సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2105వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చేసిన గొప్ప సహాయాలు
2. సమస్యలు తీర్చే సాయితండ్రి 

బాబా చేసిన గొప్ప సహాయాలు

సాయి మహరాజ్ కి జై. సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్. మాది తాడేపల్లిగూడెం. 2026, మార్చి 3న మా నాన్న మాకు భౌతికంగా దూరమై, మమ్మల్ని అనాథలను చేశారు. దాంతో ఇంటికి నేనే ఒక్కగానొక్క మగ దిక్కు అయ్యాను. అప్పటిదాకా అన్నీ నాన్నే చూసుకోవడం వల్ల నాకు బయట ప్రపంచం గురించి అంతగా అవగాహన లేదు. అప్పుల గొడవలు, పోలీసులు, కోర్టు వంటి వ్యవహారాలు ఏం తెలియదు. అలాంటిది మేము నాన్న పోయారన్న దుఃఖంలో వుండగా అనుకోకుండా ఒక లాయర్ నోటీసు మాకు వచ్చింది. మేమంతా ఆశ్చర్యపోయాము. ఆ నోటీసులో మా అమ్మ 2 సంవత్సరాల క్రితం మాకు తెలియని ఎవరి దగ్గరో 6 లక్షల రూపాయలు అప్పు చేశారని, ప్రామిసరీ నోటు కూడా ఉందని వుంది. నిజానికి మా అమ్మ గుమ్మంలో కూరగాయలు కొనడానికి కూడా ఏనాడూ బయటకు రాని మనిషి. అందుచేత ఆ నోటీసుతో పిడుగు పడినట్టై వణికిపోయి నిద్రలేని రాత్రులు గడిపాము. మా నాన్న ఆర్థికంగా మాకు అన్నీ అమర్చి వెళ్ళిపోయారు. బాబా దయవల్ల మాకు ఏ లోటూ లేదు. కాబట్టి 6 లక్షలు ఇవ్వడం సమస్య కాదు. కానీ నాన్న గుప్త దాత. సమాజంలో ఒక్కరితో కూడా మాట పడకుండా, అందరితో మనిషంటే ఇలా బ్రతకాలి అనిపించుకున్నారు. అలా మచ్చ లేకుండా దానకర్ణుడిలా వెళ్ళిపోయిన మా నాన్న మీద ఆయన వెళ్ళిపోయిన 3వ నెలలోపే ఇలాంటి అపవాదు రావడం ఆయన గౌరవానికి పెద్ద మచ్చ అని మేము కుమిలిపోయాము. నేను సదరు లాయరుకి ఫోన్ చేస్తే, "కోర్టుకు రండి, మాట్లాడుకుందాం" అన్నాడు. విషయం తెలిసిన ఇంకో లాయర్ సెటిల్మెంట్ చేయిస్తా, రండి అన్నాడు. ఇంకా ఎవరెవరో కల్పించుకొని ఏమేమో చేస్తాం అంటూ గందరగోళం చేసారు. ఇవన్నీ చూసి, 'ఎక్కడో ఎవరో మోసం చేస్తున్నారు. ఒంటరివాళ్లు, అమాయకులు, డబ్బు ఉంది. భయపెట్టి ఎంతోకొంత కాజేద్దామని తోడేళ్లలా వెంటాడుతున్నారు' అనిపించి MLA ఆఫీస్ నుండి ఆ లాయరుకి ఫోన్ చేయించాను. అప్పుడు ఆ లాయర్, "నన్ను భయపెడతారు ఎందుకు? ఎవరో ప్రామిసరీ నోటు తెచ్చి, కేసు నోటీసు పంపమంటే పంపాను. సాక్ష్యం లేకుండా నేను పంపాను కదా! మీకు ఏదైనా చేయాలని ఉంటే, కౌంటర్ ఇవ్వండి" అని చెప్పాడు. అప్పుడు నేను, 'నాన్న సంరక్షణలో సౌఖ్యంగా గుమ్మం దాటని మా అమ్మను నా సంరక్షణలోకి రాగానే కోర్టు గుమ్మం ఎక్కించాలా దేవుడా?' అని బాబాకు నా బాధ చెప్పుకొని, "స్తవనమంజరి 108 సార్లు చదువుతాను. ఈ ఆపద, అపవాదు నుండి గట్టు ఎక్కించండి. నాన్న లేని నాకు నువ్వే నాన్నవు" అని బాబాను కష్టనివారణ స్తోత్రం చదువుతూ పగలూరాత్రీ ప్రార్థించాను. ఒక లాయరును కలిసి కౌంటర్ ఇచ్చాను. బాబా దయవల్ల అటునుండి ఇప్పటివరకు రిప్లై రాలేదు. ఇక రాదని నిర్ధారించుకున్న తరువాత నెత్తి మీద భారం తీరిపోయి బాబాకు వేలవేల కృతజ్ఞతలు చెప్పుకుందామని మీ అందరికి తెలియజేస్తున్నాను.  అపార కరుణ గల మన అవధూత (సాయి)మహరాజ్‌కు మన కుటుంబ పెద్దగా ఉండమని బాధ్యత అప్పగిస్తే, మన 7 తరాలకు ఆయన రక్షణ వహిస్తారు.

నేను బ్యాంకులో పని చేస్తున్నాను. ఆ బ్రాంచులో పని ఒత్తిడికి నాకు గుండెనొప్పి వచ్చేలా ఉంటుంది. నేను చాలా బాధపడుతూ ఆ ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టుకుందామని అనుకోని రోజు లేదు. కానీ కొన్నాళ్ళు ఆ ఉద్యోగం తప్పనిసరిగా చేసేలా నాకు బాధ్యతలు ఉన్నాయి. అదికాక నాన్న మరణంతో నా మీదే ఆధారపడ్డ మా అమ్మ, చెల్లి, మేనకోడలు, నా భార్య, నా కూతురు అందరూ ఆడవాళ్లు  నేను డ్యూటీకి వెళ్ళిపోతే ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బాబా చేసిన సహాయం చూడండి. ఆయన విచిత్రంగా నా సొంత వూరిలో మా ఇంటి ప్రక్కనే ఉన్న బ్రాంచ్కి నాకు బదిలీ అయ్యేలా అనుగ్రహించారు(ఈ బ్రాంచ్‌లో పని తక్కువ). నిజానికి నాకు బదిలీలు అస్సలు ఉండవు. కానీ, ప్రక్క బ్రాంచ్‌లో ఒక ఫ్రాడ్ జరగడంతో నన్ను అక్కడికి బదిలీ అయ్యేలా బాబా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబానికి, పిల్లలకు ఎంతో సమయాన్ని కేటాయించగలుగుతున్నాను.  "బాబా! మీ పాదాలను కౌగిలించుకుని ఆనందంగా ఏడవాలని ఉంది. ఇంతకు మించి మీకు నేనేం ఇవ్వగలను నాన్నా".


4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo