ఈ భాగంలో అనుభవాలు:
1. ఏదైనా సరిచేసే బాబా
2. సదా మొర అలకిస్తామని మరోసారి ఋజువిచ్చిన బాబా
ఏదైనా సరిచేసే బాబా
సాయినాథునికి, సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రమాదేవి. 2026, జూలై నెల చివరి వారంలో ఒకరోజు మా మేనేజర్ ఒక విషయం చెక్ చేసి, కన్ఫర్మ్ చేయమని నాతో చెప్పింది. కానీ నేను మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన సదరు వ్యక్తి అందుబాటులో లేకపోవడం వలన గంటలోపు చెక్ చేసి చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను చెప్పేలోపు తను, 'నేను కావాలని ఆ విషయం చెప్పకుండా దాచాన'ని నన్ను తప్పుగా అర్థం చేసుకొని వేరే పని మీద నేను ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు కోపంగా మాట్లాడింది. "నా వలన ఏదైనా పొరపాటు జరిగిందా?" అని అడిగినా కూడా ఏం చెప్పలేదు. అదీకాక తను చెప్పిన పని విషయంలో ఏం జరిగిందో చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వేరే విషయంలో మెసేజ్ చేస్తే, దానికి కూడా రిప్లై ఇవ్వలేదు. అలా 3 రోజులు గడిచిపోయాయి కానీ, పరిస్థితి మారలేదు. పైఅధికారి కోపంగా ఉంటే ఎంత సమస్యగా ఉంటుందో అందరికీ తెలిసిందే! నేను ఆ సమయంలో ఎంత మానసిక వేదన అనుభవించానో బాబాకి తెలుసు. ఆ బాధలో సచ్చరిత్రలో చదివిన ఒక సంఘటన గుర్తు వచ్చింది. అదేమిటంటే, కాకమహాజనికి ఇతను యజమాని అని ఒకరిని బాబాకి చూపిస్తే, "అతని యజమాని వేరే ఉన్నారు" అని బాబా అంటారు. ఆ విషయం గుర్తొచ్చి, 'నా యజమాని బాబా మాత్రమే అని నాకు తెలిసి కూడా నేనెందుకు బాధపడాలి. జరిగినదానిలో నా తప్పు ఎంతమాత్రమూ లేదు. కాబట్టి అంతా బాబా చూసుకుంటారని' అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. 4వ రోజు 'జరిగిన విషయం తనకి మెసేజ్ చేస్తే బాగుంటుందేమో! తను రిప్లై ఇవ్వకపోయినా తనకి విషయం తెలుస్తుంది కదా!' అనిపించింది. వెంటనే బాబాని చీటీల వేసి, 'మెసేజ్ చేసి చెప్పాలా? వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పాలి?' అని అడిగాను. అందుకు బాబా 'మెసేజ్ చేయమని' చెప్పారు. సరేనని జరిగిన విషయం క్లుప్తంగా మెసేజ్ పెట్టాను తనకి. తను అది చూసి రిప్లై ఇవ్వలేదు. నేను బాబా చూసుకుంటారని వదిలేసాను. 5వ రోజు అనగ 2026, జూలై 28న ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ముందుగా బాబా గుడికి వెళ్ళి, "పరిస్థితి సరిచేయండి బాబా" అని వేడుకున్నాను. అలాగే దత్తస్వామిని కూడా వేడుకున్నాను. బాబా దయ చూపారు. నేను ఒక ఆఫీసు విషయంగా, అలాగే గురుపౌర్ణమి సందర్భంగా సెలవు కావాలని మెసేజ్ చేస్తే, తను మామూలుగా మాట్లాడింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా ఏదైనా సరిచేయగలరు. "శతకోటి కృతజ్ఞతలు బాబా. జన్మజన్మాంతరాలలో నాకు తోడుగా ఉండండి సాయి".
సదా మొర అలకిస్తామని మరోసారి ఋజువిచ్చిన బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!! సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నన్ను ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉంటారని, రాబోయే సమస్యలు నుండి నేను తేలిగ్గా బయటపడేటట్టు చేస్తారని నా ప్రగాఢ నమ్మకం. మా ఆయన ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉంటుండగా నేను 8 మా బాబుతో అత్తమామలు దగ్గర ఉంటున్నాను. కొద్దిరోజులు ముందు నాకు గొంతునొప్పి, జలుబులతోపాటు ఒంట్లో జ్వరం వచ్చినట్లు 2 రోజులు ఉండింది. మామూలుగా మా బాబు పనులన్నీ నేనే చూసుకుంటాను. ఒంట్లో బాగాలేకున్న ఆ రెండు రోజులు కూడా పిల్లాడిని చూసుకుంటూ, వాడి పనులన్నీ ఎవరి సహాయం లేకుండా చేసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ బాబా దయవల్ల 3వ రోజు నుంచి తగ్గుముఖం పట్టి నెమ్మదిగా జలుబు, గొంతునొప్పి అన్ని తగ్గిపోయాయి. మామూలుగా ఒంట్లో బాగా లేనప్పుడు కావలసినంత రెస్ట్ తీసుకోవచ్చు.కానీ, ప్రస్తుతం పిల్లాడితో రెస్ట్ కాదు కదా, ఏ పనైనా పక్క వాళ్ళు సహకరిస్తేనే అవుతుండటం వల్ల ఇక నుంచి నా ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉంటూ జలుబు, గొంతునొప్పి లాంటివి తెచ్చుకోకూడదని అనుకున్నాను. కానీ కొద్దిరోజులు తర్వాత ఇంట్లో ఒక డబ్బాలో ఏదో బిస్కెట్ ఉంటే ఆలోచించకుండా తిన్నాను. ఇంకా అప్పటినుండి గొంతులో కిచకిచ మొదలై గొంతునొప్పి వచ్చే సూచన కనపడింది. దాంతో మళ్ళీ ఇదివరకటిలా ఇబ్బందిపడాలా అని చాలా భయమేసింది. ఈసారి నా దగ్గర మందులు కూడా లేవు. అందువల్ల ఇంకేం చేయలేక, "బాబా! నాకు మళ్ళీ గొంతునొప్పి రాకుండా ఉండేలా అనుగ్రహించండి" అని బాబాని వేడుకొని ఆయన మీద భారమేసాను. ఆ రాత్రి గొంతుకు బామ్ రాసుకొని పడుకున్నాను. అంతే! బాబా దయవల్ల పొద్దున్న లేచేసరికి గొంతు బాగుంది. ఏ కిచకిచ, నస లేవు. హాయిగా ఉంది. ఈ అనుభవం ద్వారా బాబా నా మొర సదా అలకిస్తారని మరోసారి ఋజువు అయింది. "ధన్యవాదాలు బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Baba me daya valana Kalyan ki marriage ipoindi variddarini kalipi unchu swamy house kosam kattina money vapasu ippinchu thandri 🙏
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsairam
ReplyDelete