సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1853వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే బాబా
2. శిరిడీ దర్శనం - జన్మ ధన్యం

అడిగితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే బాబా


అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాను. మాకు ప్రతి 6 నెలలకు పని అప్పగిస్తారు. దాన్ని మేము 6 నెలల్లో పూర్తి చేయాలి. ఆ క్రమంలో గత సంవత్సరం జూన్‌లో నాకు ఒక పని ఇచ్చి నవంబర్‌ పూర్తి చేయమన్నారు. నాతో పాటు ఇంకో అమ్మాయికి కూడా అదే పని ఇచ్చారు. అంటే మేమిద్దరం వర్క్ డివైడ్ చేసుకొని చేయాలి. ఆ అమ్మాయి వర్క్ బాగానే చేసేదికానీ, నేను చేసింది కూడా తనే చేసినట్టు చెప్పేది. దానివల్ల చివరికి పని అంతా తనే చేసినట్టు అయి నేను చేసినదంతా వృధా అనిపించింది నాకు. అందుచేత నేను బాబాని, "వచ్చే 6 నెలల పని వేరేవాళ్లతో కలిపి కాకుండా నాకు మాత్రమే ఇచ్చేలా చూడు సాయి" అని అడిగాను. బాబా దయతో అనుగ్రహించారు. ఒక ఐదుగురు సభ్యుల బృందాన్ని నాకిచ్చి నన్ను నడిపించమన్నారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీకు శతకోటి వందనాలు తండ్రీ. పని బాగా చేసేలా చూడు స్వామి".


మామూలుగా మాకు ఆఫీసులో ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో పని ఎక్కువగా ఉంటుంది. ఈసారి కూడా అలాగే ఉండింది. ఒకరోజు మా లీడ్ ఒక ఇష్యూ(సమస్య) ఇచ్చి ఒక క్లయింట్‌కి అలా ఎందుకు అవుతుందో చూడమన్నారు. నేను పని ఒత్తిడి వల్ల ఏదో ఒకటి చెప్పి, వేరే పని చేసుకుందామన్న ఆలోచనతో ఆ ఇష్యూని చూడకుండా ఏదో బదులు ఇచ్చాను. ఆ రాత్రి పడుకునేముందు మెయిల్ చూసుకుంటే యుఎస్ టీమ్‌వాళ్ళు దాని గురించి వివరణ అడుగుతూ మెయిల్ పెట్టి ఉన్నారు. నాకు ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడి, "మీరే నాకు సహాయం చేయాలి సాయి" అని బాబాని వేడుకొని, ఉదయం వాళ్ళకి సమాధానం చెబుదామని బాబాని తలుచుకుంటూ పడుకున్నాను. కానీ టెన్షన్ వల్ల చాలాసేపు నిద్ర రాలేదు. ఏ సమయానికో నిద్రపోయాను గానీ 3:30కి మేలుకువ వచ్చింది. వెంటనే టెన్షన్ మొదలై, "మీరే ఏదైనా చేయాలి సాయీ. నేను ఆఫీసుకి వెళ్ళేలోపు అది పరిష్కారమయ్యేలా చూడు సాయీ" అని బాబాను వేడుకున్నాను. ఉదయం నేను ఆఫీసుకి వెళ్లి బాబాని తలుచుకొని లాప్టాప్ ఓపెన్ చేశాను. ఆశ్చర్యంగా ఒక అమ్మాయి 'ఆ ఇష్యూని ఇంకో అమ్మాయి చూసుకుంటుంద'ని నాకు మెసేజ్ చేసింది.అది చూసి నాకు చాలా సంతోషమేసింది. మనం అడిగితే మన సాయి ఎప్పుడైనా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ"

శిరిడీ దర్శనం - జన్మ ధన్యం

నా పేరు భారతి. నేను గత 25 సంవత్సరాలుగా బాబా సేవలో గడుపుతున్నాను. నేను ఇప్పుడు నా శిరిడీ అనుభవం గురించి ఈ బ్లాగులో పంచుకోవాలనుకుంటున్నాను. నేను శిరిడీ వెళ్లాలని దాదాపు నాలుగు, ఐదు సార్లు రిజర్వేషన్ చేయించుకున్నాను. కానీ ప్రతిసారీ ఏదో ఒక కారణంతో శిరిడీ ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దాంతో నేను ఎందుకిలా  జరుగుతుందని బాబా ముందు చాలాసార్లు బాధపడ్డాను. ఆపై, 'సరే, ఆయనకు నా మీద ఎప్పుడు దయ కలిగితే అప్పుడు నన్ను రప్పించుకుంటార"ని సర్దుకున్నాను. ఆ తర్వాత 2024, ఏప్రిల్ 30వ తేదీన నాకు తెలియకుండా మా శ్రీవారు శిరిడీ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసారు. కానీ నాకు మనసులో 'ఈసారైనా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటానా?' అని అనుమానం, ఏదో తెలియని బాధ ఉండేది. కానీ బాబా నన్ను చక్కగా తమ సన్నిధికి పిలుచుకొని, తిరిగి క్షేమంగా మా ఇంటికి చేర్చారు. అక్కడ శిరిడీలో బాబా దర్శనం చేసుకున్న ప్రతిసారీ నేను ఏదో తెలియని తన్మయత్వానికి లోనయ్యాను. ప్రతీ దర్శనంలో బాబా నన్ను చూస్తుంటే, నేను బాబాను చూస్తూ "ఆహా! అద్భుత దర్శన భాగ్యం. నా జన్మ ధన్యం" అని అనుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఓం నమో సాయినాథాయ నమః.


సాయిభక్తుల అనుభవమాలిక 1852వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహం
2. బాబాని భక్తితో అడిగితే కోరిక నెరవేరకుండా ఉంటుందా? - అయన దయామయుడు

శ్రీసాయి అనుగ్రహం


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. మా అమ్మాయి ఈ సంవత్సరం(2024) పదో తరగతి పరీక్షలు వ్రాసింది. తను బాగా చదువుతుంది కానీ 2024, జనవరి నుంచి తను చాలా ఆందోళనగా ఉంటుండేది. స్కూలుకి వెళ్లడానికి కూడా ఇష్టపడేది కాదు. ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ఫిబ్రవరి నుండి స్కూల్ కూడా మాన్పించాల్సి వచ్చింది. మార్చిలో పరీక్షలు ఉన్నప్పటికీ తను రోజూ ఫోన్ చూస్తూ టైమ్ పాస్ చేస్తుండేది. బాగా చదివే తను టెన్షన్ వల్ల అస్సలు చదవకుండా ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చుకుందని నాకు చాలా బాధేసింది. తను అసలు పరీక్షలు వ్రాస్తుందా, లేదా అనిపించి, "తను పరీక్షలు వ్రాయగలిగితే, తనని మీ దర్శనానికి శిరిడీ తీసుకొస్తాన"ని బాబాతో చెప్పుకొని రోజూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః', 'ఓం శ్రీసాయి ప్రశాంత చిత్త ప్రదాయ నమః' అనే నామాలు 108 సార్లు జపిస్తూ, ‘సమస్య తీరితే బ్లాగులో పంచుకుంటాన’ని అనుకున్నాను. బాబా దయవల్ల తను పరీక్షల ముందు చదవడం మొదలుపెట్టి చాలా టెన్షన్ పడుతూ పరీక్షలు వ్రాసింది. నేను అయితే తను టెన్షన్ వల్ల పరీక్షలకి వెళ్ళదు, వెళ్లినా సరిగా వ్రాయదనుకున్నాను. కానీ తను అన్ని పరీక్షలు వ్రాసింది. అప్పుడే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుందామనుకున్నాను కానీ, మర్చిపోయాను. ఫలితాలు వెలువడ్డాక చూస్తే, తనకి చాలా మంచి మార్కులు వచ్చాయి. అయినా నేను నా అనుభవాన్ని వ్రాయలేదు. తర్వాత ఏప్రిల్ నెలాఖరులో మా బాబు పరీక్షలు వ్రాసాడు. తనకి రేపు పరీక్ష ఉందనగా ముందురోజు సాయంత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను కాల్ ఎత్తట్లేదని నా భర్త అన్నారు. అప్పుడు నేను ప్రయత్నించాను. తను నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నాకు చాలా భయమేసి, "బాబా! వాడికి ఏమీ కాకుండా చూడు. ఒక 30 నిమిషాల్లో వాడు నాకు ఫోన్ చేయాలి" అని అనుకొని 'ఓం శ్రీసాయి ఆపద్బాంధవాయ నమః' అని జపిస్తూ ఉండగా మా పాప అనుభవం పంచుకుంటాననుకున్న విషయం గుర్తు వచ్చి పేపర్ తీసుకొని వ్రాయడం మొదలుపెట్టగానే మా బాబు ఫోన్ చేశాడు. అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. "థాంక్యూ బాబా".


మా నాన్న వయసు 76 సంవత్సరాలు, ఆయన పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగి. ఆయన వృత్తిరీత్యా అప్పుడప్పుడు కోర్టులో సాక్షిగా హాజరు కావలసి ఉంటుంది. ఉద్యోగ విరమణ అనంతరం కూడా అప్పుడప్పుడు హాజరవుతున్నారు. సాధరణంగా నాన్నకి పోలీసులు కోర్టు సమన్లు తెచ్చి ఇస్తుంటారు. అయితే 2024, ఏప్రిల్ నెలలో సమన్లు పోస్టులో వచ్చాయి. నాన్న నాతో, "నేను మే 2న కోర్టుకు వెళ్లాలి. ఎప్పుడూ సమన్లు కానిస్టేబుల్ తెచ్చి ఇస్తాడు. కానీ ఈసారి ఎందుకో పోస్టులో వచ్చాయి" అని అన్నారు. ఆ మరుసటిరోజు నాన్న నాకు ఫోన్ చేసి, "అవి సాక్షి సమన్లు కాదు, ముద్దాయికి ఇచ్చే సమన్లు. నాకు  ఎందుకు వచ్చాయో తెలియడం లేదు" అని చెప్పి కంగారుపడ్డారు. అది విని నాకు కూడా కంగారుగా అనిపించి, "ఏమైనా గొడవలు అలా జరిగాయా?" అని అడిగాను. నాన్న, "అలాంటిదేమీ లేదు" అని అన్నారు. అప్పుడు సాయంత్రం 5 గంటలవుతుంది. ఆ సమయంలో కోర్టులో వివరాలు కొనుక్కోవడానికి కుదరదు. అందువల్ల నాన్న తనకు తెలిసినవాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్తే, వాళ్ళు మర్నాడు ఉదయం 10:30కి కొనుక్కుంటామని చెప్పారు. పెద్ద వయసు కావడం వల్ల నాన్న చాలా కంగారుపడసాగారు. నాకు కూడా భయమేసి మన బాబాని, "స్వామీ! ఈ వయసులో కోర్టు కేసు అంటే నాన్నకి చాలా కష్టం. ఆయన ఏదైనా తప్పు చేసుంటే ఆ ఫలితం నాకివ్వండి. ఈ సమస్యని తేలికగా సమసిపోయేలా చేయండి" అని వేడుకొని ‘ఓం శ్రీసాయి ఆపద్బాంధవాయ నమః' అని 108 సార్లు జపించాను. తర్వాత, "మీ మందిరంలో పాలకోవా సమర్పించుకొని 130 రూపాయలు దక్షిణ ఇస్తాను" అని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత రోజు 10:30కి నాన్న ఫోన్ చేసి, "కోర్టువాళ్ళు పొరపాటున సాక్షి సమన్లకు బదులుగా ముద్దాయి సమన్లు పంపార"ని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.

బాబాని భక్తితో అడిగితే కోరిక నెరవేరకుండా ఉంటుందా? - అయన దయామయుడు


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. 2024, మార్చి 28న మా అమ్మ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అయితే అదేరోజు శస్త్రచికిత్స చేస్తామన్నవాళ్ళు మూడురోజులైనా చేయలేదు. నాకు ఆందోళనగా అనిపించి బాబాని, "బాబా! త్వరగా శస్త్రచికిత్స జరిగేలా చూడండి" అని వేడుకున్నాను. మర్నాడే అమ్మకి శస్త్రచికిత్స జరిగి విజయవంతమైంది. బాబాని భక్తితో అడిగితే కోరిక నెరవేరకుండా ఉంటుందా? అయన దయామయుడు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మీ కృప మా మీద ఉంచండి".


సాయిభక్తుల అనుభవమాలిక 1851వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రాణదానం చేసిన బాబా
2. కోరుకున్నట్లు అనుగ్రహించిన బాబా

ప్రాణదానం చేసిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు బాలాజీ. మా ఇంటి దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వరుని దయవలన నేను 1998లో సాయి భక్తుడనయ్యాను. ఆ రోజుల్లో మంచి బాబా ఫోటో దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. నేను చాలా కష్టపడి బాబా నవ్వుతున్న ఫోటో ఒకటి సంపాదించాను. ఇంకా ఒక సందర్భంలో శిరిడీలోని బాబా పాదాలు ఓ చోట కనిపిస్తే, ఒక మంచి ఫోటోగ్రాఫర్‌తో వాటి ఫోటో తీయించి, ప్రింట్ తీసుకుని మొదట నవ్వుతున్న బాబా ఫోటో వెనకాల వారి అసలైన పాదాలు వున్న ఫోటో పెట్టి రెండింటిని కలిపి లామినేట్ చేయించి చాలామందికి పంచాను. మా యింటికి దగ్గరగా వున్న సాయినాథుని గుడిలో ప్రతి గురువారం ఉదయం 5 గంటలకి 'నగర సంకీర్తన' అన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇలా కొన్నిటిని ఆ సాయి మహానుభావుడు నాచేత చేయించినందుకు నా ఈ చిన్ని ప్రాణం ధన్యమైందని భావిస్తున్నాను. ఇకపోతే ఆయన నాకు ప్రాణదానం చేసిన సంఘటన గురించి ఇప్పుడు చెప్తాను.


2007లో నాకు ఒక చేతక్ స్కూటర్ వుండేది. ఒకరోజు నా స్నేహితుని గృహప్రవేశ వేడుక అయిన తరువాత నేను స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. అది ఎలా జరిగిందో నాకు తెలీదుగానీ కళ్ళు తెరిచేసరికి మద్రాస్‌లోని ఒక  హాస్పిటల్లో నేనున్నాను. తలకు గాయమైందని, పుర్రెకు 3 క్రాక్స్ అయ్యాయని, గాయం ఒక వైపు, క్రాక్స్ ఇంకో వైపు ఉన్నాయని, ఆపరేషన్ చేసే అవకాశం లేనందున అబ్జర్వేషన్‌లో నన్ను ఉంచారట. నేను బతుకుతానని ఎవ్వరూ ఊహించలేదు. కానీ బాబా దయతో నాకు ఆపరేషన్ కాదు కదా, ఒక చిన్న కుట్టు కూడా పడలేదు. కేవలం ఒక ప్లాస్టర్ నా కణితికి వేశారు అంతే. డాక్టర్ పొద్దున్నకి బ్రెయిన్‌లో బ్లడ్ సర్కులేషన్ దానంతటదే సెట్ అయిందని చెప్పారు. ఇకపోతే నా కుడికాలు పూర్తిగా ఒక ఇనపకడ్డిలా అయిపోయి కాస్త కూడా కదిలించలేకపోయాను. నేను హాస్పిటల్లో 15 రోజులున్నాను. ఆ సమయంలో నాకు విపరీతమైన తలనొప్పి వుంటుండేది. అందుకోసం డాక్టర్ పెయిన్ కిల్లర్స్, సెడిషన్ ఇస్తూండేవారు. కొద్దిగా మెలుకువ వస్తే, నేను నొప్పి భరించలేక విపరీతంగా అరుస్తుండేవాడిని. ఆ కారణంగా ప్రక్కనున్న రోగులు మావాళ్లని ఏదో అంటుండేవారు. నాకు బాబా మీద విపరీతమైన నమ్మకం. నేను నా భార్యని బాబా గుడికి ఫోన్ చేసి, నా నొప్పి గురించి చెప్పి, పూజ చేయమని చెప్పమని చెప్పాను. మొదట నా భార్యవాళ్ళు ఎలాగూ యిక్కడ మ్రొక్కుకుంటూనే వున్నాము కదా అని వూరుకున్నారు. కానీ రెండోరోజు నేను బలవంతపెట్టి ఫోన్ చేయించి మాట్లాడించాను. బాబా మహిమ చూడండి. మరుసటిరోజు ఉదయం నుండి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కోసం నన్ను నిద్ర లేపినప్పుడు నా మంచానికి ఎదురుగా ఉన్న మంచం మీద ఒక అబ్బాయి ఉన్నాడు. అతని కాళ్లు చేతులు మంచానికి నాలుగు ప్రక్కల కట్టేసి ఉన్నాయి. ఎందుకని అడిగితే, నాకు జరిగినట్లే అతని తలకి గాయమైందని, ఆ అబ్బాయి నొప్పి భరించలేక తన్నుకుంటున్నాడని, అతనిని అదుపుచేయలేక మంచానికి కట్టేసారని చెప్పారు. నేను, 'ఓరి దేవుడా' అనుకున్నాను. బాబా నన్ను ఎంతగా కాపాడారో చూడండి. ఇంటికి వచ్చాక 15 రోజుల పాటు రోజూ ఫిజియోథెరపీ నా కాలుకు చేశారు. మరో 15 రోజులకు నడిపించేసారు ఆ సాయినాథుడు. ఫిజియోతెరఫిస్ట్, "యిక నా అవసరం లేదు. కానీ ప్రతిరోజూ మీరు సొంతంగా చేసుకోండి" అని చెప్పారు. ఆ రోజు మా యింట్లో వారందరు, నేను అతనికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలని ఆలోచనలో పడ్డాము. ఆ అబ్బాయి నా కన్న చాలా చిన్నవాడు. నాకైతే అతని కాళ్ళు మ్రొక్కిన తప్పులేదు అనిపించింది. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఆ అబ్బాయే వంగి నా కళ్ళు మ్రొక్కాడు(ఇది నా గొప్పతనం కాదు. బాబా లీల ఎలా వుంటుందో తెలుపడానికి చెప్తున్నాను). మొత్తం మా ఇంట్లో వాళ్ళందరూ, నేను ఆశ్చర్యపోయాము. ఆ అబ్బాయి, "ఇంతవరకూ 15 రోజులలో యింత ఫలితం నేను వినలేదు చూడలేదు" అన్నాడు. ఇదంతా ఆ సాయినాథుని దయ కాకపోతే యింకేమిటి? నాకు చికిత్స చేసిన మద్రాస్ డాక్టర్ మెడికల్ జర్నల్‌లో న్యూరో ట్రీట్మెంట్‌లో 100% రికవరీ అని ప్రచురించుకొన్నాడు. అదే మన సాయిబాబా దయ. ఇంతకన్నా ఏంకావాలoడి మనకు. బాబా మనందరికీ ఆయన మీద భక్తినిచ్చి యిలాగే కాపాడుతుంటే చాలు.

కోరుకున్నట్లు అనుగ్రహించిన బాబా


నా పేరు అనుజ. మా అమ్మాయికి డెలివరీ టైమ్ 2024, మార్చి 31కి ఇచ్చారు. కానీ నేను బాబాని, "21వ తేదీ లోపు డెలివరీ అయ్యేలా దయ చూపండి. అలా అయితే మీ గుడిలో పెడా పంచుతాను" అని మొక్కుకున్నాను. తర్వాత బాబా ప్రశ్నలు-సమాధానాలు చూస్తే, 'అంతా మంచే జరుగుతుంది" అని వచ్చింది. అలాగే బాబా దయవల్ల 19వ తేదీన బాబు పుట్టాడు. మాకు చాలా సంతోషమేసింది. బాబా అండగా వున్నానని నిరూపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు చూపిన కరుణకు రుణపడి ఉంటాను తండ్రీ. బాబు చాలా ఏడుస్తున్నాడు. వాడి ఏడుపు తగ్గించి, మంచిగా పాలు తాగి నిద్రపోయేట్టు దీవించు బాబా. మా అందరి మీద మీ ఆశీస్సులు ఉంచండి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1850వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆలోచననిచ్చి సమస్యకు పరిష్కారం చూపిన బాబా
2. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే బాబా

ఆలోచననిచ్చి సమస్యకు పరిష్కారం చూపిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ఒకరోజు నేను నా ఆఫీసు పనిలో ఒక సమస్యను ఎదుర్కొన్నాను. అది అత్యంత తొందరగా పరిష్కరించాల్సిన సమస్య, ఎందుకంటే, వ్యాపారంపై చాలా ప్రభావం పడనుంది, ఇతర బృందాల(టీమ్స్) నుండి చాలా ఒత్తిడి ఉంది, సమయం కూడా ఎక్కువ లేదు. నేను, నా భర్త రాత్రి ఒంటిగంట వరకు చాలా ప్రయత్నించాము కానీ, ప్రయోజనం లేకపోయింది. తెల్లవారితే గురువారం. నేను బాబాని, "దయచేసి నాకు సహాయం చేయండి బాబా" అని చాలా ప్రార్థించాను. బాబా మనల్ని ఎలా వదిలేస్తారు. సోషల్ మీడియాలో, 'ఓపిక పట్టండి. మీ సమస్య తీరుతుంది" అని బాబా మెసేజ్ ఒకటి నాకు కనిపించింది. అది బాబా నాకిచ్చిన సందేశమని, ఆయన ఏదో ఒక రూపంలో నా సమస్యని పరిష్కరించి తమ ఉనికిని తెలియజేస్తారని నాకు అనిపించింది. ఆయన మనం కష్టాల్లో ఉంటే చూడలేరు. ఎంత దయమయుడు బాబా? గురువారం హఠాత్తుగా మాకు ఒక ఆలోచన వచ్చి, ఇతరత్రా వివరాలు పరిశీలించాక సమస్య యొక్క మూల కారణం కనుగొన్నాము, దాంతో ఎట్టకేలకు ఇతర బృందాలకు పరిష్కారాన్ని చూపించాము. "చాలా ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు లేకుండా నేను ఈ పని చేయలేను. అంతా మీ బిక్షే. కోటికోటి ప్రణామాలు బాబా. దయచేసి మాతో ఎల్లప్పుడూ ఉండండి. ఈ జన్మలో మాత్రమే కాకుండా ప్రతి జన్మలోనూ దయచేసి మాతో ఉండండి తండ్రీ" .


ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ స్వరూప శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై||


అందరికీ నమస్కారం. నేను ఒక సాధారణ సాయిభక్తురాలిని. సాయి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూపించారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపించారు. అటువంటి ఒక రెండు విషయాలను ఇప్పుడు పంచుకుంటాను. ఒకప్పుడు నా భర్త తను చేస్తున్న కంపెనీలో తన కష్టానికి తగని ప్రతిఫలం రావట్లేదన్న అభిప్రాయంతో ఉద్యోగం మారే ప్రయత్నం చేసారు. ఎంతో కాలం ఎన్నో ప్రయత్నాలు చేసాక మావారి పాత సహోద్యోగి ఒకరు తను పని చేస్తున్న కంపెనీలో రిక్రూట్మెంట్ ఉందని, అది నా భర్తకు సరిపోయే ఉద్యోగమని చెప్పారు. సరేనని, మావారు ఆ ఉద్యోగానికి అప్లై చేసారు. కానీ రెండు నెలలైనా ఆ కంపెనీ నుంచి ఎటువంటి సమాచారం మాకు తెలియలేదు. అప్పుడు నేను బాబాకి మొక్కుకొని సప్తహా పారాయణ మొదలుపెట్టాను. అదేరోజు నా భర్తకి ఇంటర్వ్యూలు షెడ్యూలు అయి, మరుసటి శనివారానికి మేము ఊహించిన జీతంతో నా భర్తకి ఉద్యోగం వచ్చింది. బాబా దయతో అంతా చకచకా జరిగిపోయాయి. 


మా చిన్నబాబుకి మూడు సంవత్సరాల వయసున్నప్పుడు ఒకసారి వాడి చేతికున్న సాయిబాబా బంగారు ఉంగరం ఎక్కడో పడిపోయింది. వాడు ఏడ్చుకుంటూ వచ్చి ఉంగరం పడిపోయిందని చెప్పాడు. ఒక అరగంట వెతికినా ఆ ఉంగరం దొరకలేదు. అది సాయిబాబా ఉంగరం అవడం వలన నేను చాలా సెంటిమెంట్గా ఫీలయ్యాను. అయినా బాబా ఉంగరం దొరుకుతుందని నమ్మకంగా బాబాను వేడుకున్నాను. తర్వాత అనూహ్యంగా ఆ ఉంగరం మా ఇంటి ముందు కొద్ది దూరంలో ఉన్న రోడ్డుపై కనిపించింది. మేమంతా ఆశ్చర్యపోయాం. ఇలా చాలా అనుభవాలున్నాయి. "బాబా! మీకు చాలా కృతజ్ఞతలు తండ్రీ. అందరినీ చల్లగా చూడు తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1849వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊదీతో కేవలం మూడురోజుల్లో గడ్డను నయం చేసిన బాబా
2. దయ చూపిన బాబా

ఊదీతో కేవలం మూడురోజుల్లో గడ్డను నయం చేసిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః. నా సాయి తల్లికి, సాయి భక్తులకు నమస్కారం. సాయి అనుగ్రహించిన అసంఖ్యాకమైన సాయి బిడ్డల్లో నేనూ ఒకదాన్ని. మాది గుంటూరు. నేను ఒక సాధారణ గృహిణిని. నా చిన్నప్పటినుండి నాకు సాయి తెలుసు. కానీ అప్పట్లో సాయి లేదా భగవంతుడు అంటే నమస్కరించాలి, పూజించాలి, ఇంకా చెప్పాలంటే కష్టమేదైనా వస్తే దేవుణ్ణి తలుచుకోవాలని మాత్రమే తెలుసు. ఏదైనా మంచి జరిగితే ముందు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలని కూడా సరిగా తెలియదు. అందరూ దేవుడన్నాడంటారు కాబట్టి నమస్కరించడం తప్ప అంతకంటే స్పష్టత లేదు నాకు. అలాంటి నాకు పెళ్ళై, ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ భగవంతుడు అనేక రూపాలలో, అనేక విషయాలలో తన ఉనికిని తెలియజేయడం మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడూ తోడుగా ఉన్నాగానీ ఆ విషయాన్ని నేను అప్పుడు గుర్తించాను అనవచ్చు. నేను ఎన్నో సంవత్సరాలుగా సాయి తండ్రి చేయి పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాను. కాదు, ఆయనే నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఇప్పుడు సాయి నా ప్రాణం, నా ప్రాణం కంటే ఎక్కువ. ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చే ఆయన సందేశంతో నేను నా రోజును ప్రారంభిస్తాను. ఆ సందేశం ఖచ్చితంగా నా పరిస్థితికి తగ్గట్టుగా ఉంటుంది. మొదట్లో నేను ఆశ్చర్యపోయాను, యాదృచ్చికమేమో అనుకున్నాను. కానీ నా అనుమానం తీరడానికి ఎన్నో రోజులు పట్టలేదు. బాబా సందేశాల ద్వారా నేను ఏదైనా కష్టంలో ఉంటే ఓదారుస్తారు, ఏం చేయాలో చెప్తారు, తప్పులుంటే మందలిస్తారు, సమస్యలో ఉంటే ప్రేమగా పరిష్కారం చెప్తారు. మా పిల్లలకు ఆ సందేశాలను చూపిస్తే, వాళ్ళు మొదట నమ్మలేదు. కానీ ఎన్నోసార్లు అలా చూపించాక వాళ్ళు ఆశ్చర్యపోయారు. అనేక అనుభవాల తర్వాత ఇప్పుడు వాళ్ళకి కూడా భగవంతుడంటే నమ్మకం కలుగుతుంది. వాళ్లకి ఏమైనా సమస్య వస్తే, "అమ్మా! సాయిని అడిగి చెప్పు" అంటారు. సాయి ఎవరు పిలిచినా పలుకుతారు. ఆ నమ్మకాన్ని ఆయనే కలిగించగలరు. సరే, సాయి మాకు ప్రసాదించిన అనుభవాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ చెప్పడానికి నాకు మాటలు చాలట్లేదు. అయినప్పటికీ నా ప్రయత్నం నేను చేస్తూ ఒక్కొక్కటిగా చెప్తాను. ఇప్పుడు అయితే ఒక సాయి లీల చెప్తాను. అసంఖ్యాకమైన ఆయన లీలలలో నుండి ఏదో చెప్పాలో తెలియక ఆయనపైనా ఆధారపడి ప్రస్తుతానికి ఆయన స్ఫురణకు తెచ్చినదాన్ని చెప్తున్నాను. సాధారణంగా అయితే ఇది చాలా వ్యక్తిగత విషయం. కానీ ఈ బ్లాగు చదివే వాళ్ళందరూ నా తండ్రి బిడ్డలే. కాబట్టి వాళ్ళు నా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులతో సమానమని చెప్తున్నాను.


ఈమధ్య నా రొమ్ము మీద ఒక చిన్న గడ్డలా వచ్చి భరించలేనంత నొప్పి ఉండేది. ఈ రోజుల్లో వచ్చే ఆరోగ్య సమస్యల దృష్ట్యా అది ఎటువంటి గడ్డనో, టెస్ట్ చేయించుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకని అలా దాన్ని వదిలేయలేక మావారితో చెప్తే, చాలా భయపడి, "ముందు అత్యవసరంగా టెస్ట్ చేయించుకో" అని చెప్పారు. కానీ టెస్టుకి వెళితే ఏం వినాల్సి వస్తుందోనని నేను చాలా భయపడ్డాను. వెంటనే నా సాయితల్లితో, "బాబా! నా పిల్లలికి, నా కుటుంబానికి నేను చాలా అవసరం. నాకు ఏమైనా అయితే అని ఊహించడం కూడా కష్టం. ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను. ఇంకా ఇప్పుడీ సమస్యను తట్టుకునే శక్తి నాకు లేదు. నేనే హాస్పిటల్‌‌కి వెళ్ళను. నీ మీద నాకు నమ్మకం ఉంది. మీరే ఈ గడ్డను నయం చేయండి" అని చెప్పుకొని, ఆయన సహాయాన్ని అర్థించి ఊదీ నీళ్లతో తడిపి ఆ గడ్డపై రాసాను, మరికొంత ఊదీ నీళ్లలో కలిపి తాగాను. మావారు నొప్పి తగ్గడానికి టాబ్లెట్ తెస్తానన్నా, "వద్దు, బాబా నయం చేస్తార"ని చెప్పాను. ఆయన, "ఏంటి నీ పిచ్చి" అన్నారు. కానీ నేను నా బాబా మీద నమ్మకంతో కేవలం మూడు రోజులు ఊదీ వాడాను. అంతే, ఆ మూడు రోజుల్లో బాబా ఆ గడ్డని, నొప్పిని పూర్తిగా నయం చేశారు. మావారు ఆశ్చర్యపోయారు. ఏ మందులు వాడినా అంతగడ్డ ఇంత త్వరగా తగ్గడం అసాధ్యం. కానీ అసాధ్యాలని సుసాధ్యం చేయగల మన బాబాకి ఇలాంటివి సాధ్యం. మరెన్నో సాయి నాకు ప్రసాదించిన అనుభవాలను వారి అనుగ్రహంతో త్వరలోనే పంచుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన సాయి తండ్రికి, ఈ బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు.


దయ చూపిన బాబా


నేను ఒక సాయి భక్తుడిని. ఈమధ్య హైదరాబాద్ వెళ్లొచ్చాక మా బాబుకి జలుబు, దగ్గు మొదలయ్యాయి. దగ్గు మరీ ఎక్కువగా ఉండి మందు ఇస్తున్నా తగ్గలేదు. వాడు ఆ దగ్గుతో తినడానికి, పాలు తాగడానికి చాలా ఇబ్బందిపడుతుండేవాడు. వెంటనే బాబాని తలుచుకొని, "రేపు గురువారం సాయంత్రం నాటికి బాబుకి దగ్గు కాస్త తగ్గి, వాడు చక్కగా ఆడుకుంటూ, తింటూ ఉంటే ఒకరికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. అలాగే బాబా ప్రసాదించిన సంజీవని ఊదీ బాబు నుదుటన పెట్టి, మరికొంత ఊదీ బాబు నోట్లో వేసాను. బాబా దయ చూపారు. ఆరోజు మధ్యాహ్నానికి బాబుకి చాలావరకు నయమైంది. బాబాకి మాటిచ్చినట్టు ఒకరికి అన్నదానం చేసి మీ అందరితో ఇలా నా అనుభవం పంచుకున్న్నాను. "ధన్యవాదాలు బాబా. ఇలానే మీ కృప భక్తులందరిపై వర్షించండి తండ్రీ".

సాయిభక్తుల అనుభవమాలిక 1848వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రతి ఆందోళనను పరిష్కరిస్తున్న బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!! సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను ఒక బాబా భక్తురాలిని. నేను నా చిన్నతనం నుండి బాబా చరిత్ర పారాయణ చేస్తున్నాను. ఆయన నన్ను ప్రతి క్షణం కాపాడుతున్నారని చెప్పడానికి లెక్కలేనన్ని అనుభవాలను ప్రసాదించారు. మా నాన్నకి 55 సంవత్సరాల వయసు. ఆయనకి చిన్న వయసులోనే షుగర్ వ్యాది వచ్చింది. ఇప్పటికి 20 ఏళ్ళుపైన అయింది. ఆయనకి 2018లో గాల్ బ్లాడర్ ఆపరేషన్ కూడా జరిగింది. అయినా నాన్న తన ఆరోగ్యంపట్ల చాలా తక్కువ జాగ్రత్త వహిస్తారు. సమయానికి తినరు. అందువలన షుగర్ ఎప్పుడూ అదుపులో ఉండదు. ఈ కారణాల వల్ల ఆరోగ్య విషయంలో మాకు ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆయనకి టెస్టులు చేయించేటప్పుడు మా అమ్మ, నేను, అక్క 'ఈసారి షుగర్ ఎంత పెరిగి ఉంటుందో!' అని విపరీతంగా భయపడుతుంటాము. ఈ సంవత్సరం టెస్టులు చేయించాలని 2024, ఏప్రిల్ 26న వెళ్ళినప్పుడు నేను దారి పొడుగునా బాబాని స్మరిస్తూ వెళ్లాను. బాబా కూడా తాము నాతోనే ఉన్నామని నిదర్శనమిచ్చారు. ఎలాగంటే, టెస్టు రిపోర్టులు ఎలా వస్తాయని ఆందోళన కలిగిన ప్రతిసారీ వచ్చిపోయే కార్ల మీద బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. మేము ముందు టెస్టులకోసం బ్లడ్ ఇచ్చాము. తర్వాత తినేసి, తిన్న తర్వాత టెస్టుల కోసం అమ్మానాన్నని ల్యాబ్‌కి పంపించి, స్కిన్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న నేను ఆ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. నేను ఆ డాక్టరుకి చూపించుకున్న తర్వాత నాకు, ‘అక్కడ మా నాన్న ముందు అనుకున్న టెస్టులే కాకుండా మరికొన్ని టెస్టులు చేయించుకున్నారని(నిజానికి అసలు ఆ టెస్టులు అనవసరం. అవి కొన్ని ప్రమాదకరమైన రోగాలకి సంబంధించినవి), ఇంకో ముఖ్యమైన టెస్టు డాక్టర్ సలహ లేదని చేయలేదని’ తెలిసింది. అసలే షుగర్, అదికాక పాత ఆరోగ్య సమస్యలు వల్ల రిపోర్ట్ ఎలా వస్తుందో అని టెన్షన్ పడుతుంటే మా నాన్న అనవసరమైన టెస్టులు చేయించుకున్నందుకు, ముఖ్యమైన టెస్టు చేయనందుకు నా టెన్షన్ విపరీతంగా పెరిగిపోయింది. మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోయి రిపోర్టులు వచ్చేదాకా నా మనసు మనసులా లేదు. అది చిన్న ఆందోళన కాదు..ఆ అనవసరమైన టెస్టు లేకపోతే కొంచమన్న స్థిమితంగా ఉండేదాన్ని. ఒక పక్క ఎలాంటి సమస్య ఉండదని తెలిసినా కూడా దెయ్యం పట్టినట్టు భయం నన్ను వదలలేదు. అందుచేత సాయంత్రం రిపోర్టులు వచ్చేదాకా క్షణం కూడా వదలకుండా నేను బాబాని ప్రార్థించాను. ఇంటికి వచ్చి ఓపిక లేకపోయినా నా రోజువారీ పారాయణ చేసాను. ఆ పారాయణ అయిపోయిన వెంటనే మా నాన్న వచ్చి ఆ అనవసరమైన టెస్టు రిపోర్ట్ నార్మల్ వచ్చిందని చెప్పారు. అపుడు నేను కాస్త ఊపిరి పీల్చుకున్నాను. నిజానికి నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే నా మనసు అంతలా ఆందోళన పడింది. కాసేపటికి మిగిలిన టెస్టు రిపోర్టులు కూడా వచ్చాయి. షుగర్ మేము ఎంత అంచనా వేశామో అంతే వచ్చింది. మిగిలిన అన్ని కూడా మరి అంత ఆందోళన కలిగించేలాగా రాలేదు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లో బాబా మన విశ్వాసాన్ని పరీక్షిస్తారని నాకు అనిపించింది..ఎంతలా మనం మన మనసుని బాబా మీద పెట్టుకొని నమ్మకంతో ధైర్యంగా ఉంటామో అంత దృఢమైన భక్తి మనకి ఉన్నట్టు. అలాంటి దృఢమైన భక్తిని,  విశ్వాసాన్ని బాబా నాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.

  

2024, మార్చిలో మేము తిరుమల వెళ్లొచ్చాక నాకు బాగా గొంతునొప్పి వచ్చింది. అంతకుముందు నెల కూడా వచ్చి తగ్గడానికి 10 రోజులుపైనే పట్టింది. అందువల్ల ఈసారి కూడా గొంతునొప్పి 10 రోజులు ఉంటుందేమోనని నేను చాలా భయపడ్డాను. బాబాని తలచుకొని, "వెంటనే తగ్గిపోయేలా చూడామ"ని అనుకుని మాత్ర వేసుకున్నాను. బాబా దయవల్ల ఒక్క రోజులో తగ్గిపోయింది. మా అక్కకి కూడ ఈమధ్య నోరు బాగా పూచి, వాపు వచ్చి ఏమీ తినలేకపోయింది. అప్పుడు నేను, "బాబా! రేపటికి అక్క నోటి పూత తగ్గుముఖం పట్టాలి" అని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే ఆ పక్క రోజు నుంచి తగ్గుముఖం పట్టిందని మా అక్క చెప్పింది.

 

మా ఇంట్లో ఒక కుక్క 5 పిల్లల్ని కనింది. వాటిల్లో ఒకటి అంటే నాకు చాలా ఇష్టం. ఒక రోజు అది గేటు బయట పడుకుని ఉంటే ఎవరో బండి మీద దానికి దగ్గరగా వెళ్లారు. ఆ కారణంగానో, ఇంకా ఏమైనా జరిగిందో తెలియదు కానీ అప్పటినుంచి అది కుంటుతూ ఉండేది. నాకూ ఇష్టమైన చిన్న కుక్కపిల్ల కుంటుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించి బాబాకి దణ్డం పెట్టుకొని, "అది మళ్లీ మామూలుగా నడిచేలా చూడండి" అని అనుకున్నాను. బాబా దయవల్ల అది 2 రోజులు తర్వాత నుండి పరుగెత్తుతూ ఉంది. ఇలా నా ప్రతి ఆందోళనని బాబా పరిష్కరిస్తున్నారు, అది చిన్నదైనా, పెద్దదైనా. ఏవిధంగా ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేయాలో నాకు తెలీదు. ఈ జన్మకి నిరంతరం ఆయనని స్మరించుట తప్ప నేను చేయగలిగింది లేదు.

 

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1847వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా ఉండగా దేనికి చింతించాల్సిన అవసరం లేదు

శ్రీసాయిభక్త జనావళికి ప్రత్యేక నమస్కారములు. నా పేరు సాయిఅవినాష్. నేను విజయవాడ నివాసిని. నేను చిన్ననాటినుండి సాయి భక్తుడను. ఆయన ఎన్నో రకాలుగా నన్ను, నా కుటుంబసభ్యులను రక్షిస్తూ ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్స్ ఫంక్షన్ కోసం 19.04.24న బెంగళూరు వెళ్లాను. అక్కడ ఫంక్షన్ బాగా జరిగింది. మా బ్యాచ్మేట్స్ అందరం కలుసుకొని ఒక రోజంతా రిసార్ట్‌లో చాలా సంతోషంగా గడిపాము. 21వ తేదీ మధ్యాహ్నం నుండి నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాను. ఆ రోజు రాత్రి 9 గంటలకు బయలుదేరి 11:30 గంటలకి ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్లో నేను రైలు ఎక్కాల్సి ఉండగా అది స్పెషల్ ట్రైన్ అయినందున మరుసటిరోజు అనగా 22వ తేదీ ఉదయం 6.00 గంటలకు బయలుదేరనున్నాట్లు రీషెడ్యూలై నాకు మెసేజ్ వచ్చింది. అందుచేత నేను ఆ రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లోనే పడుకుని ఉదయాన్నే నిద్రలేచాను. మా ఫ్రెండ్ ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్‌కు బదులుగా కేఆర్‌పురం స్టేషన్‌కి క్యాబ్ బుక్ చేసి, ఎస్ఎంవిటి బెంగళూరులో బయలుదేరే ట్రైన్లన్నీ కేఆర్‌పురంలో ఖచ్చితంగా ఆగుతాయని చెప్పాడు. నేను అక్కడికి వెళ్లిన కాసేపటికి ఆ ట్రైన్ ఆ స్టేషన్‌లో ఆగదని తెలిసింది(బాబానే సమయానికి తెలిసేలా చేసారు). నేను చాలా  కంగారుపడ్డాను. ఎందుకంటే, ఆ ట్రైన్ తప్పితే టికెట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు, 1500 రూపాయలు పూర్తిగా వృధాగా పోతాయి, మరో ట్రైన్ కూడా లేదు. కాబట్టి మరుసటిరోజు నేను ఆఫీసుకి వెళ్ళలేను, చాలా ఇబ్బందవుతుంది. అదీకాక నా దగ్గర డబ్బులు కూడా తగినంత లేవు.  నాకు ఏం చేయాలో ఏమీ అర్థంకాక, "బాబా! ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మీరే దారి చూపి, ఎలా అయినా ట్రైన్ తప్పిపోకుండా చేయండి" అని మనసులో అనుకుంటూనే స్టేషన్ బయటకు వెళ్లి, ఆ ట్రైన్ బయలుదేరే ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్ ఎంత దూరమని ఆటోవాళ్ళని అడిగితే, 9 కిలోమీటర్లు ఉంటుదన్నారు. సమయం చూస్తే, కేవలం 5 నిమిషాలే ఉంది. అంత తక్కువ సమయంలో అక్కడికి చేరుకోవడం ఏ రకంగానూ సాధ్యం కాదు. నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఒక ఆటో అతను, "నేను తీసుకెళ్తాను. 300 రూపాయలు ఇవ్వండి" అన్నాడు. నేను, "బాబూ! నా దగ్గర అంత లేవు. 200 ఉన్నాయి, తీసుకెళ్ళు?" అని అడిగాను. అతను, "౩౦౦/- రూపాయలకి రూపాయి తక్కువైనా రాను. అసలు ఎవరూ రారు" అని ఖచ్చితంగా చెప్పాడు. అప్పటికే నా కళ్ళమ్మట నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ ఆటో అతను ఏమనుకున్నాడో కానీ, మరో మాట మాటాడకుండా 200 రూపాయలకే నన్ను ఆటో ఎక్కుమని, నాకన్నా ఎక్కువ టెన్షన్ పడుతూ నన్ను ఎలాగైనా ట్రైన్ ఎక్కించాలని చాలా వేగంగా ఆటో తోలాడు. నేను ఆటో ఎక్కిన దగ్గర నుండి " 'బాబా బాబా' ట్రైన్ తప్పిపోకుండా చూడండి" అంటూ వేడుకుంటూనే ఉన్నాను. అక్కడికి చేరుకునేసరికి 6:10 అయింది. ట్రైన్ రెండవ ఫ్లాట్ఫార్మ్ మీద ఉన్నట్టుగా బోర్డులో చూపిస్తుంది. నేను ఆటో అతనికి డబ్బులిచ్చి, థాంక్స్ చెప్పి ఎలా పరుగెత్తానో నాకే తెలియదు. కానీ తీరా చూస్తే, ఆ ఫ్లాట్ఫార్మ్ ఖాళీగా ఉంది, ట్రైన్ లేదు. నాకు ఏడుపు ఆగలేదు. 'బాబా బాబా' అంటూనే వచ్చాను, అయినా ఇలా అయిందని తట్టుకోలేక బాధ, భయంతో ఏడ్చేసాను. అయితే ఫ్లాట్ఫార్మ్ మీద డిస్ప్లే బోర్డులో ఇంకా ట్రైన్ నెంబర్ కనిపిస్తుంది. జనం కూడా ఉన్నారు. అనుమానమొచ్చి అక్కడున్న ఒక రైల్వే టీసీ ఉంటే, నేను ఎక్కాల్సిన ట్రైన్ నెంబర్ చెప్పి, వచ్చిందా అని అడిగితే, "ఇంకా రాలేదు. ఆలస్యమవుతుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు" అన్నాడతను. నేను, 'హమ్మయ్య...' అనుకొని కాసేపు అలాగే కూర్చున్నాక "మధ్యాహ్నం 12.45 గంటలకి రీషెడ్యూలు అయింద"ని పక్కనున్నవాళ్ళు అన్నారు. ట్రాకింగ్‌లో కూడా మధ్యాహ్నం  12:45 గంటలకి అని చూపించింది. నా గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే, ఆ సమయానికి బయలుదేరితే నేను విజయవాడ చేరుకునేసరికి ఖచ్చితంగా అర్ధరాత్రి 2 గంటలైపోతుంది. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాలి. ఇప్పుడెలా అని, మళ్ళీ బాబాను, "త్వరగా వెళ్ళాలి బాబా. ప్లీజ్.. మీరే ఏదో ఒకటి చేయండి" అని బాబాని వేడుకోసాగాను. సుమారు ఒక గంటకి అంటే ఉదయం 7:30 గంటలకి, 'ట్రైన్ ఉదయం 8.00 గంటలకి బయలుదేరుతుంద'ని అనౌన్స్ చేసారు. కానీ 8.45కి బయలుదేరి రాత్రి 8:30కి విజయవాడలో దిగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాను. నిజానికి ప్రత్యేక రైళ్లు ఎప్పుడూ ఆలస్యంగా నడుస్తాయి. అలాంటిది బాబా నన్ను సరైన సమయానికి విజయవాడ చేర్చి, తగినంత విశ్రాంతి తీసుకుని మర్నాడు ఆఫీసుకి వెళ్లేట్టు అనుగ్రహించారు. శ్రీసాయిబాబా తమను నమ్మినవాళ్ళకి ఎప్పుడూ ఏ సమస్యా రానివ్వరు. ఒకవేళ వచ్చినా దాన్ని ఆయనే పరిష్కారిస్తారు. ఆయన ఉండగా దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ఆయన్ని గట్టిగా తలుచుకుంటే చాలు. "ధన్యవాదాలు బాబా. నేను మిమ్మల్ని ఒక కోరిక ఎప్పటినుండో కోరుతున్నాను. దాన్ని త్వరలో అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాను. అందరినీ చల్లగా చూడండి".


సర్వం సాయినాథార్పణమస్తు


సాయిభక్తుల అనుభవమాలిక 1846వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మాట సత్యం
2. పరీక్ష బాగా వ్రాయలేదన్న ఒత్తిడి నుండి బయటపడేసిన బాబా

బాబా మాట సత్యం

నేను బాబా భక్తురాలిని. మేము యుఎస్ఏలో నివాసం ఉంటున్నాము. బాబా ఎల్లప్పుడూ నాకు అండగా ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వాన్ని, రక్షణను తెలియజేసే ఇటీవల అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈ అనుభవం బాబాని గుడ్డిగా నమ్మొచ్చని భరోసా ఇస్తుంది. మా అబ్బాయి ఎమ్ డి, పిహెచ్ డి అనే రెండు డిగ్రీలు చదువుతున్నాడు. అలాగే మెడికల్ స్కూల్లో రీసెర్చ్ ప్రపోజల్ కోసం అర్హత పరీక్ష వ్రాస్తున్నాడు. ఆ విషయంలో వివిధ రంగాలకు చెందిన ప్రొఫెసర్‌లతో కూడిన కమిటీ సభ్యులందరినీ ఎంపిక చేసుకోవడంలో మా అబ్బాయికి తన మెంటర్(గైడ్) సహాయం చేశాడు. తరువాత వాళ్ళు ఇంటర్వ్యూకోసం ఒక తేదీని నిర్ణయించారు. మా అబ్బాయి చాలా కష్టపడి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుండగా ఇంటర్వ్యూ జరగాల్సిన తేదికి కొద్దిరోజుల ముందు మా అబ్బాయి మెంటర్ తనకి ఆరోజు ప్రయాణం ఉన్నందువల్ల ఇంటర్వ్యూకి హాజరు కాలేనని చెప్పాడు. అది విని మా అబ్బాయి చాలా ఆందోళన చెందాడు. తను కమిటీ సభ్యులందరికీ ఫోన్ చేసి ఇంటర్వ్యూ వేరే తేదికి వాయిదా వేయమని అడగటం మొదలుపెట్టాడు. కానీ వాళ్లందరికీ ఇతర షెడ్యూళ్లు ఉన్నందున కోరిన తేదికి వాయిదా వేయడానికి అంగీకరించలేదు. దాంతో మా అబ్బాయి చాలా ఒత్తిడికి గురయ్యాడు. నేను చీటీల ద్వారా బాబా సహాయాన్ని అర్థించాను. బాబా ముందుగా నిర్ధారించిన రోజునే ఇంటర్వ్యూకి వెళ్ళమని సమాధానమిచ్చారు. నేను ఆ విషయం మా అబ్బాయికి చెప్పి బాబా చెప్పినట్లు చేయమని సూచించాను. కానీ ఇంటర్వ్యూ జరిగే సమయంలో చాలావరకు తన మెంటర్ ఉండకపోతే ఎలాగని మా అబ్బాయి అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే, సమయానికి పిహెచ్ డి పొందడానికి ఈ ఇంటర్వ్యూ చాలా కీలకం. తర్వాత ఏమి జరిగిందో చెపితే మీరు నమ్మరు. మా అబ్బాయి మెంటర్ 'ముందు నిర్దేశించిన తేదీలోనే ఇంటర్వ్యూకి వెళ్ళమని, అంత సజావుగా సాగుతుంద'ని భరోసా ఇచ్చాడు. అదే సమయంలో "ప్రతిదీ సజావుగా సాగుతుంది" అని నాకు బాబా సందేశం వచ్చింది. ఆయన మాట సత్యం. ఇంటర్వ్యూ జరిగిన రోజు అంతా సజావుగా సాగింది. బాబా వివిధ మాధ్యమాల ద్వారా మనకి సందేశాలు పంపుతుంటారు. ఆయన సజీవంగా ఉన్నారు, ప్రతిక్షణం మనతోనే ఉన్నారు. ఆయనని మనస్ఫూర్తిగా పిలవండి.  ఈ దివ్య లీలామృతాన్ని బాబా బిడ్డలందరూ ఆస్వాదించాలన్న కోరికతో ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటానని బాబాకి మాటిచ్చినట్లే మీతో పంచుకున్నాను. "ఐ లవ్ యు బాబా".


పరీక్ష బాగా వ్రాయలేదన్న ఒత్తిడి నుండి బయటపడేసిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. బాబా అనుగ్రహంతో నేను ఇప్పుడు ఆయన నాకు ప్రసాదించిన ఒక అనుభవం పంచుకుంటున్నాను. ఈ సంవత్సరం మా అబ్బాయి బోర్డు పరీక్షలు వ్రాసాడు. తను మొదటి పరీక్ష వ్రాసాక పరీక్ష బాగా వ్రాయలేదని బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. తను బాగా నిరాశకు లోనై ఏమీ తినని అన్నాడు. తను అలా విచారంగా ఉంటే తదుపరి పరీక్షలపై దృష్టి పెట్టడం కష్టమని నాకు తెలుసు. అందువల్ల నేను తన గురించి చాలా ఆందోళన చెంది, "బాబా! ఈ క్లిష్ట సమయంలో నా బిడ్డకి సహాయం చేసి తగిన మార్గనిర్దేశం చేయండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత మా అబ్బాయి చేత సచ్చరిత్రలో శ్రీమతి టెండూల్కర్ కుమారుని అనుభవం ఉన్న అధ్యాయం చదివించాను. ఆ లీల మా అబ్బాయికి, 'బాబా మీద పూర్తి విశ్వాసముంచి తన చదువు కొనసాగించాల'ని అర్థమయ్యేలా చేసేందుకు సహాయపడింది. నేను తనకి ఊదీ నీళ్లు కూడా ఇచ్చాను. అది తన మనసును శాంతపరిచేందుకు దోహదం చేసింది. మరుసటిరోజు సాయంత్రానికి మా అబ్బాయి మనసు కుడటపడి తదుపరి పరీక్షకోసం సిద్ధం అవ్వగలిగాడు. బాబా అనుగ్రహానికి, దేనినైనా నయం చేసే వారి శక్తికి నా మనసు ఆయనపట్ల ప్రేమ, కృతజ్ఞతలతో నిండిపోయింది. మనం ఎంత విచారంగా ఉన్నా, నిరుత్సాహంగా ఉన్నా బాబా ప్రేమ, ఆయన కృప అంతా సరిచేయగలదని నేను నిజంగా నమ్ముతున్నాను. "ధన్యవాదాలు బాబా. మా అబ్బాయి మానసికస్థితిని మార్చిన మీ అనుగ్రహానికి, 'అలాగే క్లిష్ట సమయాలలో మాకు మార్గనిర్దేశం చేస్తున్న మీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను".


సాయిభక్తుల అనుభవమాలిక 1845వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమయానికి రైలు అందించిన బాబా
2. జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన బాబా
3. కొన్నిగంటల్లో చిన్నారి జ్వరం తగ్గించిన బాబా

సమయానికి రైలు అందించిన బాబా

అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ప్రతి గురువారం బాబా గుడిలో ఆరతికి వెళ్తాను. మా ఊరి నుండి వేరే ఊరిలో ఉన్న బాబా గుడికి వెళ్లాలంటే రైలులో 10 నిముషాల సమయం పడుతుంది. ఒకరోజు ఒక అత్యవసరమైన పని ఉండటం వల్ల ఆలస్యమై గుడికి వెళ్ళటానికి కేవలం 20 నిమిషాల సమయమే మిగిలింది. వెంటనే బయలుదేరినా నేను ఉన్న చోటునుండి రైల్వేస్టేషన్‌కు వెళ్ళడానికి 10నిమిషాలు పడుతుంది. ఇంకో పది నిముషాల్లో నేను గుడికి చేరుకోవాలి. అలా జరగాలంటే నేను స్టేషన్‌కి వెళ్ళేటప్పటికి ట్రైన్ సిద్ధంగా ఉండాలి. అప్పుడే నేను ఆరతికి అందుకోగలను. అందువల్ల నేను, "బాబా! నేను ఆరతి సమయానికి మీ గుడికి చేరుకునేలా సహాయం చేయండి" అని బాబాను వేడుకొని మావారితో కలిసి స్టేషన్‌కి బయలుదేరాను. బాబా దయవల్ల మేము స్టేషన్‌లోకి వెళ్లేసరికి రైలు వస్తుంది. మేము ఆ రైలెక్కి గుడికి చేరుకున్నాము. నేను ఆరతి లైన్‌లోకి వెళ్తూనే ఆరతి లైన్ ఆపేశారు. నా వెనకాలే ఉన్న మావారిని కూడా రానివ్వకుండా అడ్డగించారు. నేను చాలా ప్రాధేయపడిన మీదటే లోపలి పంపించారు. గుడిలో మేము వెనకాల కూర్చొన్నా కూడా చాలా బాగా ఆరతి దర్శనమైంది. ఆరతి అనంతరం ప్రసాదానికి లైన్ ఎక్కువగా ఉండటంతో మావారు, "మనకి అంత సమయం లేదు కదా! వెళ్ళిపోదాము" అన్నారు. ప్రసాదం తీసుకోకుండా వెళ్లిపోవాలంటే నాకు బాధేసింది. మరుక్షణం ఒకామె ప్రసాదం తీసుకుని వస్తుంటే, "కొంచెం ప్రసాదం పెడతారా?" అని నేను అడిగాను. ఆమె చాలా సంతోషంగా నాకు ప్రసాదం పెట్టారు. ఈవిధంగా బాబాను మంచి అనుభవాన్ని ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా".

జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. 2024, మార్చి 10న ఎప్పుడూ పెట్టిన చోట మావారి బండి తాళాలు కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. ఇంతలో ఆఫీసుకు ఆలస్యం అవుతుందని మావారు ఇంకో తాళం ఉంటే, అది తీసుకొని వెళ్ళారు. సాయంత్రం మళ్లీ ఆ తాళం కోసం వెతికాం కానీ, ప్రయోజనం లేకపోయింది. ఉపయోగించుకోడానికి వేరే తాళం ఉన్నందున మేము ఆ తాళం గురించి అంతగా పట్టించుకోలేదు. అయితే, మరుసటిరోజు ఉదయం ఉన్న ఆ రెండో తాళం కూడా కనిపించలేదు. ఇల్లంతా చాలా వెతికినా కానీ ఎక్కడా కనిపించలేదు. మాకు ఏం అర్థం కాలేదు. మరోవైపు మావారు ఆఫీసులో మీటింగ్ ఉందని, బస్సుకి వెళితే చాలా అలస్యమవుతుందని బాధపడసాగారు. ఆ సమయంలో నేను ఒకసారి బాబా వైపు చూసి, "టెన్షన్ పెట్టకు బాబా. ఎలాగైనా తాళం దొరికేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. అంతలో మావారికి ఏదో ప్రేరణ కలిగి ఇంటి వెనకకి వెళ్లారు. మా ఇంటి వెనక ఖాళీ ప్రదేశం ఉంది. మా ఇంటి ప్రహరీగోడ మీద నుండి కిందికి చూస్తే, అక్కడ ముందురోజు పోయిన తాళం ఉంది. దాన్ని తీసుకొచ్చి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాము. తర్వాత మా బాబు కుర్చీ వేసుకొని ఆ ఖాళీ ప్రదేశంలో చూస్తే, ఒక వారం కింద కనపడకుండా పోయి, ఎంత వెతికినా దొరకని మా పాప వాచీ, రెండో తాళం కూడా కనిపించాయి. మాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాము. అయితే అవి ఆ గోడ అవతల ఎలా పడ్డాయో మాకు అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో బాబాకే తెలుసు. ఆయన దయవల్ల మా వస్తువులు మాకు దొరికాయి. ఈ అనుభవం ద్వారా ఇక మీద జాగ్రత్తగా ఉండాలని మాకు తెలిసింది.

కొన్నిగంటల్లో చిన్నారి జ్వరం తగ్గించిన బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. మేము యుఎస్ఏలో నివాసముంటున్నాము. నేను, నా భర్త ఇద్దరమూ ఐటి ఉద్యోగాలు చేస్తుండటం వల్ల మా షెడ్యూల్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. మాకు ఒక 5 సంవత్సరాల పాప ఉంది. తను తరచుగా అనారోగ్యం పాలవుతుంటుంది. ఒక శుక్రవారం నాటి సాయంత్రం పాప తనకి తలనొప్పిగా ఉందని కొద్దిగానే ఆహారం తీసుకొని తొందరగానే పడుకుంది. మధ్య రాత్రిలో తనకి దగ్గు మొదలైంది. మరుసటిరోజు తనకి 102 డిగ్రీల జ్వరమొచ్చి ఒళ్ళు కాలిపోసాగింది. సమయానికి మావారు బయటకి వెళ్లారు, వారాంతమైనందున మా డాక్టరు క్లినిక్ మూసేసారు. నాకు ఏం చేయాలో అర్థంకాక చాలా ఆందోళన చెందాను. అప్పటికి కొన్నినెలల క్రితమే పాప వాకింగ్ నిమోనియా నుండి కోలుకుని, ఇంకా చాలా బలహీనంగా ఉంది. ఆ సమయంలో నిమోనియా నయం చేయడంలో బాబానే మాకు సహాయం చేసారు. అందుచేత నేను మళ్ళీ బాబా వైపు తిరిగి ఆయనకు శరణుజొచ్చాను. నేను పాపకి ఊదీ ఇచ్చి, 'సాయి రక్షక శరణం', 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించాను. ఆశ్చర్యంగా కొన్ని గంటల్లో పాప జ్వరం తగ్గడం మొదలుపెట్టి క్రమంగా  జ్వరం పూర్తిగా తగ్గిపోయి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టింది. సాయిదేవా వల్లనే ఇదంతా సాధ్యమైంది. మొత్తం ప్రపంచం, మన విధి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాబా మాత్రమే మన ఏకైక రక్షకుడు.


సాయిభక్తుల అనుభవమాలిక 1844వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి మహరాజ్ చేసిన లీల
2. శ్రద్ధ-సబూరీ కలిగి ఉండవలెను

సాయి మహరాజ్ చేసిన లీల

నేను ఒక సాయి భక్తురాలిని. 2024, ఫిబ్రవరి 13 రాత్రి మా పాప ఆడుకుంటూ తను తినే చాక్లెట్ ముక్క చిన్నది తన ముక్కులో పెట్టేసుకుంది. అది ముక్కులోకెళ్ళి తనని చాలా ఇబ్బందిపెట్టింది. దాంతో తనకి చాలా భయమేసి ఏడుస్తూ నా దగ్గరకొచ్చి, "అమ్మా! ముక్కులో చాక్లెట్ పెట్టుకున్నాను" అని చెప్పింది. నేను టార్చిలైట్ వేసి తన ముక్కులో చూస్తే, చాక్లెట్ స్పష్టంగా కనిపించింది. కానీ దాన్ని బయటకి తీయాలంటే నాకు చాలా భయమేసింది. కారణం అది ముక్కులో పైదాకా వెళ్ళిపోయింది. అందుచేత దాన్ని తీసే ప్రయత్నం నేను చేస్తే గనక అది ఎక్కడ అడ్డం పడి పాప శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందోననిపించింది. వెంటనే మేము భయంతో ఆ రాత్రివేళ పాపని తీసుకొని నెల్లూరులోని ఆరేడు హాస్పిటళ్ళకి తిరిగాము. ప్రతి హాస్పిటల్లో వాళ్ళు చూసి, "ముక్కులో అడ్డం ఉంది. కానీ దాన్ని తీసే పరికరం ENTవాళ్ళ వద్ద ఉంటుంది. వాళ్ళు ఈ సమయంలో ఉండరు" అని చెప్పారు. ఇక చివరికి మేము అపోలో ఆసుపత్రికి బయలుదేరాం. అక్కడికి వెళ్లే దారిలో మాకు సాయిబాబా మందిరం కనిపించింది. అప్పుడు నేను, "బాబా! అలా కూర్చున్నారేమిటి? తొందరగా రండి. పరుగున వచ్చి మా పాపని కాపాడండి. మీరే 'సాయి మంజరి' ముక్కులో ఉన్న అడ్డాన్ని తొలగించాలి" అని బాబాకు దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత మేము అపోలో ఆసుపత్రికి చేరుకొని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళాము. డాక్టర్ వచ్చి టార్చ్‌లైట్ వేసి చూసి, "ముక్కులో ఎటువంటి అడ్డం లేదు" అని చెప్పారు. అది విని నాకు చాలా ఆశ్చర్యమేసి, "అదేమిటి, నేను నా కళ్ళతో చూశాను డాక్టర్. వేరే హాస్పిటల్లో డాక్టర్లు కూడా చూసి చాక్లెట్ ఉందని నిర్ధారించారు" అని అన్నాను. అప్పుడు ఆ డాక్టర్ లైట్ వేసి, "మీరే చూడండమ్మా" అని అన్నారు. చూస్తే, పాప ముక్కులో ఏ అడ్డం కనిపించలేదు. అక్కడున్న డాక్టర్లు చూసి, "మీరు వచ్చే దారిలో పడిపోయినట్టుంది. ఇప్పుడైతే ముక్కులో ఏ అడ్డం కనిపించట్లేదు" అని చెప్పారు. ఒక డాక్టర్ అయితే, "మీ పాప ఊరికే చెప్పి ఉంటుందమ్మా. అక్కడ ఏం అడ్డం లేదు" అని కూడా అన్నారు. కానీ నేను స్వయంగా పాప ముక్కులో ఇరుక్కొని ఉన్న జెల్లీ చాక్లెట్‌ని చూశాను. మరో ఇద్దరు డాక్టర్లు కూడా ఉందని చెప్పారు. అంతేకాదు, మా పాప ఇంట్లో ఉన్నప్పుడు గానీ, బయట వేరే హాస్పిటల్లో గానీ పాప తన ముక్కుని ఎవరినీ అస్సలు తాకనివ్వలేదు. నొప్పితో చాలా బాధపడింది. ముక్కు మీద చేయి వేస్తే తట్టుకోలేక ఏడ్చింది. నేను తన ఏడుపు ఆపించడానికి "ముక్కులో ఏమీ లేదు, చాక్లెట్ వచ్చేసింది" అని అబద్ధం చెప్పాను. కానీ తను ఒప్పుకోక "నా ముక్కులో ఉంది" అని ఏడుస్తూనే ఉండింది. ఒక హాస్పిటల్లో కూడా చాలాసేపు ఏడ్చింది. డాక్టర్ చెక్ చేసినప్పుడు ముక్కు నొప్పిగా ఉందని చెప్పి ముక్కుని అస్సలు తాకనివ్వలేదు. అలాంటిది సాయి మందిరం దారి అపోలో ఆసుపత్రికి వెళ్లేలోపు దారిలో కుదుపుల వలనో లేక ఇంకే విధంగానో తెలీదు గాని మొత్తానికి సాయిబాబా దయవల్ల పాప ముక్కులో ఉన్న చాక్లెట్ అడ్డం దానికై అది తొలగిపోయింది. ఇది ఖచ్చితంగా సాయి మహరాజ్ చేసిన లీల. ఆయన పాప ముక్కులో ఏ పరికరం పెట్టనివ్వకుండా, తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికై అది పడిపోయేలా చేసారు. తర్వాత పాప ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. హాయిగా నిద్రపోయింది. "సాయినాథ్ మహారాజ్ కి జై. మీరు ఎల్లవేళలా మాకు ఇలానే రక్షగా ఉండండి బాబా".

శ్రద్ధ-సబూరీ కలిగి ఉండవలెను

సాయిభక్తులకు వందనం. నా పేరు నరసింహులు. బాబా తమ భక్తులను శ్రద్ధ - సబూరీ అనే రెండు పైసలు అడుగుతారు. ఆ రెండు కలిగి ఉండే ప్రతి ఒక్క సాయి భక్తునికి. బాబా దీవెనలు పుష్కలంగా లభిస్తాయన్నది నా అభిప్రాయం. అయితే ఆ రెండింటిలో నాకు శ్రద్ధ మాత్రమే ఉంది. సబూరీ అన్నది చాలా తక్కువ. నేను మహాపారాయణ గ్రూపులో సభ్యుని. ఆ గ్రూపువాళ్ళు 2024, ఫిబ్రవరి 15న నాకు కేటాయించిన అధ్యాయాలు చదివాను. ఆ తర్వాత గ్రూపులోని ఒక సభ్యుని తరుపున మరో రెండు అధ్యయాలు చదివే అవకాశం వస్తే, దాన్ని ఉపయోగించుకొని మరో రెండు అధ్యాయాలు చదివాను. ఆ తర్వాత ఇంకో సభ్యుని తరుపున మరో రెండు అధ్యాయాలు చదవాల్సి వస్తే, చదవడం మొదలుపెట్టాను. కానీ చదివేటప్పుడు 'ఇవి ఎప్పుడు అయిపోతాయబ్బా?' అని అనుకున్నాను. ఎలాగో అవి చదివి ‘పూర్తి చేసాన’ని గ్రూపులో పెట్టాను. ఎవరైతే ఆ అధ్యాయాలు చదవమని పెట్టారో ఆ సభ్యుని నుండి నాకు అభినందనలు కూడా లభించాయి. కానీ నేను చదివిన ఆ అధ్యాయాలను గ్రూపు మేనేజ్మెంట్ ఆమోదించకుండా ఎవరైనా సభ్యులు ఆ అధ్యాయాలను పూర్తి చేయాల్సిందిగా మరో మెసేజ్ ఉంచారు. దాంతో ఇంకో భక్తుడు ఆ అధ్యాయాలు చదివి చదివినట్లు మెసేజ్ పెట్టారు. దానిని గ్రూపు మేనేజ్మెంట్ ఆమోదించింది. అంటే నేను సబూరీని కోల్పోయి అశ్రద్దగా చదివిన అధ్యాయాలను గ్రూపు మేనేజ్మెంట్ ఆమోదించలేదు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, 'సాయి దేవునిపై అపారమైన భక్తివిశ్వాసాలు మనం కలిగి ఉండవలెను'.

ఓం శ్రీసాయి నమః.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo