వాగ్లే, అతని స్నేహితులు స్నానం వగైరా ముగించుకుని మధ్యాహ్నం హారతి సమయానికి మళ్ళీ మశీదుకి వెళ్లారు. అక్కడి వైభవాన్ని చూసి వాగ్లే మనసు విస్మయానికి లోనైంది. అతని స్నేహితుడు శ్రీబస్తోద్కర్ నోటి నుండి అప్రయత్నంగా "ఎంతటి నాస్తిక పాషానుడైనప్పటికీ, ఈ సమయంలో మనసు ఇక్కడ లీనమవ్వాల్సిందే!" అని వెలువడ్డాయి. నిజంగా ఆ దృశ్యాన్ని గుర్తుచేసుకుంటూ, ‘అంతలా మనసు పూర్తిగా ఎలా లీనమవుతుందో అనిపిస్తుంద’ని వాగ్లే అంటారు. ఆ సమయంలో వెండి ఆసనం దీపాల కాంతులతో వెలిగిపోతోంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిశ్రద్ధలతో బాబాను పూజిస్తున్నారు. కొందరు వారి శిరస్సుపై గంధాక్షతలు పెడుతున్నారు, కొందరు పువ్వులు సమర్పిస్తున్నారు, కొందరు బిల్వ పత్రాలు, తులసి చేతపట్టుకుని ఉన్నారు, కొందరు హారతి ఇస్తున్నారు, కొందరు వారి చేతులకు తాంబూలం అందిస్తున్నారు. ఇలా గంటసేపు పూజ కార్యక్రమం కొనసాగి హారతి పూర్తైన తర్వాత భక్తులందరూ భోజనానికి వెళ్లారు. 'కానీ అక్కడ ఒక ఆచారం ఉందని, ఎవరైనా ఏదైనా కోరికతో దర్శనానికి వస్తే, ఆ కోరికలు బాబాకు విన్నవించుకొనే నిమిత్తం ప్రతిరోజూ ఆరతి అనంతరం కొంత సమయం కేటాయిస్తారని, అప్పుడు పాత, కొత్త భక్తులందరూ అక్కడ ఉండి బాబా తమ ఆసనంపై ఆశీనులయ్యాక వారికి దక్షిణ సమర్పించి, వారి చేతుల మీదుగా ఊదీ ప్రసాదాలు స్వీకరించి తాము వచ్చిన పని పూర్తయ్యాక సెలవు తీసుకొని వెళ్ళిపోతారని, అది అక్కడి పద్దతి అని, ఆ సమయంలో బాబా అనేక భాషలలో మాట్లాడుతూ, భక్తుల వద్ద నుండి దక్షిణ స్వీకరించి, జేబులో వేసుకొని, వారికి ప్రసాదమిచ్చి, ఆ తర్వాత ఎవరైనా ఏదైనా అడిగితే, సమాధానం చెప్తారని, కొందరు తమ పరీక్షల గురించి అడిగేవారని, దానికి బాబా 'అంతా సవ్యంగా ఉంటుంద'ని అని బదులు చెప్పేవారని, ఎవరూ ఏమీ అడగకున్నా అక్కడున్న వారందరూ పూర్తిగా సంతృప్తి చెందేవారని, అలా అక్కడున్న వారందరి మనసులోని మాటలకు బాబా సమాధానం చెప్తారని' వాగ్లే తెలియజేసారు.
అందుకని హారతి పూర్తైన తర్వాత వాగ్లే, అతని స్నేహితులు అక్కడే ఉండి బాబా పక్కన కూర్చున్నారు. అతని స్నేహితులలో ఒకరు 4, ఒకరు 8 అణాలు బాబాకు దక్షిణ సమర్పిస్తే, ఆయన వాటిని తీసుకొని "సరిపోతుంది" అని చెప్పారు. వాగ్లే ఒక రూపాయి సమర్పిస్తే, వారు దానిని తీసుకొని తమ జేబులో వేసుకున్నారు. 'ఆ జేబు వారి ఖజానా. ఎందుకంటే, డబ్బంతా అందులోనే ఉంటుందని, ఏ సమయంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా ఆ ధనాన్ని వినియోగిస్తారని, రోజువారీ ఖర్చులన్నీ ఆవిధంగా జరుగుతాయని అంటార'ని వాగ్లే తెలియజేసారు.
ఇకపోతే, బాబా వాగ్లే ఇచ్చిన దక్షిణ తమ జేబులో వేసుకున్న తర్వాత అతనికి ప్రసాదమిచ్చి ఎవరికీ అర్థంకానీ రీతిలో తమ చేతితో సైగ చేసి అతని మనసులో మెదులుతున్న ఆలోచనకు సమాధానం చెప్పారు. అది చూసి అతను జలదరించిపోయాడు. కారణం, ఆ సమయంలో ఒక యువతి అతన్ని తన వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంది. దాని గురించే బాబా చెప్పారు. ఆ తర్వాత వాగ్లే, అతని స్నేహితులు కొని తెచ్చుకున్న బాబా ఫోటోలు బాబాకిచ్చి, వారి చేతుల మీదగా తిరిగి తీసుకున్నారు. ఇక్కడ చెప్పవలసిన ఒక విషయం ఏమిటంటే, వాళ్ళు తమ తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు తీసుకుని, బాబా వద్ద అనుమతి తీసుకోకుండానే రైలు ఎక్కాలని నిర్ణయించుకొని టాంగా కూడా మాట్లాడుకొని ఉన్నారు. కానీ వాళ్ళు నమస్కారం చేసి బయలుదేరబోతుండగా బాబా వాళ్ళతో, "ఇప్పుడు బొంబాయికి వద్దు, వెళ్లి వాడాలో కూర్చోండి" అని చెప్పారు. ఇంకా పాటిల్ నామధేయం గల గ్రామానికి చెందిన గృహస్థుడిని పిలిచి, "వీళ్ళని సాయంత్రం బెల్లం తయారీ జరిగే చోటకి తీసుకెళ్లి, తాగడానికి చెరుకు రసం ఇవ్వు" అని చెప్పారు. దాంతో వాళ్ళు చేసేదిలేక టాంగావానికి డబ్బులిచ్చి పంపేసి వాడాకి వెళ్లారు. అక్కడ వాగ్లే స్నేహితులిద్దరూ నిద్రపోగా అతను మాత్రం నిద్రపోకుండా పడుకొని విశ్రాంతి తీసుకుంటుంటే, కొంతసేపటికి పెద్ద కోలాహలం అతని చెవిన పడింది. 'ఏంటిది? అక్కడ ఏం జరుగుతుంది?' అని అతను కుతూహలంగా అది చూడటానికి వెళ్ళాడు.
ఆ సమయంలో మశీదు వద్ద చాలా జనం గుమిగూడి ఉన్నారు. మూడు, నాలుగు భక్తబృందాలు తబలాలు వాయిస్తూ ఒకే తాళంలో బాబాను కీర్తిస్తూ పాటలు పడుతున్నారు. వాటన్నింటిలోనూ నిరంతరాయంగా వస్తున్న ఏకైక చరణం 'సాయిబాబారే, సాయినాథారే'. వాగ్లే మశీదు బయట నిలబడి అదంతా చూస్తుండగా బాబా అతన్ని చూసి, "ఏ అబ్బాయీ! ఇక్కడికి రా(ఏ చోకర ఈదర ఆవ్)" అని దగ్గరకి పిలిచారు. అతను వారి దగ్గరకి వెళ్లి, వారికి నమస్కరించి, బాబా వైపే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆయన, "వాడాకి వెళ్లి మరో 5 రూపాయలు తీసుకొని రా" అని అన్నారు. అది విని బాబా సర్వజ్ఞతకు అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, ఆ సమయంలో అతని దగ్గర సరిగ్గా 5 రూపాయలే ఉన్నాయి. అయినా అతను తొందరగా వాడాకు వెళ్లి, ఆ 5 రూపాయలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, అక్కడే కూర్చున్నాడు. కారణం అతను బాబాతో పైన పేర్కొన్న(ముందు భాగంలో) నారేకర్ గురించి మాట్లాడాలని. కానీ అతను అతని గురించి బాబాకి వినతి చేసుకోబోతుండగా బాబా ఉన్నట్టుండి ఒక్కసారిగా భయంకర రూపు దాల్చారు. ఆయన కళ్ళు ఎర్రగా మారిపోయాయి. వాటిని పెద్దగా చేసి, నోటితో పెద్దపెద్దగా శబ్దాలు చేస్తూ తీవ్రంగా తిట్టనారంభించారు. ఆ సమయంలో వారిని స్తుతిస్తున్న కొందరు, అలాగే సమీపంలో కూర్చుని సాయి లీలలున్న ఏదో గ్రంథం చదువుతున్న వార్ధాకి చెందిన శ్రీనాయక్ తదితరులు బాబాని ఆ స్థితిలో చూసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే తటస్థంగా ఉండిపోయారు. బాబా హఠాత్తుగా సమక్షంలో ఎవరున్నా శాపనార్థాలు కురిపిస్తూ జమదగ్ని అవతారం ఎందుకు దాల్చారో ఎవరికీ అర్థం కాలేదు. భక్తులంతా భయంతో వణికిపోయారు. 'ఎవరి మీద ఈ మండిపాటు? ఎవరి పాతక వృక్షాన్ని సమూలంగా తుడిచిపెడుతున్నారు?' అన్నది ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. బాబా దృష్టి మాత్రం ఎక్కడో దూరంగా ఉంది. వారి నోటి వెంబడి "అలాంటి పనులు చేసి(బహుశా దుష్కర్మలు) నా దగ్గరకి వస్తే, నేను నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తాను" అని వెలువడ్డాయి. ఈవిధంగా సుమారు 10 నిముషాలపాటు సాగింది. అంతలో బాబా దృష్టి ఉన్న దిశలో పొడవాటి చెట్టు గుండా సూర్యకిరణాలు పట్టు వస్త్రంపై పడి చమక్, చమక్మని మెరవడం కనిపించింది. అంటే, దూరంగా ఇద్దరు ఆడవాళ్లు రావడం కనిపించసాగింది. వాళ్ళు అలా అలా దగ్గరకు వస్తుండగా, బాబా అలా అలా తమ దృష్టి మరోవైపుకు మళ్లించి నోటిలో చిలుము పెట్టుకొని పీల్చడం ప్రారంభించారు. అంతలో సుందరమైన మధ్యవయస్కురాలు పల్చని జరీ చీర ధరించి తన దాసితో మశీదు లోపలికి వచ్చింది. ఆమె చాలాసేపు నిలబడి బాబాకి నమస్కరించింది. కానీ బాబా ఆమెను ఏమాత్రమూ పట్టించుకోలేదు. అప్పుడు ఎవరో 'ఆమె నగర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ధనిక జాగీర్దార్ వితంతువు, మీ దర్శనానికి వచ్చింది' అని చెప్పారు. బాబా మార్మిక భాషలో, "నన్నెందుకు ఇబ్బందిపెడుతున్నారు. దీని గురించి అంతా నేను ముందే చెప్పలేదా? ఆమెను కూర్చోమని చెప్పండి" అని అన్నారు.
వాగ్లే కొంత సమయం తరువాత అవకాశం చూసుకొని నారేకర్ గురించి, అతని భార్యాబిడ్డల పరిస్థితి గురించి బాబాతో చెప్పాడు. బాబా అతను చెప్పిందంతా ప్రశాంతంగా విని నారేకర్ను పిలిపించి, "రేపు అతనితోపాటు వెళ్ళు" అని ఆజ్ఞాపించారు. నిజానికి వాగ్లే అదివరకే నారేకర్ను వెతికి పట్టుకొని, అతని కుటుంబ పరిస్థితుల గురించి అతనితో మాట్లాడాడు. గడ్డం వగైరా పెంచుకొని గుప్తంగా ఏకాంతంలో గడుపుతున్న అతను వాగ్లే చెప్పినదానికి సానుకూలంగా స్పందించలేదు. కానీ బాబా మాటని ధిక్కరించే సాహసం అతను చేయలేదు. అతను, వాగ్లే ఆ రాత్రి అతని రహస్య స్థలానికి వెళ్ళేముందు బాబా వద్దకు వెళ్లి వారి అనుమతి తీసుకున్నారు. మరుసటిరోజు వాళ్ళు శిరిడీ నుండి బయలుదేరి వారి గమ్యస్థానానికి క్షేమంగా చేరుకున్నారు.
వాగ్లే తన అనుభవం గురించి, ‘ఇలాంటి సందర్భం నా జీవితకాలం మొత్తంలో ఒక్కటే ఎదురైంది. అది కనీసం పూర్తి ఇరవై నాలుగు గంటల సమయం కూడా కొనసాగలేదు. అయినప్పటికీ, ఆ క్షణాన్ని నేను ఎప్పుడు తలచుకున్నా నా హృదయం అంతులేని ఆనందంతో పొంగిపోతుంది. మేము బాబాను తెలుసుకోలేదు, ఆయన గురించి ఆలోచించలేదు. కానీ ఆయన అనంతమైన దయతో మాకు స్ఫూర్తినిచ్చి తమ పవిత్ర పాద దర్శనాన్నిచ్చారు. సంతృప్తికరంగా జీవించే అవకాశం కల్పించారు. ఆ మహనీయుని పాదాల చెంత ఉండటం నా కర్తవ్యమని గ్రహించి నేను నా మనసున ఆ ఆత్మోద్ధారకుని పాదాలకు నమస్కరిస్తూ, "ప్రజలందరూ సుఖంగా, సుసంపన్నంగా ఉండాలి" అని ప్రార్థిస్తున్నాను’ అని తెలియజేసారు.
గమనిక: బాబా అప్పుడప్పుడు జమదగ్నిలా తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయేవారని, ఆయన ఎందుకు అంత భయంకరమైన రూపాన్ని దాల్చేవారో ఎవరికీ తెలిసేది కాదని చాలామంది భక్తులు తమ అనుభవాలలో చెప్పి ఉన్నారు. అందుకు శ్రీవాగ్లేగారి పైఅనుభవం తగిన వివరణ ఇస్తుంది. కాస్త యోచించినట్లైతే, బాబా భక్తులు తమ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అంతరాలలో దాగి ఉన్న(గతంలో చేసిన) దుష్కర్మల పట్ల తీవ్ర ఆగ్రహానికి గురయ్యేవారని, అయినప్పటికీ బాబా బాహ్యంగా ప్రదర్శించే ఆ కోపం లేదా ఆగ్రహం వెనుక అనంతమైన కరుణ దాగి ఉంటుందని పైఅనుభవం ద్వారా మనకి అర్థమవుతుంది.
సోర్స్: సాయిలీల పత్రిక 1938, 7,8,9 సంచిక

Baba me daya valana Kalyan ki marriage ipoindi variddarini kalipi unchu swamy
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏
ReplyDelete