సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 657వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. పరీక్షించినా, చివరికి అనుగ్రహించిన బాబా 
  2. సంవత్సరకాలంగా అనుభవిస్తున్న బాధ మరుసటిరోజుకే మాయం!

పరీక్షించినా, చివరికి అనుగ్రహించిన బాబా 


నేను బాబా కుమార్తెలలో ఒకరిని. ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా భర్త ఆరోగ్య విషయంలో బాబా చేసిన సహాయానికి సంబంధించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2020, జూలైలో అకస్మాత్తుగా నా భర్తకి చెవిలో నొప్పితో పాటు ఛాతీ దగ్గర ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా రాత్రివేళల్లో సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నానని బాధపడేవారు. సమస్య ఛాతీ దగ్గర కావడం వల్ల నేను చాలా భయపడ్డాను. అయినప్పటికీ, దానంతట అదే తగ్గిపోతుందని నేను మొదట్లో అంత శ్రద్ధ చూపలేదు. కానీ పరిస్థితి మరింత దిగజారేసరికి 'సమస్య ఏమై ఉంటుందో' అని నాకు చాలా కంగారుగా అనిపించింది. ఒకవైపు తను ఊపిరి తీసుకోలేకపోతున్నారు, హాస్పిటల్‌కి వెళదామంటే కరోనా సమయం కావడం వలన భయం. కానీ వేరే మార్గంలేక మావారు అత్యవసర పరిస్థితి కింద అపాయింట్‌మెంట్ తీసుకుని క్లినిక్‌కి వెళ్లారు. ఆ సమయమంతా నేను, "నా భర్త ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళనకర వార్త వినకూడద"ని బాబాను ప్రార్థిస్తూ గడిపాను. 'ఆర్తిగా పిలిస్తే సాయి తక్షణం పరుగున వస్తార'ని మనందరికీ తెలుసు. క్లినిక్‌లో మావారికి భయపడేంత పెద్ద సమస్యేమీ లేదని కొన్ని మందులిచ్చి, వాటిని వాడమని చెప్పారు. వెంటనే మావారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అది విని నాకు చాలా ఉపశమనంగా అనిపించింది.


మావారు మందులు వాడటం ప్రారంభించారు. కానీ రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. దాంతో ఈసారి మావారు మా ఫ్యామిలీ డాక్టరు వద్ద అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో యు.ఎస్.ఏలో కరోనా చాలా ఎక్కువగా ఉండటం వలన భయంతో నేను హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ తప్పనిసరై మావారు వెళ్లారు. డాక్టరు మావారిని పరీక్షించి, అనుమానించేంతగా ఏమీ లేదని చెప్పి, కొన్ని మందులిచ్చి వాడమన్నారు. మావారు నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పగా అప్పటివరకు బాబా నామస్మరణ చేస్తున్న నేను ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మావారు ఆ మందులు వాడటం ప్రారంభించారు. కానీ మళ్ళీ అదే పరిస్థితి. దాంతో, 'మందులు వాడుతున్నా మావారి ఆరోగ్యం ఎందుకు మెరుగుపడట్లేదు? కారణం ఏమైంటుంది?' అని నాలో ఆందోళన మొదలైంది. మరోసారి మావారు డాక్టరు వద్దకు వెళ్లారు. డాక్టరు వేరే మందులు వాడమని సూచించి, “అవి కూడా పనిచేయకపోతే ఎండోస్కోపీ అపాయింట్‌మెంట్ తీసుకోండి, అసలు లోపల ఏమి జరుగుతుందో చూద్దాం” అని అన్నారు. అది తెలిసి నేను చాలా కలతచెందాను. అసలే కరోనా సమయం, పదేపదే హాస్పిటల్స్‌కి వెళ్లలేము. ఒకవేళ సమస్య పెద్దది అయితే పరిస్థితి ఏమిటని చాలా కంగారుగా అనిపించింది. ఇక్కడ యు.ఎస్.ఏ.లో ఎండోస్కోపీ అంటే పెద్ద ప్రక్రియ. అది పూర్తి కావడానికి రోజులో సగం సమయం పడుతుంది. పైగా మావారికి ఎనస్థీషియా ఇస్తారు. ఆ స్థితిలో తను కారు డ్రైవ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నేను మావారితో వెళ్లాలి. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్ళని హాస్పిటల్ లోపలికి అనుమతించరు. కాబట్టి వాళ్ళని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళాలి. కరోనా వల్ల ఎవరినీ  సహాయం అడగలేను. ఇలా రకరకాల ఆలోచనలు, భయాలతో నేను నా తండ్రి సాయి వద్దకు పరుగెత్తి, "ఈ పరిస్థితి నుండి  మీరు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు" అని దీనంగా వేడుకున్నాను.


తరువాత నాకు సాయి దివ్యపూజ చేయాలనిపించి, 5 వారాల పూజ ప్రారంభించాను. దాంతో పాటు సచ్చరిత్రలోని 13వ అధ్యాయం పారాయణ, ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులోని భక్తుల అనుభవంలో చూసిన 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే మంత్రం జపించసాగాను. రెండవ వారంలో నేను మావారిని "ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడిగాను. తన నోటినుండి మునుపటి సమాధానమే విని నాకు భయమేసినప్పటికీ సాయి నాకు సహాయం చేస్తారనే బలమైన నమ్మకం కూడా ఉంది. 'బాబా మనల్ని పరీక్షిస్తారేమోగానీ ఎన్నడూ మోసగించరు' అని మనకి తెలుసు కదా! 4వ వారంలో మావారిని అడగడానికి కూడా చాలా భయపడినప్పటికీ సాయిపై నమ్మకంతో "ఇప్పుడు ఎలా అనిపిస్తుంద"ని అడిగాను. మావారు, "నా ఛాతీలో ఇబ్బంది పోయింది. కానీ చెవినొప్పి మాత్రం కొంచెం ఉంది" అని చెప్పారు. అది వింటూనే చెప్పలేని సంతోషం కలిగి ఆనందభాష్పాలతో నా సాయికి నమస్కరించాను. 


"సాయీ! నిజంగా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో, నా మనోభావాలను ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియడం లేదు. నా భర్తకున్న ఆ చిన్న సమస్యలను కూడా తీసివేసి దయతో తనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. బాబా! మీకు తెలుసు, నేను ఒక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నాను. దయచేసి త్వరలోనే దానికి పరిష్కారాన్ని చూపించి నాకు మానసిక ప్రశాంతతను అనుగ్రహించండి. ప్లీజ్ సాయీ! నేను మీపై ఆధారపడి దూరంగా ఉంటున్నాను. దయచేసి సర్వవేళల్లోనూ మా చుట్టూ ఉంటూ మమ్మల్ని రక్షించండి. కఠిన సమయంలో మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమతో ఆశీర్వదిస్తున్న మీకు ధన్యవాదాలు సాయీ! ఈ కరోనా సమయంలో దయచేసి మీ బిడ్డలందరినీ దీవించండి. చివరిగా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటానని మీకు మాటిచ్చి ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా!".


సంవత్సరకాలంగా అనుభవిస్తున్న బాధ మరుసటిరోజుకే మాయం!


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీలత. నేను అనుభవిస్తున్న ఒక అనారోగ్య సమస్యను బాబా ఏ విధంగా తీర్చారో ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఒక సంవత్సరకాలంగా నేను 'గ్యాస్ట్రిక్' సమస్యతో బాధపడుతున్నాను. దానివలన ఛాతీలో చాలా నొప్పిగా ఉండేది. చాలా మందులు వాడాను కానీ ఎలాంటి గుణం కనిపించలేదు. 2020, నవంబరు 26న ఈ బ్లాగు నా కంటపడింది. అందులో ప్రచురితమైన "సాయిభక్తుల అనుభవమాలిక" చదువుతుంటే నా కళ్ళనుండి కన్నీళ్లు కారిపోయాయి. ఆ స్థితిలోనే నేను, "నా ఆరోగ్య సమస్యను తగ్గించండి బాబా, నా సమస్య తీరితే నేను కూడా నా అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. సంవత్సరకాలంగా అనుభవిస్తున్న బాధ మరుసటిరోజు నుండి ఎటుపోయిందో తెలియలేదు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతకాలంగా ఎన్ని మందులు వాడినా నయంకానిది ప్రార్థించినంతనే బాబా అనుగ్రహించారు. "సాయీ! మీ చరణాలకు శతకోటి నమస్కారములు. నేను ఎదుర్కొంటున్న మానసిక ఆందోళన మీకు తెలుసు తండ్రీ. దానినుండి కూడా నాకు విముక్తిని ప్రసాదించండి బాబా!".



సాయిభక్తుల అనుభవమాలిక 656వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో చాలావరకు తగ్గిన సమస్య
  2. మన తండ్రి మనసు వెన్న కదా! నా నొప్పిని తగ్గించారు
  3. నాన్నకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా ఊదీ

బాబా అనుగ్రహంతో చాలావరకు తగ్గిన సమస్య


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ సాయిరాం! సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాన్ని సాటి సాయిభక్తులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 


చదువుకునే రోజుల్లో మా అక్క, నేను తరచుగా శ్రీసాయిబాబా గుడికి వెళ్లేవాళ్ళం. ఇంట్లో కూడా సాయంకాల ఆరతి పాడుకునేవాళ్లం. సాయిబాబా నాకు ఎన్నో మంచి అనుభవాలను ప్రసాదించారు, ఎన్నో సమస్యలలో మాకు అండగా ఉండి పరిష్కారాలు చూపించారు. బాబాకు భక్తిపూర్వక ప్రణామాలు. ఈమధ్య నేను ఒక సంవత్సరం నుంచి హార్మోనుల అసమతుల్యతతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. మూడు నెలల క్రిందట ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగును చూశాను. అందులోని సాయిభక్తుల అనుభవాలను చదివి, “నా సమస్య తగ్గిపోతే నేను కూడా నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకుని, శ్రీసాయిలీలామృతము, శ్రీగురుచరిత్ర పారాయణ చేశాను. బాబా అనుగ్రహంతో నా సమస్య చాలావరకు తగ్గిపోయింది. బాబా దయవల్ల త్వరలోనే నా సమస్య పూర్తిగా తగ్గిపోతుందని నమ్ముతున్నాను. ఆ సమస్య వల్ల నేను అనుభవించిన మానసిక ఒత్తిడి నుంచి కూడా నాకు ఉపశమనం లభించింది. “బాబా! ఎల్లప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడు తండ్రీ! నీ యందు అచంచలమైన భక్తివిశ్వాసాలు ఉండేలా అనుగ్రహించు బాబా!”


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః.


మన తండ్రి మనసు వెన్న కదా! నా నొప్పిని తగ్గించారు


సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న అన్నయ్యకి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. బాబా నాకు ఇచ్చిన అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకోవాలని నేనిప్పుడు మీ ముందుకు వచ్చాను. బాబా కృపవల్ల నా జీవితంలోని కష్టకాలాన్ని నేను దాటగలిగాను. నాకు ఈమధ్య ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. అది నన్ను మానసికంగా, శారీరకంగా చాలా బాధపెట్టింది. ఆ సమస్య వల్ల నేను మానసికంగా కృంగిపోయినప్పటికీ నాకు హాస్పిటల్‌కి వెళ్ళాలనిపించలేదు. కరుణామయుడైన మన బాబాను నమ్ముకొని, నొప్పి ఉన్న చోట బాబా ఊదీని రాసుకుంటూ, కొద్దిగా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగుతూ ఉన్నాను. బాబాకు నమస్కరించుకుని, “నొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని మ్రొక్కుకున్నాను. మన తండ్రి మనసు వెన్న కదా! నా నొప్పిని తగ్గించారు. కొద్దిగా నొప్పి మిగిలివుంది. ఆ కాస్త నొప్పి కూడా పోయేలా ఇప్పటికీ ప్రతిరోజూ బాబా ఊదీని, ఊదీనీళ్ళని తీసుకుంటున్నాను. “నా కష్టం తీర్చినందుకు థాంక్యూ సో మచ్ బాబా! అజ్ఞానంతో మేము చేసే అన్ని తప్పులను క్షమించండి తండ్రీ!”


నాన్నకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా ఊదీ


సాయి భక్తుడు రవి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


ఓం సాయిరామ్! 2020, మార్చ్ నెలలో తీవ్రమైన దగ్గు, వాంతులతో  మా నాన్నగారు చాలా అనారోగ్యానికి గురయ్యారు. బయట ఫుడ్ తీసుకున్నందువల్ల అలా అయ్యుంటుందని నేను దాన్ని తీవ్రంగా పరిగణించలేదు. అప్పటినుండి నాన్న ఆహారం తీసుకోవడం మానేశారు. నేను తినమని చెప్తే, "ఆకలి లేదని, ఆకలేస్తే తింటాన"ని చెప్పేవారు. సోమవారం ఉదయం నుండి మంగళవారం రాత్రి వరకు ఆయన కొబ్బరినీళ్లు వంటి ద్రవ పదార్థాలనే తీసుకున్నారు. మంగళవారం సాయంత్రానికి ఆయన చాలా బలహీనపడిపోయారు. అయినప్పటికీ ఆయన ఇంటికి అవసరమైన సరుకులు తేడానికి వెళ్లి చాలా నీరసంగా తిరిగి వచ్చారు. ఆ రాత్రి దగ్గుకోసం కొన్ని టాబ్లెట్స్ వేసుకొని రాగి జావ తీసుకొన్నారు. తరువాత ఆయన మళ్ళీ వాంతులు చేసుకున్నారు. అసలే కరోనా ప్రభావం ఉన్న రోజులైనందున నాకు భయమేసింది. ఒకటి తరువాత ఒకటి ప్రతికూల ఆలోచనలతో నా మనస్సు గందరగోళమైపోయింది. మరుసటిరోజు ఉగాది కూడా. అప్పుడు నేను నా ప్రియమైన సాయి తండ్రిని తలుచుకుని, "బాబా! రేపు పండగరోజు. ఉదయానికి నాన్న ఆరోగ్యం బాగుపడి, తన పనులు తాను చేసుకోగలిగితే నేను నా   అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. తరువాత నా సోదరితో, "నాన్న నుదిటిపై ఊదీ పెట్టి, కొంత నీటిలో కలిపి ఇవ్వు" అని చెప్పాను. తను అలాగే చేసింది. మరుసటిరోజు ఉదయం 5:30 కల్లా ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కొంచం దగ్గు మాత్రమే ఉంది. ఆయన తన రోజువారీ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. "శతకోటి ధన్యవాదాలు బాబా. నాన్న పూర్తి ఆరోగ్యంతో ఉండేలా ఆశీర్వదించండి. నా సోదరి కొడుకు ప్రశాంతంగా నిద్రపోయేలా చేసారు. అందుకు కూడా మీకు చాలా చాలా ధన్యవాదాలు. సాయిబాబా మీ పవిత్ర పాదాలకు నా సాష్టాంగ నమస్కారం.


అనంత కోటి బ్రాహ్మణడ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


source: http://www.shirdisaibabaexperiences.org/2020/04/shirdi-sai-baba-miracles-part-2695.html#experience3



సాయిభక్తుల అనుభవమాలిక 655వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయినాథుని కృపవలన ఆరోగ్యం
  2. బాబానే బాబుని కాపాడారు

సాయినాథుని కృపవలన ఆరోగ్యం


సాయి భక్తురాలు రూప ఇటీవల బాబా తనకి ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:


ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సాయి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. ఇటీవల జరిగిన నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య మా తమ్ముడికి జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. ఈ రోజుల్లో ఇవంటేనే చాలా భయమేస్తోంది. తరువాత తనకు జ్వరం తగ్గిందిగానీ జలుబు, దగ్గు తగ్గలేదు. పైగా దగ్గు చాలా ఎక్కువగా వస్తోంది. అదే తగ్గిపోతుందిలే అని ఒక వారం రోజులు వేచిచూశాము. కానీ దగ్గు తగ్గలేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, ‘మా తమ్ముడికి దగ్గు త్వరగా తగ్గిపోయేలా అనుగ్రహించమ’ని వేడుకున్నాను. దగ్గు చాలా ఎక్కువగా వస్తుండటంతో మా తమ్ముడు డాక్టరుకి చూపించుకుందామని హాస్పిటల్‌కి వెళ్ళాడు. డాక్టర్ దగ్గు తగ్గటానికి మందులిచ్చి రెండు రోజులు వాడమన్నారు. మందులు వాడినప్పటికీ దగ్గు తగ్గకపోవటంతో మా తమ్ముడు మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాడు. డాక్టర్ మా తమ్ముడిని ఎక్స్-రే తీయించుకోమన్నారు. దాంతో నాకు చాలా భయమేసి, “బాబా! ఇది మామూలు దగ్గు అయివుండాలి. ఎలాంటి వైరస్ ఉండకూడదు” అని బాబాను వేడుకున్నాను. తరువాత మా తమ్ముడు హాస్పిటల్ నుంచి వచ్చేవరకు నేను ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉన్నాను. ఆ మంత్రాన్ని నేను ‘సాయిసర్వస్వం’ యూట్యూబ్ ఛానల్లో చూశాను. రిపోర్ట్ వచ్చింది. “సమస్యేమీ లేదు, ఇది మామూలు దగ్గే” అని చెప్పారు డాక్టర్.  అది విని మేమంతా చాలా సంతోషించాము. ఇదంతా ఆ సాయినాథుని కృపవల్లనే జరిగిందని నా ప్రగాఢ విశ్వాసం. ఆ సాయినాథుడే మా తమ్ముడిని వైరస్ నుంచి కాపాడారు. “సాయినాథా! నీకు శతకోటి వందనాలు తండ్రీ!”


మరొక అనుభవం:


మా తమ్ముడికి జ్వరం వచ్చినప్పుడే మా అమ్మకి కూడా జ్వరం వచ్చింది. మా అమ్మ యూరాలజీ సమస్యతో బాధపడుతోంది. తనకి జ్వరం రాకుండా జాగ్రత్తలు తీసుకోమని తనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్ చెప్పారు. తను ఎదుర్కొంటున్న యూరాలజీ సమస్యకు తోడు జ్వరం వస్తే తనకు ఇన్ఫెక్షన్ ఉన్నట్లని చెప్పారు. ఇప్పుడిలా అమ్మకు జ్వరం రావటంతో నాకు భయమేసి బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఏమిటయ్యా మాకీ పరీక్ష? అమ్మకు త్వరగా జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించు తండ్రీ!” అని వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో అమ్మకు త్వరగానే జ్వరం తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “బాబా! అమ్మకి ఉన్న యూరాలజీ సమస్యను కూడా పరిష్కరించు తండ్రీ! ఆ సమస్య తీరిన తర్వాత ఆ అనుభవాన్ని కూడా నా తోటి సాయిబంధువులతో పంచుకుంటాను. తొందరగా ఆ కోరిక తీర్చు సాయిదేవా! నా అనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించు బాబా! తప్పులేమైనా ఉంటే క్షమించు తండ్రీ! అందరినీ రక్షించు బాబా! మీకు శతకోటి వందనాలు తండ్రీ!” బాబా ఆశీస్సులతో త్వరలోనే నా అనుభవంతో మరోసారి మీ ముందుకు వస్తాను.


ఓం సాయిరామ్!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబానే బాబుని కాపాడారు


ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మా చిన్నబాబు విషయంలో బాబా చేసిన ఒక మిరాకిల్ గురించి మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. 


నా పేరు అరుణదేవి. నాకు ఇద్దరు పిల్లలు. చిన్నబాబు LKG లో ఉన్నప్పుడు ఒకరోజు సాయంత్రం తనను స్కూల్ నుండి తీసుకుని రావడానికి నేను వెళ్ళాను. బాబుని తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు వేగంగా వస్తున్న ఒక బైక్ బాబుని ఢీ కొట్టి, కొంతదూరం ఈడ్చుకొని వెళ్ళింది. మా బాబు రెండు కాళ్ళ మీద బైక్ ముందు చక్రం ఎక్కింది. బాబు చనిపోయాడనే అనుకున్నాను. కాసేపు నాకు ఏమీ అర్థం కాలేదు. అంతలోనే తేరుకుని వెంటనే బాబుని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాను. “బాబా! మీరే మా బాబుని కాపాడాలి” అంటూ ఎంతో ఆర్తిగా బాబాను ప్రార్థించాను. కొంతసేపటికి బాబు స్పృహలోకి వచ్చాడు. బాబుని పరీక్షించిన డాక్టర్, “కంగారుపడాల్సింది ఏమీ లేదు, అంతా నార్మల్‌గానే ఉంది” అని చెప్పారు. బాబు రెండు కాళ్ళ మీద బైక్ ముందు చక్రం ఎక్కడం నేను నా కళ్ళారా చూశాను. బాబు కాళ్ళు విరిగిపోయాయనే అనుకున్నాను. బాబానే మా బాబుని కాపాడారు. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా జీవితంలో నేనెన్నటికీ మర్చిపోలేని సంఘటన ఇది. బాబాకు శతకోటి వందనాలు.



ఆళంది శ్రీపద్మనాభేంద్రస్వామి



శ్రీసాయి సచ్చరిత్ర 13వ అధ్యాయంలో ఆళందిస్వామి అనుభవం గురించి ఈవిధంగా ఉంది:

ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనానికి శిరిడీ వచ్చాడు. అతను తీవ్రమైన చెవిపోటుతో బాధపడుతుండేవాడు. ఆ కారణంగా అతనికి నిద్రకరువైంది. నివారణోపాయాలు పనికిరాలేదు. చివరికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయినా ప్రయోజనం లేకపోయింది. అతనికి ఏమి చేయుటకు తోచలేదు. ఆ స్థితిలో అతనికి బాబా గురించి తెలిసి శిరిడీ వచ్చాడు. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని మాధవరావు దేశ్‌పాండే (షామా) ఆ స్వామి తరపున బాబాకు మనవి చేశాడు. బాబా అతనిని, “అల్లా అచ్ఛా కరేగా (అల్లా మంచి చేస్తాడు)అని ఆశీర్వదించారు. బాబా ఆశీస్సులను అందుకొని స్వామి పూణే పట్టణానికి వెళ్లాడు. వారం రోజుల తరువాత తన చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం వ్రాశాడు. కానీ వాపు తగ్గనందువలన శస్త్రచికిత్స చేయించుకునేందుకు బొంబాయి వెళ్లాడు. డాక్టరు చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టరు చెప్పాడు. దానితో స్వామి యొక్క చింత తొలగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది.

ఇకపోతే, శ్రీపద్మనాభేంద్రస్వామి తన అనుభవం గురించి స్వయంగా వ్రాసిన వివరణాత్మక లేఖ 1923వ సంవత్సరం సాయిలీల పత్రికలో ప్రచురితమైంది. ఆ వివరాలు అతని మాటల్లోనే:

“నాకు అత్యంత ప్రియతముడు, బొంబాయి నివాసియైన శ్రీహరిసీతారాం దీక్షిత్ సలహాననుసరించి నేను శిరిడీ దర్శించాను. శ్రీసాయిబాబా దర్శనంతో, వారి కృపాశీస్సులతో నేను అంతులేని ఆనందంలో మునిగిపోయాను. అక్కడున్న చాలామంది భక్తులు నా చెవివాపు గురించి సాయిమహరాజుతో విన్నవించుకోమని సలహా ఇచ్చారు. కానీ నా ఆత్మ, హృదయం అలా చేయడానికి ఇష్టపడలేదు. అందుకు కారణం, నేను కేవలం సాయిమహరాజు దర్శనం కోసం మాత్రమే శిరిడీ వెళ్ళాను, అంతకుమించి నాకు ఏ ఉద్దేశ్యమూ లేదు. ప్రారబ్ధకర్మను అనుభవించి తీరాలని నా దృఢ విశ్వాసం. కానీ చివరికి నా సమస్య గురించి సాయిమహరాజుకి విన్నవించమని మాధవరావు దేశ్‌పాండే(షామా)ను అడిగాను. తరువాత నేను సాయిమహరాజు దర్శనానికి వెళ్ళినప్పుడు షామా నా సమస్య గురించి బాబా వద్ద ప్రస్తావించాడు. అప్పుడు సాయిమహరాజు ప్రేమతో, “అల్లా సబ్ అచ్ఛా కరేగా” (అల్లా అంతా సరిచేస్తాడు) అని అన్నారు. తక్షణం చంచలంగా ఉన్న నా మనసు నిశ్చలమైంది. శ్రీసాయిమహరాజు యొక్క మహిమానిత్వమైన దైవత్వం గురించి వర్ణించడం అసాధ్యం. అది నా మనస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. పర్యవసానంగా నేను అపారమైన శాంతిని అనుభవించాను.

శిరిడీయాత్ర ముగించుకుని జనవరి 29(1914), గురువారంనాడు నేను ఆళంది వెళ్ళాను. అక్కడ ఫిబ్రవరి 2న జరిగిన శ్రీగురు తుకారాం మహరాజ్ పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొన్నాను. మరుసటిరోజు మంగళవారం నేను బొంబాయి వెళ్ళాను. అక్కడ నేను నా చెవి వెనుక నుండి మెడ వరకు వ్యాపించిన వాపు విషయమై డాక్టర్ అండర్వుడ్‌ని సంప్రదించాను. ఆయన నా చెవిని పరీక్షించి, శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పి, ఒక ఇంజెక్షన్ ఇచ్చి, దాంతో వాపు నయమవుతుందని చెప్పారు. నిజానికి నా శిరిడీ ప్రయాణానికి ముందు నాగపూర్‌లోని వైద్యుడు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఆళందిలోని వైద్యుడు కూడా అదే చెప్పాడు. కానీ బొంబాయి వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షనుతో నా చెవినొప్పి, వాపు పూర్తిగా మాయమైపోయాయి. ఇదంతా శ్రీసాయిమహరాజు ఆశీర్వాదమే. అది తల్చుకుంటే నాకు ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి”.

సాయిమహరాజు అడిగిన దక్షిణ:

“నేను సాయిమహరాజుని దర్శించిన మొదటిరోజునే ఆయన నన్ను దక్షిణ అడిగారు. అప్పుడు నేను, “మహరాజ్! నేనొక సన్యాసిని. నా దగ్గర ధనం ఎక్కడుంటుంది?” అని అన్నాను. తరువాత మాధవరావు దేశ్‌పాండేతో బాబా, “స్వామి నాకేమైనా ఇస్తాడేమోనని ఎదురుచూశాను. కానీ అతను ఏమీ ఇవ్వదలుచుకోలేదు. అయినప్పటికీ అతను నా వద్దకు వచ్చాడు కాబట్టి నేను అతనికి ఏమైనా ఇవ్వాలి” (“స్వామీ మలా కాహీ దేతాస్ కా పాహిలే, పరంతు తే కహీ దేణార్ నాహిత్!! తే మజకడే ఆలే ఆహేత్!! తేంవ్హా మలాచ్ త్యాంనా దిలే పాహిజో!!”) అని అన్నారు. మరుక్షణం నేను చింతారహితుడనయ్యాను. ఈ సిద్ధపురుషుల గురించి ఏమి చెప్పేది? వాళ్ళు మానవరూపంలో ఉన్న శ్రీనారాయణులే!”


సోర్స్: బాబా'స్ వాణి బై విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 654వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాకు కృతజ్ఞతాపూర్వక ప్రార్థన
  2. సాయి కృపతో దొరికిన ఫోన్
  3. సచ్చరిత్ర పారాయణతో చేకూరిన ఆరోగ్యం

బాబాకు కృతజ్ఞతాపూర్వక ప్రార్థన


ఒక భక్తురాలు బాబా తనపై చూపిన ప్రేమకు ఆనందంగా బాబాకు కృతజ్ఞతాపూర్వక ప్రార్థన సమర్పించుకుంటున్నారు:


"ఓం సాయిరాం బాబా! మేము పడినటువంటి ఎన్నో కష్టాలనుంచి మీరే మమ్మల్ని బయటకి లాగారు. మా సమస్యల నుంచి మమ్మల్ని బయటకు లాగి తాత్కాలికంగా మాకంటూ ఒక మార్గం చూపించారు. ఇప్పుడు మేము ఇంత బాగున్నామంటే అది కేవలం మీ దయవల్లే. మీపై మాకు విశ్వాసాన్ని, ఓపికని కలుగచేసి, మా మనస్సుని మీ పాదాల చెంత పెట్టుకుని, ఎల్లవేళలా మాకు మీ ఆశీస్సులనిచ్చి, మాకు తోడుగా ఉండి, మీరు నిర్ణయించినటువంటి శాశ్వతమైన మరియు అద్భుతమైన జీవితాన్ని మాకు ప్రసాదించండి బాబా!


బాబా! నాకు 3 సంవత్సరాల నుండి దొరకనటువంటి ఉద్యోగం మీ దయవలన దొరికింది. నన్ను డిప్రెషన్ నుంచి బయటకు రప్పించి మామూలు స్థితికి తీసుకొచ్చారు. అలానే, అడగగానే మా అక్కకి ఉద్యోగం ఇచ్చారు. అన్నిటికంటే కరోనా లాక్‌డౌన్ సమయంలో మీరు మాపై చూపిన ప్రేమను నేను మరువలేను. కరోనా లాక్‌డౌన్ సమయంలో వృత్తిరీత్యా నేను తిరగని ప్రదేశం లేదు. అలాంటి పరిస్థితిలో కరోనా నుంచి కాపాడమని నేను మిమ్మల్ని ప్రార్థించినంతనే నన్ను దాని బారినుంచి కాపాడారు. ఇప్పుడు నేనిలా ఉన్నానంటే అది కేవలం మీ ప్రేమాశీస్సుల వల్లనే బాబా.


అలానే, ఇంటివలన ఇబ్బందిపడుతుంటే మీరు మాకు చక్కని అద్దె ఇంటిని ప్రసాదించారు. తల్లివైపు నుంచి, తండ్రివైపు నుంచి  మాకు రావలసిన ఆస్తిని మాకు ఇప్పించి, మాకు స్వంతింటిని ప్రసాదించి, మా వ్యాపారం పునఃప్రారంభించేలా చేయండి బాబా! మా సిస్టర్స్ ఇద్దరికీ మంచి వ్యక్తులతో వివాహం జరిపించి వారికి మంచి జీవితాన్ని ప్రసాదించండి తండ్రీ! 


నాకు మీపై పూర్తి నమ్మకముంది బాబా. మేము మా జీవితాంతం మీకు ఋణపడివుంటాము. ఎల్లవేళలా మా మనసులో మీ నామజపం చేసేలా ఆశీర్వదించండి తండ్రీ! మీరు మాకు చూపిన లీలలు మరువలేనివి తండ్రీ! మీరెంచిన బాటలో నన్ను నడిపించండి సాయిదేవా! మీకు శతకోటి వందనాలు బాబా!"


ఓం శ్రీ సాయి రక్షక శరణం దేవః


సాయి కృపతో దొరికిన ఫోన్


సాయిభక్తురాలు శిరీష ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిరామ్! నా పేరు శిరీష. 2020, డిసెంబరు 21, సోమవారంనాడు బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆరోజు సాయంత్రం 8 గంటల 20 నిమిషాలకు నా ఫోన్ పోయింది. ఫోన్ పోయిన దానికన్నా దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా పోయిందని నాకు చాలా బాధగా అనిపించింది. అందులో కొన్ని సాయిబాబా ఫోటోలు, మెసేజెస్ సేవ్ చేసి పెట్టుకున్నాను. అంతేకాకుండా, నేను మహాపారాయణలో సభ్యురాలిని. ప్రతి గురువారంనాడు పారాయణ చేసి ఆ గ్రూపులో రిపోర్ట్ చేయాలి. కానీ నా ఫోన్ పోవటంతో, ఇప్పుడెలా రిపోర్టు చేయాలా అని దిగులు పట్టుకుంది. ఆ బాధలో నేను బాబాను తలచుకుని, "బాబా! నేను గురువారంనాడు నా పారాయణ పూర్తయినట్లు నా ఫోనులోనే రిపోర్టు చేయాలని అనుకుంటున్నాను. ఇక ఏం చేస్తారో మీ ఇష్టం" అని చెప్పుకుని, బాబాకు నమస్కరించుకుని ఫోన్ సంగతి ఆయనకే విడిచిపెట్టాను. బాబా చేసిన అద్భుతం చూడండి. కేవలం రెండు గంటల్లో, అంటే రాత్రి 10 గంటల 15 నిమిషాలకు దొంగ దొరకడం, నా ఫోన్ నాకు చేరడం జరిగింది. అది ఎలా జరిగిందనేది ఇక్కడ చెప్పడం భావ్యం కాదని వివరించడం లేదు. అంత తక్కువ సమయంలో పోయిన ఫోన్ దొరకడమంటే అది కేవలం సాయి కృపే! ఇంకో ముఖ్యవిషయం, ఫోన్ దొరకడానికి కొద్దిసేపటి ముందు బాబా తమ కృపకు సంకేతంగా నాకొక నిదర్శనాన్ని ఇచ్చారు. ఏ కారణం లేకుండానే నాకు చాలా ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది. "థాంక్యూ సో మచ్ బాబా!"


సచ్చరిత్ర పారాయణతో చేకూరిన ఆరోగ్యం

ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్. సాయి రక్షక్ శరణం! ఈ మధ్యకాలంలో నాకు జ్వరం వచ్చింది. కరోనా కారణంగా నేను చాలా భయపడి, సాయి నామాన్ని జపించడం ప్రారంభించాను. కానీ జ్వరం తగ్గలేదు. ఆ సమయంలో లాక్ డౌన్ కావడంతో హాస్పిటల్ కి వెళ్ళలేని పరిస్థితి. ఒకరాత్రి ఛాతీలో నొప్పితో నాకు మెలుకువ వచ్చింది. అప్పుడు సమయం రాత్రి 3 గంటలైంది. ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. అవి నా నెలసరి రోజులు. అయినప్పటికీ నేను పూజ మందిరంలో ఉన్న 'సాయి సచ్చరిత్ర' తీసుకుని చదవడం మొదలుపెట్టాను. వెంటనే బాబా నాకు పరిష్కారం చూపించినట్లు అనిపించింది. నెమ్మదిగా నాకు ఉపశమనం కలిగింది. తరువాత రెండున్నర రోజుల్లో నేను సచ్చరిత్ర పూర్తి చేసాను. "ధన్యవాదాలు బాబా. నన్ను క్షమించండి, ఆ సమయంలో మంచో, చెడో నాకు తెలియదు మీ పవిత్ర పుస్తకాన్ని తాకాను. ప్రియమైన బాబా! నా జీవితంలో అడుగడుగునా నిన్ను అంటిపెట్టుకోవాలని అనుకుంటున్నాను. నా వృత్తి అత్యవసర సేవల క్రిందకు వస్తున్నందున నేను ఈ కరోనా పరిస్థితుల్లో బయట ఉండాలి. కానీ ఇంటి నుండి అడుగు బయటకు పెట్టాలంటే చాలా భయంగా ఉంటుంది. బాబా, దయచేసి మమ్మల్ని రక్షించండి. మొత్తం మానవాళికి మీ ఆశీస్సులు కావాలి. మేము మీ పిల్లలం. దయచేసి మమ్మల్ని క్షమించి ఈ పరిస్థితి నుండి మమ్మల్ని రక్షించండి.  దయచేసి సహాయం చెయ్యండి.

ఓం అనంతకోటి బ్రహ్మండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.



సాయిభక్తుల అనుభవమాలిక 653వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహించుటలో లేదు ఆలస్యం
  2. మాకు అన్నీ నువ్వే బాబా

బాబా అనుగ్రహించుటలో లేదు ఆలస్యం


సాయిభక్తురాలు శ్రీమతి అరుణ ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు అరుణ. నేను ఎప్పటినుంచో సాయిభక్తురాలిని. కానీ కొన్ని కారణాలవల్ల ఐదు సంవత్సరాలు బాబాకు దూరంగా ఉండిపోయాను. అయినా బాబా ప్రేమతో మళ్ళీ నన్ను అక్కున చేర్చుకున్నారు. బాబా నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. వాటిలో ఈమధ్యకాలంలో జరిగిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


మొదటి అనుభవం:


2020, సెప్టెంబరులో 63 సంవత్సరాల వయస్సున్న మా మామయ్యగారికి కరోనా వచ్చి చాలా ప్రమాదకరంగా పరిణమించింది. ఆయన హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నేను పగలు, రాత్రి సాయిని ధ్యానిస్తూ ఉండేదాన్ని. బాబా ఎంతో దయచూపారు. బాబా దయవల్ల మామయ్యగారికి ప్రమాదకర పరిస్థితి తప్పింది. కానీ, కరోనా కారణంగా వచ్చిన ఇతరత్రా ఆరోగ్య సమస్యలు మామయ్యగారిని చాలా ఇబ్బందిపెట్టసాగాయి. అప్పుడు నేను, “మామయ్యగారి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు మొక్కుకున్నాను. అప్పటినుండి నెమ్మదిగా ఆ ఆరోగ్య సమస్యలు తగ్గుతూ వచ్చాయి. మామయ్యగారి ఆరోగ్యం కుదుటపడింది. “బాబా! మా మామయ్యగారిని నువ్వే కాపాడావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలాగే కాపాడండి తండ్రీ! చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

 

రెండవ అనుభవం:


ప్రస్తుతం నేను ఆరునెలల గర్భవతిని. 2020, డిసెంబరు మూడవ వారంలో నేను బాబా గురించి ఆలోచిస్తూ, “నాకు కాన్పు అయ్యాక త్వరగా మీ దర్శనానికి వచ్చేలా ఆశీర్వదించండి సాయీ” అని సాయిని కోరుకున్నాను. అదే సమయంలో, ‘ఎవరైనా శిరిడీ నుండి బాబా ఊదీ తెచ్చి నాకు ఇస్తే బాగుండు’ అని మనసులో అనుకున్నాను. తరువాత 2020, డిసెంబరు 22న నా మరదలు నా వద్దకు వచ్చి, “వదినా! నాకు ఒక కల వచ్చింది. అందులో మీరు ఊదీ తెచ్చివ్వమని అడుగుతున్నారు” అని చెప్పింది. ఆ నిమిషంలో నేను కేవలం ‘అవునా!’ అని ఊరుకున్నాను. ఆరోజు మంగళవారం. నా మరదలు సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకించిన విభూతి తీసుకొచ్చి నాకిచ్చి వెళ్ళింది. అప్పుడు ‘మనసులో అనుకున్నదానికి, నేను ఊదీ అడుగుతున్నట్లు కలలో నా మరదలికి చూపించి, తరువాత తనచేత సుబ్రహ్మణేశ్వరస్వామికి అభిషేకించిన విభూతిని పంపించింది నా బాబానే!’ అనిపించి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కాన్పు అయ్యేలోపు ఊదీ ఇవ్వమని అడగటమే నా ఉద్దేశ్యం. కానీ బాబా వెంటనే నా కోరిక తీర్చారు. “చాలా చాలా ధన్యవాదములు బాబా! ఎప్పటినుంచో నాకు ఒక కోరిక ఉంది బాబా. అది కూడా తీరితే, ఆ అనుభవాన్ని కూడా ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను. సాయి తండ్రీ! మీ ఆశీస్సులు ఎప్పటికీ నాపై ఉండనివ్వండి. తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి సాయీ!”


మాకు అన్నీ నువ్వే బాబా


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకు బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

 

ఓం సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేనొక చిన్న సాయిభక్తురాలిని. ఇటీవల నాకు కలిగిన ఒక చిన్న అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను.


నేను ఇంట్లోనే ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాను. నేను ఎవరివద్దనైతే వ్యాపారానికి సంబంధించిన సామగ్రిని కొనుగోలు చేస్తానో వారికి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తుంటాను. ఒకసారి నాకు తెలియకుండానే ఒకతనికి కాస్త పెద్ద మొత్తాన్ని రెండుసార్లు చెల్లించాను. తనకు రెండుసార్లు డబ్బు చెల్లించినట్లు అతను నాకు మెసేజ్ చేశారు. నేను అదే మొదటిసారి అతని వద్ద కొనుగోలు చేయడం. దాంతో నేను అదనంగా చెల్లించిన డబ్బులు తిరిగి వస్తాయో రావోనని నాకు చాలా భయమేసింది. వెంటనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ అనుగ్రహంతో నా డబ్బు నాకు తిరిగి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. వెంటనే అతను నా అకౌంటులో డబ్బు జమచేసి, ఒకసారి అకౌంట్ చూసుకోమని నాకు మెసేజ్ చేశారు. బాబాకు చెప్పుకున్న వెంటనే ఇలా జరిగింది. అంతా బాబా దయ. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


మరొక అనుభవం:


ఒకసారి మా నాన్నగారికి ఆరోగ్యం దెబ్బతింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కొన్ని టెస్టులు చేయించమన్నారు. మేము ఆ టెస్టులన్నీ చేయించాము. తరువాత నేను బాబాకు నమస్కరించుకుని, నాన్నగారికి ఏ సమస్యా లేకుండా కాపాడమని, రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చేలా చూడమని వేడుకున్నాను. మరుసటిరోజు వచ్చిన రిపోర్టుల్లో నాన్నకి పెద్ద సమస్యలేవీ లేవని తెలిసింది. దానితో అందరికీ ఆందోళన తగ్గింది. “చాలా కృతజ్ఞతలు సాయీ! శతకోటి వందనాలు బాబా! నీవు లేకుంటే ఈ లోకంలో మాకు దారేది? మాకు అన్నీ నువ్వే బాబా. మమ్మల్ని సదా నీ నామస్మరణలో ఉండేలా అనుగ్రహించు తండ్రీ!”


జై సాయిరాం!

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

ఓం శ్రీ సాయినాథాయ నమః.



సాయిభక్తుల అనుభవమాలిక 652వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. చెంత ఉండి చింతలన్నీ దూరం చేస్తారు బాబా
  2. ఎంతో కృపతో మాకు ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకున్న బాబా
  3. సాయి ఆశీర్వాదం

చెంత ఉండి చింతలన్నీ దూరం చేస్తారు బాబా


ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. గత కొన్ని నెలలుగా ఈ బ్లాగును క్రమంతప్పకుండా చదివే భాగ్యాన్ని బాబా నాకు కల్పించారు. ఇందులో పంచుకుంటున్న సాయిభక్తుల అనుభవాలను ప్రేరణగా తీసుకుని నేనూ నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు వెంకటరావు. శిరిడీ సాయిని సర్వస్య శరణంగా నమ్ముకున్నవాడిని. బాబా ప్రతిక్షణమూ ఎన్నెన్నో అనుభవాలను ప్రసాదిస్తుంటారు.


నా భార్య ఆరోగ్యానికి సంబంధించిన అనుభవం:


కొంతకాలంగా నా భార్య ఒక అనారోగ్యానికి చికిత్స తీసుకుంటూ ఉంది. అందులో భాగంగా ప్రతి ఆర్నెల్లకోసారి ఒక మందును ఆస్పత్రిలోనే తీసుకోవాలి. ఒకసారి లాక్‌డౌన్ కారణంగా సరైన సమయానికి మందు తీసుకోవటం వీలుకాలేదు. ఆ తర్వాత మరో పది నెలలు కూడా గడిచిపోయాయి. అప్పుడు బాబాపై భారం వేసి మేము హాస్పిటల్‌కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. డాక్టర్ని కలిసే ముందు కొన్ని టెస్టులు చేయించాల్సి ఉంది. టెస్టులు చేసే చోట జనాలు ఎక్కువమంది ఉంటారు. అంతేగాక, చాలాసేపు వేచివుండాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి సమస్యేలేమీ లేకుండా ఆ సాయినాథుడే మమ్మల్ని కాపాడి టెస్టులు త్వరగా పూర్తయ్యేలా చేశారు. ఆ తర్వాత, ఆ రిపోర్టుల్లో ఏముంటుందో, డాక్టర్ ఏమి చెప్తారోనని ఆందోళనచెందాము. ‘పది నెలల వరకు ఆ మందు ఇవ్వకపోవటం వల్ల నా భార్య ఆరోగ్య పరిస్థితి దిగజారకూడదు’ అని బాబాను క్షణక్షణమూ ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. మొత్తంమీద ఆ సాయిదేవుని కృపవల్ల నా భార్యకు ఎటువంటి సమస్యా లేదని డాక్టర్ చెప్పారు. కేవలం మన బాబా దయవల్లే అంతా సవ్యంగా సాగింది. అడుగడుగునా చెంత ఉండి మన చింతలన్నీ దూరం చేస్తారు బాబా. మనం ఎంత ఆర్తిగా పిలిస్తే అంతగా ఆయన మనల్ని రక్షిస్తారు. మనం పిలవకపోతే వదిలేస్తారని కాదు. బిడ్డనొదిలి తల్లి ప్రశాంతంగా ఉండగలదా? మనందరి తల్లి, తండ్రి, గురువు, దైవమైన సాయి ఎలా ఉండగలరు? ఆయన మనల్నెప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. కావల్సిందల్లా కేవలం శ్రద్ధ, సబూరి.


ఎంతో కృపతో మాకు ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకున్న బాబా


రాజమండ్రి నుంచి సాయిభక్తుడు రాధాకృష్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు రాధాకృష్ణ. నా చిన్నతనంనుండి చిత్రపటం రూపంలో సాయిబాబా మా ఇంటిలో కొలువై ఉండటం వల్ల నాకు ఆయనపై అపారమైన భక్తి ఏర్పడింది. సాయిబాబా ప్రసాదించిన దివ్యానుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకోవాలనే దృక్పథంతో నా స్వీయ అనుభవాన్ని విశదపరుస్తున్నాను. మా పెద్దమ్మాయికి 2020, ఫిబ్రవరి నెలలో వివాహమైంది. మార్చి నెలలో దంపతులిద్దరూ కొత్త కాపురం పెట్టారు. ఆ సమయంలోనే (కరోనా లాక్‌డౌన్‌కి ముందు) మా నాన్నగారు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా తన 87వ యేట సాయిలో ఐక్యమయ్యారు. మా నాన్నగారు పరమపదించినరోజునే మా అమ్మాయి గర్భవతి అని తెలిసింది. ఇంతలో కరోనా వచ్చింది. దాంతో మా అమ్మాయి, తన భర్త, అత్తగారు వేరే రాష్ట్రంలో నాలుగు నెలలపాటు ఉండిపోయారు. గర్భం దాల్చిన మొదటి నెలల్లో మా అమ్మాయి వాంతులతో ఇబ్బందిపడుతుండటంతో, కరోనా పాస్ పర్మిషన్ తీసుకుని మా ఇంటికి వచ్చింది. ఆపై ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ, డిసెంబరు 17వ తేదీ, గురువారంనాడు ఆపరేషన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనుక్షణం బాబా ఎంతో కృపతో మాకు ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకున్నారు. అన్నట్లు ఒక ముఖ్య విషయం చెప్పాలి, మా అమ్మాయి గర్భవతిగా ఉన్న సమయంలో "నేను మీ ఇంటికి మీ పాపకి బాబు రూపంలో పుడతాను" అని బాబా నాకు సంకేతం ఇచ్చారు. మా నాన్నగారు శిరిడీ సాయిని పూర్తిగా నమ్మినవ్యక్తి. ఆయన సాయిలో ఐక్యం చెందిన రోజే మా పాప గర్భం దాల్చడం, ముందుగానే బాబా నాకు సంకేతం ఇచ్చినట్లు గురువారంరోజున చంటిబిడ్డ రూపంలో మా ఇంటికి రావడంతో నాకు చాలా ఆనందం కలిగింది. ఈ అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా పంచుకోవాలని అనుకొని ఇప్పుడు మీతో పంచుకోవడం కూడా నాకు సాయిలీలగా అనిపిస్తోంది. నా ఈ ప్రథమ అనుభవం ద్వారా ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో అడుగుపెట్టాను. కొద్దిరోజులలో ఎన్నో సాయి లీలలు మరల పంచుకుంటాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కృప ఎప్పుడూ మీపై ఇలాగే ఉండాలి".


సాయి ఆశీర్వాదం

హిమాచల్ ప్రదేశ్ నుండి సాయి భక్తురాలు శృతి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు;

మేము 2019 శీతాకాల సెలవుల్లో మహాబలిపురం సందర్శించాలని అనుకున్నాము. మా ప్రయాణ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఊహించని విధంగా వాతావరణంలోని మార్పుల కారణంగా విమానాలు రద్దు చేయబడుతున్నాయి, లేదా ఆలస్యంగా నడుస్తున్నాయి. నాకసలే విమాన ప్రయాణమంటే భయం, పైగా వాతావరణం కూడా ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో నేను, "మా ప్రయాణం ఎటువంటి ఒడిదుడుకులు లేకండా సాఫీగా సాగాల"ని మన ప్రియమైన సాయిని ప్రార్థించాను. ఆశ్చర్యకరంగా మేము ప్రయాణించాల్సిన రోజు వాతావరణం అనుకూలంగా మారింది. ఆరోజు ఎండ బాగా కాసింది. మా ప్రయాణం స్వల్ప ఒడిదుడుకులతో సంతోషదాయకంగా సాగింది. నేను భక్తుల అనుభవాల ద్వారా చెన్నైలోని మైలాపూర్ బాబా మందిరం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆ మందిరాన్ని సందర్శించాలని చాలాసార్లు అనుకున్నాను. ఆ విషయమై నా కోరిక నెరవేర్చమని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయన ఆశీర్వాదం వలన మా ఈ ప్రయాణంలో ఆ భాగ్యాన్ని కూడా పొందాను. అంతటా మాకు మంచి దర్శనాలు జరిగాయి. తిరుగు ప్రయాణం కూడా సజావుగా సాగింది. మేము ఇల్లు చేరుకున్న మరుసటిరోజు వాతావరణం మునపటి కంటే దారుణంగా మారిపోయింది. అలా బాబా మా ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా మార్చి మమ్మల్ని ఆశీర్వదించారు. సాయి నన్ను ఈ రీతిన  ఆశీర్వదిస్తారని నేనెన్నడూ ఊహించలేదు. "బాబా! మీకు చాలా చాలా కృతఙ్ఞతలు. మీరు లేని నా జీవితం అసంపూర్ణం. దయచేసి అందరినీ ఆశీర్వదించండి.

ఓం సాయిరామ్, జై సాయిరామ్.



సాయిభక్తుల అనుభవమాలిక 651వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. నా మొర ఆలకించి బాబా మహిమ చూపించారు
  2. బాబాకు ప్రార్థన - వచ్చిన ఓ.సి.ఐ కార్డు


నా మొర ఆలకించి బాబా మహిమ చూపించారు


సాయిభక్తురాలు సాయిలక్ష్మి ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


అందరికీ నమస్కారం. నా పేరు సాయిలక్ష్మి. నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను బాబా భక్తురాలిని. బాబా ఎల్లవేళలా నాకు తోడుగా ఉండి కష్టాల నుండి నన్ను ముందుకు నడిపించారు. ఇటీవల నాకు ఒక పెళ్ళిసంబంధం కుదిరింది. నేను బాబాను ప్రార్థించి, నిశ్చితార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా జరగాలని, అలా జరిగితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకున్నాను. తరువాత ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ నేను బాబా పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎలాగైనా నేను కోరుకున్నట్టు బాబా ఆశీర్వదిస్తారని నమ్మకంతో ఉన్నాను. అలాగే బాబా నాపై ఎంతో కృప చూపించారు. మా నిశ్చితార్థం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఘనంగా జరిగింది. “థాంక్యూ బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలానే మా వివాహం కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా బాగా జరిగేలా చూడండి బాబా!” చివరిగా, నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు.


రెండవ అనుభవం:


నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (PharmD) చదువుతున్నాను. నేను హాస్పిటల్ క్లినికల్ రీసెర్చిలో చదువుతూ ఉద్యోగం చేసుకుంటున్నాను. మా ఊరినుండి హాస్పిటల్‌కి ఒక గంట ప్రయాణం ఉంటుంది. ఒక్కోసారి కాలేజీ బస్సులో, మరోసారి ఆర్టీసీ బస్సులో ఇంటికి తిరిగి వస్తుంటాను. ఒకరోజు హాస్పిటల్ నుండి ఆర్టీసీ బస్సులో ఇంటికి బయలుదేరాను. ఆరోజు బస్సు చాలా రద్దీగా ఉండటం వల్ల నేను నిలబడి ఉండాల్సి వచ్చింది. నాకు అప్పటికే కాలు ఫ్రాక్చర్ అయివుంది. దానికి తోడు నిల్చుని ఉండటం వల్ల కాలు వాచి నొప్పిపుట్టసాగింది. దాంతో మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఎలాగైనా నాకు సీటు దొరికేలా చూడు” అని వేడుకున్నాను. సగం దూరం ప్రయాణించాక ఒక సీటు ఖాళీ అయింది. ఒక ముసలాయన నన్ను కూర్చోమని సీటు ఇచ్చారు. నాకన్నా వయసులో పెద్దవారిని నిలుచోపెట్టడం తప్పనిపించి నేను కూర్చోలేదు. కానీ కాలునొప్పి ఎక్కువై నేను నిలుచోలేకపోతున్నాను. నొప్పి భరించలేక బాబాను మళ్ళీ ప్రార్థించాను. నా మొర ఆలకించి బాబా మహిమ చూపించారు. ఒక అబ్బాయి తన సీటులోంచి లేచి నన్ను ఆ సీటులో కూర్చోమని చెప్పాడు. అతనికేమైనా ఇబ్బందిగా ఉంటుందేమోనని అడిగితే, “ఏం పర్లేదు, మీరు కూర్చోండి” అని అన్నాడతను. బాబానే అతని రూపంలో వచ్చి నాకు సహాయం చేశారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా! నిన్ను వేడుకున్నవారికి నువ్వు ఎల్లప్పుడూ తోడుగా ఉంటావు”.


జై సాయిరాం!


బాబాకు ప్రార్థన - వచ్చిన ఓ.సి.ఐ కార్డు


అఖిలాండకోటి, అనంతకోటి బ్రహ్మాండనాయకునికి శతకోటి నమస్కారములు. బాబా గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువే. ఇటీవల నేను పంచుకున్న అనుభవాలను ప్రచురించినవారికి, వాటిని చదివినవారికి నా ధన్యవాదములు. బ్లాగ్ నిర్వాహకులకు హృదయపూర్వక వందనములు.


మేము ప్రస్తుతం అమెరికాలో ఉన్నాము. మాకు మనవడు పుట్టాడని మేము ఇక్కడికి వచ్చాము. బాబా దయవల్ల అన్నీ బాగా జరిగాయి. మేము మా అబ్బాయిని, కోడలని, మనవడిని ఇండియాకి తీసుకొని రావాలని మనవడి ఓ.సి.ఐ (OVERSEAS CITIZEN OF INDIA) కార్డు కోసం దరఖాస్తు చేశాము. అయితే కరోనా కారణంగా కార్డు రావడానికి కాస్త ఆలస్యమవుతోంది. మరోవైపు మేము తిరిగి ఇండియాకి రావాల్సిన సమయం దగ్గర పడుతోంది. ఏదేమైనా అన్నిటికీ బాబా ఉన్నారు కదా! ఎప్పటిలాగే బాబాను తలచుకొని, “బాబా! ఏదైనా మీరే చేయాలి. మీరు తప్ప మాకు ఏ దారీ లేదు. మీ దయవలన మా మనవడి ఓ.సి.ఐ కార్డు తొందరగా వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. నా ప్రార్థనను మన్నించి బాబా ఉత్తర్వులు జారీచేశారు. బాబా ఉత్తర్వులు కార్యాలయ సిబ్బంది మదిని చేరాయి. వెంటనే వాళ్ళు, “మీరు వచ్చి కార్డు తీసుకుని వెళ్లండ”ని మాకు మెయిల్ చేశారు. మేము ఎంతగా ఆనందించామో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! బాబా ప్రేమను నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. “బాబా! చాలా చాలా ధన్యవాదాలు. చిన్నపిల్లలు చాక్లెట్లు అడిగినట్లు మేము నిన్ను ఎన్నో అడుగుతున్నాము. నువ్వు అన్నీ ఇస్తూనే ఉన్నావు. మేము తింటూనే ఉన్నాము. ఎప్పటికీ ఇలాగే మా అందరినీ నీ ఒడిలో సేదతీర్చు తండ్రీ!” చివరిగా, నేను ఈ అనుభవాన్ని పంచుకోవటంలో ఏమైనా తప్పులుంటే క్షమించమని మనవి.


ఇట్లు,

బాబా బిడ్డ.



సాయిభక్తుల అనుభవమాలిక 650వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. మేరే బాబా మన వెంటే ఉన్నారు!
  2. బాబా దయవల్ల అనారోగ్యం నుండి విముక్తి
  3. ఊదీ మహిమ వలన మానసిక ఆందోళన దూరం

మేరే బాబా మన వెంటే ఉన్నారు!


సాయిభక్తురాలు శ్రీమతి ఉమ ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నమస్తే! ఈ బ్లాగు ప్రారంభించినప్పటి నుండి వచ్చిన సాయిభక్తులందరి అనుభవాలు చదువుతుంటే, మేరే బాబా (నా బాబా) తన బిడ్డలను ఎప్పటికీ విడిచిపెట్టరని నమ్మకం కలుగుతుంది. ఇంకొకసారి మేరే బాబా నా వెంటే ఉన్నారనే దృఢమైన నమ్మకాన్ని ఇచ్చారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.  


నా పేరు ఉమ. మేము దుబాయిలో ఉంటాము. మా పెద్దబ్బాయి కెనడాలో ఉంటున్నాడు. ప్రసవ సమయంలో కోడలికి తోడుగా ఉందామని 2019, నవంబరు 10వ తేదీన నేను కెనడా వెళ్లాను. ఆరునెలలు అక్కడే ఉండి, ఏప్రిల్లో తిరిగి వచ్చేద్దామని వెళ్ళేముందే అనుకున్నాను. కానీ కరోనా కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో నేను 11 నెలలపాటు కెనడాలో ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి 2020, అక్టోబరులో దుబాయి తిరిగి వచ్చాను. అయితే ఆరునెలలకు పైగా అక్కడ ఉండిపోవటం వలన నా దుబాయి రెసిడెన్సీ వీసా రద్దు చేయబడింది. దాంతో మళ్ళీ వీసాకి దరఖాస్తు చేశాను. దానికోసం నాకు రక్తపరీక్ష, ఛాతీ ఎక్స్-రే తీశారు. తరువాత వీసా కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎక్స్-రే డిపార్టుమంట్ నుండి, ‘ఏదో అనుమానం ఉంది. ఒకసారి హాస్పిటల్‌కి రమ్మ’ని మావారికి మెసేజ్ వచ్చింది. మావారు ఆఫీసు నుండి ఫోన్ చేసి ఆ విషయాన్ని నాకు చెప్పి, “నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వు సిద్ధంగా ఉండు” అని చెప్పారు. ఒక్కసారిగా నాకు చాలా భయమేసి, “నాకు ఏమయింది బాబా?” అని బాబాతో మాట్లాడుకుంటూ ఏడ్చేశాను. తరువాత ఏడుస్తూనే బాబా సమాధానం కోసం ఫేస్‌బుక్ ఓపెన్ చేశాను. “నేను నీ చెంత ఉండగా భయమేల?” అనే బాబా సందేశం కనిపించింది. బాబా సమాధానానికి ఆనందంతో ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేశాను. అంతలో మావారు వచ్చి నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్లు నాకు ‘స్పుటుం’ టెస్ట్ చేశారు. మళ్ళీ మరుసటిరోజు కూడా వచ్చి మరోసారి టెస్ట్ చేయించుకొని వెళ్ళమన్నారు. అసలు ఏం జరుగుతోందో, ఏం చేయాలో నాకేమీ అర్థంకాని స్థితిలో, “బాబా! నువ్వే నాకు దిక్కు” అని మనసులో అనుకున్నాను. తరువాత హాస్పిటల్ నుండి తిరిగి వస్తూ మావారిని, “స్పుటుం టెస్టు ఎందుకు చేస్తారు?” అని అడిగాను. అందుకు మావారు, “ఊపిరితిత్తులకు సంబంధించి ఏదైనా వ్యాధి ఉందన్న అనుమానం ఉంటే ఆ టెస్టు చేస్తారు” అని చెప్పారు. నాకింక ఏడుపు ఆగలేదు. ఆ బాధలో, “ఇదంతా ఏమిటి బాబా? ఏదేమైనా నాకు మీరే దిక్కు మేరే(నా) బాబా! నా రిపోర్టులు నార్మల్ అని వస్తే నా అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా అందరితో పంచుకుంటాను” అని నా మనసులోనే బాబాకు చెప్పుకున్నాను. రెండురోజుల తర్వాత మావారికి హాస్పిటల్ నుండి “సమస్య ఏమీ లేద”ని మెసేజ్ వచ్చింది. మావారు ఆఫీసు నుండి నాకు ఫోన్ చేసి, “భయపడవద్దు, ‘అంతా బాగుంద’ని హాస్పిటల్ నుండి మెస్సేజ్ వచ్చింది” అని చెప్పారు. ‘అంతా మీరే చూసుకోవాలి మేరే బాబా, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను మేరే బాబా’ అని అనుకున్న ప్రతిసారీ మేరే బాబా (నా సాయి) నా వెంటే ఉండి నన్ను చూసుకుంటున్నారు. ఆయన కృపవలన నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అంతా బాబా దయ. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”


ఓం సాయిరాం!


బాబా దయవల్ల అనారోగ్యం నుండి విముక్తి


సాయిభక్తురాలు శ్రీమతి లలిత ఇటీవల బాబా తనకు ప్రసాదించిన చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం సాయిరామ్! ముందుగా సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈమధ్య నేను గ్యాస్ట్రిక్ సమస్య వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. ఆ కారణంగా కడుపులో తీవ్రమైన నొప్పి, చేతుల్లో చురుక్ చురుక్ మంటూ చాలా బాధపడ్డాను. అప్పుడు బాబాను ప్రార్థించి, “ఈ సమస్య నుంచి రక్షించండి బాబా. తగ్గితే, నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని వేడుకున్నాను. తరువాత బాబా ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగాను. ఇంకా, ఆ రోజంతా బాబా నామస్మరణ చేశాను. బాబా దయవల్ల నేను అనారోగ్యం నుండి బయటపడ్డాను. “బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు”.


ఊదీ మహిమ వలన మానసిక ఆందోళన దూరం


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

 

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


నేను చాలారోజుల నుండి మానసికవ్యాధితో బాధపడుతున్నాను. దానివలన నేను ఆరోగ్యరీత్యా చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. ముఖ్యంగా రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టేది కాదు. నా పరిస్థితి చూసి నేనేమైపోతానోనని నా తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగాము. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి నేను హాస్పిటల్‌కి వెళ్లడం మానేసి, బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నుదుటన ధరించి నిద్రపోవడం మొదలుపెట్టాను. బాబా దయవలన కొద్ది క్షణాల్లోనే నాకు నిద్రపట్టేది. నెమ్మదిగా మానసిక ఆందోళన నుండి కూడా నేను బయటపడ్డాను. ఏ డాక్టరు వల్ల సాధ్యం కానిది బాబా కృపవల్ల సాధ్యమైంది. బాబా ఎల్లప్పుడూ ఇలాగే మనందరినీ కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"



సాయిభక్తుల అనుభవమాలిక 649వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. స్వయంగా వచ్చి దక్షిణ స్వీకరించిన బాబా
  2. బాబా అద్భుతం చేస్తారు!

స్వయంగా వచ్చి దక్షిణ స్వీకరించిన బాబా


సాయిభక్తులందరికీ సాయిరాం! నాపేరు అరుణలక్ష్మి. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలోనుండి రెండు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


మొదటి అనుభవం:


2020, డిసెంబరు 15వ తేదీ మంగళవారంరోజు ఒక అద్భుతమైన సంఘటన నా జీవితంలో జరిగింది. నేను సోమవారంనాడు ముఖం కడుక్కుంటున్నప్పుడు నా చేతికున్న బంగారు లక్ష్మీదేవి ఉంగరం జారి పడిపోయింది. వెంటనే దాన్ని తీసి బాత్రూం తలుపుపైన ఉంచాను. కానీ, అక్కడ ఉంగరం ఉంచిన సంగతి మర్చిపోయి నిద్రపోయాను. మర్నాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఉంగరం సంగతి గుర్తొచ్చి బాత్రూంలోకి వెళ్లి వెతికితే ఎక్కడా ఉంగరం కనిపించలేదు. ఆ చుట్టుప్రక్కల కూడా ఎంతో వెతికాను, అయినా ఉంగరం దొరకలేదు. దాంతో ఎంతో బాధపడి, ఉంగరం దొరికేలా చేయమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. బాబా నిత్యం తన భక్తుల మాటలు వింటూ ఉంటారు, వారిని ఆదుకుంటూ ఉంటారు. బాబాను స్మరించుకుంటూ మరలా వెతకగా మా ఇంట్లోని ఓ అలమరాలో ఒక ప్రక్కన నా ఉంగరం దొరికింది. అసలా ఉంగరం అక్కడికి ఎలా వచ్చిందోనని ఇంట్లో అందర్నీ అడిగితే, మా ఇంట్లో పనిచేసే ఆవిడకు ఆ ఉంగరం దొరికిందనీ, తనే అక్కడ పెట్టిందనీ, కానీ ఆ విషయం మాకు చెప్పడం మర్చిపోయిందనీ తెలిసింది. ఇలా బాబా నా సమస్యను తీర్చారు


రెండవ అనుభవం:


ఇది నా జీవితంలో చాలా సంతోషకరమైన అనుభవం. ఒకరోజు నేను ఆర్టీసీ బస్టాండులో నా స్నేహితులను కలిసి మాట్లాడుతూ ఉండగా, లుంగీ కట్టుకుని, మాసిన గడ్డంతో ఉన్న ఒక ముసలివ్యక్తి అక్కడున్న వాళ్ళనెవరినీ యాచించకుండా నేరుగా నా దగ్గరకు వచ్చి, “నాకు మూడు రూపాయలు ఇవ్వు” అని అడిగారు. నేను బ్యాగులోంచి ఐదు రూపాయలు తీసి ఇస్తే, “నాకు ఐదు రూపాయలు వద్దు, మూడు రూపాయలు మాత్రమే కావాలి” అని అన్నారు. నేను మళ్ళీ బ్యాగులో వెతికి మూడు రూపాయలు తీసి ఇవ్వగానే ఆయన ఇంకెవరినీ ఏమీ అడగకుండా అక్కడినుంచి వెళ్ళిపోయారు. అది చూసిన నా స్నేహితురాలు, “భిక్షాటన చేసే వ్యక్తి అలా డిమాండ్ చేస్తున్నారేమిటి?” అని అడిగింది. బాబా చూపిన కరుణకు కరిగిపోతున్న నేను, అది డిమాండ్ చేయడం కాదనీ, ఆరోజు ఉదయం నేను బాబా గుడికి వెళ్లి బాబాను దర్శించుకుని, మూడు రూపాయలు దక్షిణ బాబాకు సమర్పించుకోవాలని అనుకున్నాననీ, కానీ తొందరలో ఆ మూడు రూపాయలు దక్షిణ బాబాకు సమర్పించకుండానే వెళ్ళిపోయాననీ, అందుకే ఆ ముసలివ్యక్తి రూపంలో బాబానే స్వయంగా వచ్చి దక్షిణ స్వీకరించారని ఎంతో ఆనందంతో చెప్పాను.  


బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఎంతో ఆనందంతో మీతో పంచుకుంటున్నాను. ఇటువంటి అనుభవాలు మన సాయిభక్తుల జీవితాలలో ఎన్నో ఉంటాయి. నాకు ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నా అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకునే అవకాశం ఇచ్చిన ఈ గ్రూపు సభ్యులకు చాలా చాలా ధన్యవాదాలు. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా అద్భుతం చేస్తారు!


సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు వాణిశ్రీ. మాది నరసాపురం. సాయి నా జీవితంలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయింది. అప్పటినుండి నా సాయిదేవునితో స్నేహం, కోపం, అలకలు, వేడుకోవడం, బాధపడి మాట్లాడడం మానేయడం, మరలా తలచుకోవడం.. ఇట్లా నా సాయిదేవుడు నన్ను ఏనాడూ వదలకుండా అనుక్షణం నా ప్రక్కనే ఉండి చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద సమస్యల వరకు నా దాకా రాకుండానే తొలగిస్తున్నారు. అవి వెళ్ళిపోయాక తెలుస్తోంది అవి ఎంత పెద్ద కష్టాలోనని. ఇటీవల నా స్నేహితురాలికి చేసిన ప్రాథమిక పరీక్షల్లో తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారించారు డాక్టర్లు. ఈ విషయం తెలిసిన నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. వెంటనే సాయి వద్దకు వెళ్ళి నా స్నేహితురాలు ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమని మొరపెట్టుకున్నాను. కొద్దిరోజుల క్రితం, “నా స్నేహితురాలికి ట్యూమర్ తగ్గి తను ఆరోగ్యంగా ఉంటే ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు చెప్పుకున్నాను. నాకు తెలుసు బాబా అద్భుతం చేస్తారు అని. సరిగ్గా బాబాకు మ్రొక్కుకున్న వారం రోజులకి తెలిసింది, ‘తనకు ఉన్నది ట్యూమర్ కాదు’ అని. ‘తనకేదో ఇన్ఫెక్షన్ ఉందని, అదేమీ ప్రమాదకరమైనది కాద’ని చెప్పారు డాక్టర్లు. ఆ విషయం తెలియగానే ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాకు మాట ఇచ్చినట్లు, వెంటనే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. నా అనుభవాన్ని పంచుకోవటంలో తప్పులేమైనా ఉంటే క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. ఓం సాయిరాం!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo