ఈ భాగంలో అనుభవాలు:
1. నెలసరి ఆపి నోము చేసుకొనేలా అనుగ్రహించిన బాబా
2. బాబా అనుగ్రహం
నెలసరి ఆపి నోము చేసుకొనేలా అనుగ్రహించిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు లలిత. ఈ బ్లాగు బాబాకి దగ్గరయ్యే మార్గాన్ని చూపుతుంది, అలాగే సమస్యల్లో ఉన్నప్పుడు ఎంతో ధైర్యాన్నిస్తుంది. మేము కార్తీకమాసంలో కార్తీక నోములు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటిది ఈ సంవత్సరం(2024) అనుకోకుండా ముందుగా నాకు నెలసరి వచ్చేయడంతో మూమూలుగా నోము చేయాల్సిన రోజు చేసుకోలేకపోయాను. అందుకని ఒక వారం తర్వాత చేసుకుందామనుకొని అన్ని సిద్ధం చేసుకుంటుంటే, పూజకి ఒక రోజు ముందు మళ్ళీ నెలసరి కనిపించింది. అంతకుముందు కూడా ఇలానే నెలసరి పది రోజుల వరకు ఆగలేదు. అందువల్ల నాకు చాలా భయమేసింది. ఇల్లు శుభ్రపరచడం ఆపేసాను. కానీ ఇక అప్పుడు నోము చేయలేకపోతే ఈ సంవత్సరం కార్తీక నోములు అస్సలు చేయనట్టే. అది చాలా పెద్ద విషయం. ఇలాంటి సమయంలో నేను అనుకోకుండా చాలా రోజుల తరువాత ఈ బ్లాగ్(సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు) ఓపెన్ చేసి చూసాను. నాకు బాబా గుర్తొచ్చారు. బాబా దగ్గరికి వెళ్లి, "ఇక నువ్వే నాకు దిక్కు" అని ఏడ్చి, "నీ ఊదీ నీళ్ళే నాకు ఔషధం. ఏదో ఒకటి చేసి నా నెలసరి ఆపండి. పూజ చేసుకునేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. వెంటనే ఊదీ నీళ్లలో కలుపుకుని తాగాను. కొన్ని గంటల వరకు చాలా కంగారుగా భయపడుతూ గడిపాను. కానీ తరువాత అంతా సర్దుకుంటుందనిపించింది. బాబా తన లీల చూపించారు. మధ్యాహ్ననికి పూర్తిగా నెలసరి ఆగిపోయింది. ఇంటి పనులు మొదలుపెట్టుకున్నాను. అయినప్పటికీ రేపు ఏమవుతుందోనని కంగారుపడుతూనే ఉన్నాను. కానీ ఆ బాబా దయవల్ల ఏ సమస్య లేకుండా వ్రతం చేసుకోగలిగాను. "నా ప్రతి సమస్యని తీరుస్తూ నన్ను అనుగ్రహిస్తున్న మీకు చాలా ధన్యవాదాలు బాబా. నేను ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోకుండా పూజించుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వండి బాబా".
బాబా అనుగ్రహం
నా పేరు రాంప్రసాద్. నేను హైదరాబాద్ నివాసిని. ఒకప్పుడు నేను మా అన్నయ్యవాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. మా నాన్న నన్ను చూడడానికి వచ్చినా, నేను మా వూరు వెళ్లినా నా అవసరాల కోసం నాన్న దగ్గర నుండి డబ్బులు తీసుకుంటుండేవాడిని. ఆ డబ్బుల్లో ఎంతో కొంత దాచిపెట్టుకుంటుండేవాడిని. అలా 2 సంవత్సరాలు గడిచాక నేను హాస్టల్లో చేరాను. అప్పుడు నా సామానంతా తెచ్చి నా గదిలో పెట్టుకున్నాను. నేను దాచిపెట్టుకున్న డబ్బులు లెక్క పెట్టి జాగ్రత్తగా ఓ బ్యాగులో పెట్టాను. కొన్ని రోజులు గడిచాక నేను ఏదో అవసరమై నా బ్యాగు తెరిచి డబ్బులు కోసం వెతికితే, అవి దొరకలేదు. హాస్టల్లో ఉన్నందున డబ్బులు ఏమైపోయాయో అని చాలా టెన్షన్ పడ్డాను. వెంటనే నా స్నేహితుడు నిఖిల్‌కి ఫోన్ చేసి విషయం చెపితే తను, "వస్తాను ఉండు" అని చెప్పాడు. తను వచ్చేలోపు నాకు నా పక్క బెడ్ అతని(తను ఆరోజు ఊరికి వెళ్ళాడు)పై అనుమానమొచ్చి తన బ్యాగులో అంతా వెతికాను కానీ, ఏం దొరకలేదు. ఆ డబ్బులు ఎక్కడ పెట్టానో, ఏమయ్యాయో నాకు అస్సలు గుర్తుకు రాలేదు. అప్పుడు నేను నా మనసులో బాబాను తలుచుకొని, "నా డబ్బులు నాకు దొరికేలా చేయమ"ని వేడుకున్నాను. అలా వేడుకోగానే ఎందుకో నా బ్యాగులో ఒక కవర్ ఓపెన్ చేస్తే, అందులో ఉన్న ఒక బెడ్‌షీట్‌లో డబ్బులు చుట్టి ఉన్నాయి. అలా బాబా కృపవల్ల నా డబ్బులు నాకు దొరికాయి.
2024, అక్టోబరులో అమెజాన్‌లో సేల్ పెట్టినప్పుడు నేను ఒక ఫోన్ కొనాలనుకొని నా బడ్జెట్లో నాకు తగిని ఫోన్ కోసం చూస్తుంటే Samsung S23 FE ఫోన్ చాలా తక్కువకి వస్తుందని చూసి నా పాత ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టి, ఆర్డర్ పెట్టాను. కానీ ఆ పాత ఫోన్ కాస్త చెడిపోయింది. దాన్ని తీసుకోకపోతే నేను ఆ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు నేను బాబాని, "వాళ్ళు ఆ ఫోన్‌ని ఎలాగైనా తీసుకెళ్లేలా చూడమ"ని కోరుకున్నాను. ఆరోజు బాగా పొద్దుపోయాక కొత్త ఫోన్ డెలివరీ ఇవ్వడానికి డెలివరీ బాయ్ వచ్చాడు. తను నా పాత ఫోన్ చూసి, "అన్ని సరిగా ఉన్నాయా?" అని అడిగాడు. నేను ఉన్నాయని చెప్పడంతో అతను అసలేం తనిఖీ చేయకుండానే నా పాత ఫోన్ తీసుకుని, కొత్త ఫోన్ నాకిచ్చి వెళ్ళిపోయాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందరికీ బాబా ఆశీస్సులు ఉండాలి. "ధన్యవాదాలు బాబా".