ఈ భాగంలో అనుభవాలు:
1. శ్రీసాయి అనుగ్రహశీస్సులు
2. బాబాను తలుచుకుంటే ఏదీ లేదనరు
శ్రీసాయి అనుగ్రహశీస్సులు
ప్రియమైన సాయిభక్తులకు నమస్కారం. నా పేరు శశికాంత్. నేను ఎంతో చదువు చదువుకున్నాను. ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశాను. కానీ సరైన ఉద్యోగం రాక ఇంట్లో ఒకటే టార్చర్ అనుభవించాను. అలా రోజులు తరబడి బాధపడుతూనే ఉండగా ఒకరోజు మా మామయ్య సత్యేందర్ నాకు ఒక 'సాయి దివ్యపూజ' పుస్తకమిచ్చి, "ఇది చదువుకో" అని చెప్పాడు. నేను ప్రతి గురువారం ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. రెండు, మూడు వారాల తర్వాత బాబా దయవల్ల నేను అనుకున్న ఉద్యోగం నాకు వచ్చింది.
మావయ్య ఇచ్చిన ఆ సాయి దివ్యపూజ పుస్తకం మీద ఆ పుస్తకం ప్రింట్ చేసిన నెంబర్ ఉంటే, నేను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయి నా జీవితంలో నేను పడ్డ బాధలు, సమస్యల గురించి, వాటిని బాబా ఎలా తీర్చారు అన్నది చెప్పాను. ఆ సాయి పబ్లికేషన్స్ వాళ్ళు నా నెంబర్ ఉంచుకొని అప్పుడప్పుడు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. నేను గవర్నమెంట్ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్ని. ఒక నెల జీతం రాలేదు. ఇంటి అద్దె కట్టాలి, ఇంటికి అవసరమైన సరకులు తేవాలని నేను హెడ్ ఆఫీసుకి కాల్ చేసి జీతం గురించి అడిగితే, "ఈ నెల రాదు. వచ్చేనెల వస్తుంది" అని చెప్పారు. అప్పుడు నేను, "సాయీ! నాకేంటి ఈ పరిస్థితి" అని సాయితో గట్టిగా అనుకున్నాను. 10 నిమిషాల్లో సాయి పబ్లికేషన్స్ నుండి 'ఆశ వదులుకోకు. ఏ క్షణమైనా అద్భుతం జరగవచ్చు. నేను నీతో ఉన్నాను బిడ్డ' అని నాకు ఒక మెసేజ్ వచ్చింది. తర్వాత నిజంగానే అద్భుతం జరిగింది. నా జీతం నా అకౌంటులో పడింది. ఆ తర్వాత 'నీవు అనుకున్న లక్ష్యాన్ని ఇంకా సాధించలేదు. దానికోసం నువ్వు తగినంతగా ప్రయత్నం చేయి' అని నా లక్ష్యం గురించి నాకు గుర్తు చేసారు బాబా. "ధన్యవాదాలు బాబా. మీరు చెప్పినట్లే ప్రయత్నం చేస్తాను బాబా".
చాలా సంవత్సరాల క్రితం ఒకసారి నేను మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాను. వాళ్ళు అక్కడినుండి ముంబయి వెళ్లమన్నారు. నాకు ముంబయి గురించి తెలియనందున నా స్నేహితులిద్దరిని తోడుగా తీసుకొని ముంబయి వెళ్ళాను. కంపెనీవాళ్ళు ఒక పుస్తకమిచ్చి మర్నాడు ఉదయం అందులో ఉన్నదంతా మాకు చెప్పాలన్నారు. అప్పటికి చాలా ఆలస్యమవడంతో నా స్నేహితులు వెళ్లిపోయారు. కంపెనీవాళ్ళు వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండమంటే నేను ఉన్నాను. కానీ నాకు చాలా భయమేసి దుఃఖం ఆగలేదు. నా ఫోన్ పని చేయలేదు. నాతోపాటు ఉన్న ఒకతని ఫోన్ తీసుకొని మా అన్నయ్యకు ఫోన్ చేసి, "నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది" అని చెప్పాను. రాత్రంతా ఏడుస్తూ బాబాని తలుచుకుంటూ పడుకున్నాను. మర్నాడు ఉదయం ఆటో ఎక్కి అంధేరి వెళ్ళాను. అక్కడ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, అక్కడున్న ట్రావెల్స్ పేరు 'సాయి ట్రావెల్స్', బోర్డుపై సాయిబాబా ఫోటో కూడా ఉంది. అక్కడ ఉన్న ఒకతను, "మీరు ఎక్కడికి వెళ్లాలి?" అంటే, నేను "వరంగల్ వెళ్ళాలి" అన్నాను. అతను తెలుగులో మాట్లాడి తాగడానికి టీ ఇచ్చి దగ్గరుండి బస్సు ఎక్కించాడు.
ఒకరోజు నా కొడుకుకి చాలా చాలా జ్వరం వచ్చింది. జ్వరంతోపాటు ఊపిరితిత్తుల్లో కఫం ఏర్పడింది. విపరీతమైన జ్వరంతో బాబు కళ్ళు కూడా తెరవలేదు. ఇద్దరు, ముగ్గురు డాక్టర్లని కలిసాము. వాళ్ళు, "పరిస్థితి బాగాలేదు. చాలా సీరియస్గా ఉంది. హాస్పిటల్లో జాయిన్ చేయాల"ని అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాక, "బాబా! ఎలా అయినా నా కొడుకుకి జ్వరం తగ్గేలా చూడు" అని బాబాని వేడుకున్నాను. బాబా దయచూపారు. ఎందుకో రాత్రి 9 గంటలప్పుడు మా బావకి కాల్ చేశాను. తను డాక్టర్. తనికి నా కొడుకు పరిస్థితి చెపితే, ఒక నాలుగు టాబ్లెట్లు వాడమని చెప్పాడు. నేను ఆ రాత్రి వెళ్లి టాబ్లెట్లు తెచ్చి బాబుకి ఇచ్చాను. మర్నాడు ఉదయం కల్లా జ్వరం తగ్గటం ప్రారంభించి పూర్తిగా తగ్గిపోయింది "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబాను తలుచుకుంటే ఏదీ లేదనరు
ముందుగా అందరికీ నా వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఇక్కడ నేను, నా బావమరిది ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాము. మా ప్రాజెక్ట్ రెన్యూ కానందున కంపెనీవాళ్ళు మా ఇద్దరిలో ఒకరే ఉండాలి, ఇంకొకరు ఇండియా వెళ్ళాలని అన్నారు. మేము చాలా టెన్షన్ పడ్డాము. నేను, 'బాబా! ఎందుకిలా అయింది?' అని అనుకున్నాను. సరిగ్గా 10 రోజుల్లో ప్రాజెక్ట్ రెన్యూ అయిందని క్లయింట్, ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పారు. మాకు చాలా సంతోషమేసింది. ఇదంతా బాబా దయ వల్లనే జరిగింది. ఆయనను తలుచుకుంటే ఏదైనా లేదనరు.
ఒకసారి నా ఆఫీస్ లాగిన్ ఐడి పని చేయకపోతే, అది రియాక్టివేట్ చేయడానికి దాదాపు 25 రోజులు పడుతుందన్నారు. నేను, "బాబా! నా ఐడి ఏ సమస్యా లేకుండా యాక్టివేట్ అవ్వాలి" అని బాబాను గట్టిగా వేడుకున్నాను. బాబా దయవల్ల అక్టోబర్ 24న నా ఐడి యాక్టివేట్ అయింది.
మా నాన్నకి 75 సంవత్సరాల వయసు. ఆయన బలహీనంగా ఉన్నారు. పైగా సరిగా ఏమీ తినడం లేదు. ఇలా ఉండగా ఆయన ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. డాక్టరు అన్నీ టెస్టులు చేసి, "3 వాల్వ్స్కి స్టెంట్లు వేయాలి. ఒక 10 రోజులు ఆగి మళ్ళీ వస్తే, పరీక్షలు చేసి ఏమి చేయాలో చెప్తామ"ని చెప్పి 2025, మే 26న డిశ్చార్జ్ చేసారు. నేను నాన్నకోసం బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల డాక్టర్ నాన్నకి ఆపరేషన్ అవసరం లేదని, మందులు వాడితే సరిపోతుంది అన్నారు.
ఇలా బాబా ఇంతవరకు నేను అడిగినవన్నీ ఇచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
