ఈ భాగంలో అనుభవాలు:
1. మనస్ఫూర్తిగా వేడుకుంటే అన్ని బాబానే చూసుకుంటారు
2. బాబును ప్రసాదించిన బాబా
మనస్ఫూర్తిగా వేడుకుంటే అన్ని బాబానే చూసుకుంటారు
సాయిభక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయి నాకు ఎన్నోసార్లు సహాయం చేసి రక్షించారు. 2026, మేలో మా పాపకి జ్వరం, స్కిన్ అలర్జీ వచ్చాయి. ఇంట్లో ఉన్న హోమియో మందులు రెండు రోజులు వాడినా జ్వరం తగ్గలేదు. స్వల్ప జ్వరమే కానీ, వచ్చి పోతుండేది. అలర్జీ మాత్రం ఒళ్లంతా వచ్చి దురదతో పాప చాలా ఇబ్బందిపడింది. ఇంకా 3వ రోజు నేను పాపని హోమియో డాక్టర్ దగ్గరకి తీసుకెళితే, తగ్గుతుందని మందులిచ్చారు. అయితే, అలర్జీ కొంచెం తగ్గింది కానీ, జ్వరం తగ్గలేదు. అందుకని 5వ రోజు మళ్ళీ పాపని డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళాను. డాక్టర్ మందులు మార్చి అలర్జీకి మాత్రమే ఇచ్చి, "జ్వరం తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేయిద్దాం" అన్నారు. మర్నాడు మావారు, "జ్వరం తగ్గట్లేదు కదా! ఇంగ్లీష్ మందులకు వెళ్దాం" అనసాగారు. ఆయన అలా అంటూనే ఉన్నా ఇంగ్లీసు మందులకు వెళ్లడం నాకు ఇష్టం లేక, "బాబా! ఎన్నడూ లేనిది ఏమిటి ఈ అలర్జీ, జ్వరం. దయచేసి తగ్గించండి" అని బాబాని వేడుకున్నాను. మరుసటిరోజు జ్వరం కొద్దిగా వచ్చింది, అలర్జీ కొంచెం తగ్గింది. నేను వారం రోజులు నిద్రలేకుండా రాత్రిళ్ళు పాపని చూసుకున్నాను. బాబాని వేడుకుంటూ ఊదీ రాస్తూ ఉంటే, చివరికి జ్వరం తగ్గింది. కానీ అలర్జీ తగ్గలేదు. అప్పుడు ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయిస్తే, బాబా దయవల్ల వైరల్ ఫీవర్ కాదని రిపోర్ట్ వచ్చింది. హోమియో డాక్టర్ రిపోర్ట్ చూసి, "కేవలం అలర్జీ వల్లే జ్వరం వచ్చింద"ని చెప్పి అలర్జీ పూర్తిగా తగ్గడానికి ఇంకో రెండు రకాల మందులు వ్రాసారు. వాటితో అలర్జీ మెల్లగా తగ్గుతూ వచ్చింది. పాపకి తగ్గినందుకు నేను సాయి వేయి నామాలు వ్రాసి సాయికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. అయితే ఆ నామాల పుస్తకం శిరిడీ చేరుతుందని నాకప్పటికి తెలియదు. ఆ మర్నాడు మావారికి శని, ఆదివారాలు సెలవులు వస్తున్నాయని, శిరిడీ వెళ్ళి దర్శనం చేసుకోవాలని నాకనిపించింది. కానీ అప్పటికప్పుడు తత్కాల్లో కూడా టికెట్లు దొరకవు. అయినా విషయం మావారికి చెప్తే, మొదట తిట్టారు కానీ, తర్వాత ఏమనుకున్నారో ఏమో! ప్రీమియం తత్కాల్లో చాలా డబ్బు ఖర్చు పెట్టి మరీ టికెట్లు తీశారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. సంతోషంగా నేను వ్రాసిన సాయి వేయి నామాల పుస్తకంతో పాటు కొన్ని ఇంకా వ్రాయని వేయి నామాల పుస్తకాలు బ్యాగులో పెట్టుకొని శిరిడీ ప్రయాణానికి సిద్ధమయ్యాను. ఉదయం ట్రైన్ ఎక్కిన తర్వాత నేను, మావారు, మా అమ్మ తల ఒక వేయి నామాల పుస్తకాలు వ్రాసాము. మాకు దర్శనం టికెట్లు దొరికాయి కానీ, రూమ్ దొరకనందున 'ఎలా బాబా అనుకున్నాను' కానీ, మావారి సహోద్యోగి సాయిబాబా ధవళేశ్వరం ట్రస్ట్‌లో మెంబర్. ఆయన శిరిడీలో తులసివిహార్లోని ధవళగిరి సాయి ఆశ్రమంలో మాకు రూమ్ ఇప్పించారు. అలా బాబానే అన్ని అమర్చి తమ దర్శనం చేయించారు. మేము వ్రాసిన 4 వేయి నామాల పుస్తకాలు బాబా సమాధికి తాకించి తిరిగి నా చేతికి ఇచ్చాక వాటిని హుండీలో వేశాను. ఈసారి మేము మొదటిసారి ద్వారకామాయికి వెళ్లి అక్కడ గోడలు తాకి తన్మయమయ్యాము బాబాని మనస్పూర్తిగా వేడుకుంటే అన్ని ఆయనే చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా. నా భర్త, ఈ కుటుంబం అన్ని మీరు నాకిచ్చిన ప్రసాదాలే. వారి మనశ్శాంతి, సంతోషమే నేను ఎప్పుడూ కోరుకునేది. దయతో మమ్మల్ని చల్లగా చూడు తండ్రీ".
బాబును ప్రసాదించిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు సందీప్. మేము గత 10 సంవత్సరాలుగా బాబాను మా ఇంటి సభ్యుడిలా భావిస్తూ, ప్రతి విషయంలో ఆయన ఆశీస్సులు తీసుకుంటూ జీవిస్తున్నాము. బాబాకు చెప్పకుండా మేము ఏ పని ప్రారంభించము. మా జీవితంలో ఎన్నో కష్టాలు, పరీక్షలు ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఆశలు కోల్పోయిన రోజులున్నా మేమెప్పుడూ బాబాపై ఉన్న నమ్మకాన్ని మాత్రం వదలలేదు. బాబా దయవల్ల మాకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థికంగా స్థిరపడ్డాం. హైదరాబాద్‌లో ఒక ఇల్లు కూడా తీసుకున్నాము. మాకు ఒక పాప ఉంది. ఆమె మా జీవితానికి ఆనందం తీసుకొచ్చింది. కానీ కుటుంబసభ్యులు, బంధువులు, సమాజంలోని కొందరు "ఒక బాబు కూడా ఉంటే బాగుంటుంది" అని తరచూ అంటుండేవారు.
మా కుటుంబం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తున్నప్పటికీ అలాంటి మాటలు కొన్నిసార్లు మనసుకు బాధ కలిగించేవి. ఆ పరిస్థితుల్లో మేము బాబాపై విశ్వాసం ఉంచి, ఆయనకు మా కోరికను విన్నవించుకున్నాము. కొంత కాలం గడిచాక బాబా ఆశీస్సులతో మాకు ఒక బాబు జన్మించాడు. మా ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ రోజు మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. మా కుటుంబం పరిపూర్ణమైన భావన కలిగింది. మాకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం లభించినట్లు అనిపించింది. బంధువులు, స్నేహితులు కూడా చాలా సంతోషించారు. ఈ అనుభవం ద్వారా మేము బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే, ఆయన సరైన సమయంలో మనకు కావాల్సింది ప్రసాదిస్తారు. కొన్నిసార్లు ఆలస్యం జరిగినట్లు అనిపించినా, బాబా నిర్ణయం ఎప్పుడూ మన మంచికే అయి ఉంటుందని నేను తెలుసుకున్నాను. "బాబా! మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐ లవ్ యు బాబా".

Om sai ram tandri ofce lo alage na life lo unna problems ni teerchandi tandri pls, naaku unna problems meeku telusu vaati nunchi nannu bayata padesi manashanti ni ivvandi baba pls, na kutumbam mottanni andarni anni velala ayur arogyalatho kshamam ga kapadandi tandri pls.
ReplyDelete