ఈ భాగంలో అనుభవం:
- బాబా వర్షించిన కృపాకటాక్షాలు
సాయి బంధువులకు నా ప్రణామాలు. నా పేరు తన్వి. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురితమయ్యే సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటాను. తద్వారా నాకు బాబా మీద నమ్మకం, విశ్వాసం రెట్టింపు అవుతున్నాయి. నేను ఇప్పుడు నా జీవితంలో బాబా ప్రసాదించిన ఒక అద్భుతాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అది మామూలు అద్భుతం కాదు. అసలు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. నాకు పెళ్ళై 8 నెలలైనా నేను గర్భవతిని కాలేదు. ఆ కారణంగా మా అత్తయ్య నన్ను చీటికీ మాటికి చులకన చేస్తూండేవాళ్లు. ఇంకా ఇలా కాదని చెప్పి నేను బాబాని మనస్ఫూర్తిగా వేడుకొని, 'సంతానం కలగాలంటే గురువారం పారాయణ మొదలు పెట్టె ముందు ఒక టెంకాయ సాయికి సమర్పించి, పారాయణ పూర్తైన రోజు దాన్ని పగలగొట్టి, దానితో పాయసం చేసి భార్యభర్తలిద్దరూ తినాలని' సప్తాహ పారాయణ పుస్తకంలో ఉన్నట్లు చేసాను. అంతే, బాబా దయవల్ల నేను గర్భవతినయ్యాను. అయితే హాస్పిటల్కి వెళితే కొన్ని టెస్టులు వ్రాసారు. ఆ టెస్టులు చేయించుకుంటే, రిపోర్టులో లివర్కి సంబంధించి ఒక వ్యాధి ఉన్నట్లు బయటపడింది. ఇంకా నాకు కాళ్లుచేతులు ఆడలేదు. "ఏంటి సాయి? నేను చిన్నప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను కదా! నువ్వు తప్ప వేరే దైవాన్ని ఎరగను. నాకెందుకు ఇంత అన్యాయం చేసావు?" అని ఒకటే ఏడ్చాను. కానీ ఆ సాయీశ్వరుడు ఎలాగైనా కాపాడుతారని ఎక్కడో ఒక గట్టి నమ్మకం. ల్యాబ్ అతను "మళ్ళీ శాంపిల్ ఇవ్వండి. నేను మళ్ళీ టెస్ట్ చేస్తాను" అని అన్నారు. నేను సరేనని బ్లడ్ శాంపిల్ ఇచ్చాను. కానీ నేను పడిన వేదన మాటల్లో చెప్పలేనిది(నేను నా జీవితాంతం అనుభవించాల్సిన బాధను బాబా ఒక గంటలో అనుభవించేలా చేసారెమో!). "బాబా! రిపోర్టులు నార్మల్ వచ్చేలా చూడు. శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను. అలాగే మీ గుడిలో అన్నదానంకి 5000 రూపాయలు ఇస్తాను" అని బాబాను మనసారా బాబాను ప్రార్థించి మళ్ళీ రిపోర్టులు వచ్చేవరకు, 'సాయి సాయి' అని స్మరిస్తూ గడిపాను. దయామయుడు, నా రక్షకుడు అయిన ఆ సాయీశ్వరుడు అద్భుతం చేసారు. ఈసారి రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది. అది నేను నమ్మలేకపోయాను. మళ్లీ 3వ సారి టెస్ట్ చేయించాను. అప్పుడు కూడా నెగెటివ్ వచ్చింది. అయినా నమ్మక లివర్ ఫంక్షన్ టెస్టులు అన్ని కూడా చేయించాను. అవి కూడా నార్మల్గానే వచ్చాయి. నేను షాక్లో ఉండిపోయాను. కోలుకోవడానికి నాకు రెండు రోజులు పట్టింది. బాబా కరుణ నా మీద కురుపించినందుకు నా మనసు ఆనందంతో సేద తీరింది. వెంటనే శిరిడీ ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకొని, బాబా గుడిలో అన్నదానంకి 5000 రూపాయలు పంపించాను. నిజానికి బాబాకి ఏం చేసిన తక్కువే. "బాబా! మీ కృపాకటాక్షాలు నా మీద కురిపించినందుకు మీకు ధన్యవాదాలు. మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను తండ్రీ. ప్రతి శ్వాసలో నీ పేరు జపించడం తప్ప మీకు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకొను తండ్రీ. మీకు శతకోటి వందనాలు సాయినాథా. మీ భక్తులు అందర్నీ ఇలానే కాపాడండి తండ్రీ".
నేను రెండు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు ఏం తిన్నా సహించక వాంతులయ్యాయి. టాబ్లెట్లు అందుబాటులో లేనందున నాకు ఏం చేయాలో తెలియలేదు. ఆ స్థితిలో బాబాకి నమస్కరించి, "బాబా! ఎలాగైనా నాకు వాంతులు తగ్గేలా చేయండి" అని ప్రార్థించాను. బాబా దయ చూపారు. వాంతులు పూర్తిగా ఆగాయి.
ఒకసారి ఉన్నట్టుండి ఆహారం మింగుతుంటే, అది పొట్టలోకి దిగుతుంటే చాలా నొప్పిగా అనిపించింది. రెండు రోజులు ఓపిక పట్టినా తగ్గలేదు. అసలే నేను గర్భవతిని. అందువల్ల ఏ మందులు వాడాలన్నా నాకు భయమేసింది. అందుచేత రాత్రి పడుకునేముందు, "ఏంటి బాబా ఈ బాధ? నాకు ఇలా ఎప్పుడూ నొప్పి రాలేదు? ఇదేదో వింతగా ఉంది. ఆహారం మింగుతుంటే నొప్పి రావడం ఏంటి బాబా? డాక్టర్ దగ్గరకి వెళ్లాలన్నా చాలా భయంగా ఉంది. ఈ నొప్పిని ఎలాగైనా మీరే తగ్గించాలి తండ్రీ. మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు" అని నా బాధ బాబాతో చెప్పుకున్నాను. పిలిస్తే పలికే దైవం నా సాయినాథుడు. ఆయన దయవల్ల ఉదయానికల్లా నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "ఏమిచ్చి మీ ఋణం తీర్చుకొను తండ్రీ. మీకు శతకోటి వందనాలు సాయి".
ఒకరోజు ఉదయం 4 గంటల సమయంలో మా తమ్ముడికి జ్వరం వచ్చి బాగా చలితో వణికిపోయాడు. డోలో టాబ్లెట్ వేసుకుని పడుకున్న తమ్ముడు నుదుటి మీద నేను కొంచెం ఊదీ పెట్టి బాబాకి నమస్కరించి, "బాబా! తమ్ముడికి జ్వరం తగ్గేలా చేయండి" అని బాబాను ప్రార్థించి పడుకున్నాను. ఉదయానికి తమ్ముడి జ్వరం కొంచం తగ్గింది. తను టిఫిన్ చేసి మా ఊరిలో వున్న ఆర్ఎమ్పి డాక్టర్ దగ్గరకి వెళ్లి ఇంజెక్షన్ చేయించుకున్నాడు. తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాడు. కాసేపయ్యాక లేచి కొద్దిగా అన్నం తిన్నాడు. మామూలుగా తనకి జ్వరమొస్తే, 3, 4 రోజులు వరకు తగ్గేది కాదు. కానీ ఈసారి బాబాని ప్రార్ధించడం వల్ల ఒక్క రోజులో తమ్ముడు కొంచెం కొలుకున్నాడు. "ధన్యవాదాలు బాబా. నేను ఒక మానసిక సమస్య వల్ల చాలా బాధపడుతున్నాను బాబా. త్వరగా ఆ సమస్య నుండి బయటపడేలా చూడు బాబా".

ఓం శ్రీ సాయి రాం 🌹🌺🌹💐🌹
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOmsairam
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete