నరహరి శిరిడీలో బాబా సన్నిధిలో ఉన్న 11వ రోజు తెల్లవారుఝామున బాబా అతనిని కుదిపి నిద్రలేపి, “అరే! లేచి నాతో రా” అని అన్నారు. వెంటనే నరహరి నిద్రలేచి బాబాను అనుసరించాడు. బాబా వడివడిగా నడుస్తూ కొద్దిదూరంలో ఉన్న చిన్న మారుతి మందిరానికి వెళ్లారు. అక్కడ ఒక రావిచెట్టు, దానిక్రింద సింధూరం పూసివున్న మారుతి ప్రతిమ ఉన్నాయి. దాని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయమని బాబా నరహరిని ఆజ్ఞాపించారు. అతను బాబా చెప్పినట్లే చేశాడు. ఆ తర్వాత బాబా అతన్ని, ‘అక్కడున్న పిట్టగోడ దిగువన ఒక పిడికెడు మట్టి ఉంచి, దానిపై అక్కడ వెలుగుతున్న దీపాన్ని ఉంచమని’ అన్నారు. ఆపై బాబా అతన్ని ‘ఆ పిడికెడు మట్టిని తిరిగి యథాస్థానంలో ఉంచమని’ చెప్పారు. ఆ తరువాత వారిరువురు చావడికి తిరిగి వచ్చారు. అప్పుడు బాబా అతనిని స్నానం చేయమని చెప్పారు. ఇంతలో ఒక గ్రామస్థుడు వారిరువురికోసం టీ తీసుకొచ్చాడు. బాబా నరహరితో, "టీ త్రాగి వెళ్ళు. సాయంత్రం వరకు తిరిగి రావద్దు. రోజంతా గ్రామంలో ఎక్కడో ఒకచోట గడిపి సాయంత్రం వచ్చి మసీదులో నన్ను కలుసుకో!" అని అన్నారు. బాబా ఆజ్ఞ ప్రకారం నరహరి వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి మశీదుకు వచ్చాడు. బాబా అతన్ని దగ్గరకు రమ్మని పిలిచి, ధునిలో నుండి పిడికెడు ఊదీ తీసి అతనిపై చల్లారు. ఆ సమయమంతా బాబా మెల్లగా ఏదో గొణుగుతూ ఉన్నారు. ఆ తర్వాత నరహరిని ధుని దగ్గర ప్రశాంతంగా కూర్చోమని చెప్పారు. చాలా సమయం తర్వాత ఇద్దరూ మసీదు విడిచి చావడికి వెళ్లారు. చివరిగా బాబా, “ఇప్పుడు నీ పని ప్రారంభమైంది. నువ్వు దేనిగురించీ చింతించకు" అని అన్నారు. జరుగుతున్నదంతా గమనిస్తున్న నరహరి తన భవిష్యత్తు గురించి ఆందోళన చెంది, అందులో ఏదో తనకి ఎంత మాత్రం మంచిది కాదని అనుమానించి, బహుశా దానికోసం బాబా ఈవిధంగా నివారణ చేసారని భావించాడు. బాబా ఏం చేస్తారో, ఎందుకు చేస్తారో ఎవరు ఊహించగలరు?
18వ రోజు మధ్యాహ్నం దాటిన తర్వాత బాబా నరహరిని వెంటబెట్టుకొని కొండచిలువను సమాధి చేసిన ప్రదేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక బాబా తమ రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, “ఓ ప్రభూ! ఈ బిడ్డపై కరుణ చూపండి. అతని జీవితపర్యంతం అతనికి రోజుకు రెండింతల ఆహారాన్ని సమకూర్చండి, అతని అవసరాలు తీర్చండి" అని అన్నారు. తర్వాత బాబా నరహరిని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోమని చెప్పారు. అతను బాబా ఆజ్ఞానుసారం కళ్లు మూసుకుని కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక అలౌకికమైన ఘటన జరిగింది. నరహరికి తన తలలో సుడిగాలి రేగుతున్నట్లు, ఆపై శరీరమంతా కంపించిపోతున్నట్లు అనుభూతి కలిగింది. ఆ అనుభూతి యొక్క తీవ్రత క్రమంగా పెరగడం మొదలై అతను భయంతో బిగుసుకుపోయాడు. అంతలో తనని ఏదో శక్తి క్రిందికి లాగుతున్నట్లు అనిపించింది. ఆ మొత్తం ప్రక్రియ భయానకంగా ఉన్నందున అతను బాగా అలసిపోయాడు. తనకేం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. కానీ అతను తన జీవితాన్ని, భవిష్యత్తును బాబా చేతికి అప్పగించాడు. అందువల్ల అతను చేయగలిగిందేమీ లేదు. కాబట్టి అతను అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అతనికి మెలకువ వచ్చి లేచి చూసేసరికి చీకటి పడింది. బాబా కోసం చుట్టుప్రక్కల చూశాడు, కానీ బాబా ఎక్కడా కనిపించలేదు. దాంతో అతను ఆత్రుతగా పరిగెత్తుకుంటూ మసీదుకి వెళ్లి చూస్తే, అక్కడ బాబా ఉన్నారు. బాబా అతడిని చూస్తూనే సంతోషంగా, "రా బిడ్డా! ఈరోజు నుండి నీ జీవితం మెరుగుపడనారభించింది" అని అన్నారు. నిజానికి నరహరి శిరిడీ వచ్చినప్పటినుండి బాబా తరచూ అతనితో, "నీ ప్రారబ్ధం తుచ్ఛమైనది. నీ జీవితచరిత్రలో వ్రాసినది చాలా తక్కువ" అని అంటుండేవారు. అయితే, “నా భక్తుని జీవితంలో తిండికి, బట్టకు కొరత ఉండదు” అని బాబా ప్రతిజ్ఞ చేశారు కదా! అందుచేత, ఒంటరిగా శిరిడీ వచ్చి తమను ఆశ్రయించిన ఆ కుర్రవాడి తలరాతను(ప్రారబ్ధాన్ని) బాబా తమ అనుగ్రహంతో మార్చివేశారు.
నరహరి శిరిడీలో బసచేసిన 19వ రోజంతా బాబా ఉల్లాసంగా ఉన్నారు. ఆ రాత్రి బాబా అందరినీ మసీదు నుండి పంపించి నరహరిని పడుకోమనీ, తాము చెప్పినప్పుడే లేవమనీ అన్నారు. రాత్రి మధ్యమధ్యలో బాబా అతన్ని నిద్రలేపి, “నేను చెప్పేది బాగా శ్రద్ధగా విను” అంటూ ఎన్నో విషయాలు చెప్పారు. ఆ తర్వాత ధుని నుండి కొంత ఊదీ తీసి నరహరి ముందు నేలపై పరచి, దానిపై ఒక చేయి ఆకారాన్ని చిత్రించి, “ఇది ఒక వ్యక్తి యొక్క కుడి అరచేతి ముద్ర. ఇందులో వీనస్ పర్వతం అంటే బొటనవేలు మొదలులో కండవంటి భాగం ప్రక్కన ఒక చేప ఆకారాన్ని ఏర్పరిచే రేఖలు ఉన్నాయి. ఒక సరళరేఖ దానిగుండా చూపుడువ్రేలికి, మధ్యవ్రేలికి మధ్యగా వెళుతోంది. నేను చూపిస్తున్నది నీకు అర్థమైందా?" అని స్పష్టంగా అడిగారు. నరహరి తనకు అర్థం కాలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. అప్పుడు బాబా, “గాడిదా! ఇది ఆ వ్యక్తి యొక్క గుర్తింపు. కాబట్టి దీనిని జాగ్రత్తగా చూసి, ఇది నీ బుర్రలో స్థిరపడిపోయేలా మనస్సులో మననం చేస్తూ ఉండు. ఆ వ్యక్తి నా స్నేహితుడు. నీ అవసాన సమయంలో సముద్రానికి దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో అతను నిన్ను కలుస్తాడు. అతని చేతిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట, నేనిప్పుడు నీకు ఇవ్వబోయేది అతనికివ్వు, మర్చిపోవద్దు. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా, అత్యంత శ్రద్ధగా విను. ఆ యువకుడు(నా స్నేహితుడు) భగవంతుడిని విశ్వసించడు. కాబట్టి అతను నువ్వు చెప్పేది నమ్మడు. అందువల్ల నువ్వు అతనితో ‘ఈరోజు నుండి మూడవరోజున అతనొక పోట్లాటలో పాల్గొంటాడని, 4వ రోజున అతను తిండి తినకుండా రాత్రి పొద్దుపోయేవరకు ఆకలితో అలమటిస్తాడని’ చెప్పు. ఈ రెండు విషయాలు జరిగిన తరువాత నేనిప్పుడు నీకు ఇచ్చేది అతనికి ఇవ్వు” అని వివరంగా చెప్పారు.
బాబా ఇంకా ఇలా చెప్పారు: “నేను నా శరీరాన్ని విడిచిపెట్టిన 20 సంవత్సరాల తర్వాత ఆ యువకుడు జన్మిస్తాడు. అతని కుడి అరచేతిలో నేను నీకు చూపించినట్లుగా రేఖలు ఉండటం నువ్వు గమనిస్తావు. అదే అతని గుర్తింపు. అతను నీ మరణానికి ముందు నిన్ను కలుస్తాడు. నీ మరణానంతరం నీ అంత్యక్రియలు చేస్తాడు. అంత్యక్రియలు అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే, వ్యక్తి మరణించినప్పుడు బాధల నుండి విముక్తి పొంది ఆనందకరమైన ఘడియల్లోకి వెళ్తాడు. ఆ సమయంలో అతను చాలా స్వచ్ఛంగా ఉంటాడు. కారణం అతను ఈ లౌకిక జీవితం నుండి ఏమీ తీసుకొనిపోడు. అతని శరీరం కూడా కాలి బూడిద అవుతుంది, అది కూడా ఇక్కడే ఉండిపోతుంది. ఇకపై, నువ్వు హస్తసాముద్రికాన్ని అభ్యసిస్తావు, అందులో జ్ఞానాన్ని పొందుతావు. నువ్వు మరణించేరోజు వరకు నీకు అవసరమైన ఆహారం, బట్టలు పొందగలిగేంత జ్ఞానాన్ని మాత్రమే నువ్వు సంపాదిస్తావు. నా అనుగ్రహం వల్ల నువ్వు ఎన్నటికీ ఆకలితో ఉండవు".
తర్వాత బాబా నరహరిని తమ గుండెలకు హత్తుకొని, అతని తల నిమురుతూ, "కాసేపు ప్రశాంతంగా కూర్చో!" అని చెప్పి వడివడిగా ఎక్కడికో వెళ్ళారు. కొంతసేపటికి తిరిగి వచ్చిన బాబా తమ పాదాలు కడుక్కొని, ధుని చుట్టూ మొత్తం 7 సార్లు ప్రదక్షిణ చేశారు. తర్వాత తమ తలకు కట్టుకున్న గుడ్డను తీసి, దాన్ని రెండు ముక్కలుగా చేసి, ఒక ముక్కను రాశిగా పోసివున్న ఊదీపై వేసి, దానిపై కొద్దిసేపు నిలబడ్డారు. దాంతో ఆ గుడ్డపై బాబా పాదముద్రలు ముద్రితమయ్యాయి. అప్పుడు బాబా ఆ గుడ్డను చక్కగా మడిచి, తమ తలపాగా యొక్క మరో గుడ్డముక్కలో భద్రంగా చుట్టి నరహరికి ఇచ్చి, "ఈ పాదముద్రల ఆధారంగా రాతితో ఒక జత పాదుకలు, ఇత్తడితో మరో జత పాదుకలు చేయించి, వాటిలో ఒక జత పాదుకలను నా భక్తుల దర్శనార్థం, రెండవ జత పాదుకలను అభిషేకం కోసం ఉపయోగించమని ఆ యువకుడితో చెప్పు. ఆ పాదుకలు నా భక్తుల కోరికలు నెరవేరుస్తాయి, వాళ్ళను ఉద్ధరిస్తాయి. వారి వారి విశ్వాసం, పూర్వజన్మలలో వారు చేసుకున్న సత్కర్మలననుసరించి విశేషమైన ప్రయోజనాన్ని పొందుతారు. నా పాదుకలను అభిషేకించిన జలం అమృతం వంటిది. అది అసాధారణ వ్యాధులను నిర్మూలిస్తుంది, సంతానం లేనివారికి సంతానాన్ని ప్రసాదిస్తుంది, పురిటి నొప్పులు, ప్రసవ బాధల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు, ఆ అభిషేకజలం ఏ స్థలాన్నయినా పవిత్రం చేస్తుంది" అని చెప్పారు. తరువాత బాబా నరహరి ఎడమచెవిలో ఒక మంత్రం చెప్పి, దాన్ని ఆ యువకుడి కుడిచెవిలో చెప్పమన్నారు. తర్వాత, "ఈ మంత్రాన్ని అతను 30 సంవత్సరాల పాటు రాత్రి ఒంటిగంట సమయంలో ఒకే ఒక్కసారి మనసారా పఠించాలి. 30 సంవత్సరాలు పఠించడం పూర్తయిన తరువాతే నా పాదుకలు పవిత్రతను సంతరించుకొని సజీవంగానూ, శక్తివంతంగానూ అవుతాయి. ఆ తర్వాత వాటిని నా భక్తుల ప్రయోజనార్థం ఉపయోగించవచ్చు. ఆ రోజున ఆ కాల నాగరికత, సామాజిక విలువలు అత్యల్పంగా ఉంటాయి. మనుషులు సంపదననుసరించి, అంటే వారి వద్ద ఉన్న ధనం ఆధారంగా గుర్తింపబడతారు, మానవతా లక్షణాలను బట్టి కాదు. జనాభా విస్ఫోటనం జరిగి ప్రజలు చీమల్లా ఉంటారు. వాళ్ళు ఒకరిపట్ల ఒకరు సానుభూతి కలిగివుండరు. కేవలం డబ్బు మాట్లాడుతుంది. అటువంటి పరిస్థితుల్లో నా భక్తులకు భరోసా ఇవ్వడానికి నా పాదుకలు ఆశ్రయంగా ఉంటాయి. కాబట్టి సరైన సమయం వచ్చినప్పుడు ఈ మూటను నా మిత్రునికి ఇవ్వు. అతను నేను చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడని నేను నీకు హామీ ఇస్తున్నాను. నరహరీ! ఇది బాగా గుర్తుంచుకో, 'ఈ మంత్రం నీ మస్తిష్కము నుండి నిర్ణిత సమయం వరకు చెదిరిపోతుంది. నీకు అది గుర్తుండదు. కానీ, నువ్వు అతని కుడి చెవిలో చెప్పవలసి వచ్చినప్పుడు నీకు అది తిరిగి జ్ఞాపకమొచ్చి, నువ్వు స్పష్టంగా ఉచ్ఛరిస్తావు" అని చెప్పారు.
మరుసటిరోజు ఉదయానికి, ఆ మంత్రంలోని ఒక్క పదం కూడా నరహరికి గుర్తు రాలేదు. ఆ మరుసటి రోజు అంటే 21వ రోజున అతను తిరిగి బయలుదేరాలని బాబా నిర్ణయించి ఉన్నందున నరహరి బాబాకు వీడ్కోలు పలికే సమయం దగ్గర పడింది. అందువల్ల అతను 20వ రోజున బాబా చెప్పిన ఆ మంత్రాన్ని గుర్తుచేసుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు బాబా అతనిని తమ దగ్గర కూర్చుండబెట్టుకొని, "నువ్వు ఆ మంత్రాన్ని నిర్ణిత సమయం వరకు మర్చిపోతావని చెప్పాను. అది భగవంతుని సంకల్పం. దాని గురించి చింతించకు. ఆయన పనిని ఆయన్ని చేయనివ్వు. ఇది ఆయన దివ్య నాటకం. మనం అర్థం చేసుకోలేము. మనం భగవంతుని సేవకులం. ఆయన సంకల్పానుసారం మనం జీవనం సాగించినట్లైతే, మనం సంతోషంగా ఉంటాము. మనమందరం యాచకులం. ఎందుకంటే, మనం ఆయనని అనేక విషయాలు అడుగుతాము. అయితే, ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు. నేను ప్రతిరోజూ భిక్షకు వెళ్తాను, నేను చనిపోయేవరకు అలా చేస్తాను. ఇది ఈ బ్రతుకు నాటకంలో భక్తులు ఎక్కడ, ఎలా నిలబడ్డారో చూపించడానికే. వాళ్ళు అభాగ్యులకు సహాయం చేస్తే, అణగారిన ప్రజలకు కాస్తైనా సేవ చేస్తే అదే భగవంతునిపట్ల నిజమైన భక్తి. ఇతరుల కన్నీళ్ళు తుడవడం, వారితో ప్రేమగా మాట్లాడటం, ఇదే నిజమైన గురుసేవ. ఇది నా గురువు నాకు బోధించినది, ఇది ఆయన నాకిచ్చిన ఆయన ఖజానా తాళంచెవి. అది నేను నీకు అప్పగిస్తున్నాను. ఇది బ్రతుకు మంత్రం" అని చెప్పారు.
ఆఖరి రోజు అంటే బాబా నరహరితో శిరిడీ విడిచి వెళ్లాలని చెప్పిన 21వ రోజు రానే వచ్చింది. నరహరి బాబాని విడిచి వెళ్ళడానికి చాలా బాధపడ్డాడు. అప్పుడు బాబా అతనిని ఆలింగనం చేసుకొని, “జీవనప్రయాణంలో సుఖదుఃఖాలు ఎప్పుడూ ఉంటాయి. ఎలాంటి క్లిష్టపరిస్థితి ఎదురైనా నువ్వు దాన్ని శాంతంగా, ధైర్యంగా ఎదుర్కొంటే దానిని అధిగమిస్తావు. శ్రద్ధ-సబూరిలు కలిగి ఉండి నీకు ఎదురైన పరిస్థితి/ఘటన గురించి ఆలోచిస్తే, నువ్వు ఖచ్చితంగా సరైన మార్గాన్ని ఎంచుకుంటావు. నా ప్రతి భక్తుడు ఈ ప్రపంచంలో ఇలా జీవించాలి. ఇది అంటే 'శ్రద్ధ-సబూరీ' నా గురువు యొక్క బోధ అని నువ్వు కలిసే ప్రతి భక్తుడికి చెప్పాలని నేను కోరుకుంటున్నాను" అని అన్నారు. తర్వాత బాబా అతనిని కోపర్‌గావ్ వెళ్లే భక్తులకోసం వేచి ఉన్న టాంగా దగ్గరకు తీసుకెళ్లి, అతని శిరస్సుపై తమ అమృత హస్తన్నుంచి, అతని ముఖాన్ని ముద్దాడి ఆశీర్వదించారు. ఆపై బాబా అతనికి 16 రూపాయలిచ్చి, “ఈ లక్ష్మిని నీ దగ్గర ఉంచుకో! నీ తిండికి, ఖర్చులకు అవసరమైన ధనానికి లోటుండదు” అని చెప్పి టాంగాలో కూర్చోమన్నారు. ఆవిధంగా శిరిడీలో బాబాతో నరహరి గడిపిన 21 గోల్డెన్ డేస్(సువర్ణ దినాలు) ముగిశాయి. ఐదు, ఆరు సంవత్సరాల తరువాత బాబా మహాసమాధి చెందారు. ఆ సమయంలో నరహరి శిరిడీ సందర్శించలేకపోయాడు. తాను శిరిడీలో బస చేసిన చివరిరోజున బాబా అతనితో చెప్పిన 'శ్రద్ధ - సబూరీ' గురించి, జీవితాన్ని ఎలా జీవించాలో అందరికి చెప్తుండేవాడు. చాలామంది జనం అతనిని కలవడానికి వచ్చేవారు. వాళ్ళు బట్టలు, తినుబండారాలు, కిరాణా సామాన్లు, పండ్లు తెచ్చి అతనికి ఇచ్చేవారు. అతనికి ఇబ్బందిగా అనిపించినప్పటికీ బాబా ఆశీర్వాదంగా భావించి స్వీకరిస్తుండేవాడు. అలా సంవత్సరాలు దొర్లిపోయాయి.
మిగతాది తరువాయి భాగంలో ..
మూలం: బాబా స్ డివైన్ మేనిఫెస్టేషన్స్ బై విన్నీ చిట్లూరి.