సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2000వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా అద్భుత అనుగ్రహం - రెండవ భాగం

నా పేరు రాజేశ్వరి. మాది విజయవాడ. బాబా అనుగ్రహంతో నేను నెల తప్పానని ముందు భాగంలో పంచుకున్నాను. ఇక తర్వాత విషయానికి వస్తే, నా ఆడపడుచుకి ఇద్దరమ్మాయిలు. అందుకని నేను 'నాకు పుట్టేది అబ్బాయి అయితే బావుండున'ననుకొని బాబాని అదే కోరుకున్నాను. కానీ 9 నెలల తర్వాత నాకు అమ్మాయి పుట్టింది. నాకు బాబాపై చాలా కోపమొచ్చి, "బాబా! నేను నిన్ను అబ్బాయిని అడిగాను. మరేంటి నాకు అమ్మాయినిచ్చారు" అని పోట్లాడాను. నిజానికి నేనప్పుడు సిజేరియన్ చేసినప్పుడు ఇచ్చిన మత్తులో ఉన్నాను. కాసేపటికి నేను పడుకుంటే బాబా నా కలలోకి వచ్చారు. ఆయన ద్వారకామాయిలో రాయి మీద ఎలా కూర్చుంటారో అలాగే దర్శనమిచ్చి, “అమ్మాయినిచ్చానని నువ్వు బాధపడతావేంటి? నేను నీకు పండంటి బిడ్డనిచ్చాను. అబ్బాయి బొమ్మను కూడా తయారు చేస్తున్నాను. కానీ, ఇప్పుడు అబ్బాయినివ్వటానికి సరైన సమయం కాదు. మొదట అమ్మాయి బొమ్మనే ఇవ్వాలి నీకు. అబ్బాయి బొమ్మ కూడా వుంది, నేనిస్తాను. ఈ అమ్మాయిని నా అంశగా అనుకో! దాన్ని బాధపెట్టక చక్కగా చూసుకో! నేను ఉన్నాను” అని చెప్పారు. బొమ్మని తయారు చేస్తున్నానంటూ మట్టి బాల్స్ లాంటివి కూడా చూపించారు. అయితే మొదట బాబు కావాలన్న కోరిక నా మనసులో బలంగా ఉండిపోయినట్లుంది. ఆ భావం వల్ల ఏడాదిలోపు పాపను రెండు, మూడుసార్లు కొట్టాను. మొదటిసారి పాపని కొట్టినప్పుడు బాబా కలలోకి వచ్చి, “కొట్టద్దు అని చెప్పానుగా, ఎందుక్కొట్టావు? పాపాయిని కొడితే నన్ను బాధపెట్టినట్టే! నీకు అబ్బాయిని ఇస్తానని చెప్పానుగా!" అన్నారు. కానీ నేను రెండు రోజులలో పాపకి మరో దెబ్బ వేసాను. మళ్ళీ బాబా కలలోకి వచ్చి, “నేనింక నీ కలలోకి రాను. ఆ భావం మనసులో నుండి తీసేసి పాపని ప్రేమగా చూసుకో!” అన్నారు. అంతే! ఆ తర్వాత బాబా నాకింక కలలోకి రాలేదు. పాపని కొడితేనైనా బాబా కలలోకి వస్తారని రెండు మూడుసార్లు పాపని కొట్టాను కూడా. అయినా బాబా కలలోకి రాలేదు.


రెండు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ నెల తప్పాను. నెల తప్పేముందు నాకో కల వచ్చింది. ఆ కలలో, "బొమ్మ తయారు అయిపోయింది. ఇదిగో తీసుకో!" అని అప్పజెప్పినట్లు మాటలు వినిపించాయి, బాబా మాత్రం కనిపించలేదు. 9వ నెల వచ్చాక నేను మా అమ్మవాళ్ళింట్లో పడుకుని ఉండగా, నిద్రలో ఆంజనేయస్వామి మేఘంలా వచ్చారు. నేను తల ఎత్తలేకపోతున్నాను. బాబా కలలోకి రానన్నారుగా! అందుకని ఆంజనేయస్వామిని పంపారేమో! నేను, "ఏం బాబా! ఇలా చేస్తున్నావు? నేను తల ఎత్తలేకపోతున్నాను" అని అంటుంటే ఆయన, "ఉండు చిట్టీతల్లి! నేను నిన్ను వదులుకోలేను" అని అన్నారు. తర్వాత ఆ మేఘమంతా ఒక వైపు గొట్టంలోంచి వచ్చినట్లు నా పొట్టలోకి వచ్చింది. అదేంటి అనేది నాకర్ధం కాలేదు. ఆ తర్వాత నాకు స్కానింగ్ తీసి అంతా బాగానే ఉందని చెప్పారు. నాలుగురోజుల్లో సిజేరియన్ చేసి బాబుని బయటకి తీస్తే, తనకి ఆక్సిజన్ అందటం లేదు. డాక్టర్లు బిడ్డ బ్రతకడం గురించి గ్యారంటీ ఇవ్వలేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసారు. ఆపరేషన్ చేసేటప్పుడు నాకు పెట్టిన ఆక్సిజన్ తీసి బాబుకి తగిలించారు. కొంతసేపటికి అంతా సెట్ అయింది. అంత సీరియస్ అయిన బాబుని నా చేతిలో పెట్టేసరికి నా ఆనందం చెప్పనలవి కాలేదు. మేఘం అంటే గాలే కదా! నాకిలా సమస్య ఉందనే బాబా అదివరకే హెచ్చరించి నా పొట్టలోకి ఏదో పంపించారు. నా కలలోకి రానున్నారు కానీ, అన్ని విధాలా నాకు సాయం చేసారు.


నేను మాకు సంతానం కలిగితే బాబా భజన చేయిస్తానని అనుకున్నాను. కానీ ఏడాది, ఏడాదిన్నర అయినాగానీ భజన చేయించటానికి మాకు అసలు కుదరలేదు. అప్పుడు బాబా కలలోకి వచ్చి, “భజన పెడతానన్నావు? ముందు భజన పెట్టు, ఇంటికి దృష్టి తగలబోతోంది. నేను నీ ఇంటికి రావాలి, శాంతి చేయాలి. ఒక వారం లోపు నా భజన పెట్టు" అని అన్నారు. విజయవాడలోని వస్త్రలత షాపింగ్ కాంప్లెక్స్‌‌లో సాయిబాబా భజనలు చేసే బృందంవారు బాగా చేస్తారని మావారికి నమ్మకం. కానీ వాళ్ళనడిగితే రెండు నెలలవరకు ఖాళీ లేదన్నారు. మరో ఇద్దర్ని అడిగితే, వాళ్ళు కూడా ఖాళీ లేదన్నారు. ఇంక మాకేం చేయాలో తోచలేదు. మావారు నాతో, "నువ్వేమో బాబా వారం రోజుల లోపే పెట్టమన్నారని చెప్పావు. వాళ్ళేమో ఖాళీ లేదంటున్నారు" అన్నారు. నేను ఆయనతో, "ఏమండీ! బాబాయే కలలో కనిపించి చెప్పారు. ఆయనే మార్గం చూపిస్తారు. నాకా నమ్మకం ఉంది" అన్నాను. ఆ రాత్రి ఇద్దరం పడుకున్నాము. మరునాడు ఉదయాన్నే 6గంటలకి వస్త్రలతలోని భజనబృందం వారు ఫోన్ చేసి, "మేము భజన చేయాల్సిన ఇంటివాళ్ళకేదో ఇబ్బంది వచ్చి హఠాత్తుగా ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు. నలుగురైదుగురు భజన చేయమని మమ్మల్ని అడిగారు కానీ మొదటి ప్రాధాన్యత మీకే ఇవ్వాలనిపించింది. అందుకని మీకు ఫోన్ చేసాం నిరంజన్ గారూ(మావారి పేరు)" అని చెప్పారు. ఇంకేముంది బాబా చెప్పినట్లు వారంలోపే భజన జరిగిపోయింది. అలా బాబా మాచేత కోరి భజన చేయించుకున్నారు.


ఆ భజన బృందంవాళ్ళు ఒక బాబా విగ్రహం తీసుకొచ్చి భజన చేసారు. వాళ్ళు భజన అయిపోయాక ఆ విగ్రహం మా ఇంట్లోనే ఉంచి, "వారం రోజులు పూజలు చేసుకొండి. బట్టలు ఉంటే మార్చుకొండి. మీరు ఏది తింటే అది బాబాకి పెట్టండి. మీ ఇంటికి వచ్చిన అతిథిగా భావించండి" అని చెప్పి వెళ్లిపోయారు. నేను మొదటిరోజు బాబాకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నం, రాత్రికి కూడా టిఫిన్ పెట్టాను. రెండవరోజు కూడా అలాగే చేసాను. మూడవరోజు రాత్రి ఇంకా టిఫిన్ పెట్టడానికి సమయం ఉంది. మా పిల్లలు రోజూ సంగీతం క్లాస్‌‌కి వెళ్లారు. నేను రోజూ వాళ్ళని పక్క సందులోనే ఉన్న సంగీతం క్లాసు వద్ద దింపి వస్తాను. ఆరోజు వాళ్ళని క్లాసులో దింపేసి, నేనొక్కదాన్నే తిరిగి నడుచుకుంటూ వస్తుంటే, ఒక ముసలాయన నా ముందుకు వచ్చి, "ఈ పూటైనా అన్నం పెడతావా? టిఫినే పెడతావా?" అని అడిగి నేను సమాధానం చెప్పే వ్యవధి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆ ముసలాయన్ని నేను అంతకుముందుకానీ, తర్వాతకానీ చూడలేదు. ఇంతకీ విషయమేమిటంటే, నేను రాత్రి బాబాకి టిఫిన్ అయితే బాగుంటుందని ప్రత్యేకించి టిఫిన్ చేసి పెడుతున్నాను. నేను ఆ ప్రసాదాన్ని కొంచెం తిని అన్నం తింటున్నాను. ఆ ముసలాయన అలా అడిగినంతనే నేను గబగబా ఇంటికి వచ్చేసి రెండు చెంబులు నీళ్లు పోసుకుని అన్నం, కూరలు వండి బాబాకి నైవేద్యం పెట్టాను. మిగిలిన నాలుగు రోజులు కూడా అన్నమే పెట్టాను. అలా టిఫిన్ పెడ్తుంటే వద్దని, నేను ఏది తింటే తమకీ అదే కావాలని అన్నం పెట్టించుకుని తిన్నారు బాబా.


తరువాయి భాగంలో మరికొన్ని అనుభవాలు...

5 comments:

  1. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo