల చాలా ప్రేమ. ఆ ప్రేమను చూసే చివరికి ఒకరోజు నేను తనతో, "సరే, మా ఇంట్లో ఉండే బాబా విగ్రహం నీకు ఇస్తాను. కానీ, శిరిడీ నుంచి క్రొత్త బాబా విగ్రహం నాకు వచ్చేవరకు ఇవ్వను. వచ్చాక మాత్రం తప్పకుండా ఇస్తాను" అని చెప్పాను. అందుకు తను అంగీకరించి, ప్రతి నిత్యం బాబాను త్వరగా రమ్మని ప్రార్థిస్తుండేది. ఇలా రోజులు గడుస్తుండగా 2020, డిసెంబరు 28న భువనేశ్వర్ నుండి నాకు తెలిసిన ఒక కుటుంబం శిరిడీ వెళ్తుంటే, "నాకోసం ఒక బాబా విగ్రహం తెస్తారా?" అని అడిగాను. వాళ్ళు ‘సరే, ప్రయత్నిస్తామ’న్నారు. వాళ్ళు డిసెంబరు 29న శిరిడీ చేరుకున్నారు. మూడురోజులు గడిచినా వాళ్ళనుండి నాకు ఏ ఫోనూ రాలేదు. ఆలోగా సంబల్పూరు భక్తురాలు తన ఆరాటం కొద్దీ, "శిరిడీ వెళ్లినవాళ్ళు బాబా విగ్రహం తీసుకున్నారా?" అని పదేపదే అడుగుతుండేది. నేను తనతో, "ఏమో తెలియదు. బాబా ఇష్టం, ఆయన రాదలుచుకుంటే వస్తారు" అని చెప్పాను.


2021, జనవరి ఒకటి, క్రొత్త సంవత్సరం ప్రారంభమైన తొలిరోజు సాయంత్రం భువనేశ్వర్ నుంచి వెళ్లినవాళ్ళు బాబా దర్శనం చేసుకున్న తరువాత ఒక షాపుకు వెళ్లారు. ఆ షాపతను, "మీకోసం ఒక బాబా విగ్రహం సిద్ధంగా ఉంచాము, తీసుకోండి" అంటూ వాళ్ళను ఆహ్వానించాడు. అది విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెళ్లి చూస్తే, ఆ బాబా మూర్తి ఎంతో అందంగా ఉంది. వెంటనే అతను నాకు వీడియో కాల్ చేసి విషయం చెప్పి, బాబాను చూపించారు. నిజంగానే బాబా ఎంతో బాగున్నారు. వాళ్ళు ఆ బాబాను నాకోసం తీసుకున్నారు.


తరువాత అతని భార్య, "అందరికోసం బాబా విగ్రహం తీసుకుంటారుగానీ మనకోసం మాత్రం ఎప్పుడూ తీసుకోరు. మనకోసం ఒక బాబా విగ్రహం తీసుకోండి" అని అతన్ని అడిగింది. అంతలోనే అతనికొక ఫోన్ వచ్చింది. అతను ఫోన్ లిఫ్ట్ చేస్తే, "మీకోసం మేము ఒక బాబా విగ్రహం సిద్ధంగా ఉంచాము, వచ్చి తీసుకెళ్లండి" అని అవతలివ్యక్తి చెప్పాడట. ఇతను ఆశ్చర్యపోతూనే, "అసలు మీరెవరు? మాకోసం బాబా విగ్రహం సిద్ధంగా ఉండటమేంటి?" అని అడిగాడు. అవతలి వ్యక్తి "నేను ఎవరో మీకు తెలియదుగానీ, నేను మీ ఫోన్ నెంబరు హోటల్లో తీసుకుని మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు సంస్థాన్ 4వ నెంబరు గేటుకి దగ్గరగా ఉండే మా ఇంటికి రండి" అని చెప్పాడు. సరేనని విషయమేంటో తెలుసుకుందామని వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళను వివరాలడిగితే, అతనిలా చెప్పాడు: "మా అమ్మగారు గత 50 సంవత్సరాలుగా సంస్థాన్‌లో పనిచేస్తున్నారు. ఆమె సేవకు గుర్తింపుగా 2018 శతాబ్ది ఉత్సవాలలో ఒక బాబా మూర్తిని సంస్థాన్ వాళ్ళు మా అమ్మకు కానుకగా ఇచ్చారు. అది మీకివ్వాలని అమ్మ చెబితే, మీకు ఫోన్ చేసి రమ్మన్నాను" అని. అది విన్న వీళ్ళు, "అసలు మీరు బాబా విగ్రహాన్ని మాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు?" అని అడిగారు. అందుకు ఆ పెద్దావిడ, "రాత్రంతా బాబా, 'ఈ విగ్రహాన్ని మీకు ఇవ్వమని, నేను అక్కడికి వెళ్తాన'ని చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని పిలిపించమని మా అబ్బాయితో చెప్పాను. అందుకు మా అబ్బాయి, 'ఇన్నాళ్ళ నీ సాయిసేవకు గుర్తింపుగా నీకు ఇచ్చిన విగ్రహాన్ని, పైగా నువ్వు పూజిస్తున్న విగ్రహాన్ని ఇచ్చేస్తావా అమ్మా?' అని అడిగాడు. నేను, 'బాబా ఇవ్వమని, అక్కడికి వెళ్తానని చెప్తున్నారు', అందుకే వాళ్ళకి ఈ బాబాని ఇస్తున్నానని అన్నాను" అని చెప్పారు. అది విన్న వీళ్ళు ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు. తరువాత ఆ విగ్రహాన్ని తీసుకుని మరుసటిరోజు భువనేశ్వర్ చేరుకున్నారు.


ఇంటికి చేరుకున్నాక నాకోసం తెచ్చిన బాబా విగ్రహాన్ని నాకు ఇచ్చారు. సంకష్ట చతుర్థి రోజు బాబా నా ఇంటిలో అడుగుపెట్టారు. ఇక నా కష్టాలన్నీ బాబా తీరుస్తారని విశ్వసిస్తున్నాను. ఇకపోతే సంబల్పూరువాళ్ళు మా ఇంటికి వచ్చి బాబా విగ్రహాన్ని తీసుకొని వెళ్లడానికి మూడురోజుల ముందు ఆ భక్తురాలకి బాబా కలలో కనిపించి, "నేను మీ ఇంటికి వస్తున్నాను" అని చెప్పారు. ఈవిధంగా సంబల్పూరులోని భక్తురాలికి ఇష్టమైన మా ఇంటిలోని బాబా అక్కడికి వెళ్లారు. క్రొత్తది, పెద్దది అయిన మూర్తి రూపంలో బాబా నాకోసం శిరిడీ నుండి వచ్చారు. ఆ బాబాను తెచ్చిన వాళ్లకు బాబా స్వయంగా వచ్చారు. ఎంత లీల చూడండి. అందుకే బాబా లీలలు వర్ణించనలవికానివి.

శిరిడీ నుండి మా ఇంటికి వచ్చిన బాబా మూర్తి


మనస్ఫూర్తిగా అడిగితే, నెరవేరుస్తారు నా సాయితండ్రి


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉమ. నేను బాబా భక్తురాలిని. మేము దుబాయిలో నివసిస్తున్నాము. మా పెద్ద కొడుకు, కోడలు వాంకోవర్ సిటీలో ఉంటారు. 2021, జనవరి తొలివారాల్లో మా కోడలికి ప్రసవ సమయం ఉందనగా అందుకు కొద్దిరోజుల ముందు ఇండియా నుండి వాళ్ళ అమ్మగారు పుట్టబోయే పాపకోసం బట్టలు, మా కోడలికోసం చీరలు, పచ్చళ్ళు, కొన్ని తినుబండారాలు కొరియరులో పంపించారు. 2020, డిసెంబరు 29న పార్సెల్ డెలివరీ చేయడానికి కొరియర్ బాయ్ మా కోడలికి ఫోన్ చేశాడు. అయితే, ఏదో కారణం చేత మా కోడలు ఆ సమయంలో ఫోన్ చూసుకోలేదు. తరువాత చూసుకుని తను ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా కోడలు మరోసారి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు, "మీ పార్సెల్ గోడౌన్లో ఉంది, చూస్తామ"ని చెప్పారు. మా కోడలు రోజూ కొరియర్ వాళ్లకు ఫోన్ చేస్తుంటే వాళ్లు అదే సమాధానం చెప్తూ ఉండేవారు. ఇలా 2021, జనవరి 5వ తారీఖు వరకు జరిగింది. ఆరోజు మా కోడలు నాకు ఫోన్ చేసి, "అత్తమ్మా! అమ్మ పంపించిన పార్సెల్ ఇంకా నాకు అందలేదు. అందులో, పుట్టబోయే పాపకోసం బట్టలు, నాకోసం చీరలు పంపింది అమ్మ. నావి లేకున్నా పరవాలేదుగానీ, పాపవి మిస్ అవుతున్నాయని దిగులుగా ఉంది" అని చెప్పి చాలా బాధపడింది. అప్పుడు నేను తనతో, "అలా ఏమీ జరగదు, రేపటికల్లా పార్సెల్ తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఆందోళనచెందకు" అని తనను ఓదార్చాను. తరువాత నా సాయితండ్రిని మనసులో తలచుకుని, "బాబా! ఆ పార్సెల్ ఎక్కడున్నా మాకు అందించవయ్యా" అని వేడుకున్నాను. అదేరోజు రాత్రి మా కోడలు, "అత్తమ్మా, పార్సెల్ వచ్చింద"ని మెసేజ్ పెట్టింది. అది చూసి నేను సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ప్రతి విషయంలోనూ నేను బాబాను తలచుకుని మనస్ఫూర్తిగా అడిగితే నా సాయితండ్రి నెరవేరుస్తున్నారు. "మేరే బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. కృపతో ఎల్లప్పుడూ నాతో ఉండండి. ఏ విషయంలో అయినా మీరే ముందుండి నడిపించండి. మేరే బాబా! నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. మీరే మాకు దిక్కు తండ్రీ!"



సాయిభక్తుల అనుభవమాలిక 662వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. ‘నీకు నేనున్నాను’ అంటూ సదా వెంట ఉండే బాబా
  2. బాబా దయవల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోయాయి

‘నీకు నేనున్నాను’ అంటూ సదా వెంట ఉండే బాబా


సాయిభక్తురాలు శ్రీమతి విజయ సాయి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


ఓం సాయిరాం! నా పేరు విజయ సాయి. నా చిన్నతనంనుండి నాకు సాయితో ఉన్న అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరిస్తున్న బాబాకు నా పాదాభివందనాలు.


నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు. నా చిన్నతనంలో మా నాన్నగారు నన్ను భీమునిపట్నం పాఠశాలలో 5వ తరగతిలో చేర్పించారు. అప్పటికి నాకు సాయిబాబా గురించి తెలియదు. భీమిలిలో మా ఇంటినుండి స్కూలుకి వెళ్ళే దారిలో బాబా గుడి ఉండేది. ఆ గుడిలో నా స్నేహితురాలు, తన తల్లిదండ్రులు బాబాకు నిత్యపూజలు చేస్తూ బాబా సన్నిధిలో ఉండేవారు. నా స్నేహితురాలు ఒకరోజు నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చింది. ఆ ఫోటోను నేను చదువుతున్న పుస్తకంలో పెట్టుకున్నాను. నేను చదువుకుంటున్నది మిషనరీ పాఠశాల కావడం వలన నాలో కొద్దిగా క్రైస్తవభావాలు ఉండేవి. కానీ ప్రతి గురువారం నేను బాబా గుడికి వెళ్ళేదానిని. 


10వ తరగతి పూర్తయిన తరువాత ఇంటర్మీడియట్ విజయనగరం కాలేజీలో చేరడం జరిగింది. మొదటి సంవత్సరమంతా ఏదో అలా గడిచిపోయింది. మార్కులు కూడా కేవలం పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి. చాలా బాధ కలిగింది. నాకు ఇంతకుముందెప్పుడూ అంత తక్కువ మార్కులు రాలేదు. విజయనగరంలో ఒక స్నేహితురాలి ద్వారా అనుకోకుండా అక్కడున్న బాబా గుడికి వెళ్ళడం జరిగింది. నా మనస్సులో అప్పటివరకు ఉన్న క్రైస్తవభావాలను పూర్తిగా విడిచిపెట్టి బాబానే పూర్తిగా నమ్మాను. ఇంక అక్కడినుండి నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనా నాకు అద్భుతంగానే అనిపించేది


ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు మొదటి సంవత్సర బెటర్‌మెంట్ పరీక్షల్లో ఊహించని విధంగా మార్కులు పెరిగి కాలేజ్ అంతా కూడా నా పేరు తెలియటం జరిగింది. ఇది ఖచ్చితంగా బాబా నా మీద చూపించిన దయే. తరువాత బాబా దయవల్ల ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోను, డిగ్రీలోను చక్కని ఫలితాలు సాధించాను. ఆ వెంటనే బాబా దయతో నాకు బి.ఇడి లో సీటు వచ్చింది. బి.ఇడి పూర్తయ్యాక M.Sc లో చేరాను. M.Sc చదువుతుండగానే బాబా దయతో నేను కోరుకున్నవ్యక్తితో నా వివాహం జరిగింది. అతనిది ప్రైవేటు ఉద్యోగం. ఇద్దరం అప్పటికి ఇంకా స్థిరపడలేదు. ఇంతలో నేను గర్భవతినయ్యాను. నా చదువు ఇంకా పూర్తి కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. తెలియని భయం, ఆందోళన ఉండేవి. భారమంతా బాబాపై వేశాను.


ఇంతలో DSC నోటిఫికేషన్ వెలువడింది. బాబానే వెన్నుతట్టి ముందుకు నడిపించి నన్ను DSC కి ప్రిపేర్ చేయించారు. నేను ప్రైమరీ స్కూల్, హైస్కూల్ ఉద్యోగాలకు రెండింటికీ దరఖాస్తు చేశాను. కానీ హైస్కూల్ ఉద్యోగానికి పోస్టులు తక్కువగా ఉండటం వలన కేవలం ప్రైమరీ పోస్టుకే ప్రిపేర్ అయ్యాను. నేను 3వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆటంకం కలుగకుండా బాబా నా చేత పరీక్షలు వ్రాయించారు. నేను 8వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు పరీక్షా ఫలితాలు వచ్చాయి. అద్భుతం! బాబా నేను ఊహించినదానికంటే నాకు ఎక్కువే ఇచ్చారు. నాకు హైస్కూల్ టీచరుగా ఉద్యోగం వచ్చింది. తరువాత బాబా తన కృపతో బంగారం లాంటి పాపను మాకు ప్రసాదించారు. ఈ విధంగా మమ్మల్ని జీవితంలో స్థిరపడేలా చేసిన బాబాకు ఎన్నిసార్లు నా పాదాభివందనాలు సమర్పించినా నాకు తనివితీరదు. 


ఆ తరువాత మా పాపకు అవసరమైన సమయంలో నన్ను పట్టణ ప్రాంతానికి బదిలీ చేయించారు బాబా. మా పాప ఇంటర్మీడియట్ చదువుతుండగా చిన్న చిన్న అనారోగ్యాల కారణంగా తన చదువు విషయంలో చాలా ఆందోళన చెందాము. చివరకు బాబానే సర్వస్యశరణాగతి కోరాము. బాబా దయవలన పాప 2020, అక్టోబరులో ఢిల్లీ ఐఐటీలో తనకు నచ్చిన బ్రాంచిలో సీటు పొందింది. నాకు వచ్చిన ప్రతీ సమస్యను బాబాకు నివేదించగానే, ‘నీకు నేనున్నాను’ అంటూ వెంటనే పరిష్కరిస్తారు బాబా.


ఈ విధంగా కరుణామూర్తియైన బాబా సర్వకాల సర్వావస్థలయందునూ తన కరుణ, దయ, కృప, కటాక్షాలను మా కుటుంబం పట్ల చూపునట్లు అందరిపైనా చూపాలని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటూ..


జై సాయిరాం!

సర్వేజనాః సుఖినోభవంతు.


బాబా దయవల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోయాయి


సాయిభక్తురాలు షర్మిల ఇటీవల తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు షర్మిల. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. మా బాబుకి గత నాలుగు నెలల నుండి పొట్టలో బాగా నొప్పి వస్తుండేది. చాలామంది డాక్టర్లకి చూపించినప్పటికీ నొప్పి తగ్గలేదు. చివరికి ఒక డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళినపుడు ఆ డాక్టర్ "స్కానింగ్ చేయిద్దామ"ని అన్నారు. నాకు చాలా భయమేసి, "బాబా! బాబుకి ఏమీ కాకూడదు. అంతా బాగుండాలి" అని బాబాను వేడుకున్నాను. స్కానింగ్ చేయిస్తే, 'కిడ్నీలో రాళ్లు ఉన్నాయి' అని రిపోర్టు వచ్చింది. నేను బాబాను ఒక్కటే కోరుకున్నాను, "బాబా! మా బాబు కిడ్నీలో ఉన్న రాళ్లు బయటకి వచ్చేయాలి. మా బాబు ఆరోగ్యం కుదుటపడాలి. అలా జరిగితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని. తరువాత నేను రోజూ బాబాకు ఆరతి ఇచ్చి, మా బాబుకి ఊదీనీళ్లు ఇస్తూ వచ్చాను. సాయి దయవల్ల బాబు కిడ్నీలో ఉన్న రాళ్లు కొన్ని కరిగిపోయాయి, కొన్ని బయటకు వచ్చాయి. ఇప్పుడు మా బాబు ఆరోగ్యం కుదుటపడింది. బాబుకి సీటీ స్కాన్ చేయిస్తే, ‘కిడ్నీలో రాళ్లు లేవ’ని రిపోర్టు వచ్చింది. కానీ అప్పుడప్పుడు బాబుకి పొట్టలో నొప్పి వస్తోంది. అది కూడా త్వరలోనే బాబా దయవల్ల తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి.



శ్రీమతి గంగూబాయి ఔరంగాబాద్‌కర్



శ్రీసాయి సచ్చరిత్ర 36వ అధ్యాయంలో శ్రీసఖారాం తాత్యాజీ ఔరంగాబాద్‌కర్, అతని భార్య గంగూబాయిలకు బాబా సంతానాన్ని అనుగ్రహించిన అద్భుత లీల ఇవ్వబడింది. ఆ లీలకు సంబంధించిన పూర్వాపరాలు శ్రీసఖారాం తాత్యాజీ ఔరంగాబాద్‌కర్ మనవడైన దత్తాత్రేయ వాసుదేవ్ ఔరంగాబాద్‌కర్ తెలిపిన వివరాలు:

శ్రీసఖారాం తాత్యాజీ ఔరంగాబాద్‌కర్‌ది సంపన్న కుటుంబం. షోలాపూరులో అందరూ అతనిని ‘సఖ్య హరి’ (శ్రీహరి స్నేహితుడు) అని పిలిచేవారు. అతను పొడవుగా చక్కటి శరీర సౌష్టవాన్ని కలిగి ఉండేవాడు. అతను ధోతి కట్టుకొని, తలపాగా, కోటు ధరించి గంభీరంగా హుందాగా నడిచేవాడు. అతను ధర్మవర్తనుడు. చిన్నవయస్సునుండే విష్ణుసాహస్రనామ పారాయణ చేస్తుండేవాడు.

ఔరంగాబాద్‌కర్ పూర్వీకుల గృహం షోలాపూరులో ఉంది. వంశపారంపర్యంగా ఆ కుటుంబీకులు ఆ గృహమందే నివసిస్తుండేవారు. వాళ్ళు వృత్తిరీత్యా స్వర్ణకారులు. షోలాపూరులోని మంగళవారపేటలో సఖారాంకి ఒక నగల దుకాణం ఉండేది. అతను రెడీమేడ్ ఆభరణాలు తయారుచేయడంలో ప్రసిద్ధుడు. ఆ రోజుల్లో ఎవరికైనా తమకు కావలసిన ఆకృతిలో ఆభరణాలు కావాలంటే అందుబాటులో ఉండేవి కాదు. అందువల్ల వాళ్ళు సఖారాం వద్దకు వచ్చి, తమకు కావలసిన రీతిలో ఆభరణాలు తయారుచేసి ఇవ్వమని అడిగేవారు. అతను తనకున్న నైపుణ్యంతో ఆభరణాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దేవాడు. ఆ రోజుల్లో బ్యాంకులు ఉండేవి కాదు. కాబట్టి నగలను కుదువ పెట్టుకొని డబ్బు ఇచ్చే వ్యాపారం కూడా చేస్తుండేవాడు సఖారాం. అతని గొప్ప వ్యక్తిత్వానికి, నీతి, నిజాయితీలకి తగిన గౌరవం లభించేది. సఖారాం ప్రతిరోజూ సాయంత్రం తన పనులు ముగించుకొని ఇంటికి వచ్చి ఒక ఊయలలో కూర్చొని భక్తిశ్రద్ధలతో విష్ణుసహస్రనామం పఠించేవాడు.

గంగూబాయికి సఖారాంతో వివాహమై ఇరవై ఏడు సంవత్సరాలైనా వారికి సంతానం కలగలేదు. ఆ రోజుల్లో భార్యకి పిల్లలు పుట్టకపోతే భర్త మరో వివాహం చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. సఖారాం కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకి విశ్వనాథ్ అని పేరు పెట్టారు. గంగూబాయి సంపన్నుల ఇంటి కోడలిగా విలువైన దుస్తులు, ఆభరణాలు ధరించినప్పటికీ తాను తల్లిని కాలేకపోతున్నందుకు లోలోపల చాలా బాధపడుతుండేది. ఆ కాలంలో సంతానం లేని స్త్రీలను సమాజానికి శాపమని భావించి, వారిని ‘గొడ్రాలు’ అని అవమానపరుస్తూ చాలా క్రూరంగా చూస్తూండేవాళ్లు. పర్యవసానంగా, సంపదలెన్ని ఉన్నప్పటికీ గంగూబాయి ఎప్పుడూ దిగులుగా ఉంటుండేది. చివరికి తన వ్యధ తీర్చమని ఆమె దైవాన్ని ఆశ్రయించింది. వారి ఇంటిముందు ఒక రామాలయం ఉండేది. గంగూబాయి ఎక్కువ సమయం రాముని ప్రార్థిస్తూ అక్కడే గడిపేది. పవిత్రమైన శ్రావణమాసంలో శివుడికి రుద్రాభిషేకం, శివలింగానికి బిల్వపత్రాలతో సహస్రనామార్చన చేసి, మాసాంతంలో భారీ ఎత్తున అన్నదానం చేయించేది. ప్రతి పౌర్ణమినాడు తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసేది. ఆ కుటుంబీకుల కులదేవత రేణుకాదేవి. గంగూబాయి అర్థరాత్రి వేళ మాహుర్‌గడ్ శిఖరానికి వెళ్లి, ఆ చీకటిలో తన చేతికి తగిలిన తొలిరాయిని ఇంటికి తీసుకొచ్చి, దానికి కాషాయరంగు వేసి, బంగారంతో తయారుచేసిన కళ్ళు, చెవులు, ముక్కు అమర్చి, ఆభరణాలతో అలంకరించి దేవతోపాసన చేస్తుండేది. నేటికీ ఇవి ఔరంగాబాద్‌కర్ ఇంట సంప్రదాయంగా జరుగుతున్నాయి. ఇన్ని ఆచారాలతోపాటు ఉపవాసాలు, మ్రొక్కులు మొదలైనవన్నీ చేసిన తరువాత కూడా గంగూబాయికి సంతానం కలగలేదు. ఏ దేవతలూ తనపై కరుణ చూపి సహాయం చేయకపోవడంతో ఆమె సాధుసత్పురుషలను ఆశ్రయించసాగింది. ముందుగా హుమ్నాబాద్ సందర్శించనారభించి అక్కడి మాణిక్యప్రభు సంస్థాన్‌లో సేవ చేసింది. తరువాత షోలాపూరుకి సమీపంలో ఉన్న అక్కల్కోట వెళ్లి భక్తితో ఎంతో సేవ చేసింది. కానీ తన కోరిక నెరవేరలేదు.

ఇలా కాలం గడుస్తుండగా, ఒకసారి దాసగణు షోలాపూరులో కీర్తన చేశాడు. ఆ కీర్తన కార్యక్రమానికి గంగూబాయి, ఆమె కుటుంబం హాజరయ్యారు. బాబా యొక్క దైవత్వం గురించి, భక్తుల కోసం బాబా చేసిన అనేక లీలల గురించి, బాధితులపట్ల వారి కరుణ గురించి దాసగణు ఎంతో మనోరంజకంగా చేసిన కీర్తన ఆమెపై తీవ్రప్రభావాన్ని చూపి, ఆమె మనసు బాబాపట్ల విశ్వాసంతో నిండిపోయింది. కీర్తన ముగిసిన తర్వాత ఆమె దాసగణుని కలిసి బాబా గురించి వివరాలు అడిగింది. ఆమె గురించి తెలుసుకున్న దాసగణు, “శిరిడీ వెళ్లి బాబా పాదాల వద్ద సాష్టాంగపడు. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది” అని భరోసా ఇచ్చాడు.  ఆమె క్షణమైనా ఆలస్యం చేయకుండా శిరిడీ వెళ్ళడానికి భర్త నుండి అనుమతి తీసుకొని, తన సవతి కొడుకు విశ్వనాథ్‌ను తోడుగా వెంటబెట్టుకొని బాబా దర్శనానికి ప్రయాణమైంది

శిరిడీ చేరుకున్న గంగూబాయి మసీదులో బాబా ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించుకుని తన మనసులోని కోరికను తెలుపుకోవడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ బాబా వద్ద ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటుండటంతో తన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. దాంతో ఆమె, “బాబాతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం నాకెప్పుడు వస్తుంది? వారికి నా మనోగతాన్ని ఎలా తెలియజేయాలి?” అంటూ చింతించసాగింది. గంగూబాయి, విశ్వనాథ్‌లిద్దరూ బాబా సేవ చేసుకుంటూ శిరిడీలో రెండు నెలలున్నారు. చివరికి ఆమె షామా సహాయం కోరి అతనితో తన మనోగతాన్ని చెప్పి, “బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూచి మీరైనా నా మనసులోని కోరికను బాబాకు విన్నవించండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరూ వినకుండా చెప్పాలి” అని వేడుకుంది. అప్పుడు షామా ఆమెతో, “ఈ మసీదు ఏ సమయంలోనూ ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు బాబా దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరచే ఉంటుంది. ఇక్కడ ఎవరికీ ఏ ఆటంకమూ లేదు. అయినా ఒక మాట చెప్తాను గుర్తుంచుకో! ప్రయత్నించటం నా పని, ఫలితాన్నిచ్చేది మాత్రం కీర్తిదాత, మంగళప్రదుడు అయిన బాబానే! చివరకు సుఖాన్ని కలిగించేది వారే. కనుక నీ చింత ఉపశమిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు, నీవు ఒక టెంకాయను, అగరువత్తులను చేతపట్టుకుని, సభామండపంలో రాతిమీద కూర్చో! బాబా భోజనమయ్యాక, వారు ఉల్లాసంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడు నువ్వు పైకి రా!” అని చెప్పాడు. షామా చెప్పినట్లే గంగూబాయి వేచి ఉండగా శుభఘడియ రానే వచ్చింది.

ఒకరోజు బాబా భోజనం పూర్తిచేసి తమ చేతులు కడుక్కున్న తరువాత షామా వస్త్రంతో వారి చేతులు తుడవసాగాడు. అప్పుడు బాబా ప్రేమోల్లాసంతో షామా బుగ్గను గిల్లారు. అప్పుడు భగవంతునికి, భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి! మాధవరావు వినయ సంపన్నుడైనప్పటికీ కోపాన్ని నటిస్తూ, బాబాతో సరదాగా, “ఇది మంచి లక్షణమేనా? ఇలా గట్టిగా బుగ్గ గిల్లే చిలిపి దేవుడు మాకవసరం లేదు. మేమేమన్నా మీపై ఆధారపడ్డామా? మన స్నేహానికి ఇదేనా ఫలితం?” అని అన్నాడు. బదులుగా బాబా, “డెబ్భైరెండు జన్మల నుండి నువ్వు నాతో ఉన్నప్పటికీ నేనెప్పుడైనా నీపై చేయి వేశానా? బాగా గుర్తు తెచ్చుకో!” అని అన్నారు. అప్పుడు షామా, “మాకు ఎప్పుడూ తినటానికి మంచి క్రొత్త క్రొత్త మిఠాయిలను ఇచ్చే దేవుడు కావాలి. మాకు మీ గౌరవమర్యాదలో లేదా స్వర్గలోక విమానాలో అవసరం లేదు. మీ చరణాలయందు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉండేలా కరుణించండి. అంతే! ఇంత మాత్రం చాలు” అని అన్నాడు. అందుకు బాబా, “అందుకోసమేగా నేను ఇక్కడికి వచ్చింది. మీకు భోజనం పెట్టి పోషిస్తున్నాను. నాకు మీపై ప్రేమ కలిగింది” అని అన్నారు. తరువాత బాబా వెళ్ళి తమ ఆసనంపై కూర్చోగానే, షామా గంగూబాయికి సైగ చేశాడు. ఆ శుభసమయం కోసమే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న గంగూబాయి వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినమ్రంగా నిలుచుని, వారికి కొబ్బరికాయను అర్పించి, వారి పాదపద్మాలకు వందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కఠడాపై కొట్టి, “షామా! ఈ కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తుంది. ఇది ఏమంటోంది?” అని అన్నారు. షామా ఆ అవకాశాన్ని అందుకుని, “తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో కోరుకుంటోంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ చరణాలయందు లగ్నమవ్వాలి, ఆమె సమస్య తీరుగాక! ఆమెననుగ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు, కూతుళ్లూ కలుగుతారు” అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, “కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెఱ్ఱిగా ఎందుకనుకుంటారు? జనానికి పిచ్చిపట్టినట్లు అనిపిస్తోంది” అని అన్నారు. అందుకు షామా, “మాకు తెలుసు. మీ మాటల ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు. మీ మాటలు అంత అమూల్యమైనవి. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీస్సులు ఇవ్వకుండా ఊరికే కూర్చుని వృథా మాటలు చెప్పుతున్నారు. ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి” అని అన్నాడు. తరువాత, “కొబ్బరికాయను పగులగొట్టు” అని బాబా అంటే, “కాదు, ఆమె ఒడిలో వేయండి” అని షామా.. ఇలా కొంతసేపు బాబా, షామాల మధ్య వాదులాట జరిగాక షామా ప్రేమకు లొంగిపోయిన బాబా, “సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు, వెళ్ళు” అని అన్నారు. “ఎప్పుడో చెప్పండి” అని బాబాను నిలదీసి అడిగాడు షామా. “పన్నెండు మాసాల అనంతరం” అని బాబా చెప్పారు. షామా కొబ్బరికాయను పగులకొట్టాడు. సగం కాయను ఇద్దరూ తిని మిగిలిన సగాన్ని గంగూబాయికి ఇచ్చారు. షామా ఆ స్త్రీతో, “నా మాటకు నీవే సాక్షివి. ఈరోజు నుండి పన్నెండు మాసాల లోపు నీ కడుపుపండి సంతానం కలగకపోతే నేనేం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి, ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమివేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండనివ్వనని ఖచ్చితంగా చెప్పుతున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో” అని చెప్పాడు. అతని ధైర్యవచనాలను విన్న ఆ స్త్రీ ఎంతో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్లిపోయింది.

పన్నెండు మాసాలు గడిచేసరికి బాబా నోటిమాట ఫలించింది. శిరిడీ నుండి తిరిగి వచ్చిన మూడు మాసాలకు గంగూబాయి గర్భం దాల్చి, 1911లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబా ఆశీర్వాదఫలంగా పుట్టిన ఆ బిడ్డ పూర్ణ ఆరోగ్యంతో, గులాబీ వర్ణంలో ఎంతో అందంగా ఉన్నాడు. బిడ్డను చూస్తూ, ‘ఎట్టకేలకు తాను తల్లినైనా’ననే ఆనందంలో మునిగిపోయింది గంగూబాయి. ఆమెతోపాటు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందించారు. బాబా వరప్రసాదంగా జన్మించిన తమ బిడ్డకు బాబానే నామకరణం చేయాలని సఖారాం నిర్ణయించాడు. పిల్లాడికి 5 నెలలు వచ్చాక బిడ్డని తీసుకొని సఖారాం, గంగూబాయిలు బాబా దర్శనానికి శిరిడీ వెళ్లారు. బాబా ఆ బిడ్డను తమ ఒడిలోకి తీసుకొని, “రామకృష్ణ” అని పేరుపెట్టి ఆశీర్వదించారు. సఖారాం ఎంతో సంతోషంగా బాబాకు 500 రూపాయలు దక్షిణ సమర్పించాడు. బాబా దానిని స్వీకరించలేదు. తరువాత ఆ డబ్బును బాబాకు ప్రియమైన గుర్రం శ్యామకర్ణ కోసం ఒక శాల నిర్మించడంలో ఉపయోగించారు.

1915లో గంగూబాయి మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకి ‘వాసుదేవ్’ అని నామకరణం చేశారు. ఆ బిడ్డ పుట్టిన సంవత్సరం తరువాత గంగూబాయి కన్నుమూసింది. పిల్లలిద్దరూ చిన్నవయస్సులోనే తల్లిప్రేమకు దూరమయ్యారు. కానీ కుటుంబంలోని అందరూ పిల్లల్ని బాగా చూసుకున్నారు. ముఖ్యంగా విశ్వనాథ్ భార్య మధురబాయి పిల్లలిద్దరి విషయంలో ఎంతో జాగ్రత్త వహించింది.

సద్గురువు కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువుల కంటే అధికం. వారి మాట చాలా శక్తివంతమైనది.

సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర, బాబా'స్ డివైన్ మేనిఫెస్టేషన్స్ బై విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 661వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా దయవల్ల నిమిషాల్లో తగ్గిన జలుబు
  2. సాయి దయవల్ల అంతా మంచి జరిగింది

బాబా దయవల్ల నిమిషాల్లో తగ్గిన జలుబు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 


నా పేరు కుమార్. నేను హైదరాబాదులోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా ఇంటి దగ్గరే వుండే సాయిబాబా గుడిలో పదిమంది సభ్యులతో కూడిన మా బృందం వాలంటీర్లుగా చిన్న చిన్న సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం. మేము చేసే ప్రతి సేవాకార్యక్రమంలో బాబా ఆశీస్సులు మాకు చాలా స్పష్టంగా అనుభవమవుతూ ఉండేవి. ఆ అనుభవాలతో ఇంకా ఎంతో ఉత్సాహంగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాళ్ళం. కరోనా లాక్‌డౌన్ కారణంగా మా సామాజిక సేవాకార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. అందుకు మా బృందమంతా ఎంతో బాధపడేవాళ్ళం. నవంబరు నెలలో లాక్‌డౌన్ తీసివేసిన తరువాత, మళ్ళీ మా బృందమంతా కలిసి డిసెంబరు నెలలో సేవా కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము. కానీ మనసులో ఒకప్రక్క కరోనా భయం మాత్రం వుండేది. అందరం కలిసి బాబాను ప్రార్థించి, మా సేవా కార్యక్రమాలు ప్రారంభించాము. మొదటిరోజు అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా సేవా కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమం పూర్తయిన తరువాత ఇంటికి చేరుకున్నాము. ఇంటికి వచ్చిన దగ్గర నుండి నాకు జలుబు మొదలై, కొద్దిసేపటిలోనే బాగా తీవ్రంగా అయిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారి చాలా ఇబ్బందిపడ్డాను. కరోనా ఏమోనని చాలా భయపడ్డాను. అసలే నాకున్న “anxiety stress” కి ఇలా శ్వాససమస్య కూడా తోడైతే ఇంకా చాలా కష్టంగా వుంటుంది. 'పరిస్థితి ఇలాగే వుంటే ఇక ఈరోజు రాత్రికి నిద్ర కూడా పోలేను' అనుకొని, మనసులోనే బాబాను తలచుకొని, “బాబా! మీ సంతోషం కోసమే కదా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలా ఇబ్బంది ఎదురైతే ఎలా చేయగలం బాబా? శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా వుంది. నా జలుబును తగ్గించండి బాబా. మీ దయవల్ల జలుబు తగ్గితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో ఈ అనుభవాన్ని అందరితో పంచుకుంటాను” అని వేడుకుని, పూజగదిలోకి వెళ్ళి కొంచెం బాబా ఊదీని నీళ్ళలో కలిపి తీర్థంలా తీసుకున్నాను. బాబా దయవల్ల సరిగ్గా పదిహేను నిమిషాల్లో అంతా సర్దుకుంది. జలుబు తగ్గిపోయి, శ్వాస తీసుకోవడం కూడా చాలా తేలికగా అయి, ఆ రాత్రికి హాయిగా నిద్రపోయాను. జలుబు వలన శ్వాస ఆడక అప్పటివరకు నేను చేసిన గందరగోళం చూసి మా ఇంట్లోవాళ్ళు వెళ్ళి ఏవేవో మందులు తీసుకొచ్చారు. కానీ నా సాయిబాబా నాకు జలుబు తగ్గించాక, ఇక నాకు ఏ మందులూ అవసరం లేదనిపించింది. నేను ఏ మందులూ వేసుకోకుండానే ప్రశాంతంగా నిద్రపోవడం చూసి మా ఇంట్లోవాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇక నేనయితే చెప్పనక్కర్లేదు, బాబా ప్రేమలో తడిసి (కన్నీళ్ళతో) ముద్దైపోయాను.


“బాబా! ఈ కలియుగంలో మీ వంటి దేవుడు లేకపోతే మా బ్రతుకులు ఎలా ఉండేవో ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా వుంది. అనుక్షణమూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మీరు. ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేము బాబా. మీరు శిరిడీలో సశరీరులై వున్నప్పుడు, ప్లేగువ్యాధిని సమూలంగా నిర్మూలించి ఈ ప్రపంచాన్ని కాపాడారు. ఇప్పుడు మళ్ళీ ఈ కరోనా బారినుంచి ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారు. మీకు కోటానుకోట్ల కృతజ్ఞతాపూర్వక, హృదయపూర్వక నమస్కారాలు ప్రభూ!


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయి దయవల్ల అంతా మంచి జరిగింది


అమెరికా నుండి సాయిభక్తురాలు శ్రీమతి సౌజన్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా కృతజ్ఞతలు. చిన్నతనంనుండి నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబా నాకు ఎన్నో అనుభవాలను, ఆనందాలను ప్రసాదించారు. నా ప్రస్తుత అనుభవానికి వస్తే.. మేము అమెరికాలో నివసిస్తున్నాము. ఇటీవల ఒకరోజు మావారు తనకు ఛాతీ దగ్గర నొప్పిగా ఉందని చెప్పారు. కొద్దిరోజుల తరువాత మళ్ళీ తనకు ఛాతీ దగ్గర నొప్పిగా ఉందన్నారు. తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు ఛాతీ వద్ద నొప్పి రావడంతో మాకు చాలా భయమేసింది. వెంటనే డాక్టరుకి చూపిద్దామని హాస్పిటల్లో అపాయింట్‌మెంట్ తీసుకుందామని ప్రయత్నిస్తే వారం రోజుల తరువాత అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అది కూడా గురువారంరోజు వచ్చింది. గురువారంరోజున అపాయింట్‌మెంట్ దొరకగానే బాబా ఆశీస్సులు మాపై ఉన్నాయని నాకు నమ్మకం కలిగింది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! డాక్టరు మావారికి ఏ సమస్యా లేదని చెప్పేలా అనుగ్రహించండి. మీ దయవల్ల ఈయనకు ఏ సమస్యా లేకపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. అన్నదానం కూడా జరిపిస్తాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత కొద్దిగా బాబా ఊదీని మావారి ఛాతీపై రాసి, మరికొంత ఊదీని నీళ్ళలో వేసి మావారికి ఇచ్చాను. బాబా నా బాధను విన్నారు. మావారిని పరీక్షించిన డాక్టర్, “ఏ సమస్యా లేదు, అంతా బాగానే ఉంది” అని చెప్పారు. నా సాయి దయవల్లనే అంతా మంచిగా జరిగింది. “థాంక్యూ బాబా! లవ్ యు బాబా! నా అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు బాబా!” బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపైన మరియు అందరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.



సాయిభక్తుల అనుభవమాలిక 660వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. ఏది అడిగినా బాబా తప్పక తీరుస్తారు
  2. మనసు మార్చి పెద్ద కష్టం నుండి విముక్తి ప్రసాదించిన బాబా
  3. ఊదీ రాసిన మరునిమిషంలో బాబా చూపిన అద్భుతం

ఏది అడిగినా బాబా తప్పక తీరుస్తారు


నేను సాయిబాబా భక్తురాలిని. మాది విశాఖపట్నం. చిన్నప్పటినుండి నాకు బాబా అంటే ప్రాణం. నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు నా మనసులోనే ఉన్న బాబాకు అన్ని విషయాలూ చెప్పుకుంటూ ఉంటాను. ఈ బ్లాగులో 'సాయిభక్తుల అనుభవమాలిక'లో ప్రచురితమవుతున్న భక్తుల అనుభవాలు చదువుతుంటే, బాబా తమ భక్తులపై చూపుతున్న ప్రేమకు నాకు కన్నీళ్లు ఆగడం లేదు. నాకు కూడా బాబా చాలా అనుభవాలను ప్రసాదించారు. అందులో నుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2016-17లో నేనొక బంగారు ఆభరణాన్ని తయారు చేయించుకున్నాను. ఆ ఆభరణాన్ని వేసుకుని అన్నవరంలో జరుగుతున్న మా బంధువుల పెళ్ళికి వెళ్లాను. పెళ్లైన తరువాత తిరిగి వస్తున్న సమయంలో సుమారు అర్థరాత్రి 12:30-1:00 మధ్యలో ఆ ఆభరణాన్ని తీసి బ్యాగులో వేశాను. అయితే అది బ్యాగులో కాకుండా క్రింద పడిపోయింది. అది నేను గమనించుకోలేదు. తరువాత ఎవరి ఇళ్లకు వాళ్ళం చేరుకున్నాక చూసుకుంటే ఆభరణం కనిపించలేదు. నాకు చాలా ఆందోళనగా అనిపించి విషయం మావారికి చెప్పాను. మావారు వెంటనే బస్సు డ్రైవరుకి ఫోన్ చేస్తే అతను, "మేము ఇంకో పెళ్ళికి వెళ్తున్నాము. మీ వస్తువులు బస్సులో పడివుంటే ఎక్కడికీ పోవు, మీరు కంగారుపడకండి" అని చెప్పాడు. బస్సు ఉన్న ప్రదేశాన్ని తెలుసుకుని వెంటనే మేము అక్కడికి వెళ్ళాము. అప్పటికే బస్సులో కొంతమంది ఎక్కి కూర్చుని ఉన్నారు. నేను మనసులో, "బాబా! ఆ ఆభరణం ఎక్కడ పడిందో అక్కడే ఉండాలి, అది నా కళ్ళకు మాత్రమే కనబడాలి" అని బాబాను ప్రార్థిస్తూ వెంటనే బస్సు ఎక్కాను. రాత్రి ఎక్కడైతే కూర్చున్నానో అక్కడికి వెళ్ళి చూశాను. బాబా దయవల్ల ఆ ఆభరణం అక్కడే ఉంది. అది చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఎంతో సంతోషంగా బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. నా బాబా ఏది అడిగినా తప్పక తీరుస్తారు.


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


మనసు మార్చి పెద్ద కష్టం నుండి విముక్తి ప్రసాదించిన బాబా


నేను ఒక సాయిభక్తుడిని. నేను ఒకప్పుడు ప్రీ ప్రైమరీ స్కూలుని నడుపుతుండేవాడిని. కోవిడ్ కారణంగా 2020, మార్చి నుండి స్కూలు మూసివేశాము. అయితే అప్పటికే ఫిబ్రవరి నెలలో మేము రాబోయే విద్యాసంవత్సరానికి అవసరమయ్యే పుస్తకాలకి ఆర్డరు పెట్టాము. అది మాకు ప్రతి సంవత్సరం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే, మేము వేసవి సెలవులకు ముందే పుస్తకాలను విద్యార్థుల తల్లిదండ్రులకి విక్రయించి వారి వారి సీట్లు నిర్ధారించుకుంటాము. ఫిబ్రవరిలో కరోనా తీవ్రత ఇండియాలో అంతగా లేకపోవడంతో మేము యథావిధిగా పుస్తకాలకు ఆర్డరు పెట్టాము. కానీ హఠాత్తుగా మార్చి నెలలో కోవిడ్ కేసులు పెరగడంతో మేము స్కూలు మూసివేశాము. కరోనా మహమ్మారి కారణంగా సెలవులు కొనసాగుతూపోయాయి. చివరికి మేము శాశ్వతంగా స్కూలు మూసేయాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే, అనవసరంగా పెద్దమొత్తంలో అద్దె, టీచర్లకి జీతాలు చెల్లించాల్సి వస్తుండేది. మేము విద్యార్థుల తల్లితండ్రులకి, స్కూలు భవన యజమానికి మా నిర్ణయాన్ని చెప్పి, కరోనా పరిస్థితుల్లో స్కూలు నడపడం ఎంత కష్టంగా ఉందో ప్రతి ఒక్కరికీ వివరించాము. అందరూ మా నిర్ణయానికి సమ్మతించారు. తరువాత అన్ని లావాదేవీలు పూర్తిచేశాము. ఇకపోతే పుస్తకాల విషయానికి వస్తే, నేను పుస్తక వ్యాపారితో, "మేము స్కూలును శాశ్వతంగా మూసివేశాము. కరోనా కారణంగా మీ వద్దనుండి తీసుకున్న ఒక్క పుస్తకాన్ని కూడా మేము అమ్మలేదు. కాబట్టి ఆ పుస్తకాలను తిరిగి తీసుకోండి" అని చెప్పాను. కానీ అతను, “ఒకసారి పుస్తకాలను మీకు అమ్మిన తరువాత వాటిని మేము వెనక్కి తీసుకోము. ఇక అమ్ముకోవడం, అమ్ముకోకపోవడం అనేది మీ తలనొప్పి. మాకు దానితో ఎటువంటి సంబంధం లేదు. పూర్తి మొత్తాన్ని మీరు చెల్లించాల్సిందే” అని ఖరాఖండిగా చెప్పేశాడు. ఆరునెలలుగా ఎటువంటి ఆదాయం లేని నేను అంత పెద్దమొత్తాన్ని ఎలా చెల్లించగలను? అందువలన నేను బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించాను. అతను పుస్తకాలు వెనక్కి తీసుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని కూడా అనుకున్నాను. బాబానే ఆ పుస్తక వ్యాపారి మనసు మార్చగలరన్న విశ్వాసంతో ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. చివరికి ఒక గురువారంనాడు ఆ పుస్తక వ్యాపారి నాకు ఫోన్ చేసి, "పుస్తకాలన్నీ వెనక్కి తీసుకుంటాన"ని చెప్పాడు. అంత పెద్ద కష్టం నుండి విముక్తి ప్రసాదించినందుకు ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై !!!


ఊదీ రాసిన మరునిమిషంలో బాబా చూపిన అద్భుతం

నా పేరు శివాని. నేను శ్రీసాయిని చాలాసార్లు అనుమానించాను. బాబాను వివిధరకాలైన కోరికలు అడిగి, చాలాసార్లు నిరాశచెందాను. నేను ఎంతగా వేడుకున్నా, డిమాండ్ చేసినా, పోరాడినా కూడా ఇవ్వకూడని వాటిని ఆయన నాకు ఇవ్వలేదు. అయితే బాబా కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఆయన మనకు శ్రేయస్సునిచ్చేదే చేస్తారు. ఇక నా అనుభవంలోకి వస్తాను. ఒకసారి మా అన్నయ్య ల్యాప్‌టాప్ అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. రీబూట్ కాలేదు. ఆ ల్యాప్‌టాప్ మరీ అంత పాతదేమీ కాదు. రిపేర్ సెంటర్లన్నీ మూసివున్నాయి. ఒకవేళ తెరిచి ఉన్నప్పటికీ ఖర్చు భారీగా ఉంటుందేమో అని భయపడ్డాము. సొంతంగా రిపేర్ చేసుకుందామంటే ఆ పరిజ్ఞానం కూడా మాకు లేదు. అన్నయ్య యూట్యూబ్ వీడియోలను చూస్తూ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ పలుమార్లు పవర్ బటన్ ఆన్&ఆఫ్ చేసినా ఫలితం కనపడలేదు. కొంతసేపు ప్రయత్నించిన తరువాత నేను నిరాశ చెంది శ్రీసాయిని గుర్తు చేసుకున్నాను. బ్లాగులో ఎంతోమంది సాయిభక్తులు పనిచేయడం మానేసిన తమ ఎలక్ట్రానిక్ పరికరాలకు బాబా ఊదీని పెట్టడం ద్వారా అవి తిరిగి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. వాటిని గుర్తు చేసుకుని బాబా దగ్గరకు వెళ్లి, ఆయనను ప్రార్థించి, చిటికెడు ఊదీ తీసుకొచ్చి ల్యాప్‌టాప్‌కు రాశాను. తరువాత జరిగింది నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. ఊదీ పెట్టి, నేనింకా నా వేలిని వెనక్కి కూడా తీసుకోలేదు, అంతలోనే స్క్రీన్ పనిచేయడం ప్రారంభించింది. నిజానికి నేనది పనిచేస్తుందని అస్సలు ఊహించలేదు. కానీ బాబా అద్భుతం చేసి చూపించారు. నేను నా కోరికలు నెరవేరాలని శ్రీసాయిని ప్రార్థించినప్పుడు ఫలితం కనిపించదు. కానీ నా చింతలను, ఆందోళనలను ఆయన పాదాలకు సమర్పించి సహాయాన్ని అర్థించినప్పుడు, ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు. "ధన్యవాదాలు బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 659వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా నిత్యమూ మనతోనే ఉన్నారు
  2. నమ్ముకుంటే, బాబా ఎల్లప్పుడూ మన వెంటే తోడుగా ఉంటారు

బాబా నిత్యమూ మనతోనే ఉన్నారు


సాయిభక్తురాలు శ్రీమతి అలేఖ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


ముందుగా ఈ బ్లాగుని నిరాటంకంగా నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు అలేఖ్య. నేను ఏలూరు నివాసిని. నాకు, నా భర్తకు బాబా Ph.D ప్రసాదించిన అనుభవాన్ని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. శ్రీసాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ నాకు కలిగిన మరికొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


మా అమ్మావాళ్ళు హైదరాబాదులో ఉంటారు. 2020 కరోనా కాలంలో లాక్‌డౌన్ వల్ల సంక్రాంతి తర్వాత మేము మా అమ్మావాళ్ళింటికి వెళ్ళలేదు. అందువల్ల అక్టోబరులో అక్కడికి వెళ్ళి, కొద్దిరోజులు అమ్మావాళ్ళతో కలిసి ఆనందంగా గడిపాము. తిరుగు ప్రయాణంలో ఏలూరుకి బయలుదేరాము. ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. మేము కారులో క్షేమంగా ఇంటికి చేరుకున్నాక ఇంటి దగ్గర కారు పార్క్ చేశాము. మరుసటిరోజు నుండి కారు అసలు స్టార్ట్ అవలేదు. దాంతో మెకానిక్‌ని తీసుకుని వచ్చి చూపిస్తే, తను కారును పరిశీలించి, బ్రేక్ విరిగిపోయిందనీ, కొంచెం జామ్ అయిందనీ చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మేము రాత్రి 8 గంటలకి హైదరాబాదులో బయలుదేరితే ఏలూరు వచ్చేసరికి తెల్లవారుఝామున 2 గంటలయింది. మధ్యలో కారు ఎక్కడా ఆగలేదు, మాకు ఏ సమస్యా ఎదురవలేదు. అప్పుడు మాకు అనిపించింది, ‘ఆ సాయినాథుడు మన వెంట లేకపోయుంటే ఏమైపోయేవాళ్లమో!’ అని. సదా మమ్మల్ని కాపాడుతున్న సాయికి సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. సర్వం సాయిమయం.


సాయి మా నాన్నని కాపాడారు:


ఇటీవల మా నాన్నగారికి ఉన్నట్లుండి ఊపిరి తీసుకోవడంలో సమస్య వచ్చింది. నాన్నను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి స్కానింగ్‌తో పాటు కరోనా పరీక్ష కూడా చేయించాము. తనకు కరోనా పాజిటివ్ రాలేదుగానీ, సమస్యేమిటో మాకు అర్థంకాలేదు. డాక్టర్లు మా నాన్నగారిని ICU లో ఉంచి, ముందుగా 15 లీటర్ల ఆక్సిజన్ ఎక్కించారు. కరోనా కారణంగా మమ్మల్ని ICU లోకి రానివ్వలేదు. మాకు అసలేం జరుగుతోందో తెలియట్లేదు. అలా 15 రోజుల పాటు నాన్నగారిని హాస్పిటల్లో ఉంచి, ఆక్సిజన్ పరిమాణాన్ని రోజురోజుకూ తగిస్తూ వచ్చారు. 15వ రోజున 2 లీటర్ల ఆక్సిజన్ ఎక్కించారు. నాన్న ICU లో ఉన్నన్ని రోజులూ ప్రతిరోజూ నేను బాబాను ప్రార్థించి, బాబా ఊదీని పెట్టుకుంటూ, “బాబా! నాన్నకు మీ ఊదీ పెడదామంటే మమ్మల్ని ICU లోనికి వెళ్ళనివట్లేదు. కనుక, ఇక్కడ నేను పెట్టుకుంటున్న మీ ఊదీ ICU లో ఉన్న మా నాన్నకు చేరేలా చూడు తండ్రీ!” అని బాబాను వేడుకునేదాన్ని. 15 రోజుల తరువాత నాన్నని 2 లీటర్ల ఆక్సిజన్‌తో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. బాబా అనుగ్రహంతో నాన్నగారి ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. ఆ సాయినాథుడు లేకపోయుంటే మేము ఇలా ఉండేవాళ్ళమే కాదు. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః.


“బాబా! మీకు మాటిచ్చినట్లు నా రెండు అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాయిభక్తులతో పంచుకున్నాను. నిత్యమూ మమ్మల్ని కాపాడు బాబా!”


నమ్ముకుంటే, బాబా ఎల్లప్పుడూ మన వెంటే తోడుగా ఉంటారు


ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. బ్లాగులో ప్రచురితమవుతున్న తోటి సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనసుకు ప్రశాంతత, ఆత్మస్థైర్యం, పాజిటివ్ ఎనర్జీ సమకూరుతున్నాయి. నా పేరు సురేష్. మేము విశాఖపట్నంలో నివసిస్తున్నాము. నాకు కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత బాబా చూపించిన ఒక నిదర్శనాన్ని నేనిప్పుడు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను.


నాకు కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత డాక్టరు సలహామేరకు నేను మొదటిసారి 2020, అక్టోబరు 26న షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. ఏమీ తినకముందు, తిన్న తరువాత షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. నా వయసు 50 సంవత్సరాలు. అంతకుమునుపు నాకు షుగర్ లేదు. కోవిడ్ తర్వాతే ఎటాక్ అయ్యింది. దాంతో నేను చాలా ఆందోళనకు గురయి డాక్టరుని సంప్రదించాను. డాక్టరు రెండు నెలలకి మందులు వ్రాసిచ్చి, రెండు నెలల తర్వాత మరోసారి టెస్ట్ చేయించుకుని రమ్మన్నారు. నేను "షుగర్ నియత్రించమ"ని బాబాను ప్రార్థిస్తూ, రోజూ బాబాకు పూజ చేసిన ఊదీని మందుగా తీసుకుంటూ, రెండు నెలలు కాఫీ త్రాగడం మానేశాను. రెండు నెలల తరువాత 2020, డిసెంబరు 27న షుగర్ టెస్ట్ చేయించుకుంటే, బాబా దయవలన షుగర్ దాదాపు సాధారణ స్థాయికి వచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా ప్రసాదించిన ఆ సంతోషాన్నే ఈ బ్లాగ్ ద్వారా మీతో ఇలా పంచుకున్నాను. బాబాను నమ్ముకుంటే, ఆయన ఎల్లప్పుడూ మన వెంటే తోడుగా ఉంటారు. "మీరు చేసిన సహాయానికి చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


ఓం సాయిరామ్!



సాయిభక్తుల అనుభవమాలిక 658వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. 'నీకు మంచి జరుగుతుంది, నమ్మకముంచి ఓర్పుగా ఉండు!'
  2. బాబా ఎవ్వరినీ నిరాశపరచరు

'నీకు మంచి జరుగుతుంది, నమ్మకముంచి ఓర్పుగా ఉండు!'


పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగుని నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభవాలను చదువుతాను. నాలో బాబాపై నమ్మకం దృఢంగా పెరగటానికి ఈ బ్లాగ్ కూడా ఒక కారణం. ధన్యవాదాలు సాయీ! నా మనసులో ఉన్న విషయాన్ని మీతో ఎలా పంచుకోవాలో నాకు తెలియటంలేదు. ఇప్పటివరకు నేను అన్ని విషయాలను బాబాకు మాత్రమే చెప్పుకున్నాను. అందరితో పంచుకోవటం ఇదే మొదటిసారి. తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించండి. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. నాకోసం బాబాను ప్రార్థించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. 


11 సంవత్సరాల క్రితం ఒక ఫ్రెండ్ ద్వారా ఫోటో రూపంలో మా ఇంటికి వచ్చారు బాబా. అప్పటినుండి మాకు అన్నీ బాబానే. అప్పటికే మేము ఒక పెద్ద కోర్టు సమస్యలో ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చారు బాబా. ఎన్నో సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవటంలో అండగా నిలిచారు. కోవిడ్‌కు ముందే కోర్టులో ఉన్న ఆ సమస్యను రాజీ చేసుకుని, పెద్దమొత్తంలో డబ్బులు కట్టి మా ఆస్తిని విడిపించుకున్నాము. ఈ విషయంలో మాకెంతో సహాయం చేసినవారికి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మాకు సహాయం చేసిన ఒక అతనికి మా ఆస్తిని అమ్మాలనుకున్నాము. బాబానే ఆయన రూపంలో మాకు సహాయం చేశారని మా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆయనే ఆస్తిని తీసుకోవాలని మా ఆకాంక్ష. అలా జరిగితే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాను. అనుకోకుండా కోవిడ్ వలన మా కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ఆయనే ఆస్తిని తీసుకుంటానన్నారు. కానీ, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయినా బాబాపై నమ్మకంతో ముందుకు నడుస్తున్నాము. ఇప్పుడు మేము ఎంతగానో నమ్మిన ఒక లాయరు ద్వారా, మరో ముగ్గులు వ్యక్తుల ద్వారా క్రొత్త సమస్య వచ్చింది. మాకు నమ్మకద్రోహం చేసిన వీళ్ళ గురించి నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. ఎందుకో ఈ సమయంలో బాబా మౌనంగా ఉన్నారు. అయితే, నాకు ధైర్యం కలిగించేలా, ‘నమ్మకం ఉంచు’, ‘నీకు మంచి జరుగుతుంది’, ‘ఓర్పుగా ఉండు’ అనే బాబా మెసేజెస్ కొన్ని వస్తున్నాయి. బాబానే నమ్ముకునివున్నాము. ఆయన తప్ప మాకు ఎవ్వరూ సహాయం చేయలేరు. అన్ని విషయాలూ బాబాకు తెలుసు. “ప్లీజ్ బాబా! మేము మాట్లాడే ప్రతి మాటా నువ్వే మాట్లాడించాలి. మేము వేసే ప్రతి అడుగూ నువ్వే వేయించాలి. మమ్మల్ని ఈ సమస్య నుంచి నువ్వే బయటపడేయాలి. ఆస్తిని రిజిస్టర్ చేసి అందరి అప్పులు తీర్చాలి. మాకు సహాయం చెయ్యి బాబా. మీ అనుగ్రహంతో మా సమస్య తీరి నేను సంతోషంగా ఈ విషయాన్ని మళ్ళీ బ్లాగులో పంచుకోవాలి”.


బాబా ఎవ్వరినీ నిరాశపరచరు


సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


నా వెనుకనున్నది ఎవరో కాదు, సాక్షాత్తూ ఆ శిరిడీ సాయినాథుడు. నా ఊపిరి, నా సర్వస్వం ఆయనే. ముందుగా ఆ సాయినాథునికి నా ప్రణామములు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకు నా నమస్కారములు. నా పేరు లక్ష్మి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


మేము చాలారోజులుగా మా అబ్బాయి కోసం ఒక స్థలం కొనాలని ప్రయత్నిస్తున్నాము. ఎంతగా ప్రయత్నించినప్పటికీ మా కోరిక నెరవేరలేదు. అప్పుడు నేను నా మనసులోని కోరికను బాబాకు విన్నవించుకుని, "ఐదు గురువారాలు సాయి దివ్యపూజ చేస్తాన"ని మ్రొక్కుకుని పూజ మొదలుపెట్టాను. మరునాడు ఐదవ గురువారం పూజ ఉందనగా బుధవారంనాడు బాబా మా కోరిక నెరవేర్చారు. అలాగే, మా చెల్లెలి కూతురికి ఉద్యోగం రావాలని ఏడు గురువారాలు సాయి దివ్యపూజ చేయగా బాబా దయవలన తనకు ఉద్యోగం వచ్చింది. నాకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేను సాయినే ఆశ్రయిస్తాను. ఆయన నా ప్రతి కష్టాన్నీ ఇట్టే పరిష్కరిస్తూ నాపై అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు. "ధన్యవాదాలు సాయినాథా! తండ్రీ! నీ చల్లని దీవెన ఎల్లప్పుడూ అందరిమీదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను". భక్తుల కోరికలను తీర్చే కరుణామయుడు సాయి. ఆయన ఎవ్వరినీ నిరాశపరచరు.


ఓం సాయిరాం!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo