సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2056వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రతి ఆందోళనను తీసేసే బాబా

సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు తన్వి. నేను చిన్నప్పటి నుంచి సాయిబాబా భక్తురాలిని. ఆయన నా చిన్ననాటి నుండి నా ప్రతి అడుగులో మార్గనిర్ధేశం చేస్తున్నారు. మావారు ఇండియన్ ఆర్మీ, త్రిపురలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కుటుంబాన్ని అక్కడికి తీసుకొని వెళదామని క్వార్టర్ కోసం దరఖాస్తు పెడుతున్నప్పటికీ క్వార్టర్ ఖాళీ లేని కారణంగా అప్లికేషన్ చాలాసార్లు రిజెక్ట్ అయింది. ఆయన మాకు దూరంగా ఉండటం వల్ల మాకు అస్సలు మనశాంతి ఉండేది కాదు. అప్పుడు నేను, 'ఏ సమస్య వచ్చినా అడిగితే చాలు అసాధ్యాన్ని సాధ్యం చేసే బాబా ఉండగా దిగులెందుకని' ఆయన మీద భారమేసి 'నవగురువర వ్రతం' మొదలుపెట్టాను. బాబా అద్భుతం చేసారు. వ్రతం మొదలు పెట్టిన రెండో వారంలోనే మావారు ఫోన్ చేసి, "క్వార్టర్ సెక్షన్ అయింద"ని చెప్పారు. అది విని నా ఆనందానికి అవధులు లేవు. బాబాకి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

తర్వాత మావారు కుటుంబాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళడానికి 2025, అక్టోబర్ 30కి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసారు. కానీ అవి వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి కన్ఫర్మ్ కాలేదు. దాంతో మావారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఒక్కరే వెళ్లిపోయారు. ఆ తర్వాత మావారు మమ్మల్ని తీసుకెళ్లడానికి మళ్ళీ టిక్కెట్లు బుక్ చేసారు. ఈసారి కూడా అవి వెయిటింగ్ లిస్టులో ఉండటంతో అవి కన్ఫర్మ్ అవుతాయో, లేదో అని నాకు చాలా ఆందోళన మొదలైపోయింది. ప్రయాణం 2025, నవంబర్ 12న కాగా ముందురోజు అంటే నవంబర్ 11న అవి కన్ఫర్మ్ అయ్యేది, లేనిది తెలుస్తుంది. నేను బాబాని, "ఈసారి టిక్కెట్లు కన్ఫర్మ్  అవ్వకపోతే మేము ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది బాబా. దయచేసి ఈసారైనా టికెట్లు కన్ఫర్మ్ అయ్యేలా చూడండి సాయి" అని కన్నీళ్లతో వేడుకొని ఆయన సహాయం అర్థించి 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అని రోజంతా జపించాను. సాయంత్రానికి మావారు కాల్ చేసి, "టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. బట్టలు, సామాన్లు అన్ని సర్దుకొని సిద్ధంగా ఉండండి" అని చెప్పారు. నేను బాబాకి నమస్కారం చేసుకొని ధన్యవాదాలు తెలుపుకున్నాను.

ఇకపోతే, ట్రైన్‌లో 3రోజుల ప్రయాణం. పైగా నాకు హిందీ అంతగా రాదు. అందువల్ల నాలో మళ్ళీ ఆందోళన మొదలై, "3 రోజుల ప్రయాణం ఏ ఆటంకం రాకుండా చూడు" సాయి అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మా బెర్తులు ఉన్న చోట ఇద్దరు తెలుగువాళ్ళు వున్నారు. వాళ్ళు కూడా సైనికులు. మాతోపాటు త్రిపుర(అగర్తల) ముందు స్టేషన్ గౌహతి వరకు ప్రయాణం చేసారు. మాకు చాలా ధైర్యంగా అనిపించింది. బాబానే స్వయంగా మాతో ప్రయాణం చేసినట్లు అనిపించింది. సాధారణంగా గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్ అంత బాగుండవు. నేను, "ఎలాగైనా మాకు ఇచ్చిన క్వార్టర్ బాగుండేలా చూడు బాబా" అని బాబాని వేడుకున్నాను. ఆయన దయవల్ల మాకు ఇచ్చిన క్వార్టర్ చాలా బాగుంది.

మేమున్న చోట చుట్టూ అంతా హిందీ, బెంగాలీ వాళ్ళు ఉన్నారు. నా భర్త డ్యూటీకి వెళ్ళిపోయాక నేను, మా అత్తయ్య ఇంట్లో ఒంటరిగా వుండేవాళ్ళం. నేను, "బాబా! తెలుగువాళ్ళు ఎవరైనా పరిచయం అయ్యేలా చూడు" అని బాబాకి చెప్పుకున్నాను. అంతలో డ్యూటీలో ఉన్న నా భర్తకి తనతో కలిసి పనిచేసే ఒక అన్నయ్య కాల్ చేసి, 'తనకి తెలిసిన తెలుగువాళ్ళు ఉన్నార'ని వాళ్ళ నంబరు చెప్పి, "మా చెల్లికి వాళ్ళని పరిచయం చేయి. వాళ్ళు కొంచం తోడుగా ఉంటారు. తనకి ఒంటరితనం అనిపించదు" అని చెప్పారు. మావారు డ్యూటీ నుండి ఇంటికి వచ్చి నన్ను, మా అత్తయ్యని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. నేను వాళ్ళు నాతో చనువుగా ఉంటారో, లేదో అని కొంచెం టెన్షన్ పడ్డాను కానీ, వాళ్ళు నేను అనుకున్న దానికంటే చాలా మంచివాళ్ళు. అంతా బాబా దయ. కానీ మా అత్తయ్య "నేను ఇక్కడ వుండలేను. తిరిగి ఇంటికి (వైజాగ్) వెళ్లిపోతాను" అని ఒకటే గొడవ చేసింది. ఆమె వెళ్ళిపోతే, నేను ఎక్కడ ఒంటరిని అయిపోతానోనని చాలా బాధపడ్డాను. కానీ ఆమె ఎంత చెప్పిన వినలేదు. ఇంకా చేసేది లేక టికెట్ తీసి ఆమెని తిరిగి ఇంటికి పంపేశాం. నేను బాబాతో, "నాకు ఇక్కడ ఎవరూ లేరు. మీరు నాతో వున్నారన్న ధైర్యం తప్ప. ఎప్పుడూ మీరు నాతో వుండి అడుగుడుగునా నన్ను నడిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాలో ఉన్న భయాన్ని, ఆందోళనని తీసేయమని వేడుకుంటున్నాను సాయినాథా" అని వేడుకున్నాను.

తర్వాత 2025, డిసెంబర్ 18న మా తమ్ముడు కాల్ చేసి అమ్మమ్మ పడిపోయి హఠాత్తుగా చనిపోయిందని చెప్పాడు. నేను ఇంత దూరం నుండి వెళ్ళలేక చాలా ఏడ్చాను. మా అమ్మకు దగ్గరుండి ధైర్యం చెప్పలేని పరిస్థితికి రెండురోజులు చాలా బాధపడ్డాను. అమ్మమ్మ పోయిన బాధ నుండి నేను అస్సలు బయటపడలేక, "అమ్మమ్మ చనిపోయిన బాధ నుండి త్వరగా కొలుకునేలా చేయి సాయినాథా. నీవు తప్ప మాకు దిక్కు లేదు. నీవే శరణం బాబా" అని బాబాను వేడుకున్నాను. పిలిస్తే పలికే దైవం శ్రీసాయినాథుడు. ఆయన తన బిడ్డలు కష్టాల్లో ఉంటే  తట్టుకోలేరు. నేను ఆ బాధ నుండి బయటపడేలా చేసారు. "ధన్యవాదాలు సాయితండ్రీ".

ఒకరోజు రాత్రి నా పొట్టలో బాగా మంటగా అనిపించింది. నేను బాబా ఊదీ తీసుకుని కాస్త నా నుదుటన పెట్టి, మరికాస్త నీటిలో కలిపి తాగాను. బాబా దయవల్ల ఉదయానికల్లా నా పొట్టలో మంట తగ్గింది. "చాలా థాంక్స్ బాబా. మీ ఋణం ఏ జన్మలోనూ తీర్చుకోలేనిది. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మమ్మల్ని అడుగడుగునా నడిపించు తండ్రీ. అందరూ బాగుండేలా చూడు తండ్రీ".

మేము ఉండేది ఉత్తర భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రంలో అని చెప్పాను కదా! ఇక్కడ ఒకరోజు మరీ విపరీతమైన చలి వేసింది. నేను ఆ చలికి తట్టుకోలేక, "బాబా! నాకు ఎక్కువగా చలి వేయకుండా చూడండి తండ్రీ" అని బాబాను ప్రార్ధించాను. అలా ప్రార్ధించానో. లేదో మరుక్షణమే నాకు చలివేయడం తగ్గింది. "చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ .అందర్ని ఇలానే కాపాడు సాయినాథా".

5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo