సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2097వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సరైన సమయంలో, సరైన విధంగా మార్గదర్శనం చేసే బాబా
2. అంతా బాబా దయ

సరైన సమయంలో, సరైన విధంగా మార్గదర్శనం చేసే బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు బాబా ఆశీస్సులతో నిజంగా ఒక అద్భుతంలా అనిపించిన ఒక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అది నా మనసులోని ఎంతో ఒత్తిడిని తొలగించి, విశ్వాసం, శరణాగతికి సంబంధించి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. నాకు ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. వాడు చాలా మంచి పిల్లాడు. కానీ, తన స్కూల్ స్నేహితుల్లో చాలామంది ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుండటంతో వాడికి కూడా వాటిపై ఆసక్తి కలిగి ఆ గేమ్‌లు తన ఐప్యాడ్‌లో ఇన్‌స్టాల్ చేయమని నన్ను అడిగాడు. నేను, "ఆ గేమ్ లు ఆడటానికి నీ వయసు ఇంకా చాలా చిన్నద"ని చెప్పి ఊరుకున్నాను. అయితే, కాలం గడిచేకొద్దీ వాడికి వాటిపై ఆసక్తి మరింత అధికమై ప్రతిరోజూ ఆ గేమ్‌ల గురించి మాట్లాడుతూ, తన తోటి విద్యార్థులందరూ అవే ఆడుతున్నారని నాతో చెప్తుండేవాడు. దాంతో నేను, 'నేను మరీ కఠినంగా ఉంటున్నానేమో!' అని ఆలోచించడం మొదలుపెట్టి, తనని ఆ గేమ్‌లు ఆడకుండా పూర్తిగా నిర్బంధిస్తుంటే, తను నా నుండి విషయాన్ని దాచిపెట్టి, రహస్యంగా ఆడుకుంటాడేమోనని ఆందోళనగా అనిపించింది. అందువల్ల నేను ఆ గేమ్‌లు తన ఐప్యాడ్‌‌లో ఇన్‌స్టాల్ చేసి, వారాంతాల్లో కేవలం 30 నిమిషాలు మాత్రమే ఆడుకోవడానికి అనుమతించడం మంచిదని నిర్ణయించుకొని అలాగే చేశాను. కొన్ని వారాల తర్వాత వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సెలవుల్లో తనకి విసుగుగా అనిపించడంతో తరచుగా ఆడుకోవాలని చూస్తుండేవాడు. రెండు వారాల్లో తన ప్రవర్తనలో కొన్ని మార్పులను నేను గమనించాను. తను వస్తువులను దాచడం, అబద్ధాలు చెప్పడం, ఏకాగ్రత కోల్పోవడం వంటి మార్పులు చూసి నాకు తీవ్ర ఆందోళన కలిగింది. కొంత హింస ఉన్న ఆ గేమ్‌లు తనపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాకు అనిపించింది. గేమ్స్ ద్వారా పిల్లలను హింస వైపు ప్రోత్సహించకూడదని గట్టిగా నమ్మే నేను తనతో చాలాసార్లు సున్నితంగా, కొన్నిసార్లు కాస్త గట్టిగా ఆ గేమ్‌లు ఆడొద్దని చెప్పాను కానీ, తను నా మాట వినలేదు. ఒకరోజు నాకు పూర్తిగా విసుగొచ్చి ఒక తల్లిగా నేను విఫలమయ్యానని నాకు అనిపించింది. బాబా దగ్గర చాలా ఏడ్చి, "నాకు మార్గనిర్దేశం చేసి ఒక పరిష్కారం చూపండి" అని ప్రార్థించాను. ఆ తర్వాత బాబా సందేశం కోసం క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో చూస్తే, "రెండు రోజులు వేచి చూడు. ఇంట్లో ఏం జరుగుతుందో గమనించు. మీ ఇంట్లోని సాయిబాబాను ప్రార్థించు" అని వచ్చింది. ఆ క్షణం నాకు ఆ సందేశం పూర్తిగా అర్థం కాలేదు. అది నిజంగా బాబా సమాధానమో, కేవలం ఒక యాదృచ్ఛిక ప్రతిస్పందనో నాకు తెలియలేదు. అయినప్పటికీ, నేను బాబా పవిత్ర పాదాల చెంత పూర్తిగా శరణాగతి చెంది, విశ్వాసంతో ఆయన అనుగ్రహం కోసం ఎదురుచూశాను. తర్వాత నేను ఆ సందేశం గురించి మరచిపోయి నా దినచర్యలో పడ్డాను. అప్పుడు అద్భుతం జరిగింది. మర్నాడు మధ్యాహ్నం అమెజాన్ నుండి మాకు ఒక పార్సెల్ వచ్చింది. నేను, నా భర్త మా పనుల్లో నిమగ్నమై ఉండగా మా అబ్బాయి ఆ పార్సెల్ తెరవడానికి ఒక ప్లాస్టిక్ కత్తి తీసాడు. తను అంతకుముందు కూడా కత్తెర వాడి ఉన్నందువల్ల నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కొద్దిసేపటి తర్వాత తను నా దగ్గరకి వచ్చి, ఆ ప్లాస్టిక్ కత్తి హాలులో ఎక్కడో దొరికిందని చెబుతూ, ఒక వైపు చూపించాడు. అయితే నేను దాన్ని ఎక్కడ పెట్టానో నాకు స్పష్టంగా గుర్తు ఉన్నందున 'తను నిజం చెప్పడం లేద;ని నాకు వెంటనే అర్థమైంది. నేను తనని సౌమ్యంగా ప్రశ్నించేసరికి తను ఏడవడం మొదలుపెట్టాడు. నేను తనతో, "గేమ్స్ వల్ల నువ్వు ఎంతగా మారిపోతున్నావో చూడు! ఇది నీ జీవితానికి మంచిది కాదు. ఇది నిన్ను తప్పుడు మార్గంలోకి తీసుకువెళుతుంది" అని చెప్పాను. నాకు పూర్తిగా ఆశ్చర్యం కలిగేలా, తను ఇలా బదులిచ్చాడు: "అమ్మా! దయచేసి ఆ యాప్స్ తీసేయ్. ఒకవేళ ఆ గేమ్స్ నా ఐప్యాడ్‌లో ఉన్నా నేను వాటిని ఇంకా ఆడను" అని. అది విని నేను షాకయ్యాను. ఎందుకంటే, ఆ విషయాన్ని నేను తనకి అదివరకు లెక్కలేనన్ని సార్లు వివరించాను కానీ, తను ఎప్పుడూ వినలేదు. నిజానికి, నేను కావాలంటే, తన అనుమతి లేకుండా ఆ గేమ్స్ తీసేయగలిగేదాన్ని. కానీ నేను కోరుకున్నది, తన మనసు మారడం. కొన్ని గంటల తర్వాత హఠాత్తుగా క్వశ్చన్&ఆన్సర్ సైట్ ద్వారా బాబా ఇచ్చిన సమాధానం నాకు గుర్తొచ్చింది. అప్పుడు నాకు బాబా ఉద్దేశం ఏమిటో అర్థమైంది. ఆయన చెప్పినట్లే జరిగింది. కొన్నిసార్లు దేవుని ప్రణాళికను మామూలు మనుషులమైన మనం వెంటనే అర్థం చేసుకోలేమని ఈ అనుభవం నాకు తెలియజేసింది. అంతేకాదు, బాబా నాకు శ్రద్ధ, సబూరిల నిజమైన అర్థాన్ని, అలాగే శరణాగతి యొక్క ప్రాముఖ్యతను బోధించారు. సమస్య వచ్చినప్పుడు మనం అసహనానికి, ఆందోళనకు, గందరగోళానికి గురికావచ్చు. కానీ మనం పూర్తిగా బాబాకు శరణాగతి పొంది, విశ్వాసంతో వేచి ఉంటే, ఆయన సరైన సమయంలో, సరైన విధంగా మనకు మార్గదర్శనం చేస్తారు. "బాబా! మీ అంతులేని ప్రేమకు, మార్గదర్శకత్వానికి, ఆశీర్వాదాలకు మీకు ఎంతో ధన్యవాదాలు".

సాయి స్మరణం శంకట హరణం
బాబా శరణం భవభయ హరణం.

అంతా బాబా దయ

సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాను. మాకు 2026, మే 10వ తేదీ నుండి 20 వరకు సెలవులు ఇచ్చారు.  15వ తేదీన మా అమ్మ వాళ్ళ ఊరిలో జాతర జరిగింది. అక్కడ జాతర చాలా బాగా చేస్తారు. మా అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. అందువల్ల నాకు జాతరకు వెళ్ళి రావాలని అనిపించింది. కానీ మావారిని అడిగితే, ఒప్పుకోరని బాధేసింది. అప్పుడు, "బాబా! మావారు గొడవ పడకుండా జాతరకు వెళ్లేందుకు ఒప్పుకునేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకొని 15వ తేదీ ఉదయాన్నే 5:30 గంటలకు మావారిని, "నేను జాతరకు పోయి మధ్యాహ్నానికి వచ్చేస్తాను" అని అడిగాను. మావారు అస్సలు ఏమీ అనకుండా సరే అని చెప్పారు. నేను సంతోషంగా వెళ్లి అమ్మవారిని చూసుకొని వచ్చాను. ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు మా ఆయన. అంతా బాబా దయ.

2026, మే 26వ తేదీన తిరుమల వెళ్లడానికి మేము టికెట్లు బుక్ చేసుకున్నాము. కానీ మెనోపాజ్ దశ వల్ల నాకు నెలసరి సరిగ్గా రావడం లేదు. 21వ తేదీ వరకు చూసాను, నెలసరి రాలేదు. అప్పుడు నేను నెలసరి వాయిదా పడడానికి మాత్రలు వాడాను. కానీ అంతకుముందెన్నడూ ఆ మాత్రలు వాడని నేను, "బాబా! నాకు ఆ మాత్రల మీద నమ్మకం లేదు. మీ ఊదీయే నాకు మందు" అని బాబాతో చెప్పుకుని రోజూ ఊదీ నుదుటన పెట్టుకొని, కొంచెం నోట్లో వేసుకున్నాను. ఏ ఆటంకం లేకుండా వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని వచ్చాను. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

4 comments:

  1. Om sri sairam 🙏🙏

    ReplyDelete
  2. Om Sai ram we are going to Bangalore. Be with us and bless us Sai baba bless 🙏🙏 all

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo