ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా ఆశీర్వాదం
2. భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారు
బాబా ఆశీర్వాదం
నాపేరు షాలిని. నేను 2022 నుండి సాయిబాబా భక్తురాలిని. ఆ సంవత్సరం మా నాన్న చనిపోతే, "నువ్వే నాకు ఇక తండ్రి" అని బాబా పాదాలు పట్టుకున్నాను. అప్పటినుండి సాయి నాతోనే ఉన్నారు. బాబా నా చేయి పట్టుకొని నడిపిస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఎప్పటికప్పుడు తన ఉనికిని మనకు తెలియజేస్తూ మనతో ఉంటారు. బాబా మనకు ప్రసాదించే అనుభవాలు ఒకటీ రెండు కావు. ఇక నా అనుభవానికి వస్తే.. నేను ప్రైవేట్ స్కూలులో టీచరుగా చేస్తూ డియస్సి పరీక్షకి ప్రిపేరవుతుండేదాన్ని. ఆ సమయంలో నేను ప్రతిరోజూ "బాబా! నాకు ఈ ఉద్యోగం ఎంత అవసరమో మీకు తెలుసు. నా చేయి వదలకు" అని బాబాను అడుగుతుండేదాన్ని. బాబా ఇన్స్టాగ్రామ్ ద్వారా 'భయపడకు! నువ్వు తప్పకుండ విజయం సాధిస్తావు' అని చెప్తుండేవారు. నేను బాబా మీద నమ్మకంతో ఆ దుర్గమ్మ మీద భారమేసి రోజూ సచ్చరిత్ర పారాయణ, అర్జునకృత దుర్గా స్తోత్ర పఠనం చేస్తూ పరీక్షకి చదువుకుంటుండేదాన్ని. బాబా దయవల్ల 2025, జూన్‌లో ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్ష వ్రాస్తే, బాబా ఆశీర్వాదం నాకు లభించింది. ఆగస్టు 22న విడుదలైన మెరిట్ లిస్టులో నా పేరు ఉంది. ఆరోజు నా కళ్ళలో ఆనందభాష్పాలు ధారాపాతమయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 28న వెరిఫికేషన్ పూర్తై సెలక్షన్ లిస్టులో కూడా నా పేరు వచ్చింది. 2025, అక్టోబర్ 13న ప్రభుత్వ హైస్కూల్ టీచరుగా నేను జాయినయ్యాను.
మా అక్క యూరిన్ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడింది. తను ఆ ఇన్ఫెక్షన్ వల్ల కనీసం ఎక్కడికి వచ్చేది కాదు. యూరిన్ కాసేపు ఆపినా తను చాలా ఇబ్బందిపడేది. ఒక గురువారంనాడు "అక్కకి ఈ ఇన్ఫెక్షన్ తగ్గితే, మా అనుభవాన్ని సాయి బంధువలతో పంచుకుంటాను" అని చెప్పుకొని డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. డాక్టర్ చాలా సీరియస్‌గా "ఇంత ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్నిరోజులు ఎలా ఉన్నావు అసలు?" అని వారం రోజులు మందులు వాడమని, తగ్గకపోతే మళ్ళీ రమ్మని చెప్పారు. బాబా దయవల్ల ఆ మందులతో ఇన్ఫెక్షన్ తగ్గి అక్క సంతోషంగా ఉంది. "ధన్యవాదాలు బాబా".
భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారు
బాబా నా పేరు మహేష్. ఒకసారి నేను శిరిడీలో లక్ష్మీ మందిరంకి దర్శనానికి వెళ్లి అక్కడున్న బాబా భక్తితో ప్రార్థించాను. దర్శనానంతరం బయటకు వచ్చిన నేను తొందరలో నా చెప్పులు అక్కడే మర్చిపోయాను. ఆ విషయం నాకు అస్సలు గుర్తుకు రాలేదు. నేను బస చేసిన హోటల్‌కి చేరుకున్న తర్వాత చెప్పులు లేవని గమనించాను. కొంచం ఆందోళన కలిగినప్పటికీ బాబాపై నమ్మకంతో ఆయన చూసుకుంటారని మనసులో అనుకొని ఆయనకి చెప్పుకొని ప్రశాంతంగా ఉన్నాను. ఆ రాత్రంతా బాబా ధ్యాసలో గడిచింది. మర్నాడు ఉదయం లక్ష్మీ మందిరంకి వెళ్ళడానికి బయలుదేరాను. నా మనసులో చెప్పులు దొరుకుతాయో లేదోనని భయం ఉన్నప్పటికీ దొరకుతాయన్న ఆశ కూడా ఎక్కువగానే ఉంది. అక్కడికి వెళ్ళాక చూస్తే, నా చెప్పులు కనిపించాయి. ఎవరూ వాటిని తాకకుండా అలాగే ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అది సాయిబాబా కరుణ అనిపించింది. ఆయనపట్ల నా భక్తి మరింత బలపడింది. బాబా తన భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారని ఈ అనుభవం మరోసారి నిరూపించింది.
ఒకరోజు అకస్మాత్తుగా నీళ్ల విరోచనాలు మొదలై నా శరీరమంతా బలహీనమైపోయి ఏ పని చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నేను ఈ సమస్య నుంచి బయటపడేసేది బాబా దయ తప్ప ఇంకేమీ లేదని నమ్మి ఆయనను మనస్ఫూర్తిగా ప్రార్థించి పూర్తి భారం ఆయన మీద వేసాను. డాక్టరు సూచనలననుసరించి మందులు సక్రమంగా తీసుకుంటూ ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. బయట ఆహారం పూర్తిగా మానేసి తేలికపాటి భోజనం తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నాను. డీహైడ్రేషన్(నిర్జలీకరణం)కి గురికాకుండా ఎక్కువగా నీళ్లు, ఓఆర్ఎస్ తీసుకున్నాను. ప్రతిక్షణం సాయిబాబా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండసాగాను. మొదటిరోజు చాలా కష్టంగా గడిచినప్పటికీ రెండోరోజు నుంచి పరిస్థితి క్రమంగా మెరుగుపడటం మొదలై విరోచనాలు కావడం తగ్గింది. దాంతో నా మనసుకు ప్రశాంతత వచ్చింది. ఇంకా శరీరంలో కూడా శక్తి మెల్లగా పుంజుకుంటున్నట్లు అనిపించింది. చివరికి సాయిబాబా అనుగ్రహంతో నేను పూర్తిగా కోలుకున్నాను. ఈ అనుభవం ద్వారా కష్టకాలంలో భక్తి మనకు ఎంత బలన్నిస్తుందో తెలుసుకున్నాను. ప్రార్థనతోపాటు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని అర్థమైంది. ప్రతి సమస్యకు సాయిబాబా ఒక మార్గం చూపిస్తారని నమ్మకం మరింత బలపడింది.
ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను.
నేను ఒక IT కంపెనీలో పని చేస్తున్నాను. 2025, డిసెంబర్ నెలకు సంబంధించిన నా టైమ్‌షీట్ విషయంలో అప్రూవల్ లేకుండా రెగ్యులరైజ్ అవుతుందా అనే సందేహం నా మనసును కలవరపెట్టడంతో నేను కొంత ఆందోళనకు లోనయ్యాను. అలాంటి సమయంలో నేను ఎప్పటిలాగే, “బాబా! ఈ విషయాన్ని నీవే చూసుకుంటావని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈలోగా అనవసరమైన మెయిల్స్ లేదా రిమైండర్స్ రాకుండా మీరే చూసుకోవాలి" అని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి భారం ఆయన మీద వేసాను. ఆ రోజంతా కొద్దిగా టెన్షన్‌గా ఉన్నప్పటికీ బాబా మీద విశ్వాసం తగ్గలేదు. అనుకోకుండా సిస్టమ్‌లో నా టైమ్‌షీట్ ప్రాసెస్ అయిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ క్షణంలో నా మనసు ఎంతో ప్రశాంతమైంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా డిసెంబర్ టైమ్‌షీట్ రెగ్యులరైజ్ కావడం నిజంగా బాబా కృపే. నా ప్రయత్నం కంటే బాబా అనుగ్రహమే ఎక్కువగా పనిచేసిందని నాకు అనిపించింది. ఈ సంఘటన మరోసారి బాబా మన సమస్యలను మౌనంగా పరిష్కరిస్తారని నిరూపించింది. సమయం వచ్చినప్పుడు బాబా అన్నీ సరిచేస్తారని నాకు బలమైన నమ్మకం ఏర్పడింది. మనకు చిన్నగా అనిపించే సమస్యలు కూడా ఆయన దృష్టిలో ఉంటాయని అర్థమైంది. బాబా మీద భారమేసి నిశ్చింతగా ఉండటం ఎంత ముఖ్యమో నాకు తెలిసింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".
