ఈ భాగంలో అనుభవాలు:
1. ఆరోగ్య సమస్యలను పూర్తిగా తగ్గించిన బాబా
2. కృపతో కోరుకున్నట్టు అనుగ్రహించిన బాబా
3. కోరుకున్నట్టు దర్శనమిచ్చి పాస్‌పోర్ట్ మంజారు చేసిన బాబా
ఆరోగ్య సమస్యలను పూర్తిగా తగ్గించిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. నా పేరు శివశంకరరావు. నేను హైదరాబాదులో ఉంటాను. నేను చాలా సంవత్సరాల నుంచి బాబాను ప్రార్థిస్తున్నాను. నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఆయననే తలుచుకుంటూ ఆయన నామస్మరణ చేస్తుంటాను. ఆయన నా కంటికి కనపడకపోయినా కష్టకాలంలో ఆయన అనేకసార్లు నన్ను ఆదుకున్నారు. అందుకు శ్రీసాయినాథునికి నేను నా జీవితమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా కుటుంబ సభ్యులకు నా ఆర్థిక సమస్యల గురించి తెలియదు గాని, నేను ఆర్థికంగా చాలా నష్టపోయాను, అప్పుల్లో కూరుకుపో యాను. వాటిని ఎలా తీర్చాలని ఆలోచించి ఆలోచించి మానసికంగా కృంగిపోయాను. దాంతో నా శరీరంలో ఆరోగ్యపరంగా చాలా మార్పులు సంభవించాయి. 2026, ఫిబ్రవరి నెలలో నేను చాలా అనారోగ్యానికి గురయ్యాను. నా తలలో నొప్పి, ఒక కాలు, చేయి వణకడం, అప్పుడప్పుడు పట్టు కోల్పోవడం జరిగాయి. నేను చాలా భయపడిపోయాను. మానసికంగా నాలో నేనే నలిగిపోతూ 'ఇలా ఎందుకు జరుగుతుంద'ని బాబా ముందు కూర్చుని చాలా కన్నీళ్లు పెట్టుకున్నాను. చివరికి అన్నింటిని బాబా చూసుకుంటారని ఆయన మీద భారమేసి, "ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేయమ"ని బాబాను వేడుకున్నాను. ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తియందు ఉంచుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపిస్తూ ఊదీ తీసుకుంటుండేవాడిని. అలాగే 'సాయి రక్ష, సర్వ జగద్రక్ష' అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒక గురువారం బాబా మందిరానికి వెళ్లి, బాబాకి సర్వస్య శరణాగతి చెంది, "బాబా! నాకు నీవే దిక్కు. నా కుటుంబమంతా నా మీదే ఆధారపడి ఉంది. మీరే నన్ను కాపాడాలి. వచ్చే గురువారం లోపల నా ఈ అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతే మీ గుడి ముందన్న వాళ్ళకి ఒక పూట టిఫిన్ పెడతాను" అని మొక్కుకున్నాను. బాబా నా ప్రార్థన ఆలకించి క్రమంగా నా ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోయేటట్లు చేసారు. నేను చాలా సంతోషించాను. ఇది జరిగి మూడు మాసాలు అయింది. నాకు ఇప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. "ధ్యన్యవాదాలు బాబా. నాకు తల్లి, తండ్రి, దైవం అన్ని అయి నన్ను నడిపిస్తున్న మీకు సాష్టాంగ నమస్కారాలు. ఈ సమస్యలకు మూల కారణమైన ఆర్థిక సమస్యల నుంచి నన్ను బయటపడేయమని ఆర్తితో వేడుకుంటున్నాను బాబా"
సాయి రక్ష, సర్వ జగద్రక్ష.
కృపతో కోరుకున్నట్టు అనుగ్రహించిన బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మా అమ్మాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు బాబాను, "లోన్ తీసుకుని మా బడ్జెట్లో ఒక ఇల్లు కొనుక్కునేలా అనుగ్రహించమ"ని ప్రార్థించాము. బాబా దయవల్ల అనుకున్నట్టుగానే మా బడ్జెట్‌కు సరిపోయే మంచి ఇల్లు దొరికింది. ఎంతో ఆనందంగా ఆ ఇల్లు తీసుకున్నాము. కొంతకాలం తర్వాత కొన్ని కారణాల రీత్యా ఆ లోన్ తీర్చడానికి అదే ఇల్లు అమ్మాలని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు మనసులో అనుకున్న ధరకే అమ్ముడైతే బాగుంటుందని, అదే విషయం బాబాను ప్రార్థించాము. బాబా కృపతో మేము అనుకున్న అదే ధరకు ఆ ఇల్లు అమ్ముడైంది. "బాబా! మీరు చేసిన ఈ సహాయానికి ఎంతో కృతజ్ఞతలు. మా జీవితంలో ఇంకా కొన్ని పెద్ద పెద్ద సమస్యలున్నాయి. చాలా సంవత్సరాలుగా వాటితో బాధపడుతున్నాము. ఎన్నో ఆశలతో, నమ్మకంతో మీ దయకోసం ఎదురుచూస్తున్నాము. ఆ సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను బాబా".
కోరుకున్నట్టు దర్శనమిచ్చి పాస్‌పోర్ట్ మంజారు చేసిన బాబా
ప్రియమైన సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు రాణి. మాది కాకినాడ. నేను చిన్నతనం నుండి సాయి భక్తురాలనే కానీ, గత పది సంవత్సరాలుగా పూర్తి భక్తురాలిని. నా జీవితంలో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది సాయి బిక్ష, దయ. నేను చాలా అనుభవాలు అనుమతి చెందాను. 2026, మే 21న నేను పాస్‌పోర్ట్ ఆఫీసుకి వెళ్లాను. ఏ కారణం చేతనో గానీ మొదట కాకినాడలో నా పాస్‌పోర్ట్ రిజెక్ట్ చేశారు. మళ్లీ రీషెడ్యూల్ చేసి వైజాగ్ పంపించారు. రెండు రోజులకి నేను వైజాగ్ వెళ్లాను. అప్పుడు సాయిని ఒకటే కోరుకున్నాను, "సాయీ! నేను ఆఫీసులో అడుగుపెట్టేసరికి మీరు నాకు కనపడాలి. కనపడితే నా పని అయిపోయినట్టే బాబా" అని నమస్కారం చేసుకొని ఆఫీసులో అడుగుపెట్టాను. వెంటనే నాకు బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. నేను చాలా నిశ్చింతగా నా పని అయిపోయింది అనుకున్నాను. అదే నిజమైంది. ఆరోజు పాస్‌పోర్ట్ నాకు మంజూరు అయింది. "శతకోటి వందనాలు బాబా".
