ఈ భాగంలో అనుభవం:
- కోరుకున్నట్లే గృహవైద్యంతో ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా
సాయిభక్తులందరికీ అనేక నమస్కారాలు, నా పేరు విజయ. నేను సాయిని నమ్ముకున్నదాన్ని. సుమారు 2023లో నా రెండు కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్ జరిగింది. తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా అంతకు ముందు లేని కాళ్లవాపు సమస్య కనిపించింది. దానివల్ల ఎక్కువసేపు నిల్చోవడం, నడవడం చేస్తే నాకు బాధగా ఉండేది. కాళ్లవాపుకి చాలా కారణాలుంటాయి గానీ, నాకు సరైన అవగాహన లేని కారణంగా నేను యూరాలజిస్ట్ దగ్గరకి వెళ్ళాను. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి, 'యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంద'ని కాళ్లలోకి నీరు చేరకుండా ఉండడానికి, యూరిన్ ఫ్రీగా అవడానికి చేయవలసిన ప్రక్రియ చేసి మందులిచ్చారు. బాధాకరమైన ఆ ప్రక్రియను ఎలాగో ఓర్చుకొని వాళ్ళు చెప్పిన మందులు వాడి అప్పటికి ఉపశమనం పొందాను. కాళ్లలో వాపు ఉన్నా కూడా నాకేమీ బాధ ఉండేది కాదు, ఎంతసేపైనా నిల్చోవడం, నడవడం చేయగలిగేదాన్ని. ఇలా 2, 3 సంవత్సరాలు గడిచిపోయాక 2026లో కొన్ని నెలలకు ముందు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. కాళ్ళలోకి నీరు చేరడం, యూరిన్ ఫ్రీ లేకపోవడం, స్టవ్ దగ్గర నిల్చొని వంట చేసేటప్పుడు, నడిచేటప్పుడు చాలా బాధ కాసాగింది. ఒక గంటకు మించి నిల్చోలేకపోయేదాన్ని. 'పరిస్థితి ఇలా ఉంటే ఇంట్లో పనులన్నీ ఎలా చేయాలి? జీవితమంతా ఎలా గడపాలి?' అని నా కాళ్ళ గురించి, భవిష్యత్తు గురించి బెంగపట్టుకుంది నాకు. తె ల్లవారుతుందంటే చాలు, నాకు భయమేసేది. ఎందుకంటే, ఇంట్లో నేను, నా భర్త మాత్రమే ఉంటాము. మాకు ఒక అమ్మాయి. తను, తన కుటుంబంతో హైదరాబాదులో ఉంటుంది. అయినా ఎవరైనా ఎంతకాలం మనకు సహాయం చేయగలరు? మనని మనమే చూసుకోవాలి. నాకు వచ్చిన బాధ నేనే తగ్గించుకోవాలి. కారణం నాకు డాక్టర్ దగ్గరకి వెళ్లడం ఇష్టం లేదు. అక్కడవాళ్ళు అన్ని రకాల టెస్టులు చేయడం, వాళ్లు చేసే బాధాకరమైన ప్రక్రియ, మందులు వాడటం నావల్ల అయ్యే పని కాదు. అందుకని నేను సాయినాథుని, "బాబా! నేను ఏ డాక్టర్ దగ్గరకి వెళ్ళను. నాకు తెలిసిన ఇంటి గృహవైద్యాలనే పాటిస్తాను. నీ అపారమైన దయతో నా కాళ్లు మళ్ళీ యధాప్రకారంగా నార్మల్ అయిపోవాలి. నా కాళ్ళలోకి నీరు చేరకూడదు. ఎటు వెళ్లే వ్యర్థాలు అటే వెళ్లాలి. మీ దయతో నా శరీరానికి తగ్గ గృహవైద్యాన్ని నాకు కనిపించేలా చేయి సాయీ" అని ప్రార్థించాను. అప్పుడే కాలం చేసిన మా అమ్మ కాళ్ల గురించిన మొక్కు ఒకటి నాకు గుర్తుకు వచ్చి, 'అది తీర్చకపోవడం వల్ల నాకు ఈ కాళ్లు బాధా?' అని అనిపించింది. దాంతో నేను, మా చెల్లి బాబాని క్షమాపణ వేడుకుని మా అమ్మ అనుకున్న విధంగా పూర్తిగా కాకపోయినా మాకు ఎంత అనుకూలత ఉందో ఆ ప్రకారం చేసాము. ఎందుకంటే, మనవి గాని, మన పూర్వీకులవి గాని మ్రొక్కులు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదని బాబా చెబుతారు. ఆ తర్వాత నేను యూట్యూబ్ చూస్తుంటే, నాకున్న
లక్షణాలను బట్టి నా సమస్య బ్లడ్లో యూరిక్ ఆసిడ్ పెరగడంగా గుర్తించాను. దానికి పరిష్కారమార్గాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోని బాబానే నా కంటపడేలా చేశారని భావించి, బాబాకి నమస్కరించుకుని 'శ్రీసాయి ధన్వంతరియే నమః' అనే నామం స్మరించి ఆ వీడియోలో నాకున్న లక్షణాలకు సంబంధించి ఉన్న ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా పాటించడం మొదలుపెట్టాను. సాయినాథుని దయవల్ల అతి తొందరలోనే నా బాధ క్రమక్రమంగా సమసిపోవడం గమనించాను. ఇప్పుడు చాలా చాలావరకు బాధ తగ్గింది. చాలా ఎక్కువసేపు నిల్చొని పని చేస్తున్నా బాధ కలగట్లేదు. నా బాధ తొలగించినందుకు, నా పనులు నేను చేసుకునే స్థితి కల్పించినందుకు, మళ్లీ జీవితంలో అలాంటి స్థితి వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఇచ్చినందుకు సాయినాథునికి అనేక అనేక కృతజ్ఞతలు(గృహ వైద్యం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతిరోజు వాడకపోయినా, జీవిత పర్యంతం వారానికి ఒకరోజు, లేదా అప్పుడప్పుడు వాడుకోవచ్చు).
ఈ అనుభవం ద్వారా బాబా నాకు తెలియజేసిన విషయాలు:.
1. మొక్కులు మర్చిపోకూడదు.
2. ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యాన్ని కోల్పోకూడదు.
3. భవిష్యత్తు గురించి బెంగపడకూడదు.
4. ఆలోచిస్తే ఉపాయం తడుతుంది.
5. మన శరీరతత్వం మనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదని గమనించాలి.
6. మనం చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేయాలి.
7. ప్రతి దానికి బాధపడితే ప్రయోజనం ఉండది.
8. మనకు పూర్తిగా తెలిసిన ఇంటి చిట్కాలు పాటించిన తర్వాత అవసరమైతే వైద్యుని దగ్గరకి వెళ్లాలి.
9. అలాగని ప్రాణాపాయ స్థితి వచ్చేవరకు డాక్టర్ దగ్గరకి వెళ్లకుండా నిర్లక్ష్యం చేయకూడదు.
10. అనవసరంగా అందరికీ అన్నీ చెప్పి భయపెట్టకూడదు.
11. ముఖ్యంగా దైవం మీద నమ్మకం, విశ్వాసం పూర్తిగా ఉండాలి.
12. అందుకు సాయినాథుడు చెప్పిన శ్రద్ధ, సబూరి పాటించాలని పూర్తిగా అర్థమైంది..
13. సాయిని నమ్ముకుంటే, తప్పకుండా మనకు మేలు చేస్తారు. కానీ అది జరగవలసిన సమయంలోనే జరుగుతుంది. మనకి అర్హత, యోగం కూడా ఉండాలి. ఏదైనా మన కర్మను బట్టే ఉంటుంది.
చివరిగా అడుగడుగునా తమ ఉనికిని చూపిస్తూ.. 'నేను నీ వెంటే ఉన్నాను' అని తెలియజేస్తున్న సాయినాథునికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ... శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

సాయిరాం.
ReplyDeleteనేను పంచుకోబోతున్న అనుభవం చాలా సామానమైనది కానీ దాని ద్వారా సాయి ఇచ్చిన భరోసా చాలా అమోఘమైనది..
నేను చాలా సంవత్సరాలనుండి ఒంటరితనపు డిప్రెషన్ తో బాధ పడుతూ వున్నాను. అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే , ప్రతి రోజంతా ఆకారణం గా గుండె లో ఏదో చాలా బాధ,భారం గా ఉన్నట్లు , ఏదో మనో వ్యధ గా గుండె నిండా pain గా ఉంటుంది.ఎవరైనా ఆప్యాయత చూపిస్తూ ఓదార్పు మాటలు మాట్లాడితే కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంటుంది ఇది చాలా సార్లు గమనిస్తుంటాను .కాబట్టి ఒక సాయి స్నేహం కోసం మనసు ఎపుడూ ఆశిస్తూ ఉంటుంది. మనకన్నా ఆధ్యాత్మిక జ్ఞానం, సాయి భక్తి లో ఒక మెట్టు పైన ఉన్నవారి స్నేహం మనల్ని సత్సంగత్యం లో సాయి కి సన్నిహితం గా ఉంచుతూ మాయ కి దూరం చేస్తుంది అని అంటారు. అలా అలాంటి భక్తుల స్నేహం కోసం ప్రయత్నించేదాన్ని. సాయి పరమయిన చర్చ చేస్తూ, సాయి విషయాలు, భావాలు పంచుకుంటూ, సాయి ప్రేమ తెలుసుకుంటూ అలా ఒంటరితనం కూడా పోగొట్టుకోవచ్చు కదా అని నేనెప్పుడూ బాబా ని ఈ విషయం గూర్చే ప్రార్థించ్చేదాన్ని.కానీ నాకు ఇంతవరకు అలా ఎవరి స్నేహం లభించలేదు.అలాంటి సాయిభక్తులు వున్నా కూడా ఎవరూ నాతో సాయి విషయాలు పంచుకోడానికి ఆసక్తి చూపలేదు, వారి స్నేహం నాకు దొరకలేదు. అందువల్ల ఎపుడూ ఎక్కడ వున్నా నా కంటూ ఏ కంపెనీ లేక ఒంటరిగా గడిపేస్తూ భారం గా ఫీల్ అవుతుంటాను ప్రతి రోజు ని..రోజులో ఎక్కువ భాగం బాబా విషయాల్లో ఉంటున్నా కూడా, మధ్య మధ్యలో ఈ ఒంటరితనపు భారము గుండె లో నిండిపోయి బాధ పడుతూ వుంటాను .. ఆ క్రమం లో ఈరోజు ఆదివారం 23rd August నాడు పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు రచించిన పుస్తకం పై నిర్వహించే పరీక్ష కి హైదరాబాద్ లో హాజరు అయినాను. పరీక్ష అయ్యాక మధ్య్హనం తిరిగి ఇంటికెళ్లాలని అనిపించలేదు. ఎందుకంటె మళ్లీ ఇంటికెళ్ళాక ఒంటరిగా ఉండాలి.అది తలచుకుంటే భయం వేసింది. అందుకని మా అక్క వాళ్ళింట్లో ఈరోజు గడుపుదాం అని వాళ్ళింటికి వెళ్ళాను. కాసేపయ్యాక వాళ్ళు ఈవెనింగ్ వళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉందని బయటికి వెళ్లిపోయారు. నన్ను రమ్మని అన్నారు. అయితే ఫంక్షన్స్, ready అవడం ఇవన్నీ నాకు సాధారణంగా గా ఆసక్తి వుండని కారణం చే వెళ్ళక మళ్లీ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయా. ఎంత ప్రయత్నించినా ఈ ఒంటరితనం తప్పేట్లు లేదు అని అనిపించింది . కాసేపయ్యాక మళ్లీ గుండె లో ఎదో బాధ తో భారం గా ఫీల్ అవడం మొదలు అయ్యింది. అలాంటి సమయం లో, సాయి నామం చెప్పుకుంటూ, బాబా పుస్తకాన్ని గుండె కి హత్తుకుని, బాబా వొడిలో నేను తల వాల్చినట్లు ఫీల్ అవుతూ ఆ బాధ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటాను.అలా చేస్తుంటే గుండె తేలిక అయ్యి ఆ బాధాకరమైన స్థితి శాంతిస్తూ ఉంటుంది కూడా.. అలా ఈ రోజు కూడా బాబా ని తలచుకుంటూ, బాబా వోడి లో ఉన్నట్లు భావిస్తూ నడుం వాల్చాను. ఆ తరువాత మనసులో, బాబా ఇంకెన్నాళ్లు ఈ డిప్రెషన్? నాకు ఒక మంచి ఆధ్యాత్మిక జ్ఞానం, సాయి భక్తి కలిగిన వారి స్నేహం అందించవచ్చు కదా అనుకున్నా.తరువాత ఇక నిద్ర కి ఉపాక్రామిద్దామని అనుకుంటూ నా పంజాబీడ్రస్ చున్నీ కి పెట్టిన safety pins తీద్దాం అని ప్రయత్నిస్తుంటే, ఒక safety pin లో బట్ట ఇరకడం వల్ల ఎంత ప్రయత్నించినా safety pin ఊడి రాలేదు. మనసులో బాబా! ఇపుడు మళ్లీ ప్రయత్నం చేస్తాను, ఇపుడు ప్రయత్నం చేసిన మరు సెకన్ లోనే సునాయసం గా safety pin బయటికి వచ్చేస్తే " నేను నీ తోడు వున్నాను ,నువ్వు ఒంటరిని కావు " అని నువ్వు నాకు భరోసా ఇచ్చినట్లు అనుకుంటాను " అని సాయి కి చెప్పుకున్న. ఆశ్చర్యం గా,ఈసారి safety pin ఒకే ఒక second లోనే easy గా వచ్చేసింది.అంత సేపు ప్రయత్నం చేసినా దాన్లో బట్ట ఇరుక్కుని ఉండడం వల్ల ఎంతకీ ఊడి రాని పిన్ను, ఒకే ఒక second లో ఇరుక్కున్న బట్ట వధులయ్యి ఎలా వచ్చింది? ఇది సాయి లీల మాత్రమే.. నేనున్నాను అనే భరోసా ఇవ్వడం. ఎవరు ఏ సంకేతం ద్వారా సమాధానం ఆశిస్తారో, వారి భావాలకి తగిన పద్దతి లో సాయి స్పందిస్తూ సమాధానం ఇస్తారు.
సాయి ఎపుడూ మన ప్రేమ, తపన ని ఎదురుచూస్తూ వుంటారు. ఎపుడైయితే మనస్ఫూర్తిగా సాయి, నువ్వే నాకు తోడు అని చెప్పుకుంటామో, వెంటనే తన వాస్థల్యం మన పై కురిపిస్తూ మనల్ని అక్కున చేర్చుకుంటారు. సాయి లోనే సర్వమూ వుంది.
మన ఆశ, మన శ్వాస, ఒక భరోసా, జన్మ జన్మ లకి వదలని ఒక తోడు,చల్లని వాస్తల్యం,అద్భుతమయిన స్నేహం, గొప్ప రక్షణ,అన్నీ సాయి లో వున్నాయి. సాయి లో లేనిది లేదు. మనం ఆర్తి తో అడగాలి కానీ అది మనకి అవసరమే అయితే సాయి ఇవ్వలేనిది కూడా ఏదీ లేదు.. అలాంటి సాయి ని వేరే ఎవరి స్నేహం కోసమో ప్రార్టించే అవసరం లేదు. అన్నీ ఇచ్చే సాయి నే సాయి ని ఆశిస్తూ ప్రార్థిద్దాం..
Om Sai ram🙏🙏🙏🙏🙏... Sai bless me plz🙏🙏
ReplyDelete