ఈ భాగంలో అనుభవాలు:
1. ఉనికిని తెలియజేసి ధైర్యాన్నిచ్చిన బాబా
2. బాబా ఎల్లప్పుడూ భక్తుల ప్రార్థన వింటారు - ఎన్నడూ నిరాశపరచరు
ఉనికిని తెలియజేసి ధైర్యాన్నిచ్చిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు సురేష్ కుమార్. నేను నా కుటుంబంతో యుఎస్‌లో ఉంటున్నాను. నేను నా జీవితంలో ఎక్కువసార్లు చదివిన పుస్తకం 'బాబా చరిత్ర'. బాబా నా జీవితంలో ఒక భాగమైపోయాయి. ఆయన ఇప్పటివరకు నాకెన్నో అనుభవాలు ఇచ్చారు. వాటిలో నుండి కొన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు మా అమ్మకి ఛాతీలో కొంచం ఇబ్బందిగా అనిపిస్తే, డాక్టర్ని సంప్రదించి అన్ని పరీక్షలు చేయించాము. అప్పుడు ఆమె హార్ట్‌లో బ్లాక్ ఉందని తెలిసి దేశం కాని దేశంలో అమ్మకి స్టెంట్ వేయించాల్సి వచ్చింది. అమ్మని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లేటప్పుడు మేము వస్తామన్నాము. ఎందుకంటే, మా అమ్మకి ఇంగ్లీష్ అస్సలు రాదు, డాక్టర్‌కి తెలుగు తెలీదు. కానీ డాక్టర్ వద్దన్నారు. దాంతో మేము గదిలో చాలా భయపడుతూ కూర్చున్నాము. నేను బాబానే ధ్యానిస్తూ, 'బాబా బాబా..' అనుకుంటూ ఏం చేయాలో తెలియక ఒకసారి గది తలుపు తీసి చూసాను. ఒక్కసారిగా నా కళ్ళు చమర్చాయి. మేమున్న గదికి ఎదురుగా ఒక తలుపు(STAIRS డోర్) ఉంది. ఆ తలుపు మీద ఉన్న STAIRS అన్న అక్షరాలలో కొన్ని అక్షరాలు రాలిపోయి కేవలం 'S A I' అని మాత్రమే మిగిలాయి. అది చూసిన వెంటనే నాకు ధైర్యం వచ్చి మనస్ఫూర్తిగా బాబాకి నమస్కరించుకున్నాను. బా బా దయతో ఆపరేషన్ విజయవంతమైంది.
ఒకసారి నేను కొంచం అత్యవసర పని మీద ఇండియా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాకు వీసా లేనందున వీసా స్టాంపింగ్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాను. తర్వాత స్టాంపింగ్‌కి వెళ్లే ముందురోజు చూసుకుంటే, నా DS-160(టెంపరరీ వీసా) తప్పు వుంది. అప్పటికప్పుడు నేను వేరే DS-160 ఫారం నింపి తీసుకెళ్ళాను. కానీ మనసులో 'వాళ్ళు కొత్త అప్లికేషన్ తీసుకుంటారా? మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని రమ్మంటారా? అదే జరిగితే స్లాట్స్ దొరకవేమో!' ఇలా చాలా సందేహాలు. బాబాని తలుచుకొని, "నువ్వే గట్టెకించాలి బాబా?" అని అనుకుంటూ 'బాబా బాబా..' అని నామస్మరణ చేస్తూ ఉన్నాను. తర్వాత పిలిచేది నన్నే అనగా ఎందుకో పక్కకి తిరిగి చూసాను. అద్భుతం! నా పక్క వరుసలో కూర్చున్న ఒక ఆమె బాబా చరిత్ర చదువుతుంది. వెంటనే నాలో ఆనందం, ధైర్యం కలిగాయి. ఆమె దగ్గరకు వెళ్లి, బాబాకి నమస్కరించుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి సమస్యా లేకుండా వీసా పని పూర్తయింది. "ధన్యవాదాలు బాబా. మేము ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాం బాబా".
బాబా ఎల్లప్పుడూ భక్తుల ప్రార్థన వింటారు - ఎన్నడూ నిరాశపరచరు
నా పేరు ప్రీతిరావు. నా జీవితంలో సాయిబాబా కృపకు సంబంధించిన ఒక అందమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా కొడుకు 10వ తరగతి పరీక్షకి దరఖాస్తు చేసేటప్పుడు, నేను పొరపాటున తన పేరు తప్పు వ్రాసాను. ఆ తప్పు నా కొడుకుకి సంబంధించిన ఏ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలతోనూ సరిపోలదు. కాబట్టి భవిష్యత్తులో తీవ్రమైన సమస్యగా పరిణమించనుంది. కానీ నేను ఆ సమయంలో ఆ పొరపాటుని గమనించకపోవడంతో అధికారిక రికార్డుల్లో నా కొడుకు పేరు తప్పుగా నమోదు అయింది. చాలారోజుల తర్వాత 10వ తరగతి సర్టిఫికెట్ రావడానికి ఒక వారం ముందు అనుకోకుండా నేను చేసిన ఆ పెద్ద తప్పిదాన్ని గ్రహించాను. సాధారణంగా CBSE సర్టిఫికెట్లో వివరాలను సరిదిద్దడం క్లిష్టమైన మరియు సుదీర్ఘమైన ప్రక్రియ అయినందున నేను చాలా ఆందోళన చెంది ఒత్తిడికి గురయ్యాను. ఎంత సమయం పడుతుందో, దిద్దుబాటు సరిగ్గా జరుగుతుందో, లేదో అన్న భయం నా గుండె అంతా నిండిపోయింది. అటువంటి స్థితిలో నేను సంపూర్ణ భక్తి, విశ్వాసాలతో బాబాను హృదయపూర్వకంగా, "నా కొడుకు సర్టిఫికేట్ సవరణ వీలైనంత త్వరగా పూర్తి అయ్యేలా చూడండి" అని వేడుకున్నాను. తర్వాత సర్టిఫికేట్ నా చేతికి అందిన వెంటనే, నా కొడుకు చదివిన స్కూల్ ద్వారా పేరు సవరణ కోసం దరఖాస్తు చేశాను. బాబా అపారమైన కృపవల్ల CBSE సవరణలకు చాలా సమయం పడుతుందని అందరూ చెప్పినప్పటికీ కేవలం 5 నెలల్లో సవరించిన సర్టిఫికెట్ వచ్చింది. అసాధ్యం అనిపించింది సాయిబాబా ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. సరైన సమయంలో సహాయం చేసి నా చింతలు తొలగించినందుకు నేను ఆయన పాదాలకు కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను. నిజంగా, బాబా ఎల్లప్పుడూ తన భక్తుల ప్రార్థనలను వింటారు, ఎన్నడూ నిరాశపరచరు. "సాయిబాబా! నా ప్రార్థనకు ఇంత త్వరగా సమాధానం ఇచ్చినందుకు, నా కుటుంబంపై మీ అనుగ్రహాన్ని కురిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు".
