సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శంభు మంగేష్ వాగ్లే - 1వ భాగం....



బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించిన భాగ్యశాలి శంభు మంగేష్ వాగ్లే. అతను గోవా రాష్ట్రంలోని ఐయాస్(తిస్వాడి) తాలూకా, శాంతాక్రజ్ గ్రామవాసి. 1911లో అతను బోరివలిలో ఉన్న ప్రఖ్యాత 'మాడ్గాంకర్' కుటుంబానికి చెందిన విస్తారమైన స్థిరాస్తుల పర్యవేక్షకుడిగా పనిచేస్తుండేవాడు. ఒకరోజు 'బలవంతరావు రామచంద్ర' ఉరఫ్ 'బాలభాయ్' మాడ్గాంకర్ అతన్ని, "గోవాలో మేలైన ‘సోన్‌కేవడే’(సుగంధభరితమైన పసుపురంగు పూలు) లభిస్తాయి కదా?" అని అడిగారు. అందుకతను "అవున"ని సమాధానమిస్తూ, "వాటికి ఒక నిర్దిష్ట కాలం(సీజన్) ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే అవి పుష్కలంగా లభిస్తాయ"ని వివరించాడు. అప్పుడు బాలభాయ్, "బాంద్రా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీగోవిందరావు రఘునాథ్ దభోల్కర్‌ వాటిని తీసుకురమ్మని మీతో చెప్పమని చెప్పారు. మీరు వాటిని తీసుకొచ్చి ఆయనకిస్తే, ఆయన ఎంతో సంతోషిస్తారు. కారణం, వారి ఆధ్యాత్మిక గురువు శ్రీశిరిడీ సాయిబాబాకు ఆ పూల సుగంధానిచ్చే కాచు గోళీలు(కాచు అనే పదార్థాన్ని కిళ్ళిలో వాడతారు) అంటే చాలా ఇష్టం. కాబట్టి, ఆయనకోసం మీరు ఈ పనిని తప్పక చేయాల"ని అన్నారు. అతను "సరేన"ని ఒక వారంలోపే ఆ పూలు సేకరించి దాబోల్కర్‌కి అందజేశాడు. సహజంగానే ఆయన చెప్పలేనంతగా ఆనందభరితులయ్యారు. నాటినుండి వాగ్లేకి దభోల్కర్‌తో పరిచయం మొదలైంది. ఆ విషయమై అతను, "కాలం గడిచేకొద్దీ దాభోల్కర్ నాతో ఎంతో ఆప్యాయతతో, సానుభూతితో వ్యవహరించసాగారు. అంతటి ఉన్నత పదవి, తన హోదాకు తగినంత గంభీరత, అధికార దర్పం కలిగిన వ్యక్తి అయినప్పటికీ నా వంటి ఒక సామాన్య, అల్పుడైన వ్యక్తిపట్ల ఆయన ప్రవర్తన అసాధారణమైన ఆప్యాయతతో కూడుకొని ఉండేది. నేటికీ(1939) ఆయన ఆ దయార్ద్ర ప్రవర్తనను తలచుకున్నప్పుడల్లా నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది" అని చెప్పారు.


దైవసంకల్పమో, యాదృచ్చికమో గానీ ఒకరోజు వాగ్లే బోరివాలి స్టేషన్‌లో దభోల్కర్‌ను అనుకోకుండా కలిసినప్పుడు ఆయనకి ఏదో స్ఫూర్తి కలిగి సమీపంలో ఉన్న తమకి పరిచయస్తుడైన భన్సాలీవాణి వర్గానికి చెందిన ఒక వ్యాపారిని పిలిచి, "మీరు శిరిడీ వెళ్ళినప్పుడు, ఈ వాగ్లేని తప్పకుండ మీతోపాటు తీసుకువెళ్ళండి" అని అన్నారు. అది విన్న వాగ్లే ఆశ్చర్యపోతూ, "ఎందుకు రావూసాహెబ్! మీరంత ప్రయాస పడుతున్నారు? నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి? అక్కడికి వెళ్లి ఆయన(సాయిబాబా) నుండి కోరుకోవాల్సింది నాకేమీ లేదు, ఆయనకు ఏ ఇబ్బంది కలిగించాలని కూడా నాకు లేదు" అని అన్నాడు. దానికి ఆయన, "మీ అభిప్రాయాన్ని నేను కాదనను కానీ, మీరు వెళ్లాల్సిందే!" అని నిశ్చయంగా చెప్పడంతో అతను, "సరే రావుసాహెబ్, చూద్దాం" అని బదులిచ్చాడు. అతను అలా చెప్పగానే, ఆయన రైలు బయలుదేరింది. ఆ తర్వాత రోజుల్లో దభోల్కర్ గట్టిగా పలికిన ఆ మాటలు వాగ్లే మనసును నిరంతరం కుదిపేసాయి. ఒకరోజు అతను బోరివాలికి చెందిన దామోదర్ రఘునాథ్ ఠాకూర్‌తో కూర్చుని ఉండగా యధాలాపంగా జరిగిన ఆ సంఘటన గురించి చెప్పాడు. అది విన్న ఠాకూర్ ఎంతో సంతోషించి, "దభోల్కర్ సాహెబ్ ఇలాంటి విషయాలను ఎవరికి పడితే వారికి చెప్పే వ్యక్తి కాదు. ఆయన ప్రత్యేకంగా మీకే ఈ విషయం చెప్పారంటే, మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే!" అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అది అక్కడితోనే ముగిసిపోలేదు. ఆ సమయంలో ఆయన కుమార్తె, మనవళ్లు అక్కడే ఉన్నారు. వాళ్లంతా చాలా ఆనందంగా ఏకకంఠంతో, "వాగ్లేసాహెబ్, మీరు గనక శిరిడీ వెళితే, మాకు మా మనిషి కలుస్తార"ని ఆశని వ్యక్తం చేసారు. విషయమేమిటంటే, ఠాకూర్‌గారి అల్లుడు- వసాయి నివాసి అయిన శ్రీపాండురంగ్ సఖారాం నారేకర్ తన కుటుంబాన్ని వదిలేసి అప్పటికి రెండేళ్లగా శిరిడీలోనే ఉంటున్నారు.


పైసంఘటనతో సహజంగానే అప్పటివరకు శిరిడీ వెళ్ళడం గురించి వాగ్లే మనసులో ఉన్న అనిశ్చితి దానంతటదే తొలగిపోయి శిరిడీ వెళ్లాలని నిశ్చయానికి వచ్చాడు. కాబట్టి, ఆ సంవత్సరం డిసెంబరులో అతను గోవాలోని తన ఇంటికి వెళ్లడానికని యజమాని నుండి అనుమతి పొందాడు. తర్వాత అతను బొంబాయిలోని భివాండిలో మూడవ సంవత్సరం వైద్య పరీక్షలకు సిద్ధమవుతున్న తన స్నేహితుడు డా. నారాయణ రామచంద్ర బస్తోద్కర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ గోవాకు చెందిన గృహస్థుడైన పాండురంగ్ అనంత్ కెంకరే అనే అతని ఇంకో స్నేహితుడు కళాశాలలో బి.ఏ. చదువుతున్నాడు. అతను వాళ్ళిద్దరితో శిరిడీ వెళ్లాలన్న తన సంకల్పం గురించి చెప్పి, వాళ్ళు కూడా వస్తారేమోనని అడిగాడు. కానీ వాళ్ళు వెంటనే ఎలాంటి సమ్మతి తెలియజేయలేదు. కానీ ఆ రాత్రి 8 గంటల కలకత్తా మెయిల్‌లో వెళ్ళడానికి వాగ్లే సిద్ధమై, వేళకు బోరిబందర్ స్టేషన్‌కు బయలుదేరబోతుండగా ఆ స్నేహితులిద్దరూ స్టేషన్ వరకు వస్తామంటూ అతనితోపాటు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందంటే, వాగ్లే తన టిక్కెట్ కొన్నప్పుడు వాళ్ళు కూడా రహస్యంగా తమతమ టిక్కెట్లు తీసుకుని, అతనికి వీడ్కోలు చెప్పకుండా అతనితోపాటు వెళ్లి కోచ్‌లో కూర్చున్నారు. అది చూసి అతను ఆశ్చర్యానందాలకు గురయ్యాడు. తర్వాత రైలు సమయానికి బయలుదేరడంతో వారి శిరిడీ యాత్ర ప్రారంభమైంది. మధ్య దారిలో వాళ్ళు మన్మాడ్ స్టేషన్‌లో దిగి, 'డౌన్-మన్మాడ్' రైలు వచ్చేవరకు అక్కడ వేచి ఉండాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు జీవితంలో ఎన్నడూ చూడని తీవ్రమైన చలికి ఇబ్బందిపడ్డారు కానీ, రైలు నిర్ణీత సమయానికి రావడంతో అది ఎక్కి ఉదయం ఆరు గంటలకు కోపర్‌గాఁవ్‌ స్టేషన్‌లో దిగారు. వాళ్ళు అక్కడినుండి టాంగాలో శిరిడీకి ప్రయాణమయ్యారు. దారిలో గోదావరి నీటి ప్రవాహం చూసి సంతోషపడ్డారు. సుమారు ఏడున్నర గంటలకు వాళ్ళు శిరిడీ పుణ్యభూమిలో అడుగుపెట్టారు. 


వాగ్లే, అతని స్నేహితులు గ్రామంలోకి వెళ్ళినప్పుడు ముందుగా పైకప్పులేని మట్టి ఇళ్లను చూసి చకితులయ్యారు. కానీ వారి దృష్టి అంతా శ్రీసాయిబాబాపైనే కేంద్రీకృతమై ఉంది. సరిగ్గా అప్పుడే ఒక నల్లని దిగంబర వ్యక్తి ఒక మట్టి ఇంటి కప్పుపై నిలబడి, సూర్యుని వైపు ముఖం ఉంచి సూర్యుని చూస్తూ కనిపించాడు. అతన్ని చూసిన వాగ్లే, అతని స్నేహితులకి, 'ఈయనే సాయిబాబానా?' అనిపించింది. ఒక క్షణం పాటు అలాగే అనిపించి, అక్కడి ప్రజలను అదే ప్రశ్న అడిగారు. దానికి ఆ ప్రజలు, "ఈయన బాబా కాదు, షెగాం మహారాజ్ శిష్యుడు, తన ఉద్ధరణార్థం బాబా పాదాల చెంతకు వచ్చి, మౌనవ్రతం పాటిస్తున్నాడు" అని తెలియజేసారు. అప్పుడు వాళ్ళు, "ఇప్పుడు బాబా ఎక్కడ ఉన్నారు?" అని అడగ్గా, "బాబా బయటకు వెళ్లారు. ఇప్పుడు తిరిగి వస్తున్నారు. అదిగో బాకాల శబ్దం. మీరు వెళ్లి, మశీదులో కూర్చోండి" అని చెప్పారు. వాగ్లే, అతని స్నేహితులు బాకాలు మోగుతున్న దిశగా చూస్తే, దూరంగా ఒక పెద్ద ఎర్ర గొడుగు, చాలా జనం వస్తూ కనిపించారు. అది చూసి వాళ్ళు వెళ్లి మశీదులో కూర్చున్నారు. అక్కడ కింద ఒక సభా మండపం, దాని ముందు ఒక పెద్ద ఎత్తైన ప్రదేశం, వ్యాసపీఠం, దానికి కుడి వైపున వెండి ఆసనం, మధ్యలో గోడకు ఆనుకుని పగలు రాత్రి వెలిగే దీపాల వరస, ఎడమ వైపున ఎల్లప్పుడూ మండుతూ ఉండే ఒక అగ్నిగుండం(ధుని), చిలుము ఉన్నాయి. వాళ్ళు అవన్నీ గమనిస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే దూరాన కనిపించిన బాబావారి ఊరేగింపు మశీదులోకి ప్రవేశించింది. సాయిబాబా చూడటానికి మంచి రంగుతో, దృఢంగా, కొద్దిగా వంగి ఉన్నారు. ఆయన చిరిగిన అరబిక్ శైలి కఫ్నీ ధరించి, తలకి ఒక చిన్న గుడ్డను చుట్టుకుని ఉన్నారు. ఆయన భుజాల నుండి తల పైకెత్తి, నోటితో కఠిన పదజాలంతో తిట్లు, శాపనార్థాలు పలుకుతూ వచ్చి ఆసనం మీద కూర్చున్నారు. వాగ్లే, అతని స్నేహితులు వెంటనే లేచి, బాబాకోసం కానుకగా తెచ్చిన బాదం హల్వా, ఇతర వస్తువులు తీసుకొని బాబా ముందుకి వెళ్లారు. బాబా వాళ్ళని చూస్తూనే, "బొంబాయి నుండి వచ్చారు. కూర్చోండి" అని అన్నారు. వాళ్ళు బాబాకు నమస్కరించి, ఆ వస్తువులను ఆయన ముందు ఉంచారు. ఆయన వాళ్ళకి ఊదీ ఇచ్చారు. వాళ్ళు దానిని తీసుకొని తమలాగే బాబా దర్శనానికి వచ్చిన ప్రయాణికులు ఆరోజు చాలామంది ఉన్నందున అక్కడినుండి లేచి అన్నపానీయాల కోసం వెళ్లారు.


సోర్స్: సాయిలీల పత్రిక 1938, 7,8,9 సంచిక

2 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Baba me daya valana Kalyan ki marriage ipoindi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu house koni pettandi baba pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo