1911, మార్చి నెలలో ఒకరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో బాబా వద్ద సెలవు తీసుకొని కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాధవరావు దేశ్‌పాండే బొంబాయికి బయలుదేరి వెళ్లారు. వాళ్ళు వెళ్లిన పిమ్మట మసీదులో బాబా, బాపుసాహెబ్ జోగ్, బాలసాహెబ్ భాటే, నీలకంఠ రామచంద్ర సహస్రబుద్దే మరియు ముఖ్య సేవకులు కొందరున్నారు. అకస్మాత్తుగా బాబా తమ కఫ్నీ(కఫ్నీ లోపల ఎప్పుడూ కౌపీనం ఉండేది) పైకి లేపి, "ఆ వెధవ నన్ను చూడటానికి వస్తున్నాడు! నా దగ్గర ఏముంది? నేను దిగంబర ఫకీరును. ముందు పురుషాంగం మరియు వెనుక పిరుదులు…(సాలా హమ్కూ దేఖనేకూ అతా హై. హమారే పాస్ క్యా హై? హమ్ తో నంగా ఫకీర్ హై. ఆగేలండ్ ఔర్ పిచే గాండ్- )" అని పెద్దగా అరిచారు. ఆ మాటలు విని అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యచకితులమయ్యారు. వారికెవరికీ బాబా మాటల అంతరార్థం అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే, ఆ సమయంలో మసీదు ముంగిట కొత్త వ్యక్తులు ఎవరూ లేరు. కానీ రెండు, మూడు నిమిషాల తర్వాత సెంట్రల్ ప్రావిన్సెస్ కమిషనర్ మిస్టర్ కర్టిస్, అతని భార్య, అహ్మద్‌నగర్ కలెక్టర్ మిస్టర్ మెక్‌నీల్, కమిషనర్ స్థానిక సహాయకుడు రావుబహదూర్ రామచంద్ర నారాయణ్(అలియాస్ భావుసాహెబ్ జోగ్లేకర్) తదితరులతో కూడిన అధికారుల బృందం మసీదు పక్కగా చావడి వైపు వెళ్తూ కనిపించారు. వాళ్ళని చూసాక మశీదులో ఉన్న భక్తులకు బాబా మాటల అర్థం బోధపడి, ఇది బాబా దివ్య దృష్టికి నిదర్శనమని గుర్తించారు. అనంతరం బాబా వద్ద సెలవు తీసుకొని కొందరు భక్తులు చావడికి వెళ్లగా, సహస్రబుద్దే, బాలాసాహెబ్ బాటే ఇంటికి వెళ్లారు.
శిరిడీ గ్రామపాటిల్, కులకర్ణిలు అధికారుల బృందాన్ని చూడగానే ‘శిరిడీలో ఏదైనా రాజకీయ అశాంతి నెలకొందా లేదా ఇంకేమన్నా అన్న విషయం చూడటానికి ఆ బృందం ఆకస్మికంగా వచ్చిందని’ భావించి తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వాళ్ళు హడావిడిలో చావడికి మూడు కుర్చీలే తెప్పించడంతో సాహెబ్‌లు(ఆంగ్ల దొరలు) కుర్చీలలో కూర్చోగా తక్కువ స్థాయి అధికార హోదాలో ఉన్నవాళ్ళు సహజంగానే నిలబడక తప్పలేదు. తర్వాత భావుసాహెబ్ జోగ్లేకర్ తన విచారణను ప్రారంభించారు. ఆ క్రమంలో తమకి కావాల్సిన సమాచారం ఇవ్వడానికి ఆ సమయంలో తన మిత్రుడు, శ్రీబాలాసాహెబ్ భాటే, బి.ఏ.(పదవీ విరమణ చేసిన మామలతదారు) తప్ప తమకు పరిచయమున్న ఇతరులెవ్వరూ లేరని తెలిసి వెంటనే, ప్యూన్‌తో బాలాసాహెబ్ బాటేను రమ్మని కబురు పంపారు. అయితే, మామలతదారుగా ఉన్నప్పుడు కర్టిస్ సాహెబ్ పాలన వల్ల విసుగు చెందిన బాలాసాహెబ్ భాటే వాళ్ళ దగ్గరకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుచేత తనను తీసుకెళ్లడానికి వచ్చిన ప్యూన్‌తో, "నేను రావడం లేదని భావుసాహెబ్‌కు చెప్పు" అని అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సహస్రబుద్ధే ఆ ప్యూన్‌తో, "బాలాసాహెబ్ సందేశాన్ని అందించే బదులు, ముందు భావుసాహెబ్‌నే ఇక్కడికి(బాలాసాహెబ్ ఇంటికి) రమ్మని చెప్పు. ఆ తర్వాత నేను అతనితోపాటు చావడికి వస్తాన”ని చెప్పాడు. సహస్రబుద్దే సందేశం అందుకున్న వెంటనే భావుసాహెబ్ బాలాసాహెబ్ ఇంటికి వచ్చాడు. భావుసాహెబ్ జోగ్లేకరు, సహస్రబుద్దేలు చిన్ననాటి స్నేహితులు అయినందున కొద్దిసేపు అక్కడే మాట్లాడుకున్నారు. తర్వాత సహస్రబుద్ధే అతనితో కలిసి చావడికి వెళ్లాడు.
అక్కడికి చేరుకున్నాక, భావుసాహెబ్ సహస్రబుద్ధేతో, "బాబాను సత్వరం వారి ఉదయపు కాలకృత్యాలు ముగించుకోమని బాబాకు సందేశం పంపండి. ఎందుకంటే, సాహెబ్ ఆయనను కలవాలనుకుంటున్నారు" అని అన్నాడు. ఆ మాటలు విని సహస్రబుద్దే కొంత ఆశ్చర్యానికి గురై, “ఇక్కడ ఎవరూ అలాంటి పని చేయరు” అని, ఆపై “ 'అసలు నీకు పేరే లేనప్పుడు, నీపై నాకెలాంటి హక్కు ఉంటుంది?’ అని సాక్షాత్తు దేవుడినే ప్రశ్నించే సాహసం చేసిన సంత్ తుకారాం వంటి అత్యున్నత కోవకు చెందిన మహనీయులు ఆయన(సాయిబాబా). అటువంటప్పుడు, మీ పెత్తనం ఇక్కడ ఎలా చెల్లుతుందని మీరు ఆశిస్తున్నారు? ఆయనతో మీకు ఏదైనా పని ఉంటే, మీరు ఖచ్చితంగా ఆయన ఇష్టానుసారమే నడుచుకోవాలి" అని అన్నాడు. అతని ఆ మాటలకు కర్టిస్ సాహెబ్ నొచ్చుకోకుండా ఉండేందుకు బావుసాహెబ్ తనకి, సహస్రబుద్దేకి మధ్య చిన్ననాటినుండి ఉన్న స్నేహబంధం గురించి వాళ్ళకి కాస్త వివరంగా చెప్పాడు. ఆ తర్వాత వాళ్లంతా శ్రీసాయిబాబా తమ ప్రాతఃకాల విధులు(స్నానం వగైరా) ముగించుకుని, తమ నిత్య నియమానుసారం భిక్షాటనకు వెళ్లే సమయం వరకు వేచి చూశారు.
సుమారు అరగంట తర్వాత బాబా చావడి వైపు రావడం చూసిన శ్రీమతి కర్టిస్ కిందకు దిగి, దారి మధ్యలో బాబాను కలిసి, వినయంగా వారికి నమస్కరించి, "నేను మహారాజ్‌తో నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను" అని అంది. అందుకు బాబా, "అరగంట ఆగు" అని ముందుకు వెళ్లిపోయారు. అరగంట తర్వాత ఆయన తిరిగి వస్తుంటే, శ్రీమతి కర్టిస్ మళ్ళీ మునుపటిలాగే వారికి నమస్కరించి, అభ్యర్థించింది. అప్పుడు ఆయన, "ఒక గంట ఆగు" అని చెప్పి మసీదుకు వెళ్లిపోయారు. అలా జరిగేసరికి శిరిడీలో ఏ వింత, విశేషం కనిపించక కర్టిస్ సాహెబ్ తిరిగి వెళ్ళడానికి తొందరపడటంతో మిగత అందరూ కూడా కాసేపట్లో బయలుదేరడానికి సిద్ధం కాసాగారు. సహస్రబుద్ధే, భావుసాహెబ్‌లు చావడి దగ్గర బయట మాట్లాడుకుంటూ నిలబడ్డారు. కొంతసేపటికి కర్టిస్ సాహెబ్ సహస్రబుద్దే దగ్గరకు వచ్చి, ఎంతో కష్టంగా అతని చేతిలో 5 రూపాయలు పెట్టి, దానిని పేదలకు పంచమని ఆజ్ఞాపించాడు. అది విని సహస్రబుద్దే ఆయనతో, "నేను ఈ మొత్తాన్ని బాబాకి అందజేస్తాను. దానిని పేదలకు పంచడం వారి ఇచ్చ అయితే, పాటిల్, కులకర్ణిలతో ఆ పని చేయమని చెప్తారు" అని అన్నాడు. అతని ఆ మాటలు విన్న సాహెబ్, "నీకు ఏది సరైనదనిపిస్తే, అది చేయి" అని చెప్పాడు. తర్వాత మెక్‌నీల్ సాహెబ్ 5 రూపాయలు, భావుసాహెబ్ 2 రూపాయలు సహస్రబుద్దెకి ఇచ్చారు. అతను ఆ మొత్తం ధనాన్ని వెంటనే బాబాకి పంపించాడు కానీ, వారు ఆ ధనాన్ని స్వీకరించలేదు. అందువల్ల ఆ ధనం తిరిగి అతని వద్దకే వచ్చింది. అతను దానిని మళ్ళీ బాబాకి పంపినప్పుడు, వారు దానిని తీసుకుని పక్కన కూర్చున్న ఒక వ్యక్తికి ఇచ్చేసారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అధికారులు నగరానికి తిరిగి వెళ్లిపోయారు.
సుమారు రెండు గంటల తర్వాత హారతికోసం సహస్రబుద్దే మసీదుకు వెళ్ళినప్పుడు బాబా అతనితో, "గవర్నర్ సాహెబ్ ఇచ్చిన ఆ ముప్పై రూపాయలు నాకు ఇవ్వు" అన్నారు. అతను ఆ రూపాయల గురించిన వాస్తవాలన్నీ బాబాకి చెప్పిన మీదట, "నాకు అందిన 12 రూపాయలు వెంటనే మీకు పంపించాను. మీకు కావాలంటే, అదనంగా నా సొంత డబ్బు 18 రూపాయలు తెప్పించి ఇస్తాను" అన్నాడు. బాబా, "ఆ సాహెబ్‌ల నుండి మొత్తం 30 రూపాయలు నాకు రావాల్సి ఉంది. నాకు నీ డబ్బు వద్దు" అన్నారు. వారి ఆ మాటల్లోని మర్మాన్ని అతను గ్రహించలేకపోయాడు. అతనికేమీ అర్థం కాలేదు. కానీ బాబా మాట్లాడిన ఒక్క మాట కూడా వ్యర్థం కాదని అతనికి తెలుసు కనుక వాస్తవేమేమిటో శ్రీమతి కర్టిస్‌ను అడిగి, విషయమేమిటో తెలియజేయమని కోరుతూ భావుసాహెబ్ జోగ్లేకర్‌కు ఒక లేఖ పంపాడు. దానికి ప్రతిస్పందనగా అతను, "ఆ రూపాయలకు సంబంధించి కర్టిస్‌కు, అతని భార్యకు మధ్య జరిగిన సంభాషణను వ్రాసాడు. శిరిడీలో కర్టిస్ సాహెబ్ సహస్రబుద్దేకు పైకమివ్వడానికి ముందు సహస్రబుద్ధే, భావుసాహెబ్‌లు చావడి బయట నిల్చొని మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ చావడిలో కర్టిస్ సాహెబ్ తన భార్యతో పేదలకు పంచడానికి ఒక్క రూపాయి ఇవ్వాలనే తన ఉద్దేశాన్ని చెప్పగా, ఆమె చాలా బాధపడి, "మీ హోదా, సంపద దృష్ట్యా మీరు కనీసం 25 రూపాయలైనా ఇవ్వాల"ని అందట. ఈ వివరాలు తెలిసాక కర్టిస్ సాహెబ్ ఇవ్వవలసిన 25 రూపాయలు, మెక్‌నీల్ సాహెబ్ ఇచ్చిన 5 రూపాయలు కలిపి మొత్తం 30 రూపాయలు, అందుకే బాబా తనని 30 రూపాయలు అడిగారని సహస్రబుద్దేకి అర్థమైంది.
ఇకపోతే, ఆ తర్వాత సహస్రబుద్ధే చాలా విచారించిన మీదట, ‘శ్రీమతి కర్టిస్‌కి పిల్లల్లేరని, సత్పురుషుల కృప లభిస్తే, పుత్రప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో ఆమె శిరిడీ వచ్చి తన మనోభీష్టాన్ని సాయి పాదాలకు విన్నవించుకోవాలనుకుందని’ తెలిసింది. అయితే ఆమె శ్రద్ధ అంత బలంగా లేనందున, బాబా ఆజ్ఞను ఉల్లఘించి తన భర్తకి అనుకూలంగా వెనుదిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడింది. కానీ ఎవరి(దొరల) ఎంగిలి స్వీకరించడానికి వేలాది ప్రాపంచిక మహాపండితులు సిద్ధపడతారో, అటువంటి ఆమెను అంత అవమానకరంగా చూసే ధైర్యం ఒక నిజమైన సాధువుకి తప్ప మరెవరికి ఉంటుంది? ఆ విషయం ఆమె గ్రహించలేదు గనకనే బాబా పెట్టిన పరీక్షలో ఓడిపోయింది. ఆమె మనోభీష్టం నెరవేరలేదు.
పై వివరాలన్నీ తెలియజేసిన సహస్రబుద్దే చివరిగా అధికారులు గ్రామ ప్రవేశం చేసే సమయంలో శ్రీ(బాబా) పలికిన మాటలు ఎవరికైతే అశ్లీలంగా, అసభ్యకరంగా ఉన్నాయని అనిపిస్తాయో వారిని శ్రీతుకారాం గాధలో ఆయన రచించిన 4438వ అభంగం పూర్తిగా చదవమని సూచించారు(ఆ అభంగం వృద్ధాప్యం యొక్క స్వభావాన్ని, భగవన్నామాన్ని స్మరించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది. అందులోని 7వ వాక్యంలో సాయిబాబా వాడినటువంటి పదజాలమే వాడారు సంత్ తుకారాం మహారాజ్).
చివరిగా ‘ఆగేలండ్ ఔర్ పిచే గాండ్(आगे लंड, पीछे गांड)’ అని బాబా అన్న ఆ వాక్యం మామూలుగా మరాఠీలో ఎటువంటి పని పాట లేని, బాధ్యత లేని, భవిష్యత్తు గురించి ఆలోచన లేని, లేదా నిరుపేద వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. అంటే ‘తాము పేద పకీరుమని, తమ వద్ద ఏమీ లేదని’ చెప్పడమే బాబా మాటల అంతరార్థం. అయినా బాబా వంటి మహాత్ముల అంతరంగం ప్రేమమయం. వారు ఎప్పుడూ కోపంతోనో, ద్వేషంతోనే తిట్లు, శాపనార్థాలు పెట్టరు. వారి తిట్లు, శాపనార్థాల వల్ల తెలియకుండానే భక్తుల జన్మజన్మల దుష్ట సంస్కారాలు తొలగిపోయి మనో పవిత్రత జరుగుతుంది. అందుకే ఒక్కొక్కప్పుడు భక్తులను చెడ్డగా తిట్టడానికి కారణమేమిటని అడిగిన ఒకరితో, “నేను తిట్టలేదు, ఆశీర్వదించాను” అన్నారు బాబా.
మూలం: శ్రీసాయిలీల మరాఠీ పత్రిక, 1923, 3వ సంచిక & 1931, 4వ సంచిక,
సాయి లీలామృతం, సాయి సన్నిధి.

Baba me daya valana Kalyan ki marriage ipoindi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu house koni pettandi baba pl
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOmsaiRam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me