ఈ భాగంలో అనుభవం:
- ప్రతి అడుగులో తోడుగా ఉండి అన్నీ అనుకూలంగా జరిపించిన బాబా
నేను ఒక బాబా భక్తురాలిని. 2023కు ముందు నాకు బాబా అందరి దేవుళ్లలో ఒకరు. ప్రత్యేకమైన భక్తి ఆయన మీద నాకు కలగలేదు. నేను USAలో ఉంటాను. 2023లో నేను ఇండియా వచ్చినప్పుడు వీసా స్టాంపింగ్‌కి వెళ్లాల్సి వచ్చింది. అదే నా మొదటి H1 వీసా స్టాంపింగ్ అయినప్పటికి డ్రాప్ బాక్స్ అవకాశం ఉండటం వల్ల పెద్దగా కష్టం అవుతుందనుకోలేదు. కానీ అనుకోకుండా నేను వీసా ఇంటర్వ్యూకి హాజరవ్వాలని లెటర్ వచ్చింది. మా కజిన్స్, స్నేహితులకి విషయం చెప్తే, "ఏం కాదు. వేలిముద్రలు తీసుకోవడానికి లేదా సాధారణ ఇంటర్వ్యూ కోసం అయుంటుంది. కంగారుపడాల్సిన అవసరం లేదు" అన్నారు. నేను సరేనని అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని, మరుసటిరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ నన్ను సెకండరీ ఇంటర్వ్యూకి పిలిచారు. నా యజమాని(ఎంప్లోయర్) వల్ల చాలా సమస్య అయింది. నా యజమాని చేసిన తప్పులకి నన్ను ఇంటర్వ్యూ చేసి, నా దగ్గర నుండి మౌఖిక/లిఖితపూర్వక ప్రూఫ్ తీసుకోవాలని దౌత్యకార్యాలయం(ఎంబసీ)లో ఇంటర్వ్యూచేసేవాళ్లు చాలా ప్రయత్నించారు. నేను వాళ్ళు ఇచ్చిన పేపర్ మీద వాళ్ళు అడిగింది వ్రాసాను కానీ, సంతకం చేయలేదు. ఉదయం 9 గంటలకు వెళ్లిన నేను మధ్యాహ్నం 4 గంటలకు బయటకు వచ్చాను. అలా అవుతుందని కొంచం కూడా ఊహించని నేను తర్వాత ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో పడిపోయి ఇంటికి వచ్చాక కూడా అదే షాక్‌లో ఉండిపోయాను. 7 రోజుల తరువాత నా వీసా తిరస్కరించినట్లు లెటర్, ఇమెయిల్ వచ్చాయి. మా బావ, స్నేహితులతో మాట్లాడాను కానీ, ఇలాంటి పరిస్థితి ఎవరూ ఎదుర్కొనందువల్ల ఏం చెప్పాలో ఎవరికీ తెలియని పరిస్థితి.
అలా ఉండగా ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా ఇలవేల్పు దుర్గామాత తన చేయితో ఎవరినో నాకు చూపించడం, ఎవరిని చూపిస్తారని అటు వైపు చూస్తే, అక్కడ కాషాయ రంగు వస్త్రాలు ధరించిన ఒకాయన ఉన్నారు. ఉదయం మా మమ్మీకి ఇలా కల వచ్చిందని చెప్పాను. అప్పటికే 'సాయి సచ్చరిత్ర' పారాయణ చేస్తున్న మమ్మీ, "దుర్గమ్మ 'బాబాని నమ్ముకో, నీకు పరిష్కారం తప్పక దొరుకుతుంద'ని నీకు ఒక దారి చూపుతున్నారు" అని చెప్పింది. ఆ రాత్రి(USA టైమ్ ప్రకారం నేను పని చేయాల్సి వచ్చి పని చూస్తున్నప్పుడు) ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తుంటే, ఒక బాబా రీలు "నువ్వు కోరుకున్న రెండు కోరికలు తప్పక తీరుతాయి" అని కనిపించింది. నిజానికి అప్పటివరకు దేవుళ్ళకి సంబంధించిన రీల్స్ నా ఫీడ్ లో రాలేదు. అందువల్ల ఆ బాబా రీల్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. బాబా పిచ్చుకి కళ్లకి దారం కట్టి లాగినట్లు నన్ను తన పాదాల వద్దకు లాక్కున్నారు. ఆ క్షణం నాలో ఏదో తెలియని భక్తి,, విశ్వాసాలు మొలకెత్తాయి. బాబా నాకు ఒక దారి చూపిస్తారన్న నమ్మకం కలిగింది. ఒకవైపు నా ప్రయత్నాలు నేను చేస్తూ మరోవైపు 5 వారలు సాయి దివ్యపూజ చేసాను. సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాను. రోజుకి ఒక అధ్యాయం చదువుతుంటే, బాబా ఎదురుగా కూర్చొని చదువుతున్నట్లు నాకనిపించేది.
సాధారణంగా ఒకసారి వీసా తిరస్కరణకు గురయ్యాక వేరే ఎంప్లాయర్ ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు, రిస్క్ అని అస్సలు సానుకూలంగా స్పందించరు. అలాంటిది బాబా దయవల్ల మా వెండర్ క్లయింట్‌కి పని చేస్తున్న నన్ను ఫుల్ టైం ఎంప్లోయగా తీసుకొని H1 వీసా ట్రాన్స్ఫర్కి అంగీకరించారు. H1 బదిలీ అప్పుడు USCIS(U.S. Citizenship and Immigration Services) ఆడిట్ వేశారు. వాళ్ళు పాత ఎంప్లాయర్‌ని, కొత్త ఎంప్లాయర్‌ని, క్లయింట్‌ని నా గురించిన సమాచారం అడిగి తీసుకున్నారు. ఆ విషయం నాతో మా క్లయింట్ మేనేజర్, కొత్త ఎంప్లాయర్ చెప్పి, "ఈ వారం రోజుల్లో USCIS మళ్ళీ ఇమెయిల్ చేయకపోతే పర్వాలేదు. చేస్తే, వాళ్ళు ఇంకా అడిగే సమాచారం ఇవ్వాలి" అని చెప్పారు. ఆ వారం రోజులు 'ఏం జరుగుతుందో, ఏంటో' అని చాలా భయపడ్డాను, ఎక్కడా నా తప్పు లేకున్నా నేను ఎందుకు ఇంత సమస్య ఎదుర్కొంటున్నాను? జీవితం ఎటు పోతుంది? USCIS ఆడిట్లో ఏమైనా సమస్య వస్తే, ట్రాన్స్ఫర్ ఆమోదింపబడదు, అప్పుడు ఏం చేయాలి?' అని చాలా బాధపడ్డాను. అయితే సచ్చరిత్ర చదివిన ప్రతిసారీ మనసులో బాబా నాతో, "నేను ఉన్నాను, నన్ను నమ్ము", "నీకు అంతా మంచి జరుగుతుంది" అని మాట్లాడుతున్నట్లు అనిపించేది. కానీ మనుషులం కాబట్టి ఎక్కడో భయం, 'ఇవన్నీ నేనే అనుకుంటున్నానేమో!' అని. కానీ బాబా దయవల్ల ఎలాంటి అవాంతరాలు, RFE(Request for Evidence) లేకుండా H1 బదిలీ పూర్తి అయింది. తర్వాత మా క్లయింట్ మేనేజర్ ఎంప్లాయర్‌తో మాట్లాడి, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా USAలో రిసోర్స్ కావాలని రిక్వెస్ట్ చేసారు. దాంతో నన్ను వెంటనే USA పంపడానికి ఎంప్లాయర్ ఒప్పుకున్నారు. ఈసారి నేను వీసా స్లాట్ కోసం చాలా జాగ్రత్తగా ప్రయత్నించాను. హైదరాబాద్ కాన్సులేట్ మంచిదని తెలిసి, కేవలం అక్కడే స్లాట్ దొరకాలని అనుకున్నాను. కానీ ఒకటి, రెండు నెలలలో వీసా స్లాట్ దొరకడం చాలా కష్టం, అందులోనూ హైదరాబాద్‌లో దొరకడం ఇంకా కష్టం. నేను రాత్రి చూస్తే, తదుపరి అందుబాటులో ఉన్న స్లాట్ డిసెంబర్లో కనిపించింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. 'డిసెంబర్ వరకు నేను ఇండియా నుండి పనిచేస్తే క్లయింట్ ఒప్పుకుంటారా? క్లయింట్ వేరే రిసోర్స్ చూసుకుంటే నా పరిసితి ఏంటి?' అని చాలా ఏడ్చాను. బాబాని, "ఎలా అయినా త్వరగా స్లాట్ దొరికేలా చూడు తండ్రీ" అని బ్రతిమాలుకున్నాను. మరుసటిరోజు ఉదయం నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి, "జూలైలో హైదరాబాద్‌లో స్లాట్ ఉంది. బుక్ చేయనా?" అని అడిగారు. అడగ్గానే బాబా నాకు స్లాట్ దొరికేలా చేసారని నాకు చాలా ఆనందమేసింది.
నేను వీసా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేరై హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో సచ్చరిత్ర చదువుకున్నాను. అక్కడికి చేరుకున్నాక నా అపాయింట్మెంట్ కోసం క్యూలో ఉన్నంతసేపూ "అంతా మంచే జరుగుతుంది, కంగారుపడకు" అని బాబా చెప్తున్నట్లు నాకనిపించింది. బాబా దయవల్ల అప్పటికే H1 వీసా రిజెక్ట్ అయిన నన్ను చాలా ప్రాథమిక ప్రశ్నలు అడిగారు. అయినా నన్ను మళ్లీ సెకండరీ ఇంటర్వ్యూకి తీసుకెళ్తారేమోనని చాలా భయపడ్డాను. కానీ అలా జరగలేదు. నా పాస్‌పోర్ట్ తీసుకొని, నిర్ణయం చెప్తామని పంపించారు. ఏమవుతుందో ఏంటో అని మళ్ళీ ఇంకో 10 రోజులు టెన్షన్ పడ్డాను. అయితే పాస్‌పోర్ట్ తీసుకున్నారు కాబట్టి ఏ సమస్య ఉండదన్న చిన్న నమ్మకం కూడా వుంది. నా నమ్మకం వమ్ము కాలేదు. 10వ రోజు రాత్రి నా ఫ్రెండ్ కాల్ చేసి, నా వీసా అప్రూవ్ అయిందని చెప్పారు. ఇంకో అద్భుతం ఏంటంటే, ఒకసారి వీసా రిజెక్ట్ అయినవాళ్ళకి 'పోర్ట్ ఆఫ్ ఎంట్రీ'లో కూడా సెకండరీ ఇంటర్వ్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటిది నన్ను మాత్రం ఒక సాధారణ ప్రశ్న అడిగి పంపించారు. ఎవరికైనా ఈ విషయం చెప్తే, 'నేను చాలా లక్కీ, అలాంటి పరిస్థితిలో అసలు ఎవరూ వెనక్కి రాలేర'ని అంటారు. నేను ఈ ప్రక్రియలో నలుగురు, ఐదుగురు లాయర్లని సంప్రదించాను. వాళ్లలో ముగ్గురు "0% ఛాన్స్, ఒకసారి వీసా రిజెక్ట్ ఐతే ఇంకా అస్సలు ఆమోదం పొందాదు" అని, మిగతా ఇద్దరు, "0% అని చేపలేం, కొంచెం అవకాశాలు ఉన్నాయి" అన్నారు. అంతటి కష్టం నుండి బాబా నన్ను బయటపడేసారు. ఆయన ప్రతి అడుగులో నాకు తోడుగా ఉన్నారు, అన్నీ నాకు అనుకూలంగా జరిపించారు. "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి నా రెండో కోరిక కూడా తొందరలో తీర్చు బాబా. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది".

Om Sai Ram 🙏🙏
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsairam
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete