- సాయితండ్రిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది
- కరోనా పరీక్ష అవసరం లేకుండా ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా
సాయితండ్రిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది
సాయిభక్తుడు వై.శ్రీనివాసరావు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులకు నమస్కారం. గతంలో సాయితండ్రి నాకు ప్రసాదించిన అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. అలాగే, నా కుమారుని విషయంలో సాయితండ్రి చేసిన అద్భుతమైన మిరాకిల్‌ను ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. నా అనుభవాలను అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నా పెద్దకుమారుడు B.Tech (మెకానికల్) పూర్తయిన తరువాత తనకు జర్మనీలో M.S చేయాలని ఉందని మాతో చెప్పాడు. మేము అందుకు అంగీకరించి అందుకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించాము. ఈ విషయంలో సాయితండ్రి సహాయం కోరుతూ 5 వారాలు ‘సాయి దివ్యపూజ’ చేద్దామనే తన ఆలోచనను నా భార్య పద్మావతి నాతో చెప్పింది. వెంటనే మేము సాయి దివ్యపూజ 5 వారాలు చేద్దామని నిర్ణయించుకొని, సాయి తండ్రికి ముడుపు కట్టి, ‘పూజ ముగిసేలోపు మా కుమారునికి జర్మనీలో మంచి యూనివర్సిటీలో, మంచి కోర్సులో M.S సీటు వచ్చేటట్లు చేయమ’ని బాబాను ప్రార్థించాము. వెంటనే M.S సీటు కొరకు జర్మనీలోని యూనివర్సిటీలకు దరఖాస్తు చేయటం ప్రారంభించాము. ఒక మంచి యూనివర్శిటీ వాళ్ళు మా కుమారునికి "Space Engineering" కోర్సులో అడ్మిషన్ ఇవ్వడానికి అంగీకరిస్తూ, జర్మనీ భాషలో B1 సర్టిఫికెట్ తప్పనిసరిగా కావాలని షరతు విధించారు. కానీ మా కుమారునికి B1 సర్టిఫికెట్ పూర్తికాలేదు. అందువలన ఆ యూనివర్సిటీవాళ్ళు మా కుమారుని దరఖాస్తుని తిరస్కరించారు. అప్పటికి సాయి దివ్యపూజ 5 వారాలు పూర్తయ్యాయి. “మా కుమారుని M.S విషయంలో సహాయం చేయమ”ని మేము సాయితండ్రిని ఆర్తిగా ప్రార్థించాము. అందరినీ శ్రద్ధ, సబూరిలతో ఉండమని, ఏమి జరిగినా మన మంచికే అనుకొని ముందుకు వెళ్ళమని మన సాయితండ్రి చెప్పిన మాటలు గుర్తుచేసుకుని మా కుమారుని విషయంలో బాబా అంతా మంచే చేస్తారని నమ్మకంతో ఉన్నాము. మేము నమ్మినట్లే బాబా గొప్ప మిరాకిల్ చేశారు. ఏ యూనివర్సిటీ అయితే జర్మనీ భాషకు సంబంధించిన B1 సర్టిఫికెట్ లేదని మా కుమారుని దరఖాస్తుని తిరస్కరించిందో, అదే యూనివర్సిటీ ‘B1 సర్టిఫికెట్ అవసరం లేదని, మా కుమారుని M.S సీటు కేటాయిస్తున్నామ’ని మాకు ఇ-మెయిల్ చేశారు. బాబా చేసిన అద్భుతానికి మేమంతా ఆశ్చర్యానందాలకు లోనయ్యాము. తరువాత మా కుమారుడు ఆ యూనివర్సిటీలో "Space Engineering" కోర్సులో చేరి ఆన్లైన్ క్లాసులకు కూడా హాజరవుతూ ఉన్నాడు. ఆ తరువాత, 2020, డిసెంబరు 12వ తేదీన మరొక జర్మన్ యూనివర్సిటీలో "Material Science" కోర్సులో మా కుమారుడికి M.S సీటు వచ్చింది. ఈ యూనివర్సిటీ జర్మనీలోని టాప్ 10 యూనివర్సిటీలలో 5,6 స్థానాలలో ఉంటుందట. మాకు చాలా చాలా సంతోషం కలిగింది. సాయితండ్రిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. తనను నమ్ముకున్నవారిని సాయితండ్రి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. కేవలం మనం కొద్దిగా శ్రద్ధ, సబూరి కలిగివుంటే చాలు. “సాయితండ్రీ! ఎల్లప్పుడూ ఇలాగే నీ బిడ్డలను కనిపెట్టుకొని ఉండమని, మా కుమారుల చదువు విషయంలో సహాయం చేస్తూ వారికి తోడుగా ఉండమని మీ దివ్యచరణాలను వేడుకుంటున్నాము”.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
కరోనా పరీక్ష అవసరం లేకుండా ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా
సాయిభక్తుడు కె.శ్రీనివాసరావు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరావు. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా నాకు, నా కుటుంబానికి ప్రసాదించిన మరొక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.
నా భార్య టిబి కోసం కొంతకాలంగా మందులు వాడుతోంది. ఇటీవల కరోనా సమయంలో తన ఆరోగ్యం బాగాలేక తనను డాక్టరు వద్దకు తీసుకువెళ్ళాను. డాక్టరు ముందుగా, “మీకు జ్వరం, జలుబు ఉన్నాయా?” అని అడిగి, అవేమీ లేవని చెప్పిన తర్వాత లోపలికి రమ్మన్నారు. నేను, నా భార్య లోపలికి వెళ్ళాము. డాక్టరు తనను పరీక్షించిన మీదట, “టిబి పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి ఆ మందులు ఇక వాడొద్దు” అని చెప్పారు. ఆ మాట వింటూనే బాబా దయతో నా భార్యకు టిబి తగ్గిపోయిందని చాలా సంతోషించాను. తరువాత, “నా భార్యకు నొప్పులు (గొంతునొప్పి, ముక్కునొప్పి మొదలైనవి) ఎక్కువగా ఉన్నాయ”ని డాక్టరుతో చెప్పాను. అందుకు డాక్టరు, “కరోనా పరీక్ష చేయించుకొని రండి, లేకపోతే చూడను” అని చెప్పి మమ్మల్ని బయటకు పంపేశారు. ఇక చేసేదిలేక మరుసటిరోజు ఉదయం మేము కరోనా పరీక్ష చేయించుకోవడానికి బయలుదేరాము. అక్కడికి వెళ్లేముందు బాబా గుడికి వెళ్ళాము. బాబా దర్శనం చేసుకొని, ఆయనను ప్రార్థించాము. తరువాత గుడి నుండి బయటకు వస్తున్నంతలో బాబా గుడి సభ్యులలో ఒక డాక్టరు కనిపించారు. నేను వారితో విషయం చెప్పాను. బాబా అనుగ్రహం వలన ఆయన, “కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేద”ని కొన్ని మందులు వ్రాసిచ్చి, “రెండు రోజులు ఇవి వాడండి, బాబా దయతో తగ్గిపోతుంది” అని అన్నారు. బాబాను ప్రార్థించినంతనే ఈ విధంగా కృప చూపారని మేము చాలా సంతోషించాము. తరువాత మేము బాబాను ప్రార్థించి, ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగుతూ మందులు కూడా వాడాము. బాబా దయతో రెండురోజులలో నా భార్యకు గొంతునొప్పి, ముక్కునొప్పి అన్నీ తగ్గిపోయాయి. ప్రస్తుతం నా భార్యకు ఒక సమస్య ఉంది. బాబా దయవలన ఆ సమస్య తీరితే ఆ అనుభవాన్నీ మీతో పంచుకుంటాను. జై సాయిరాం!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!