1961, మార్చి నెలలో నరహరి వాసుదేవ్ రాయికర్ కడుపుకు సంబంధించిన అనారోగ్యంతో ముంబాయిలోని KEM(King Edward Memorial) హాస్పిటల్లో చేరాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్ బి.ఎన్.పురంధరే ఆధ్వర్యంలో శశికాంత్ జి.జవేరి అనే అతను డాక్టరుగా పనిచేస్తుండేవాడు. జవేరి, అతని స్నేహితులు సాయంత్రం వేళల్లో ఏ సహోద్యోగి ఖాళీగా ఉంటే ఆ వార్డులో అలవాటుగా కలుసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండేవారు. అలా ఒకరోజు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా జవేరితో అతని స్నేహితులు, “మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నరహరి అనే రోగి హస్తసాముద్రికంలో మంచి నిపుణుడు. అతని అంచనాలు తప్పవు” అని చెప్పారు. తర్వాత వారిలో ఒకరు జవేరిని నరహరికి పరిచయం చేశారు. సాదాసీదాగా, సౌమ్యంగా, ఎవరినైనా పాత స్నేహితుడిలా భావించే అసాధారణ గుణాలను కలిగివున్న నరహరిని జవేరి ఇష్టపడ్డాడు. కానీ జవేరికి హస్తసాముద్రికంపైన, దేవునిపైన నమ్మకం లేనందువల్ల అటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండేవాడు. అయినప్పటికీ ఒకరోజు సాయంత్రం కేవలం వినోదం కోసం హస్తసాముద్రికం చెప్పమంటూ తన అరచేతిని నరహరికి చూపించాడు. నరహరి మామూలుకంటే చాలా ఎక్కువ సమయం పాటు జవేరి అరచేతిలోని రేఖలను పరిశీలించి చూశాడు. ఆపై తన వద్దనున్న పాత సంచిలోంచి భూతద్దాన్ని తీసి మళ్ళీ ఏకాగ్రతతో అతని చేతిరేఖలను పరిశీలించి ఎంతో ఆశ్చర్యంతో, “ఆ ఒక్కడివి నువ్వే! ఓ సాయినాథ్ భగవాన్! మీ చర్యలు అగోచరం. చివరికి నేను మీ స్నేహితుడిని కలిశాను" అని అన్నాడు. నరహరి అలా ఎందుకంటున్నాడో జవేరికి అంతుబట్టలేదు. అప్పుడు నరహరి తన పాత డైరీని తీసి 1912లో తాను గీసిన అరచేతి గీతలను అతనికి చూపించాడు. అవి అచ్చం తన చేతిలోని గీతల వలె ఉండటం చూసి జవేరి తీవ్ర గందరగోళానికి గురై ‘ఇది కేవలం యాదృచ్ఛికమ’ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అప్పుడు నరహరి అతనితో, "బాబా తాము మహాసమాధి చెందిన 20 సంవత్సరాల తర్వాత నువ్వు పుడతావని నాతో చెప్పారు. అంటే, నువ్వు ఖచ్చితంగా 1938లో పుట్టి ఉంటావు. అవునా?” అని అన్నాడు. దాంతో జవేరి అయోమయంలో పడి, "ఏ బాబా? ఆ బాబాతో నాకు సంబంధం ఏమిటి? ఈ అర్థంలేని మాటలకు ముగింపు పలికితే మంచిది" అనుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు. కానీ అతని మనసు శాంతించలేదు.
మరుసటిరోజు ఆదివారం. ఆరోజు సాయంత్రం జవేరి ఖాళీగా ఉండటంతో వెళ్లి నరహరి వద్ద కూర్చున్నాడు. నరహరి నవ్వి, “మీ చంచలమైన మనస్సు మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు కదా! మీరు నా మాటలను నమ్మరని, అయినప్పటికీ ఇప్పుడు నాతో సరదాగా గడపడానికి వచ్చారని నాకు తెలుసు. నిజమేనా?” అని అన్నాడు. జవేరి అవునన్నట్టు తల ఊపాడు. అప్పుడు నరహరి అతనితో, “ఈరోజు నుండి మూడవరోజున మీరు ఒక కొట్లాటలో పాల్గొంటారు. ఆ మరుసటిరోజు మధ్యాహ్నం మీకు భోజనం ఉండదు. రాత్రి వరకు ఆకలితో ఉంటారు. మీరు ఈ రెండు విషయాలను నిరోధించలేకపోతే(తప్పించుకోలేకపోతే), మీరు శ్రీసాయిబాబా ఆదేశాలను పాటించాలి. అందుకు మీరు అంగీకరిస్తారా?" అని అన్నాడు. జవేరి తనని ఆ నాటకంలోకి ఒక అత్యున్నత శక్తి లాగుతుందని తెలియక దీనినంతా ఒక తమాషాగా భావించి అంగీకరించాడు. అప్పుడు నరహరి అతనిని, "బాబా ఆజ్ఞాపించినట్లు చేస్తానని వాగ్దానం చేయమ"ని అడిగాడు. అతనలాగే వాగ్దానం చేశాడు.
తర్వాత మూడవరోజున జవేరి, అతని స్నేహితులు ఇంటికి తిరిగి వెళ్ళడానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బస్సు ఎక్కారు. ఆ బస్సు చాలా ఖాళీగా ఉంది. ఒక యువతి చిన్నబిడ్డతో వచ్చి జవేరి ముందు సీటులో కూర్చుంది. ఆ యువతి టిక్కెట్ తీసుకుంది. కానీ, ఆమె అల్లరి బిడ్డ దానితో ఆడుకుంటూ కిటికీలోంచి బయటకు విసిరేసింది. తర్వాతి స్టాప్‌లో టిక్కెట్‌లు తనిఖీ చేసే అధికారి బస్సెక్కి బస్సులో ఉన్న అందరి టిక్కెట్లు తనిఖీ చేయనారంభించాడు. జవేరి, అతని స్నేహితులు తమ టిక్కెట్‌లను చూపించారు. తర్వాత ఆ అధికారి ఆ యువతిని టికెట్ అడిగాడు. ఆమె జరిగింది చెప్పగా జవేరి, అతని స్నేహితులు అందుకు సాక్ష్యం చెప్పారు. అధికారి విషయం అర్థం చేసుకొని ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. కానీ బస్సు కండక్టర్ మాత్రం అసభ్య పదజాలంతో ఆ యువతిని దూషించాడు. అప్పుడు జవేరి, అతని స్నేహితులు జోక్యం చేసుకోవడంతో భీకరమైన గొడవ జరిగింది. చివరకు వాళ్ళు బస్సును పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లారు. జరిగిన ఘటనతో జవేరి మనశ్శాంతి కోల్పోయాడు. ఆ విధంగా బాబా చెప్పిన జోస్యంలోని మొదటి విషయం నిజమైంది.
4వ రోజున జవేరి, అతని స్నేహితులు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భోజనానికి ఇంటికి వెళ్లారు. వాళ్ళు డబ్బు ఆదా చేయదలచి ఒక భోజనం పార్శిల్ తెప్పించుకుని ముగ్గురూ తినాలనీ, పొదుపు చేసిన డబ్బుతో సినిమాకి వెళ్లాలనీ అనుకున్నారు. వాళ్ళు ఉంటున్న ఇల్లు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఎత్తైన భవనం(municipal chawl)లో ఉంది. ఆరోజు తమ భవనం ముందర రోడ్డు ప్రక్కన ఉన్న కాలిబాట రద్దీగా లేనందున వాళ్ళు భవనం ముందున్న రేకుల షెడ్ కింద మంచం వేసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు జవేరి, "రాయికర్‌తో చేసుకున్న ఒప్పందంలోని ఈ భాగం అవాస్తవం. హస్తసాముద్రికం అంతా అవాస్తవం" అని ఆలోచిస్తూ ఆనందంగా మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అంతలో ఏం జరిగిందో చూడండి! జవేరి, అతని స్నేహితులు ఉంటున్న భవనంలో గోవా నుండి వచ్చిన చాలామంది నివసిస్తున్నారు. వాళ్ళకి కాలిబాటకు ప్రక్కనే దుకాణాలు ఉన్నాయి. వాళ్లలో ఒక గోవా మహిళ జవేరి, అతని స్నేహితుల వద్దకి పరుగున వచ్చి, "డాక్టర్! త్వరగా రండి, ఒక యువకుడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. అతనికి మీ సహాయం కావాలి" అని అంది. వెంటనే వాళ్లంతా అక్కడినుంచి లేచి సహాయం చేసేందుకు పరుగుతీశారు. అక్కడ దాదాపు 20 సంవత్సరాల వయసున్న ఒక యువకుడు క్రింద పడిపోయి వున్నాడు. అతని నోటినుండి నురగ వస్తోంది. అతనికి మూర్ఛ వచ్చిందని గ్రహించిన ఆ స్నేహితులు వెంటనే క్యాబ్ తీసుకొని ఆ యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకొని చికిత్స ప్రారంభించారు. అయితే రోగి పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచాడు. అప్పటికి రాత్రి అయింది. ఈ పరిస్థితుల వల్ల జవేరికి, అతనికి స్నేహితులకి ఆరోజు మధ్యాహ్నభోజనం లేకుండా పోయింది. దాంతో జవేరి సందిగ్ధంలో పడి చివరికి ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఆ రాత్రంతా జవేరికి కంటిమీద కునుకు లేదు. 'ఈ సాయిబాబా ఎవరు? నేను పుట్టడానికి 20 సంవత్సరాల ముందు నా అరచేతిలోని గీతలను ఆయన ఎలా తెలుసుకోగలిగారు? తమ మహాసమాధి అనంతరం జరగబోయే సంఘటనలను ఆయన ఎలా ఊహించగలిగారు? ఈ సమయంలో ఈ రెండు సంఘటనలు జరుగుతాయని ఆయన 1912లోనే రాయికర్‌కు ఎలా హామీ ఇచ్చారు? నేను ఎప్పుడు పుడతానో ఆయనకి ఎలా తెలుసు?' అనే ఆలోచనలు మనసులో సుడులు తిరగసాగాయి. చివరికి అతను భవిష్యత్తు గురించి అంతులేని జ్ఞానమున్న ఆ అత్యున్నత శక్తికి తలవంచాల్సి వచ్చింది.
మరుసటిరోజు జవేరి నెమ్మదిగా వెళ్లి నరహరి ముందు నిలబడి, "మీరు చెప్పినవన్నీ నిజమే" అని అన్నాడు. అప్పటినుండి అతను తన ఖాళీ సమయాన్ని నరహరితో గడుపుతుండేవాడు. ప్రతిరోజూ రాత్రి తన పని పూర్తయిన తర్వాత నరహరి వద్ద కూర్చుని బాబా గురించి అడుగుతుండేవాడు. బాబా దైవత్వం గురించి నరహరి అతనికి చెప్తుండేవాడు. ఒకరోజు నరహరి అలమరాలో ఉన్న తన ట్రంకుపెట్టెను తీసుకొని రమ్మని జవేరితో చెప్పాడు. జవేరి ఆ పెట్టెను తీసుకురాగానే నరహరి ఆ పెట్టెలో ఉన్న ఒక చిన్న గుడ్డమూటను జవేరికిచ్చి, 1912లో బాబా జవేరితో చెప్పమని తనకు చెప్పిన వివరాలన్నీ చెప్పి, "నేను త్వరలోనే మరణిస్తాను. నేను మరణించిన పిమ్మట నా దగ్గర ఉన్నదంతా ఒక మూట కట్టి నాతోపాటు దహనం చేయండి. అనంతరం ఈ మూటను తెరిచి, అందులోని వస్త్రంపైన ఉన్న పాదముద్రల ఆధారంగా రాతితో ఒక జత పాదుకలను, ఇత్తడితో మరో జత పాదుకలను తయారు చేయించి, ఆ వస్త్రాన్ని పాదుకల వద్ద ఉంచి నేనిప్పుడు చెప్పబోయే మంత్రం పఠించండి” అంటూ జవేరి కుడిచెవిలో మంత్రం చెప్పడానికి ఉపక్రమించాడు. చిత్రంగా 49 ఏళ్లుగా ఒక్క పదం కూడా గుర్తులేని బాబా 1912లో చెప్పిన ఈ క్రింది మంత్రం అతనికి గుర్తొచ్చి, జవేరి చెవిలో ఉచ్ఛరించాడు.
'జన్మ్ జన్మో జన్మి శ్రీచరణ్ శ్రీభాగ్య సాయి'
తర్వాత కొద్దిసేపట్లోనే నరహరి తుదిశ్వాస విడిచాడు. నరహరి సూచనలననుసరించి అతని పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, అతని అస్థికలను నాసిక్‌లోని గోదావరి నదిలో నిమజ్జనం చేశాడు జవేరి. ఆ తరువాత నరహరి ఇచ్చిన గుడ్డమూటను తెరిచి చూశాడు. అందులో చాలా పురాతనమైన నల్లటి వస్త్రం కనిపించింది. దానిపై బాబా పాదాల ముద్రలు మరింత నల్లగా ముద్రించబడి ఉన్నాయి. వాటి ఆధారంగా రాతితో ఒక జత పాదుకలను, ఇత్తడితో మరో జత పాదుకలను తయారుచేయించి వాటిని ఇంటికి తీసుకొచ్చాడు. వాటిపై బాబా పాదముద్రలున్న వస్త్రాన్ని ఉంచి, అగరుబత్తీలు వెలిగించి, కళ్ళు మూసుకొని బాబా చెప్పిన మంత్రాన్ని ఉచ్ఛరించాడు. కళ్లు తెరిచి చూసేసరికి పాదుకలపై ఉంచిన వస్త్రం కనిపించలేదు. చుట్టుప్రక్కలంతా వెతికినప్పటికీ దాని జాడ తెలియలేదు. దాంతో ఆ వస్త్రం తుదకు తన ఇంటికి చేరుకుందని (అనగా భగవంతుని పాదాలలో ఐక్యమైందని) జవేరి గ్రహించాడు. అప్పటినుంచి 36 సంవత్సరాలపాటు క్రమంతప్పకుండా జవేరి నిష్ఠగా ప్రతిరోజూ రాత్రి ఒంటిగంటకు లేచి, బాబా చెప్పిన మంత్రాన్ని భక్తితో ఉచ్ఛరించి నిద్రపోయేవాడు. ఆ విధంగా 36 సంవత్సరాలు పూర్తైన తర్వాత బాబా చెప్పినట్లు ఆ పాదుకలను దర్శనార్థం భక్తులకు అందుబాటులో ఉంచాడు. ఆ పాదుకలు ఎంతో పవిత్రమైనవి. పూజాసమయంలో బాబా చిత్రపటానికి వేసిన పూలమాల పొడవు దానంతటదే పెరిగి క్రిందనున్న పాదుకలను ఆచ్ఛాదన చేయడం వంటి అనేక అద్భుతాలను డాక్టర్ జవేరి చవిచూశారు.
ఆ పాదుకలకు చేసే అభిషేకం ఎంత ప్రభావవంతమైనదో ఈ క్రింది లీల మనకు తెలియజేస్తుంది. ఇది కొల్హాపూర్ నివాసస్థులైన శ్రీబాలకృష్ణ రామచంద్ర బక్రే కుమార్తె గంగ యదార్థ గాధ. 2004, డిసెంబర్ నెలలో ఒకరోజు గంగ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. అయితే ఆ రాత్రి తనకు బాగానే ఉండటంతో వంట చేసి తన కుటుంబంతో కలిసి భోజనం చేసింది. ఆపై ఆమె ఇంటిపనులన్నీ పూర్తిచేసి నిద్రపోయింది. మరుసటిరోజు ఉదయం ఆమె ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు నిద్రలేచింది. కానీ, అవయవాలు పటుత్వం కోల్పోయివున్నందున గంగ తన అవయవాలను కదల్చలేకపోయింది. గంగ పరిస్థితిని చూసిన తండ్రి, తన కూతురికి ఏదో తీవ్రమైన సమస్య ఉందని గ్రహించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ గంగను వారంరోజులు ఐసీయూలో ఉంచి క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆమెకొచ్చిన సమస్యను పక్షవాతంగా నిర్ధారించారు డాక్టర్లు. అది విని బాలకృష్ణ విస్తుపోయాడు. పక్షవాతానికి గురైన కండరాలలో బలం ఎప్పుడు తిరిగి పుంజుకుంటుందో నిర్ధారణగా చెప్పలేమని చెప్పి డాక్టర్లు గంగను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తన కుమార్తె కోలుకుంటుందన్న ఆశతో బాలకృష్ణ ఎంతోమంది వైద్యులను సంప్రదించి తనకు సాధ్యమైనమేరకు అన్నిరకాల వైద్యచికిత్సలు ఆమెకు అందించే ప్రయత్నం చేశాడు. అనేకమంది న్యూరాలజీ నిపుణులు, ఆయుర్వేద వైద్యలు, హకీమ్‌లు గంగకు చికిత్స చేశారు. ఒకటిన్నర సంవత్సరంపాటు ఆమెకు అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద మందులు ఇచ్చారు. అలా గంగ చికిత్స కోసం బాలకృష్ణ లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఆమె పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా కనిపించలేదు. గంగ పూర్తిగా మంచానికే పరిమితమైంది. దాంతో గంగ రోజువారీ అవసరాలు చూసుకోవడానికి బాలకృష్ణ ఒక నర్సును నియమించాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక సాయిభక్తుడు 'శ్రీభాగ్య' సాయిబాబా మంత్రం మరియు పాదుకల గురించి బాలకృష్ణతో చెప్పాడు. వెంటనే బాలకృష్ణ పూణే వెళ్లి గంగ పేరు మీద బాబా పాదుకలకు అభిషేకం చేసి, 'శ్రీచరణ్ శ్రీభాగ్య సాయి' మంత్రాన్ని నిరంతరాయంగా పఠిస్తూ బాబాపై అత్యంత విశ్వాసంతో పాదుకల అభిషేకతీర్థాన్ని, బాబా ఊదీని గంగకు ఇవ్వసాగాడు. ఆ విధంగా ఒక సంవత్సరం చేశాక అద్భుతమైన ఫలితం వచ్చింది. మంచానికే పరిమితమైన గంగ కోలుకొని ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇంటిపనులన్నీ చేసుకోసాగింది. ఖాళీ సమయంలో టైలరింగ్ కూడా నేర్చుకొని జీవనోపాధి పొందింది. ఇది కేవలం బాబా ఆశీస్సులతో ఆయన ఊదీ, తీర్థం, మంత్రం వల్లనే సాధ్యమైంది. గంగ, ఆమె కుటుంబం బాబాకు శాశ్వతంగా ఋణపడిపోయారు. బాలకృష్ణ ఇలా అంటారు: “నేను అనేకమంది వైద్యులు, మందులు, ఆసుపత్రులకు ఖర్చు చేసిన లక్షల రూపాయలతో పోలిస్తే రవాణా ఛార్జీలు(పూనా వెళ్లి రావడానికి), పువ్వులు, అభిషేకం అన్నిటికీ కలిపి కేవలం 1,800 రూపాయల ఖర్చు మాత్రమే అయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న నా కూతురిని చూసి అంతటి అపూర్వమైన మంత్రాన్ని, పాదుకలను తన భక్తులకు ప్రసాదించిన బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను".
నరహరిని అనుగ్రహించినట్లే జవేరిని కూడా ఎంతగానో అనుగ్రహించారు బాబా. తనను ఇంతగా అనుగ్రహించిన తన సద్గురువైన శ్రీసాయిబాబాకు ‘గురుదక్షిణ’ ఎలా సమర్పించుకోవాలా అన్న ఆలోచన డాక్టర్ జవేరి మనస్సుని చాలా కలతకు గురిచేసింది. ఎంతో ఆలోచించిన మీదట, మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ అనీ, అది బాబాకు నచ్చుతుందనీ, బాధల్లో ఉన్న మానవాళికి సహాయం చేయడమే తాను తన గురువుకు సమర్పించుకునే ఉత్తమమైన దక్షిణ అనీ నిర్ణయించుకున్నాడు. అందువల్ల అతను 30 ఏళ్ళపాటు ఎంతో పరిశోధన చేసి ఆస్తమా రోగులకు ఉపశమనం కలిగించే ఆయుర్వేద ఔషధాన్ని కనుగొని 7,000 మందికి పైగా రోగులకు విజయవంతంగా చికిత్స అందించాడు. అతని ద్వారా శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందిన ప్రతి రోగి హృదయపూర్వకంగా అతనిని ఆశీర్వదించినందువల్ల అతను సంతృప్తికరమైన ప్రశాంత జీవితాన్ని గడిపాడు. 2016లో డాక్టర్ జవేరి చికెన్ గున్యాతో అనారోగ్యం పాలై చివరికి 2016, అక్టోబరు 1, శనివారంనాడు బాబాలో ఐక్యమయ్యాడు.
శ్రీసాయిబాబా పవిత్రమైన ఈ పాదుకలు పూణేలో డాక్టర్ జవేరి క్లినిక్‌లో భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉన్నాయి. సాయిభక్తుల ప్రయోజనార్థం ఆ క్లినిక్ చిరునామా దిగువన ఇవ్వబడింది.
Shree Aushadhalaya.
Shop No.2,
Radhakrishna Apartment,
Bajirao Road,
Infront of Prabhat Cinema,
Shaniwar Peth,
Pune – 411030
Maharashtra, India.
మూలం: బాబాస్ డివైన్ మేనిఫెస్టేషన్స్ బై విన్నీ చిట్లూరి.